
న్యూఢిల్లీ: సమగ్ర ఆర్థిక వాణిజ్య భాగస్వామ్య ఒప్పందంపై భారత్, చిలీ చర్చలు ప్రారంభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ ఫాంట్ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, ఖనిజాలు, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో కలిసి పని చేయాలని, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. లాటిన్ అమెరికాలో చిలీ తమకు అత్యంత కీలక భాగస్వా మ్య దేశమని మోదీ పేర్కొన్నారు.
చిలీతో దశాబ్దా లుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకుంటామని వెల్లడించారు. బోరిక్ ఫాంట్‌తో భేటీ అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. భౌగోళికంగా దూరంగా ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య ఎన్నో సారూప్యతలున్నాయని గుర్తుచేశారు.
డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, అంతరిక్షం వంటి రంగాల్లో తమ అనుభవాన్ని చిలీలో పంచుకోడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ వెల్లడించారు. ఐరాస భద్రతా మండలితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల విషయంలో ఇండియా, చిలీ ఏకాభిప్రాయంతో ఉన్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వీసా జారీ ప్రక్రియను సులభతరంగా మార్చుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.