అమెజాన్ అతలాకుతలం...
ఎండుతున్న ప్రధాన నదులు
బ్రెజిల్‌లో కనీవినీ ఎరగని కరువు
రికార్డు ఎండలు, కార్చిచ్చులు
వాతావరణ మార్పులే కారణం
ఎండి పగుళ్లిచ్చిన నేల. నీటిచుక్క ఆనవాలు కూడా లేని తీరాల్లో బారులు తీరిన బోట్లు. కొంతకాలంగా బ్రెజిల్‌లోని ప్రధాన నదులన్నింట్లోనూ కనిపిస్తున్న దృశ్యాలివి. ఒకవైపు రికార్డు స్థాయి ఎండలు. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు. వీటి దెబ్బకు ఈ సీజన్లో దాదాపుగా ప్రతి నదీ రికార్డు స్థాయిలో కుంచించుకుపోయింది. రాజధాని బ్రెజీలియాతో పాటు పలు ప్రధాన నగరాలు వరుసగా 140 రోజులుగా వాననీటి చుక్కకు కూడా నోచుకోని పరిస్థితి! దేశంలో 60 శాతానికి పైగా వరుసగా రెండో ఏడాది కరువు గుప్పెట్లో చిక్కింది. గతేడాదితో పోలిస్తే పరిస్థితులు పెనం నుంచి పొయ్యిలోకి చందంగా విషమిస్తున్నాయి. ఫలితంగా 1950 తర్వాత అతి పెద్ద కరువుతో బ్రెజిల్ అల్లాడుతోంది. దీన్నిప్పటికే జాతీయ విపత్తుగా ప్రకటించారు. అమెజాన్ వర్షారణ్యాలకు పుట్టిల్లయిన బ్రెజిల్‌లో ఈ అనూహ్య పరిస్థితి సైంటిస్టులను ఆందోళనపరుస్తోంది.
అయ్యో.. రియో...
అమెజాన్ ఉపనదుల్లో అతి పెద్దదైన రియో నెగ్రో అయితే ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది. నదిలో నీటిమట్టం కొద్ది నెలలుగా ఏకంగా రోజుకు ఏడంగుళాల చొప్పున తగ్గిపోతూ కలవరపెడుతోంది. దాంతో నలుపు రంగులో నిత్యం అలరించే అపార జలరాశి మాయమై ఏకంగా నదీగర్భమే బయటపడింది. రియో నిగ్రోలో కలిసే సొలిమెస్ నదిదీ ఇదే దుస్థితి. దాని నీటిమట్టం ఈ నెలలో రికార్డు స్థాయికి పడిపోయింది. ఈ రెండు నదులు కలిసిన మీదట అమెజాన్‌గా రూపొందుతాయి. వీటిలో నిత్యం తిరగాడే రవాణా నౌకలు కొంతకాలంగా నదీగర్భాల్లోని విస్తారమైన ఇసుకలో కూరుకుపోయి కని్పస్తున్నాయి.
సొలిమెస్ తీరాన ఉండే టెఫ్ సరస్సులో కూడా నీళ్లు దాదాపుగా నిండుకున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఈ సరస్సు ఊహాతీతంగా చిక్కిపోయిన తీరు పర్యావరణ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. గతేడాది రికార్డు ఎండలు, కనీవినీ ఎరగని కరువు దెబ్బకు ఈ సరస్సులో 200కు పైగా డాలి్ఫన్లు మృత్యువాత పడ్డాయి. ఈసారి పరిస్థితి మరింత ఘోరంగా ఉండనుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా కనీసం రోజుకొకటి చొప్పున డాల్ఫిన్లు మరణిస్తున్నాయి. మరో నెలన్నర దాకా ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని, ఫలితంగా బ్రెజిల్ చరిత్రలోనే తొలిసారిగా జల వనరుల్లో అత్యధికం పూర్తిగా ఎండిపోయినా ఆశ్చర్యం లేదని
పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
దారుణ పర్యవసానాలు
బ్రెజిల్‌లో నదులు, సరస్సులు అడుగంటితే పర్యవసానాలు దారుణంగా ఉండనున్నాయి. ఆహారం మొదలుకుని రవాణా దాకా అన్నింటికీ వీటిపైనే ఆధారపడే స్థానికుల పరిస్థితి దయనీయంగా మారుతుందన్నారు అమెజాన్ పర్యావరణ పరిశోధన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్ర్ గుయ్‌మే ర్స్. ఇలాంటి పరిస్థితిని తన జీవితకాలంలో ఎన్న డూ చూడలేదని చెప్పుకొచ్చారు. నదీ ప్రవాహాలు దాదాపుగా ఎండిపోతున్న పరిస్థితులు చరిత్రలో బహుశా ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు. మరోవైపు తీవ్రమైన వేడి పరిస్థితులు అమెజాన్ అడవులతో పాటు పొరుగునే ఉన్న ప్రపంచంలోకెల్లా అతి పెద్ద చిత్తడి నేలలైన పంటనల్స్‌లో కూ డా కార్చిచ్చులకు కారణంగా మారుతున్నాయి.
అమెజాన్. ఈ పేరు వింటూనే సతత హరితారణ్యాలు, అపారమైన జీవవైవిధ్యం, అంతులేని జలవనరులు గుర్తుకొస్తాయి. ప్రపంచానికే ఊపిరితిత్తులుగా అమెజాన్‌కు పేరు. కానీ వాటికిప్పుడు నిలువెల్లా చిల్లులు పడుతున్నాయి. ప్రపంచ నదుల్లోకెల్లా పెద్దదైన అమెజాన్ క్రమంగా కుంచించుకుపోతోంది. దాని ప్రధాన జల వనరులైన అతి పెద్ద ఉపనదులన్నీ కనీవినీ ఎరగనంతగా ఎండిపోతున్నాయి. అమెజాన్ పరీవాహక ప్రాంతాల్లో ప్రధాన దేశమైన బ్రెజిల్‌లో ఈ ధోరణి కొట్టిచి్చనట్టుగా కాన్పిస్తోంది. ఈ పరిణామం పర్యావరణవేత్తలనే గాక ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులను కూడా ఎంతగానో కలవరపెడుతోంది...
– సాక్షి, నేషనల్ డెస్క్
కారణమేమిటి?
కరువు పరిస్థితులకు దారి తీసే ఎల్ నినో గతేడాది బ్రెజిల్‌ను అల్లాడించింది.
⇒ ఈ ఏడాది దాని తీవ్రత తగ్గినా దేశవ్యాప్తంగా వాతావరణంలో వేడి పరిస్థితులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
⇒ అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడ్డ అసాధారణ వేడి పరిస్థితులు సమస్యను మరింత పెంచుతున్నాయి.
⇒ అమెజాన్ అంతటా విచ్చలవిడిగా కొనసాగుతున్న అడవుల నరికివేత తాలూకు దుష్పరిణామాలు ఇప్పుడు కొట్టొచ్చినట్లుగా కన్పిస్తున్నాయి.
⇒ పచ్చదనం విపరీతంగా తగ్గిపోతుండటంతో ఎండలు పెరుగుతున్నాయి. వానల క్రమం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది.
⇒ అమెజాన్ బేసిన్‌లో గతేడాది వచ్చిన తీవ్ర కరువుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ నెట్‌వర్క్ తేల్చింది.
⇒ బ్రెజిల్‌లో జరుగుతున్నది ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పుల తాలూకు స్థానిక ప్రభావమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment