నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ బిల్లు | Waqf Amendment Bill To Be Presented In Lok Sabha On April 2nd, Know About Waqf Bill Controversy Inside | Sakshi
Sakshi News home page

Waqf Bill Row: నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ బిల్లు

Published Wed, Apr 2 2025 4:15 AM | Last Updated on Wed, Apr 2 2025 9:15 AM

Waqf Amendment Bill To Be Presented In Lok Sabha on April 2

మంగళవారం పార్లమెంట్‌ హౌస్‌లో ఇండియా కూటమి నేతల భేటీలో రాహుల్, ఖర్గే

ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని బీఏసీ భేటీలో నిర్ణయం  

బిల్లుపై నేడు ఓటింగ్‌ 

రేపు రాజ్యసభలో చర్చ, ఓటింగ్‌  

బిల్లును ఆమోదింపజేసుకోవాలని పట్టుదలతో ఉన్న కేంద్రం 

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష ‘ఇండియా’ కూటమి  

బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

న్యూఢిల్లీ: కీలకమైన వక్ఫ్‌(సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్‌(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు.

బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్‌(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్‌ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు. 

ఎన్డీయేలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలైన తెలుగుదేశం, జేడీ(యూ) తమ ఎంపీలకు విప్‌ జారీ చేశాయి. బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆదేశించాయి. బిల్లుకు మద్దతు పలకాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇతర పార్టీలు సైతం తమ ఎంపీలకు విప్‌లు జారీ చేశాయి. వక్ఫ్‌ (సవరణ) బిల్లును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు.  

బీఏసీ సమావేశం నుంచి విపక్షాల వాకౌట్‌  
వక్ఫ్‌ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకు రానున్న నేపథ్యంలో స్పీకర్‌ ఓం బిర్లా ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. విపక్షాలు సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలన్న ప్రతిపాదనకు వారు అంగీకరించారు. అయితే, ఈ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం తమ గొంతును అణచివేస్తోందని ఆరోపిస్తూ బీఏసీ సమావేశం నుంచి విపక్ష నేతలు వాకౌట్‌ చేశారు. దీన్నిబట్టి చూస్తే బుధవారం లోక్‌సభలో వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. 

బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న లక్ష్యంతో విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఉమ్మడి వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ‘ఇండియా’ కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాందీ, కేసీ వేణుగోపాల్, రాంగోపాల్‌ యాదవ్, సుప్రియా సూలే, కల్యాణ్‌ బెనర్జీ, సంజయ్‌ సింగ్‌. టి.ఆర్‌.బాలు, తిరుచ్చి శివ, కనిమొళి, మనోజ్‌కుమార్‌ ఝా తదితరులు మంగళవారం సమావేశమయ్యారు. ఉమ్మడి వ్యూహంపై చర్చించారు.  ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను అణచివేయడానికే వక్ఫ్‌(సవరణ) బిల్లును మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఆరోపించారు.

బిల్లుకు మద్దతు పలుకున్న తెలుగుదేశం, జేడీ(యూ)లకు ప్రజలు కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజ్యాంగవిరుద్ధమైన బిల్లును ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ బీఏసీ సమావేశం జరిగింది. గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 293 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి.

ఏమిటీ వివాదం? 
వక్ఫ్‌ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్‌ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్‌ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం. 

ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్‌ ఆస్తినీ సెంట్రల్‌ పోర్టల్లో విధిగా నమోదు చేయించాలి. 

ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్‌ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement