న్యూఢిల్లీ: ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ మొత్తమ్మీద సాధారణ వర్షపాతంతో ఈ సీజన్ ముగిసిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. నాలుగు నెలల వర్షాకాలంలో దేశంలో దీర్ఘకాల సగటు వర్షపాతం 868.6 మిల్లీమీటర్లు కాగా, ఈసారి ఎల్‌నినో పరిస్థితులను నిలువరించే సానుకూల కారకాల ప్రభావంతో 820 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది 94.4 శాతమని ఐఎండీ తెలిపింది. దీర్ఘకాలం సరాసరి వర్షపాతం 94–106 శాతం మధ్య నమోదైతే సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు.
వాతావరణ మార్పుల కారణంగా రుతుపవనాల్లో అస్థిరత ఏర్పడినట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర శనివారం మీడియాతో అన్నారు. దేశంలోని 36 వాతావరణ సబ్ డివిజన్లకుగాను మూడింటిలో అధిక వర్షపాతం, 26 సబ్ డివిజన్లలో సాధారణ, ఏడింట్లో లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. లోటు వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, జార్ఖండ్, బెంగాల్, బిహార్, యూపీలో కొంత భాగం, కర్ణాటక దక్షిణ ప్రాంతం, కేరళ ఉన్నాయన్నారు.
అదేవిధంగా, దక్షిణాది రాష్ట్రాల్లో 8% లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర జలాల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు (హిందూ మహా సముద్రం డైపోల్), గాల్లో మేఘాలు, వర్షాలు తూర్పు దిశగా కదిలే తీరు(మాడెన్–జులియన్ ఆసిలేషన్) ఈ దఫా రుతుపవనాలను ప్రభావితం చేశాయని మహాపాత్ర విశ్లేషించారు. ఈ రెండు పరిస్థితులు ఎన్ నినో ప్రభావాన్ని తగ్గించాయని వివరించారు.
నైరుతి రుతు పవనాల సమయంలో ఏటా సాధారణంగా 13 వరకు అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి, ఈసారి 15 అల్ప పీడనాలు ఏర్పడినప్పటికీ వాటి వృద్ధి సక్రమంగా లేదన్నారు. ఎల్‌నినో కారణంగానే 1901 తర్వాత అత్యంత వేడి మాసంగా ఈ ఏడాది ఆగస్ట్ రికార్డు సృష్టించిందన్నారు. నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈసారి 8 రోజులు ఆలస్యంగా సెప్టెంబర్ 25వ తేదీన పశ్చిమ రాజస్తాన్ నుంచి ప్రారంభమయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment