దేహంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్ ప్రవేశించడం గానీ లేదా ఏవైనా గాయాలైనప్పుడుగానీ ఆ హానికారక సూక్ష్మజీవులతో పోరాడి, శరీరాన్ని రక్షించుకునేందుకు రోగ నిరోధక వ్యవస్థ... ఇన్‌ఫ్లమేషన్ అనే స్వాభావికమైన చర్య జరిగేలా చూస్తుంది. తెల్లరక్తకణాలపై. దేహాన్ని రక్షించేందుకు అవసరమైన కొన్ని రసాయనాలను పంపుతుంది.
గాయమైనప్పుడు ఆ ప్రదేశం ఎర్రబారడం, వాపురావడం, మంట అనిపించడం గమనించవచ్చు. అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ... ఆ గాయాన్ని మాన్పే పని మొదలుపెట్టిందనేందుకు నిదర్శనాలే ఆ గుర్తులు. ఉదాహరణకు ఒకరి వేలు తెగిందనుకుందాం. వెంటనే వ్యాధి నిరోధక వ్యవస్థ రంగంలోకి దూకుతుంది. తెగిన ప్రాంతం చుట్టూ ఎర్రబడి, వాపు వస్తుంది. తెగడంతో గాయమైన కణజాలాన్ని రిపేరు చేసేందుకు ఉపక్రమించాయన్నమాట.
అలాగే జలుబు చేసినా లేదా దేహంలోకి జలుబు కలగజేసే వైరస్‌లాంటిది ఇంకోటి ఏదో ప్రవేశించిందంటే... దాన్ని తుదముట్టించేందుకు జ్వరం వస్తుంది. అంటే దేహం ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా ఆ వేడిమి సహాయంతో శత్రు వైరస్‌ను కాల్చేటందుకే దేహపు ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే జ్వరం అనేది దేహం తాలూకు ఓ ‘ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్’ అన్నమాట.
కొద్దికాలం పాటు మాత్రమే ఉండే ఇన్‌ఫ్లమేషన్‌ను ‘అక్యూట్ ఇన్‌ఫ్లమేషన్’ అనీ, అదే దీర్ఘకాలం పాటు కొనసాగితే దాన్ని ‘క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్’ అని వ్యవహరిస్తారు. అక్యూట్ ఇన్‌ఫ్లమేషన్‌తో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చుగానీ... చాలాకాలం పాటు ఉండే ‘క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్’ మాత్రం ఒక్కోసారి చాలా ప్రమాదకరం.
ఒక ఇన్‌ఫ్లమేషన్ చాలాకాలం పాటు కొనసాగుతోందంటే... శత్రువును ఎదుర్కొనేందుకు దేహం, దాని తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా చురుగ్గా, సుదీర్ఘకాలం పాటు అలర్ట్‌గా ఉన్నాయని అర్థం.
ఓ వ్యక్తి అనారోగ్యకరమైన జీవనశైలితో జీవిస్తున్నా, అతడు చాలాకాలంగా చాలా ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నా, అతడు తీసుకుంటున్న ఆహారం అంతగా ఆరోగ్యకరంగా లేకపోయినా... ఈ అంశాలన్నీ అతడిలోకి వ్యాధి నిరోధక వ్యవస్థపై ఒత్తిడి కలగజేస్తూ, దాన్ని ఎప్పుడూ అలర్ట్‌గా ఉంచుతాయి. దాంతో ఇన్‌ఫ్లమేషన్ సుదీర్ఘకాలం పాటు (క్రానిక్‌గా) కొనసాగుతుంది. అప్పుడా పోరాటం శత్రుకణాల మీద కాకుండా సొంత కణాల మీదే జరుగుతుండటం వల్ల... ఈ పోరులో ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతింటుంటాయి.
ఉదాహరణకు ఓ వ్యక్తి తీసుకునే ఆహారంలో ్రపాసెస్‌డ్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నా లేదా చక్కెరలను ఎక్కువగా తీసుకుంటున్నా అతడిలో క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ వచ్చేందుకు అవకాశాలెక్కువ. అది సుదీర్ఘకాలం కొనసాగుతున్నందు ఆరోగ్యవంతమైన కణాలనూ నాశనం చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సుదీర్ఘ ఇన్‌ఫ్లమేషన్స్‌తో ఆరోగ్యవంతమైన కణజాల వ్యవస్థలు దెబ్బతినడంతో అక్రమంగా గుండెజబ్బులు, డయాబెటిస్‌తో పాటు కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీయవచ్చు. ఇక ఆ ఇన్‌ఫ్లమేషన్ జీర్ణవ్యవస్థలో వస్తే అది ఆరోగ్యంపై రకారకాల దుష్ప్రభావాలను కలగజేయవచ్చు.
ఓ వ్యక్తిలో అతడి జీర్ణవ్యవస్థ చాలా కీలకమైనది. ఆహారాన్ని జీర్ణం చేయడం ద్వారా అది దేహంలోని కోటానుకోట్ల (ట్రిలియన్లకొద్దీ) కణాలకు జీవశక్తిని అందజేయడం, అక్కడ వ్యర్థాలను తొలగించడం వంటి పనులు చేస్తుంది. ఈ జీర్ణవ్యవస్థే దేహానికి మేలు చేసే ట్రిలియన్లకొద్దీ సూక్ష్మజీవుల (మైక్రోబ్స్)కు ఆవాసం. వీటినే గట్ మైక్రోబియమ్ అంటారు. ఒక వ్యక్తి తాలూకు మూడ్స్ (భావోద్వేగాల)కూ ఇవే కారణం. అతడి వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడంలోనూ ఇవే కీలకం. అన్నట్టు వ్యాధి నిరోధక వ్యవస్థకు చెందిన కణజాలంలో 70 – 80 శాతం వరకు జీర్ణవ్యవస్థలోనే ఉండటమనే అంశం కూడా ఓ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థకు అతడి జీర్ణవ్యవస్థ ఎంతగా ఊతం ఇస్తుందో ఈ అంశం తెలియజేస్తుంది.
ఇంతటి కీలకమైన జీర్ణవ్యవస్థలో క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ వచ్చిందంటే అది ‘లీకీ గట్ సిండ్రోమ్’ లాంటి ఎన్నో అనర్థాలకు దారితీయవచ్చు. మానసికాందోళనలు మాటిమాటికీ తలెత్తే వాళ్లలో కొందరిలో పేగుల్లోని గోడలు చిట్లుతాయి. ఈ పరిస్థితినే ’లీకీ గట్’ అంటారు. ఇలా పేగుల్లోని గోడలు చిట్లడం జరిగితే దేహంలోని ప్రమాదకరమైన విషపదార్థాలూ, జీర్ణం కాని వ్యర్థాలూ, బ్యాక్టీరియా.. ఇవన్నీ రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ మరింత ఇన్‌ఫ్లమేషన్‌ను ప్రేరేపిస్తుంది. దాంతో సొంత వ్యాధినిరోధక వ్యవస్థే తన కణజాలంపై ప్రతికూలంగా పనిచేసే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వంటి వ్యాధులూ, చర్మరోగాలు, కీళ్లనొప్పులు వస్తాయి. ఇక మానసిక సమస్యలైన డిప్రెషన్ వంటివీ రావచ్చు.
జీర్ణవ్యవస్థలో వచ్చే ఇన్‌ఫ్లమేషన్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అయిన గట్ మైక్రోబియమ్ సమతౌల్యతను దెబ్బతీయవచ్చు. దాంతో కడుపుబ్బరం, మలబద్ధకం, నీళ్ల విరేచనాలు వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక అనారోగ్యాలు కనిపించవచ్చు. గట్ మైక్రోబియమ్ దెబ్బతినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడేందుకూ అవకాశముంది. గట్ మైక్రోబియమ్ దెబ్బతినడం వల్ల ఇన్‌ఫ్లమేషన్... మళ్లీ ఈ ఇన్‌ఫ్లమేషన్ వల్ల మైక్రోబియమ్ సమతౌల్యత మరింత దెబ్బతినడం... ఈ విషవలయం ఇలా కొనసాగుతూ జీర్ణవ్యవస్థ మరింతగా దెబ్బతింటుంది. దాంతో జీర్ణవ్యవస్థ పనితీరూ దెబ్బతింటుంది.
అందుకే జీర్ణవ్యవస్థ బాగుంటేనే వ్యాధి నిరోధక వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. సంతోషకరమైన భావోద్వేగలతో మూడ్స్ బాగుంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే దీర్ఘకాలిక (క్రానిక్) ఇన్‌ఫ్లమేషన్స్ సైతం తగ్గుతాయి. ఇతర దీర్ఘకాలిక జబ్బులు... అంటే గుండెజబ్బులు, ఊబకాయం, డయాబెటిస్ వంటివి నివారితమవుతాయి. అందుకే ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఉందంటే... దేహమంతా ఆరోగ్యంగా ఉందనీ, వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా చురుగ్గా ఉందని అర్థం.
Comments
Please login to add a commentAdd a comment