వాతావరణ శాఖ అంచనా
న్యూఢిల్లీ: ఎండలు, వడగాడ్పులతో అల్లాడుతున్న వేళ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు మోసుకొచ్చింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో సమృద్ధిగా వానలు కురుస్తాయని శుభవార్త చెప్పింది. ‘లా నినో’ వాతావరణ పరిస్థితులు కలిసిరావడంతో దేశంలో ఈసారి సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనావేసింది.
వాతావరణ శాఖ అంచనా వివరాలను కేంద్ర భూవిజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ సోమవారం ఢిల్లీలో వెల్లడించారు. ‘‘దీర్ఘకాల సగటు వర్షపాతం 106 శాతం మేర పడొచ్చు. అంటే 87 సెంటీమీటర్లకు మించి నమోదు కావచ్చు. ప్రస్తుతం భూమధ్య రేఖ పసిఫిక్ ప్రాంతంలో మధ్యస్థ ఎల్‌నినో పరిస్థితులున్నాయి. ఈ ఎల్ నినో (వర్షాభావ పరిస్థితులు) నైరుతి రుతుపవనాల ప్రవేశం (జూన్) నాటికి బలహీనపడి, ద్వితీయార్థంలో లా నినో (వర్షాలకు అనుకూల) పరిస్థితులు ఏర్పడనున్నాయి.
గడచిన మూడు నెల్లో ఉత్తరార్థ గోళం, యూరేసియాలో మంచు సాధారణం కన్నా తక్కువగా ఉంది. దీంతో ఈసారి భారత్‌లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువ నమోదు కావచ్చు’’ అని పేర్కొన్నారు. దేశ సాగు విస్తీర్ణంలో 52 శాతం పంటలు వర్షాధార పంటలే. రిజర్వాయర్లు అడుగంటి తాగునీటికి సైతం జనం కష్టాలు పడుతున్న ఈ తరుణంలో వాతావరణ శాఖ ప్రకటన రైతాంగాన్ని భారీ ఊరటనిస్తోంది.
అయితే వాయవ్య, తూర్పు, ఈశాన్య భారతావనిలోని కొన్ని ప్రాంతాత్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదుకావచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అంచనావేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్‌లలో వర్షపాత వివరాలను ఐఎండీ వెల్లడించలేదు. గత 50 ఏళ్ల సగటున అయిన 87 సెంటీమీటర్ల వర్షపాతంలో 96 శాతం నుంచి 104 శాతాన్ని ‘సాధారణ వర్షపాతం’గా ఐఎండీ గణిస్తోంది.
దీర్ఘకాల సగటులో 90 శాతం కన్నా తక్కువ వర్షపాతం కురిస్తే దానిని వర్షాభావ పరిస్థితిగా లెక్కిస్తారు. 90–95 శాతం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా, 105–110 శాతం కురిస్తే సాధారణం కన్నా ఎక్కువగా పరిగణిస్తారు. 1951–2023 కాలంలో పరిశీలిస్తే ఎల్ నినో తర్వాత వచ్చే లా నినో సందర్భాల్లో తొమ్మిదిసార్లు దేశంలో రుతుపవన కాలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. లా నినో సంభవించిన 22 సంవత్సరాల్లో 20 సార్లు సాధారణం/సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment