Inflammation
-
Health: క్రానిక్... పానిక్.. వేడివేడిగా బాడీ రిపేర్!
దేహంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్ ప్రవేశించడం గానీ లేదా ఏవైనా గాయాలైనప్పుడుగానీ ఆ హానికారక సూక్ష్మజీవులతో పోరాడి, శరీరాన్ని రక్షించుకునేందుకు రోగ నిరోధక వ్యవస్థ... ఇన్ఫ్లమేషన్ అనే స్వాభావికమైన చర్య జరిగేలా చూస్తుంది. తెల్లరక్తకణాలపై. దేహాన్ని రక్షించేందుకు అవసరమైన కొన్ని రసాయనాలను పంపుతుంది.గాయమైనప్పుడు ఆ ప్రదేశం ఎర్రబారడం, వాపురావడం, మంట అనిపించడం గమనించవచ్చు. అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ... ఆ గాయాన్ని మాన్పే పని మొదలుపెట్టిందనేందుకు నిదర్శనాలే ఆ గుర్తులు. ఉదాహరణకు ఒకరి వేలు తెగిందనుకుందాం. వెంటనే వ్యాధి నిరోధక వ్యవస్థ రంగంలోకి దూకుతుంది. తెగిన ప్రాంతం చుట్టూ ఎర్రబడి, వాపు వస్తుంది. తెగడంతో గాయమైన కణజాలాన్ని రిపేరు చేసేందుకు ఉపక్రమించాయన్నమాట.అలాగే జలుబు చేసినా లేదా దేహంలోకి జలుబు కలగజేసే వైరస్‌లాంటిది ఇంకోటి ఏదో ప్రవేశించిందంటే... దాన్ని తుదముట్టించేందుకు జ్వరం వస్తుంది. అంటే దేహం ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా ఆ వేడిమి సహాయంతో శత్రు వైరస్‌ను కాల్చేటందుకే దేహపు ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే జ్వరం అనేది దేహం తాలూకు ఓ ‘ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్’ అన్నమాట.కొద్దికాలం పాటు మాత్రమే ఉండే ఇన్ఫ్లమేషన్ను ‘అక్యూట్ ఇన్ఫ్లమేషన్’ అనీ, అదే దీర్ఘకాలం పాటు కొనసాగితే దాన్ని ‘క్రానిక్ ఇన్ఫ్లమేషన్’ అని వ్యవహరిస్తారు. అక్యూట్ ఇన్ఫ్లమేషన్తో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చుగానీ... చాలాకాలం పాటు ఉండే ‘క్రానిక్ ఇన్ఫ్లమేషన్’ మాత్రం ఒక్కోసారి చాలా ప్రమాదకరం.ఒక ఇన్ఫ్లమేషన్ చాలాకాలం పాటు కొనసాగుతోందంటే... శత్రువును ఎదుర్కొనేందుకు దేహం, దాని తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా చురుగ్గా, సుదీర్ఘకాలం పాటు అలర్ట్‌గా ఉన్నాయని అర్థం.ఓ వ్యక్తి అనారోగ్యకరమైన జీవనశైలితో జీవిస్తున్నా, అతడు చాలాకాలంగా చాలా ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నా, అతడు తీసుకుంటున్న ఆహారం అంతగా ఆరోగ్యకరంగా లేకపోయినా... ఈ అంశాలన్నీ అతడిలోకి వ్యాధి నిరోధక వ్యవస్థపై ఒత్తిడి కలగజేస్తూ, దాన్ని ఎప్పుడూ అలర్ట్‌గా ఉంచుతాయి. దాంతో ఇన్ఫ్లమేషన్ సుదీర్ఘకాలం పాటు (క్రానిక్‌గా) కొనసాగుతుంది. అప్పుడా పోరాటం శత్రుకణాల మీద కాకుండా సొంత కణాల మీదే జరుగుతుండటం వల్ల... ఈ పోరులో ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతింటుంటాయి.ఉదాహరణకు ఓ వ్యక్తి తీసుకునే ఆహారంలో ్రపాసెస్డ్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నా లేదా చక్కెరలను ఎక్కువగా తీసుకుంటున్నా అతడిలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చేందుకు అవకాశాలెక్కువ. అది సుదీర్ఘకాలం కొనసాగుతున్నందు ఆరోగ్యవంతమైన కణాలనూ నాశనం చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సుదీర్ఘ ఇన్ఫ్లమేషన్స్తో ఆరోగ్యవంతమైన కణజాల వ్యవస్థలు దెబ్బతినడంతో అక్రమంగా గుండెజబ్బులు, డయాబెటిస్తో పాటు కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీయవచ్చు. ఇక ఆ ఇన్ఫ్లమేషన్ జీర్ణవ్యవస్థలో వస్తే అది ఆరోగ్యంపై రకారకాల దుష్ప్రభావాలను కలగజేయవచ్చు.ఓ వ్యక్తిలో అతడి జీర్ణవ్యవస్థ చాలా కీలకమైనది. ఆహారాన్ని జీర్ణం చేయడం ద్వారా అది దేహంలోని కోటానుకోట్ల (ట్రిలియన్లకొద్దీ) కణాలకు జీవశక్తిని అందజేయడం, అక్కడ వ్యర్థాలను తొలగించడం వంటి పనులు చేస్తుంది. ఈ జీర్ణవ్యవస్థే దేహానికి మేలు చేసే ట్రిలియన్లకొద్దీ సూక్ష్మజీవుల (మైక్రోబ్స్)కు ఆవాసం. వీటినే గట్ మైక్రోబియమ్ అంటారు. ఒక వ్యక్తి తాలూకు మూడ్స్ (భావోద్వేగాల)కూ ఇవే కారణం. అతడి వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడంలోనూ ఇవే కీలకం. అన్నట్టు వ్యాధి నిరోధక వ్యవస్థకు చెందిన కణజాలంలో 70 – 80 శాతం వరకు జీర్ణవ్యవస్థలోనే ఉండటమనే అంశం కూడా ఓ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థకు అతడి జీర్ణవ్యవస్థ ఎంతగా ఊతం ఇస్తుందో ఈ అంశం తెలియజేస్తుంది.ఇంతటి కీలకమైన జీర్ణవ్యవస్థలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే అది ‘లీకీ గట్ సిండ్రోమ్’ లాంటి ఎన్నో అనర్థాలకు దారితీయవచ్చు. మానసికాందోళనలు మాటిమాటికీ తలెత్తే వాళ్లలో కొందరిలో పేగుల్లోని గోడలు చిట్లుతాయి. ఈ పరిస్థితినే ’లీకీ గట్’ అంటారు. ఇలా పేగుల్లోని గోడలు చిట్లడం జరిగితే దేహంలోని ప్రమాదకరమైన విషపదార్థాలూ, జీర్ణం కాని వ్యర్థాలూ, బ్యాక్టీరియా.. ఇవన్నీ రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ మరింత ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపిస్తుంది. దాంతో సొంత వ్యాధినిరోధక వ్యవస్థే తన కణజాలంపై ప్రతికూలంగా పనిచేసే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వంటి వ్యాధులూ, చర్మరోగాలు, కీళ్లనొప్పులు వస్తాయి. ఇక మానసిక సమస్యలైన డిప్రెషన్ వంటివీ రావచ్చు.జీర్ణవ్యవస్థలో వచ్చే ఇన్ఫ్లమేషన్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అయిన గట్ మైక్రోబియమ్ సమతౌల్యతను దెబ్బతీయవచ్చు. దాంతో కడుపుబ్బరం, మలబద్ధకం, నీళ్ల విరేచనాలు వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక అనారోగ్యాలు కనిపించవచ్చు. గట్ మైక్రోబియమ్ దెబ్బతినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడేందుకూ అవకాశముంది. గట్ మైక్రోబియమ్ దెబ్బతినడం వల్ల ఇన్ఫ్లమేషన్... మళ్లీ ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల మైక్రోబియమ్ సమతౌల్యత మరింత దెబ్బతినడం... ఈ విషవలయం ఇలా కొనసాగుతూ జీర్ణవ్యవస్థ మరింతగా దెబ్బతింటుంది. దాంతో జీర్ణవ్యవస్థ పనితీరూ దెబ్బతింటుంది.అందుకే జీర్ణవ్యవస్థ బాగుంటేనే వ్యాధి నిరోధక వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. సంతోషకరమైన భావోద్వేగలతో మూడ్స్ బాగుంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే దీర్ఘకాలిక (క్రానిక్) ఇన్ఫ్లమేషన్స్ సైతం తగ్గుతాయి. ఇతర దీర్ఘకాలిక జబ్బులు... అంటే గుండెజబ్బులు, ఊబకాయం, డయాబెటిస్ వంటివి నివారితమవుతాయి. అందుకే ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఉందంటే... దేహమంతా ఆరోగ్యంగా ఉందనీ, వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా చురుగ్గా ఉందని అర్థం. -
Natural Beauty Tips: నిమ్మరసం, కీరా జ్యూస్, ఆలివ్ ఆయిల్‌తో ఇలా చేస్తే..
►తాజా నిమ్మరసం చర్మం రంగును మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఒక టీ స్పూను తాజా నిమ్మరసం, రెండు టీ స్పూన్లు కీరా జ్యూస్, ఆలివ్ ఆయిల్ మూడు టీ స్పూన్లు తీసుకుని మూడింటినీ కలుపుకోవాలి. ముందుగా నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. వేళ్ళతో నెమ్మదిగా రబ్ చేయాలి. ఆ తర్వాత సబ్బుతో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికే కాకుండా శరీరమంతా కూడా అప్లై చేసుకోవచ్చు. స్నానానికి వెళ్ళే ముందు ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజూ స్నానానికి ముందు చేయడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. అర టీస్పూన్ గంధపు పొడిలో తగినంత రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా మూడు రోజులకోసారి చేస్తూ వుంటే ముడతలు తగ్గడంతో ΄ాటు ముఖ కాంతి మెరుగుపడుతుంది. నల్లమచ్చల నివారణకు... ► నాలుగు తులసి ఆకులు, పావు టీస్పూన్ పసుపు కలిపి పేస్ట్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి15 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ► అరచేతిలో టీ స్పూన్ తేనె తీసుకుని రెండు రేకల కుంకుమ పువ్వుని వేసి రంగరించాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే క్రమంగా నల్ల మచ్చలు తగ్గుముఖం పడతాయి. -
పెరుగు తింటే..
శరీరంలో ఏదైనా సమస్య వస్తే రోగనిరోధక వ్యవస్థ మంట/వాపుతో స్పందిస్తుంది. కానీ ఈ స్పందన ఎక్కువ కాలముంటే వ్యాధులొస్తాయి. కీళ్లవాతం, ఇన్ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్, గుండెజబ్బులు, మధుమేహం వంటి అనేక వ్యాధులకు ఈ దీర్ఘకాలిక మంట/వాపులే కారణం. మరి తరుణోపాయం ఏమిటి? చాలా సింపుల్. యోగర్ట్ లేదా పెరుగు తో సమస్యను చాలావరకూ అధిగమించవచ్చునంటున్నారు శాస్త్రవేత్తలు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆస్ప్రిన్ వంటి కొన్ని మందులతో మంట/వాపు తగ్గుతుంది కానీ.. వాటితో దుష్ప్రభావాలు ఎక్కువని, ఈ నేపథ్యంలో ఉపశమనం కలిగించేందుకు ఉన్న ఇతర అవకాశాల గురించి తాము పరిశోధనలు చేశామని, పెరుగుతో మేలైన ఫలితాలు రాబట్టామని బ్రాడ్ బొల్లింగ్ అనే శాస్త్రవేత్త చెప్పారు. 2017లో జరిపిన దాదాపు 52 క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చామని, దాదాపు తొమ్మిది వారాల పాటు రోజూ ఆహారంలో పెరుగును చేర్చి తాము ఈ ప్రయోగం చేశామని, మధ్యకాలంలో అప్పుడప్పుడూ పరిశోధనలో పాల్గొన్న వారి రక్త నమూనాలు సేకరించి పరీక్షించినప్పుడు మంట/వాపులు గణనీయంగా తగ్గిన సూచనలు కనిపించాయని వివరించారు. పెరుగుతో పాటు కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నా ఫలితాల్లో పెద్దగా మార్పు లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఆహారం తీసుకున్న తరువాత రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను తగ్గించే విషయంలోనూ పెరుగు ఉపకరిస్తున్నట్లు తాము గుర్తించామని బొల్లింగ్ తెలిపారు. -
నడుము అరుస్తోందా?!
నొప్పి ఒక అరుపు... శరీరం పెడుతున్న కేక. జాగ్రత్త.. జాగ్రత్త అని చేస్తున్న హెచ్చరిక. ‘లిమిట్ క్రాస్ అవొద్దు.. ప్రాబ్లం పెద్దదౌతుంది..చెప్పిన మాట విను... అది నీ మంచి కోసమే’ అని మైండ్.. బాడీకి ఇస్తున్న సిగ్నల్. నడుము నొప్పి ప్రాణం తీసేది కాదు... కానీ ప్రాణం తీసేంత నొప్పి. కొన్ని సూచనలు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. అక్కచెల్లెళ్లూ... మీరెంతో చురుగ్గా, చలాకీగా ఉంటారు. మహిళల్లో నడుమునొప్పి... నడుమునొప్పి చాలా సాధారణంగా కనిపించే సమస్య. కానీ మహిళల్లో ఇది మరింత ఎక్కువ. రోజంతా నిలబడి వంట చేసే సమయంలో నడుము ఒంచి ఉండటం నడుమునొప్పి ముప్పును పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా నడుమునొప్పి తీవ్రత విషయంలో పురుషులు, మహిళలల్లో తేడాలు ఉంటాయి. భారత్‌లో పురుషుల్లో 18 శాతం మంది నడుమునొప్పితో బాధపడుతుంటే మహిళల్లో అది 25 శాతం. పైగా మహిళల్లోని రుతుస్రావం నొప్పి వారి నడుమునొప్పిని మరింత ప్రభావితం చేస్తుంది. అంతేకాదు... వారిలో ప్రత్యేకంగా స్రవించే హార్మోన్లు సైతం నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంటాయి. పురుషుల్లో కంటే మహిళల్లో ఇన్ఫ్లమేషన్ (నొప్పి, వాపు, మంట)కు స్పందించడం కాస్తంత తీవ్రంగా ఉంటుంది. ఒకేలాంటి నొప్పి అయినా మగవారితో పోలిస్తే మహిళల్లో ఆ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. హార్మోన్లు, జన్యువులు, మనస్తత్వం, నొప్పి తెలిసే వ్యవస్థ వంటివి పరిగణనలోకి తీసుకున్నప్పుడు మహిళల్లో నడుము నొప్పి తీవ్రత ఎక్కువే. అందుకే మహిళల్లో వివిధ కారణాల వల్ల కనిపించే నడుము నొప్పులు, వాటి పరిష్కారాలను చూద్దాం. నడుమునొప్పుల్లో కొన్ని... టెయిల్‌బోన్ పెయిన్ : సరిగ్గా మనం కూర్చొనే చోటికి కాస్త పైనా, నడుమునకు కాస్త కింద నొప్పి రావడాన్ని టెయిల్‌బోన్ పెయిన్‌గా చెప్పవచ్చు. అంటే సరిగ్గా వెన్ను చివరి ఎముక దగ్గర నొప్పి రావడం. దీన్ని ‘కాక్సిడైనియా’ అంటారు. ఇది పురుషుల్లో కంటే మహిళల్లో ఐదు రెట్లు ఎక్కువ. ఇక మహిళల్లో గర్భధారణ అనే అంశం కాక్సిడైనియా ముప్పును పెంచుతుంది. కంప్రెషర్ ఫ్రాక్చర్ : వెన్నెముకల్లో ఎముక విరిగినప్పుడు వచ్చే నొప్పి. వెన్నెముక అనేది వెన్నుపూసలు అనే చిన్న చిన్న ఎముకల సమాహారం. ఇందులో ఆస్టియోపోరోసిస్ ఎముక విరిగినప్పుడు తీవ్రమైన నడుమునొప్పి వస్తుంది. ఈ తరహా కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అయ్యేందుకు అవకాశం ఇరువురిలోనూ ఉన్నా... పురుషుల్లో కంటే మహిళల్లో రెండు రెట్లు ఎక్కువ. ఫైబ్రోమయాల్జియా : ఈ తరహా నొప్పి వెన్నులో కింది భాగంతో పాటు పైన కూడా కనిపించవచ్చు. మహిళల్లో యాంగై్జటీనే ఇందుకు దోహదం చేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ : కీళ్ల అరుగుదలతో వచ్చే నొప్పి ఇది. రెండు ఎముకలు కలిసే చోట ఎముక అరిగినప్పుడు వచ్చే నొప్పి ఇది. అయితే మోకాలు, తుంటి భాగంలో లాగే నడుము ప్రాంతంలోని వెన్నులో ఎముకల అరుగుదలతో ఈ నొప్పి వస్తుంది. శాక్రో ఇలియాక్ జాయింట్ సమస్యలు : ఈ ఎముకలు వెన్నెముక చివరి భాగంలో ఉంటాయి. శాక్రమ్ అనే వెన్నెముక చిట్టచివరి ఎముక (టెయిల్‌బోన్)ను తుంటితో కలిపేలా ఈ ఎముకలు పిరుదులకు ఇరువైపులా కాస్త విస్తరించి ఉంటాయి. ఈ భాగంలో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు నడుము కింద భాగంతో పాటు కాళ్లలోకి సైతం నొప్పి పాకుతుంది. గర్భధారణ అనే అంశం ఈ నొప్పిని మరింత ప్రభావితం చేస్తుంది. పక్కతేడా : మహిళలు తమ రోజువారీ పనుల్లో భాగంగా బిందెల మోయడం, పిల్లలను చంకలో మోసేటప్పుడు నడుము ఒంపు భాగంలో ఒత్తిడి పడుతుంటుంది. చాలాసేపు అవసవ్య భంగిమలో ఉండటం కూడా నడుము నొప్పికి కారణం. ఇక నడుము వంచి ఇల్లు తుడిచే వాళ్లు నిటారుగా ఉండే లాంగ్ హ్యాండిల్ మాప్‌లను వాడటం మంచిది. అకస్మాత్తుగా అసహజ భంగిమల్లోకి వంగడం, పక్కకు తిరగడం, బరువులు ఎత్తే సమయంలో ముందుకు ఒంగడమూ నడుము నొప్పికి కారణం కావచ్చు. బరువును ఎత్తేటప్పుడు కూర్చొని నెమ్మదిగా ఎత్తడం మేలు. ఇక పనిచేసే చోట్ల మహిళల్లో కంప్యూటర్లోకి వంగి చూస్తుండటం వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. అందుకే కంప్యూటర్ వంటివి చూస్తున్నప్పుడు నడుమును వీలైనంత నిటారుగా ఉంచాలి. చాలాసేపు నిలబడి ఉండే వాళ్లలో నడుము నొప్పి కొన్ని వృత్తుల్లో ఐదారు గంటల పాటు నిలబడాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్లలో నడుమునొప్పి రావడంతో పాటు కాళ్లలోని ఎముకలు, కండరాలు దెబ్బతిని ‘మస్క్యులో స్కెలెటల్ డిజార్డర్స్’ రావచ్చు. స్వల్పకాలిక సమస్యలైన కాళ్లలో తిమ్మిర్లు (క్రాంప్స్) వంటివి నడుమునొప్పితో పాటు వచ్చినప్పుడు పరిస్థితి దుర్భరమవుతుంది. అందుకే చాలాసేపు నిలబడే ఉండే వృత్తుల్లో ఉండేవారు తరచూ కాస్తంత బ్రేక్ తీసుకోవాలి. నిలబడి ఉన్నప్పుడు కూడా అదేపనిగా నిటారుగా ఉండకుండా తరచూ పోష్చర్‌లో కాస్తంత మార్పులు చేస్తూ ఉండాలి. వంట చేసేటప్పుడు మహిళలు వంట ప్లాట్‌ఫారమ్ దగ్గర చాలాసేపు నిలబడి ఉండాల్సి వస్తోంది. ఇలాంటి వారు తమ ఎత్తునకు అనుగుణంగా ప్లాట్‌ఫారమ్ అమర్చుకోవడం, తరచూ కూర్చోడానికి ఎల్తైన లాంగ్ స్టూల్‌ను వేసుకోవడం మంచిది. దాని కాళ్ల దగ్గర ఫుట్‌రెస్ట్ చేసుకోవడానికి అనుగుణంగా అడ్డుపట్టీలు ఉండటం నడుమునొప్పి నివారించడానికి దోహదపడుతుంది. డైవింగ్ సీట్... నడుము నొప్పి వాహనాన్ని నడపడానికీ, నడుమునొప్పికీ చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. వాహనాన్ని నడిపే కొందరిలో నడుము నొప్పి కనిపిస్తుంటుంది. ఆ నొప్పి నివారణకు సూచనలు : ∙ తొడలకు సీట్ సపోర్ట్ వీలైనంత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే వాటి నిడివిలో అవి ఎక్కువ భాగం సీట్‌పై ఉండాలన్న మాట. ∙ బ్రేక్, క్లచ్ వంటి మీ కాళ్లు ఆనే భాగాలకు మరీ దూరంగా కూర్చోవద్దు. ∙కాళ్ల పొడవుకు అనుగుణంగా సీట్‌ను సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి ∙ఎత్తునకు అనుగుణంగా సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకోవాలి ∙సీట్‌ను నిటారుగా ఉంచేలా చూసుకోవాలి లేదా అది మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా సీట్ ఒంచాలి. ఆ సీట్ ఒంపు ఎంత అవసరం అని తెలియాలంటే ఒకటే కొండగుర్తు... ఆ ఒంపు నడుము మీదగానీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి. ∙నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్) భాగంలో ఒక కుషన్ ఉంచుకోవాలి. ఆ లంబార్ సపోర్ట్ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది. ∙మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్రెస్ట్ ఉండాలి. ∙సీట్లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి. ∙అదేపనిగా డ్రైవ్ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్ తీసుకోవాలి. ∙ఇక డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మేలు. చికిత్స నడుమునొప్పితో బాధపడుతున్న మహిళలు ముందుగా అది ఏ నిర్దిష్టమైన కారణంతో వస్తున్నదో తెలుసుకోవాలి. ఇందుకోసం అనేక మార్గాలు ఉన్నాయి. వీటిల్లో అన్నింటికంటే ప్రధానమైనది... ఫిజియోథెరపిస్ట్ సహాయంతో అవసరమైన వ్యాయామాలు లేదా (ఇంటర్‌ఫెరెన్షియల్ థెరపీ) ఐఎఫ్‌టీ వంటి ప్రక్రియలతో చేసే చికిత్సలూ ఉపశమనాన్ని కలిగిస్తాయి. టెన్స్ అనే చికిత్స కూడా ఇలాంటిదే. ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనే మాటలకు సంక్షిప్త రూపమే ఈ ‘టెన్స్’. ఈ చికిత్స ప్రక్రియలో ఎలక్ట్రోడ్ల సహాయంతో చిన్న చిన్న విద్యుత్ ప్రకంపనలను చర్మం కిందికి పంపుతారు. ఫలితంగా ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భవతులు, మూర్ఛతో బాధపడే రోగులు, గుండెజబ్బులు ఉన్నవారు లేదా గుండె సమస్యను చక్కదిద్దడానికి పేస్‌మేకర్ అమర్చిన వాళ్లకు టెన్స్ చికిత్స సరికాదు. అందుకే ఇలాంటి చికిత్సలు పూర్తిగా వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే సాగాలి. ఇక పై మార్గాలన్నీ విఫలం అయినప్పుడు సమస్యను శాశ్వతంగా చక్కదిద్దడానికి ఎముకల వైద్య నిపుణులు లేదా న్యూరోసర్జన్లు లేదా స్పైన్ సర్జన్లు అవసరమైన శస్త్రచికిత్సను నిర్వహించి పరిస్థితిని చక్కబరుస్తారు. తక్షణ నొప్పి నివారణ కోసం : నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కోసం నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి కేవలం తక్షణ నొప్పి నివారణ కోసమే పనికి వస్తాయి. శాశ్వత నివారణ కోసం నొప్పి నివారణ మందులను వాడకూడదు. నొప్పి నివారణ మందులను దీర్ఘకాలం వాడటం వల్ల జీర్ణవ్యవస్థతో పాటు మూత్రపిండాల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినవచ్చు. అందుకే రెండు వారాలకు మించి నొప్పి నివారణ మందులు తీసుకోవడం సరికాదు. దీనికి బదులు ఉపశమనం కోసం పైపూత మందులు (టాపికల్ మెడిసిన్స్) వాడటం మంచిది. అయితే ఇందుకోసం కొన్ని ఆయిల్స్‌తో మసాజ్ చేస్తుంటారు. తొలుత నొప్పిని ఉపశమింపజేసే నూనెలతో మసాజ్‌లు చేయడం మంచిదే. మసాజ్‌లో భాగంగా నిపుణులు రుద్దడం, నొక్కడం, కొన్ని నిర్దిష్టమైన చోట్ల ఒత్తిడి కల్పించడం... అంటే రోలింగ్, నీడింగ్, అప్లయింగ్ ప్రెషర్ వంటవి చేస్తారు. దాంతో నొప్పి ఉన్న భాగాల్లో రక్తప్రసరణ బాగా అయ్యేలా చేస్తారు. ఫలితంగా కండరాల్లో ఒత్తిడి తగ్గడం లేదా పట్టివేసిన కండరం వదులు కావడం వల్ల నొప్పి ఉపశమిస్తుంది. అయితే... ఇలా ఆరు వారాల కంటే ఎక్కువగా చేసినప్పటికీ నొప్పి కొనసాగుతూ ఉంటే పూర్తిస్థాయి చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదించాలి. అలాగే 20 ఏళ్ల లోపు వాళ్లలో నడుము నొప్పి కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. పడక కారణంగా వచ్చే నడుమునొప్పి... మీ పడక కారణంగా నడుమునొప్పి వస్తుందేమో కూడా చూసుకోవాలి. నిద్రలేవగానే అకస్మాత్తుగా నడుమునొప్పి వస్తే అది పక్కసరిగా లేని కారణంగా కావచ్చు. కనీసం 15 –30 నిమిషాల పాటు మెల్లగా స్ట్రెచ్ అవుతూ చేసే వ్యాయామాల తర్వాత కూడా నొప్పి తగ్గలేదంటే అది పక్క సరిగా లేకపోవడం వల్ల వచ్చిన నొప్పిగా అనుకోవచ్చు. ఏది మంచి పడక : మంచి పడక అనేది అందరికీ ఒకేలా ఉండదు. వారి వారి వ్యక్తిగత సౌకర్యాలకు అనుగుణంగా తమ పడకను ఏర్పాటు చేసుకుంటుంటారు. అయితే నడుము నొప్పి రాకుండా ఉండేందుకు పడక విషయంలో తీసుకోవాల్సిన కొన్ని సూచనలు ఇవి... ∙పడుకునే చోటు సమతలంగా ఉండాలి. అయితే కొందరు కఠినమైన తలం (సర్ఫేస్) మీద పడుకోవడం వల్ల నడుమునొప్పి తగ్గుతుందని అపోహ పడుతుంటారు. అది సరికాదు. పడక కూరుకుపోయేంత మెత్తగానూ ఉండకూడదు, పూర్తిగా చెక్కలాగా కఠినంగానూ ఉండకూడదు. మీ మ్యాట్రెస్ తగినంత మెత్తగా ఉంటూనే... సమతలంగానూ ఉండాలి. మీ మ్యాట్రెస్ చాలా కఠినంగా ఉంటే వెన్నులోని కొన్ని మృదువైన లిగమెంట్లు, కండరాలను మరీ గట్టిగా నొక్కేస్తుంది. అలాగే మరీ మృదువుగానూ, మీరు లోనికి కుంగిపోయేంత మెత్తగా ఉంటే మీ వెన్నెముకను అర్ధచంద్రాకారంలో ఒంగిపోయేలా చేసి నొప్పికి కారణమవుతుంది. వెన్నెముక ఆకృతి ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా మారి సపోర్ట్ ఇచ్చేలా మీ పరుపు ఉండాలి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, లైఫ్‌స్టైల్ నిపుణులు, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఆస్తమా... ఉంటే ఏంటి?
ప్రతిభకు... ఆస్తమా అడ్డంకి కాదు.పాటవానికి...అది ప్రతిబంధకం కాదు.సామర్థ్యానికి మోకాలడ్డదు.చిన్నప్పుడు వస్తేతగ్గే అవకాశాలు ఎక్కువ.పెద్దయ్యాక వచ్చినానియంత్రణలో ఉంచుకుంటేప్రాబ్లం ఉండదు.కాబట్టి... ఉంటే ఏంటి?అని ధీమాగా అనుకుంటే...నిశ్చింతగా ఎదుర్కోవచ్చు.నిర్భయంగా ఉండిపోవచ్చు.ఒకవేళ ‘ఉంటే ఏంటి?’అని సమాచారంతెలుసుకోవాలనుకుంటేఈ కథనం చదవండి. అవగాహన పెంచుకోండి. ఆస్తమా ఊపిరితిత్తులకు ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట) కలిగించే వ్యాధి. ఇది దీర్ఘకాలికంగా బాధిస్తుంది. ఆస్తమాను అర్థం చేసుకోవాలంటే మన ఊపిరితిత్తుల్లోని వాయునాళాల పనితీరును అవగతం చేసుకోవాలి. మన ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకెళ్లి, మళ్లీ బయటకు వదలడానికి అనేక నాళాలు ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ కారణంగా అవి ఉబ్బుతాయి. సెన్సిటివ్‌గా మారిపోతాయి. అంటే ఉదాహరణకు చర్మంపై మనం ముట్టుకుందామంటే ముట్టనివ్వని విధంగా మారడం అన్నమాట. దాంతో ఊపిరితిత్తులకు దారితీసే నాళాల కండరాలు బిగుసుకుపోతాయి. ఫలితంగా శ్వాస మార్గం మూసుకుపోయినట్లుగా అవుతుంది. ఫలితంగా గాలి గొట్టాల మార్గం మరింత సన్నబడుతుంది. దీని వల్ల కూడా ఊపిరి అందదు. మనకు సరిపడని వాటిని పీల్చుకున్నప్పుడు మన వాయునాళాలు తీవ్రంగా ప్రతిస్పందించడం వల్ల ఇలా జరుగుతుంది. దాంతో వాయునాళాలు ఉబ్బడంతో పాటు దాని లోపల కాస్త జిగురుగా ఉండే మ్యూకస్ అనే పదార్థం స్రవిస్తుంది. అది గాలి మార్గాన్ని మరింతగా మూసేస్తుంది. దాంతో గాలి పీల్చడమూ, వదలడమూ కష్టమవుతుంది. వేర్వేరు దేశాల్లో... వేర్వేరు విస్తృతితో... వేర్వేరు దేశాల్లో ఆస్తమా విస్తృతి భిన్నంగా ఉంది. దిగువ స్థాయి ఆదాయ వర్గాలు, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆస్తమా విస్తృతితో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. అయితే ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది కాస్త నిలకడగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 33.4 కోట్ల మంది ఆస్తమా బాధితులు ఉండగా దాదాపు ఏటా 2,50,000 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తమా బాధితుల్లో పదోవంతు మంది మనదేశంలోనే ఉన్నారు. ఇది ఏ వయసు వారిలోనైనా వస్తుంది. అయితే సాధారణంగా ఇది బాల్యంలోనే మొదలవుతుంది. దీని తీవ్రతను పరిశీలించిన దాదాపు 15 అధ్యయనాలలోని విశ్లేషణల ఆధారంగా ప్రపంచంలోని పిల్లల్లో 14 శాతం మందికి ఆస్తమా లక్షణాలు కనిపిస్తున్నాయి. మన దేశంలోని 5 – 11 ఏళ్ల పిల్లల్లో 10% నుంచి 15% మంది చిన్నారులు ఆస్తమా కనిపిస్తోంది. పిల్లల్లో ఆస్తమా చిన్న పిల్లల్లో సాధారణంగా ఐదేళ్ల తర్వాత ఆస్తమా లక్షణాలు బయట పడతాయి. అయితే చాలా చిన్నపిల్లల్లో అటు తల్లితండ్రులకు, ఇటు డాక్టర్లకు కూడా ఆస్తమా వస్తే దాన్ని గుర్తించడం ఒకింత కష్టం అవుతుంది. ఎందుకంటే ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే బ్రాంకియల్ ట్యూబులు చిన్నపిల్లల్లో అసలే చాలా సన్నగా, చిన్నగా ఉంటాయి. ఇక పడిశం, జలుబు లాంటి వాటితో ఆ మార్గాలు మామూలుగానే ఇన్ఫ్లమేషన్కు గురవుతాయి. దాంతో అవి మరింత సన్నగా మారతాయి. అందువల్ల అది ఆస్తమా వల్ల కలిగిన పరిణామమా, లేక పడిశం, జలుబు తాలూకు లక్షణాలా అన్నది గుర్తించడం కష్టమవుతుంది. కారణాలు / నివారణ ఆస్తమాకు మూలకారణం ఇంకా పూర్తిగా తెలియదు. జన్యుపరమైన కారణాలతో పాటు వాతావరణం ఇది వచ్చేందుకు దోహదం చేస్తుందని స్పష్టమైంది. మనం శ్వాసించే సమయంలో ఏదైనా సరిపడనిది (దీన్ని అలర్జెన్ అని పిలుస్తారు) మన ఊపిరితిత్తుల మార్గంలోకి ప్రవేశిస్తే అది అలర్జిక్ ప్రతిచర్యకు కారణమవుతుంది. ఇలా అలర్జిక్ ప్రతిచర్యకు దోహదపడే అంశాల్లో కొన్ని... ► గదుల్లో ఉండే ఇండోర్ అలర్జెన్స్ (ఉదాహరణకు పక్కబట్టల్లో, కార్పెట్స్‌లో, ఇరుగ్గా ఉండే ఫర్నిచర్లో ఉండే డస్ట్‌మైట్స్, కాలుష్యంలో పుష్కలంగా ఉండే దుమ్ముధూళి కణాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు. ► ఆరుబయట ఉండే అలర్జెన్స్: (ఉదాహరణకు పుప్పొడి, గాలితో పాటు విస్తరించే బూజు వంటి పదార్థాలు). ►పొగాకు పొగ ► రసాయనాలు, వాటి వాసన, ఘాటైన స్ప్రేలు కొందరిలో కారణం కావచ్చు. వాయు కాలుష్యం... ఇవేగాక ఇంకా చాలా అంశాలు ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అవి... చలిగాలి, చాలా ఎక్కువగా చేసే వ్యాయామాలు. కొన్నిసార్లు కొన్ని మందులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. ఉదాహరణకు ఆస్పిరిన్, నొప్పి నివారణకు వాడే నాన్–స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇటీవల నగరీకరణకు దోహదపడే అనేక అంశాలు ఆస్తమాను కలిగిస్తున్నట్లు తేలింది. కారణాలకు దూరంగా ఉంటే నివారణ కూడా సాధ్యమవుతుంది. అలర్జెన్స్కూ, ట్రిగర్స్కూ దూరంగా ఉండటమే నివారణ. నివారించడం అంటే జబ్బుకు దూరంగా ఉండటమే. అంటే ఇంచుమించు జబ్బు లేకుండా ఉండటమే. లక్షణాలు ► దగ్గు ... ప్రధానంగా రాత్రివేళల్లో ఎక్కువగా ఉంటుంది. శరీరానికి శ్రమకలిగే వ్యాయామం లేదా నవ్వడం, ఏడ్వటం, పరుగెత్తడం వంటివి చేస్తే ఈ దగ్గు మరింతగా పెరుగుతుంది. ► శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ► ఛాతీ పట్టేసినట్లుగా బిగుతుగా మారడం ► ఊపిరి హాయిగా అందకపోవడం ► పిల్లికూతలు (శ్వాస తీసుకునే సమయంలో... అందునా మరీ ముఖ్యంగా గాలి వదిలే సమయంలో సన్నటి పిల్లికూతలు వినిపిస్తుంటాయి). ► కొందరిలో ఆస్తమా వచ్చినప్పుడు ఒళ్లు (చర్మం) కూడా ఎర్రబారి పొడిగా మారుతుంది. మరికొందరిలో ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, గురక వంటి లక్షణాలు కనిపించవచ్చు. ► పిల్లల్లో పైన పేర్కొన్న లక్షణాల్లో ఏదో ఒకటి గాని లేదా కొన్ని లక్షణాలు కలగలిసి గాని కనిపించవచ్చు. ఇలా లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని జలుబు లేదా బ్రాంకైటిస్ కావచ్చని అనుకుంటాం. అయితే అవే లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే అప్పుడు అది ఆస్తమా కావచ్చని అనుమానించాలి. ఆ పిల్లలకు ఆస్తమాను ప్రేరేపించే అంశం (ట్రిVýæ్గరింగ్ ఫ్యాక్టర్) ఏదైనా ఎదురైతే వెంటనే వారి పరిస్థితి మరింత దుర్భరమవుతుంది. వెంటనే ఆస్తమా లక్షణాలు మొదలైపోతాయి. పొగ, ఘాటైన వాసనలు, పుప్పొడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, డస్ట్‌మైట్స్... ఇవి సోకీ సోకగానే ఆస్తమాను ప్రేరేపిస్తాయి. చికిత్స చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే వారు పెరిగే కొద్దీ... అంటే టీన్స్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడుగానీ లేదా యుక్తవయస్కులుగా మారుతున్నప్పుడుగానీ ఆ ఆస్తమా లక్షణాలు క్రమంగా తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ లక్షణాలు కొంతకాలం తర్వాత మళ్లీ వ్యక్తం కావచ్చు. ఇక చిన్నప్పుడు మరీ తీవ్రమైన ఆస్తమా ఉన్న పిల్లల్లో అది పెద్దయ్యాక కూడా తగ్గకపోవచ్చు. ఆస్తమాకు రెండు రకాల చికిత్స అవసరమవుతుంది. అది... ► దీర్ఘకాలంలో మళ్లీ రాకుండా నివారించేందుకు అవసరమైన ప్రివెంటివ్ చికిత్స. వాయునాళాల ఇన్ఫ్లమేషన్ నివారణకు ఈ మందులను వాడాలి. దాదాపు వీటిని ప్రతిరోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ► తక్షణ ఉపశమనం కోసం తీసుకోవాల్సిన చికిత్స: ఆస్తమా వచ్చినప్పుడు వాయునాళాల వాపు తగ్గించి, హాయిగా శ్వాస తీసుకోవడాని దోహదపడేందుకు ఉపయోగించే మందులు వాడాల్సి ఉంటుంది. వీటినే రెస్క్యూ మెడికేషన్ అనీ, క్విక్ రిలీఫ్ మెడికేషన్ అని కూడా అంటారు. ఇది ఆస్తమా అటాక్ ఉన్నప్పుడు చేసే స్వల్పకాలిక చికిత్స. కొందరు పిల్లల్లో ఆటలు లేదా వ్యాయామానికి ముందు కూడా ఈ చికిత్సను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. ► మూడేళ్ల లోపు పిల్లలకు ఇన్‌హేలర్స్‌తో చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు మందు వృథా కాకుండా ఉండటంతో పాటు... ఆ మందు పిల్లల ఊపిరితిత్తుల్లోకి సమర్థంగా వెళ్లడానికి స్పేసర్ డివైజ్ విత్ మాస్క్ విధిగా ఉపయోగించాలి. ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల్లో స్పేసర్‌తో ఇన్హేలర్ ఉపయోగించాలి. ► కేవలం మందులు ఇవ్వడం లేదా చికిత్స మాత్రమే ఆస్తమాను నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడదు. దాంతోపాటు ఆస్తమాను ప్రేరేపించే అంశాలకు రోగిని దూరంగా ఉంచడం, తమకు ఆస్తమాను ప్రేరేపించే అంశాలేమిటో క్రమంగా గుర్తుపట్టి, వాటినుంచి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రతిస్తూ ఉండటం వంటి అంశాలెన్నో కలగలిస్తేనే ఆస్తమా నియంత్రణలో ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆస్తమా – సెలబ్రిటీ బాధితుల్లో... కొందరు ప్రముఖులు అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ, ప్రముఖ హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్, షరాన్‌స్టోన్, ప్రముఖ రచయిత చార్లెస్ డికెన్స్, దక్షిణ అమెరికా విప్లవయోధుడు చేగువేరా వంటి ప్రముఖులు ఆస్తమాతో బాధపడ్డవారిలో ఉన్నారు. బాలివుడ్ దిగ్గజం రాజ్కపూర్నూ ఆస్తమా బాధించింది. జెరోమ్ బెట్టిస్ అనే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు ఆస్తమాతో బాధపడ్డవాడే. అలాగే నాన్సీ హాగ్షెడ్ ఆస్తమా ఉన్నప్పటికీ స్విమ్మింగ్‌లో ఒలింపిక్‌లో 3 బంగారు పతకాలు సాధించింది. అయితే వారి ప్రఖ్యాతికీ, ప్రతిభకూ అది ఎప్పుడూ ప్రతిబంధకం కాలేదు. ఆస్తమా – ఆహారం ఆస్తమా ఉందా? ఇలా తినండి! ► కిస్మిస్, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్, బొప్పాయి, ఆపిల్ వంటి తాజా పండ్లు, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి కాయ, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఈ, బీటా కెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ► బ్రేక్‌ఫాస్ట్‌లో... పండ్లు, తేనె, కిస్మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో... క్యారట్, బీట్రూట్, తాజా కాయగూరలు తీసుకోవాలి. ► వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం– సోయా గింజలు, కొవ్వు తీసిన పాలు. ►ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాలు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి. ఇలా కూడా తీసుకోవచ్చు... ► పాలలో పసుపు కలుపుకొని తాగడం, ఒక స్పూన్ పసుపులో అంతే మోతాదులో తేనె కలిపి పరగడుపున తీసుకుంటే సమస్య ఉపశమనంతో పాటు నివారణకు కూడా దోహదం చేస్తుంది. ► పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు... ఇవి ఆస్తమా సమస్యను తీవ్రతరం చేస్తాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో కొన్ని పాక్షికంగా మాత్రమే నిజం. వీటిలో ఫలానా ఆహారం నిర్దిష్టంగా అలర్జీని కలిగించి ఆస్తమాను ప్రేరేపిస్తుందనీ, అదే ట్రిగర్ అనీ తెలిస్తేనే దాన్ని మానేయాలి. కమలాలు, నిమ్మ, బత్తాయి లాంటివి ‘సి’ విటమిన్‌ను అందించి, వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయి. నిర్దిష్టంగా ఆ ఆహారం అలర్జీని కలిగిస్తుందని అనుకున్నప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రతించి, అది కచ్చితంగా అలర్జీని కలిగిస్తుందనే నిర్ధారణ పరీక్షను చేయించాకే... ఆ ఆహారం నుంచి దూరంగా ఉండాలి. అపోహతోనే దూరంగా ఉంటే కొన్ని పోషకాలనుంచి దూరమైనట్లే. ► ఇక బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే, అది భవిష్యత్తులో ఆస్తమా నుంచి రక్షణ ఇస్తుంది. ఇవి ఆస్తమాను పెంచుతాయి... ఉప్పు తగ్గించాలి. ► రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారం, బ్రెడ్ వంటివి మానేయాలి. ఆస్తమా – నిర్ధారణ నిర్ధారించడం అంత ఈజీ కాదు ఆస్తమా నిర్ధారణ చాలా కష్టమైన ప్రక్రియ. లక్షణాలతో పాటు... అవి ఎంత వ్యవధిలో మళ్లీ మళ్లీ వస్తున్నాయనే అంశం ఆధారంగా ఆస్తమాను అనుమానిస్తారు. దాంతో నిర్ధారణ కోసం కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా బాల్యంలోని వచ్చే మరికొన్ని సమస్యల లక్షణాలూ ఆస్తమా లక్షణాలతో కలగలసి పోతాయి. దాంతో సదరు లక్షణాలు నిర్దిష్టంగా ఆస్తమా వల్లనే కనిపిస్తున్నాయా, లేక ఇతర మరికొన్ని ఆరోగ్య సమస్యల వల్లనా అని నిర్ధారణ చేయడం కష్టమవుతుంది. ఉదాహరణకు ఆస్తమా లాంటి లక్షణాలే కనబరిచే మరికొన్ని కండిషన్లు.... ∙ రైనైటిస్ ∙ సైనసైటిస్ ∙ఆసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) ► వాయునాళాలలో ఏమైనా తేడాలు (ఎయిర్ వే అబ్నార్మాలిటీస్) ► స్వరపేటిక సరిగా పనిచేయకపోవడం (వోకల్ కార్డ్ డిస్ఫంక్షన్) ► బ్రాంకైటిస్ వంటి శ్వాసమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్లు ► రెస్పిరేటరీ సింటాక్టికల్ వైరస్ (ఆర్ఎస్వి) ఆస్తమా నిర్ధారణ ఇంత సంక్లిష్టం కాబట్టే డాక్టర్లు చిన్నారి లక్షణాలను నిశితంగా పరిశీలించడంతో పాటు కొన్ని వైద్య పరీక్షలూ చేయిస్తారు. అవి... ► ఐదేళ్లు లేదా అంతకంటే పైబడిన వయసు పిల్లల విషయానికి వస్తే పెద్దవాళ్లలోనూ నిర్ధారణ చేసేందుకు నిర్వహించే లంగ్ ఫంక్షన్ పరీక్షలు (స్రైరోమెట్రీ) వంటివి చేస్తారు. ఇందులో పిల్లలు ఎంత సమర్థంగా గాలిని బయటకు వదలగలరో చూస్తారు. సాధారణ స్థితితో ఈ పరీక్ష చేయడంతో పాటు, కాస్త వ్యాయామం తర్వాత, అటుపైన కొంత ఆస్తమా మందు ఇచ్చాక ఆ పరీక్షల్లో కనిపించే తేడాలను సునిశితంగా గమనించాకే ఆస్తమా నిర్ధారణ చేస్తారు. ►ఇక ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో లంగ్ ఫంక్షన్ పరీక్షతో ఆస్తమా నిర్ధారణ ఒకింత కష్టం. దాంతోపాటు రోగి చెప్పేవి, తల్లితండ్రులు గమనించే అనేక లక్షణాల ఆధారంగా ఆస్తమాను నిర్ధారణ చేస్తారు. ఇంత చిన్న పిల్లల్లో ఆస్తమాను నిర్ధారణ చేయాలంటే కొన్ని సందర్భాల్లో కొన్ని నెలలు కూడా పట్టవచ్చు. అలర్జిక్ ఆస్తమా కోసం చేసే కొన్ని అలర్జీ పరీక్షలు : కొన్ని ట్రిVýæ్గరింగ్ అంశాలతో పిల్లల్లో ఆస్తమా వెంటనే కనిపిస్తుంటే.. అలాంటి పిల్లల్లో డాక్టర్లు అలర్జీ స్కిన్ టెస్ట్ చేయిస్తారు. అలర్జీ వల్ల కలిగే ఆస్తమా విషయంలో ఇది మొదటి ప్రాధాన్య పరీక్ష (గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్). ఇందులో ఏదైనా అలర్జీ కలిగించే పదార్థాన్ని (అంటే జంతువుల వెంట్రుకలో లేదా బూజునో) ఉపయోగించి చర్మంలోని కొంత భాగాన్ని సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఏదైనా అలర్జిక్ ప్రతిక్రియ (రియాక్షన్) జరుగుతుందేమోనని గమనిస్తారు. ఇది చాలా సంక్షిప్తంగా, వేగంగా జరిగిపోయే నిర్దిష్టమైన పరీక్ష. కొన్నిసార్లు చర్మంపై లక్షణాలు కనిపిస్తూ ఉండేవారికి, యాంటీ హిస్టమైన్ మందులు తీసుకునే వారికి అలర్జీ బ్లడ్ టెస్ట్‌ల వల్ల ఉపయోగం ఉంటుంది. అయితే కొంతమందికి ఆహారం కారణంగా అలర్జీ వచ్చి ఆస్తమా కనిపించవచ్చు. అలాంటప్పుడు ఏయే రోగులకు ఏయే ఆహారం వల్ల అలర్జీ కలుగుతుందని తెలుసుకోవడం చాలా కష్టమైన పని. అది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది.కొన్ని సందర్భాల్లో డాక్టర్లు మరింత సూక్ష్మస్థాయి పరీక్షలనూ ఆశ్రయించాల్సి రావచ్చు. డా. అపర్ణా రెడ్డి పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్, రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ హైదరాబాద్ -
కప్పింగ్ చికిత్స!
ఓల్డ్ ఈజ్ న్యూ ఒకనాటి ప్రాచీన ప్రక్రియకు ఇప్పుడు మళ్లీ ప్రాచుర్యం లభిస్తోంది. కానీ ఈ ప్రక్రియను ప్రాచీన ఈజిప్షియన్లు, చైనీయులు క్రీస్తుపూర్వం 1550 నాటికే ఉపయోగించేవారు. ప్రత్యామ్నాయ వైద్య చికిత్సల్లో అత్యంత ప్రాచీనమైనది కప్పింగ్ ప్రక్రియ. ఇందులో నొప్పి ఉన్న చర్మం భాగంలో ప్రత్యేకమైన ‘కప్’ల ద్వారా చర్మాన్ని కాసేపు పైకిలాగేట్లుగా, పీల్చడం (సక్షన్ ప్రక్రియ) జరుగుతుంది. దాంతో ఆ శరీర భాగంలో రక్తప్రసరణ ఎక్కువగా జరిగి నొప్పి లేదా ఇన్ఫ్లమేషన్ నుంచి ఉపశమనం వస్తుందనేది ఈ చికిత్స ప్రక్రియలోని భావన. కప్‌ల రూపంలో ఉపయోగించేవి.. గాజుకప్పులు వెదురు బొంగులు మట్టితో చేసిన పాత్రలుసిలికాన్ కప్పులుకప్పింగ్ రెండు విధాలుగా జరుగుతుంది. మొదటిది డ్రై కప్పింగ్, రెండవది వెట్ కప్పింగ్.ఇందులో ఏ ప్రక్రియను ఉపయోగించినా... థెరపిస్ట్ ఆ కప్పులో ఆల్కహాల్నో, కొన్ని ఔషధ మొక్కలనో లేదా కాగితాన్నో మండిస్తారు. అలా కాల్చడం వల్ల కప్‌లోని ఆ ప్రాంతంలో శూన్య ప్రదేశం (వాక్యూమ్) ఏర్పడుతుంది. ఫలితంగా చర్మం ఆ కప్పులోకి లాగివేసినట్లుగా అవుతుంది. దాంతో చర్మం పైకి ఉబుకుతుంది. అప్పుడు ఆ ప్రాంతంలోని రక్తనాళాలూ విశాలం అవుతాయి. అయితే ఆధునిక కప్పింగ్ ప్రక్రియలో కాల్చడం వంటివి చేయకుండా రబ్బర్ పంప్‌ను ఉపయోగించడం ద్వారా కప్ ఉన్న ప్రదేశంలో వాక్యుమ్ను క్రియేట్ చేస్తున్నారు. ఇలా కప్‌ను ఉన్న ప్రదేశాన్ని పదే పదే మార్చడం ద్వారా మసాజ్ జరిగినట్లుగా కప్పింగ్ చేస్తుంటారు. ఇది డ్రై కపింగ్లో అనుసరించే పద్ధతి.ఇక వెట్ కప్పింగ్‌లో ఇదే ప్రక్రియ అనుసరిస్తారుగానీ... ఆ తర్వాత ఉబికిన చర్మంపై నుంచి చిన్న స్కాల్పెల్ సహాయంతో గాటు పెట్టి ఒకటి రెండు రక్తనాళాల ద్వారా కాస్త రక్తం పైకి ఉబికేలా చేస్తారు. పని చేస్తుందన్న దాఖలాలేమీ లేవు... కప్పింగ్ ప్రక్రియకు శాస్త్రబద్ధమైన తార్కాణాలు ఏమీ లేవు. ఇది సంప్రదాయ చికిత్స ప్రక్రియలకు ఒక ప్రత్యామ్నాయం మాత్రమేగానీ... దీనితో ఒనగూరే ప్రయోజనాలు ప్రత్యేకంగా లేవు. 2012లో పీఎల్ఓఎస్ అనే హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన అంశాల ప్రకారం... ఇది ఆక్యుపంక్చర్లాంటి ఒక ప్రత్యామ్నాయ వైద్య చికిత్స ప్రక్రియ. అయితే బ్రిటిష్ కప్పింగ్ సొసైటీ మాత్రం ఈ కింది జబ్బుల్లో ఈ ప్రక్రియ సమర్థంగా పనిచేస్తోందని చెబుతోంది. వాటిలో కొన్ని... ►ఆర్థరైటిస్, ఫైబ్రోమయాల్జియా వంటి రుమాటిక్ డిజార్డర్స్ ►మొటిమల వంటి చర్మ సంబంధిత సమస్యలు అధిక రక్తపోటు సైడ్ ఎఫెక్ట్స్: శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్ నిర్వహిస్తే ఇది సురక్షితమైన ప్రక్రియేగానీ... కొన్ని సైడ్ఎఫెక్ట్స్ కనిపించినప్పుడు మాత్రం దీన్ని కొనసాగించకూడదు. అవి.. చికిత్స ప్రక్రియ నిర్వహించే సమయంలో ఇబ్బంది (డిస్కంఫర్ట్) చర్మం కాలడం చర్మంపై గాయాలు కావడం చర్మానికి ఇన్ఫెక్షన్లు ముందుగా ఆ నిపుణులను అడగాల్సినవి... ►కప్పింగ్ ప్రక్రియలో వారు అనుసరించే విధానం ఏమిటి? వారికి ఉన్న శిక్షణ ►వారు ఎంతకాలంగా ఈ ప్రక్రియను అనుసరిస్తున్నారు. (అనుభవం) ►ఇంతకుముందు తనకు ఉన్న సమస్యలకు ఆ ప్రక్రియ ద్వారా ఒనగూరిన మేలు. ►ఇతర ప్రక్రియలతో పోలిస్తే కప్పింగ్ వల్ల ఆ సమస్యకు కలిగే ఉపశమనం. ఇదో నమ్మకం మాత్రమే... ఇలా కప్పింగ్ చేయడం ద్వారా ఒంట్లోని కాలుష్యాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. కొంతమంది ‘నీడిల్ కప్పింగ్’ చేస్తుంటారు. అంటే ఈ ప్రక్రియలో ఆక్యుపంక్చర్‌ను కూడా కప్పింగ్కు తోడు ఉపయోగిస్తుంటారు.