సంస్కృత ‘సాధు’ పదానికి ‘మంచి గుణం’ అని అర్థం. మంచితనానికి పరాకాష్ఠ ‘పవిత్రత’. ఈ తత్త్వం మానసిక ఆరోగ్యానికి ఉత్ప్రేరకం. భగవంతుని ఆశీర్వచన సూచికనే ప్రసాదంలో భక్తులు వీక్షిస్తారు. అందుకే ప్రసాదం పరమ పవిత్రమైనదని ప్రతీతి. ఇక్కడ పరిమాణం ప్రధానం కాదు, విశ్వాసం విశిష్టమైనది. భారతీయ ధార్మిక సాంప్రదాయాలలో, భగవంతుని క్షేత్రం ఏదైనా, స్థాయి ఏదైనా ప్రసాదమే ప్రాముఖ్యత వహిస్తుంది. ప్రాంతాన్ని బట్టి ప్రసాద పదార్థం మారుతుంటుంది. మారేడు దళమైనా, మందార పువ్వైనా, కుంకుమైనా, విభూదిౖయెనా, అన్నిటికీ ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. కడుపులోకి సేవించే వాటిలో కదళీ ఫలమైనా, నారికేళ జలమైనా, కర్పూల తులసీ దళ తీర్థమైనా అన్నీ ఆరోగ్యకరమైనవే. ప్రత్యేకంగా తయారుచేసే భక్ష్యాలలో పాలు, నెయ్యి, శర్కర, తేనె... వంటి పదార్థాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మధురమైనవి, మధురేతరమైనవి కూడా ప్రసాదాలుగా ఉండొచ్చు. పాలు, నెయ్యి అన్నప్పుడు అవి ఆవులకు సంబంధించినవే అని అర్థం చేసుకోవాలి. సంస్కృతంలో ఆవుని ధేనువు అంటారు. ‘గో’ శబ్దం ఆవుకి, ఎద్దుకి కూడా వర్తిస్తుంది. భారత ఇతిహాసంలో గోమాత యొక్క పవిత్రత, ప్రాశస్త్యం గురించి చెప్పవలసిన అవసరం లేదు. నాటి ఆయుర్వేద శాస్త్రం నుంచి, నేటి ఆధునిక పరిశోధన విప్లవాల వరకు పంచగవ్యాల (ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, గోమయం/పేడ) పోషక విలువలు, ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు అత్యుత్తమంగానే ఉన్నాయి. శాస్త్ర దృక్కోణం లో ఆవు ఉత్కృష్టతను ఒక్కమాటలో చెప్పాలంటే, ఆవుకి విషం ఇస్తే, అది మరణిస్తుందే తప్ప దాని క్షీర, మూత్ర, మలాలలో మాత్రం విషపు ఛాయలు కనబడవు. ఈ గుణం ఏ ప్రాణికీ లేదు. అటువంటి పంచగవ్యాల గురించి స్థూలంగా శాస్త్రం చెప్పిన విషయాలు...
గోమూత్రం:
రుచి: కటు (కారం) క్షార (ఉప్పదనం), తిక్త (చేదు), కషాయ (వగరు)
గుణాలు: తీక్షణం, లఘు, అగ్నిదీపనం, కఫవాతహరం, పిత్తకరం.
ఔషధ ధర్మాలు: జీర్ణశక్తిని పెంచి, పొట్టలో వాయువును తొలగించి, ఉదర శూల (కడుపులో నొప్పి) ను పోగొడుతుంది. మేధావర్ధకం. ముఖరోగాలను (నోటి పూత మొదలైనవి) తగ్గిస్తుంది. మూత్ర వహ సంస్థానానికి చాలా ఉపయుక్తం. అంటే మూత్రాన్ని ధారాళంగా ప్రవహింప చేసి, ఎన్నో మూత్ర రోగాలను హరిస్తుంది. శోఫ హరం (శరీరంలో వాపులను నశింపచేస్తుంది). దగ్గు, ఆయాసాలను తగ్గిస్తుంది. కంటి రోగాలను, సమస్త చర్మ రోగాలను హరిస్తుంది. క్రిమిహరం, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. (గోమూత్రం... మేధ్యం... శూలగుల్మ ఉదర ఆనాహ... కాస, శ్వాసాపహం... మూత్రలం, మూత్రరోగహరం... అతిసార కుష్ట క్రిమి, శోఫ, పాండు రోగాపహం...)
గోమయం (ఆవు పేడ): దీనిలో కూడా పోషక విలువలు ఉంటాయి. క్రిమిహరం కూడా. తక్కువ ప్రమాణంతో గోమయ రసాన్ని సేవించటం కూడా ఉంది. వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టే క్రిమిహర, విషహర గుణాలు ఉన్నాయి. చక్కటి ఎరువుగా ఉపకరిస్తుంది.ఎండబెట్టి పిడకలు చేసి ఇంధనంగా వాడితే ఆయా వంటకాల గుణాలు కూడా ఉత్తమం. భస్మమైన పిడకల్ని ‘కచిక’ అంటారు. దీంతో పండ్లు (దంతాలు) తోముకునే విధానాన్ని ఇప్పటికీ పల్లె ప్రజలు పాటిస్తున్నారు. దంత రోగాలు రాకుండా కాపాడుతుంది. కొద్దిగా గోమయం కలిపిన నీటితో స్నానం చేసే సాంప్రదాయం కూడా ఉంది.‘గోమయేన సదా స్నాయాత్ కర్రషి చ ఆప్యవిశేషేత్’’ (మహాభారతం, అనుశాసన పర్వం)యన్మే రోగం శోకం చ తన్మే దహతు గోమయం, రక్షం శకృత్ కృత్వా ద్వాదశాంగేషు నామభిః’’(శ్రీమద్భాగవతం)అందుకే గోమూత్ర గోమయాలను పవిత్రంగా భావిస్తారు.బజారులో లభించే ఆయుర్వేద ఔషధం: పంచగవ్య ఘృతం మరియు మహాపంచగవ్య ఘృతం.
మోతాదు: ఒక చెంచా (5 మి.లీ. లేక గ్రాములు) పావు కప్పు ఆవు పాలలో కలిపి ఉదయం ఖాళీ కడుపున సేవించాలి. సాయంత్రం కూడా మరోసారి తాగాలి. ఎంతకాలం వాడినా మంచిదే.
ప్రయోజనాలు: మేధా వర్ధకం, అన్నిరకాల మానసిక రోగాలలోనూ (ఉద్వేగ, ఉన్మాద, బుద్ధిమాంద్య, నిద్రా నాశరోగాలు) గుణకారి. ఆటిజం, పార్కిన్‌సోనిజం వంటి వాతరోగాలు తగ్గడానికి సహకరిస్తుంది.
గుర్తుంచుకోవలసిన సారాంశం:గోఘృతంబునె సర్వదా కోరుకొనుముప్రబల మేధ్యంబు వృష్యంబు బలకరంబుముదిమి రానీదు యువ శక్తి పొంగిపొరలు కంటికి బలమ్ము దీర్ఘాయుకర ము, ఘనముపావు పెరుగు నెయ్యి పరమోత్తమంబవిఆవు మూలమైన అమృతమయముక్రొత్త కాదు మనకు గోమయ మూత్రముల్‌పంచగవ్యములవి యెంచి చూడ
ఆవు పాలు: (భావప్రకాశ సంహితా)గవ్యం దుగ్ధం విశేషేణ మధురం రసపాకయోఃశీతలం స్తన్యకృత్ స్నిగ్ధం వాత పిత్త నాశనమ్... జరా సమస్త రోగాణా శాంతికృత్ సేవినాం సదా’’ఆవు పాలు తియ్యగా ఉంటాయి. చలవ చేస్తాయి. జిగురుగా ఉంటాయి. స్తన్యవర్థకం. వాతపిత్తహరమై రక్తదోషాలను తొలగిస్తాయి. ఆవు పాలను ప్రతి రోజూ తీసుకోవచ్చు. దీనివల్ల సమస్త రోగాలను నివారించే ‘క్షమత్వం’ వృద్ధి చెందుతుంది. ముసలితనం దూరం అవుతుంది. ఓజస్సును పెంపొందించి, నేత్రాలకు, చర్మానికి కాంతిని కలిగిస్తుంది. తల్లి పాలు కొరవడినప్పుడు శిశువులకు ఆవు పాలు శ్రేష్ఠం, బలవర్ధకం. అందుకే చరకాచార్యులు ‘ప్రవరం జీవనీయానాం క్షీరముత్తమం రసాయనం’ అని చెప్పాడు. సప్తధాతు పుష్టికరమై ఆయువును పెంచుతాయి ఆవు పాలు.
ఆవు నెయ్యి (గోఘృతం): మధురం, ప్రధానంగా పిత్త దోషహరం, వాతకఫ శ్యామకం, చలువ చేస్తుంది. మేధా (తెలివితేటలు) వర్ధకం, ఓజోకరం, శుక్రకరం, రసాయనం (సప్తధాతు పుష్టికరమై క్షమత్వ వర్ధకం). లావణ్య, కాంతి, తేజో... వర్ధకం, వయస్థాపకం (ముసలితనం రానీయకుండా యౌవనాన్ని పదిల పరుస్తుంది), ఆయుః వర్ధకం, మంగళకరం. కంటికి మంచిది. (గవ్యం ఘృతం విశేషేణ చక్షుష్యం, వృష్యం, అగ్నికృత్... మేధా లావణ్య కాంతి తేజో ఓజో వృద్ధికరం, వయస్థాపకం, బల్యం, సుమంగలం, ఆయుష్యం, సర్వ ఆజ్యేషు గుణాధికం) ఆవు నేతిని హోమం చేస్తే వచ్చే పొగ విషాన్ని హరిస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని కూడా హరిస్తుంది.
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి,
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment