
సవరణ బిల్లుతో ముస్లింల హక్కుల్ని కాలరాసే కుట్ర
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖాలిద్ సైఫుల్లా రెహ్మానీ
సవరణ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేసిన మాజీ మంత్రి పేర్ని నాని
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ బిల్లును అడ్డుకోకపోతే ఊరుకోబోమంటూ ముస్లింల హెచ్చరిక
సాక్షి, అమరావతి: వక్ఫ్ సవరణ బిల్లును దేశ ప్రజలంతా అడ్డుకుని తీరాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) అధ్యక్షుడు ఖాలిద్ సైపుల్లా రెహ్మానీ పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లును తిరిస్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ, రాష్ట్ర ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో శనివారం మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముస్లింలు పెద్దఎత్తున తరలిరాగా.. వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ సంఘీభావం తెలిపాయి.
ఈ సందర్భంగా జరిగిన సభలో రెహ్మానీ మాట్లాడుతూ.. రాజ్యాంగం ముస్లింలకు ప్రసాదించిన హక్కులను వక్ఫ్ సవరణ బిల్లుతో కాలరాసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. వందల ఏళ్లనాటి మసీదులు, మదర్సాల రిజిస్ట్రేషన్ పత్రాలు దొరక్కపోతే మత సంబంధమైన బై యూజర్ నియమం ద్వారా చట్టబద్ధత లభిస్తుందన్నారు. అటువంటి నియమాలను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు తెచ్చి.. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకోవాలని చూస్తోందని విమర్శించారు.
దేశంలో ఇప్పటికే లక్షలాది ఎకరాలను ప్రభుత్వాలు ఆక్రమించాయని, ఇంకా అనేక హాస్యాస్పదమైన సవరణలు చేసి వక్ఫ్‌ను బలహీన పరచడానికి సవరణ బిల్లు తెచ్చారన్నారు. దీనిపై కొన్ని మీడియా సంస్థలు సైతం తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు దేశ లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థకు పెను ప్రమాదమని, రాజ్యాంగ పరిరక్షణకు, లౌకిక వాదాన్ని కాపాడేందుకు దేశంలోని సెక్యులర్ పార్టీలు ఐక్యంగా పోరాడాలని కోరారు.
మహాధర్నాలో జమాతే ఇస్లాం హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ రఫిక్, ఉపాధ్యక్షుడు మాలిక్ ముహతషిమ్ ఖాన్, మజ్లిస్ ఉలమా ఏపీ ప్రతినిధి మౌలానా ముఫ్తి యూసుఫ్, ఉమ్రి అధ్యక్షుడు మౌలానా నసీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్ షేక్ అసిఫ్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ముస్లిం సమాజానికి తీవ్ర నష్టం
వక్ఫ్ పరిరక్షణ ముస్లింల విశ్వాసానికి సంబంధించిన అంశం. ఈ బిల్లును ఆమోదిస్తే ముస్లిం సమాజానికి తీవ్ర నష్టంతోపాటు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించినట్టు అవుతుంది. వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చిన కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఈ బిల్లు ముస్లింలకు మాత్రమే నష్టం కలిగించదు. వక్ఫ్ చట్టం–1995కు 2013లో సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకుసంక్రమించిన హక్కులు, అ«ధికారాలను కూడా కోల్పోతాయి. – మౌలానాషా ఫజల్ రహీమ్ ముజద్దిద్, ప్రధాన కార్యదర్శి, ఏఐఎంపీఎల్‌బీ
వక్ఫ్ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తోంది
రాజకీయ ప్రయోజనాల కంటే రాజ్యాంగ పరిరక్షణే ముఖ్యమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ భావిస్తారు. అందుకే ముస్లింలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం కలిగేలా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును మా పార్టీ మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. వైఎస్ జగన్ ఆదేశాలతో ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించారు.
మరోసారి పార్లమెంట్‌లో ఆ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తుంది. దేశంలో భిన్న మతాలు, కులాలు కలిసి మెలిసి అన్నదమ్ముల్లా మెలగాలన్నదే వైఎస్సార్‌సీపీ ఉద్దేశం. కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు రాజ్యాంగంలో రాసుకున్న రాతలకు తూట్లు పొడుస్తున్నాయి. అటువంటి పాపపు ఆలోచనల నుంచి వచ్చిందే వక్ఫ్ సవరణ బిల్లు.
పాపాలు చేస్తున్న వారితోపాటు.. అలాంటి వారికి అండగా నిలవడం కూడా పాపమే అని ఖురాన్ చెబుతోంది. రంజాన్ మాసంలో వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లిం సమాజం ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు కారణమైన రాజకీయ పార్టీలను ఈ వేదిక ద్వారా నిలదీయాలి. – పేర్ని నాని, మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నేత