ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి భారత్‌కు వచ్చే ముందు తనని, తన చెల్లెలు షేక్ రెహానాను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు.
గతేడాది ఆగస్టు నెలలో ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చు కారణంగా అదుపు తప్పిన అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అవమానకర రీతిలో తన సోదరితో కలిసి దేశాన్ని వీడారు. అయితే, నాడు దేశాన్ని వీడే సమయంలో జరిగిన ఘటనను తాజాగా షేక్ హసీనా గుర్తు చేసుకున్నారు.
తన బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ ఫేస్‌బుక్ పేజీలో షేక్ హసీనా ఆడియో ప్రసంగాన్ని పోస్ట్ చేశారు. ఆ ఆడియో ప్రసంగంలో ‘రెహానా,నేను కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో మేం మరణం అంచునుంచి తప్పించుకున్నాము’ అని ఆడియో ప్రసంగంలో తెలిపారు.
ఆ ఆడియోలో తనను చంపేందుకు వివిధ సమయాల్లో కుట్రలు పన్నారని షేక్ హసీనా గుర్తు చేసుకున్నారు. అందుకు ఆగస్టు 21న జరిగిన హత్యల నుండి, కోటాలిపారాలో జరిగిన భారీ బాంబు నుండి బయటపడటమే నిదర్శనమన్నారు.
అల్లాయే లేకపోతే నేను ఇలా మీ ముందు మాట్లాడం సాధ్యమయ్యేది కాదు. కుట్రదారులు నన్ను ఎలా చంపాలని ప్లాన్ చేశారో మీరే చూశారు. అయితే, నేనింకా సజీవంగా ఉన్నానంటే అల్లా దయే. నేను నా దేశంలో ఎందుకు లేకపోయానా? అని ఇప్పటికీ బాధపడుతున్నాను.కట్టుబట్టలతో బంగ్లాదేశ్‌ను వీడాను’ అంటూ భావోద్వేగంగా కన్నీరు పెట్టుకున్నారు.
పలు మార్లు హత్యాయత్నం
షేక్ హసీనా పలు మార్లు హత్యహత్నం నుంచి తప్పించుకున్నారు. ఆగస్ట్ 21, 2004న బంగాబంధు అవెన్యూలో అప్పటి ప్రతిపక్ష నాయకురాలు షేక్ హసీనా నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ర్యాలీలో గ్రనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది మరణించారు. షేక్ హసీనాతో పాటు 500 మందికి పైగా గాయపడ్డారు. దీంతో పాటు పలు మార్లు హసీనాపై హత్యయత్నం జరగడంతో హసీనా భారీ మొత్తంలో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు.
👉ఇదీ చదవండి : ట్రంప్ ప్రమాణ స్వీకారం.. 40ఏళ్లలో ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment