Yogurt
-
పెరుగుతో జత చేయకూడని ఆహార పదార్థాలు ఇవే..!
కొంతమంది అజీర్ణం, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట లేదా కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు ప్రోటీన్, కాల్షియంల పవర్‌హౌస్ అయిన పెరుగుతో ఈ ఆహార పదార్థాలను జోడించడం వల్ల ఈ సమస్య తీవ్రతరమయ్యి, ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా కూడా పెరుగుతో ఇలాంటి పదార్థాలను జోడించడం శరీరానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా భారీ భోజనం లేదా మంచి స్పైసీతో కూడిన ఆయిలీ ఫుడ్స్ తినేటప్పుడు పెరుగులో కలపి అస్సలు ఇలాంటివి అస్సలు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ పెరుగుతో జత చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో సవివరంగా చూద్దామా..!కాల్షియం, ప్రోబయోటిక్స్ ఉండే పెరుగు శరీరానికి చలువ చేస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. కడుపులోని ప్రేగు కదలికలకు మద్దతు ఇస్తుంది. ఐతే కడుపులో జీర్ణక్రియ ప్రశాంతంగా హాయిగా ఉండాలంటే మాత్రం పెరుగుకి ఈ పదార్థాలు అస్సలు జత చెయ్యకండి.ఉల్లిపాయలు..ఉల్లిపాయ రైతా ఒక రుచికరమైన లంచ్ టైం డిష్. కూరగాయలు, రోటీలతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..పెరుగు శరీరంలో చల్లదనం తీసుకొస్తే..ఉల్లి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు కలిపి తీసుకుంటే..అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు తీవ్రతరం అవ్వడం లేదా రావడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.మామిడికాయలునిపుణుల అభిప్రాయం ప్రకారం మామిడిని పెరుగుతో జత చేసి అస్సలు తినకూడదు. జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, పీహెచ్ స్థాయిలలో అసమతుల్యతకు దారితీస్తుంది. మామిడికాయలో పులుపు, పెరుగులోని ఆమ్లం వల్ల పీహెచ్ స్థాయిల్లో అసమతుల్యతకు కారణమవుతుంది. మామిడి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల ఇది కూడా జీర్ణక్రియకు సమస్యాత్మకంగా ఉంటుంది. ఇలా తినడం ఫుడ్ పాయిజన్‌కు దారితీసి, దద్దుర్లు, తామర లేదా సోరియాసిస్ వంటి చర్మ సమస్యలకు దారితీస్తుంది. చేపశాకాహారంతో నాన్‌వెజ్ మూలాన్ని ఎట్టిపరిస్థితుల్లో జత చేయకూడదు. చేపలు, పెరుగులో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. ఇది కూడా కడుపు నొప్పి, ఉబ్బరం, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. పండ్లు..చాలా పండ్లలలో ఫ్రక్టోజ్ ఉంటుంది. అందువల్ల కొన్ని రకాల పండ్లను కూడా పెరుగుతో కలపడకూడదు. ఈ కలయిక జీర్ణక్రియకు ఇబ్బందికరంగా మారుతుంది. ఇది కూడా గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుతందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం ఇష్టంగా తాగే మిల్క్ షేక్‌లో ఎక్కువగా పాలు, అరటిపండ్లు ఉపయోగిస్తారు. ఇవి కూడా పొట్టకు ప్రతికూలంగా ఉంటాయని చెబుతున్నారు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్..పెరుగులో బాగా వేయించిన డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, వడలు కలిపిన బ్రేక్‌ఫాస్ట్‌లు తీసుకున్నా పొట్టలో చాలా భారంగా ఉంటుంది. పైగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది కూడా. అంతేగాదు ఆయిల్ ఫుడ్స్‌తో కూడిన పెరుగు జీర్ణక్రియను నెమ్మదించేలా చేసి నీరసం తెప్పించేలా చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: నాడు చిన్నారి పెళ్లి కూతురు..నేడు డాక్టర్‌గా..!) -
బొప్పాయి, దానిమ్మ.. రోజూ తింటే కలిగే లాభాలు! ముఖంపై ముడతలు.. ఇంకా
వయసు పెరిగే కొద్ది రకరకాల మార్పులు రావడం సహజం. ముఖ్యంగా ముఖంపై ముడతలు, ముఖం మెరుపు కోల్పోయి కళావిహీనం కావటం, కళ్లకింద ఉబ్బెత్తుగా ఉండటం, మంగు మచ్చలు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వీటినుంచి ఉపశమనానికి చాలా మంది మార్కెట్లో లభించే అనేకమైన కాస్మెటిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయితే వీటి వినియోగం వల్ల పరిష్కారం లభించకపోగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులుగా కొన్ని రకాల ఆహారాన్ని తీసుకుంటూ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌లను వాడటం వల్ల శరీరం యవ్వనంగా తయారవుతుంది. అంతేకాకుండా చాలా రకాల చర్మసమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాం... బొప్పాయి దీనిలో చర్మానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి బొప్పాయి పండ్లను ప్రతి రోజూ తినడం మంచిది. బొప్పాయిలో యాంటీ ఏజింగ్ గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి కాబట్టి దీనిని తినడం వల్ల శరీరానికి అధిక పరిమాణం లో యాంటీ ఆక్సిడెంట్లు లభించి చర్మం ఆరోగ్యంగా మిలమిలలాడుతుంది. అంతేకాదు, అనేకరకాల చర్మ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. బొప్పాయి గుజ్జును ఫేస్‌ప్యాక్‌లా వాడటం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆకు కూరలు ఆకు కూరల్లో క్లోరోఫిల్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం ఆరోగ్యంగా, కళ్లు మెరుపులీనుతూ ఉండాలంటే ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఆకుకూరల వాడకం వల్ల ఏ లోపం లేకుండా శరీరానికి సమృద్ధిగా విటమిన్లు అందుతాయి. అంతేగాక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి. పాలు, బాదం పాలలో ఉండే పోషకాల గురించి చిన్నప్పటినుంచి వింటున్నదే కాబటిట ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇక బాదం పప్పును ఏ విధంగా తీసుకున్నా అందులో చర్మాన్ని యవ్వనంగా ఉంచే లక్షణాలున్నాయి కాబట్టి రోజూ గుప్పెడు బాదం పప్పు తీసుకోవడం చాలా మంచిది. దానిమ్మ దానిమ్మను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని ఆపడానికి సహాయపడుతుంది. చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే రోజూ ఆహారంలో దానిమ్మను వినియోగించాలి. దానిమ్మ రసాన్ని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. షుగర్ ఉన్న వారు కూడా దానిమ్మను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పెరుగు శరీరానికి కావాల్సిన ప్రోబయోటిక్స్ అధిక పరిమాణంలో లభించాలంటే ఆహారంలో పెరుగు తప్పనిసరిగా ఉండాల్సిందే. పెరుగును ఫేస్ ప్యాక్‌గా కూడా వాడచ్చు. ప్రతి రోజూ పెరుగును ఆహారంలో తీసుకుంటే ముడతలు తొలగిపోవడంతోపాటు చర్మంపై రంధ్రాలు, మచ్చలు లేకుండా ముఖచర్మం మృదువుగా తయారవుతుంది. పిల్లలకు చిన్నప్పటినుంచి పెరుగు తినే అలవాటు చేయడం మంచిది. పైన చెప్పుకున్న వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మందులు, సౌందర్య సాధనాలతో పనిలేకుండా యవ్వనంగా ఉండచ్చని నిపుణుల మాట. చదవండి: Carrot Juice: క్యారట్ జ్యూస్ తాగే అలవాటుందా?... ఈ విషయాలు తెలిస్తే.. -
Beauty Tips: పెరుగు, రోజ్ వాటర్.. ఇంకా! నా బ్యూటీ సీక్రెట్ అదే: అనుష్క
అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ రబ్ నే బనాదీ జోడీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. బీ-టౌన్ అగ్ర హీరోయిన్గా ఎదిగింది. అంతేకాదు తన సోదరుడు కర్ణేశ్ శర్మతో కలిసి పలు హిట్ సినిమాలు నిర్మించింది కూడా! ఇక 2017లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని పెళ్లాడింది ఈ అయోధ్య అందం. ఈ క్రమంలో గతేడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అనుష్క శర్మ. కాగా ఎంతటి బిజీ షెడ్యూల్‌లోనైనా ఫిట్‌నెస్‌కు సమయం కేటాయించే ఆమె.. ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికీ అంతే ప్రాధాన్యతనిస్తుంది. అయితే, నిగనిగలాడే చర్మం కోసం కృత్రిమ పద్ధతుల బదులు ఇప్పటికీ తన తల్లి చెప్పిన చిట్కానే ఫాలో అవుతానంటోంది ఈ అందాల రాశి. అమ్మ చెప్పింది! అనుష్క శర్మ సౌందర్య రహస్యం ఆమె మాటల్లోనే.. ‘‘నిగనిగలాడే చర్మం కోసం సదా నేను పాటించే చిట్కా ఒక్కటే... ఫేస్ ప్యాక్. కొంచెం పెరుగు, రోజ్ వాటర్‌లో కాసింత వేపాకు పొడి వేసి బాగా కలిపి మొహానికి, మెడకు అప్లయ్ చేస్తాను. అది ఆరిపోయాక చన్నీళ్లతో మొహం కడిగేసుకుంటాను. ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా ఈ చిట్కాను పాటిస్తా. నేను టీన్స్‌లో ఉన్నప్పుడు పింపుల్స్ వస్తుంటే మా అమ్మ చెప్పింది ఈ కిటుకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మొహమ్మీద చిన్న మచ్చ కూడా లేకుండా.. రాకుండా కాపాడుతోంది ఈ ఫేస్ ప్యాక్’’. కాగా అనుష్క శర్మ ప్రస్తుతం.. భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్ చక్దా ఎక్స్‌ప్రెస్ సినిమాతో బిజీగా ఉంది. ఇక వీలు చిక్కినప్పుడల్లా భర్త విరాట్ కోహ్లి, కూతురు వామికతో అనుష్క సరదాగా సమయం గడుపుతుంది. ఈ అప్డేట్లను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో అకౌంట్లలో షేర్ చేస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) చదవండి: Shilpa Shetty: పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను.. నా బ్యూటీ సీక్రెట్ అదే! -
పెరుగు మంగమ్మ
చాలా ఏళ్ళుగా మాకు వాడుకగా పెరుగు పోస్తోంది మంగమ్మ. మాములుగా మా పేట వేపు వచ్చినప్పుడు మా ఇంటికి రావడం, ‘‘పెరుగు తీసుకుంటారా అమ్మా, మంచి పెరుగు తెచ్చాను’’ అనడం మేం అవసరమైతే తీసుకుని, ఆరోజు ధర ఎలా ఉందో తెలుసుకుని అప్పుడే డబ్బులు ఇచ్చేయడం, లేదా మర్నాడివ్వడం, ఇదీ మా వాడుక.వాళ్ళ ఊరు అవలూరు పక్కన ఏదో పల్లెటూరు. వస్తూ మా ఇంటి ముందు నుంచే రావాలి. వెళ్లేటప్పుడు మా ఇంటి మీదుగానే వెళ్ళాలి. వచ్చేటప్పుడొకసారి, వెళ్ళేటప్పుడు ఒకసారి మా ఇంటికి రావడం అలవాటు. మా లోగిట్లో కాసేపు కూర్చొని, మమ్మల్ని పలకరించి, తమలపాకులు, వక్క నోట్లో వేసుకుని, లేకపోతే మా దగ్గర పుచ్చుకొని తరువాత ఊరికి వెళ్ళేది. నేను కొంచెం తీరిగ్గా ఉంటే తన కష్టసుఖాల్ని చెప్పుకుని, నన్ను కూడా ఏమైనా చెప్పమంటుంటుంది.నాకేమున్నాయి కష్టాలు? దేవుడి దయవల్ల అంతా బాగానే ఉంది.సుమారు నెలాళ్ళ క్రితం మంగమ్మ పొద్దున్నే ‘‘పెరుగు తీసుకుంటారామ్మ?’’ అంటూ వచ్చినప్పుడు మా కుర్రాడు ‘‘ఇయ్యి పెరుగు’’ అంటూచెయ్యి జాపాడు.‘‘బంగారంలాంటి బిడ్డని కన్నావు. కానీ ఇయ్యన్నీ ఎన్నాళ్ళు? కుర్రోడు పెద్దోడయ్యే వరకే. అప్పుడెవతో వస్తుంది. ఇప్పుడు ‘అమ్మ! అమ్మ!’ అని కొంగట్టుకు తిరిగిన కొడుకు అప్పుడు అమ్మ ఉందో సచ్చిందో కూడా అడగడు’’ అంది మంగమ్మ.నేను ‘‘ఏమైంది మంగమ్మా? కొడుకు నువ్వు చెప్పిన మాట విన్లేదా?’’ అన్నాను.‘‘సర్లే తల్లీ, కట్టుకున్న మొగుడిన్లేదు, ఇక కొడుకేటి వినేది? అయ్యో, నాయమ్మ! నేనేనాడూ మంచి కోక్కట్టుకుని ఎరగను. మరెవతో కట్టుకుంది. కోక అందం చూసి అటెల్లాడు. నా ఇల్లు, నా ఆడది అనుంటే చాలు మగాడికి అనూరుకున్నాను. అమురుతం అన్నాను. మొగుణ్ణి పోగొట్టుకున్నాను. ఏదో నాకంతే రాసుంది. నువ్వు మటుకు మొగుడొచ్చే ఏలకు మంచికోక కట్టుకునుండు. మగాళ్ళ మనసు శానా చంచలం. ఇదుగో, ఇప్పుడు కట్టుకున్నావే, ఇలాంటి కోకలు పనీపాటు చేసేటప్పుడు కట్టుకోవాలి తల్లీ’’ నాక్కొద్దిగా నవ్వొచ్చింది. కాని ఆమె అనుభవంలోంచి వచ్చిన మాటల్లోని తెలివి గొప్పగా తోచింది. ఆ మాటల వెనకాల ఆమె స్వానుభవంలో కలిగిన నొప్పి తాలూకు ఛాయలు కనిపిస్తున్నాయి. అది గ్రహించగానే నాకెంతో బాధ కలిగింది. ‘‘చూడు తల్లీ భర్తని సరిగ్గా వుంచుకోవాలంటే నాలుగు చిటకాలు. అప్పుడప్పుడు తింటానికి రుచిగా ఏమన్నా చేసి పెట్టడం, సక్కగా కళ్ళకింపుగా తయారై, కష్టనిష్ఠూరమో ఏదెలా ఉన్నా నవ్వుతూ పలకరించాలి.ఇంటిక్కావల్సినవన్నీ ఒక్కసారే తెప్పించుకొని, మళ్ళీ మళ్ళీ అడక్కుండా ఉండాలి. మూడు పైసలో, ఆరు పైసలో పోగేసి దాచి, అవసరమన్నప్పుడొక రూపాయి చేతిలో పెట్టాలి. ఆడదిట్టా సేస్తే మొగుడన్నోడు ఇంటికుక్కలా పడుంటాడు. లేదనుకో ఈదులెంట తిరుగుతాడు. నాకు మంగమ్మ మాటల చమత్కారం చూసి ఆశ్చర్యమేసింది. మరోరెండు మాటలాడి ఆ వేళటికి ఇంటికి పంపించేశాను.పదిహేను రోజుల క్రితం మంగమ్మ వచ్చినపుడదోలాగ ఉన్నట్టనిపించి ‘‘ఏ మంగమ్మా! అదోలా వున్నావేమిటి? కొడుకేమన్నా అన్నాడా?’’ అనడిగాను.‘‘అన్నాడమ్మా. వాడి పెళ్ళాం ఏ మెరగని పసివాణ్ణి, వాడేదో చేశాడని పట్టుక్కొట్టింది. ఏమే గయ్యాళీ, ఎందుకు రాక్షసిలా ఆ పసివాడిని బాదుతావు?’’ అని అడిగాను. నాకే ఎదురు తిరిగిందది. నోటికొచ్చినట్టంది. ‘‘ఇదేటే నీ మొగుణ్ణి కన్నదాన్ని నేను.నన్నే ఇంతలేసి మాటలంటావా? కానీయ్, ఆణ్ణే రానీ అడుగుతాను’’ అన్నాను. ఆ దొర ఇంటికొచ్చాడు. ‘‘చూడయ్యా, సంటోణ్ణూరికే బాత్తుంటే ‘ ఒద్దే’ అన్నానని నన్ను నానా తిట్లూ తిట్లింది. నీ పెళ్ళానికి కాస్త బుద్ధి చెప్పుకోరాదా’’ అన్నాను. కోడలొచ్చి ‘‘ఏటి నాకు బుద్ధి చెప్పేది? కుర్రోడల్లరి చేస్తే ఒద్దంటానికి నాకధికారం లేదా? నువ్వు నా మొగుణ్ణి కన్నట్టే, నేనూ ఈణ్ణి కనలేదా? నాకేటి బుద్ధి సెప్పేది?’’ అంది. ఎంతైనా అది ఆడి పెళ్ళాం కదా! ఆడన్నాడూ ‘ఔనే అమ్మా! కన్నబిడ్డనది కొట్టుకుంటుంది. నువ్వెందుకు దాని జోలికి పోతావు? నేను నీ కొడుకుని కదా, నన్నేమన్నా అను, చెల్లు’’ అన్నాడు. ‘‘నాకెవరయ్యా దిక్కు?’’ అన్నాను. ‘‘నీకేమిటమ్మా పాడి, డబ్బు ఉన్నాయి. నిన్ను నేను సాకక్కర్లేదుగా’’ అన్నాడు. ‘‘అంటే నన్ను వేరు పొమ్మంటావేటిరా?’’ అన్నాను. ‘‘నీ ఇష్టం. పోతానంటే వద్దనను. మీ ఇద్దరి గోల పడలేకుండా ఉన్నాను’’ అన్నాడు. ‘‘సరేనయ్యా, మద్దేనం నుంచి నేను వేరే పోతాలే. నువ్వు, నీ పెళ్ళాం సుకంగా ఉండండి అనేసి పెరుగు తీసుకుని సక్కా వచ్చాను తల్లీ’’ అంటూ మంగమ్మ ఏడ్చింది. నేను ఓదార్చాను. ‘‘సర్లే మంగమ్మా ఇవన్నీ ఉట్టి మాటలే. అంత సర్దుకుంటుంది’’ అని ధైర్యం చెప్పి పంపాను.మర్నాడు మంగమ్మొచ్చినప్పుడు నిన్నటంత దిగాలుగా లేదు. కాని ఎప్పటిలా చురుగ్గానూ లేదు. ‘‘గొడవలన్నీ సర్దుకున్నాయా మంగమ్మా?’’ అనడిగాను. ‘‘సర్దుకోడానికిడుస్తుందా అది. నిన్న నేను పెరుగమ్మి ఇంటికివెళ్లేసరికి, నా కుండలవీ వారగా ఉంచింది. ఓ దాంట్లో బియ్యం, మరోదాంట్లో రాగులు, ఉప్పు, మిరకాయలు అన్నీను.తను, తన మొగుడూ అన్నం తిన్నామన్నట్లుగా కాళ్ళు జాపుక్కూర్చుంది. ఇంకేముంది తల్లీ సర్దుకునేది. నేనూ ఒకింత ముద్ద (సంగటి) కెలుక్కుని తిన్నాను. నేనేదో అన్నాననుకో. అదే చాలన్నట్టు ఊరుకున్నారు వాళ్ళు. రోజూ ఆ పిల్లాడికింత పెరుగు పెట్టిగాని అమ్మకానికొచ్చేదాన్ని కాదు. పోద్దున్నే ఆ వేళకి ఆడ్నెక్కడికో తీసికెళ్ళిపోయింది. ఆ పిల్లాణ్ణి నాకు దూరం చెయ్యాలనే అలా చేసింది’’ అంది. ఒక చిన్నమాట ఎంత దూరం పోయింది అని ఆశ్చర్యమేసింది నాకు. తరువాత ఒకట్రెండు రోజులు ఆ మాట ఎత్తలేదు. మంగమ్మ వేరుగా ఉంటున్నట్లుగా అనిపించింది. తరువాతొకరోజు మంగమ్మ, ‘‘నువ్వేసుకుంటావే, ఆ మకమల్ జాకెట్టు బట్ట గజమెంత?’’ అనడిగింది.‘‘ఎందుకు మంగమ్మా’’ అన్నాను. ‘‘ఇన్ని రోజులు కొడుక్కి, మనవడికి అనుకుంటూ పైసా పైసా కూడ బెట్టాను. ఇంకెందుకు? నేను మకమల్ జాకెట్టు కుట్టించుకుని తొడుక్కు తిరుగుతాను’’ అంది.‘‘జాకెట్టుకు ఏడెనిమిది రూపాయలవుతుంది మంగమ్మా’’ అన్నాను. ఆ వేళే దర్జీ కొట్లో మంగమ్మ మకమల్ బట్ట బేరం చెయ్యనూ చేసింది, కుట్టడానికియ్యనూ ఇచ్చింది. మర్నాడు ఊరికెళుతూ దాన్ని తొడుక్కుని వచ్చింది. ‘‘చూశావా అమ్మయ్యా...నా సింగారం. మావోడొచ్చినప్పుడు కూడా మంచి కోక కట్టలేదు నేను. వాడెవతెనో వెంట పోయాడు. కన్న కొడుకు కోసం పైసా పైసా కూడబెట్టి దాస్తే దాని కథ ఇట్టాగయింది. చూడు నా సింగారం’’ అంది. కొడుకుని దూరం చేసుకున్న దుఃఖంలో మంగమ్మకు కొంచెం మతిచలించిందేమో అనిపించింది నాకు. కాని ఆ జాకెట్ వల్ల ఆమెకి మిగతా వాళ్ళతో గొడవొచ్చింది. వాళ్ళ ఊళ్ళో కుర్రాడొకడు బెంగుళూర్లో చదువుకుంటున్నాడట. అతను టై, కాలర్ వేసుకునే నాజుకు మనిషి. అతను మంగమ్మనిచూసి ‘‘ఏంటవ్వోయ్ ఏకంగా మఖమల్ జాకెట్టు తొడిగేసావ్?’’ అన్నాట్ట. ‘‘నువ్వు గొంతుక్కి ఊరిపోసుకోగా లేంది నేను జాకెట్టు తొడుక్కుంటేనేం?’’ అందంట. మాటా మాటా పెరిగింది. చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వారు.బయటవాళ్ళ సంగతలా ఉంచి, మంగమ్మ కోడలే, ‘‘కోడలికో రవిక కుట్టించలేక అత్త వేరు పోయి, మఖమల్ జాకెట్టు తొడిగింది చూడండి’’ అందట పొరుగు వాళ్ళతో మంగమ్మకి వినబడేలా.మంగమ్మ కోడలికి పెళ్ళిలో కమ్మలు, కడియాలు, నాగర, కంటి, ఒడ్డాణం అన్నీ పెట్టింది.తరువాత ఏడాదికొకటి చొప్పున ఏదో ఒక నగ కొంటూనే ఉంది. అవన్నీ గుర్తులేవా కోడలికి? మంగమ్మ రెండుమూడుసార్లు ఊరుకొని ఆఖరికి ఓ రాత్రివేళ కొడుకుతో ‘‘నీ పెళ్ళాం నన్నేదేదో అంటోంది. నేను దానికేమీకొనివ్వలేదా?’’ అందట. కోడలు మొగుణ్ణి మాట్లాడనియ్యకుండా ‘‘మొగుడు లేని ముసల్దానివి నువ్వు. ఇప్పుడు కమ్మలు, ఒడ్డాణం కావల్సొచ్చాయా? తీసుకుపో, ఏస్కో’’ అంది. ఆ మొగుడు, ‘‘ఎందుకే అన్ని మాటలు!’’ అని పెళ్ళాంతో అని, తల్లితో ‘‘అమ్మా! మీ ఇద్దరి తగూల సంగతి నాకెందుకుగానీ, నీ నగలు నీక్కావాలంటే పట్టుకుపో’’ అన్నాడట. మంగమ్మ ‘‘ఇరుగు పొరుగుతో అలాంటి మాటలెందుకే’’ అని పెళ్ళానికి చెప్పుకోలేడుగానీ, కావాలంటే నగలు తీసుకుపో అని నా మీదే తప్పు మోపాడు’’ అని వాపోయింది. అదంతా విని చాలా బాధపడ్డాను. ఈమె చూస్తే ముసల్ది. అతనా ఒక్కడే కొడుకు. ఆ మనిషి మొగుణ్ణి, మొగుడి తల్లిని కాస్త బాగా చూసుకోకూడదూ. ఇంతకీ ముసల్ది మనవణ్ణి కొట్టొద్దన్నందుకు ఇంత గొడవా? ఎందుకిలా చేస్తారో కదా అనిపించింది. అవును, ఎక్కడచూసినా దెబ్బలాటలకి కారణాలిలాగే ఉంటాయి. ఒకరికి ఒకరంటే పడకపోవడం వల్ల చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద గొడవలవుతాయి’’ అనిపించింది.ఇది జరిగిన కొన్నాళ్ళకి మంగమ్మ నాతో, ‘‘అమ్మా మీరు సత్యవంతులు. నాది కొంచెం డబ్బుంది. దాన్ని ఎక్కడైనా బ్యాంకి అంటారు కదా అలాంటి చోట దాచిపెట్టగలరా? దానికి మీ సాయం కావాలి. ఆ డబ్బు మీద వాళ్ళు, వీళ్ళు కన్నేస్తున్నారు...’’ అంది. ఏం జరిగిందని అడిగాను. నిన్నేం జరిగిందంటే. మా ఊళ్ళో రంగప్పని ఒకడున్నాడు. జూదగాడు, సోకులెక్కువ. నేను పెరుగు తీసుకొస్తుంటే తోవలో ఎక్కడ్నుంచో ఊడిపడ్డాడు. ‘‘ఏటి మంగమ్మా బాగుండావా?’’ అన్నాడు. ‘‘ఏం బాగులే రంగప్పా, నీకు తెలీందేముంది?’’ అన్నాను. ఆడన్నాడు, ‘‘ఇప్పుడు బాగు సంగతెవడిక్కావాల? ఈ కాలం కుర్రోళ్ళు నీ లెక్కేట్టన్నట్టు మాట్టాడతారు. మాలాంటి వయసు మళ్ళినోళ్ళు ‘అయ్యో ఇలా జరిగిందేటి?’’ అనుకుంటామంతే. ఇంకేటి సేస్తాంలే’’ అన్నాడు. అట్టాగే నడుసుకుంటూ వచ్చాం. దార్లో తోపు, నుయ్యి ఉన్నాయి. అక్కడికొచ్చేసరికి ఆడేటి చేస్తాడోనని భయమేసింది. ఈ సంచిలో డబ్బుందిలే. అందుకే ఆడు కొంచెం సున్నవుంటే ఇస్తావా?’’ అన్నాడు. ఇచ్చాను. తీసుకుపోయాడు. ఈరోజు వస్తుంటే ఆ తావులోనే మళ్ళీ కలిశాడు. ఆమాట, ఈమాట చెప్ని, ‘‘మంగమ్మా! కాస్త డబ్బుతో పనిబడింది. అప్పిస్తావా? ఈసారి రాగులమ్మగానే తీర్చేస్తాను’’ అన్నాడు. ‘‘నా దగ్గర యాడుంది?’’ అన్నాను. ‘‘సర్లే మంగమ్మా, నాకు తెల్దా డబ్బు ఆడా, ఈడా పూడ్చి పెడితే ఏటొస్తాది? నాకు అప్పిస్తావా, నన్ను సమయానికి ఆదుకున్నదానివవుతావు. నీకు వడ్డీ వస్తది’’ అన్నాడు. కాసేపాగి, ‘‘నువ్వు కొడుకు కలిసున్నట్టయితే నేనడిగేవాణ్ణే కాదు. ఏదో కోడలికి నగా–నట్రా చేయించుకునేదానివి. ఇప్పుడు అట్టాటిదేవీ లేదు కదా! అందుకే అడిగా’’ అన్నాడు. చూడమ్మయ్యా, ఆడదొంటిగా ఉంటే జనం కళ్ళెట్టా పడతాయ్యో’’ అంది. మా వాళ్లను అడిగి చెబుతాను’’ అన్నాను. నేనింకా వారికి ఈ సంగతింకా చెప్పనేలేదు’’ అంది. మర్నాడు మంగమ్మ పెరుగుపోసి, రొంటిన ఉన్న సంచీ తీసింది. ‘‘లోపలికి పదండి లెక్కెట్టుకుందురుగాని’’ అంది. ‘‘నేనింకా ఆయనకి చెప్పలేదు, ఇంకో రోజు ఇద్దువుగానిలే’’ అన్నాను. మంగమ్మ, ‘‘నాకు శానా బయంగా ఉందమ్మయ్యా. రంగప్ప ఇయాల కూడా వచ్చాడు. తోపు దగ్గర, ‘‘కూచో మంగమ్మ, తొందరేటి? ఎల్దువుగాన్లే’’ అన్నాడు. మంచి ఒయసులో ఉన్నప్పుడే కట్టుకున్నోడే పట్టుకున్న సెయ్యొదిలేశాడు. మరోడు ముట్టలేదు దాన్ని. ఇయాల ఈడట్టుకున్నాడు. ఇడిపింసుకుని, ‘ఏటి రంగప్పా, సరసం ముదిరిందే. నా అందసందం ఊసెత్తడానికి నువ్వేమన్నా, నా కట్టుకున్న మొగుడివా? ఇడిసిసెట్టు’’ అని ఇదిలించుకుని వచ్చేసినా.ఇదేమిటి, ఈమె కథ ఏదో ప్రమాదానికి దారి తీసెటట్టుందే అనిపించింది.‘‘ఇదంతా ఎందుకొచ్చిన గొడవగాని మంగమ్మా అయిందేదో అయిందిగాని, వెళ్ళి కొడుకుదగ్గర ఉండరాదా?’’ అన్నాను. ‘‘నేనుంటానంటే ఏంలాబంలే అమ్మాయ్యా, ఆడుండ నియ్యొద్దూ’’ ‘‘కొడుకుతో చెప్పు ఇదంతా’’ ‘‘అయ్యో నా తల్లి, రచ్చకీడ్చి వెలివేయిస్తుంది నా కోడలు. నాకు పొద్దుపోతుంది. నేనెన్ళొస్తా. అయ్యగార్నడిగి రేపు చెప్పు’’ అంటూ వెళ్ళిపోయింది మంగమ్మ.మళ్ళీ ఒంటిగంటకొచ్చింది ‘‘అమ్మయ్యా, ఇవాళొక పనయింది. పిల్లాడికుంటుందిలే అని కాస్త మిఠాయి కొని తట్టలో పెట్టుకున్నా’’ అంది. ‘‘ఏ పిల్లాడు?’’ అని అడిగాను. ‘‘మా పిల్లాడికే...నా దగ్గరికి వెళ్ళొద్దని ఆళ్ళమ్మ సెబుతుందిగాని, ఆడుండ గలడా. ఆళ్లు సూడకుండా ఎప్పుడో వచ్చి కాసిన్ని పాలు తాగుతాడు. కూసింత పెరుగు బిళ్ళ పెట్టమంటాడు. ఏదైనా ఇస్తే గంతులేస్తాడు. ఆడి కోసమని మిఠాయి తట్టలో ఎట్టుకుంటే ఈ సంకరపురంలో వచ్చేటప్పుడు కాకి తన్నుకు పోయింది. ఇట్టా జరిగిందెందుకు?’’ అంది. ‘‘ఏమైందిలే, ఓ పొట్లం కాకెత్తుకుపోతే మరోటి కొనుక్కెళ్తే పోలా?’’ అన్నా. ‘‘కాకి మనుషుల్ని ముట్టకూడదంటారు కదా!’’ అంది. ‘‘ముట్టుకుంటే ఏమంటా?’’ అన్నాను. ‘‘పానానికి ముప్పు అంటారు. నాకు కొనకాలం వచ్చిందేమోనని బయం వేసింది ముందు. మళ్ళీ అనుకున్నా, ఇదీ మంచిదే ఎవురికీ పనికిరాని జల్మమెందుకని’’ అంది. ‘‘ఏంమాటలవి? ఏంఫరవాలేదుగాని, ఇంటికెళ్ళిరా’’ అన్నాను. ‘‘అయితే బయం లేదంటావా అమ్మాయ్యా?’’ ‘‘భయం లేదు, గియం లేదు. ఆపదలొచ్చిన కొద్దీ ఆయుస్సు ఎక్కువంటారు. ఆలోచించకుండా హాయిగా ఇంటికెళ్ళు’’మంగమ్మ వెళ్ళిపోయింది. కొడుకు కావాలి, కోడలు కావాలి, మనవడు కావాలి. కాని తన పెద్దరికాన్ని అంతా గౌరవించాలి. మనిషన్నవాడికి ఈ చాపల్యం తప్పనిది. అది లేకపోతే బ్రతుకులో ఏదో బాధ. అయినా చావడానికి ఇష్టం లేదు. మంగమ్మ ఈసారి మరొక సంగతి చెప్పింది. ఆ మనవడు అమ్మని, నాన్నని వదిలి ఈవిడ దగ్గరికే వచ్చేశాడట. ‘‘నిన్న మద్దేన్నం నా కాడికి వచ్చినోడు మళ్లీ అమ్మ దగ్గర కెళ్ళనని మొరాయించాడు. ఇన్నాళ్ళు దొంగచాటుగా వచ్చేవోడు, ఎప్పుడైతే ఇట్టా చేశాడో ఆళ్ళమ్మొచ్చి నానా గోలా చేసింది. ఉహు...ఎల్లనే లేదు. నాకాడే ఉండిపోయాడు తెలుసా తల్లి. పసిపిల్లాడైనా ఈడుతోడుగా ఉంటే ఎంత దయిర్యంగా ఉందో నాకు. ఎంతైనా మగనలుసు కదా!ఒకే ఇంట్లో ఉంటుంటే నా కోడలు ఎంత అందగత్తో నాకు తెలవనే లేదు. ఇప్పుడు దూరం నించి సూత్తానా...మొకం ముడుసుకుంటే ఏదో లాగుంటుందిగానీ, లేకపోతే మంచి అందగత్తెల్లోకే లెక్క. ఆడినీ అంతే, పొలానికెప్పుడొస్తాడో సూసేదాన్ని కాదు. ఇప్పుడు గుమ్మం కాడ కూసుని ఇంకా రాలేదేటి అనో, ఇంత తొరగా ఎల్తున్నాడేటనో సూస్తాను కదా. దానికి అంతే కదా. ఇప్పుడు కొడితే, ఆడు రేపు నాతో బాటు ఇటొచ్చేస్తే ఏటి సేస్తాది? కొడుకునిడిసి పెట్టుకుంటాదా?’’ ‘‘ఈమె ఊహలు ఎంత దూరం పోతున్నాయి కదా’’ అని ఆశ్చర్యం వేసింది నాకు. ఈలోపలే వీళ్ళ మధ్య పొరపొచ్చాలు తొలగిపోయే సూచనలు కనబడుతున్నట్టుగా తోచింది నాకు. అలాగే జరిగింది కూడా. రెండు రోజులాగి తల్లి దగ్గర కెళ్ళిన కుర్రాడు మర్నాడు నాన్నమ్మతో బెంగుళూరొస్తానని పేచీ పెట్టాడు. మంగమ్మకి ఏం చెయ్యాలో తోచలేదు.కొడుకు–కోడలు వచ్చి ‘‘ఏదో మా వల్ల తప్పయిందనుకో, నువ్వు కోపం చేసుకుంటే ఎట్టాగమ్మా?’’ అన్నారు. తన బింకం సడలకుండా మంగమ్మ ఇష్టంగానే కోడలితో కలిసిపోయింది. కాని ఈ మనవడు నానమ్మతో ఉండాలని పట్టుబట్టాడు. దాని వల్ల కొత్త ఏర్పాటే చేసుకున్నారు. ‘‘ఏటి ఎండలో పోడం, రాడం! పెద్దతనం వచ్చాక ఎన్నాళ్ళీ చాకిరీ. ఇంత ముద్ద కెలికి చారుపెట్టి ఇంట్లో ఉండు. నేనెళ్ళి పెరుగమ్ముతాను’’ అంది కోడలు. మంగమ్మ ఒప్పుకుంది. ఓరోజు అత్తాకోడళ్ళిద్దరూ వచ్చారు. ఒకరి చంకలో పిల్లాడు, మరొకరి నెత్తి మీద పెరుగుతట్ట.‘‘ఇదిగో నమ్మయ్యా నా కోడలు. పాపం ముసల్ది, తనే ఉడుకేసుకొని అవస్థ పడుతుందని, మళ్ళీ నన్నింట్లో చేర్చుకుంది. ఉట్టినే ఎండలో పడి తిరగద్దని అంది. ఇక నుంచదే తెస్తుంది పెరుగు. పోయించు కోండమ్మయ్యా’’ అని చెప్పి కోడలికి మా ఇల్లు అప్పజెప్పింది. ఈమధ్య ఆ కోడలే పెరుగుపోస్తోంది.అత్త వేపు నుంచి మాటలు జరిగాయి కదా, ఇక కోడలేమంటుందో విందామనిపించి ఓ రోజు.‘‘సంజమ్మా...అత్తని ఇంటి నుంచి వెళ్ళగొట్టచ్చా?’’ అని అడిగాను. దానికి సంజమ్మ అందికదా– ‘‘అత్తనెల్లగొట్టడానికి నేనేటి రాచ్చసినా అమ్మగారూ, అత్త అన్న మనిషి అన్నింటికీ నేనే పెద్దనంటూ తయారైతే, ఇక ఆడు మొగుడేటీ, నేను పెళ్ళానేటి, మేం సంసారం చేసేదేటి? నా మొగుణ్ణి కావాలంటే తనకి సొంతం అని అట్టే పెట్టుకోనీ. కాని నా కొడుకుని నేనుకొట్టకూడదని రూలు పెడితే ఇదెక్కడి కోడంట్రికం అమ్మగారు?’’ అంది.‘కొడితేనే కొడుకు నీ సొంతమని లెక్కా?’’ అని అడిగాను.‘‘నా కొడుకంటే, నా కొడుకే. నా మొగుడంటే నా మొగుడే. కోడలంటూ వచ్చాక, అత్త ఒక మాటంటే అనచ్చు. ఇది లేకుండా ఎవరి సంసారం మాత్రముంటుంది?’’ నాకు మంగమ్మ చెప్పినప్పుడు తను చెప్పింది ‘సరి’ అనిపించినట్టుగానే, కోడలు చెబుతుంటే కోడలిదీ సరిగ్గాఉన్నట్టుగానే అనిపించింది. ‘‘అయితే ఇప్పుడు నీకు ఇంట్లో కొంత స్వతంత్రం వచ్చినట్టేనా?’’ అనడిగాను. ‘‘ఇప్పుడు మొదటి కన్నా నయం తల్లీ. ఎట్టాగో సద్దుకుపోవాలి. గొడవ పడితే మాకే నష్టం. మాఅత్త డబ్బు మీద కన్నేసి ఉన్నారెంతోమంది. కాజేసినా చెయ్యొచ్చు. రంగప్ప అని ఒకడున్నాడు. ఆడు మా అత్త వేరు కాపురం పెట్టినప్పుడు అప్పడిగాడట. ఈమె ఇస్తానందట. ఆడొచ్చి ఆ మాట చెప్నాడు. మా కుర్రాణ్ణి పిలిచి, ‘‘ఒరేయ్ నానమ్మ దగ్గరకెళ్ళి అడుగు, మిఠాయి పెడుతుంది. మళ్లీ పిల్చేదాకా రామాకు’’ అని కట్టడి చేశా. గొడవలెలాగైనా సర్దుకుంటే చాలని అట్టా చేశానమ్మా. కాని అమ్మగారూ, ఇయ్యన్నీ పైకి చెప్పుకోగలమా? మగవాళ్ల కివన్నీ ఏం తెలుస్తాయి?’’ అంది. మంగమ్మ కంటే సంజమ్మ తెలివితేటల్లో తక్కువదేం కాదు. అతడిని తన పట్టు నుంచి వదులుకోకూడదని తల్లి మనోవాంఛ, అతడిని గుప్పిట బంధించాలని ఈ కోడలి పట్టుదల. ఇదీ ప్రతిచోట జరిగే భాగోతమే. ఇందులో గెలుపు–ఓటమి, ఈవిధంగా ఉంటాయని చెప్పడానికి లేదు. పల్లెలో అయితే పెరుగు మంగమ్మ ఇంట్లో, పట్నంలో అయితే పెరుగుకొనే తంగమ్మ ఇంట్లో ఈ నాటకం జరుగుతూనే ఉంటుంది. ఆఖరి అంకం ఊహించలేని నాటకం. కన్నడ మూలం : డా.మాస్తి వెంకటేశ అయ్యంగార్ - అనువాదం: శర్వాణి -
యవ్వనకాంతి
పండ్లు, కూరగాయలు, వాటి నుంచి వచ్చే నూనెలను సౌందర్య లేపనాలుగా ఉపయోగిస్తే చర్మం యవ్వనకాంతితో మెరిసిపోతుంది. విటమిన్ –సి సహజసిద్ధమైన యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ గల స్ట్రాబెర్రీ మాస్క్ వల్ల రెట్టింపు అందాన్ని పొందవచ్చు. ఎండకు కమిలిన, మృతకణాలున్న చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చి యవ్వనకాంతిని పెంచుతుంది. ఓ కప్పు తాజా స్ట్రాబెర్రీలు మిక్సర్‌లో మెత్తగా బ్లెండ్ చేయాలి. దీంట్లో కప్పు పెరుగు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మెత్తటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి లేదా రెండువారాలకు ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవచ్చు. చర్మం ముడతలు పడనివ్వని యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ దానిమ్మలో పుష్కలం. యాంటీయాక్సిడెంట్స్, విటమిన్–సి సమృద్ధిగా ఉన్న దానిమ్మ ఓట్స్ లేదా పెరుగుతో కలిపి మేలైన ఫేస్ ప్యాక్ తయారవుతుంది. మృతకణాలను తొలగించడమే కాదు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలు, కప్పు ఓట్స్ కలిపి మిక్సర్‌లో వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకొని, 2 టేబుల్ స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల మజ్జిగ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఐదు నిమిషాలు ఉంచి, కడిగేయాలి. -
పంచగవ్యాల ప్రాశస్త్యం
సంస్కృత ‘సాధు’ పదానికి ‘మంచి గుణం’ అని అర్థం. మంచితనానికి పరాకాష్ఠ ‘పవిత్రత’. ఈ తత్త్వం మానసిక ఆరోగ్యానికి ఉత్ప్రేరకం. భగవంతుని ఆశీర్వచన సూచికనే ప్రసాదంలో భక్తులు వీక్షిస్తారు. అందుకే ప్రసాదం పరమ పవిత్రమైనదని ప్రతీతి. ఇక్కడ పరిమాణం ప్రధానం కాదు, విశ్వాసం విశిష్టమైనది. భారతీయ ధార్మిక సాంప్రదాయాలలో, భగవంతుని క్షేత్రం ఏదైనా, స్థాయి ఏదైనా ప్రసాదమే ప్రాముఖ్యత వహిస్తుంది. ప్రాంతాన్ని బట్టి ప్రసాద పదార్థం మారుతుంటుంది. మారేడు దళమైనా, మందార పువ్వైనా, కుంకుమైనా, విభూదిౖయెనా, అన్నిటికీ ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. కడుపులోకి సేవించే వాటిలో కదళీ ఫలమైనా, నారికేళ జలమైనా, కర్పూల తులసీ దళ తీర్థమైనా అన్నీ ఆరోగ్యకరమైనవే. ప్రత్యేకంగా తయారుచేసే భక్ష్యాలలో పాలు, నెయ్యి, శర్కర, తేనె... వంటి పదార్థాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మధురమైనవి, మధురేతరమైనవి కూడా ప్రసాదాలుగా ఉండొచ్చు. పాలు, నెయ్యి అన్నప్పుడు అవి ఆవులకు సంబంధించినవే అని అర్థం చేసుకోవాలి. సంస్కృతంలో ఆవుని ధేనువు అంటారు. ‘గో’ శబ్దం ఆవుకి, ఎద్దుకి కూడా వర్తిస్తుంది. భారత ఇతిహాసంలో గోమాత యొక్క పవిత్రత, ప్రాశస్త్యం గురించి చెప్పవలసిన అవసరం లేదు. నాటి ఆయుర్వేద శాస్త్రం నుంచి, నేటి ఆధునిక పరిశోధన విప్లవాల వరకు పంచగవ్యాల (ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, గోమయం/పేడ) పోషక విలువలు, ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు అత్యుత్తమంగానే ఉన్నాయి. శాస్త్ర దృక్కోణం లో ఆవు ఉత్కృష్టతను ఒక్కమాటలో చెప్పాలంటే, ఆవుకి విషం ఇస్తే, అది మరణిస్తుందే తప్ప దాని క్షీర, మూత్ర, మలాలలో మాత్రం విషపు ఛాయలు కనబడవు. ఈ గుణం ఏ ప్రాణికీ లేదు. అటువంటి పంచగవ్యాల గురించి స్థూలంగా శాస్త్రం చెప్పిన విషయాలు... గోమూత్రం: రుచి: కటు (కారం) క్షార (ఉప్పదనం), తిక్త (చేదు), కషాయ (వగరు) గుణాలు: తీక్షణం, లఘు, అగ్నిదీపనం, కఫవాతహరం, పిత్తకరం. ఔషధ ధర్మాలు: జీర్ణశక్తిని పెంచి, పొట్టలో వాయువును తొలగించి, ఉదర శూల (కడుపులో నొప్పి) ను పోగొడుతుంది. మేధావర్ధకం. ముఖరోగాలను (నోటి పూత మొదలైనవి) తగ్గిస్తుంది. మూత్ర వహ సంస్థానానికి చాలా ఉపయుక్తం. అంటే మూత్రాన్ని ధారాళంగా ప్రవహింప చేసి, ఎన్నో మూత్ర రోగాలను హరిస్తుంది. శోఫ హరం (శరీరంలో వాపులను నశింపచేస్తుంది). దగ్గు, ఆయాసాలను తగ్గిస్తుంది. కంటి రోగాలను, సమస్త చర్మ రోగాలను హరిస్తుంది. క్రిమిహరం, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. (గోమూత్రం... మేధ్యం... శూలగుల్మ ఉదర ఆనాహ... కాస, శ్వాసాపహం... మూత్రలం, మూత్రరోగహరం... అతిసార కుష్ట క్రిమి, శోఫ, పాండు రోగాపహం...) గోమయం (ఆవు పేడ): దీనిలో కూడా పోషక విలువలు ఉంటాయి. క్రిమిహరం కూడా. తక్కువ ప్రమాణంతో గోమయ రసాన్ని సేవించటం కూడా ఉంది. వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టే క్రిమిహర, విషహర గుణాలు ఉన్నాయి. చక్కటి ఎరువుగా ఉపకరిస్తుంది.ఎండబెట్టి పిడకలు చేసి ఇంధనంగా వాడితే ఆయా వంటకాల గుణాలు కూడా ఉత్తమం. భస్మమైన పిడకల్ని ‘కచిక’ అంటారు. దీంతో పండ్లు (దంతాలు) తోముకునే విధానాన్ని ఇప్పటికీ పల్లె ప్రజలు పాటిస్తున్నారు. దంత రోగాలు రాకుండా కాపాడుతుంది. కొద్దిగా గోమయం కలిపిన నీటితో స్నానం చేసే సాంప్రదాయం కూడా ఉంది.‘గోమయేన సదా స్నాయాత్ కర్రషి చ ఆప్యవిశేషేత్’’ (మహాభారతం, అనుశాసన పర్వం)యన్మే రోగం శోకం చ తన్మే దహతు గోమయం, రక్షం శకృత్ కృత్వా ద్వాదశాంగేషు నామభిః’’(శ్రీమద్భాగవతం)అందుకే గోమూత్ర గోమయాలను పవిత్రంగా భావిస్తారు.బజారులో లభించే ఆయుర్వేద ఔషధం: పంచగవ్య ఘృతం మరియు మహాపంచగవ్య ఘృతం. మోతాదు: ఒక చెంచా (5 మి.లీ. లేక గ్రాములు) పావు కప్పు ఆవు పాలలో కలిపి ఉదయం ఖాళీ కడుపున సేవించాలి. సాయంత్రం కూడా మరోసారి తాగాలి. ఎంతకాలం వాడినా మంచిదే. ప్రయోజనాలు: మేధా వర్ధకం, అన్నిరకాల మానసిక రోగాలలోనూ (ఉద్వేగ, ఉన్మాద, బుద్ధిమాంద్య, నిద్రా నాశరోగాలు) గుణకారి. ఆటిజం, పార్కిన్సోనిజం వంటి వాతరోగాలు తగ్గడానికి సహకరిస్తుంది. గుర్తుంచుకోవలసిన సారాంశం:గోఘృతంబునె సర్వదా కోరుకొనుముప్రబల మేధ్యంబు వృష్యంబు బలకరంబుముదిమి రానీదు యువ శక్తి పొంగిపొరలు కంటికి బలమ్ము దీర్ఘాయుకర ము, ఘనముపావు పెరుగు నెయ్యి పరమోత్తమంబవిఆవు మూలమైన అమృతమయముక్రొత్త కాదు మనకు గోమయ మూత్రముల్పంచగవ్యములవి యెంచి చూడ ఆవు పాలు: (భావప్రకాశ సంహితా)గవ్యం దుగ్ధం విశేషేణ మధురం రసపాకయోఃశీతలం స్తన్యకృత్ స్నిగ్ధం వాత పిత్త నాశనమ్... జరా సమస్త రోగాణా శాంతికృత్ సేవినాం సదా’’ఆవు పాలు తియ్యగా ఉంటాయి. చలవ చేస్తాయి. జిగురుగా ఉంటాయి. స్తన్యవర్థకం. వాతపిత్తహరమై రక్తదోషాలను తొలగిస్తాయి. ఆవు పాలను ప్రతి రోజూ తీసుకోవచ్చు. దీనివల్ల సమస్త రోగాలను నివారించే ‘క్షమత్వం’ వృద్ధి చెందుతుంది. ముసలితనం దూరం అవుతుంది. ఓజస్సును పెంపొందించి, నేత్రాలకు, చర్మానికి కాంతిని కలిగిస్తుంది. తల్లి పాలు కొరవడినప్పుడు శిశువులకు ఆవు పాలు శ్రేష్ఠం, బలవర్ధకం. అందుకే చరకాచార్యులు ‘ప్రవరం జీవనీయానాం క్షీరముత్తమం రసాయనం’ అని చెప్పాడు. సప్తధాతు పుష్టికరమై ఆయువును పెంచుతాయి ఆవు పాలు. ఆవు నెయ్యి (గోఘృతం): మధురం, ప్రధానంగా పిత్త దోషహరం, వాతకఫ శ్యామకం, చలువ చేస్తుంది. మేధా (తెలివితేటలు) వర్ధకం, ఓజోకరం, శుక్రకరం, రసాయనం (సప్తధాతు పుష్టికరమై క్షమత్వ వర్ధకం). లావణ్య, కాంతి, తేజో... వర్ధకం, వయస్థాపకం (ముసలితనం రానీయకుండా యౌవనాన్ని పదిల పరుస్తుంది), ఆయుః వర్ధకం, మంగళకరం. కంటికి మంచిది. (గవ్యం ఘృతం విశేషేణ చక్షుష్యం, వృష్యం, అగ్నికృత్... మేధా లావణ్య కాంతి తేజో ఓజో వృద్ధికరం, వయస్థాపకం, బల్యం, సుమంగలం, ఆయుష్యం, సర్వ ఆజ్యేషు గుణాధికం) ఆవు నేతిని హోమం చేస్తే వచ్చే పొగ విషాన్ని హరిస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని కూడా హరిస్తుంది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
పెరుగు తింటే..
శరీరంలో ఏదైనా సమస్య వస్తే రోగనిరోధక వ్యవస్థ మంట/వాపుతో స్పందిస్తుంది. కానీ ఈ స్పందన ఎక్కువ కాలముంటే వ్యాధులొస్తాయి. కీళ్లవాతం, ఇన్ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్, గుండెజబ్బులు, మధుమేహం వంటి అనేక వ్యాధులకు ఈ దీర్ఘకాలిక మంట/వాపులే కారణం. మరి తరుణోపాయం ఏమిటి? చాలా సింపుల్. యోగర్ట్ లేదా పెరుగు తో సమస్యను చాలావరకూ అధిగమించవచ్చునంటున్నారు శాస్త్రవేత్తలు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆస్ప్రిన్ వంటి కొన్ని మందులతో మంట/వాపు తగ్గుతుంది కానీ.. వాటితో దుష్ప్రభావాలు ఎక్కువని, ఈ నేపథ్యంలో ఉపశమనం కలిగించేందుకు ఉన్న ఇతర అవకాశాల గురించి తాము పరిశోధనలు చేశామని, పెరుగుతో మేలైన ఫలితాలు రాబట్టామని బ్రాడ్ బొల్లింగ్ అనే శాస్త్రవేత్త చెప్పారు. 2017లో జరిపిన దాదాపు 52 క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చామని, దాదాపు తొమ్మిది వారాల పాటు రోజూ ఆహారంలో పెరుగును చేర్చి తాము ఈ ప్రయోగం చేశామని, మధ్యకాలంలో అప్పుడప్పుడూ పరిశోధనలో పాల్గొన్న వారి రక్త నమూనాలు సేకరించి పరీక్షించినప్పుడు మంట/వాపులు గణనీయంగా తగ్గిన సూచనలు కనిపించాయని వివరించారు. పెరుగుతో పాటు కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నా ఫలితాల్లో పెద్దగా మార్పు లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఆహారం తీసుకున్న తరువాత రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను తగ్గించే విషయంలోనూ పెరుగు ఉపకరిస్తున్నట్లు తాము గుర్తించామని బొల్లింగ్ తెలిపారు. -
పెరుగు రాస్తే కరవవు!
ఇంటిప్స్ రాగిపాత్రలను శుభ్రం చేయడానికి చింతపండు లేదా నిమ్మచెక్క వాడుతుంటాం. కాని చింతపండుతోపాటు ఉప్పు కూడా కలిపి రుద్దితే గార త్వరగా వదులుతుంది. చేతిలో నిలవకుండా జారిపోతున్న బాత్‌సోప్ ముక్కలను వాషింగ్ మెషీన్లో కాని దుస్తులను నానబెట్టే నీటిలో కాని వేస్తే దుస్తులకు సువాసన అంటుతుంది. కొత్త చెప్పులు, షూస్ కరుస్తుంటే ఆ ప్రదేశంలో పెరుగురాసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తుడిచి వేసుకోవాలి. బాటిల్ మూత గట్టిగా ఉండి తీయడానికి రాకుంటే కొద్ది సెకన్లపాటు కొవ్వొత్తితో వేడి చూపించాలి లేదా మంటకు కొద్దిదూరంలో వేడి మూతకు తగిలేటట్లు ఉంచి తీయాలి. మూత మీద వేడి నీటిని పోసి ప్రయత్నించినా ఫలితం ఉంటుంది. -
నల్లని జుట్టుకోసం...
బ్యూటిప్స్ బీరకాయను చెక్కు తీసి ముక్కలుగా కోయాలి. వాటిని బాగా ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి మరిగించి తలకు పట్టించాలి. అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత కుంకుడు రసంతో తలంటుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తూ ఉంటే... నెరిసిన జుత్తు మెల్లమెల్లగా నల్లబడుతుంది. ఓ కప్పు హెన్నా పొడిలో రెండు చెంచాల కాఫీ పొడి, చెంచాడు నిమ్మరసం, చెంచాడు పుదీనా పొడి, అర చెంచాడు వెనిగర్, పెరుగు వేసి చిక్కగా కలపాలి. దీన్ని తలకు పట్టించి, గంట తర్వాత శుభ్రంగా తలంటుకోవాలి. జుత్తు నెరిసి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. గుప్పెడు నువ్వుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయమే లేచి మెత్తగా రుబ్బాలి. దీనిలో కాసింత పెరుగు కానీ ఎగ్ వైట్ కానీ కలిపి మాడుకు, జుత్తుకు పట్టించి... అరగంట తర్వాత తలంటుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే తెల్ల జుత్తు నల్లబడటంతో పాటు కుదుళ్లు బలపడి జుత్తు పొడవుగా పెరుగుతుంది. -
తాజాగా.. మృదువుగా..!
ఇంటిప్స్ కాకరకాయలను మధ్యలో చీరి ఉప్పు, శనగపిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత వండితే చేదు తగ్గుతుంది, రుచి ఇనుమడిస్తుంది. మిరప్పొడి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే దానిని నిలవ ఉంచిన పాత్రలో చిన్న ఇంగువ ముక్క లేదా కొద్దిగా ఇంగువ పొడి వేయాలి. అల్యూమినియం పాత్రలో వండితే పుట్టగొడుగులు నల్లబడతాయి. స్టీలు లేదా నాన్‌స్టిక్ పాత్రలు వాడితే మంచిది. ఆపిల్స్, అరటిపండ్లు కలిపి ఒకే సంచిలో ఉంచితే అరటిపండ్లు త్వరగా పండుతాయి. అరటిపండ్లు మూడు నాలుగు రోజులు నిల్వ ఉండాలంటే రెండింటినీ కలిపి నిలవ చేయకూడదు. మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చిన వెంటనే వేరుచేయాలి. మాంసం ఉడికించేటప్పుడు చిన్నముక్క కొబ్బరి వేస్తే త్వరగా ఉడుకుతుంది, మృదువుగా కూడ ఉంటుంది. కేక్ ఎగ్ వాసన రాకుండా ఉండాలంటే కోడిగుడ్డును గిలక్కొట్టేటప్పుడు కొద్దిగా తేనె కలపాలి. ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా మెత్తబడతాయి. -
మహారుచి
కృష్ణ, గోదావరి, నర్మద, తపతి.. ‘మహా’నదులు. ముంబై, పుణె, నాగపూర్ .. ‘మహా’నగరులు. చాళుక్య, శాతవాహన, మరాఠీ.. ‘మహా’వంశాలు. పావ్‌బాజీ, మసాలాబాత్, రసీలా బూందీ.. ‘మహా’మీల్స్ నదుల్లో మునిగితే పుణ్యం. నగరాల్లో తిరిగితే జ్ఞానం. వంశాలు తిరగేస్తే చరిత్ర సారం. మీల్స్ ఆరగిస్తే మహారుచి! మహాద్భాగ్యం!! ఈవారం మీకోసం మహారాష ్టస్ప్రెషల్స్!! మసాలా టాక్ కావల్సినవి: పెరుగు - కప్పుడు; నీళ్లు - 2 కప్పులు; మసాలా (లవంగ,, దాల్చిన చెక్క, ఇలాచీ వేయించిన పొడి) - చిటికెడు, ఉప్పు - చిటికెడు; కొత్తిమీర తరుగు - అర టీ స్పూన్; వెల్లుల్లి - 1 తయారీ: పెరుగును బాగా చిలికి, కొత్తిమీర, వెల్లుల్లి, నీళ్లు కలిపి బ్లెండ్ చేయాలి. ఉప్పు, మసాలా కలిపి సర్వ్ చేయాలి. కడాయిలో అర టీ స్పూన్ నూనె వేసి, పోపు గింజలు వేసి కూడా మజ్జిగలో కలుపుకోవచ్చు. పావ్ భాజీ పావ్‌కి కావల్సినవి: లడి పావ్స్ - 4; నెయ్యి - 2 టేబుల్ స్పూన్; పావ్ భాజీ మసాలా - తగినంత (మసాలా తయారీ పక్కన ఇచ్చాం) భాజికి కావల్సినవి: బంగాళదుంప - 1 (ఉడికించి గుజ్జు చేయాలి); క్యాలీఫ్లవర్ తరుగు - అర కప్పు; పచ్చిబఠాణీ - పావు కప్పు; క్యారట్ తరుగు - పావు కప్పు; క్యాబేజీ తరుగు - అరకప్పు; క్యాప్సికమ్ తరు గు - పావు కప్పు; టొమాటో తరుగు - 1 1/2 కప్పు; కారం - అర టీ స్పూన్; పావ్ భాజీ మసాలా - టీ స్పూన్; నల్లుప్పు - అర టీ స్పూన్; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి - 2; వెల్లుల్లి రెబ్బలు - 4, బటర్- చిన్నముక్క సర్వ్ చే సేటప్పుడు... ఉల్లిపాయ - 1; నిమ్మముక్కలు - 2; కొత్తిమీర తరుగు - టీ స్పూన్ తయారీ: క్యాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారట్, బఠాణీలను ఉడికించి, నీళ్లను వడకట్టి ముక్కలను పేస్ట్ చేసుకోవాలి కడాయిలో నెయ్యి వేసి, వేడయ్యాక ఉల్లిపాయ తరుగు, క్యాప్సికమ్ వేసి వేయించి కారం, అల్లం పేస్ట్ వేసి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి దీంట్లో టొమాటో తరుగు వేసి ఉడికించాలి పసుపు, కారం, పావ్ భాజీ మసాలా, నల్లుప్పు, ఉప్పు, కూరగాయల మిశ్రమం, బంగాళదుంప గుజ్జు, అరకప్పు నీళ్లు వేసి మిశ్రమం మెత్తబడే వరకు ఉడికించాలి పావ్లకు కొద్దిగా నెయ్యి రాసి, రెండు వైపులా పెనం మీద వేయించి, మసాలా చల్లి ప్లేట్లోకి తీసుకొవా లి. వాటి పక్కనే ఉల్లిపాయ తరుగు ఉంచాలి. భాజీ ఉడికాక ప్లేట్లోకి తీసుకొని, పైన బటర్ వేసి, కొత్తిమీర చల్లి, నిమ్మముక్కలతో సర్వ్ చేయాలి. మసాలా బాత్ కావల్సినవి: బియ్యం - కప్పు (15 నిమిషాలు నీళ్లలో నానబెట్టాలి); నూనె - టేబుల్ స్పూన్; జీలకర్ర - అర టీ స్పూన్; ఉల్లిపాయ తరుగు - అర కప్పు; ఇంగువ - చిటికెడు; అల్లం తరుగు - అర టీ స్పూన్; పచ్చిమిర్చి - 2 (తరగాలి); పచ్చి బఠాణీ, మొక్కజొన్నగింజలు - పావు కప్పు; ఉప్పు - తగినంత; పసుపు - అర టీ స్పూన్; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్మసాలా పొడికి... జీలకర్ర - అర టీ స్పూన్; ధనియాలు - అర టీ స్పూన్; లవంగాలు - 3; నల్లమిరియాలు - 6 (మసాలా పొడికి కావల్సిన దినుసులన్నీ పెనం మీద వేయించుకొని, పొడి చేసి పక్కన ఉంచాలి) తయారీ: గిన్నె లేదా ప్రెజర్ కుకర్‌లో నూనె వేసి, వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, ఇంగువ వేసి 2 నిమిషాలు వేయించాలి. అల్లం తరుగు, పచ్చిమిర్చి, వడకట్టిన బియ్యం, పచ్చి బఠానీ, మొక్కజొన్న గింజలు, క్యారెట్, బీన్స్ వేసి మరో 2 నిమిషాలు ఉంచి, కలపాలి. దీంట్లో రెండున్నర కప్పుల నీళ్లు, ఉప్పు, పసుపు, మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టాలి.అన్నం పూర్తిగా ఉడికాక చివరలో కొత్తిమీర వేసి దించాలి. మసాలా బాత్‌ని రైతా లేదా శనగల కూరతో వడ్డించాలి. నోట్: మసాలా బాత్‌లో దొండకాయలు, వంకాయ ముక్కలు, చిక్కుడు గింజలు కూడా వేసుకోవచ్చు. రసీలా బూందీ కావల్సినవి శనగపిండి - కప్పు; పంచదార - 2 కప్పులు; నూనె - వేయించడానికి తగినంత; రోజ్‌వాటర్ - పావు టీ స్పూన్ తయారీ: బూందీ తయారీకి శనగపిండిలో తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి కడాయిలో నూనె పోసి వేడి చేయాలి కడాయిపైన బూందీ జల్లి పెట్టి, దానిపైన శనగపిండి మిశ్రమం పోసి మృదువుగా రుద్దుతూ ఉండాలి. జల్లి నుంచి పిండి జారి, నూనెలో పడుతుంది. బూందీని వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి పంచదారలో 2 కప్పుల నీళ్లు పోసి, పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. గులాబ్‌జామూన్ కోసం ఎలా పంచదార పాకం చేసుకుంటామో అలాగే దీనిని తయారు చేసుకోవాలి. ఈ పంచదార పాకంలో రోజ్ వాటర్ కలపాలి. పంచదార పాకంలో వేయించిన బూందీ వేసి కలిపి, భోజనానంతరం వడ్డించాలి. పిత్లా కావల్సినవి: శనగపిండి - కప్పు; నూనె - 3 టీ స్పూన్లు; నీళ్లు - 4 కప్పులు;; పచ్చిమిర్చి - 6 ; వెల్లుల్లి - 4 ; ఉల్లిపాయ - 1 (తరగాలి); ఆవాలు - టీ స్పూన్; జీలకర్ర - టీ స్పూన్; ఉప్పు - రుచికి తగినంత; కొత్తిమీర - టీ స్పూన్ తయారీ: చిన్న గిన్నెలో శనగపిండి వేసి, అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి స్టౌ మీద గిన్నె పెట్టి వేడయ్యాక నూనె వేసి, అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి పసుపు, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి దీంట్లో జారుగా కలిపిన శనగపిండి వేసి,4 కప్పుల నీళ్లు పోసి కలుపుతూ మిశ్రమం బాగా చిక్కబడేంతవరకు ఉడకనివ్వాలి చివరగా ఉప్పు కలిపి, కొత్తిమీర వేసి దించాలి. దీనిని చపాతీ, రైస్‌లోకి వడ్డించాలి. పావ్ భాజీ మసాలా... ఎండుమిర్చి - 6, ధనియాలు - 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు, నల్లమిరియాలు - అర టీ స్పూన్, దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క, లవంగాలు - 3, ఇలాచీలు - 4, సోంపు - టీ స్పూన్ తయారీ: కడాయిలో ఈ దినుసులన్నీ వేసి సన్నని మంటమీద వేయించుకోవాలి. చల్లారాక అన్నీ కలిపి పొడి చేసుకోవాలి. మహారాష్ర్ట వంటకాలు కొంత ఘాటుగా ఉంటాయి. గోధుమ, బియ్యం, జొన్నలు, సజ్జలు, పప్పులు, కూరగాయలు వీళ్ల వంటకాలలో ప్రధానంగా చూస్తాం. అలాగే పల్లీలు, జీడిపప్పులు కూడా వీరి వంటకాలలో విరివిగా ఉపయోగిస్తారు. సంప్రదాయ వంటకాలతో పాటు వీరి రుచులలో దేశంలోని ఇతర ప్రాంతాల ఘుమఘుమలు త్వరగా చేరిపోతాయి. వీరి వంటలలో మాంసాహారం చాలా చాలా తక్కువ. మహారాష్ట్రీయుల పైన ప్రముఖ నగరాలైన ముంబయ్, పునే పట్టణవాసుల ఆహారపు అలవాట్ల ప్రభావం ఎక్కువ. ఉడిపి రుచులు ముఖ్యంగా ఇడ్లీ, దోసెలే కాకుండా చైనీస్ వంటకాలూ వీరి ఆహారంలో భాగమయ్యాయి. అయితే మోదక్, పత్ల, పావ్ భాజీ.. వంటివి మాత్రం తమ ప్రాభవాన్ని కోల్పోలేదు. కొల్హాపురి మటన్ కావల్సినవి: మటన్ - అర కేజీ మటన్‌ని నానబెట్టడానికి... అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీ ; స్పూన్లు; నూనె - టీ స్పూన్; పసుపు - పావు టీ స్పూన్; ఉప్పు - టీ స్పూన్ కొల్హాపురి మసాలా.. (పెద్ద ఉల్లిపాయలు -2, ఎండు కొబ్బరి తురుము - అర కప్పు, నూనె - టేబుల్ స్పూన్, ధనియాలు - టీ స్పూన్, నువ్వులు - ఒకటిన్నర టీ స్పూన్, గసగసాలు - 3 టీ స్పూన్లు, ఎండుమిర్చి - 8, లవంగాలు - 2); ఉల్లిపాయలు - 2 (తరగాలి); నూనె - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; కొత్తిమీర తరుగు - టీ స్పూన్; నీళ్లు - తగినన్ని తయారీ:మటన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, నూనె బాగా కలిపి గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. కడాయిలో నూనె వేసి మసాలాకు ఇచ్చిన దినుసులన్నీ వేసి వేయించుకోవాలి. చివరగా కొబ్బరి వేసి మరో 2 నిమిషాలు వేయించి, మంట తీసేయాలి. చల్లారాక వీటన్నింటినీ కలిపి పేస్ట్ చేయాలి. కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.మరొక గిన్నె స్టౌ మీద పెట్టి, నూనె వేసి ఉల్లిపాయలు వేయించాలి. దీంట్లో బాగా నానిన మటన్ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి కలపాలి. ముప్పావు భాగం మటన్ ఉడికాక దాంట్లో మసాలా మిశ్రమం వేసి, నూనె తేలేంతవరకు ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లో 2 కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. పూర్తిగా ముక్క ఉడికేదాకా మంట తగ్గించి ఉంచాలి. చివరగా కొత్తిమీర వేసి, వేడి వేడిగా భోజనంలోకి వడ్డించాలి. కరె్టిసీ సంజయ్ కుమార్ షెఫ్ విలేజ్ సోల్ ఆఫ్ ఇండియా బేగంపేట్, హైదరాబాద్ -
నల్లమచ్చలకు ఉల్లిరసం..
బ్యూటిప్స్ ఉల్లిరసంలో కొద్దిగా దూది ఉండ ముంచి ముఖం మీది నల్లమచ్చలపై రుద్దాలి.ఇలా రోజూ నిద్రపోయే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రెండు టేబుల్స్పూన్ల నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ వేప పొడి వేసి బాగా కలపాలి. ఆ పేస్ట్‌ను వారానికి రెండుసార్లు ఫేస్‌కు ప్యాక్ వేసుకుంటే మొటిమలు తగ్గుతాయిఅందానికి సూచికగా భావించే కనురెప్పలు రాలిపోకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి. కనురెప్పలకు బాదం నూనెతో రోజూ మసాజ్ చేసుకుంటే సరి. చిటికెడు కుంకుమ పువ్వును పెరుగులో 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత దాన్ని పెదాలపై రోజుకు రెండు, మూడుసార్లు రాసుకుంటే మంచి రంగు వస్తుంది. -
సమ్మర్@ 5
బ్యూటిప్స్ ప్యాక్ కప్పు పెరుగులో టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ నిమ్మరసం క లపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే ట్యాన్ (ఎండ వల్ల ఏర్పడిన నలుపు) తగ్గడమే కాకుండా చర్మకాంతి పెరుగుతుంది. బాత్ అరకప్పు గులాబీ రేకులను పేస్ట్ చేసి అందులో టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలపాలి. ఈ పేస్ట్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి, స్నానం చేయాలి. గులాబీల సుగంధం ఎండ వల్ల కలిగే ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందేలా చేస్తుంది. కొబ్బరిపాలు చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌ని అందిస్తాయి. హెయిర్ గోరువెచ్చని గ్రీన్ టీని మాడుకు, శిరోజాలకు పట్టించి ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో తలంతా శుభ్రపరుచుకోవాలి. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, కండిషనర్ ఎండ వల్ల కలిగే హానిని నివారించి, జుట్టు ఊడటాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీలోని పోషకాలు శిరోజాలను పెంచడానికి దోహదం చేస్తాయి. మసాజ్ చెరకురసంలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసి, వేళ్లతో మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో ఒకసారి, వెచ్చని నీటితో ఒకసారి ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ విధంగా రోజూ చేస్తే ఎండ కారణంగా పొడిబారిన చర్మం తేమని పుంజుకుని ఆరోగ్యంగా తయారవుతుంది. యాక్నె వెనిగర్‌లో ఉప్పు కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని యాక్నె(చిన్న చిన్న మొటిమల గడ్డలు) మీద రాసి, మృదువుగా రబ్ చేయాలి. ఇరవై నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తే జిడ్డు తొలగడంతోపాటు మొటిమలు, యాక్నె, మచ్చలు తగ్గుతాయి. -
పెరుగు తినండీ... రక్తపోటును తగ్గించుకోండి
ప్రోబయాటిక్ ఫుడ్ - లోవర్స్ ద హై బీపీ మనం తోడేసిన పాలు పెరుగుగా మారడానికి కారణం... మనకు మేలు చేసే బ్యాక్టీరియానే అన్న సంగతి తెలిసిందే. ఇదొక్కటే కాదు... కాస్తంత అట్ల పిండిని కాస్త పులిసేలా చేసి అట్లు వేసుకుని తింటుండే సంగతీ తెలిసిందే. ఇలా పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పుష్కలంగా ఉన్న పదార్థాలను ‘ప్రోబయాటిక్’ ఉత్పాదనలుగా మార్కెట్లో అమ్ముతున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు 543 మందిపై చేసిన అధ్యయనంలో తెలుసుకున్న కొత్తసంగతి ఏమిటంటే... ప్రోబయాటిక్స్ ఉన్న ఆహారాలు అధిక రక్తపోటును తగ్గిస్తాయి. ఈ సంగతి ఆస్ట్రేలియా నుంచి వెలువడే హెల్త్ జర్నల్ ‘హైపర్‌టెన్షన్’లోనూ ప్రచురితమైంది. ఒకవేళ మీకు హైబీపీ లేకపోయినా పరవాలేదు. పెరుగూ, అట్ల వంటి టిఫిన్లు తింటూ ఉండండి. ఇందులోని ప్రోబయాటిక్ బ్యాక్టీరియా రక్తపోటును చాలావరకు నివారిస్తుంది. దాంతో గుండెజబ్బులూ, పక్షవాతం ప్రమాదాలూ నివారితమవుతాయని తెలుసుకోండి. -
శాకారుణ్యాహారం...
అక్టోబర్-1శాకాహార దినోత్సవం ఇటీవల ఆరోగ్యరీత్యా కొందరు... జీవకారుణ్య దృష్టితో చాలా మంది ఇప్పుడు శాకాహారాన్ని స్వీకరించడమే కాదు... దాని ప్రాధాన్యాన్ని ప్రచారం చేస్తున్నారు. శాకాహారంలోనూ ఎన్నో తేడాలు చాలామంది కూరగాయలు, ఆకుకూరలు తినడంతో పాటు జంతువుల నుంచి వచ్చే ఉత్సాదనలైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి వాటిని తీసుకుంటారు. మొదటి నుంచి అమల్లో ఉన్న సాంస్కృతిక ఆహారపు అలవాట్ల కారణంగా వారు తమను తాము శాకాహారులుగానే పరిగణిస్తారు. శాకాహారం తీసుకుంటూ, జంతు ఉత్పాదనలైన పాలు, పెరుగు వాడేవారిని ‘లాక్టో వెజిటేరియన్స్’గా పరిగణిస్తారు. ఇక మరికొందరు ఇటీవల లభ్యమయ్యే గుడ్లలో పొదిగిస్తే ఎదిగే పిండం ఉండదు కాబట్టి వాటిని శాకాహారంగా పరిగణిస్తారు. వీరిని ‘లాక్టో-ఓవో వెజిటేరియన్స్’గా పిలుస్తారు. అయితే మొదటి నుంచీ ఉన్న సాంస్కృతిక అలవాటు కారణంగా కొందరు పిండం లేని గుడ్డును కూడా మాంసాహారంగానే పరిగణిస్తారు. ఇక మరికొందరు చేపలను పూర్తిగా శాకాహారంగా పరిగణిస్తారుగానీ... మిగతా జీవరాశులను మాంసాహారంగా చూస్తారు. ఇక మరికొందరైతే పాలు, పెరుగు, గుడ్లు... ఇలా జంతుసంబంధమైన ఏ ఉత్పాదననైనా మాంసాహారంగానే పరిగణిస్తారు. వీరు జంతు ఉత్పాదనలు ఏవైనా సరే వాటిని ఆహారంగా తీసుకోరు. ఇలాంటి వారిని ‘వేగన్స్’ అని అంటారు. వీరు తీసుకునే శుద్ధశాకాహారాన్ని వైగన్ డైట్ అంటారు. ఈ వేగన్ డైట్ తీసుకునే వారు ఎంత కఠినంగా ఉంటారంటే... తేనెను తేనెటీగలు తయారు చేస్తాయి కాబట్టి మకరందం వాటి ఆహారం కాబట్టి తేనెను కూడా జంతుసంబంధమైన ఉత్పత్తిగానే పరిగణించి శాకాహారంలో దానికి స్థానమివ్వరు. ఫ్లెక్సిటేరియన్ డైట్ : పై కారణాల వల్ల ఫలానాదే నిర్దిష్టంగా శాకాహారంగా చెప్పడం కష్టం. దాంతో చాలామంది జీవకారుణ్యంతో జంతువుల ప్రాణాలకు గాని లేదా వాటి ఉనికికి గాని ఎలాంటి హానీ లేకుండా వచ్చే జంతు ఉత్పాదనలను ఆహారంగా స్వీకరిస్తూ, వాటిని చంపి మాంసం తీసుకోవడాన్నే వ్యతిరేకిస్తారు. అందుకే వీళ్లు తీసుకునే ఆహారాన్ని ‘ఫ్లెక్సిటేరియన్ డైట్’గా పేర్కొంటారు. వాదనలు ఎలా ఉన్నాప్పటికీ ఆహారం పట్ల అభిరుచి అన్నది వ్యక్తిగత అంశంగా కొందరు ఇలాంటి వివాదాల జోలికి వెళ్లరు. తేనెను కూడా వ్యతిరేకించేంత వేగనిజమ్ను కలిగి ఉండటమూ తప్పేననీ, అలాగే జీవహింసనూ చేయడమూ సరికాదనేది ఫ్లెక్సిటేరియన్స్ దృక్పథం. మాంసాహారంతో అనర్థాలెన్నో... శాకాహారాన్ని నిర్వచించే తీరుతెన్నులు ఎన్ని ఉన్నా... మనం సాధారణంగా శాకాహారంగా పరిగణించే ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే. మాంసాహారంతో మన శరీరంలోకి కొన్ని అవాంఛిత సూక్ష్మజీవులు చేరే అవకాశాలున్నాయి. ఉదాహరణకు సరిగా ఉడకని పోర్క్ తినేవారిలో ‘టేప్ వార్మ్స్’ పెరుగుతాయి. సీఫుడ్స్‌తో అలర్జీలు ఎక్కువే ఉంటాయి. మాంసాహారంలోని అధిక కొవ్వుల వల్ల కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి గుండెజబ్బులు, పక్షవాతం, హైబీపీ వంటి వాటికి దారితీస్తున్నాయి. మాంసాహారం జీర్ణమయ్యేందుకు పట్టే సమయం ఎక్కువ. మాంసాహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పాదన పెరగడం వల్ల అల్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. శాకాహారంతో చేకూరే ప్రయోజనాలెన్నో ... శాకాహారం తీసుకునే వారికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోనాలు చేకూరుతాయి. వాటిలో కొన్ని... శాకాహారం మన శరీరంలో పేరుకునే చాలా విషపదార్థాలను స్వాభావికంగా బయటకు పంపుతుంది. అందుకే వీటిని ‘డీ-టాక్స్’ డైట్ అని కూడా చెబుతుంటారు. శాకాహారంలో పీచుపదార్థాలు (డయటరీ ఫైబర్) ఎక్కువ. దాంతో అది తేలిగ్గా జీర్ణమవుతుంది. కొలోన్ క్యాన్సరు నివారితమవుతాయి. శాకాహారంలోని పీచు వల్ల మొలలు, స్థూలకాయం, డయాబెటిస్, మలబద్దకం, హయటస్ హెర్నియా, డైవర్టిక్యులైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పిత్తాశయంలో రాళ్లు వంటి అనేక వ్యాధుల నివారణ సాధ్యం. దీంతో లభ్యమయ్యే ఫోలేట్స్, ఫైటోన్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మానికి ఎప్పటికప్పుడు మంచి పోషణ, విటమిన్స్ లభిస్తాయి కాబట్టి వాళ్లలో మేని మెరుపు చాలా బాగుంటుంది. శాకాహారంతో తేలిగ్గా బరువును నియంత్రించుకోవచ్చు. ఫలితంగా బీపీ నియంత్రణలో ఉండటం, గుండెజబ్బులకు ఆస్కారం లేకపోవడం వంటివి ప్రయోజనాలు చేకూరతాయి. ఆకుకూరలు, పండ్లలో కాపర్, మెగ్నీషియమ్ వంటి ఖనిజాలు, లవణాలు ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. అంతా మేలేనా... మరి పరిమితులు లేవా? శాకాహారం వల్ల అంతా మేలేననీ, పరిమితులేవీ లేవని చెప్పడం కూడా వైద్యశాస్త్రపరంగా సరికాదు. అయితే వాటిని కొన్ని శాకాహార ప్రత్యామ్నాయాలతో అధిగమించవచ్చు. ఉదా: ప్రోటీన్లు : శాకాహారం కంటే మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కువ. అయితే మాంసాహారం నుంచి దూరంగా ఉండి కేవలం శాకాహారంతోనే ప్రోటీన్లు పొందడం కూడా సాధ్యమే. అందుకోసం చిక్కుళ్లు, సోయా ఉత్పాదనలు బాగా ఉపకరిస్తాయి. శాకాహారం ద్వారానే ప్రొటీన్ కోరుకునేవారు తమ ఆహారంలో ఈ కింది పదార్ధాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అవి: గుమ్మడి గింజలు బ్లాక్ బీన్స్ సోయామిల్క్ పీనట్ బటర్ బాదం రాజ్మా క్యాల్షియమ్ : యుక్తవయసులో ఉన్నవారు మొదలుకొని యాభైలలో పడ్డ వారి వరకూ... ప్రతి ఒక్కరికీ ఎముకల ఆరోగ్యం, పటిష్టత, నిర్వహణ కోసం క్యాల్షియమ్ పుష్కలంగా అందాలి. సాధారణంగా పాల ఉత్పాదనల్లో క్యాల్షియమ్ ఎక్కువ. కానీ వెజిటేరియనిజమ్ కారణాలతో క్యాల్షియమ్‌ను శాకాహారం నుంచి పొందాలనుకుంటే ఆకుకూరలైన పాలకూర వంటివీ, బ్రకోలీ, పొద్దుతిరుగుడు గింజలు, సోయా మిల్స్ ఉత్పాదనలను రోజూ తీసుకోవాలి. విటమిన్ డి : మన శరీరంలోకి క్యాల్షియమ్ చక్కగా ఇంకిపోవాలంటే విటమిన్-డి అవసరం. ఇది పాల ఉత్పాదన్లో, సూర్యకాంతిలో లభ్యమవుతుంది. సాధారణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ (ఐయూ)ల విటమిన్-డి అవసరం. ఒకవేళ జంతువుల నుంచి కాకుండా కేవలం శాకాహారం నుంచి మాత్రమే లభ్యం కావాలనుకుంటే సోయా మిల్క్ ఉత్పాదనలు వాటిని భర్తీ చేస్తాయి. ఐరన్ : మనలో రక్తహీనత రాకుండా ఉండటానికి ఐరన్ చాలా అవసరం. ఇది మాంసాహారంలో తక్షణం లభిస్తుంది. అయితే శాకాహారం ద్వారానే ఇది లభ్యం కావాలంటే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు (పాలకూర, బ్రకోలీ), డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సోయాబిన్ నట్స్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్-సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు టమాటాలు తినడం వల్ల కూడా ఐరన్ తేలిగ్గా శరీరంలోకి ఇంకుతుంది. విటమిన్ బి12 : ఇది మాంసాహారంలోనే పుష్కలంగా లభిస్తుంది. ఆ తర్వాత పాలలో అధికంగా ఉంటుంది. ఇక శాకాహారం నుంచే దీన్ని తీసుకోవాలంటే సోయామీల్ వంటి వాటిపై ఆధారపడాలి. దీని లోపం వల్ల మెదడు నరాల నుంచి అవయవాలకు ఆదేశాలు అందడంలో ఆటంకాలు, స్పృహతప్పడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఎండలో తగినంతగా తిరగకుండా ఇన్‌డోర్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వారిలో విటమిన్-డి, విటమిన్-బి12 లోపంతో వచ్చే నరాల సమస్యలు ఇటీవల చాలా పెరిగాయి. అందుకే కేవలం వెజిటేరియన్ ఆహారంపైనే ఆధారపడే వారు, విటమిన్-డి, విటమిన్-బి12, ఐరన్ వంటి కీలకమైన పోషకాల కోసం ప్రత్యామ్నాయాలపై మరింత ఎక్కువ దృష్టిపెట్టాలి. ఇలా ప్రత్యామ్నాయ ఆహారం ద్వారా జంతువుల నుంచి లభ్యమయ్యే వాటిని శాకాహారంతోనే పొంది జీవహింసను నివారించడంలోని తృప్తినీ, ఆరోగ్యాన్నీ ఏకకాలంలో పొందవచ్చు. -
చర్మకాంతికి పాలు పెరుగు...
రోజూ తినే కాయగూరలు, పాలు, పెరుగు... వంటి పదార్థాలన్నీ ముఖకాంతిని పెంచేవే. ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్మానికి సహజకాంతిని అందించే ప్యాక్‌లివి... టొమాటో చర్మకాంతిని పెంచుతుంది. ఎండకు కమిలిన చర్మానికి సహజకాంతిని తీసుకువస్తుంది. టొమాటో-దోస కలిపిన గుజ్జును వాడితే, వాటిలో ఉండే మెలనిన్ పిగ్మేంటేషన్ స్థాయిని తగ్గిస్తుంది. రెండు టేబుల్స్పూన్ల టొమాటో జ్యూస్, 50 గ్రా.ల ఓట్స్, 25 గ్రా.ల పెరుగులో కప్పు నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గి చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. తేనె కొబ్బరినూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మసాజ్ చేస్తే పెద వులు పొడిబారడం, పగుళ్ల సమస్య లు తగ్గి, మృదువుగా అవుతాయి. రెండు టీ స్పూన్ల క్యారెట్ తురుములో టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ జత చేర్చి ముఖానికి పట్టించాలి. మృదువుగా రబ్ చేసి, శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల నిస్తేజంగా మారిన చర్మానికి జీవకాంతి లభిస్తుంది. పాలు చర్మానికి పాలు మంచి క్లెన్సర్‌లా పనిచేస్తాయి. పాలలోని లాక్టిక్ యాసిడ్ మృతకణాలతో ఉన్న చర్మపు పై పొరను తొలగిస్తుంది. టీ స్పూన్ గోధుమపిండిలో పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించి స్క్రబ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం కోల్పోయిన చర్మానికి ఈ ప్యాక్ మంచి కాంతి లభిస్తుంది. పసుపు చర్మకాంతిని పెంచుతుంది. పసుపులో ఉండే సహజసిద్ధమైన రసాయనాలు చర్మంపై మలినాలనూ తొలగిస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల గంధం పొడి, టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకొని అందులో కొన్ని పాలు, రోజ్ వాటర్, కొద్దిగా పసుపు, నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి పట్టించి స్క్రబ్ చేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. మచ్చలు తగ్గిపోయి చర్మం కాంతిమంతం అవుతుంది. స్క్రబ్: ఓట్స్‌కు తగినన్ని నీళ్ళు చేర్చి మెత్తగా ఉడికించి చల్లారిన తర్వాత అందులో పెరుగు, ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్ల తో అద్దుకుంటూ, ముఖ చర్మాన్ని మృదువుగా రుద్దాలి. తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి. మసాజ్: టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖానికి రాయాలి. వేళ్లతో కొద్దిగా మసాజ్ చేసి, ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మలినాలు తొలగి, చర్మం కాంతివంతం అవుతుంది. ఫేస్‌మాస్క్: టీ స్పూన్ శనగపిండి, రెండు టీ స్పూన్ల పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పూయాలి. పది నిమిషాల తర్వా త శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ఎండవల్ల నల్లబడిన చర్మానికి సహజమైన రంగు తీసుకువస్తుంది. నిమ్మ, శనగపిండి చర్మాన్ని కాంతిమంతంగా మారిస్తే, పెరుగు మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. బాడీ వాష్: తేనె, పెరుగు కలిపి శరీరానికి పట్టించి, పది నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు సులువుగా తొలగిపోతాయి. కండిషనర్: పెరుగు జుట్టుకు గొప్ప కండిషనర్‌గా పనిచేస్తుంది. పెరుగులో నిమ్మరసం లేదా మెంతిపిండి కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే తలకు పట్టించి, గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి.