సాక్షి, ముంబై: మహారాష్ట్రలో నేటి (జూలై 6) నుంచి 8 వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో ఐఎండీ శుక్రవారం వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.ఇప్పటికే ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ముంబై రహదారులపై, సబ్ వేలలో వర్షపు నీరు చేరడంతో వాహనాలను దారిమళ్లించాల్సి వస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షాలు తెరిపిలేకుండా కురుస్తున్నాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబైసహా తూర్పు, పశ్చిమ ఉప నగరాలలో గత 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇరుకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంధేరీ, సైన్, చెంబూర్, కుర్లా తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరడంతో అనేక చోట్ల వాహనాలను దారి మళ్లించారు. న్యూ ముంబైలోని ఖాందేశ్వర్ రైల్వే స్టేషన్ టికెట్ బుకింగ్ కౌంటర్ జలమయమైంది. సాన్‌పాడా రైల్వే స్టేషన్ దిశగా వెళ్లే రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో ఆటోలు ముందుకు వెళ్లలేకపోయాయి. దీంతో ప్రయాణికులు కాలినడకన ముందుసాగారు.
ముంబై, థానే, ఉప నగరాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే సూచించారు. నదులు, చెరువులు, నాలాల పరీవాహక ప్రాంతాలపై నిఘా వేయాలని అధికారులను ఆదేశించారు. ఐఎండీ హెచ్చరికల ప్రకారం సముద్రంలో మూడు రోజులపాటు హై టైడ్ ఉంటుంది. పెద్దపెద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడే ప్రమాదముంది. దీంతో జనాలు సముద్ర తీరాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
పర్యాటకుల కష్టాలు..
24 గంటల నుంచి తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పంచ్‌గంగాలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. సోమవారం సాయంత్రం వరకు ఈ నదిపై ఉన్న రాజారాం డ్యాంలో నీటి మట్టం 16 అడుగుల మేర పెరిగింది. కాని మంగళవారం ఉదయం ఈ నీటి మట్టం ఏకంగా 24 అడుగులకు చేరింది. డ్యాంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోవడంతో తిలకించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. కాని భారీవర్షం కారణంగా అనేక మంది పర్యాటకులు డ్యాం పరిసరాల్లో చిక్కుకున్నారు. రెస్క్యు టీం పర్యాటకులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా కొల్హాపూర్ సిటీసహా జిల్లా లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొల్హాపూర్ వాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
మరఠ్వాడాలోనూ వానలే వానలు..
మరఠ్వాడలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఔరంగాబాద్, జాల్నా, పర్భణీ, నాందేడ్, హింగోళి, లాతూర్, బీడ్, ఉస్మానాబాద్ జిల్లాలో భారీ వర్షాలతోపాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నా యి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలుల వల్ల అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో అనేక గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఒకపక్క వర్షం, మరోపక్క విద్యుత్ సరఫరాలేక ప్రజలు అంధకారంలోనే గడుపుతున్నారు.
అయితే జూన్‌లో పత్తాలేకుండా పోయిన వర్షాలు జూలై ఆరంభంలోనే కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దుక్కిదున్ని, విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో అనేక చోట్ల చెక్ డ్యాంలు కనిపించకుండా పోయాయి. చిన్న చిన్న వంతెనల మీదుగా నీరు ప్రవహిస్తోంది. దీంతో కొన్ని గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయా యి. రవాణా సౌకర్యాలు లేక ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
భారీ వర్షాల కారణంగా మంగళవారం సీఎస్‌ఎంటీలో రైళ్లు ఆలస్యం కావడంతో
ఫ్లాట్‌ఫాంకు అటూఇటూ భారీగా నిలిచిపోయిన ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment