ఆస్తమా నియంత్రణతో హ్యాపీ ఊపిరి | Asthma Is More Common In Childrens In The Environment | Sakshi
Sakshi News home page

ఆస్తమా నియంత్రణతో హ్యాపీ ఊపిరి

Published Thu, Dec 12 2019 12:13 AM | Last Updated on Thu, Dec 12 2019 12:13 AM

Asthma Is More Common In Childrens In The Environment - Sakshi

చలికాలం వచ్చిందంటే చాలమంది చిన్నపిల్లలకు ఇబ్బంది. ఆ పిల్లల తల్లిదండ్రులకూ వణుకు. కారణం... ఈ వాతావరణంలో పిల్లల్లో ఆస్తమా మరింత పెచ్చరిల్లుతుంది. ఆస్తమా ఉన్నవారిలో ఊపిరితిత్తులకు ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు, మంట) వస్తుంది. అప్పుడప్పుడూ ఎటాక్‌ చేస్తూ ఇది దీర్ఘకాలికంగా బాధిస్తుంది. ఈ సీజన్‌లో మరిన్ని ఎక్కువసార్లు, మరింత తీవ్రతతో కనిపించేందుకు అవకాశాలెక్కువ. అలర్జీ కారణంగా వచ్చే ఆస్తమా... ఈ సీజన్‌లో అయితే సరిపడని వాతావరణంతోనూ వస్తుంది. ఆస్తమాపై అవగాహనకు, దానిని నియంత్రణలో ఉంచుకునేందుకే ఈ కథనం...

ఆస్తమాను అర్థం చేసుకోవాలంటే మన ఊపిరితిత్తుల్లోని వాయు నాళాల పనితీరును అవగతం చేసుకోవాలి. మన దేహానికి అవసరమైన ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల్లోకి  తీసుకెళ్లి, అక్కడి కాలుష్య కార్బన్‌ డై ఆక్సైడ్‌ను మళ్లీ బయటకు వదలడానికి అంచెలంచెలుగా అనేక నాళాలు ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు, మంట, ఎర్రబారడం) కారణంగా అవి ఉబ్బుతాయి. దాంతో సెన్సిటివ్‌గా మారిపోతాయి. ఉదాహరణకు చర్మంపై ఏదైనా గాయమైనప్పుడు అది ఎర్రబారి, వాచి, ముట్టుకుందామన్నా ముట్టనివ్వని విధంగా మారడాన్ని ఇన్‌ఫ్లమేషన్‌ అని చెప్పవచ్చు. ఇలా ఊపిరితిత్తుల్లోని నాళాల కండరాలు ఉబ్బడం వల్ల వాటి మధ్యభాగంలోని స్థలం సన్నబడిపోయి, శ్వాసమార్గాలు మూసుకు పోయినట్లుగా అవుతాయి.

ఫలితంగా ఆ నాళాల్లో గాలి ఫ్రీగా కదిలేందుకు సరిపడనంత స్థలం లేక శ్వాస సరిగా అందదు. దాంతో మనకు ఆస్తమా అటాక్‌ వస్తుందన్నమాట. ఏవైనా మనకు సరిపడని వాటిని తిన్నా, పీల్చుకున్నా మన వాయునాళాలు తీవ్రంగా ప్రతిస్పందించడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ సీజన్‌లో చల్లటి వాతావరణంలోని గాలిలో మంచు కారణంగా వాయునాళాలు ఉబ్బుతాయి. దాంతో పాటు వాయునాళాల్లో కాస్త జిగురుగా ఉండే మ్యూకస్‌ అనే పదార్థం స్రవిస్తుంది. అసలే నాళాలు సన్నబడి ఉండటంతో పాటు... ఈ మ్యూకస్‌ కూడా అడ్డుపడటం వల్ల వాయువులు కదిలే ప్రాంతం మరింత మూసుకుపోతుంది. ఫలితంగా గాలి పీల్చడమూ, వదలడమూ... అంటే మొత్తంగా శ్వాస తీసుకోవడమే చాలా కష్టమవుతుంది.

కారణాలు: ఆస్తమాకు ప్రధాన కారణం జన్యుపరమైనవని అనేక అధ్యయనాల్లో స్పష్టమైంది.  అయితే ఇటీవల జన్యుపరమైన కారణాలేమీ లేకుండానే ఇది వస్తోందంటూ కూడా మరికొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇక మనకు సరిపడని వాతావరణం దీన్ని ట్రిగ్గర్‌ చేస్తుందనేది చాలామందికి తెలిసిన విషయమే. మనం శ్వాసించే సమయంలో ఏదైనా మనకు సరిపడని పదార్థం (దీన్ని అలర్జెన్‌ అంటారు) మన ఊపిరితిత్తుల మార్గంలోకి ప్రవేశిస్తే అది అలర్జిక్‌ రియాక్షన్‌కు కారణమవుతుంది. ఇలా అలర్జిక్‌ రియాక్షన్‌ రావడానికి కారణమయ్యే అంశాల్లో ఇవి కొన్ని...

►గదుల్లోపల (ఇన్‌డోర్స్‌లో)ఉండే అలర్జెన్స్‌ (ఉదా... పక్కబట్టల్లో, కార్పెట్స్‌లో, ఇరుగ్గా ఉండే ఫర్నిచర్‌లో ఉండే డస్ట్‌మైట్స్, కాలుష్యంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉండే ధూళి కణాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు.

ఆరుబయట ఉండే అలర్జెన్స్‌: పుప్పొడి, బూజు వంటి పదార్థాలు.

►పొగాకు కాలినప్పుడు / మండినప్పుడు వచ్చే పొగ

►ఘాటైన రసాయనాలు, స్ప్రేలు.. వాటి తాలూకు ఘాటైన వాసనలు కొందరిలో ఆస్తమాకు కారణం కావచ్చు.

అలర్జిక్‌ ఆస్తమా కోసం చేసే కొన్ని అలర్జీ పరీక్షలు
కొన్ని ట్రిగరింగ్‌ అంశాల కారణంగా పిల్లల్లో ఆస్తమా కనిపిస్తుంటే... అలాంటి పిల్లల్లో డాక్టర్లు అలర్జీ స్కిన్‌ టెస్ట్‌ చేయిస్తారు. ఇందులో ఏదైనా అలర్జీ కలిగించే పదార్థాన్ని (అంటే జంతువుల వెంట్రుకలో లేదా బూజునో) ఉపయోగించి చర్మంలోని కొంత భాగాన్ని సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఏదైనా అలర్జిక్‌ రియాక్షన్‌  జరుగుతుందేమోనని గమనిస్తారు. కొన్నిసార్లు చర్మంపై లక్షణాలు కనిపిస్తూ ఉండేవారికి, యాంటీ హిస్టమైన్‌ మందులు తీసుకునే వారికి అలర్జీ బ్లడ్‌ టెస్ట్‌ల వల్ల ఉపయోగం ఉంటుంది. అయితే కొంతమందికి ఆహారం కారణంగా అలర్జీ వచ్చి ఆస్తమా కనిపించవచ్చు.

అలాంటప్పుడు ఏయే రోగులకు ఏయే ఆహారం వల్ల అలర్జీ కలుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టమైన పని. అది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. అందుకే పెద్దవారైతే తమకు తాము... పిల్లల విషయంలోనైతే తల్లిదండ్రులు... ఏయే పదార్థాలు తిన్న తర్వాత లక్షణాలు కనిపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఫలానా పదార్థాలతోనే ఆస్తమా లక్షణాలు బయటపడుతున్నాయని ఒకటి రెండుసార్లు గమనించాక తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఆయా పదార్థాలకు దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు మరింత సూక్ష్మస్థాయి పరీక్షలనూ ఆశ్రయించాల్సి రావచ్చు.

చికిత్స
సాధారణంగా చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే చాలామందిలో వారు పెరుగుతున్న కొద్దీ... అంటే టీన్స్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడుగానీ లేదా యుక్తవయస్కులుగా మారుతున్నప్పుడుగానీ ఆ ఆస్తమా లక్షణాలు క్రమంగా తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ లక్షణాలు కొంతకాలం తర్వాత మళ్లీ వ్యక్తం కావచ్చు. ఇక చిన్నప్పుడు మరీ తీవ్రమైన ఆస్తమా ఉన్న పిల్లల్లో పెద్దయ్యాక కూడా తగ్గకపోవచ్చు.

రెండు రకాల చికిత్స ...
►దీర్ఘకాలంలో మళ్లీ రాకుండా నివారించేందుకు అవసరమైన ప్రివెంటివ్‌ చికిత్స. వాయునాళాల ఇన్‌ఫ్లమేషన్‌ నివారణకు ఈ మందులను వాడాలి. వీటిని రోజూ తీసుకోవాలి.

తక్షణ ఉపశమనం కోసం: ఆస్తమా వచ్చినప్పుడు వాయునాళాల వాపు తగ్గించి, హాయిగా శ్వాస తీసుకోవడానికి దోహదపడేందుకు ఉపయోగించే మందులు వాడాలి. వీటినే రెస్క్యూ మెడికేషన్‌ అనీ, క్విక్‌ రిలీఫ్‌ మెడికేషన్‌ అనీ అంటారు. ఇది ఆస్తమా అటాక్‌ ఉన్నప్పుడు చేసే స్వల్పకాలిక చికిత్స. కొందరు పిల్లల్లో ఆటలు లేదా వ్యాయామానికి ముందు కూడా ఈ చికిత్సను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు.

►మూడేళ్ల లోపు పిల్లలకు ఇన్‌హేలర్స్‌తో చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ఆ మందు పిల్లల ఊపిరితిత్తుల్లోకి సమర్థంగా వెళ్లడానికి స్పేసర్‌ డివైజ్‌ విత్‌ మాస్క్‌ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇందువల్ల మందు వృథా కాకుండా ఉంటుంది. ఇక ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల్లో స్పేసర్‌తో ఇన్‌హేలర్‌ ఉపయోగించాలి.

►ఇప్పుడు ఆస్తమాకు ఇమ్యూనోథెరపీ చికిత్స  కూడా అందుబాటులో ఉంది. చివరగా... కేవలం కొన్నాళ్లు మందులు వాడటం లేదా చికిత్స తీసుకోవడంతో మాత్రమే ఆస్తమా తగ్గిపోదు. దీన్ని అనుక్షణం నియంత్రణలో ఉంచడం అవసరం. అందుకే పిల్లలకు ఆస్తమా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆ విషయాన్ని అంగీకరించి, దీర్ఘకాలం పాటు చికిత్సకు సిద్ధపడాలి. ఆస్తమాను ప్రేరేపించే అంశాలకు రోగిని దూరంగా ఉంచడం, తమకు ఆస్తమాను ప్రేరేపించే అంశాలేమిటో క్రమంగా గుర్తించి, వాటినుంచి ఎల్లప్పుడూ దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండటం చేస్తుండాలి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆస్తమా నివారణ, నియంత్రణ చాలా సులభమే. అందుకే ఆందోళనకు గురికాకుండా తమ డాక్టర్‌తో నిత్యం ఫాలోఅప్‌లో ఉండాలి.

ఆస్తమా లక్షణాలు

►దగ్గు, ఆయాసం... ప్రధానంగా రాత్రివేళల్లో ఎక్కువగా ఉంటుంది. శరీరానికి శ్రమకలిగే వ్యాయామం చేడం లేదా గట్టిగా నవ్వడం, ఏడ్వటం, పరుగెత్తడం వంటివి చేస్తే ఈ దగ్గు, ఆయాసాలు మరింతగా పెరుగుతాయి.
►శ్వాస తీసుకోవడంలో చాలా  ఇబ్బంది
►ఛాతీ బిగుతుగా పట్టేసినట్లుగా ఉండటం
►హాయిగా ఊపిరి అందకపోవడం, సాఫీగా ఊపిరాడకపోవడం
►పిల్లికూతలు (శ్వాస తీసుకునే సమయంలో... అందునా మరీ ముఖ్యంగా గాలి వదిలే సమయంలో సన్నటి పిల్లికూతలు వినిపిస్తుంటాయి).
►కొందరిలో ఆస్తమా వచ్చినప్పుడు ఒళ్లు (చర్మం) కూడా ఎర్రబారి పొడిగా మారుతుంది. మరికొందరిలో ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, గురక వంటి లక్షణాలు కనిపించవచ్చు. పిల్లల్లో పైన పేర్కొన్న లక్షణాల్లో ఏదో ఒకటిగాని లేదా కొన్ని లక్షణాలు కలగలిసి గాని కనిపించవచ్చు. ఇలా లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని జలుబు లేదా బ్రాంకైటిస్‌ కావచ్చని అనుకుంటాం. అయితే అవే లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే అప్పుడు అది ఆస్తమా కావచ్చని అనుమానించాలి. ఆ పిల్లలకు ఆస్తమాను ప్రేరేపించే అంశం (ట్రిగరింగ్‌ ఫ్యాక్టర్‌) ఏదైనా ఎదురైతే వారి పరిస్థితి మరింత దుర్భరమవుతుంది. వెంటనే ఆస్తమా లక్షణాలు మొదలైపోతాయి. పొగ, ఘాటైన వాసనలు, పుప్పొడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, డస్ట్‌మైట్స్‌... ఇవి సోకీ సోకగానే ఆస్తమాను తక్షణం ప్రేరేపిస్తాయి.

నిర్ధారణ
ఆస్తమా నిర్ధారణ కాస్తంత కష్టమైన ప్రక్రియ. లక్షణాలతో పాటు... అవి ఎంత వ్యవధిలో మళ్లీ మళ్లీ వస్తున్నాయనే అంశం ఆధారంగా అది ఆస్తమా కావచ్చేమోనని  అనుమానిస్తారు. దాంతో నిర్ధారణ కోసం కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా బాల్యంలో వచ్చే మరికొన్ని సమస్యల లక్షణాలూ ఆస్తమా లక్షణాలతో కలగలసి ఉంటాయి. దాంతో ఆయా లక్షణాలు ఆస్తమా వల్లనే కనిపిస్తున్నాయా లేక ఇతర మరికొన్ని ఆరోగ్య సమస్యల వల్లనా అని నిర్ధారణ చేయడం కష్టమవుతుంది. ఉదాహరణకు ఆస్తమా లాంటి లక్షణాలే కనబరిచే మరికొన్ని కండిషన్లు....

►రైనైటిస్‌
►సైనసైటిస్‌
►ఆసిడ్‌ రిఫ్లక్స్‌ లేదా గ్యాస్ట్రో ఈసోఫేజియల్‌ రిఫ్లక్స్‌ డిసీజ్‌ (జీఈఆర్‌డీ)
►వాయునాళాలలో ఏమైనా తేడాలు (ఎయిర్‌ వే అబ్‌నార్మాలిటీస్‌)
►స్వరపేటిక సరిగా పనిచేయకపోవడం (వోకల్‌ కార్డ్‌ డిస్‌ఫంక్షన్‌)
►బ్రాంకైటిస్‌ వంటి శ్వాసమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్లు ఆస్తమా నిర్ధారణ ఇంత సంక్లిష్టం కాబట్టే డాక్టర్లు చిన్నారి లక్షణాలను నిశితంగా పరిశీలించడంతో పాటు కొన్ని వైద్య పరీక్షలూ చేయించాల్సి రావచ్చు. అవి...
►ఐదేళ్లు లేదా అంతకంటే పైబడిన వయసు పిల్లల విషయానికి వస్తే పెద్దవాళ్లలోనూ నిర్ధారణ చేసేందుకు నిర్వహించే లంగ్‌ ఫంక్షన్‌ పరీక్షలు (స్పైరోమెట్రీ) వంటివి చేస్తారు. ఇందులో పిల్లలు ఎంత సమర్థంగా గాలిని బయటకు వదలగలరో చూస్తారు. సాధారణ స్థితితో ఈ పరీక్ష చేయడంతో పాటు, కాస్త వ్యాయామం తర్వాత, అటుపైన కొంత ఆస్తమా మందు ఇచ్చాక ఆ పరీక్షల్లో కనిపించే తేడాలను సునిశితంగా గమనించాకే ఆస్తమా అని నిర్ధారణ చేస్తారు.
►ఇక మూడేళ్లు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో లంగ్‌ ఫంక్షన్‌ పరీక్షతో ఆస్తమా నిర్ధారణ ఒకింత కష్టం. దాంతోపాటు రోగి చెప్పేవి, తల్లిదండ్రులు గమనించే అనేక లక్షణాల ఆధారంగా ఆస్తమాను నిర్ధారణ చేస్తారు.  

పిల్లల్లో ఆస్తమా  
చిన్న పిల్లల్లో సాధారణంగా ఐదేళ్ల వయసు తర్వాత ఆస్తమా లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే అంతకంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో ఆస్తమాను గుర్తించడం అటు తల్లిదండ్రులకు, ఇటు డాక్టర్లకు కూడా ఒకింత కష్టమవుతుంది. చిననపిల్లల్లో ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే బ్రాంకియల్‌ ట్యూబులు మొదటే చాలా సన్నగా, చిన్నగా ఉంటాయి. ఇక జలుబు, పడిశం వంటి వాటి కారణంగా ఆ మార్గాలు మామూలుగానే ఇన్‌ఫ్లమేషన్‌కు గురవుతుంటాయి. దాంతో అవి మరింత సన్నగా మారతాయి. అందువల్ల అవి ఆస్తమా వల్ల సన్నబడ్డాయా లేక పడిశం, జలుబు తాలూకు లక్షణాలా అన్నది గుర్తించడం కొంత కష్టమవుతుంది.
డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్‌ పీడియాట్రీషియన్,
రోహన్‌ హాస్పిటల్స్, విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement