ఆస్తమా... ఉంటే ఏంటి? | sakshi health tips | Sakshi
Sakshi News home page

ఆస్తమా... ఉంటే ఏంటి?

Published Wed, Dec 28 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM

ఆస్తమా... ఉంటే ఏంటి?

ఆస్తమా... ఉంటే ఏంటి?

ప్రతిభకు... ఆస్తమా అడ్డంకి కాదు.పాటవానికి...అది ప్రతిబంధకం కాదు.సామర్థ్యానికి మోకాలడ్డదు.చిన్నప్పుడు వస్తేతగ్గే అవకాశాలు ఎక్కువ.పెద్దయ్యాక వచ్చినానియంత్రణలో ఉంచుకుంటేప్రాబ్లం ఉండదు.కాబట్టి... ఉంటే ఏంటి?అని ధీమాగా అనుకుంటే...నిశ్చింతగా ఎదుర్కోవచ్చు.నిర్భయంగా ఉండిపోవచ్చు.ఒకవేళ ‘ఉంటే ఏంటి?’అని సమాచారంతెలుసుకోవాలనుకుంటేఈ కథనం చదవండి. అవగాహన పెంచుకోండి.

ఆస్తమా ఊపిరితిత్తులకు ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు, మంట) కలిగించే వ్యాధి. ఇది దీర్ఘకాలికంగా బాధిస్తుంది. ఆస్తమాను అర్థం చేసుకోవాలంటే మన ఊపిరితిత్తుల్లోని వాయునాళాల పనితీరును అవగతం చేసుకోవాలి. మన ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకెళ్లి, మళ్లీ బయటకు వదలడానికి అనేక నాళాలు ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్‌ కారణంగా అవి ఉబ్బుతాయి. సెన్సిటివ్‌గా మారిపోతాయి. అంటే ఉదాహరణకు చర్మంపై మనం ముట్టుకుందామంటే ముట్టనివ్వని విధంగా మారడం అన్నమాట. దాంతో ఊపిరితిత్తులకు దారితీసే నాళాల కండరాలు బిగుసుకుపోతాయి. ఫలితంగా శ్వాస మార్గం మూసుకుపోయినట్లుగా అవుతుంది. ఫలితంగా గాలి గొట్టాల మార్గం మరింత సన్నబడుతుంది. దీని వల్ల కూడా ఊపిరి అందదు. మనకు సరిపడని వాటిని పీల్చుకున్నప్పుడు మన వాయునాళాలు తీవ్రంగా ప్రతిస్పందించడం వల్ల ఇలా జరుగుతుంది. దాంతో వాయునాళాలు ఉబ్బడంతో పాటు దాని లోపల కాస్త జిగురుగా ఉండే మ్యూకస్‌ అనే పదార్థం స్రవిస్తుంది. అది గాలి మార్గాన్ని మరింతగా మూసేస్తుంది. దాంతో గాలి పీల్చడమూ, వదలడమూ కష్టమవుతుంది.

వేర్వేరు దేశాల్లో... వేర్వేరు విస్తృతితో...
వేర్వేరు దేశాల్లో ఆస్తమా విస్తృతి భిన్నంగా ఉంది. దిగువ స్థాయి ఆదాయ వర్గాలు, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆస్తమా విస్తృతితో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. అయితే ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది కాస్త నిలకడగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 33.4 కోట్ల మంది ఆస్తమా బాధితులు ఉండగా దాదాపు ఏటా 2,50,000 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తమా బాధితుల్లో పదోవంతు మంది మనదేశంలోనే ఉన్నారు. ఇది ఏ వయసు వారిలోనైనా వస్తుంది. అయితే సాధారణంగా ఇది బాల్యంలోనే  మొదలవుతుంది. దీని తీవ్రతను పరిశీలించిన దాదాపు 15 అధ్యయనాలలోని విశ్లేషణల ఆధారంగా ప్రపంచంలోని పిల్లల్లో 14 శాతం మందికి ఆస్తమా లక్షణాలు కనిపిస్తున్నాయి. మన దేశంలోని 5 – 11 ఏళ్ల పిల్లల్లో 10% నుంచి 15% మంది చిన్నారులు ఆస్తమా కనిపిస్తోంది.

పిల్లల్లో ఆస్తమా
చిన్న పిల్లల్లో సాధారణంగా ఐదేళ్ల తర్వాత ఆస్తమా లక్షణాలు బయట పడతాయి. అయితే చాలా చిన్నపిల్లల్లో అటు తల్లితండ్రులకు, ఇటు డాక్టర్లకు కూడా ఆస్తమా వస్తే దాన్ని గుర్తించడం ఒకింత కష్టం అవుతుంది. ఎందుకంటే ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే బ్రాంకియల్‌ ట్యూబులు చిన్నపిల్లల్లో అసలే చాలా సన్నగా, చిన్నగా ఉంటాయి. ఇక పడిశం, జలుబు లాంటి వాటితో ఆ మార్గాలు మామూలుగానే ఇన్‌ఫ్లమేషన్‌కు గురవుతాయి. దాంతో అవి మరింత సన్నగా మారతాయి. అందువల్ల అది ఆస్తమా వల్ల కలిగిన పరిణామమా, లేక పడిశం, జలుబు తాలూకు లక్షణాలా అన్నది గుర్తించడం కష్టమవుతుంది.

కారణాలు / నివారణ
ఆస్తమాకు మూలకారణం ఇంకా పూర్తిగా తెలియదు. జన్యుపరమైన కారణాలతో పాటు వాతావరణం ఇది వచ్చేందుకు దోహదం చేస్తుందని స్పష్టమైంది. మనం శ్వాసించే సమయంలో ఏదైనా సరిపడనిది (దీన్ని అలర్జెన్‌ అని పిలుస్తారు) మన ఊపిరితిత్తుల మార్గంలోకి ప్రవేశిస్తే అది అలర్జిక్‌ ప్రతిచర్యకు కారణమవుతుంది. ఇలా అలర్జిక్‌ ప్రతిచర్యకు దోహదపడే అంశాల్లో కొన్ని...

గదుల్లో ఉండే ఇండోర్‌ అలర్జెన్స్‌ (ఉదాహరణకు పక్కబట్టల్లో, కార్పెట్స్‌లో, ఇరుగ్గా ఉండే ఫర్నిచర్‌లో ఉండే డస్ట్‌మైట్స్, కాలుష్యంలో పుష్కలంగా ఉండే దుమ్ముధూళి కణాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు.

ఆరుబయట ఉండే అలర్జెన్స్‌: (ఉదాహరణకు పుప్పొడి, గాలితో పాటు విస్తరించే బూజు వంటి పదార్థాలు).

పొగాకు పొగ

రసాయనాలు, వాటి వాసన, ఘాటైన స్ప్రేలు కొందరిలో కారణం కావచ్చు.

వాయు కాలుష్యం... ఇవేగాక ఇంకా చాలా అంశాలు ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అవి... చలిగాలి, చాలా ఎక్కువగా చేసే వ్యాయామాలు. కొన్నిసార్లు కొన్ని మందులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. ఉదాహరణకు ఆస్పిరిన్, నొప్పి నివారణకు వాడే నాన్‌–స్టెరాయిడ్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌. ఇటీవల నగరీకరణకు దోహదపడే అనేక అంశాలు ఆస్తమాను కలిగిస్తున్నట్లు తేలింది.
కారణాలకు దూరంగా ఉంటే నివారణ కూడా  సాధ్యమవుతుంది. అలర్జెన్స్‌కూ, ట్రిగర్స్‌కూ దూరంగా ఉండటమే నివారణ. నివారించడం అంటే జబ్బుకు దూరంగా ఉండటమే. అంటే ఇంచుమించు జబ్బు లేకుండా ఉండటమే.

లక్షణాలు
దగ్గు ... ప్రధానంగా రాత్రివేళల్లో ఎక్కువగా ఉంటుంది. శరీరానికి శ్రమకలిగే వ్యాయామం లేదా నవ్వడం, ఏడ్వటం, పరుగెత్తడం వంటివి చేస్తే ఈ దగ్గు మరింతగా పెరుగుతుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఛాతీ పట్టేసినట్లుగా బిగుతుగా మారడం
ఊపిరి హాయిగా అందకపోవడం
►  పిల్లికూతలు (శ్వాస తీసుకునే సమయంలో... అందునా మరీ ముఖ్యంగా గాలి వదిలే సమయంలో సన్నటి పిల్లికూతలు వినిపిస్తుంటాయి).
కొందరిలో ఆస్తమా వచ్చినప్పుడు ఒళ్లు (చర్మం) కూడా ఎర్రబారి పొడిగా మారుతుంది. మరికొందరిలో ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, గురక వంటి లక్షణాలు కనిపించవచ్చు.
పిల్లల్లో పైన పేర్కొన్న లక్షణాల్లో ఏదో ఒకటి గాని లేదా కొన్ని లక్షణాలు కలగలిసి గాని కనిపించవచ్చు. ఇలా లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని జలుబు లేదా బ్రాంకైటిస్‌ కావచ్చని అనుకుంటాం. అయితే అవే లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే అప్పుడు అది ఆస్తమా కావచ్చని అనుమానించాలి. ఆ పిల్లలకు ఆస్తమాను ప్రేరేపించే అంశం (ట్రిVýæ్గరింగ్‌ ఫ్యాక్టర్‌) ఏదైనా ఎదురైతే వెంటనే వారి పరిస్థితి మరింత దుర్భరమవుతుంది. వెంటనే ఆస్తమా లక్షణాలు మొదలైపోతాయి. పొగ, ఘాటైన వాసనలు, పుప్పొడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, డస్ట్‌మైట్స్‌... ఇవి సోకీ సోకగానే ఆస్తమాను ప్రేరేపిస్తాయి.

చికిత్స
చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే వారు పెరిగే కొద్దీ... అంటే టీన్స్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడుగానీ లేదా యుక్తవయస్కులుగా మారుతున్నప్పుడుగానీ ఆ ఆస్తమా లక్షణాలు క్రమంగా తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ లక్షణాలు  కొంతకాలం తర్వాత మళ్లీ వ్యక్తం కావచ్చు. ఇక చిన్నప్పుడు మరీ తీవ్రమైన ఆస్తమా ఉన్న పిల్లల్లో అది పెద్దయ్యాక కూడా తగ్గకపోవచ్చు.

ఆస్తమాకు రెండు రకాల చికిత్స అవసరమవుతుంది. అది...
►  దీర్ఘకాలంలో మళ్లీ రాకుండా నివారించేందుకు అవసరమైన ప్రివెంటివ్‌ చికిత్స.  వాయునాళాల ఇన్‌ఫ్లమేషన్‌ నివారణకు ఈ మందులను వాడాలి. దాదాపు వీటిని ప్రతిరోజూ తీసుకోవాల్సి ఉంటుంది.

తక్షణ ఉపశమనం కోసం తీసుకోవాల్సిన చికిత్స: ఆస్తమా వచ్చినప్పుడు వాయునాళాల వాపు తగ్గించి, హాయిగా శ్వాస తీసుకోవడాని దోహదపడేందుకు ఉపయోగించే మందులు వాడాల్సి ఉంటుంది. వీటినే రెస్క్యూ మెడికేషన్‌ అనీ, క్విక్‌ రిలీఫ్‌ మెడికేషన్‌ అని కూడా అంటారు. ఇది ఆస్తమా అటాక్‌ ఉన్నప్పుడు చేసే స్వల్పకాలిక చికిత్స. కొందరు పిల్లల్లో ఆటలు లేదా వ్యాయామానికి ముందు కూడా ఈ చికిత్సను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు.

మూడేళ్ల లోపు పిల్లలకు ఇన్‌హేలర్స్‌తో చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు మందు వృథా కాకుండా ఉండటంతో పాటు... ఆ మందు పిల్లల ఊపిరితిత్తుల్లోకి సమర్థంగా వెళ్లడానికి స్పేసర్‌ డివైజ్‌ విత్‌ మాస్క్‌ విధిగా ఉపయోగించాలి. ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల్లో స్పేసర్‌తో ఇన్‌హేలర్‌ ఉపయోగించాలి.

  కేవలం మందులు ఇవ్వడం లేదా చికిత్స మాత్రమే ఆస్తమాను నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడదు. దాంతోపాటు ఆస్తమాను ప్రేరేపించే అంశాలకు రోగిని దూరంగా ఉంచడం, తమకు ఆస్తమాను ప్రేరేపించే అంశాలేమిటో క్రమంగా గుర్తుపట్టి, వాటినుంచి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రతిస్తూ ఉండటం వంటి అంశాలెన్నో కలగలిస్తేనే ఆస్తమా నియంత్రణలో ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ఆస్తమా – సెలబ్రిటీ బాధితుల్లో... కొందరు ప్రముఖులు
అమెరికా మాజీ అధ్యక్షులు జాన్‌ ఎఫ్‌ కెనడీ,  ప్రముఖ హాలీవుడ్‌ నటి ఎలిజబెత్‌ టేలర్, షరాన్‌స్టోన్, ప్రముఖ రచయిత చార్లెస్‌ డికెన్స్, దక్షిణ అమెరికా విప్లవయోధుడు చేగువేరా వంటి ప్రముఖులు ఆస్తమాతో బాధపడ్డవారిలో ఉన్నారు. బాలివుడ్‌ దిగ్గజం రాజ్‌కపూర్‌నూ ఆస్తమా బాధించింది. జెరోమ్‌ బెట్టిస్‌ అనే  ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు ఆస్తమాతో బాధపడ్డవాడే. అలాగే నాన్సీ హాగ్‌షెడ్‌ ఆస్తమా ఉన్నప్పటికీ స్విమ్మింగ్‌లో ఒలింపిక్‌లో 3 బంగారు పతకాలు సాధించింది. అయితే వారి ప్రఖ్యాతికీ, ప్రతిభకూ అది ఎప్పుడూ ప్రతిబంధకం కాలేదు.

ఆస్తమా – ఆహారం
ఆస్తమా ఉందా? ఇలా తినండి!


కిస్‌మిస్, వాల్‌నట్స్‌ వంటి డ్రై ఫ్రూట్స్, బొప్పాయి, ఆపిల్‌ వంటి తాజా పండ్లు, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి కాయ, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్‌ ‘సి, ఈ, బీటా కెరోటిన్‌’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్‌ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
బ్రేక్‌ఫాస్ట్‌లో... పండ్లు, తేనె, కిస్‌మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో... క్యారట్, బీట్‌రూట్, తాజా కాయగూరలు తీసుకోవాలి.

వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్‌ ఆయిల్, బాదం– సోయా గింజలు, కొవ్వు తీసిన పాలు.

 ►ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాలు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి.

ఇలా కూడా తీసుకోవచ్చు...
 ►  పాలలో పసుపు కలుపుకొని తాగడం, ఒక స్పూన్‌ పసుపులో అంతే మోతాదులో తేనె కలిపి పరగడుపున తీసుకుంటే సమస్య ఉపశమనంతో పాటు నివారణకు కూడా దోహదం చేస్తుంది.
 
పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్‌డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు... ఇవి ఆస్తమా  సమస్యను తీవ్రతరం చేస్తాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో కొన్ని పాక్షికంగా మాత్రమే నిజం. వీటిలో ఫలానా ఆహారం నిర్దిష్టంగా అలర్జీని కలిగించి ఆస్తమాను ప్రేరేపిస్తుందనీ, అదే ట్రిగర్‌ అనీ తెలిస్తేనే దాన్ని మానేయాలి.  కమలాలు, నిమ్మ, బత్తాయి లాంటివి ‘సి’ విటమిన్‌ను అందించి, వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయి. నిర్దిష్టంగా ఆ ఆహారం అలర్జీని కలిగిస్తుందని అనుకున్నప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రతించి, అది కచ్చితంగా అలర్జీని కలిగిస్తుందనే నిర్ధారణ పరీక్షను చేయించాకే... ఆ ఆహారం నుంచి దూరంగా ఉండాలి. అపోహతోనే దూరంగా ఉంటే కొన్ని పోషకాలనుంచి దూరమైనట్లే.
 
ఇక బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే, అది భవిష్యత్తులో ఆస్తమా నుంచి రక్షణ ఇస్తుంది. ఇవి ఆస్తమాను పెంచుతాయి...
ఉప్పు తగ్గించాలి.
 
రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారం, బ్రెడ్‌ వంటివి  మానేయాలి.

ఆస్తమా – నిర్ధారణ
నిర్ధారించడం అంత ఈజీ కాదు

ఆస్తమా నిర్ధారణ చాలా కష్టమైన ప్రక్రియ. లక్షణాలతో పాటు... అవి ఎంత వ్యవధిలో మళ్లీ మళ్లీ వస్తున్నాయనే అంశం ఆధారంగా ఆస్తమాను అనుమానిస్తారు. దాంతో నిర్ధారణ కోసం కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా బాల్యంలోని వచ్చే మరికొన్ని సమస్యల లక్షణాలూ ఆస్తమా లక్షణాలతో కలగలసి పోతాయి. దాంతో సదరు లక్షణాలు నిర్దిష్టంగా ఆస్తమా వల్లనే కనిపిస్తున్నాయా, లేక ఇతర మరికొన్ని ఆరోగ్య సమస్యల వల్లనా అని నిర్ధారణ చేయడం కష్టమవుతుంది. ఉదాహరణకు ఆస్తమా లాంటి లక్షణాలే కనబరిచే మరికొన్ని కండిషన్లు.... ∙ రైనైటిస్‌ ∙ సైనసైటిస్‌ ∙ఆసిడ్‌ రిఫ్లక్స్‌ లేదా గ్యాస్ట్రో ఈసోఫేజియల్‌ రిఫ్లక్స్‌ డిసీజ్‌ (జీఈఆర్‌డీ)

వాయునాళాలలో ఏమైనా తేడాలు (ఎయిర్‌ వే అబ్‌నార్మాలిటీస్‌)
స్వరపేటిక సరిగా పనిచేయకపోవడం (వోకల్‌ కార్డ్‌ డిస్‌ఫంక్షన్‌)
బ్రాంకైటిస్‌ వంటి శ్వాసమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్లు
రెస్పిరేటరీ సింటాక్టికల్‌ వైరస్‌ (ఆర్‌ఎస్‌వి)
ఆస్తమా నిర్ధారణ ఇంత సంక్లిష్టం కాబట్టే డాక్టర్లు చిన్నారి లక్షణాలను నిశితంగా పరిశీలించడంతో పాటు కొన్ని వైద్య పరీక్షలూ చేయిస్తారు. అవి...
 ► ఐదేళ్లు లేదా అంతకంటే పైబడిన వయసు పిల్లల విషయానికి వస్తే పెద్దవాళ్లలోనూ నిర్ధారణ చేసేందుకు నిర్వహించే లంగ్‌ ఫంక్షన్‌ పరీక్షలు (స్రైరోమెట్రీ) వంటివి చేస్తారు. ఇందులో పిల్లలు ఎంత సమర్థంగా గాలిని బయటకు వదలగలరో చూస్తారు. సాధారణ స్థితితో ఈ పరీక్ష చేయడంతో పాటు, కాస్త వ్యాయామం తర్వాత, అటుపైన కొంత ఆస్తమా మందు ఇచ్చాక ఆ పరీక్షల్లో కనిపించే తేడాలను సునిశితంగా గమనించాకే ఆస్తమా నిర్ధారణ చేస్తారు.

 ►ఇక ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో లంగ్‌ ఫంక్షన్‌ పరీక్షతో ఆస్తమా నిర్ధారణ ఒకింత కష్టం. దాంతోపాటు రోగి చెప్పేవి, తల్లితండ్రులు గమనించే అనేక లక్షణాల ఆధారంగా ఆస్తమాను నిర్ధారణ చేస్తారు. ఇంత చిన్న పిల్లల్లో ఆస్తమాను నిర్ధారణ చేయాలంటే కొన్ని సందర్భాల్లో కొన్ని నెలలు కూడా పట్టవచ్చు.

అలర్జిక్‌ ఆస్తమా కోసం చేసే కొన్ని అలర్జీ పరీక్షలు :
కొన్ని ట్రిVýæ్గరింగ్‌ అంశాలతో పిల్లల్లో ఆస్తమా వెంటనే కనిపిస్తుంటే.. అలాంటి పిల్లల్లో డాక్టర్లు అలర్జీ స్కిన్‌ టెస్ట్‌ చేయిస్తారు. అలర్జీ వల్ల కలిగే ఆస్తమా విషయంలో ఇది మొదటి ప్రాధాన్య పరీక్ష (గోల్డ్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌). ఇందులో ఏదైనా అలర్జీ కలిగించే పదార్థాన్ని (అంటే జంతువుల వెంట్రుకలో లేదా బూజునో) ఉపయోగించి చర్మంలోని కొంత భాగాన్ని సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఏదైనా అలర్జిక్‌ ప్రతిక్రియ (రియాక్షన్‌) జరుగుతుందేమోనని గమనిస్తారు. ఇది చాలా సంక్షిప్తంగా, వేగంగా జరిగిపోయే నిర్దిష్టమైన పరీక్ష. కొన్నిసార్లు చర్మంపై లక్షణాలు కనిపిస్తూ ఉండేవారికి, యాంటీ హిస్టమైన్‌ మందులు తీసుకునే వారికి అలర్జీ బ్లడ్‌ టెస్ట్‌ల వల్ల ఉపయోగం ఉంటుంది. అయితే కొంతమందికి ఆహారం కారణంగా అలర్జీ వచ్చి ఆస్తమా కనిపించవచ్చు. అలాంటప్పుడు ఏయే రోగులకు ఏయే ఆహారం వల్ల అలర్జీ కలుగుతుందని తెలుసుకోవడం చాలా కష్టమైన పని. అది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది.కొన్ని సందర్భాల్లో డాక్టర్లు మరింత సూక్ష్మస్థాయి పరీక్షలనూ ఆశ్రయించాల్సి రావచ్చు.

డా. అపర్ణా రెడ్డి
పీడియాట్రిక్‌ పల్మనాలజిస్ట్,
రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌
హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement