బీభత్సం సృష్టించిన గాలివాన
పెట్రోల్ బంక్‌పై కుప్పకూలిన భారీ హోర్డింగ్
9 మంది దుర్మరణం, 65 మందికి గాయాలు
హోర్డింగ్ కిందే కనీసం మరో 30 మంది!
ముంబై: అకాల వర్షాలు, దుమ్మూ ధూళితో కూడిన బలమైన ఈదురుగాలులతో ముంబై సోమవారం అతలాకుతలమైంది. నగరంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ముంబైవ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు గంటల పాటు నరకం చవిచూశారు. దుమ్ముతో కూడిన గాలి దుమారం ధాటికి చాలామంది వాహనాలను వదిలి తలదాచుకోవడానికి చెల్లాచెదురయ్యారు.
ఎక్కడ చూసినా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘట్కోపర్ ప్రాంతంలోని చెద్దానగర్ జంక్షన్ వద్ద 100 అడుగుల భారీ అక్రమంగా హోర్డింగ్ ఈదురుగాలుల ధాటికి సాయంత్రం కుప్పకూలింది. అది పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడటంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. హోర్డింగ్ కింద 100 మందికి పైగా చిక్కుకున్నట్టు అధికారులు చెబుతున్నారు! గాయపడ్డ 65 మందిని ఆసుపత్రికి తరలించారు.
ఇంకా హోర్డింగ్ కిందే చిక్కుకున వారిని కాపాడేందుకు ప్రయతి్నస్తున్నట్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గగ్రానీ చెప్పారు. జాతీయ విపత్తు స్పందన బృందంతో పాటు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. భారీ హైడ్రా క్రేన్లు తదితరాలతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఘటన జరిగినప్పుడు పెట్రోల్ బంక్‌లో కనీసం 30కి పైగా ఆటోలు, బస్సులు, లగ్జరీ కార్లున్నట్టు ఒక కానిస్టేబుల్ తెలిపారు. వాటిలో పలు వాహనాలు హోర్డింగ్ కిందే చిక్కుకుపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రమాదస్థలిని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు.
రైళ్లు, విమానాలకు అంతరాయం
గాలివాన ధాటికి ముంబైలో పలు ఇతర చోట్ల కూడా బిల్ బోర్డులు, హోర్డింగులు కూలిపడ్డాయి. వడాల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కూలి ముగ్గురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగిన ఉదంతాల్లో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కనీసం మరో నలుగురు మరణించినట్టు సమాచారం.
ప్రతికూల వాతావరణం వల్ల సోమవారం గంటపాటు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గాలి దుమారం ధాటికి ఏమీ కనిపించని పరిస్థితి నెలకొనడంతో పలు విమానాలను దారి మళ్లించారు. మెట్రో, లోకల్ రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నగరంలో సోమవారం అర్ధరాత్రి దాకా ఈదరగాలులు, ఉరుములు, మెరుపులతో వాన కొనసాగింది. థానె, పాల్ఘర్ తదితర ప్రాంతాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment