జలమయమైన పుణె, ముంబై, థానె, పాల్ఘర్
ముంబై: మహారాష్ట్రలోని పలు జిల్లాలపై వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ముంబై మహానగరంసహా థానె, పుణె, పాల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయందాకా ఎడతెగని వానలతో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భీకరవర్షాలకు ఆయా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణెలోని దక్కన్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ముగ్గురు, తహమినీ ఘాట్‌లో కొండచరియలు పడి ఒకరు చనిపోయారు.
జలదిగ్భంధంలో చిక్కుకున్న వారికి కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముంబైలోనూ వానలు ముంచెత్తాయి. సిటీ లోని శాంటాక్రూజ్ ప్రాంతంలో జూలైలోనే అత్యధికంగా 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో రెండో అత్యంత భారీ వర్షపాతం ఇదే. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎయిర్‌పోర్టులో విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై 300 మీటర్ల దూరం తర్వాత ఏమీ కనిపించట్లేదు. దీంతో 11 విమానాలను రద్దుచేశారు. కొన్నింటిని వేరే నగరాలకు దారి మళ్లించారు.
Comments
Please login to add a commentAdd a comment