Cow Milk
-
పాలు అందరికీ అందుతున్నాయా?
అధికారిక డేటా ప్రకారం, దేశంలో పాల ఉత్పత్తి 2021–22లో 221 మిలియన్ టన్నులు. భారతదేశపు పాల ఉత్పత్తి మెజా రిటీ బర్రెల నుండి లభిస్తుండగా, ఆవు పాల వాటా పెరుగుతోంది. 2021 నాటికి ఆవు పాల వాటా 48.2%. 2019లో విడుదల చేసిన 20వ పశుగణన ప్రకారం, ఆవులు బర్రెలు, పాలు ఇచ్చేవి వట్టి పోయినవి కలిపి, దేశంలో మొత్తం పాడి పశువులు 12.57 కోట్లు. మునుపటి గణనమీద ఇది 6% పెరుగు దల. పాలు ఇచ్చే పశువుల సంఖ్య వేరుగా లేదు. వట్టి పోయిన పశువుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? పశువుల సంఖ్యలో పెరుగుదల ఎట్లా సాధ్యం? ప్రభుత్వం ఇస్తున్న లెక్కలకూ, క్షేత్ర పరిస్థితికీ మధ్య తేడా ఉన్నది. పలుచనవుతున్న పాలుదేశంలోని 110 బిలియన్ డాలర్ల పాడి పరిశ్రమలో డెయిరీ సహకార సంఘాలు, ప్రైవేట్ సంస్థలు, ‘అమూల్’, ‘మదర్ డెయిరీ’ వంటి ప్రభుత్వ సంస్థలతో కూడిన సంఘటిత రంగం వాటా కేవలం 30 బిలియన్ డాలర్లు. ఇది 30 శాతం కంటే తక్కువ. భారతదేశంలోని పాల ఉత్పత్తిలో సగానికి పైగా ప్రాసెస్ అవుతున్నది. అంటే నెయ్యి వగైరా వాటికి లేదా ఇతర ఉత్పత్తులలో ఒక ముడి పదార్థంగా వాడతారు. మిగిలిన 48% పాలుగా అమ్ముతున్నారు. నిత్యం పాలు వాడే హోటళ్ళు, స్వీట్ దుకాణాలలో పన్నీర్ కొరకు కూడా డిమాండ్ పెరుగుతోంది. పెద్ద హోటళ్ళు వాళ్ళకు అవసరమైన పాలను అధిక ధరకు కొని, వినియోగ దారుల నుంచి వసూలు చేయగలవు. దరిమిలా చిన్న హోటళ్ళు, చాయ్ దుకాణాలకు అంతగా పాలు దొరక కపోవచ్చు. లేదా ఆ ధర వాళ్ళు పెట్టలేరు. ముడి పాల కొరకు ఉన్న ఇటువంటి పోటీ గురించి, అంతర్గత డిమాండ్ గురించి, ఆ యా వినియోగ వర్గాలు చెల్లిస్తున్న ధరల గురించి విశ్లేషణలు లేవు. పోటీ పడలేని వ్యక్తులు, రంగాలు అసంఘటిత రంగంలోనే ఎక్కువ. పర్యవసానంగా, చాయ్ దుకాణాల చాయ్‌లో పాల ‘శాతం’ తగ్గుతున్నది. కొన్ని ఉత్పత్తులలో పాలు పలుచన అవుతున్నాయి.చిన్న పిల్లల ఎదుగుదలకు ముడి పాలు అవస రమని వైద్యులు, పోషకాహార నిపుణులు నిత్యం వల్లెవేస్తున్న తరుణంలో ‘అందరికీ పాలు’ దొరకక పోవడం అన్యాయమే. పేద వాడికి పాలు అందక పోవడం మన ఆహార వ్యవస్థలో ఉన్న తీవ్ర లోపం. ఈ లోపాన్ని సరిదిద్దే ప్రభుత్వ చర్యలు కావాలి. ఒక ఊర్లో ఉత్పత్తి అవుతున్న పాలు, ఇతర ఉత్పత్తులు అక్కడే, లేదా ఆ ప్రాంతంలోనే వినియోగం అయ్యే పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి.దిగుమతులతో దెబ్బతినే జీవనోపాధిఅమెరికా సహా వివిధ దేశాల నుంచి ఏటా రూ. 200–300 కోట్ల విలువైన పాల ఉత్పత్తులను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. 2020లో భారత ప్రభుత్వం 10,000 టన్నుల స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ను దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. 2023 జన వరిలో, దేశంలోకి పాలు, క్రీమ్ దిగుమతులు మునుపటి సంవత్సరం కంటే వెయ్యి శాతం పైగా పెరిగి 4.87 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ దిగుమతులు ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ వంటి దేశాల నుండి వచ్చాయి.పాల ఉత్పత్తుల దిగుమతులను సరళీకృతం చేయా లని భారత్ మీద ఐరోపా కమ్యూనిటీ, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుంచి ఒత్తిడి ఉన్నది. డెయిరీ ఉత్పత్తుల దిగుమతుల మీద సుంకాలు తగ్గించాలని వాణిజ్య ఒప్పందాలలో భాగంగా చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో భారతదేశం నుండి డెయిరీ దిగుమతులకు నిబంధనలు పెట్టి రష్యా, యూరప్, మెక్సికో, చైనా అనుమతించడం లేదు. డెయిరీ దిగుమతులపై 60–70% సుంకం విధిస్తున్న అమెరికా, భారతదేశం విధించే 30–60% సుంకాలను తగ్గించాలని కోరుతున్నది. ఇంకొక వైపు అమెరికా తన డెయిరీ రంగానికి సంవత్సరానికి 28 బిలియన్ డాలర్ల సబ్సి డీలను ఇస్తుంది. పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులు పెరిగితే లక్షలాది మంది భారత చిన్న, సూక్ష్మ పాడి రైతుల జీవనోపాధి ఆగమైపోతుంది అనే ఆందోళన నెలకొంది.విధానాలు అనుకూలమేనా?ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం వాటా 22%. జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇది 5%. దాదాపు 7 కోట్ల మంది పాడి రైతులు ఉన్నారు. పాడి పరిశ్రమ జీవనోపాధులను, వాతావరణ మార్పులను, కులం, మతాలను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. వినియోగదారులు వివిధ రకాలగా పాలకు ధర చెల్లిస్తున్నారు. పంటల మాదిరే పాడి రైతుకు ఆ వినియోగం నుంచి వస్తున్న డబ్బులో ఎంత శాతం చేరుతున్నది అనే ప్రశ్న ఉన్నది. బర్రె మీద, ఆవుల మీద పెట్టాల్సిన ఖర్చుకు తగినట్టు ముడి పాలకు ధర లేదనీ, ఇంకా ఆదాయం సంగతి దేవుడెరుగు అనీ పాడి రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు అనేకం ఉన్నాయి. అందులో అనేకం చిన్న పాడి రైతులు అందుకోలేరు. భారత పాడిపరిశ్రమలో సరళీకృత విధానం చిన్న రైతులకు ముప్పు కలిగిస్తుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. పాడి రైతులకు భూమి దొరికే అవకాశం తగ్గిపోతున్నది. పట్టణాలలో, పట్టణ శివార్లలో భూమి ధరలకు రియల్ ఎస్టేట్ వలన రెక్కలు రావడం వల్ల చిన్న పాడి రైతు మనగలిగే పరి స్థితులు లేవు.సగటు రైతు ఆదాయం రూ. 7,000 అని ప్రభుత్వం అంటున్నది. పశుపోషణ ఉంటే అదనపు ఆదాయం వస్తుంది. దేశంలోని రైతులు తమ మొత్తం పశుపోషణ ఆదాయంలో దాదాపు 67% పాడి ద్వారా సంపా దిస్తున్నారు. ఇంకా అనేక రకాల ఉపయోగం పాడి పశువులతో ఉంది. పర్యావరణం వినాశనం అవుతున్న తరుణంలో పశువుల వైవిధ్యం, ఆహారం, సుస్థిర జీవనం మీద దృష్టి పెట్టడం ముఖ్యం. పుడమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పశు పోషణ ఇంకా సమస్యాత్మకంగా మారుతున్నది. హైబ్రిడ్ జాతులతో, పాశ్చాత్య పశు పోషణ పద్ధతుల వల్ల కాలుష్యం పెరుగుతున్నది. అనారోగ్య పశువుల సంఖ్య పెరుగు తున్నది. శుభ్రత పాటించని ఆధునిక డెయిరీల వల్ల పశువుల వ్యాధులు మానవులకు సంక్రమిస్తున్నాయి. పశువులకు సరైన ఆహారం, జీవనం లేని కారణంగా వాటి పాలలో కూడా పోషకాలు ఉండటం లేదు. విషాలు, రసాయనాలు, యాంటీ బయాటిక్స్ వాటికి ఇవ్వడం వలన, వాటి పాల ద్వారా అవి మనుషులకు చేరుతున్నాయి.పశుపోషణలో సంప్రదాయ విజ్ఞానం, నైపుణ్యానికి చాలా విలువ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాడి పశువులను ప్రకృతి వనరుగా పరిగణించాలి. ఈ సూత్రం ఆధారంగా విధానం తీసుకురావాలి. పథకాలు వాటి సుస్థిరతకు, విస్తృతికి ఉపయోగపడే విధంగా రూప కల్పన చెయ్యాలి. స్థానిక పాడి రైతులను స్థానిక మార్కె ట్లతో అనుసంధానం చెయ్యాలి. పాలు, పాల ఉత్పత్తులు గ్రామాలలో ప్రథమంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. పాడి రైతులకు ప్రతి ఏటా చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను ప్రకటించి, అమలు చెయ్యాలి. పాల సహకార సంఘాల సంఖ్యను పెంచాలి. కేంద్రీకృత పాల మార్కెటింగ్ వ్యవస్థకు ఇచ్చే సబ్సిడీలు స్థానిక సహకార సంస్థలకు ఇవ్వాలి. భూమి వినియోగ విధానం రూపొందించి అందులో గడ్డి మైదానాలకు స్థానం కల్పించాలి. పశుగ్రాసానికి, దాణాకు సంబంధించి శాస్త్రీయ నిర్ణయాలు తీసుకోవాలి. పాడి రైతులకు భూమి ఇవ్వాలి. లేదా భూమి ఉన్న రైతుకు పాడి పశువులను అందజెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డివ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
ట్రైనీ నుంచి డైరెక్టర్ దాకా... రూ.2,556 కోట్ల మార్కెట్
నేడు చాలామంది యువత చేస్తున్న ఉద్యోగాలను వదిలిపెట్టి సొంతంగా వ్యాపారాలను ప్రారరంభిస్తున్నారు. అనుకున్న రంగంలో విజయం సాధించాలని కలలు కంటున్నారు. అయితే తమ కలల లక్ష్య సాధనలో అడుగులువేయడం కోసం ఏదైనా ఒక స్ఫూర్తి ఉండాలి కదా...పుణేలో ఉంటున్న 33 ఏళ్ల అక్షాలీషా సాధిస్తున్న విజయం నవతరానికి స్ఫూర్తి దాయకం. ఎంబీయే చేసి, పద్నాలుగేళ్ల క్రితం తండ్రి ప్రారంభించిన చిన్న డెయిరీ యూనిట్లో ట్రైనీగా చేరింది అక్షాలీ షా. మిల్క్ ప్రొడక్ట్స్ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తూ నేడు కంపెనీ రూ.2,556 కోట్ల మార్కెట్‌ని సాధించేంతగా కృషి చేసింది.బిజినెస్‌లో రాణించాలనుకునేవారికి పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమె చేసిన ప్రయాణం ఓ పాఠం అవుతుంది.‘‘నేను ఎంబీయేలో చేరేనాటికి మా నాన్న దేవేంద్ర షా పుణే సమీపంలోని మంచార్లో ఒక చిన్న డెయిరీ యూనిట్‌ను ప్రారంభించాడు. ఎంబీయే పూర్తవుతూనే ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనుకున్నప్పుడు మా నాన్న తన యూనిట్లోనే జాబ్‌లో చేరి, వ్యాపారాన్ని డెవలప్ చేయమన్నాడు. దానిని సవాల్‌గా తీసుకున్నాను. పరాగ్ పేరుతో రకరకాల పాల ఉత్పత్తులను తయారుచేయడం మొదలుపెట్టాను. ముందుగా దేశవ్యాప్తంగా ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన అధ్యయనంతో మొదలుపెట్టాను. ఏ బిజినెస్ అయినా అంచెలంచెలుగా ఎదగాలంటే ముందు మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి. నాణ్యతపైన దృష్టి పెట్టాలి. పుణే ప్రాంతంలో సహకార సంఘాల వాళ్లు మిల్క్ లీవ్ ప్రకటించినప్పుడు మా నాన్న రైతుల నుండి పాలను సేకరించి, మిల్క్ ఫుడ్స్ తయారీకి పునాది వేశారు. అక్కణ్ణుంచి కంపెనీ పాడి పరిశ్రమంలో ఇదొక విప్లవాత్మకమైన ప్రయాణానికి నాంది పలికినట్లయింది. ఆ విధంగా నాన్న ఆలోచనలనూ అందుకుంటూ నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. శ్రేష్టమైన ఉత్పత్తులు..చాలారకాల ఆహారపదార్థాల నుంచి ప్రొటీన్స్ లభిస్తాయన్నది తెలిసిందే. పాలలో ప్రొటీన్ మోతాదు ఎక్కువ. అందుకే వినియోగదారుల అవసరాల మేరకు ప్రొటీన్ మిల్క్ ప్రొడక్ట్‌లను తయారుచేసి విక్రయిస్తున్నాం. ‘పరాగ్’ అని ప్రారంభించిన మా సంస్థ నుంచి నెయ్యి, చీజ్, ఫ్లేవర్డ్ మిల్క్, పెరుగు.. ఈ అన్ని ఉత్పత్తుల్లో మంచి అమ్మకాలు సాధిస్తుంది. ఇప్పుడు చీజ్ తయారీ, అమ్మకంలో దేశంలోనే మా సంస్థ రెండవదిగా నిలిచింది. ఫార్మ్ టు హోమ్ బిజినెస్, స్పోర్ట్స్ న్యూట్రిషన్ బ్రాండ్, పానీయాల వృద్ధి, ఉత్పత్తిలో నా మార్క్‌ను చూపించగలిగాను. గడపగడపకూ..ఆవుపాల శ్రేష్టత గురించి తెలిసిందే. అందుకే, మన దేశంలో వీటి వాడకమూ ఎక్కువే ఉంటుంది. ఖరీదు ఎక్కువైనా శేష్ట్రమైన ఆవుపాల గురించి చాలా మంది అన్వేషిస్తారు. మొదట్లో ఆవుపాలు పితికి, అవి అవసరం ఉన్న కొద్దిమంది ఖాతాదారులకే అందించేవాళ్లం. ఆ తర్వాత ఆవు పాల గురించి దేశీయంగా ఉన్న మార్కెటింగ్ వైపు దృష్టి పెట్టాను. శ్రేష్టమైన ఆవుపాల కోసం కోట్లమంది ఖాతాదారులు ప్రయత్నిస్తున్నారని అర్థంచేసుకున్నాను. దీంతో ‘ప్రైడ్ ఆఫ్ కౌస్’ పేరుతో దేశవ్యాప్తంగా ఆవుపాలను కోరుకున్న ఖాతాదారుల గడప దగ్గరకు చేర్చేలా ప్రణాళికలు రూపొందించాం. ఢిల్లీ, ముంబై, పుణే, సూరత్‌లలో ఆవుపాలు విశేషంగా అమ్ముడుపోతున్నాయి. వ్యాపావేత్తగా ఎన్నో అవార్డులను పొందుతూనే ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్ మార్కెట్ పై ఒక అంచనాతో అడుగులు వేస్తున్నాం’’ అని వివరిస్తుంది అక్షాలీ. -
డైరీ ఫారం ద్వారా లక్షలు సంపాదిస్తున్న రైతు డైరీ ఫారం ద్వారా లక్షలు సంపాదిస్తున్న రైతు
-
ఏపీలో ‘ఆంధ్ర గోపుష్టి’ కేంద్రాలు.. విజయవాడలో తొలిస్టాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సేంద్రియ దేశీ ఆవుపాల (ఏ–2) ఉత్పత్తులు మార్కెట్లోకి రాబోతున్నాయి. ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట పాలు, వెన్న, నెయ్యి, పన్నీరు ఇలా వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విజయవాడలో ఈ నెలాఖరున తొలి కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఏర్పాటుచేయనున్నారు. జెర్సీ, హెచ్ఎఫ్ జాతి పశువుల నుంచి వచ్చే పాలను ఏ–1 పాలుగానూ.. ఒంగోలు, పుంగనూరుతో పాటు గిర్, సాహివాల్, రెడ్సింధీ జాతి దేశీ ఆవుల నుంచి వచ్చే పాలను ఏ–2 పాలుగా పిలుస్తారు. చదవండి: మహా విపత్తుకు ముందస్తు సూచికే.. అడ్డుకోకపోతే వినాశనమే! మూపురం కల్గిన పశువుల పాలల్లో హానికర రసాయనాలు (బీసీఎం–7) ఉండవని, వీటిలో కేసిన్ ప్రొటీన్ పదార్థం అధికంగా ఉండడంవల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కొనేందుకు చక్కని ఔషధంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో నిర్ధారణ కావడంతో ఈ పాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువ. విజయవాడ, వైజాగ్‌లో లీటర్ రూ.80–100 చొప్పున విక్రయిస్తుంటే, హైదరాబాద్‌లో రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుంటారు. ఇక వీటి పేడ ద్వారా తయారుచేసే ఎరువును కిలో రూ.7 చొప్పున, మూత్రాన్ని లీటరు రూ.75 చొప్పున స్థానికంగా విక్రయిస్తున్నారు. ఐదేళ్లలో దేశీవాళీ గోజాతి రెట్టింపు లక్ష్యం రాష్ట్రంలో 2019 పశుగణన ప్రకారం.. 7.87లక్షల దేశీ ఆవులు, 11.93 లక్షల సంకర, విదేశీ జాతి పశువులున్నాయి. రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పుంగనూరుతో పాటు గిర్, సాహివాల్, రాతి, రెడ్సింధీ వంటి అంతరించిపోతున్న దేశీ నాటు ఆవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ సేంద్రీయ పాలు, పాల ఉత్పత్తులను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో 50 శాతం సబ్సిడీపై ఒక్కోటి రూ.30లక్షల అంచనా వ్యయంతో వైఎస్సార్ దేశవాళీ గో జాతుల పెంపకం కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే తొలివిడతలో గతేడాది 57 కేంద్రాలు ఏర్పాటుచేయగా, మలివిడతలో 52 కేంద్రాలు మంజూరు చేశారు. 27 కేంద్రాలు త్వరలో గ్రౌండింగ్ కానున్నాయి. ఒక్కో క్షేత్రంలో 20 దేశీ ఆవులు, ఓ ఆంబోతును అందిస్తుండగా, పునరుత్పత్తి ద్వారా వీటి సంతతిని ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్ర గో పుష్టి పేరిట బ్రాండింగ్ ఒక్కో ఆవు రోజుకు 6–8 లీటర్ల చొప్పున ఏడాదిలో 220 రోజులపాటు పాలు ఉత్పత్తి చేస్తాయి. పాల ఉత్పత్తి, వినియోగం క్రమేపి పెంచడం, ఉప ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడంతో పాటు ఆవుపేడ, గో మూత్రం, పంచగవ్య, జీవామృతం వంటి ఉప ఉత్పత్తులకు ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట ప్రత్యేక బ్రాండింగ్ ద్వారా మార్కెట్లోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ఎస్ఓపీ) ప్రమాణాలతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాలకు అదితి ఆర్గానిక్ సరి్టఫికేషన్ (బెంగళూరు) ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయిస్తున్నారు. ఏ–2 పాలు, పాల ఉత్పత్తుల విక్రయాల కోసం రైతుల ద్వారా ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట ప్రముఖ నగరాల్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నారు. విజయవాడలోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో తొలిస్టాల్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో సేంద్రీయ పాలతో పాటు నెయ్యి, పన్నీరు వంటి ఉప ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మలివిడతలో విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి 50కు పైగా నగరాల్లో నెలకొల్పేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభించిన ఫిష్ ఆంధ్ర రిటైల్ అవుట్‌లెట్స్‌తో పాటు త్వరలో ఏర్పాటుచేస్తున్న అమూల్ అవుట్‌లెట్స్, రైతుభరోసా కేంద్రాల ద్వారా కూడా మార్కెటింగ్ చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. త్వరలో ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘జైవిక్ ఖేతి’ ద్వారా ఆన్లైన్లో విక్రయించేందుకు కసరత్తు జరుగుతోంది. సేంద్రియ పాల ఉత్పత్తులకు మార్కెటింగ్ అంతరించిపోతున్న దేశీవాళీ ఆవుల సంతతిని వృద్ధి చేయడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ దేశవాళి గో జాతుల పెంపకం కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. ఈ క్షేత్రాల్లోని దేశీ ఆవుల పాలు, పాల ఉత్పత్తులతోపాటు ఉప ఉత్పత్తులను ఆంధ్ర గో పుష్ఠి పేరిట మార్కెటింగ్ చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. పాడి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటుచేస్తున్నాం. తొలిస్టాల్ ఈనెలాఖరున విజయవాడలో అందుబాటులోకి రానుంది. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, పశుసంవర్థక శాఖ -
ఆ ఊరిలో పాలు అమ్మరు!
తాగునీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఈ కాలంలో అక్కడ ఉచితంగా పాలు పోస్తున్నారు. ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి వస్తే తీసుకోరు. పాలు అమ్మరు. గర్భిణులు, బాలింతలున్న ఇళ్లకు వారే అడిగి మరీ పంపిస్తారు. ఇలా చేసేది ఒకరో ఇద్దరో కాదు. ఆ ఊరంతా ఇదే సంప్రదాయం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా పిన్నాపురం గ్రామం ప్రత్యేకత ఇదీ.. కర్నూలు: నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని పిన్నాపురం ఓ మారుమూల గ్రామం. 421 ఇళ్లు 1800 జనాభా కలిగిన ఈ ఊరిలో 344 బర్రెలు, 815 ఆవులు, 2444 మేకలు ఉన్నాయి. ఇక్కడ తాతల కాలం నుంచి పశు పోషణ సంప్రదాయంగా వస్తోంది. గ్రామ జనాభాలో దాదాపు 80 శాతం మంది పాడిపెంపకందారులే. సమీపంలోని కొండ ప్రాంతాల్లో వాటిని పెంచుకుంటూ తమకున్న కొద్దిపాటి పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం గ్రామంలో ఎవ్వరూ పాలు విక్రయించరు. పశుపోషకులు తమ కుటుంబ అవసరాలకు పోనూ మిగిలిన వాటిని గ్రామస్తులకు ఉచితంగా ఇస్తారు. ముఖ్యంగా గర్భి ణులు, బాలింతలు ఉన్న ఇళ్లకు వారే స్వయంగా పాలు పంపిస్తుంటారు. ఎవరైనా వారి ఇళ్లల్లో శుభకార్యాలు ఉన్నప్పుడు మాత్రమే సమీపంలోని పట్టణం నుంచి పాల ప్యాకెట్లు కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. ఇక్కడి గ్రామ ప్రజలు పొద్దున్నే గ్లాసుడు కాఫీ లేదా టీ తాగడంతో దిన చర్య మొదలు పెడతారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ వాడుతారు. ఇందుకు అవసరమైన పాలు గ్రామంలోనే ఉచితంగా లభిస్తుండటం విశేషం. అవసరాల్లో ఒకరికొకరు సహాయపడాలన్నదే ఈ సంప్రదాయం ప్రధాన ఉద్దేశమని గ్రామస్తులు తెలిపారు. ఉచితంగా పాలు పోస్తే మంచిదని.. మా గ్రామంలో పాలు ఉచితంగా పోసే ఆచారం మా తాతల కాలం నుంచి ఉంది. అలా మా పెద్దల నుంచి వచ్చిన ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. చాలా కుటుంబాల్లో ఇంటి అవసరాలకు మించే పాలు ఉంటాయి. గ్రామంలో పాడిలేని వారు ఎవరైనా ఉన్నారని తెలిస్తే వారు అడగకుండానే పాలు పంపిస్తాం. దీని వల్ల మాకు మంచి జరుగుతుందని నమ్మకం. –మిద్దె నాగమ్మ, పిన్నాపురం పెద్దల నుంచి వస్తున్న ఆచారం మా పెద్దలు మాకు పాలను ఉచితంగా ఇచ్చే పద్ధతిని నేర్పారు. అందుకే పాడి ఉన్నంత వరకు పాలు, మజ్జిగ చుట్టు పక్కల వారి అవసరాలకు ఉచితంగానే పోస్తుంటాం. నెయ్యి మాత్రం పాణ్యం వెళ్లి అమ్ముకుంటాం. అది కూడా పండగ వచ్చే ముందు ఏడాదికి ఒకసారి మాత్రమే. –గని ఈశ్వరమ్మ, పిన్నాపురం ఒకరికొకరం సహాయపడతాం మాకు రెండు బర్రెలు ఉన్నాయి. ఇప్పటికీ చుట్టుపక్కల వారికి అడిగి పాలు పోస్తాం. అదే బాలింతలు, గర్భిణులుంటే వారి ఇళ్లకు వెళ్లి ఇస్తాం. ఎందుకంటే వారికి పాల అవసరం ఎక్కువగా ఉంటుంది. మాకు అవసరమైనప్పుడు కూడా గ్రామంలోని వారు ఇలాగే పంపిస్తారు. – మీదివేముల రామకృష్ణ, పిన్నాపురం -
Photo Feature: అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే
అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే. తల్లికి తన బిడ్డలతో ఉండే ఏ బిడ్డయినా ఒకటే. ఆవుపాలు అమ్మ పాలకంటే శ్రేష్టం అంటారు. అలా.. ఓ శ్రేష్టమైన ఆవు తన బిడ్డతోపాటు నాలుగు మేకపిల్లలకూ పాలను పంచుతోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట్కు చెందిన ముక్త్యార్కు కొన్నేళ్ల క్రితం అటవీప్రాంతంలో ఓ ఆవుదూడ దొరికింది. దాన్ని పెంచి పెద్దచేసిన తర్వాత అదొక బిడ్డకు జన్మనిచ్చింది. ముక్త్యార్ కొద్దిరోజుల క్రితం నాలుగు మేకపిల్లలను కొన్నాడు. ప్రస్తుతం వాటికి కూడా ఆ గోమాతనే పాలిస్తుండడం అందరినీ ఆకట్టుకుంటోంది. – నిర్మల్ -
Breast Milk: తల్లిపాలు పెరగాలంటే.. బొప్పాయి కూర, ఆవుపాలు, కర్బూజ, జీలకర్ర ఇంకా
Best Foods Increase Breast Milk Production: పిల్లలకు తల్లిపాలు ఎంతో ఆరోగ్యకరం. పాలిచ్చే తల్లుల ఆరోగ్యం కూడా బాగుంటుందని పెద్దలు, పరిశోధకులు ఎప్పటినుంచో చెబుతున్న విషయమే. అయితే కొందరు తల్లులకు పాలు పడవు. అలాంటివారు కొన్ని సూచనలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. గర్భిణులకు బొప్పాయి ఇవ్వకూడదని అందరికీ తెలుసు. అదే బొప్పాయి బాలింతలకు కల్పతరువులా పనిచేస్తుంది. దోరగా ఉన్న బొప్పాయికాయను కొబ్బరి కోరులా చేసి కూర వండుకుని తింటే స్తన్యవృద్ధి కలుగుతుంది. పాల ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని మార్గాలున్నాయి! ►ఆవుపాలు, కర్బూజాపండు, పాలకూర, జీలకర్ర, బార్లీజావ, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, మునగాకు కూరలు చాలా మేలు చేస్తాయి. ►పట్టణ ప్రాంతాలలోని వారికి పిల్లిపెసర దొరకపోవచ్చు. కాని దాని వేళ్ళను దంచిన రసం తీయాలి. దీనిని ఎండించి దంచిన చూర్ణం రోజూ తేనెలో తీసుకుంటే పాలు పెరుగుతాయి. ఆయుర్వేద దుకాణాల్లో శతావరి పేరిట చూర్ణం దొరుకుతుంది. ఇది కూడా బాగానే పని చేస్తుంది. ►రెండు గ్లాసుల నీళ్ళలో రెండు టీస్పూన్ల పత్తిగింజల పొడి పోసి నీళ్ళు అరగ్లాసు అయ్యేంతవరకు మరిగించాలి. చల్లారిన తర్వాత దీనిని వడగట్టి తేనె కలుపుకుని తాగితే పాలవెల్లువ కల్గుతుంది. ►తామర కాడను ఎండించిన చెంచాడు చూర్ణాన్ని తేనెతో కలిపి రోజుకు మూడుసార్లు తింటే పాలు పెరుగుతాయి. ►ఆముదం ఆకులపైన ఆముదాన్ని రాసి వెచ్చ చేసి రొమ్ములకు కడితే పాలచేపు వస్తుంది. ►బాలింతలకు వాము కషాయం రోజూ తేనెతో తీసుకుంటే చక్కని పాలు పడతాయి. ►శనగలను మొలకలొచ్చేదాకా నాన బెట్టాలి. ఎండించి, పొట్టు తీసి, దోరగా వేయించి, కట్టులా కాచుకుని తాగితే బలాన్నిచ్చి మంచి ఔషధంగా పనిచేస్తాయి. మంచి రక్తాన్ని పుట్టిస్తాయి. పాలిచ్చే తల్లులకు ఇస్తే పాలు పెరుగుతాయి. ►బాలింతలకు జలుబు చేస్తుందని మంచినీళ్లు ఎక్కువ తాగనివ్వరు పెద్దలు. అలా కాకుండా తగినన్ని మంచి నీళ్లు తాగుతుండాలి. కాకపోతే చల్లటి నీళ్లు కాకుండా గోరు వెచ్చటి నీళ్లు తాగడం మంచిది. ►మజ్జిగ, పెరుగు, పాలు పుష్కలంగా తీసుకోవాలి. ►ఇవన్నీ అంతో ఇంతో పాలు పడే తల్లులకు పని చేస్తాయి. అయితే కొందరు తల్లులకు కొన్ని కారణాల వల్ల పాలు అసలు పడవు. అటువంటప్పుడు ప్రయోజనం ఏముందని పిల్లలను రొమ్ముకు దూరం పెడతారు తల్లులు. అలా చేయకూడదు. పిల్లలు రొమ్మును చప్పరించడం వల్ల తల్లిలో మాతృత్వ భావన ఉప్పొంగి హార్మోన్ల ప్రేరణతో పాలు స్రవించేందుకు అవకాశం ఉంటుందని పెద్దలతోబాటు వైద్యులు కూడా చెబుతున్నారు. చదవండి: Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ వల్ల... -
ఆవు పాలు పితికిన హీరోయిన్... వీడియో వైరల్
సెలబ్రిటీలు ఏ పని చేసినా.. అదో వైరల్ న్యూస్ అవుతున్న రోజులివి. ముఖ్యంగా సినీ తారల విషయంతో ఇది చాలా ఎక్కువ. వాళ్లు ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా.. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఆ వీడియోలు చూసి అభిమానులు మురిసిపోతుంటారు. తాజాగా హీరోయిన్ నివేదా థామస్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. (చదవండి: నేహాకక్కడ్: అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వుమెన్ సింగర్..) ఇంతకీ ఆ వీడియోలో ఏముందనేగా మీ ప్రశ్న. అందులో నివేదా బ్లాక్ కలర్ జాకెట్ ధరించి ఆవు పాలు పితికింది. డైరీ ఫామ్‌కి వెళ్లిన నివేదా.. స్వయంగా తానే ఆవు దగ్గరకు వెళ్లి పాలు పితికి చక్కటి కాఫీ పెట్టుకుంది. దీన్ని ఓ వీడియో రూపంలో తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తూ 'జాయ్' అని ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కొంతమంది వాటి దగ్గరకు వెళ్లడానికే భయపడతారు.. కానీ నువ్వు వెళ్లడమే కాకుండా పాలు పితికే సాహసం చేశావంటే నువ్వు చాలా గ్రేట్ అక్కా’అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీలో కీలకపాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నివేదా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. -
ఆడాళ్లు డ్రమ్ముల్లా మారుతున్నారు: డీఎంకే నేత
సాక్షి, చెన్నై: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు కొంతమంది ప్రబుద్ధులు. సామాన్యుల సంగతి పక్కన పెడితే.. ప్రజాప్రతినిధులు సైతం ఇందుకు అతీతులు కారు. సభల్లో, పార్లమెంట్, అసెంబ్లీ వేదికగా స్త్రీల వస్త్రధారణ గురించి ఇష్టారీతిన మాట్లాడి వివాదానికి కారణమైన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా వీరి జాబితాలోకి డీఎంకే నాయకుడు ఒకరు చేరారు. విదేశీ ఆవు పాలు తాగుతూ మన ఆడవాళ్లు డ్రమ్ముల్లా మారుతున్నారంటూ మహిళల శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఇతర పార్టీల నాయకులు, మహిళా సంఘాల నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆ వివరాలు.. డీఎంకే పార్టీ నాయకుడు దిండిగుల్ లియోని అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం లియోని, కార్తికేయ శివసేనాపతి అనే అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తూ.. మహిళల శరీరాకృతి గురించి అసభ్యకరంగా మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో.. ‘‘ప్రస్తుతం చాలా రకాలు ఆవులున్నాయి. ఫామ్‌లలో మీరు విదేశీ ఆవులను చూసే ఉంటారు. వీటి పాలను పితకడానికి మెషిన్లను వాడతారు. ఒక్కసారి స్విచ్ వేస్తే.. మెషిన్ గంటలో 40 లీటర్ల పాలు పితుకుంది. ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా ఈ విదేశీ ఆవుల పాలు తాగుతున్నారు. అందుకే వారి శరీరాకృతి మారి.. డ్రమ్ముల్లా తయారవుతున్నారు. గతంలో మహిళలు ‘8’ ఆకారంలో ఉండేవారు. పిల్లల్ని అలవోకగా ఎత్తుకునే వారు. కానీ ఇప్పుడు ఎవరూ అలా కనిపించడం లేదు. లావుగా అయ్యి పిల్లలను ఎత్తుకోలేకపోతున్నారు. దానికి కారణం విదేశీ ఆవు పాలు తాగడమే’’ అంటూ ఇష్టారీతిన ప్రసంగిస్తూ పోయాడు. What a shame.. what milk does he drink? Does he know what happens to women’s body post pregnancy or during hormonal changes? @KanimozhiDMK what do you like to say to this kind of male chauvinist? Is this the respect your party people have on women. https://t.co/7yMf5esqX0 — Gayathri Raguramm (@BJP_Gayathri_R) March 24, 2021 లియోని పక్కనే ఉన్నవారు అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. విషయాన్ని పక్కదోవ పట్టించడం కోసం రేషన్ సరఫరాపై మాట్లాడాల్సిందిగా లియోనికి సూచించారు. అతడు కాసేపు దాని మీద ప్రసంగించి మళ్లీ టాపిక్‌ను ఆడవారి వద్దకే తెచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కాగా గతంలోనూ లియోని అనేక సార్లు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ప్రకృతిలో సాగుబడి
ఇంజినీరింగ్ పట్టా చేతికి రాకుండానే క్యాంపస్ ఇంటర్వ్యూలోఎంపికైపోయి నాలుగంకెల వేతనం అందుకోవాలి.. ఏడాది తిరక్కుండా కంపెనీ తరఫున ఫారిన్ వెళ్లి డాలర్లు సంపాదించాలి. మూడు పదుల వయసులు దాటకుండానే సొంత ఇల్లు,బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి తీరాలి.. సగటు బీటెక్ విద్యార్థి ఆలోచన ఇలాగే ఉంటుంది.ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు వ్యవసాయం గురించి ఆలోచిస్తారా..! అంటే అలాంటి వారు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోతారు. అలాంటప్పుడు‘అల్లోల్ల దివ్యారెడ్డి’ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. సాక్షి,సిటీబ్యూరో: ఆర్థికంగా ఉన్నత కుటుంబానికి చెందిన దివ్యారెడ్డి పుట్టి పెరిగిన వాతావరణం అంతా సిటీలోనే అయినా.. ఇంజినీరంగ్ పూర్తి చేసినా ఆమె ఆలోచనలు మాత్రం గ్రామాల వైపు సాగాయి. ముఖ్యంగా దేశీయ ‘గో సంబంధ వ్యవసాయం’తో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని భావించిన ఆమె ఆ దిశగా అడుగులు వేశారు. ప్రస్తుతం ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పిల్లల నుంచి పెద్దల వరకు తాగుతున్న పాలు కల్తీ అని గుర్తించిన దివ్యారెడ్డి.. స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలు, పాల ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు ‘క్లిమామ్ వెల్నెస్ ఫామ్స్’ను ప్రారంభించారు. దీనిద్వారా దేశీయ ఆవు పాలతో పాటు నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులను తయారు చేస్తూ నగరవాసులకు అందిస్తున్నారు. ఈమె ప్రారంభించిన ఈ ఉద్యమానికి పదుల సంఖ్యలో అవార్డులు సైతం వరించాయి. నగరం మెచ్చిన ఉత్పత్తులు దివ్యారెడ్డి తన క్లిమామ్ ఫామ్ నుంచి నగరంలో రోజుకు 600 లీటర్ల పాలను సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మియాపూర్ ప్రాంతాలతో పాటు బంజారాహిల్స్, కూకట్పల్లి, సికింద్రాబాద్ వాసులు ఈ పాల గురించి తెలుసుకుని మరీ ఆర్డర్‌పై తెప్పించుకుంటున్నారు. దివ్యారెడ్డి నడుపుతున్న ఫామ్‌లో ఉత్పత్తి అయ్యే పాలు, పాల ఉత్పత్తుల కంటే డిమాండ్ అధికంగా ఉండంతో తనలా ఆలోచించే మరో 20 మందికి స్వచ్ఛమైన పాలపై అవగాహన కలిగించి ఫామ్స్‌ను ఏర్పాటుకు ప్రోత్సహించారు. అలాగే సేంద్రీయ పద్ధతిలో పండించించిన కొర్రలు, బియ్యం, సామలు, అరికెలు, ఊదలు, అండు కొర్రలతో పాటు ఆయిల్, డైఫ్రూట్స్‌ను జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కు సమీపంలో ‘క్లిమామ్ ఫామ్ కేఫ్’ను ప్రారంభించారు. అలాగే, ఈ కేఫ్‌లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు ‘సేంద్రియ వ్యవసాయం’పై అవగాహన కల్పిస్తున్నారు. ఆవులపై అధ్యయనం చేసి.. ప్రస్తుతం గ్రామాల్లో కూడా చాలామంది హైబ్రీడ్ ఆవులవైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇవి దేశీయ ఆవులతో పోలిస్తే ఎక్కువగా పాలు ఇస్తాయని వాటినే పెంచేందుకు ఇష్టపడుతుంటారు. మరోపక్క గతంలో ఆవులను పాల కంటే వాటి పేడను ఎరువుగా వాడి సేంద్రియ వ్యవసాయం చేసేవారు. దాంతో దేశీయ ఆవులు సంతతి తగ్గిపోయింది. దాంతో పాటే ప్రజల ఆరోగ్య సమస్యలు సైతం పెరగనారంభించాయి. ఇలాంటి పరిస్థితితుల్లో సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే దేశీ ఆవు పాలు, సంబంధిత ఉత్పత్తులు ప్రజలకు అందించడంతో పాటు ఆవు మలమూత్రాలతో సేంద్రియ వ్యవసాయాన్ని చేయాలని 2015లో దివ్యారెడ్డి సంగారెడ్డి సమీపంలోని ఓల్డ్ ముంబై జాతీయ రహదారికి ఆనుకొని ‘క్లిమామ్ వెల్నెస్ ఫామ్స్’ను ప్రారంభించారు. తొలుత 20 దేశీయ ఆవులతో మొదలైన ఈ ఫామ్స్‌లో ఇప్పుడు 200 ఆవులున్నాయి. ప్రారంభంలో కేవలం తమ ఇంటి అవసరాలు, బంధువులకు మాత్రమే సరఫరా చేసిన ఈ పాలు ఇప్పుడు సిటీలో వందల మందికి సరఫరా చేసే స్థాయికి తీసుకెళ్లారు. ప్రజల్లో అవగాహన పెరగాలి ఒకప్పుడు గ్రామాల్లో పశువులను పాలకోసం కాకుండా వాటి మలమూత్రాలను ఎరువుగా వాడి వ్యవసాయం చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఆదాయం కోసం హైబ్రీడ్ వైపు పరుగులు తీస్తున్నారు. ఈ ఆలోచన తప్పు. పల్లెలకు గత వైభవం రావాలి. మళ్లీ సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు పడేలా నేనొక ప్రేరణగా నిలవాలన్న ఉద్దేశంతో క్లిమామ్ వెల్నెస్ ఫామ్స్ మొదలెట్టా. నేను చేస్తున్నది ఉత్తమమైన పద్ధతి అని అందరికీ ప్రాక్టికల్‌గా చూపిస్తున్నా. సేంద్రియ ఆహారం అందరికీ అందాలన్నది నా ఉద్దేశం.– దివ్యారెడ్డి, క్లిమామ్ వెల్నెస్ ఫామ్స్ -
‘అలాగైతే ఆవులపై గోల్డ్ లోన్’
కోల్‌కతా : మన ఆవు పాలలో బంగారం ఉందని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి .బెంగాల్‌కు చెందిన దంకుని ప్రాంతంలోని ఓ వ్యక్తి తన రెండు ఆవులను తాకట్టుపెట్టుకుని బంగారంపై రుణం ఇవ్వాలని మణప్పురం ఫైనాన్స్‌కు చెందిన ఓ బ్రాంచ్‌ను సందర్శించారు. తాను గోల్డ్ లోన్ కోసం తన ఆవులను తీసుకుని ఇక్కడకు వచ్చానని, ఆవు పాలల్లో బంగారం ఉందని తాను విన్నానని, ఈ ఆవులపైనే తాము ఆధారపడ్డామని, వీటిపై తనకు రుణం లభిస్తే తన వ్యాపారాన్ని విస్తరిస్తానని ఆ వ్యక్తి చెప్పకొచ్చారు. మరోవైపు ఘోష్ వ్యాఖ్యలను గరల్‌గచా గ్రామ సర్పంచ్ మనోజ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఘోష్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలు రోజూ తన వద్దకు వారి ఆవులతో వచ్చి తమ ఆవులపై ఎంత రుణం ఇస్తారని అడుగుతున్నారని చెప్పారు. ఆవు పాలల్లో బంగారం ఉందని చెప్పిన దిలీప్ ఘోష్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. బుర్ధ్వాన్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ ఘోష్ తన సిద్ధాంతం వెనుక గల కారణాన్ని విశ్లేషించారు. "భారతీయ ఆవులకు మూపురాలు ఉన్నాయి, అవి విదేశీ ఆవులకు లేవు. మూపురం ధమని ఉంది..దీన్ని బంగారు ధమని అని పిలుస్తారు. సూర్యరశ్మి దానిపై పడినప్పుడు బంగారం తయారవుతుంద’ని చెప్పుకొచ్చారు. -
‘ఫ్లూట్ ఆవు ముందు ఊదు..’
‘ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు’ అని తెలుగులో పాపులర్ డైలాగ్ ఒకటుంది. దీన్ని కాస్త మార్చి ఆవు ముందు ఊదండి.. అంటున్నారో బీజేపీ నేత. పురాణాల్లోని శ్రీకృష్ణుడి మాదిరిగా ఆవు ముందు ఫ్లూట్ ఊదితే ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా పాలు ఇస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. అస్సాం బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ కుమార్ పాల్ శనివారం సిల్చార్‌లోని బరాక్ వ్యాలీలో జిరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఇది శాస్త్రీయంగా నిరూపించబడిందంటూ మంగళవారం ఆయన తన వాదనను సమర్థించుకున్నారు. గుజరాత్‌లోని ఎన్జీఓ కొన్ని సంవత్సరాల క్రితం ఒక అధ్యయనం చేపట్టిందని, వేణువు ద్వారా పలికించే రాగాలతో గోవుల్లో పాల ఉత్పత్తి పెరిగిందని శాస్త్రీయంగా నిరూపించిందన్నారు. మృదువైన సంగీతం వినిపిస్తే గోవులు సాధారణం కన్నా మూడు శాతం ఎక్కువగా పాలు ఇచ్చినట్టు 2001లో ఇద్దరు సైకాలజిస్టులు నిరూపించారని తెలిపారు. ఇక చెవులు చిల్లులు పడే సంగీతం, ఫాస్ట్ మ్యూజిక్‌ను అవి ఇష్టపడవని వారు పేర్కొన్నట్టుగా వెల్లడించారు. కాగా స్వచ్ఛమైన తెల్ల పాలను ఇచ్చే విదేశీ జాతి ఆవుల పాల కన్నా లేత పసుపు రంగులో ఉండే భారతీయ ఆవుల పాలు చాలా రుచిగా, ఆరోగ్యంగా ఉంటాయన్నారు. భారతీయ ఆవుల పాలతో తయారైన జున్ను, వెన్న వంటి ఉత్పత్తులు కూడా శ్రేష్టమైనవని పాల్ చెప్పారు. భారతదేశం నుంచి బంగ్లాదేశ్‌కు ఆవులను అక్రమంగా తరలిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులు గోమాతగా పూజించే ఆవుల అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరం ఉందని దిలీప్ కుమార్ పాల్ పేర్కొన్నారు. -
ఈ ఆవు.. కామధేనువు!
సాక్షి, కోటవురట్ల (పాయకరావుపేట): ఓ పాడి రైతు పంట పండింది. హార్మోన్ల లోపంతో జన్మించిన పడ్డ (ఆవు) ఆ రైతుకు కామధేనువైంది. చూడి కట్టకుండానే పాలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విశాఖ జిల్లా కోటవురట్ల మండలం బీకే పల్లికి చెందిన రైతు కన్నూరు రమణ.. హెచ్ఎఫ్ జాతికి చెందిన పడ్డను కొనుగోలు చేశారు. రెండేళ్ల వయసున్న ఈ పడ్డ చూడి కట్టకుండానే పాలు ఇస్తోంది. 10 రోజుల క్రితం ఎదకు రావడంతో రైతు రమణ పశు వైద్య కేంద్రానికి తీసుకొచ్చాడు. పొదుగు బాగా పెరిగి ఉండడాన్ని గమనించిన పశు వైద్యాధికారి పెట్ల నరేష్ పాలు పిండి చూడమని సూచించారు. అక్కడికక్కడే పిండగా 2 లీటర్ల పాలు ఇచ్చింది. రోజు రోజుకు పాల దిగుబడి పెరుగుతోందని రైతు తెలిపాడు. దీనిపై పశు వైద్యాధికారిని వివరణ కోరగా.. హార్మోన్ల లోపం కారణంగా ఇలా జరుగుతోందన్నారు. ఇది అరుదైన విషయమని, పాల వల్ల హాని ఉండదన్నారు. -
గోవుల చట్టం కోసం 8 ఏళ్ల ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ : ఆవులను ప్రేమించడంలో, గౌరవించడంలో బహూశ భారత్ తర్వాత ప్రపంచంలో రెండో దేశం స్విడ్జర్లాండే కావచ్చు. వారి జాతీయ చిహ్నం కూడా ఆవులే. ఆవుల విషయంలో అక్కడి రైతులకు ఓ ఆటవిక ఆనవాయితీ ఉంది. వారు ఓ దశలో ఆవుల కొమ్ములను నాటు పద్ధతిలో కత్తిరించి వేస్తారు. స్విడ్జర్లాండ్ మొత్తం మీద 80 శాతం ఆవులకు కొమ్ములుండవు. ఈ అనాచారం ఎందుకొచ్చిందో వారికి కూడా తెలియదుగానీ, కొమ్ములుండడం వల్ల గోశాలలకు స్థలం ఎక్కువ అవసరం పడుతుందని, కొమ్ముల వల్ల ఆవులు కోపతాపాలకు గురవుతాయని, పరస్పరం పొడుచుకుంటాయని, అప్పుడప్పుడు వాటిని సాదుతున్న రైతులనే పొడిచే ప్రమాదం ఉందని అక్కడి రైతులు చెబుతున్నారు. ఆవుల కొమ్ములను కత్తిరించడం క్రూరత్వమని నమ్మే ఆర్మిన్ కపాల్ అనే రైతు ఈ అనాచారానికి వ్యతిరేకంగా చట్టం తీసుకరావడానికి పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. విజయం సాధించారు. ఫలితంగా ఆయన ప్రతిపాదించిన చట్టంపై రేపు (ఆదివారం) స్విడ్జర్లాండ్ ప్రభుత్వం ‘రిఫరెండమ్ (ప్రజాభిప్రాయ సేకరణ)’ నిర్వహిస్తోంది. రిఫరెండానికి అనుకూలంగా మెజారిటీ ప్రజలు ఓటేస్తే చట్టం ఖాయమవుతుంది. స్విడ్జర్లాండ్ ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం అవడం వల్ల ఏ అంశంపైనైనా, ఏ పౌరుడైన చట్టాన్ని ప్రతిపాదించవచ్చు. అయితే అందుకు కనీసం లక్ష మంది ప్రజల సంతకాలను సేకరించాల్సి ఉంటుంది. మన రైతు ఆర్మిన్ కపాల్ లక్షా ఇరవై వేల మంది సంతకాలు సేకరించారు. అయితే ఆర్మిన్ ప్రతిపాదించిన చట్టంలో ఆవుల కొమ్ముల కత్తిరింపుపై నిషేధం కోరలేదు. ఆవుల కొమ్ములను కత్తిరించని రైతులకు, రాయితీగా రోజుకు ఒక్కో ఆవుకు ఒక్క స్విస్ ఫ్రాంక్ అంటే, దాదాపు 70 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించాలంటూ చట్టాన్ని ప్రతిపాదించారు. ఈ చట్టం కోసం ఆర్మిన్ దాదాపు ఎనిమిదేళ్లుగా పౌరుల సంతకాల కోసం కృషి చేస్తున్నారు. చట్టం కోసం చేసే ప్రతిపాదనపై స్విస్ పౌరులు గుడ్డిగా సంతకం చేయరు. ప్రతిపాదనతో పూర్తిగా ఏకీభవించినప్పుడే వారు సంతకాలు చేస్తారు. అందుకే లక్షా ఇరవై వేల సంతకాలు సేకరించేందుకు ఆయనకు అంతకాలం పట్టింది. ఆజానుభావుడిలా కనిపించే ఆర్మిన్కు ఇప్పుడు 67 ఏళ్లు. బవురు గడ్డంతో కనిపించే ఆర్మిన్ రకరకాల దుస్తులు, పలు రకాల టోపీలతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. ‘మేము ఆవులను ప్రేమిస్తాం, వాటిని తింటాం’ ‘ఆవు కొమ్ములను కత్తిరించడం క్రూరత్వమని నమ్మే మీరు, ఆవు మాంసాన్ని ఎలా తింటారు? అది క్రూరత్వం కాదా?’ అని జర్మనీ జర్నలిస్ట్ పీటర్ జాగ్గి (ఆమె భారత దేశంలో ఆవులను పవిత్రంగా చూడడంపై జర్మనీలో ఇటీవల ఓ పుస్తకం రాశారు) ప్రశ్నించగా ‘మేము ఆవులను ప్రేమించేమాట నిజమే. వాటి మాంసాన్ని ఇష్టంగా తినే మాట కూడా నిజమే. కొన్ని ఆవులను కబేళాలకు పంపించకపోతే నేడు స్విడ్జర్లాండ్‌లో మనుషులకన్నా ఆవులే ఎక్కువగా ఉండేవి. ఆవుల సంరక్షణను మనుషులమైన మనం బాగా చూసుకుంటాం కనుక, అవి ఆహారంగా మారి మన రుణం తీర్చుకుంటాయి. ఆవులను గౌరవించడం వల్లనే మా దేశస్థులు విమానాశ్రయాల్లో అతిథులను రికార్డు చేసిన ఆవు శబ్దాలతో ఆహ్వానిస్తారు’ అని ఆర్మిన్ అన్నారు. ఆయన మాటల్లో నిజాయతీ ఉందని, భారత దేశంలో గోమాంసాన్ని నిషేధించడంలో నిజాయితీ లేదని ఆమె ఈ సందర్భంగా ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా నేరం చేస్తోంది! ‘నా దష్టిలో ఆవులను అవసాన దశలో కబేళాలకు పంపించడం నేరం కాదు. ఆ దశలో అవి బతికి ఉండడం వల్ల ఎక్కువ బాధను అనుభవించాల్సి ఉంటుంది. గోమాంసాన్ని తినడాన్ని నేరంగా పరిగణించేవారు ఆవు పాలను తాగడం కూడా నేరమే అన్న విషయాన్ని గ్రహించాలి! ప్రకృతి సిద్ధంగా ఆవు పాలనిచ్చేది వాటి సంతానం కోసం. మనుషుల కోసం కాదు. ఈ లెక్కన ప్రపంచమంతా నేరం చేస్తోంది’ అని అమె ‘హోలి కౌవ్స్ ఇండియా (జర్మనీలో)’ పుస్తకంలో వ్యాఖ్యానించారు. -
పంచగవ్యాల ప్రాశస్త్యం
సంస్కృత ‘సాధు’ పదానికి ‘మంచి గుణం’ అని అర్థం. మంచితనానికి పరాకాష్ఠ ‘పవిత్రత’. ఈ తత్త్వం మానసిక ఆరోగ్యానికి ఉత్ప్రేరకం. భగవంతుని ఆశీర్వచన సూచికనే ప్రసాదంలో భక్తులు వీక్షిస్తారు. అందుకే ప్రసాదం పరమ పవిత్రమైనదని ప్రతీతి. ఇక్కడ పరిమాణం ప్రధానం కాదు, విశ్వాసం విశిష్టమైనది. భారతీయ ధార్మిక సాంప్రదాయాలలో, భగవంతుని క్షేత్రం ఏదైనా, స్థాయి ఏదైనా ప్రసాదమే ప్రాముఖ్యత వహిస్తుంది. ప్రాంతాన్ని బట్టి ప్రసాద పదార్థం మారుతుంటుంది. మారేడు దళమైనా, మందార పువ్వైనా, కుంకుమైనా, విభూదిౖయెనా, అన్నిటికీ ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. కడుపులోకి సేవించే వాటిలో కదళీ ఫలమైనా, నారికేళ జలమైనా, కర్పూల తులసీ దళ తీర్థమైనా అన్నీ ఆరోగ్యకరమైనవే. ప్రత్యేకంగా తయారుచేసే భక్ష్యాలలో పాలు, నెయ్యి, శర్కర, తేనె... వంటి పదార్థాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మధురమైనవి, మధురేతరమైనవి కూడా ప్రసాదాలుగా ఉండొచ్చు. పాలు, నెయ్యి అన్నప్పుడు అవి ఆవులకు సంబంధించినవే అని అర్థం చేసుకోవాలి. సంస్కృతంలో ఆవుని ధేనువు అంటారు. ‘గో’ శబ్దం ఆవుకి, ఎద్దుకి కూడా వర్తిస్తుంది. భారత ఇతిహాసంలో గోమాత యొక్క పవిత్రత, ప్రాశస్త్యం గురించి చెప్పవలసిన అవసరం లేదు. నాటి ఆయుర్వేద శాస్త్రం నుంచి, నేటి ఆధునిక పరిశోధన విప్లవాల వరకు పంచగవ్యాల (ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, గోమయం/పేడ) పోషక విలువలు, ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు అత్యుత్తమంగానే ఉన్నాయి. శాస్త్ర దృక్కోణం లో ఆవు ఉత్కృష్టతను ఒక్కమాటలో చెప్పాలంటే, ఆవుకి విషం ఇస్తే, అది మరణిస్తుందే తప్ప దాని క్షీర, మూత్ర, మలాలలో మాత్రం విషపు ఛాయలు కనబడవు. ఈ గుణం ఏ ప్రాణికీ లేదు. అటువంటి పంచగవ్యాల గురించి స్థూలంగా శాస్త్రం చెప్పిన విషయాలు... గోమూత్రం: రుచి: కటు (కారం) క్షార (ఉప్పదనం), తిక్త (చేదు), కషాయ (వగరు) గుణాలు: తీక్షణం, లఘు, అగ్నిదీపనం, కఫవాతహరం, పిత్తకరం. ఔషధ ధర్మాలు: జీర్ణశక్తిని పెంచి, పొట్టలో వాయువును తొలగించి, ఉదర శూల (కడుపులో నొప్పి) ను పోగొడుతుంది. మేధావర్ధకం. ముఖరోగాలను (నోటి పూత మొదలైనవి) తగ్గిస్తుంది. మూత్ర వహ సంస్థానానికి చాలా ఉపయుక్తం. అంటే మూత్రాన్ని ధారాళంగా ప్రవహింప చేసి, ఎన్నో మూత్ర రోగాలను హరిస్తుంది. శోఫ హరం (శరీరంలో వాపులను నశింపచేస్తుంది). దగ్గు, ఆయాసాలను తగ్గిస్తుంది. కంటి రోగాలను, సమస్త చర్మ రోగాలను హరిస్తుంది. క్రిమిహరం, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. (గోమూత్రం... మేధ్యం... శూలగుల్మ ఉదర ఆనాహ... కాస, శ్వాసాపహం... మూత్రలం, మూత్రరోగహరం... అతిసార కుష్ట క్రిమి, శోఫ, పాండు రోగాపహం...) గోమయం (ఆవు పేడ): దీనిలో కూడా పోషక విలువలు ఉంటాయి. క్రిమిహరం కూడా. తక్కువ ప్రమాణంతో గోమయ రసాన్ని సేవించటం కూడా ఉంది. వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టే క్రిమిహర, విషహర గుణాలు ఉన్నాయి. చక్కటి ఎరువుగా ఉపకరిస్తుంది.ఎండబెట్టి పిడకలు చేసి ఇంధనంగా వాడితే ఆయా వంటకాల గుణాలు కూడా ఉత్తమం. భస్మమైన పిడకల్ని ‘కచిక’ అంటారు. దీంతో పండ్లు (దంతాలు) తోముకునే విధానాన్ని ఇప్పటికీ పల్లె ప్రజలు పాటిస్తున్నారు. దంత రోగాలు రాకుండా కాపాడుతుంది. కొద్దిగా గోమయం కలిపిన నీటితో స్నానం చేసే సాంప్రదాయం కూడా ఉంది.‘గోమయేన సదా స్నాయాత్ కర్రషి చ ఆప్యవిశేషేత్’’ (మహాభారతం, అనుశాసన పర్వం)యన్మే రోగం శోకం చ తన్మే దహతు గోమయం, రక్షం శకృత్ కృత్వా ద్వాదశాంగేషు నామభిః’’(శ్రీమద్భాగవతం)అందుకే గోమూత్ర గోమయాలను పవిత్రంగా భావిస్తారు.బజారులో లభించే ఆయుర్వేద ఔషధం: పంచగవ్య ఘృతం మరియు మహాపంచగవ్య ఘృతం. మోతాదు: ఒక చెంచా (5 మి.లీ. లేక గ్రాములు) పావు కప్పు ఆవు పాలలో కలిపి ఉదయం ఖాళీ కడుపున సేవించాలి. సాయంత్రం కూడా మరోసారి తాగాలి. ఎంతకాలం వాడినా మంచిదే. ప్రయోజనాలు: మేధా వర్ధకం, అన్నిరకాల మానసిక రోగాలలోనూ (ఉద్వేగ, ఉన్మాద, బుద్ధిమాంద్య, నిద్రా నాశరోగాలు) గుణకారి. ఆటిజం, పార్కిన్సోనిజం వంటి వాతరోగాలు తగ్గడానికి సహకరిస్తుంది. గుర్తుంచుకోవలసిన సారాంశం:గోఘృతంబునె సర్వదా కోరుకొనుముప్రబల మేధ్యంబు వృష్యంబు బలకరంబుముదిమి రానీదు యువ శక్తి పొంగిపొరలు కంటికి బలమ్ము దీర్ఘాయుకర ము, ఘనముపావు పెరుగు నెయ్యి పరమోత్తమంబవిఆవు మూలమైన అమృతమయముక్రొత్త కాదు మనకు గోమయ మూత్రముల్పంచగవ్యములవి యెంచి చూడ ఆవు పాలు: (భావప్రకాశ సంహితా)గవ్యం దుగ్ధం విశేషేణ మధురం రసపాకయోఃశీతలం స్తన్యకృత్ స్నిగ్ధం వాత పిత్త నాశనమ్... జరా సమస్త రోగాణా శాంతికృత్ సేవినాం సదా’’ఆవు పాలు తియ్యగా ఉంటాయి. చలవ చేస్తాయి. జిగురుగా ఉంటాయి. స్తన్యవర్థకం. వాతపిత్తహరమై రక్తదోషాలను తొలగిస్తాయి. ఆవు పాలను ప్రతి రోజూ తీసుకోవచ్చు. దీనివల్ల సమస్త రోగాలను నివారించే ‘క్షమత్వం’ వృద్ధి చెందుతుంది. ముసలితనం దూరం అవుతుంది. ఓజస్సును పెంపొందించి, నేత్రాలకు, చర్మానికి కాంతిని కలిగిస్తుంది. తల్లి పాలు కొరవడినప్పుడు శిశువులకు ఆవు పాలు శ్రేష్ఠం, బలవర్ధకం. అందుకే చరకాచార్యులు ‘ప్రవరం జీవనీయానాం క్షీరముత్తమం రసాయనం’ అని చెప్పాడు. సప్తధాతు పుష్టికరమై ఆయువును పెంచుతాయి ఆవు పాలు. ఆవు నెయ్యి (గోఘృతం): మధురం, ప్రధానంగా పిత్త దోషహరం, వాతకఫ శ్యామకం, చలువ చేస్తుంది. మేధా (తెలివితేటలు) వర్ధకం, ఓజోకరం, శుక్రకరం, రసాయనం (సప్తధాతు పుష్టికరమై క్షమత్వ వర్ధకం). లావణ్య, కాంతి, తేజో... వర్ధకం, వయస్థాపకం (ముసలితనం రానీయకుండా యౌవనాన్ని పదిల పరుస్తుంది), ఆయుః వర్ధకం, మంగళకరం. కంటికి మంచిది. (గవ్యం ఘృతం విశేషేణ చక్షుష్యం, వృష్యం, అగ్నికృత్... మేధా లావణ్య కాంతి తేజో ఓజో వృద్ధికరం, వయస్థాపకం, బల్యం, సుమంగలం, ఆయుష్యం, సర్వ ఆజ్యేషు గుణాధికం) ఆవు నేతిని హోమం చేస్తే వచ్చే పొగ విషాన్ని హరిస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని కూడా హరిస్తుంది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
సేంద్రియ చిట్కా
కూరగాయలు, బొప్పాయి వంటి పంటలకు విత్తనం ద్వారా వైరస్ తెగుళ్లు సంక్రమించే అవకాశం ఉంది. వీటి నివారణకు– విత్తనాలను అరగంట పచ్చి దేశీ ఆవు పాలలో నానబెట్టి.. తర్వాత 20 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తడం గాని లేదా నారు పోసుకోవడం గానీ చేసినట్లయితే విత్తనం ద్వారా వచ్చే వైరస్ తెగుళ్లను సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీనితో పాటు ప్రతి 10 రోజులకు ఒకసారి పచ్చి దేశీ ఆవు పాలు 5% పిచికారీ చేయడం ద్వారా కూడా వైరస్ తెగుళ్లను అరికట్టవచ్చు. -
ఆవు ముర్రుపాలు... ఆరోగ్యపు అస్త్రశస్త్రాలు
ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి అందరూ యత్నిస్తుంటారు. ప్రస్తుత కాలుష్యాలూ, జీవనశైలితో చేజేతులారా దాన్ని దెబ్బతీసుకునే పరిస్థితి. అయితే రోగనిరోధక శక్తి అనే మనలో అంతర్గతంగా ఉండే అస్త్రశస్త్రాలను పటిష్టం చేసుకుంటే ఆరోగ్యం గురించి దాదాపుగా నిశ్చితంగా ఉండవచ్చు. మరి దాన్ని చాలా తేలిగ్గా, చవగ్గా సాధించడం ఎలా? ఆవు ముర్రుపాలతో స్వాభావికమైన వ్యాధి నిరోధక శక్తిని ఎలా పొందాలో తెలుసుకోండి. ఒక అంచనా ప్రకారం... మానవ ముర్రుపాల కంటే, ఆవు ముర్రుపాలలో వ్యాధులను ఎదుర్కొనే శక్తి, వ్యాధులను తగ్గించే శక్తి దాదాపు 1000 రెట్లు ఎక్కువ. అంతటి వ్యాధినిరోధక శక్తిని సమకూర్చుకోవడం చాలా తేలిక. ఆవు ముర్రుపాలు తీసుకుంటే చాలు. దూడపుట్టాక దాదాపు కొన్ని వారాల పాటు స్రవించే ముర్రుపాలు (బొవైన్ కొలెస్ట్రమ్)ను ‘ఇమ్యూనో’స్ అంటారు. ఇందులో చాలా వ్యాధులను ఎదుర్కోగల శక్తిమంతమైన యాంటీబాడీస్ ఉంటాయి. ఇంగ్లిష్‌లో కొలెస్ట్రమ్ అని పిలిచే ఈ ముర్రుపాలు కాస్త పసుపుపచ్చరంగులో ఉంటాయి. బీటా–కెరొటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా ముర్రుపాలకు ఈ రంగు వస్తుంది.ఈ యాంటీ ఆక్సిడెంట్లో వ్యాధినిరోధక శక్తిని సమకూర్చే ‘ఇమ్యూనోగ్లోబ్యులిన్’ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రధానమైనది ‘సెక్రటరీ ఐజీఏ‘. దీన్నే ‘సిగా’ అంటారు. తల్లికడుపులో తల్లికి ఉండే రోగ నిరోధక శక్తే బిడ్డనూ సంరక్షిస్తుంది. పుట్టగానే ఈ ‘సిగా’ అదే రోగనిరోధక శక్తిని బిడ్డలో కొనసాగేలా, బిడ్డ తన సొంత రోగనిరోధక శక్తిని సమకూర్చుకునేలా చేస్తుంది. ఈ ‘సిగా’ ఎన్ని అద్భుతాలు చేస్తుందో తెలుసా? ఇది బిడ్డ కడుపులో ఆహారం పీల్చుకునే కడుపు– పేగుల్లో ఒక లైనింగ్లాగా ఏర్పడుతుంది. ఈ ‘లైనింగ్’ వ్యాధులను వ్యాపింపజేసే వైరస్‌లనూ, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను ఒక అడ్డుగోడలా ఆపేస్తుంది. అలా రోగనిరోధక శక్తిని బిడ్డకు ఇస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లలు లేదా నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లో ప్రాణాంతకంగా పరిణమించే ‘నెక్రొటైజింగ్ ఎంటెరోకొలైటిస్’ అనే పేగులకు సంబంధించిన రుగ్మతనుంచి ఈ ‘ఇమ్యూనో’ కాపాడుతుంద రోగనిరోధక సాధనంగా ముర్రుపాలు... దాని చరిత్ర... అసలు ముర్రుపాలను ఒక రోగనిరోధక సాధనంగా వాడవచ్చని ఎలా, ఎప్పుడు తెలుసుకున్నారో చూద్దాం. పోలియో (పోలియోమైలైటిస్) వ్యాధికి 1950లో వ్యాక్సిన్ కనిపెట్టిన ఆల్బర్ట్ శాటిన్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ ‘‘చిన్నపిల్లలకు ముర్రుపాలు తాపిస్తే ఆ కొలెస్ట్రమ్ కూడా వ్యాక్సిన్‌లాగే పోలియో నుంచి రక్షణ కలిగిస్తుంది’’ అని మొదటిసారి చెప్పారు. ఇక 1955లో దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ) చికిత్సకు సిఫార్సు చేశారు. దీన్ని ఒక వ్యాధినిరోధక ఔషధంగా ఉపయోగించవచ్చునంటూ... చికిత్సలో దీన్ని ఉపయోగం కోసం ఒక నిర్దిష్టమైన ప్రణాళికను 1963లో కాంప్‌బెల్, పీటర్సన్ అనే వారు రూపొందించారు. ఇక 1992లో కుంబర్ అనే పరిశోధకుడు పిల్లల్లో పొట్ట / పేగులకు సంబంధించినే అనేక సమస్యలను ఇది నివారించగలదంటూ అధ్యయనాలతో నిరూపించి చూపారు. ఆవు ముర్రుపాలతో కొన్ని ఉపయోగాలివి... బొవైన్ కొలెస్ట్రమ్ అని పిలిచే ఆవు ముర్రుపాలతో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. వాటిలో కొన్ని ఇవి... ∙అప్పుడే పుట్టిన పిల్లల నుంచి నెలల వయసులో ఉన్న చిన్నారులు, చిన్న పిల్లల్లో తరచూ కనిపించే నీళ్ల విరేచనాలను అరికడుతుంది ∙హెచ్ఐవీ రోగులు, ఎముక మూలుగ మార్పిడి చికిత్స తీసుకున్న వారితో పాటు వ్యాధి నిరోధక శక్తి లేని అనేకమందికి వ్యాధి నిరోధక శక్తిని కల్పిస్తుంది. ∙జంపింగ్, సైక్లింగ్, పరుగు వంటి క్రీడల్లో పాల్గొనే అథ్లెట్స్‌కు అవసరమైన శక్తి కలిగిస్తాయి. క్రీడాకారుల సామర్థ్యాన్ని పెంచుతుంది ∙శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిముల నుంచి (ఉదాహరణకు జలుబుకు కారణమయ్యే ఇన్ఫ్లుయెంజా) రక్షణ కల్పించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది ∙నాడీవ్యవస్థలో కలిగే లోపాలను నివారిస్తుంది ∙కాలిన గాయాలను త్వరగా మాన్పుతుంది ∙మూడ్స్ బాగుండేలా తోడ్పడుతుంది ∙కొందరికి ప్రయోణాల్లో వచ్చే నీళ్లవిరేచనాలు (ట్రావెల్ డయేరియా)తో పాటు ఏవైనా నొప్పినివారణ మందులు (ఎన్ఎస్ఏఐడీస్) వాడినప్పుడు పేగుల లైనింగ్ దెబ్బతినకుండా కూడా కాపాడుతుంది. ఇలాంటి చిన్న చిన్న అంశాల్లోగానే గాక కాస్త సీరియస్ వ్యాధులుగా పరిగణించే ఆస్టియో ఆర్థరైటిస్, స్పాండిలార్ ఆర్థరైటిస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్‌ఎల్‌ఈ) వంటి జబ్బుల తీవ్రతను తగ్గించడమే గాక, రక్తంలోని గ్లూకోజ్ పాళ్లను కొలెస్ట్రమ్ సమర్థంగా తగ్గిస్తుందనీ, ఒంట్లోని హానికారక కీటోన్ బాడీస్‌ను హరిస్తుందని తేలినందువల్ల దీన్ని టైప్–2 డయాబెటిస్‌కూ ఔషధంగా వాడవచ్చని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలా ఆవు ముర్రుపాల (బొవైన్ కొలెస్ట్రమ్) నుంచి అనేక రకాల ఔషధాలను రూపొందించవచ్చని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. -
ఆవు రక్తం తాగే ఆచారం వారిది
ఆడిస్ అబాబా: ఇథియోపియాలోని బోడి తెగకు చెందిన ఆదివాసీల్లో ఓ విచిత్ర ఆచారం ఇప్పటీకి అమల్లో ఉంది. వారు కొత్త సంవత్సరంగా పిలిచే 'కాయెల్' వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏటా పెళ్లికాని యువకులకు ఓ పోటీని నిర్వహిస్తారు. ఆ యువకులు ఆరు నెలలపాటు ప్రతి రోజు సూర్యోదయం నుంచి లీటర్ల కొద్ది ఆవు పాలు, ఆవు రక్తం తాగుతూ బరువు పెంచుకోవాలి. ఒక ఆరు నెలలపాటు ఇలా చేసిన తర్వాత వారి తెగలో ఎవరు ఎక్కువ బరువు పెరుగుతారో, ఎవరి నడుము చుట్టు కొలత ఎక్కువగా ఉంటుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. ప్రతి ఏటా ఒక్క పెళ్లి కాని యువకుడిగా ఎంపిక చేస్తారు. ఆ విజేతకు ఎలాంటి బహుమతులు ఇవ్వరు. వారిని తెగవారంతా ఎంతో మర్యాదగా గౌరవిస్తారు. ఆరాధ్య భావంతో చూస్తారు. ఆ యువకుడితో లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు మహిళలు తహతహలాడుతారు. జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని ఆరు నెలల ముందుగా ఈ విచిత్ర పోటీని మొదలు పెడతారు. ఈ పోటీకి ప్రతి ఇంటి నుంచి ఓ పెళ్లికాని యువకుడిని పంపించవచ్చు. పోటీలో పాల్గొనే ప్రతి యువకుడు ఆరు నెలలపాటు సెక్స్‌కు దూరంగా ఉండాలి. గుడిసె పరిసరాలను వదిలి బయటకు వెళ్లడానికి వీల్లేదు. ఆవు పాలు, రక్తం తాగడమే పనిగా పెట్టుకోవాలి. కొందరు పచ్చిపాలు, రక్తం మోతాదుకు మించి తాగలేక వాంతులు చేసుకుంటారు. అర్ధంతరంగా పోటీల నుంచి కూడా నిష్క్రమిస్తారు. పోటీలో కొనసాగిన వారికి ఆరు నెలలపాటు కావాల్సిన పచ్చి ఆవు పాలను పెద్ద పాత్రల్లో సొంతింటి వాళ్లు, పక్కింటివాళ్లు తెచ్చి పోస్తారు. పోటీలో పాల్గొనే యువకులు ఆవు పచ్చి రక్తాన్ని తాగుతారు తప్ప వాటిని చంపరు. ఎంతో గౌరవంగా ఆవులను చూస్తారు. తాగే రక్తం కోసం మాత్రం వాటి నరాలకు రంధ్రంచేసి రక్తం పడతారు. తర్వాత బంక మన్నుతో ఆ రంధ్రాన్ని పూడ్చేస్తారు. బోడి తెగలో యుగ యుగాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం మరెంతో కాలం మనుగడలో ఉండకపోవచ్చని సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇథియోపిలో నివసిస్తున్న ఈ తెగకు చెందిన దాదాపు మూడు లక్షల మందికి పునరావాసం కల్పించాలని ప్రభుత్వం ఇటీవలనే నిర్ణయించింది.