
శరీరంలో ఏదైనా సమస్య వస్తే రోగనిరోధక వ్యవస్థ మంట/వాపుతో స్పందిస్తుంది. కానీ ఈ స్పందన ఎక్కువ కాలముంటే వ్యాధులొస్తాయి. కీళ్లవాతం, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్, గుండెజబ్బులు, మధుమేహం వంటి అనేక వ్యాధులకు ఈ దీర్ఘకాలిక మంట/వాపులే కారణం. మరి తరుణోపాయం ఏమిటి? చాలా సింపుల్. యోగర్ట్ లేదా పెరుగు తో సమస్యను చాలావరకూ అధిగమించవచ్చునంటున్నారు శాస్త్రవేత్తలు. విస్‌కాన్సిన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆస్ప్రిన్ వంటి కొన్ని మందులతో మంట/వాపు తగ్గుతుంది కానీ.. వాటితో దుష్ప్రభావాలు ఎక్కువని, ఈ నేపథ్యంలో ఉపశమనం కలిగించేందుకు ఉన్న ఇతర అవకాశాల గురించి తాము పరిశోధనలు చేశామని, పెరుగుతో మేలైన ఫలితాలు రాబట్టామని బ్రాడ్ బొల్లింగ్ అనే శాస్త్రవేత్త చెప్పారు.
2017లో జరిపిన దాదాపు 52 క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చామని, దాదాపు తొమ్మిది వారాల పాటు రోజూ ఆహారంలో పెరుగును చేర్చి తాము ఈ ప్రయోగం చేశామని, మధ్యకాలంలో అప్పుడప్పుడూ పరిశోధనలో పాల్గొన్న వారి రక్త నమూనాలు సేకరించి పరీక్షించినప్పుడు మంట/వాపులు గణనీయంగా తగ్గిన సూచనలు కనిపించాయని వివరించారు. పెరుగుతో పాటు కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నా ఫలితాల్లో పెద్దగా మార్పు లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఆహారం తీసుకున్న తరువాత రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను తగ్గించే విషయంలోనూ పెరుగు ఉపకరిస్తున్నట్లు తాము గుర్తించామని బొల్లింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment