సాక్షి, హైదరాబాద్ / సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గురువారం అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 10 సెం.మీ పైగా వర్షపాతం నమోదైంది. గరిష్టంగా పెద్దపల్లి జిల్లా కనుకులలో 16 సెం.మీ వర్షం కురిసింది.
తీవ్ర అల్పపీడనంగా మారి..
సోమవారం దక్షిణ ఒడిశా– ఉత్తర ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్ప పీడనంగా బలపడి ఒడిశా తీరం, దాని పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ. వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.
మరోవైపు సోమవారం నాటి ఉపరితల ఆవర్తనం, ఈస్ట్‌వెస్ట్ షియర్ జోన్ ఈ రోజు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణం వైపుకి వంపు తిరిగి ఉంది. ఇక రుతుపవన ద్రోణి మంగళవారం జైసాల్మర్, కోట, మాండ్ల, రాయిపూర్, ఝార్సిగూడ తీవ్ర అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ కారణాల వల్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
జిల్లాల్లో జోరు వాన
ఉమ్మడి వరంగల్‌లో జిల్లాలో ఆరు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంగళవారం పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంగపేట పుష్కర్ ఘాట్ వద్ద పంటపొలాలు కోతకు గురవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల జలదిగ్భంధంలో చిక్కుకుంది.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం ఏడుబావుల జలపాతం వద్ద ప్రమాదవశాత్తూ కొండ పైనుంచి జారిపడటంతో ఖమ్మం జిల్లాకు చెందిన దాసరి సాయి (21) మరణించాడు. ఉమ్మడి వరంగల్‌లో వర్షాలు, వరదలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్‌కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలతో సిద్దిపేట జిల్లాలో 55 చెరువులు అలుగుపోస్తున్నాయి. సిద్దిపేట పట్టణం ఒకటో వార్డుకు చెందిన రామిరెడ్డి(70) అనే వృద్ధుడు కాలకృత్యాలకు వెళ్లగా బాత్‌రూమ్ గోడ కూలడంతో తీవ్ర గాయాలకు గురై మృతి చెందాడు.
గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా..
ఆదిలాబాద్ జిల్లాలో చెరువులు ఉప్పొంగడంతో వంతెనల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. 25 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కాగా, జల్దా గ్రామం నుంచి 108లో గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా వంతెన కూలిపోవడంతో ఆమెను ప్లైఓవర్ బ్రిడ్జి నుంచి 44 జాతీయ రహదారి పైకి తీసుకువచ్చి అటు నుంచి ఆస్పత్రికి తరలించారు. నిర్మల్ జిల్లాలో పంటచేలన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
నిర్మల్ నడిబొడ్డున గల ధర్మసాగర్ చెరువుకు బుంగపడటంతో పక్కనే ఉన్న గాజులపేట కాలనీని నీళ్లు చుట్టుముట్టాయి. ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు 45 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లాలో 1,376 చెరువులుండగా.. ప్రస్తుతం అన్నీ నిండి అలుగు పారుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా మంచిర్యాలలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలోని గర్భిణులు, బాలింతలను మంగళవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment