అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదు: రోహిత్‌ శర్మ | Rohit Sharma Explains Reason Behind Dropping Siraj From CT 2025 Squad | Sakshi
Sakshi News home page

అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదు: రోహిత్‌ శర్మ

Published Sat, Jan 18 2025 5:06 PM | Last Updated on Sat, Jan 18 2025 6:14 PM

Rohit Sharma Explains Reason Behind Dropping Siraj From CT 2025 Squad

అభిమానుల నిరీక్షణకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎట్టకేలకు శనివారం తెరదించింది. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025తో పాటు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా(Champions Trophy India Squad)ను ప్రకటించింది. ఇక మెగా టోర్నీకి రోహిత్‌ శర్మ(Rohit Sharma) కెప్టెన్‌గా కొనసాగనుండగా.. శుబ్‌మన్‌ గిల్‌(Shubman Gill) అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు.

బుమ్రా గాయంపై రాని స్పష్టత
అంతేకాదు.. ఈ ఓపెనింగ్‌ జోడీకి బ్యాకప్‌గా యశస్వి జైస్వాల్‌ తొలిసారిగా వన్డే జట్టులోనూ చోటు సంపాదించుకున్నాడు. అయితే, ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయం గురించి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆఖరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా అతడు వెన్నునొప్పితో బాధపడిన విషయం తెలిసిందే.

అయితే, చాంపియన్స్‌ ట్రోఫీ నాటికి బుమ్రా అందుబాటులోకి వస్తాడని సెలక్టర్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని ఐసీసీ ఈవెంట్‌కు ఎంపిక చేశారు. కానీ హైదరాబాదీ స్టార్‌ మహ్మద్‌ సిరాజ్‌కు మాత్రం ఈ జట్టులో స్థానం దక్కలేదు.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో లీడింగ్‌ వికెట్‌(24 వికెట్లు) టేకర్‌గా నిలిచిన మహ్మద్‌ షమీతో పాటు అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో జట్టును ప్రకటిస్తున్న సందర్భంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు సిరాజ్‌ గురించి ప్రశ్న ఎదురైంది.

అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదు
ఇందుకు స్పందిస్తూ.. ‘‘బుమ్రా ఈ టోర్నీలో ఆడతాడా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు. కాబట్టి కొత్త బంతితో, పాత బంతితోనూ ఫలితాలు రాబట్టగల పేసర్ల వైపే మొగ్గుచూపాలని భావించాం. బుమ్రా మిస్సవుతాడని కచ్చితంగా చెప్పలేం.

కానీ ఏం జరిగినా అందుకు సిద్ధంగా ఉండాలి. అందుకే అర్ష్‌దీప్‌ సింగ్‌ను ఎంపిక చేసుకున్నాం. కొత్త బంతితో షమీ ఎలాంటి మ్యాజిక్‌ చేస్తాడో అందరికీ తెలుసు. అయితే, న్యూ బాల్‌ లేకపోతే సిరాజ్‌ తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేడు. అందుకే అతడిని ఎంపిక చేయలేదు’’ అని రోహిత్ శర్మ వివరించాడు.

సీమ్‌ ఆల్‌రౌండర్లు లేరు
ఇక చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండటం గురించి రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘దురదృష్టవశాత్తూ మనకు ఎక్కువగా సీమ్‌ ఆల్‌రౌండర్లు లేరు. కాబట్టి బ్యాటింగ్‌ ఆర్డర్‌ డెప్త్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నంతలో స్పిన్‌ ఆల్‌రౌండర్లనే ఎంపిక చేసుకున్నాం’’ అని తెలిపాడు.

కాగా స్పిన్‌ విభాగంలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ చోటు దక్కించుకున్నారు. మరోవైపు.. సీమ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు.. అతడికి బ్యాకప్‌గా ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌లో యువ సంచలనం, తెలుగు తేజం నితీశ్‌ కుమార్‌ రెడ్డికి చోటిచ్చారు.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి బీసీసీఐ ప్రకటించిన జట్టు
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌(వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా(ఫిట్‌నెస్‌ ఆధారంగా) మహ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, యశస్వి జైస్వాల్‌, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా.
ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: వరుణ్‌ చక్రవర్తి, ఆవేశ్‌ ఖాన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి

చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు ఇవే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement