El Nino
-
‘ఊపిరితిత్తు’లకు చిల్లు!
ఎండి పగుళ్లిచ్చిన నేల. నీటిచుక్క ఆనవాలు కూడా లేని తీరాల్లో బారులు తీరిన బోట్లు. కొంతకాలంగా బ్రెజిల్‌లోని ప్రధాన నదులన్నింట్లోనూ కనిపిస్తున్న దృశ్యాలివి. ఒకవైపు రికార్డు స్థాయి ఎండలు. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు. వీటి దెబ్బకు ఈ సీజన్లో దాదాపుగా ప్రతి నదీ రికార్డు స్థాయిలో కుంచించుకుపోయింది. రాజధాని బ్రెజీలియాతో పాటు పలు ప్రధాన నగరాలు వరుసగా 140 రోజులుగా వాననీటి చుక్కకు కూడా నోచుకోని పరిస్థితి! దేశంలో 60 శాతానికి పైగా వరుసగా రెండో ఏడాది కరువు గుప్పెట్లో చిక్కింది. గతేడాదితో పోలిస్తే పరిస్థితులు పెనం నుంచి పొయ్యిలోకి చందంగా విషమిస్తున్నాయి. ఫలితంగా 1950 తర్వాత అతి పెద్ద కరువుతో బ్రెజిల్ అల్లాడుతోంది. దీన్నిప్పటికే జాతీయ విపత్తుగా ప్రకటించారు. అమెజాన్ వర్షారణ్యాలకు పుట్టిల్లయిన బ్రెజిల్లో ఈ అనూహ్య పరిస్థితి సైంటిస్టులను ఆందోళనపరుస్తోంది. అయ్యో.. రియో... అమెజాన్ ఉపనదుల్లో అతి పెద్దదైన రియో నెగ్రో అయితే ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది. నదిలో నీటిమట్టం కొద్ది నెలలుగా ఏకంగా రోజుకు ఏడంగుళాల చొప్పున తగ్గిపోతూ కలవరపెడుతోంది. దాంతో నలుపు రంగులో నిత్యం అలరించే అపార జలరాశి మాయమై ఏకంగా నదీగర్భమే బయటపడింది. రియో నిగ్రోలో కలిసే సొలిమెస్ నదిదీ ఇదే దుస్థితి. దాని నీటిమట్టం ఈ నెలలో రికార్డు స్థాయికి పడిపోయింది. ఈ రెండు నదులు కలిసిన మీదట అమెజాన్‌గా రూపొందుతాయి. వీటిలో నిత్యం తిరగాడే రవాణా నౌకలు కొంతకాలంగా నదీగర్భాల్లోని విస్తారమైన ఇసుకలో కూరుకుపోయి కని్పస్తున్నాయి. సొలిమెస్ తీరాన ఉండే టెఫ్ సరస్సులో కూడా నీళ్లు దాదాపుగా నిండుకున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఈ సరస్సు ఊహాతీతంగా చిక్కిపోయిన తీరు పర్యావరణ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. గతేడాది రికార్డు ఎండలు, కనీవినీ ఎరగని కరువు దెబ్బకు ఈ సరస్సులో 200కు పైగా డాలి్ఫన్లు మృత్యువాత పడ్డాయి. ఈసారి పరిస్థితి మరింత ఘోరంగా ఉండనుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా కనీసం రోజుకొకటి చొప్పున డాల్ఫిన్లు మరణిస్తున్నాయి. మరో నెలన్నర దాకా ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని, ఫలితంగా బ్రెజిల్ చరిత్రలోనే తొలిసారిగా జల వనరుల్లో అత్యధికం పూర్తిగా ఎండిపోయినా ఆశ్చర్యం లేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. దారుణ పర్యవసానాలు బ్రెజిల్లో నదులు, సరస్సులు అడుగంటితే పర్యవసానాలు దారుణంగా ఉండనున్నాయి. ఆహారం మొదలుకుని రవాణా దాకా అన్నింటికీ వీటిపైనే ఆధారపడే స్థానికుల పరిస్థితి దయనీయంగా మారుతుందన్నారు అమెజాన్ పర్యావరణ పరిశోధన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్ర్ గుయ్మే ర్స్. ఇలాంటి పరిస్థితిని తన జీవితకాలంలో ఎన్న డూ చూడలేదని చెప్పుకొచ్చారు. నదీ ప్రవాహాలు దాదాపుగా ఎండిపోతున్న పరిస్థితులు చరిత్రలో బహుశా ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు. మరోవైపు తీవ్రమైన వేడి పరిస్థితులు అమెజాన్ అడవులతో పాటు పొరుగునే ఉన్న ప్రపంచంలోకెల్లా అతి పెద్ద చిత్తడి నేలలైన పంటనల్స్లో కూ డా కార్చిచ్చులకు కారణంగా మారుతున్నాయి.అమెజాన్. ఈ పేరు వింటూనే సతత హరితారణ్యాలు, అపారమైన జీవవైవిధ్యం, అంతులేని జలవనరులు గుర్తుకొస్తాయి. ప్రపంచానికే ఊపిరితిత్తులుగా అమెజాన్‌కు పేరు. కానీ వాటికిప్పుడు నిలువెల్లా చిల్లులు పడుతున్నాయి. ప్రపంచ నదుల్లోకెల్లా పెద్దదైన అమెజాన్ క్రమంగా కుంచించుకుపోతోంది. దాని ప్రధాన జల వనరులైన అతి పెద్ద ఉపనదులన్నీ కనీవినీ ఎరగనంతగా ఎండిపోతున్నాయి. అమెజాన్ పరీవాహక ప్రాంతాల్లో ప్రధాన దేశమైన బ్రెజిల్లో ఈ ధోరణి కొట్టిచి్చనట్టుగా కాన్పిస్తోంది. ఈ పరిణామం పర్యావరణవేత్తలనే గాక ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులను కూడా ఎంతగానో కలవరపెడుతోంది... – సాక్షి, నేషనల్ డెస్క్ కారణమేమిటి?కరువు పరిస్థితులకు దారి తీసే ఎల్ నినో గతేడాది బ్రెజిల్‌ను అల్లాడించింది. ⇒ ఈ ఏడాది దాని తీవ్రత తగ్గినా దేశవ్యాప్తంగా వాతావరణంలో వేడి పరిస్థితులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ⇒ అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడ్డ అసాధారణ వేడి పరిస్థితులు సమస్యను మరింత పెంచుతున్నాయి. ⇒ అమెజాన్ అంతటా విచ్చలవిడిగా కొనసాగుతున్న అడవుల నరికివేత తాలూకు దుష్పరిణామాలు ఇప్పుడు కొట్టొచ్చినట్లుగా కన్పిస్తున్నాయి. ⇒ పచ్చదనం విపరీతంగా తగ్గిపోతుండటంతో ఎండలు పెరుగుతున్నాయి. వానల క్రమం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ⇒ అమెజాన్ బేసిన్లో గతేడాది వచ్చిన తీవ్ర కరువుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ నెట్వర్క్ తేల్చింది. ⇒ బ్రెజిల్లో జరుగుతున్నది ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పుల తాలూకు స్థానిక ప్రభావమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. -
జూలై–సెప్టెంబర్‌కల్లా లా నినో
న్యూఢిల్లీ: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ పరిస్థితులను మోసుకొచి్చన 2023–24 ఎల్‌నినో సీజన్ ఈసారి జూలై–సెపె్టంబర్‌కల్లా లా నినోగా మారొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తాజా కబురు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వరసగా 11వ నెల(ఏప్రిల్) అత్యుష్ణ నెలగా రికార్డులకెక్కింది. సముద్రజలాల ఉపరితల ఉష్ణోగ్రతలూ గత 13 నెలలుగా అత్యధిక స్థాయిల్లో నమోదవుతున్నాయని డబ్ల్యూఎంఓ పేర్కొంది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడిగా ఉండటంతో సంభవించే ఎల్ నినో పరిస్థితులే దీనంతటికీ కారణమని డబ్ల్యూఎంఓ తెలిపింది. అడవుల నరికివేత, కాలుష్యం వంటి మానవ కార్యకలాపాలకుతోడు హరిత వాయువులు ఈ పరిస్థితులకు ప్రధాన కారణంగా నిలిచాయి. ఇంకా కొనసాగుతున్న ఎల్‌నినో కారణంగా భారత్, పాకిస్తాన్సహా దక్షిణాసియాలోని కోట్లాది మంది జనం దారుణమైన వేడిని చవిచూశారు. అయితే జూలై–సెపె్టంబర్‌కల్లా ఎల్‌నినో తగ్గిపోయి లా నినో వచ్చేందుకు 60 శాతం అవకాశముందని, ఆగస్ట్–నవంబర్‌కల్లా అయితే 70 శాతం అవకాశముందని డబ్ల్యూఎంఓ తాజాగా అంచనావేసింది. ఈసారి మళ్లీ ఎల్‌నినో పుంజుకునే అవకాశాలు లేవని తేలి్చచెప్పింది. ఎల్‌నినో కారణంగా భారత్‌లో వర్షపాతం భారీగా తగ్గిపోవడం, లా నినో కారణంగా విస్తారంగా వర్షాలు కురవడం తెల్సిందే. ఆగస్ట్–సెపె్టంబర్ కల్లా భారత్‌లో లా నినో పరిస్థితులు ఏర్పడి చక్కటి వర్షాలు కురుస్తాయని ఇటీవల భారత వాతావరణ శాఖ అంచనావేయడం విదితమే. భారత్‌లో 52 శాతం సాగుభూమి వర్షాధారితం కావడంతో భారతరైతులకు వర్షాలకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ‘‘ 2023 జూన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. మహాసముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలది వచ్చే నెలల్లో కీలక భూమిక’’ అని డబ్ల్యూఎంఓ ఉప ప్రధాన కార్యదర్శి కో బారెట్ అన్నారు. -
AP: రోహిణి ప్రభావం లేనట్టే!
సాక్షి, అమరావతి/విశాఖపట్నం:ఎల్‌నినో ప్రభావం తగ్గి.. లానినో పరిస్థితులు ఏర్పడడంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గిపోయింది. అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం చల్లబడింది. ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకు ఎల్‌నినో కొనసాగింది. ఏప్రిల్ నుంచి తగ్గుతూ లానినో పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఎండల తీవ్రత తగ్గింది. ఈ నెల 25వ తేదీ నుంచి రోహిణి కార్తె మొదలవుతున్నా.. దాని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఉష్ణోగ్రతలు ఉన్నా 40 డిగ్రీలలోపే నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనాల్లో ఏమైనా మార్పులు ఉంటే ఒకటి, రెండు రోజులు ఎండలు పెరిగే అవకాశం ఉంటుందని, మార్పులు లేకపోతే ఆ ఎండలు కూడా ఉండవని చెబుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండటం, అరేబియన్ మహాసముద్రం నుంచి గాలులు వీస్తుండటం, తమిళనాడు, బంగాళాఖాతం వైపు నుంచి కూడా గాలులు వీస్తుండడంతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, కోస్తాలోని కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.ముందుగానే నైరుతి రుతుపవనాలుఅనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఈ సీజన్లో నైరుతి రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే భారత వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన ద్రోణి తుపానుగా మారకుండా ఉంటే.. రుతుపవనాలు ముందే కేరళను తాకవచ్చని చెబుతున్నారు. ఆ ద్రోణి బలపడే అవకాశం లేదని భావిస్తున్నారు. ఒకవేళ అది బలపడి తుపానుగా మారితే రుతుపవనాలు కొంత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే బంగాళాఖాతంలో అండమాన్ పరిసరాల్లో ఈ నెలాఖరుకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది బలపడితే నైరుతి రుతుపవనాలు ఇంకా వేగంగా విస్తరించవచ్చని చెబుతున్నారు. ఏదైనా ఈ నెలాఖరుకల్లా రుతు పవనాలు కేరళను తాకవచ్చని.. జూన్ 1కల్లా ఏపీకి విస్తరించవచ్చని అంచనా వేస్తున్నారు.నేటి నుంచి వర్షాలుద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక శనివారం ప్రకాశం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. ఈ మూడు రోజులు వానలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని తెలిపింది. గంటకు 40–50 కి.మీల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని పేర్కొంది. కాగా.. శనివారం శ్రీకాకుళం జిల్లాలో 16, విజయనగరం జిల్లాలో ఆరు, పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. -
India Meteorological Department: ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
న్యూఢిల్లీ: ఎండలు, వడగాడ్పులతో అల్లాడుతున్న వేళ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు మోసుకొచ్చింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో సమృద్ధిగా వానలు కురుస్తాయని శుభవార్త చెప్పింది. ‘లా నినో’ వాతావరణ పరిస్థితులు కలిసిరావడంతో దేశంలో ఈసారి సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనావేసింది. వాతావరణ శాఖ అంచనా వివరాలను కేంద్ర భూవిజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ సోమవారం ఢిల్లీలో వెల్లడించారు. ‘‘దీర్ఘకాల సగటు వర్షపాతం 106 శాతం మేర పడొచ్చు. అంటే 87 సెంటీమీటర్లకు మించి నమోదు కావచ్చు. ప్రస్తుతం భూమధ్య రేఖ పసిఫిక్ ప్రాంతంలో మధ్యస్థ ఎల్‌నినో పరిస్థితులున్నాయి. ఈ ఎల్ నినో (వర్షాభావ పరిస్థితులు) నైరుతి రుతుపవనాల ప్రవేశం (జూన్) నాటికి బలహీనపడి, ద్వితీయార్థంలో లా నినో (వర్షాలకు అనుకూల) పరిస్థితులు ఏర్పడనున్నాయి. గడచిన మూడు నెల్లో ఉత్తరార్థ గోళం, యూరేసియాలో మంచు సాధారణం కన్నా తక్కువగా ఉంది. దీంతో ఈసారి భారత్‌లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువ నమోదు కావచ్చు’’ అని పేర్కొన్నారు. దేశ సాగు విస్తీర్ణంలో 52 శాతం పంటలు వర్షాధార పంటలే. రిజర్వాయర్లు అడుగంటి తాగునీటికి సైతం జనం కష్టాలు పడుతున్న ఈ తరుణంలో వాతావరణ శాఖ ప్రకటన రైతాంగాన్ని భారీ ఊరటనిస్తోంది. అయితే వాయవ్య, తూర్పు, ఈశాన్య భారతావనిలోని కొన్ని ప్రాంతాత్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదుకావచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అంచనావేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్లలో వర్షపాత వివరాలను ఐఎండీ వెల్లడించలేదు. గత 50 ఏళ్ల సగటున అయిన 87 సెంటీమీటర్ల వర్షపాతంలో 96 శాతం నుంచి 104 శాతాన్ని ‘సాధారణ వర్షపాతం’గా ఐఎండీ గణిస్తోంది. దీర్ఘకాల సగటులో 90 శాతం కన్నా తక్కువ వర్షపాతం కురిస్తే దానిని వర్షాభావ పరిస్థితిగా లెక్కిస్తారు. 90–95 శాతం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా, 105–110 శాతం కురిస్తే సాధారణం కన్నా ఎక్కువగా పరిగణిస్తారు. 1951–2023 కాలంలో పరిశీలిస్తే ఎల్ నినో తర్వాత వచ్చే లా నినో సందర్భాల్లో తొమ్మిదిసార్లు దేశంలో రుతుపవన కాలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. లా నినో సంభవించిన 22 సంవత్సరాల్లో 20 సార్లు సాధారణం/సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. -
ఎల్‌నినో ఉన్నప్పటికీ సాధారణ వర్షపాతం
న్యూఢిల్లీ: ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ మొత్తమ్మీద సాధారణ వర్షపాతంతో ఈ సీజన్ ముగిసిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. నాలుగు నెలల వర్షాకాలంలో దేశంలో దీర్ఘకాల సగటు వర్షపాతం 868.6 మిల్లీమీటర్లు కాగా, ఈసారి ఎల్‌నినో పరిస్థితులను నిలువరించే సానుకూల కారకాల ప్రభావంతో 820 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది 94.4 శాతమని ఐఎండీ తెలిపింది. దీర్ఘకాలం సరాసరి వర్షపాతం 94–106 శాతం మధ్య నమోదైతే సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు. వాతావరణ మార్పుల కారణంగా రుతుపవనాల్లో అస్థిరత ఏర్పడినట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర శనివారం మీడియాతో అన్నారు. దేశంలోని 36 వాతావరణ సబ్ డివిజన్లకుగాను మూడింటిలో అధిక వర్షపాతం, 26 సబ్ డివిజన్లలో సాధారణ, ఏడింట్లో లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. లోటు వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, జార్ఖండ్, బెంగాల్, బిహార్, యూపీలో కొంత భాగం, కర్ణాటక దక్షిణ ప్రాంతం, కేరళ ఉన్నాయన్నారు. అదేవిధంగా, దక్షిణాది రాష్ట్రాల్లో 8% లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర జలాల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు (హిందూ మహా సముద్రం డైపోల్), గాల్లో మేఘాలు, వర్షాలు తూర్పు దిశగా కదిలే తీరు(మాడెన్–జులియన్ ఆసిలేషన్) ఈ దఫా రుతుపవనాలను ప్రభావితం చేశాయని మహాపాత్ర విశ్లేషించారు. ఈ రెండు పరిస్థితులు ఎన్ నినో ప్రభావాన్ని తగ్గించాయని వివరించారు. నైరుతి రుతు పవనాల సమయంలో ఏటా సాధారణంగా 13 వరకు అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి, ఈసారి 15 అల్ప పీడనాలు ఏర్పడినప్పటికీ వాటి వృద్ధి సక్రమంగా లేదన్నారు. ఎల్‌నినో కారణంగానే 1901 తర్వాత అత్యంత వేడి మాసంగా ఈ ఏడాది ఆగస్ట్ రికార్డు సృష్టించిందన్నారు. నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈసారి 8 రోజులు ఆలస్యంగా సెప్టెంబర్ 25వ తేదీన పశ్చిమ రాజస్తాన్ నుంచి ప్రారంభమయిన విషయం తెలిసిందే. -
ధరల కట్టడే లక్ష్యం... కానీ సవాళ్లు ఉన్నాయ్!
ముంబై: కేంద్రం నిర్దేశిస్తున్నట్లు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యానికి చేర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రయత్నిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. అయితే ఆర్బీ ఐ ప్రయత్నాలకు ఎల్ నినో సవాలుగా నిలుస్తో ందని వెల్లడించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి సాధిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన ఉద్ఘా టించారు. గత ఏడాది మే నుంచి 2.50 శాతం పెరిగిన రెపో రేటు (బ్యాంకులకు తాని చ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం), సరఫరాలవైపు సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.25 శాతానికి (2022 ఏప్రిల్‌లో 7.8 శాతం) దిగిరావడా నికి కారణమని ఆయన ఒక ఇంటర్వ్యూలో పే ర్కొన్నారు. గోధుమలు, బియ్యం నిల్వల వి డుదల వంటి ఫుడ్ కార్పొరేషన్ చర్యలు ధరలు దిగిరావడానికి కారణమయ్యాయి. కొన్ని ప్రొడక్టులపై సుంకాల తగ్గింపూ ఇక్కడ సానుకూలమయ్యింది. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► 2023–24లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతం ఉంటుందని భావిస్తున్నాం. 4 శాతానికి దీనిని కట్టడి చేయడానికీ ప్రయతి్నస్తున్నాం. ఎల్ నినో సవాళ్లు నెలకొనే ఆందోళనలు ఉన్నాయి. (పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పులకు గురికావడమే ఎల్ నినో. ఇది భారత్, ఆ్రస్టేలియాలో భారీ వర్షపాతం, పంట ఉత్పాదకతకపై ప్రభావం, కరువు పరిస్థితులను సృష్టించడం వంటి పరిణామాలకు దారితీయవచ్చు.) ► ద్రవ్యోల్బణం అదుపులోనికి వస్తే, ప్రజలు తక్కువ వడ్డీరేటు వ్యవస్థను ఆశించవచ్చు. ► ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే. ఇది కమోడిటీ ధరలను పెంచే అంశం. అయితే ప్రస్తుతం బ్యారల్‌కు 76 డాలర్ల వద్ద ఉన్న క్రూడ్ ధర వల్ల ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు. ► ప్రాజెక్ట్ రుణాలుసహా కార్పొరేట్ల నుండి క్రెడిట్ కోసం చాలా డిమాండ్ ఉంది. మొత్తం రుణ వృద్ధి అన్ని రంగాల విస్తృత ప్రాతిపాతిపదికన నమోదవుతోంది. ► 2023 క్యాలెండర్ సంవత్సరంలో రూపాయి తక్కువ అస్థిరతను కలిగి ఉంది. డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ బలపడింది. అస్థిరతను తగ్గించడానికి ఆర్బీఐ తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ► అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ రేట్లను పెంచినప్పటికీ రూపాయిపై ప్రభావం పడదని విశ్వసిస్తున్నాం. అమెరికాలో ఫెడ్ ఫండ్ రేటు 5 శాతం పెరిగినప్పటికీ దేశీయ కరెన్సీ స్థిరంగా ఉంది. ► దేశానికి వచీ్చ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వలకు మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) 2023–24 ఆర్థిక సంవత్సరంలో ‘‘పటిష్ట నిర్వహణ స్థాయిలో’’ ఉంటుందని భావిస్తున్నాం. సేవా రంగం నుంచి అధిక ఎగుమతులు, క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉండడం దీనికి కారణం. ఈ ప్రయత్నాలకు ఎల్ నినో ప్రధాన విఘాతం – శక్తికాంత్‌దాస్, ఆర్బీఐ గవర్నర్ -
నీటి నిల్వలు తగ్గుతున్నాయ్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్న వేళ...ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ పంటలకు పెరిగిన వినియోగం, లోటు వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం కారణంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షణలో 146 ప్రధాన జలాశయాలున్నాయి. వీటిల్లో నీటి నిల్వలు గత ఏడాది కన్నా 5శాతం తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ రిజర్వాయర్ల వాస్తవ నిల్వ సామర్ధ్యం 178 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం) కాగా ప్రస్తుతం 70 బీసీఎంల నిల్వలు ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 74 బీసీఎంలతో పోలిస్తే 5 శాతం తక్కువని సీడబ్ల్యూసీ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో మొత్తం 53 బీసీఎంల నిల్వ సామర్థ్యం కలిగిన 40 రిజర్వాయర్లుండగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం ప్రత్యక్ష నిల్వ కేవలం 16.737 బీసీఎంలని వివరించింది. రిజర్వాయర్ల మొత్తం ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో ఇది 32 శాతం కాగా, గత ఏడాది కన్నా 7% తక్కువని తెలిపింది. ఇక ఏపీ, తెలంగాణలలోని 11 ప్రధాన రిజర్వాయర్లలో 20 బీసీఎంల నీటి నిల్వలకు గాను కేవలం 5.5 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 8 బీసీఎంలతో పోలిస్తే 11శాతం తక్కువని వెల్లడించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో 11.12 బీసీఎంల నిల్వలకు గానూ కేవలం 1.65 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాదితో పోలిస్తే 9% తక్కువని తెలిపింది. -
ఏసీ అమ్మకాలపై అకాల వర్షాల దెబ్బ
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తున్న అసాధారణ వర్షాలతో ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) అమ్మకాలు తగ్గినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫిబ్రవరి మధ్య నుంచి ఏసీల అమ్మకాలు పుంజుకున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితులు తాత్కాలికమేనని, ఏప్రిల్ నుంచి ఏసీల అమ్మకాలు పెరుగుతా యనే అంచనాలు కంపెనీల్లో నెలకొన్నాయి. వర్షాలతో మార్చి రెండో వారంలో ఏసీల అమ్మకా లు తగ్గాయి. ఇది కొన్ని రోజుల పరిణామమేనని, తిరిగి ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి పెరిగే ఉష్ణోగ్రతలతో డిమాండ్ గరిష్టానికి వెళుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 2022లో మొత్తం మీద 82.5 లక్షల యూనిట్ల ఏసీలు అమ్ముడయ్యాయి. ప్రస్తుత సీజన్లో అమ్మకాల పరంగా రెండంకెల వృద్ధి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వేసవి కాలం ఎక్కువ రోజుల పాటు ఉండొచ్చని, ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కావచ్చన్న అంచనాలు విక్రయాలకు మద్దతుగా నిలుస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంత తగ్గాయి.. అకాల వర్షాలకు తమ ఏసీల అమ్మకాలు కొంత తగ్గాయని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ తెలిపింది. ‘‘అయినప్పటికీ అధిక వేసవి కాలం ముందుంది. ఈ తరహా వాతావరణ ప్రతికూలతలు మరిన్ని లేకపోతే మాత్రం మా అమ్మకాల లక్ష్యాలను చేరుకుంటామనే నమ్మకం ఉంది’’అని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా బిజినెస్ హెడ్ గౌరవ్ షా అన్నారు. అమ్మకాలు తగ్గితే అది 5–6 రోజులే ఉంటుందని డైకిన్ ఇండియా చైర్మన్, ఎండీ కేజే జావా తెలిపారు. దీని ప్రభావం పెద్దగా ఉండదన్నారు. పెంటప్ డిమాండ్ (గతంలో నిలిచిన) బలంగా ఉన్నందున బుల్లిష్‌గా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది ఏసీల మార్కెట్ 20 శాతం వృద్ధి చెందుతుందున్న అంచనాను వ్యక్తం చేశారు. అలాగే డైకిన్ ఏసీల అమ్మకాలు 30 శాతం పెరగొచ్చన్నారు. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో ఏసీల అమ్మకాలు పెరగడం గమనార్హం. దీంతో రిటైలర్లు నిల్వలను పెంచుకున్నారు. ప్రస్తుత వర్షాలు తమ వ్యూహాత్మక విధానాన్ని మార్చుకునేందుకు సరైన సమయం ఇచ్చినట్టు హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ పేర్కొన్నారు. వచ్చే కొన్ని వారాల్లో వాతావరణ పరిస్థితులు సాధారణంగా మారతాయని, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఇండోర్, గృహ కూలింగ్ ఉత్పత్తులు తప్పనిసరిగా పేర్కొన్నా రు. మార్కెట్ ధోరణులు చూస్తుంటే 30–40 శాతం మేర అమ్మకాలు పెరగొచ్చని, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల మార్కెట్లో హయర్ ఈ మేర ప్రగతి సాధిస్తుందని చెప్పారు. విక్రయాలు తగ్గాయని, అయినా ఇది తాత్కాలికమేనని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయ న్సెస్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) పేర్కొంది. ఈ ఏడాది మేలో తీవ్రమైన వేసవి సీజన్‌ను చూస్తామని, నివేదికలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నట్టు సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. మరో వారం రోజుల తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు పెరగడం మొదలవుతాయని, అమ్మకాలు కూడా పుంజుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఏప్రిల్‌లో తీవ్ర ప్రతికూలతలు ఎదురైతే తప్ప అమ్మకాలపై పెద్దగా ప్రభావం ఉండబోదన్నారు. ‘‘మొత్తం మీద వేసవి అమ్మకాలపై ఇప్పుడే అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి విక్రయాలు జూన్, జూలై వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతాయి’’అని వోల్టాస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. చానల్ భాగస్వాములు కూలింగ్ ఉత్పత్తులను ముందుగా నిల్వ చేసి పెట్టుకోవాలని, అప్పుడు పెరిగే ఉష్ణోగ్రతలతో ఒక్కసారిగా డిమాండ్ వచ్చి నా, ఎదుర్కోవడానికి ఉంటుందన్నారు. -
ఎల్‌నినో ఉన్నా మంచి వానలే! భారత వాతావరణ శాఖ స్పందన ఇదే!
న్యూఢిల్లీ: భారత్‌లో వర్షాభావ పరిస్థితులకు కారణమయ్యే ‘ఎల్ నినో’ దాపురించే అవకాశాలు ఉన్నాసరే ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవన వర్షపాతం సాధారణస్థాయిలో కొనసాగి వ్యవసా య రంగానికి మేలుచేకూర్చనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం అంచనావేసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమేట్ సోమవారం ప్రకటించిన మరుసటి రోజే వాతావరణ శాఖ మరోలా అంచనాలు వెల్లడించడం గమనార్హం. భారత్‌లో వ్యవసాయం ప్రధానంగా వర్షాలపై ఆధారపడింది. మొత్తం పంట విస్తీర్ణంలో దాదాపు 52 శాతం భూభాగం వర్షాధారం. దేశ మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం.. ఈ భూభాగంలో పండించే పంట నుంచే వస్తోంది. ఇది దేశ ఆహారభద్రతకు, ఆర్థిక సుస్థిరతకు కీలక భూమికగా మారింది. ఈ పరిస్థితుల్లో దేశంలో వర్షపాతం సాధారణంగా ఉంటుందని అంచనావేసి వ్యవసాయరంగానికి ఐఎండీ తీపికబురు మోసుకొచ్చింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితర జలాలు వేడెక్కితే ఎల్ నినో అంటారు. దీనివల్ల భారత్‌లో రుతుపవన గాలులు బలహీనమై పొడిబారి వర్షాభావం తలెత్తుతుంది. సగటు వానలు జూన్ నుంచి సెప్టెంబర్ దాకా నైరుతి సీజన్లో దాదాపుగా సుదీర్ఘకాల సగటు అయిన 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని కేంద్ర భూ శాస్త్ర శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ చెప్పారు. సాధారణం, అంతకు ఎక్కువ వానలు పడేందుకు 67 శాతం ఆస్కారముందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర అంచనావేశారు. ‘‘రెండో అర్ధభాగంపై ఏర్పడే ఎల్‌నినో ప్రభావం చూపొచ్చు. అంతమాత్రాన వర్షాభావం ఉంటుందని చెప్పలేం. ఎన్నోసార్లు ఎల్‌నినో వచ్చినా సాధారణ వర్షపాతం నమోదైంది’’ అని ఆయన వివరించారు. -
ఏప్రిల్–జూన్‌లో వేడి సెగలు!
న్యూఢిల్లీ: వాయవ్య ప్రాంతం మినహా దాదాపు భారతదేశమంతటా ఈ ఏప్రిల్ నుంచి జూన్ నెలదాకా సాధారణం కంటే కాస్త ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సంబంధిత వివరాలను శనివారం ప్రకటించింది. ‘ 2023 ఎండాకాలంలో మధ్య, తూర్పు, వాయవ్య భారతంలో సాధారణం కంటే ఎక్కువగా హీట్‌వేవ్ రోజులు కొనసాగవచ్చు. దేశవ్యాప్తంగా సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు కొద్దిగా అధికం కావచ్చు. అయితే దక్షిణ భారతదేశంలో, ఇంకొన్ని వాయవ్య ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణంగా, సాధారణం కంటే తక్కువగా నమోదుకావచ్చు’ అని వాతావరణ శాఖ తన అంచనాల్లో పేర్కొంది. మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ను, తీరప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌ను, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల సెల్సియస్‌ను దాటినా, ఆ సీజన్లో ఆ ప్రాంతంలో సాధారణంగా నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే దానిని హీట్‌వేవ్‌గా పరిగణిస్తారు. భారత్‌లో 1901 నుంచి ఉష్ణోగ్రతల నమోదును గణిస్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరి.. అత్యంత వేడి ఫిబ్రవరిగా రికార్డులకెక్కడం గమనార్హం. అయినాసరే సాధారణం కంటే ఎక్కువగా(29.9 మిల్లీమీటర్లకు బదులు 37.6 మిల్లీమీటర్లు) వర్షపాతం నమోదవడం, ఏడుసార్లు పశ్చిమ అసమతుల్యతల కారణంగా మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మామూలు స్థాయిలోనే కొనసాగిన విషయం విదితమే. గత ఏడాది మార్చి నెల మాత్రం గత 121 సంవత్సరాల్లో మూడో అతి పొడిబారిన మార్చి నెలగా రికార్డును తిరగరాసింది. భారత్‌లో రుతుపవనాల స్థితిని ప్రభావితం చేసే దక్షిణఅమెరికా దగ్గర్లోని పసిఫిక్ మహాసముద్ర జలాలు చల్లబడే(లా నినో) పరిస్థితి బలహీన పడిందని వాతావరణ శాఖ తెలిపింది. లా నినో పరిస్థితి లేదు అంటే ఎల్ నినో ఉండబోతోందని అర్థం. ఎల్ నినో అనేది అక్కడి సముద్ర జలాలు వేడెక్కడాన్ని సూచిస్తుంది. అప్పుడు అక్కడి నుంచి వచ్చే గాలుల కారణంగా భారత్‌లో రుతుపవనాల సీజన్లో తక్కువ వర్షాలు కురుస్తాయి. అయితే మే నెలకల్లా పరిస్థితులు మారే అవకాశముందని భిన్న మోడల్స్ అంచనాల్లో తేలిందని వాతావరణ శాఖ తెలిపింది. -
ఈ ఏడాది మండిపోనున్న ఎండలు..
-
అప్పుడే దేశంలో కరవు తాండవం!
సాక్షి, న్యూఢిల్లీ : నేడు భారత్‌లోని 42 శాతం భూభాగంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరవు పరిస్థితులు తాండవిస్తున్నాయని ‘డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (డీఈడబ్ల్యూఎస్)’ వెల్లడించింది. మొత్తం దేశ జనాభాలో 40 శాతం జనాభా అంటే, దాదాపు 50 కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ రాష్ట్రాల్లో, ఈ ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించకపోవడం శోచనీయం. అయితే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలోని అనేక జిల్లాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరవు ప్రాంతాలుగా ప్రకటించాయి. వర్షాలు పడాలంటే మరో రెండు, మూడు నెలలు పడుతుంది కనుక కరవు పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ‘డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’ డెవలపర్, గాంధీనగర్ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విమల్ మిశ్రా తెలిపారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు, రెండూ వైఫల్యం చెందడం వల్ల ఈ కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని మిశ్రా తెలిపారు. దేశంలో ఏడాదిలో కురిసే వర్షపాతంలో నైరుతి రుతుపవాల వల్ల 80 శాతం, ఈశాన్య రుతు పవనాల వల్ల 20 శాతం వర్షాలు కురుస్తాయి. 2018, జూన్–సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల కురవాల్సిన వర్షపాతంలో 9.4 శాతం తగ్గినట్లు, అదే ఈశాన్య రుతుపవాల వల్ల అక్టోబర్–డిసెంబర్ మధ్య కురవాల్సిన సాధారణ వర్షపాతంలో 44 శాతం తగ్గినట్లు భారత వాతావరణ పరిశోధన కేంద్రం లెక్కలే తెలియజేస్తున్నాయని మిశ్రా వివరించారు. రుతుపవనాల కన్నా ముందు అంటే, మార్చి–మే నెలల మధ్య కురవాల్సిన వర్షపాతం కూడా ఈ సారి బాగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య కురిసే వర్షపాతంలో కూడా 36 శాతం తగ్గింది. ఫలితంగా దేశంలోని 91 ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టం 32 శాతం పడిపోయింది. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోని 31 రిజర్వాయర్లలో నీటి మట్టం 36 శాతం పడిపోయింది. మున్ముందు కరవు పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని, భూగర్భ జలాలు పడిపోవడం వల్ల వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని, పర్యవసానంగా గ్రామాల నుంచి వలసలు పెరుగుతాయని మిశ్రా హెచ్చరించారు. ఎల్‌నైనో పరిస్థితుల కారణంగా 2015 నుంచి (2017 మినహా) వరుసగా దేశంలో వర్షపాతం తగ్గుతూ వస్తోంది. -
ఎల్‌నినో ప్రమాదంతో తక్కువ వర్షాలు: స్కైమెట్
వ్యవసాయం కీలకమైన భారత ఆర్థిక వ్యవస్థకు, అన్నదాతలకు నిజంగా బ్యాడ్ న్యూస్. ప్రయివేట్ రంగ సంస్థ స్కైమెట్ వర్షపాతానికి సంబంధించిన నిరాశాజనక అంచనాలను బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం సాధారణం తక్కువ నమోదవుతుందని తెలిపింది. సగటుకంటే అధికం లేదా అధిక వర్షపాతానికి అవకాశాలు కనిపించడంలేదంటూ ముందస్తు వాతావరణ అంచనాల్లో స్కైమెట్ పేర్కొంది. 2019 సంవత్సరంలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం 55 శాతం ఉందని తెలిపింది. అంతేకాదు కరువు సంభవించే అవకాశాలు 15 శాతం ఉన్నాయంటూ సంచలన అంచనాలను వెల్లడించింది. ఎల్పీఏ వర్షపాతం జూన్‌లో 77 శాతం, 91 శాతం, ఆగస్టులో 102 శాతం, సెప్టెంబరులో 99 శాతంగా వుంటుందని అంచనా వేసింది.ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఎల్పీఏ 96-104 శాతం మధ్య రుతుపవనాలు సాధారణమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా వర్షాకాలమైన (జూన్ -సెప్టెంబరు) నాలుగునెలల కాల వ్యవధిలో చాలా తక్కువ వర్షపాతం ఉంటుందని తెలిపింది. అధిక లేదా సాధారణ వర్షపాతం అన్న ఊసేలేదని వ్యాఖ్యానించింది. లాంగ్ పీరియడ్ రేంజ్(ఎల్పీఏ)లో రుతుపవనాల ప్రభావం 93 శాతం ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది. వర్షపాతం 90 నుంచి 95 శాతం ఉందంటే, అది సాధారణం కంటే తక్కువే. 1951 నుంచి 2000వరకు ఎల్పీఏ సగటున 89 సెంటీమీటర్లు ఉందని స్కైమెట్ సీఈవో జతిన్ సింగ్ తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర బాగా ప్రభావితం కానుందన్నారు. అయితే భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏప్రిల్ మధ్యలో అంచనాలను ప్రకటించనున్నది. మరోవైపు వేసవి పొడవునా ఎల్‌నినో కొనసాగుతున్నందున వచ్చే వానాకాలంలో వర్షాలు కురిసే అవకాశం 60శాతమేనని అమెరికా వాతావరణశాఖ ఇటీవల హెచ్చరించింది. దీని ప్రభావం భారత్‌పైనా ఉంటుందని తెలిపింది. El Nino reason for below normal Monsoon https://t.co/exF7cAGVAG — SkymetWeather (@SkymetWeather) April 3, 2019 -
కేరళలో ఎందుకీ వరదలు?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో భారీ వరదలకు అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇందుకు కారణం ఏమిటని ఎవరిని ప్రశ్నించిన ‘భారీ వర్షాలు’ అని సమాధానం ఇస్తారు. భారీ వర్షాలకు కారణం ఏమిటని అడిగితే అల్పపీడనం అనో, పర్యావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు వల్లనో అనో సమాధానం ఇస్తారు. ఇక వర్షాలు ఎక్కువ పడినా, తక్కువ పడినా ‘ఎల్ నైనో’ లేదా ‘లా నైనో’ ప్రభావమని ఇటు ప్రభుత్వం అటు అధికార యంత్రాంగం చెబుతోంది. ఇందులో సగం మాత్రమే ఉంది. ప్రభుత్వం విధాన లోపం కారణంగానే వరదలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఎక్కువగా ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఆగస్టు 15 నాటికి కేరళ రాష్ట్ర వ్యాప్తంగా పడాల్సిన వర్షపాతం కన్నా మూడు రెట్లు వర్షపాతం ఎక్కువగా ఉంది. మొత్తం రాష్ట్రంలో కురిసిన వర్షపాతం ఎంతో ఇదుక్కి, వేయనాడ్ జిల్లాల్లో అంత వర్షపాతం కురిసింది. కేరళను ఆనుకొని ఉన్న కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. తమిళనాడులోని ఈరోడు, నమ్మక్కల్ ప్రాంతాల్లో, కర్ణాటక కొడగు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి భారీగా వరదలు వచ్చాయి. కేరళలో సాధారణ వర్షపాతం కన్నా 30 శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది. సహజ సిద్ధమైన కొండలు, లోయలు ఎక్కువగా ఉండే కేరళలో ఇంత ఎక్కువ వర్షపాతం కురిసినంత మాత్రాన ఇంతటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాల్సిన అవసరం లేదు. అయిన జరిగిందంటే మానవ తప్పిదమే. పాలకులు విధాన నిర్ణాయక లోపమే. 11 రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన కోచి విమానాశ్రయం ఎక్కడుందంటే ఇప్పటికే ఎంతో బక్క చిక్కిన పెరియార్ నదికి కేవలం 400 మీటర్ల దూరంలో ఉంది. భారీ వర్షాలు పడినప్పుడు వరదలు రమ్మంటే రావా? ఇక భారీ వర్షాలు కురిసిన ఈరోడు, నమ్మక్కాల్ ప్రాంతాలను తీసుకుంటే కావేరి నది ఒడ్డున కార్మికులు నిర్మించిన ఇళ్లన్ని కొట్టుకుపోయి ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. కావేరి నదికి నాలుగు కిలోమీటర్ల దూరంలో వరిపొలాలకు నీరందక రైతులు ఆందోళన చెందుతుంటే కావేరీకి వరదలొచ్చి ప్రాణ నష్టం సంభవించిందటే ఎవరి తప్పు? ఇవి ఉదాహరణలు మాత్రమే. కేరళలో కొండ చెరియలు విరిగి పడి ప్రాణ నష్టం సంభవించడానికి క్వారీలు కారణం. ఇటు క్వారీలు, అటు నదీ ప్రవాహాల పక్కన జనావాసాలు, మానవ నిర్మాణాల వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. -
ఎల్‌నినో ఉన్నట్టా? లేనట్టా?
ఉందంటున్న స్కైమెట్, అంతర్జాతీయ సంస్థలు అలాంటిదేమీ లేదన్న ఐఎండీ ఈ ఏడాది రుతుపవనాల తీరుతెన్నులపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తన ముందస్తు అంచనాలు విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణ వర్షపాతం నమోదవుతుందని, ఎల్‌నినోతో వచ్చిన ముప్పేమీ లేదని భరోసానిచ్చింది. అయితే ఇది ఎంత వరకు వాస్తవమన్న విషయంపై ఇప్పుడు సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి అమెరికా మొదలుకొని అనేక విదేశీ వాతావరణ సంస్థలు 2015–16లో వచ్చిన తీవ్ర ఎల్ నినో పరిస్థితులు ఈ ఏడాది కూడా రానున్నాయని స్పష్టం చేశాయి. దేశంలోనే తొలి ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ కూడా గతనెల ఆఖరులో ఇదే విషయాన్ని తెలిపింది. జూన్సెప్టెంబర్ మధ్య కాలంలో రుతుపవనాల సీజన్ రెండో అర్ధభాగంలో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిపింది. ఐఎండీ అప్పట్లో ఎల్‌నినో ప్రభావం పెద్దగా ఉండబోదని చెప్పింది. తాజాగా అసలు ఉండబోదని అంటోంది. వీటిల్లో ఏది నిజమన్న విషయం తెలుసుకోవాలంటే ముందుగా ఎల్‌నినో అంటే ఏమిటో? దాని ప్రభావం ఎక్కడ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎల్‌నినో ఏర్పడితే...?: దక్షిణ అమెరికాకు సమీపంలో భూమధ్య రేఖకు కొంచెం అటుఇటుగా సముద్ర ఉపరితల నీరు వెచ్చబడితే దాన్ని ఎల్‌నినో అని పిలుస్తారన్నది తెలిసిందే. ఉపరితల నీటి ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల అక్కడ నీటి ఆవిరి ఎక్కువవుతుంది. అంటే ఆ ప్రాంతంలోని గాలి వేడెక్కడంతోపాటు తేమ శాతం ఎక్కువవుతుంది. ఇలా వేడెక్కిన గాలి భూవాతావరణ పై పొరల్లోకి చేరి... మేఘాలను మోసుకెళ్లే జెట్స్ట్రీమ్స్ను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు నమోదైతే.. ఆస్ట్రేలియా మొదలుకొని భారత్ వరకూ వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు పెరుగుతాయి. సాధారణంగా ఎల్‌నినో అనేది సగటున నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంటుంది. అయితే భూ తాపోన్నతి ఫలితంగా వాతావరణం మారిపోతున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో తరచూ ఎల్‌నినో తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఉష్ణోగ్రతలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. 2015–16 సీజన్లో ఎల్‌నినో తీవ్రత గరిష్టంగా ఉండగా... ఆ రెండేళ్లలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది మాటేమిటి?: ఇప్పటివరకున్న పరిస్థితులను బేరీజు వేస్తే ఎల్‌నినో ఏర్పడేందుకు యాభై శాతం అవకాశాలున్నాయి. పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఇప్పటికైతే ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నాయి. అయితే దక్షిణ అమెరికా>కు అవతలి వైపున పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో మాత్రం ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు హెచ్చాయని, ఫలితంగానే ఇటీవల ఈక్వెడార్, పెరూలలో అధిక వర్షపాతం నమోదైందని అమెరికా వాతావరణ సంస్థ చెబుతోంది. దీని ప్రభావం వల్ల ఎల్‌నినో బలం పుంజుకుంటుందా? అన్నది స్పష్టం కావాల్సి ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వాతావరణ సంస్థలు కూడా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉండవచ్చని హెచ్చరించాయి. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై ఇప్పటికీ కొన్ని సందేహాలు ఉన్నాయడంలో సందేహం లేదు. భారత వాతావరణ సంస్థ రెండ్రోజుల క్రితం విడుదల చేసింది ముందస్తు అంచనాలే కాబట్టి.. త్వరలో విడుదల చేసే అసలు అంచనాల్లో ఎల్‌నినో ప్రస్తావన ఉంటుందా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఎల్‌నినోకు 72 మంది బలి
-
ఎల్‌నినోకు 72 మంది బలి
పెరూలో ఎమర్జెన్సీ లిమా: పెరూలో కురుస్తున్న భారీ వర్షాలకు 72 మంది మృత్యువాత పడినట్లు ఆ దేశ ప్రధాని ఫెర్నాండో జవాల ప్రకటించారు. ఎల్‌నినో ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాలు మరో రెండువారాలు కొనసాగుతాయని అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వరద తాకిడితో దేశంలోని 811 నగరాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి.జల దిగ్బధంతో రాజధాని లీమాకు గత వారంరోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. 1998లో ఫసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావంతో తుఫాన్లు ఏర్పడి దేశంలో 374 మంది చనిపోయారని, ప్రస్తుతం అలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. వరద వల్ల దేశంలో నిత్యావసరాల ధరలు 5 శాతం పెరిగినట్లు ప్రభుత్వం అంగీకరించింది. -
ఈసారి ఆశించిన వర్షాలు పడవా ?
-
ఎల్‌నినో ఎల్లిపాయె.. లానినా రాకపాయె!
తటస్థ స్థితిలో వాతావరణం ఉపరితల ఆవర్తనం ఏర్పడితేనే రుతుపవనాలకు ఊపు: శాస్త్రవేత్తలు సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన ఎండలతో హోరెత్తించిన ఎల్‌నినో కనుమరుగైంది. వాన లతో ముంచెత్తాల్సిన లానినా రాకకు మాత్రం ఇంకాస్త సమయం పడుతుందంటున్నారు వాతావరణ నిపుణులు! ప్రస్తుతం లానినా దశలోకి వెళ్లడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎల్‌నినో కానీ లానినా కానీ లేదని... తటస్థ స్థితి మాత్రమే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే లానినా రావాల్సి ఉన్నా.. తటస్థ స్థితి నుంచి నెల రోజుల్లో లానినా ఏర్పడుతుందని తెలిపింది. రుతుపవనాలపై ఎల్‌నినో, లానినాల ప్రభావం ఉంటుంది. రుతుపవనాలు వచ్చాక అవి వేగంగా ముందుకు కదలడానికి, వర్షాలు కురవడానికి లానినా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లానినా ఏర్పడ్డాక జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. జూలై, ఆగస్టు నాటికి లానినా 26% నుంచి 52%నికి చేరుకోనుంది. ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో లానినా 67%నికి, అక్టోబర్ చివరకు 71%నికి చేరుకోనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆవర్తనం లేకే ఆలస్యం.. నైరుతి రుతుపవనాలు కేరళను తాకి వారం రోజులు కావస్తున్నా ఇంకా తెలంగాణలోకి ప్రవేశించలేదు. ఈ నెల 15 నాటికే రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఏపీని రుతుపవనాలు తాకినా బలహీనపడడంతో అక్కడ కూడా వర్షాలు కురవడం లేదు. కేరళ, కర్ణాటకలోని కోస్తా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాల కారణంగా విసృ్తతంగా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ఊపందుకోలేదు. ఉపరితల ఆవర్తనం ఏర్పడితేనే తప్ప రుతుపవనాలు రావని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 17-18 తేదీల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఫలితంగా నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మరో 4 రోజులు వర్షాలు మరో నాలుగు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. బుధవారం రామగుండంలో 41 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 40.3, హన్మకొండ 39.7, నల్లగొండ 39.4, నిజామాబాద్ 39.3, ఖమ్మం 39.2, భద్రాచలంలో 39.0, హైదరాబాద్ 37.3, మెదక్ 37.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారబోతున్నాయి..
హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారబోతున్నాయి.. ఉదయం పది దాటితేచాలు వడగాడ్పులు పంజా విసరబోతున్నాయి.. నోరు తెరిస్తే చాలు గొంతెండిపోనుంది. అదే మూడు నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోనుంది.. కుండపోత వానలతో పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం కానుంది.. భారీ వర్షాలతో కొత్త ఆశలకు బీజం వేయనుంది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితులకు కారణం ఎల్‌నినో, లానినా పరిస్థితులే. ఏమిటీ ఎల్ నినో? సూర్యుడి తాపానికి భూమధ్య రేఖా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంతో పోలిస్తే 0.5 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉన్న పరిస్థితిని ‘ఎల్‌నినో’ అంటారు. స్పానిష్ భాషలో ‘చిన్న బాలుడు’ అని దీనికి అర్థం. ఇది నాలుగున్నరేళ్లకోసారి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సాధారణం కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కొన్నిచోట్ల విపరీతమైన వర్షాలు కురిస్తే... కొన్నిచోట్ల తీవ్రమైన వర్షాభావం, కరువు పరిస్థితులకు కారణమవుతుంది. ఎల్‌నినో కారణంగా బ్రెజిల్ సహా దాని చుట్టుపక్కల దేశాల్లో భారీగా వర్షాలు కురుస్తాయి. అదే భారత్‌లో, దక్షిణాసియా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడం, తీవ్ర వర్షాభావ పరిస్థితులను సృష్టిస్తుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఎల్‌నినో కారణంగా వచ్చే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో గత పదేళ్లలో లేనంత అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు 50 ఏళ్లలో సంభవించిన ఎల్‌నినో రికార్డుల ప్రకారం కరువు, వర్షాభావ పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. 2002, 2004, 2009, 2014లలో ఎల్‌నినో రావడంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. 1953, 1969, 1997 సంవత్సరాాల్లో ఎల్‌నినో ఉన్నా సాధారణ వర్షాలే నమోదయ్యాయి. లానినో అంటే.. భూమధ్య రేఖ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా ఉన్న పరిస్థితిని ‘లానినో’ అంటారు. స్పానిష్ భాషలో ‘చిన్న బాలిక’ అని దీనికి అర్థం. ఎల్‌నినో క్రమంగా బలహీనపడితే.. ఆ ప్రాంతంలో లానినా ఏర్పడుతుంది. దీంతో దక్షిణాసియా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఎల్‌నినో ఎంత తీవ్రంగా ఉంటే.. లానినా కూడా అదే స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. ఈ లెక్కన ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో పాటు జూలై తొలి వారం నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకు ఏర్పడుతాయి? కాలుష్యం పెరగడం, రకరకాల కారణాలవల్ల అడవులు, చెట్ల సాంద్రత తగ్గి పచ్చదనం తగ్గిపోవడమే వాతావరణలో పెను మార్పులకు కారణం. దీనికితోడు వివిధ రసాయనాలు, క్లోరోఫ్లోరో కార్బన్ల కారణంగా భూమిని ఆవరించి ఉన్న ఓజోన్ పొర మందం తగ్గిపోతోంది. భూమిపై పడిన సూర్యరశ్మి కాలుష్య మేఘాల కారణంగా తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందడం తగ్గిపోతోంది. దీంతో భూమి విపరీతంగా వేడెక్కుతోంది. దీనినే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఎల్‌నినో, లానినో వంటి విపరీతమైన మార్పులకు ఇదే కారణం. ఒక ప్రాంతంలో తీవ్రమైన వర్షాభావం, మరో ప్రాంతంలో భారీ వర్షాలు, అత్యధిక ఉష్ణోగ్రతలు వంటి అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడుతాయి. 1961 నుంచి 1990 వరకున్న సరాసరి ఉష్ణోగ్రత కంటే 2015 నాటికి భూమిపై 0.73 డి గ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోందని వాతావరణ మార్పులపై పారిస్‌లో జరిగిన సదస్సు తేల్చింది. 0.73 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడమనేది అసాధారణం. ఇటీవల చెన్నైలో ఒకేరోజు 50 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురవడానికి, ఆంధ్రప్రదేశ్‌లోనూ కుండపోత వర్షాలకు గ్లోబల్ వార్మింగే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
రైతు గుండెల్లో ఎల్‌నినో గుబులు
కడప అగ్రికల్చర్ : ఎల్‌నినో...రైతును వెంటాడుతున్న వాతావరణ భూతం.. 2014-15లో కరువుతో అల్లాడిన రైతన్న 2015-16 ఖరీఫ్ సాగుపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఏడాది సకాలంలో రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పినా, మరోవైపు ఎల్‌నినో ప్రభా వం వల్ల వర్షపాతం తగ్గవచ్చని, అందులోనూ సాధారణ వర్షపాతం కంటే 10 శాతం తగ్గుతుం దని చెబుతున్నారు. ఈ ఏడాది కరువు తప్పదా అనే ప్రశ్న..? రైతన్నను వెంటాడుతోంది. ఎల్‌నినో అంటే....: మహాసముద్రాలపై ఉపరితల ఉష్ణోగ్రతలు(వేడిమి) పెరగడం వల్ల నీళ్లు అమిత వేడిగా మారిపోతాయి. సముద్రాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయి. ఇలాఉష్ణోగ్రతలు అనుకోకుండా పెరగడం వల్ల, సముద్రపు నీరు ఆవిరి రూపంలో వెళ్లి నీరులేని మేఘాలు ఏర్పడతాయి. దీని మూలంగా మేఘాలలో తేమ లేకపోవడం వల్ల వాతావరణంలోను, వర్షపాతంలోను స్థిరత్వం ఉండదు. దీంతో కరువు వస్తుంది. దీన్నే ఎల్‌నినో అంటారని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఎల్‌నినో వల్ల ఒక్కోసారి కరువు కాట కాలు రావచ్చు, అనుకోకుండా అకాల వర్షాలు, ఉన్న మేఘాలన్నీ ఒకే ప్రాంతంలో నీటిని కుమ్మరించడం వల్ల వరదలు రావడం భారీగా నష్టం సంభవించడం జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చినుకురాలితే చిరునవ్వు...లేదంటే కన్నీరే... జిల్లాలో మెజార్టీ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వ్యవసాయంలో ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ కష్ట నష్టాలకోర్చి వ్యవసాయాన్ని చేపడుతూనే ఉన్నారు. జిల్లాలో 85 శాతం మంది రైతులు వర్షాధారంగానే పంటలు పండిస్తున్నారు. చినుకురాలితే రైతన్న మోములో చెప్పలేనంత చిరునవ్వు...లేదంటే కంట కన్నీరు తప్పని పరిస్థితి. తాజాగా వినిపిస్తున్న ఎల్‌నినోతో అన్నదాతను భయం వెంటాడుతోంది. జిల్లాలో వ్యవసాయం తీరు తెన్నులు.. జిల్లాలో ప్రధానంగా రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, పులివెందుల, ముద్దనూరు, పోరుమామిళ్ల వ్యవసాయ డివిజన్లు పూర్తిగా, కమలాపురం, కడప, ప్రొద్దుటూరు డివిజన్లలో కొన్ని మండలాల్లో వర్షం వస్తేనే భూములు పచ్చని పైర్లతో కళకళలాడేది. లేకపోతే బీళ్లుగానే ఉంటాయి. జిల్లాలో మొత్తం 3,84,679 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఏటా 1,27,394 హెక్టార్లలో వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, జొన్న, మొక్కజొన్న, సజ్జ, కొర్ర, రాగి, మినుము, పెసర, అలసంద, కూరగాయలు తదతర ఆహార పంటలు సాగవుతుండగా, ఆహారేత పంటలు 1,07,763 హెక్టార్లలో సాగవుతున్నాయి. మిగిలిన భూమిలో పలురకాల పంటలున్నాయని వ్యవసాయశాఖ అంచనాలు చెబుతున్నాయి. సకాలంలో వర్షాలు కురిస్తే రైతులు పంటలసాగుకు తెచ్చిన పెట్టుబడితోపాటు నాలుగు రూపాయలు కళ్లజూస్తారు. లేదంటే పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చలేక నరకయాతన తప్పదు. మూడేళ్లుగా...వర్షపాతాల్లో హెచ్చుతగ్గులు...: జిల్లాలో సాధారణ వర్షపాతానికి, కురుస్తున్న వర్షపాతానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. వర్షపాతం రికార్డులను పరిశీలిస్తే మూడేళ్లుగా కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి సాధారణ వర్షపాతం 699.6 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉంటుంది. 2012-13 లో ఖరీఫ్‌లో 570.5 మిల్లీ మీటర్లు కురిసింది. 2013-14లో అకాల వర్షాలతో 708.7 మిల్లీ మీటర్లు కురిసి పంటలను నష్టపోయారు. 2014-15లో 464.9 మిల్లీ మీటర్ల వర్షం కురవడంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఎల్‌నినో ప్రభావంతో 2015-16 ఈ ఖరీఫ్‌లోను వర్షపాతంలో 10 శాతం లోటు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తుండడంతో జిల్లా రైతుల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. ఈనెల సాధారణ వర్షపాతం 69.0 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 47.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గత ఏడాది ఖరీఫ్ కన్నీటీ గాథ ఇది... గత ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,79,536 హెక్టార్లు కాగా అరకొర వర్షాల కారణంగా కేవలం 43,576 హెక్టార్లలోను, రబీలో సాధారణ సాగు భూమి 2,05,143 హెక్టార్లు ఉండగా ఇందులోను అరకొర వర్షాలకు కేవలం 56,433 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు ఆ సీజన్లో దాదాపు నెల రోజులపాటు వర్షం కురవకపోవడంతో పంటలు నిలువునా ఎండిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 28 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రకటించింది. -
కరువుపై అప్రమత్తం..!
సాక్షి, హైదరాబాద్: ఎలినినో కారణంగా ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ను కరువు కమ్మే అవకాశాలుండడం వ్యవసాయ శాఖను ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వ కరువు హెచ్చరికలతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని కేంద్ర మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ (క్రిడా) రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. మూడు విడతల ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేసి, రైతుల్లో పెద్ద ఎత్తున చైతన్యం కలిగించాలని నిర్ణయించింది. రైతులలో చైతన్యం ద్వారా కరువు పరిస్థితుల్లో నష్టాన్ని కొంతైనా తగ్గించవచ్చని వ్యవసాయశాఖ యోచిస్తోంది. ఈసారి వర్షపాతం గణనీయంగా పడిపోయి కరువు పరిస్థితులు తలెత్తనున్నాయని జాతీయ వాతావరణశాఖ అంచనా. ఖరీఫ్ సీజన్లో సాధారణంగా 715 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. గత ఖరీఫ్‌లో 30 శాతం లోటు నమోదు కాగా, ఈసారి 67 శాతం వరకు ఉంటుందని అంచనా. మూడు విడతల ప్రత్యామ్నాయం... వర్షాభావ పరిస్థితులు నెలకొంటే అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలపై వ్యవసాయశాఖ కసరత్తు చేసింది. వ్యవసాయశాస్త్రవేత్తలో కలిసి మూడు విడతల ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసింది. జూలై 15 వరకు వర్షాలు లేకుంటే ఒక ప్రణాళిక, జూలై 31 వరకు రాకుంటే రెండో ప్రణాళిక, ఆగస్టు 15 నాటికి కురియకుంటే మూడో ప్రణాళిక అమలు చేస్తారు. ఆగస్టు 15 నాటికి వర్షాలు కురవకుంటే వరి పంటను పూర్తిగా మినహాయిస్తారు. వర్షాభావాన్ని ఎదుర్కొంటాం: క్రిడా వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లలో ఎలాంటి పరిస్థితుల నైనా ఎదుర్కొంటామని, అలాంటి సాంకేతిక పరి జ్ఞానం తమ వద్ద ఉందని కేంద్ర మెట్ట వ్యవసా యపరిశోధన సంస్థ(క్రిడా) సంచాలకులు సీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. క్రిడా కార్యాలయంలో సోమవారం తెలంగాణ జిల్లాల వ్యవసాయశాఖ సంచాలకులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ కో-ఆర్డినేటర్లు సహా ఇతర అధికారులతో ఖరీఫ్, రబీ సన్నద్ధతపై ప్రత్యేక సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో ఏర్పడనున్న వాతావరణ అంచనాలను వివరించారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి మాట్లాడుతూ రూపొందించుకున్న ప్రణాళికలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
గాలివాన, గాడ్పు ఎల్ నినో ముఖాలే
వాతావరణాన్ని పద్ధతి ప్రకారం రికార్డులలో నమోదు చేయడం మొదలైన తరువాత భారతదేశంలో నాలుగు నుంచి ఐదేళ్లకు ఒకసారి ఎల్ నినో పరిస్థితులు నెలకొంటున్న సంగతిని గమనించారు. అధికశాతం ఎల్‌నినో సంవత్సరాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి కూడా. చెట్టు కాయకూ సముద్రంలో ఉప్పుకూ లంకె కుదిరితే నోరూరించే ఆవకాయ అవుతుందేమోగానీ ఎక్కడో పసిఫిక్ మహా సముద్రంలో నీరు వెచ్చబడి, దానికి వాతావరణ మార్పు తోడైతే మాత్రం మన దేశంతోపాటు, చాలా ఆసి యా దేశాల్లో కరువు భయాలు కమ్ముకుంటాయి. అప్పుడ ప్పుడూ వచ్చి... కొందరికి ఖేదం మరికొందరికి మోదం కలి గించిపోయే వాతావరణ వ్యవస్థ ఎల్ నినో దుష్పరిణామం ఇది. దురదృష్టవశాత్తూ ఈ ఏడాది కూడా ఎల్ నినో దాపురిం చడానికి అవకాశాలు ఉన్నాయని అనవచ్చు. ఆ అవకాశాలు 70 - 80 శాతమని అనవచ్చు కూడా. దేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? వాన కురుస్తుందా? కరువు కాటేస్తుందా? గత అనుభవాలను చూస్తే రెండో ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. రికార్డు లను బట్టి చూస్తే ముంచెత్తే వానలకూ అవకాశం లేకపో లేదు. పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ అమెరికా దగ్గర భూ మధ్య రేఖకు ఇరువైపులా ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు పెరిగి పోవడమనే దృగ్విషయాన్ని ఎల్ నినోగా వ్యవహరిస్తామ న్నది తెలిసినదే. ఇలా అక్కడ నీరు వెచ్చబడినప్పుడు సము ద్రపు అట్టడుగు భాగాల్లో ప్రవహించే అంతర్వాహినుల్లోనూ తేడాలొస్తాయి. ఇంతకీ, ఎల్ నినో వచ్చిందనగానే.. ఈ మార్పులన్నీ జరిగిపోతాయని అర్థం కాదు. ఎల్ నినోలు రెండు రకాలు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు డిసెంబరి సమయం నుంచి కొంచెం కొంచెంగా పెరుగుతూ మే నెల నాటికి అకస్మాత్తుగా పెరిగితే దాన్ని బలమైన ఎల్ నినోగా పిలుస్తారు. మే నెలలో ఉష్ణోగ్రతల పెరుగుదల చెప్పుకోదగ్గ స్థాయిలో లేకుండా ఉన్నప్పుడు దాన్ని బలహీనమైందని అంచనా వేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారత వాతావరణ విభాగంతోపాటు, కొన్ని ప్రైవేట్ వాతావరణ అధ్యయన సంస్థలు ఈసారి బలహీనమైన ఎల్ నినో రానున్నదని అంచనాకు వచ్చాయి. దాని ఆధారంగానే ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉంటాయని ప్రకటించారు. అయితే అప్పటికి మే నెల ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకోలేదు. వాటిని కూడా లెక్కించి చూసిన తరువాత తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షాభావం, కరువు వచ్చేందుకు 23 శాతం అవకాశముందని లెక్కకట్టారు. ఎల్ నినో రాకకు ఉన్న అవకాశాలు 60 శాతం నుంచి 70 శాతానికి పెరిగాయి. వాతావరణాన్ని పద్ధతి ప్రకారం రికార్డులలో నమోదు చేయడం మొదలైన తరువాత భారతదేశంలో నాలుగు నుంచి ఐదేళ్లకు ఒకసారి ఎల్ నినో పరిస్థితులు నెలకొంటున్న సంగతిని గమనించారు. అధికశాతం ఎల్ నినో సంవత్స రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి కూడా. 1871 నుంచి 1978 మధ్యకాలంలో దాదాపు 22 సార్లు ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే ఐదుసార్లు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు ఏర్పడగా... బలహీన ఎల్ నినో పరిస్థితు లున్న నాలుగేళ్లు వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. 2009 నాటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఆ ఏడాది రుతు పవనాల రాక ఆలస్యం కాగా.. ఆ తరువాత కూడా దేశ వ్యాప్తంగా వానలు పలు అంతరాయాల మధ్య కురిశాయి. అదే సమయంలో ఆ ఏడాది అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసి శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి లో నిండింది. మరి ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక వారం రోజులు ఆలస్యమైంది. జూన్ 8వ తేదీ నాటికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విస్తరించాల్సిన మేఘాలు దక్షిణం కొస వద్ద తారాడుతున్నాయి. బంగాళాఖాతం నుంచి తగు మోతాదులో తేమ అందకపోవడం వల్ల రుతుపవన మేఘా ల విస్తరణ, విస్తృతిల్లో తేడాలు ఉంటాయని, అడపాదడపా కొంత స్తబ్దత నెలకొనే అవకాశముందని ఇప్పటికే కొన్ని వాతావరణ సంస్థలు హెచ్చరించాయి. జూన్ నుంచి సెప్టెం బర్ వరకు, ఒక్క ఆగస్టులోనే సాధారణం కంటే కొంచెం ఎక్కువగా వానలు కురిసే అవకాశముందని కూడా ఈ సం స్థలు అంచనా వేశాయి. అయితే బంగాళాఖాతంలో తీవ్ర స్థాయి అల్పపీడనమేదైనా ఏర్పడి రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలేందుకు సహకరిస్తే పరిస్థితుల్లో మార్పులు ఉండే అవకాశముంది. ఏది ఏమైనప్పటికీ ముందస్తు హెచ్చ రికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. తాగునీరు, పశుగ్రాసం కొరతలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలి. - గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
నీటి కష్టాలు తప్పవా?
సాక్షి, ముంబై: ఈ ఏడాది కూడా నీటి కష్టాలు తప్పేలా లేవు. ఏప్రిల్ నెలాఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు 33 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ నీటితోనే దాదాపు రెండు నెలలపాటు గడపాల్సి ఉంటుంది. అదీ సకాలంలో వర్షాలు కురిస్తేనే. గత ఏడాది ఏప్రిల్ మాసాంతానికి 27 శాతం నిల్వలే ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా సాధారణస్థాయిలో వర్షపాతం నమోదైంది. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు మరింత తక్కువగా కురిసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఆందోళన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... రాష్ట్రంలో రోజురోజుకు భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. నిన్నమొన్నటిదాకా 40 డిగ్రీల లోపు నమోదైన ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సూర్యతాపం పెరిగితే జలాశయాల్లోని నీరు మరింత వేగంగా ఆవిరవుతుందని, దీంతో అవి వర్షాకాలం రాకముందే అడుగంటే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే ఈ ఏడాది కూడా కరువు తప్పదంటున్నారు. గత ఏడాదికంటే ఆరుశాతం నీటి నిల్వలు ఎక్కువగానే ఉన్నా ఎల్‌నినో ప్రభావమే ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఆరు రెవెన్యూ విభాగాల్లో 84 భారీ నీటి ప్రాజెక్టులున్నాయి. వీటిలో పుణే, మరాఠ్వాడా విభాగాల్లో అత్యల్పంగా 30 శాతం నీటి నిల్వలుండగా, అత్యధికంగా నాగపూర్ విభాగంలో 53 శాతం నీటి నిల్వలున్నాయి. -
కృత్రిమ వర్షాలవైపు బీఎంసీ చూపు
సాక్షి, ముంబై: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో నగర పాలక సంస్థ(బీఎంసీ) అప్రమత్తమైంది. అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కృత్రిమ వర్షం వైపు దృష్టిసారించింది. నగరంలో సుమారు కోటిన్నర జనాభా ఉంది. వీరందరికి ప్రతిరోజూ దాదాపు 450 ఎమ్మెల్డీల నీరు అవసరముంటుంది. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో ఉన్న జలాలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు ప్రత్యామ్నాయాలపై బీఎంసీ దృష్టిపెట్టింది. నగరానికి నీటిని సరఫరా చేస్తున్న ఏడు జలాశయాల్లో మూడు నెలలకు సరిపడేంత నీరు మాత్రమే నిల్వ ఉంది. ఒకవేళ సమయానికి అనుకున్నంత మేర వర్షాలు కురవకపోతే పరిస్థితిని ఎలా గట్టెక్కాలనే ఆలోచన నేపథ్యంలో బీఎంసీ ఈ కృత్రిమ వర్షాలవైపు మొగ్గు చూపుతున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. మేఘమథనం చేసి, కృత్రిమ వర్షాలను కురిపించే ప్రక్రియ భారీ వ్యయం, రిస్క్‌తో కూడుకున్నది కావడంతో పరిపాలన విభాగం తుది నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే నిపుణులతో కూడా చర్చించినట్లు సమాచారం. 2009లో వర్షాలు ముఖం చాటేయడంతో భాత్సా, అప్పర్ వైతర్ణ జలాశయాల ప్రాంతాల్లో కత్రిమ వర్షాల కోసం ప్రయత్నాలు చేశారు. కాని ఈ ప్రయోగం ఊహించిన స్థాయిలో సఫలీకృతం కాలేకపోయింది. కృత్రిమ వర్షం కోసం వినియోగించిన విమానాలు సరిగా పనిచేయకపోవడం, రాడార్ కారణంగా 160 సార్లు మేఘాలపై రసాయనాలు పిచికారి చేసినప్పటికీ చెదురుమదురు జల్లులు మినహా పెద్ద వర్షాలేవీ కురవలేదు. అయితే అదృష్టం బాగుండి ఆ తరువాత వర్షాలు కురవడంతో అప్పట్లో నీటి కొరత సమస్య పరిష్కారమైంది. గత మూడు సంవత్సరాల నుంచి సాధారణస్థాయిలో వర్షాలు కురవడంతో కృత్రిమ వర్షాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం బీఎంసీకి రాలేదు. కాని ఈ ఏడాది వర్షాపాతం కొంత తక్కువ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించడంతో బీఎంసీ అప్రమత్తమైంది. భవిష్యత్తులో నీటి కొరత సమస్య తెరమీదకు రాకుండా జాగ్రత్త పడుతోంది. గత సంవత్సరం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు లేక కరవు తాండవించింది. అనేక పశువులు మృత్యువాత పడ్డాయి. గ్రామాలకు గ్రామాలే వలసలు పోయాయి. కాని ముంైబె నగరానికినీటిని సరఫరాచేసే జలాశయాల పరిధిలో మాత్రం పుష్కలంగా వర్షాలు కురవడంతో కరవు ప్రభావం ముంబైకర్లపై పెద్దగా కనిపించలేదు. జలాశయాల్లో నీటి నిల్వలను బట్టి బీఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతుంది. ఆ ప్రకారం ఏటా వర్షాకాలానికి కొద్ది రోజుల ముందు నుంచి నగర ప్రజలకు 10-15 శాతం వరకు నీటి కోత అమలు చేస్తుంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు 25 శాతం కోత విధిస్తుంది. కాని ఈ సారి వాతావరణ శాఖ చాలా రోజుల ముందే హెచ్చరికలు జారీ చేయడంతో కోతలు కూడా భారీగానే ఉండే అవకాశముందని బీఎంసీ అధికారులు చెబుతున్నారు. -
ముంచుకొస్తున్న కరువు
సింగపూర్: భారత్‌కు మళ్లీ కరువు ముప్పు ముంచుకొస్తోంది. దేశంలో గత నాలుగేళ్లుగా వర్షాలను సమృద్ధిగా కురిపించిన రుతుపవనాలు ముఖం చాటేయనున్నాయి. ఈ ఏడాది నుంచి మళ్లీ వర్షాభావంతో పంటలపై తీవ్ర ప్రభావం పడనుంది. వరి, గోధుమ, చెరకు ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉన్న భారత్ ఆ పంటల దిగుబడులు తగ్గి కరువును ఎదుర్కోనుంది. పసిఫిక్ మహా సముద్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగి ‘ఎల్ నినో’ వాతావరణ పరిస్థితులు ఏర్పడనుండటమే ఈ గడ్డు కాలానికి కారణం కానుంది. ఈ ఏడాది రెండో సగం నుంచి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ‘బ్యూరో ఆఫ్ మెటియరాలజీ’, అమెరికాకు చెందిన ‘యూఎస్ క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్’ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ ఎల్ నినోతో భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా తీర ప్రాంతాలు, ఆఫ్రికాలోనూ తీవ్ర కరువు ఏర్పడనుంది. అదే సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియా, తదితర ప్రాంతాలు, బ్రెజిల్ దేశాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఎల్ నినో తీవ్రతపై వాదనలు కొనసాగుతున్నాయని, దీనిని తీవ్రమైనదిగా నిర్ధారిస్తే గనక.. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడి వివిధ సరుకుల ధరలు కూడా నింగినంటుతాయని అంటున్నారు. ఇంతకుముందు 2009లో ఏర్పడిన ఎల్ నినో వల్ల.. భారత్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా నాలుగు దశాబ్దాల్లోనే అతిపెద్ద కరువును దేశం చవిచూడాల్సి వచ్చింది. చక్కెర ధరలు సైతం 30 ఏళ్లలో అత్యధికంగా పెరిగాయి. 1990లలో తీవ్ర ఎల్ నినో వల్ల ఏర్పడిన కరువుకు వివిధ దేశాల్లో 2 వేల మంది మృత్యువాతపడ్డారు. వందల కోట్ల డాలర్ల నష్టం సంభవించింది. ప్రస్తుత ఎల్ నినో వల్ల థాయిలాండ్, ఇండోనేసియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, చైనా దేశాల్లో వరి, కాఫీ, మొక్కజొన్న పంటలు కరువుతో ఎండిపోనున్నాయి. వరదలు రావడం లేదా రవాణాకు ఆటంకం కలగడం వల్ల బంగారం, నికెల్, టిన్, కాపర్ (రాగి), బొగ్గు వంటి ఖనిజాల ధరలూ భారీగా పెరిగే అవకాశమూ ఉంది. ఎల్ నినో.. ‘బ్యాడ్’బోయ్! స్పానిష్ భాషలో ఎల్ నినో అంటే బాలుడు అని అర్థం. పసిఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితినే ఎల్ నినోగా పిలుస్తారు. ఇది ప్రతి 4 నుంచి 12 ఏళ్లకు ఒకసారి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ ఎల్ నినో-దక్షిణ డోలనం అనే సహజ వాతావరణ వలయంలో భాగంగా జరుగుతుంది. ఎల్ నినో వల్ల రుతుపవనాలు ప్రభావితమై ఆయా దేశాల్లో తీవ్ర కరువు ఏర్పడే ముప్పు ఉంటుంది కాబట్టి.. దీనిని బ్యాడ్ బోయ్‌గా అభివర్ణిస్తారు. ఇది ముఖ్యంగా మనదేశంలో నైరుతి రుతుపవనాలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. అలాగే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా తగ్గి.. ఎల్ నినోకు వ్యతిరేక ంగా ఏర్పడే వాతావరణ పరిస్థితిని ‘లా నినా’(స్పానిష్‌లో లిటిల్ గర్ల్)గా పిలుస్తారు. దీని వల్ల అమెరికా, తదితర చోట్ల కరువు ఏర్పడుతుంది. భారత్, ఆస్ట్రేలియా, తదితర దేశాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి.