మందులు వాడకుండానే బీపీ, షుగర్ అదుపులోకి వస్తాయా?
హోమియో కౌన్సెలింగ్
మా అమ్మగారి వయసు 65 సంవత్సరాలు. ఆమె గత కొద్దికాలంగా విపరీతంగా తుమ్ములు, జలుబు, ఆయాసంతో సరిగా ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. డాక్టర్‌కు చూపిస్తే ఆస్తమా అయి ఉండవచ్చన్నారు. ఈ వయసు వారిలో కూడా ఆస్తమా వస్తుందా? ఒకవేళ ఆమెకు ఆస్తమానే అయితే దానికి హోమియోలో మందులున్నాయా? దయచేసి సలహా చెప్పగలరు.
- డి.ఎల్.అనూరాధ, కొత్తగూడెం
దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యకే ఆస్తమా అని పేరు. ఊపిరితిత్తులలో గాలి పోయే మార్గానికి అడ్డంకులు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. శ్వాసకోశ మార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకుపోవడం వల్ల ఆస్తమా వస్తుంది.
కారణాలు: చల్లటి వాతావరణం, దుమ్ము, ధూళి, పొగ, ఫంగస్, వాతావరణ కాలుష్యం, వైరల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, పెంపుడు జంతువులు, రసాయనాలు, ఘాటు వాసనలు.
ఎలా వస్తుందంటే..? ఆస్తమా వ్యాధి ప్రధానంగా అలర్జీకి సంబంధించింది. కొంతమందిలో ఇది వంశపారంపర్యంగా కూడా సంక్రమించవచ్చు. కొంతమందిలో వ్యాధినిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి సరిపడని యాంటీజెన్‌లు శరీరంలోనికి ప్రవేశించినప్పుడు ఈ యాంటీబాడీలు వాటితో పోరాటం చేసి శరీరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో కణాల నుండి వెలువడే రసాయనాల వల్ల శ్వాసనాళాల్లోకి శ్లేష్మం చేరుతుంది. దాంతో శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది.
లక్షణాలు: ఎడతెరపిలేని దగ్గు, పిల్లికూతలు, ఆయాసం, జ్వరం. జలుబు, శ్వాస తీసుకోలేకపోవడం, మానసిక ఆందోళన.
నిర్ధారణ: వంశానుగత చరిత్ర, అలర్జీకి సంబంధించిన పరీక్షలు, ముక్కు, గొంతు, ఛాతీ పరీక్షలు, స్పైరోమెట్రీ, ఛాతీ ఎక్స్‌రే.
జాగ్రత్తలు: రోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, ఎక్కువ శారీరక శ్రమ లేకుండా చూసుకోవడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యానికి, ఒంటికి సరిపడని ఆహారానికి దూరంగా ఉండటం, చల్లని వాతావరణ ంలో తిరగకుండా ఉండటం.
పాజిటివ్ హోమియో చికిత్స: ఆస్తమాకు హోమియోపతిలో చాలా మంచి మందులున్నాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి, శరీర తత్వాన్ని బట్టి నిపుణులైన వైద్యుని ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా ఆస్తమాను అదుపులో ఉంచుకోవచ్చు. మీరు వెంటనే మీ అమ్మగారిని మంచి హోమియోవైద్యుని దగ్గరకు తీసుకెళ్లండి.
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 44 ఏళ్లు. 110 కిలోల బరువు ఉంటాను. నాకు బీపీ, షుగర్ అదుపులోకి రావడం లేదు. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదు. బేరియాట్రిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గవచ్చని నా స్నేహితులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ నేను బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే, ఆ శస్త్రచికిత్స తర్వాత మందులు వాడకుండానే బీపీ, షుగర్‌లు అదుపులోకి వస్తాయా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపించగలరు.
- కె.ఎల్.ఎన్. రాజు, వరంగల్
మీరు మీ వయసు, బరువు తెలిపారు గానీ... మీ ఎత్తు తెలపలేదు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అనే ప్రమాణాలను బట్టి చూసినప్పుడు, మీ బరువు వల్ల మీకు హాని జరిగే అవకాశాలు ఎక్కువని తేలితే బేరియాట్రిక్ సర్జరీ నిర్వహిస్తాం. బేరియాట్రిక్ సర్జరీ అంటే కడుపుపై పెద్ద పెద్ద కోతలు పెట్టి ఆపరేషన్ చేస్తారని మీరు భయపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం అత్యాధునిక కీహోల్ విధానంలో తక్కువ కోతతో బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించవచ్చు. ఈ విధానం చాలా సురక్షితం. కీహోల్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేస్తే, రెండు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. సర్జరీ తర్వాత మీరు బరువు తగ్గడంతో పాటు, మీ బీపీ, షుగర్ కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మధుమేహం పూర్తిగా అదుపులోకి రాకపోయినా మందులు వాడటం చాలా వరకు తగ్గుతుంది. మీ బీఎంఐతో పాటు ఇతర ఆరోగ్యపరిస్థితులను బట్టి మీకు బేరియాట్రిక్ సర్జరీ అవసరమా, కాదా అని వైద్యులు నిర్ధారణ చేస్తారు. ఒకవేళ మీకు బేరియాట్రిక్ సర్జరీ తప్పనిసరి అయితే అత్యాధునిక సదుపాయాలు, నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్న ఆసుపత్రిలో మాత్రమే శస్త్రచికిత్స చేయించుకోండి.
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 68 ఏళ్లు. నాకు గత రెండేళ్లుగా మోకాళ్లలో నొప్పి ఉంది. ఇటీవల ఇది చాలా ఎక్కువైంది. ఇప్పుడు నడవడం కూడా కష్టమవుతోంది. ఒకవేళ మోకాలి మార్పిడి చికిత్స చేయించుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? తగిన సలహా ఇవ్వండి.
- మంజరి, వనపర్తి
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఆస్టియోఆర్థరైటిస్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమవుతూ పోతుంది. ముందుగా మీరు మీ దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి ఎక్స్-రే తీయించుకోండి. ఈ సమస్యకు తొలిదశలో నొప్పి నివారణ మందులు, కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అనే మందులు వాడతారు. ఫిజియోథెరపీ వ్యాయామాలూ సూచిస్తారు. అప్పటికీ నొప్పి తగ్గకపోతే మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ) అవసరమవుతుంది. మోకాలి మార్పిడి సర్జరీకి సుమారు 1.5 లక్షల రూపాయల నుంచి 1.8 లక్షల వరకు ఖర్చవుతుంది. మోకాలి కీలు మార్పిడి కోసం ఉపయోగించే మెటీరియల్ మీద ఖర్చు ఆధారపడి ఉంటుంది.
నా వయసు 29 ఏళ్లు. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నా కుడి మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. దాన్ని కొద్దిపాటి ఒత్తిడితో వంచినప్పుడు క్లిక్‌మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి.
- సోమరాజు, రాజోలు
మణికట్టులో 15 ఎముకలు ఉంటాయి. రిస్ట్ అనేది ఎన్నో లిగమెంట్లతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణం. కొన్ని చిన్న ఎముకలు విరిగినప్పుడు ఆ విషయమే మనకు తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మనం మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం సాధారణ ఎక్స్‌రేలో తెలియపోవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్‌రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లు సూచిస్తున్నాయి. మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా కావచ్చు. కాబట్టి ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్-రే పరీక్షలు చేయించుకోండి.
బేరియాట్రిక్ సర్జరీతో...
Published Tue, Nov 17 2015 10:57 PM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM
Advertisement
Advertisement