
న్యూఢిల్లీ: దేశంలో వర్షాకాలం రెండో అర్ధభాగం(ఆగస్ట్–సెప్టెంబర్)లో సాధారణ వర్షాలే కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం తెలిపింది. జూలైలో దేశవ్యాప్తంగా అధిక వర్షాలు నమోదయ్యాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో పరిస్థితులు ప్రభావితం చేయలేకపోయాయని తెలిపింది.
ఆగస్ట్, సెప్టెంబరు నెలల్లో సాధారణ వర్షపాతాన్ని అంచనా వేసినప్పటికీ, సాధారణ (422.8 మిల్లీమీటర్ల కంటే తక్కువగా (94 శాతం నుంచి 99 శాతం) కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర మీడియాతో అన్నారు. జూన్‌లో సాధారణం కంటే 9% లోటు వర్షపాతం నమోదవగా, జూలై వచ్చే సరికి 13% అదనంగా వానలు పడ్డాయని చెప్పారు. అయితే, తూర్పు, ఈశాన్య భారతంలో 1901 తర్వాత మొదటిసారిగా అత్యల్ప వర్షపాతం 280.9 మిల్లీమీటర్లు నమోదైందని చెప్పారు. గత అయిదేళ్లలోనే అత్యధికంగా ఈసారి 1,113 భారీ వర్షపాతం ఘటనలు, 205 అత్యంత భారీ వర్షపాతం ఘటనలు జూలైలో నమోదయ్యాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment