Storms
-
రేపు భూమిని తాకనున్న సౌర జ్వాలలు!
సౌరప్రకోపం భూమిని అల్లాడించనుంది. సూర్యుని కొంతకాలంగా అల్లకల్లోలంగా ఏఆర్3842 సన్‌స్పాట్ మరోసారి బద్దలైంది. ఎక్స్9.1 కేటగిరీలోకి వచ్చే అత్యంత అత్యంత శక్తిమంతమైన సోలార్ ఫ్లేర్‌కు దారితీసింది. దీని దెబ్బకు భూమి ఎగువ వాతావరణమంతా పూర్తిగా అయోనీకరణం చెందింది! ఈ పేలుడు ధాటికి పుట్టుకొచి్చన శక్తిమంతమైన సౌర జ్వాలలు ఆదివారం భూమిని గట్టిగా తాకనున్నాయి. ఇప్పటికే సూర్యునిలో సంభవించిన కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) దీనికి తోడవనుంది. ఫలితంగా భూ అయస్కాంత తుఫాన్లు ఏర్పడి, పెద్దపెట్టున విడుదలయ్యే రేడియేషన్ ప్రపంచమంతటా ప్రభావం చూపనుంది. దెబ్బకు ఉపగ్రహాలతో పాటు పలు దేశాల్లో పవర్ గ్రిడ్లతో పాటు నావిగేషన్ వ్యవస్థలు కూడా మొరాయించే ప్రమాదముంది. ముఖ్యంగా ఆఫ్రికాతో పాటు అట్లాంటిక్ దక్షిణ ప్రాంతంలోని పలు దేశాల్లో షార్ట్వేవ్ రేడియో బ్లాకౌట్లు సంభవించవచ్చని సైంటిస్టులు హెచ్చరించారు. రేడియో ఆపరేటర్లకు కనీసం అరగంటకు సిగ్నల్స్ అందబోవని వివరించారు. వీటివల్ల అరోరాలు (కాంతి వల యాలు) ఏర్పడనున్నాయి. కొంతకాలంగా ఉగ్ర రూపు సూర్యుడు ప్రస్తుతం తన 25వ సౌరచక్రం మధ్యలో ఉన్నాడు. దాంతో కొంతకాలంగా ఉగ్రరూపు దాలుస్తున్నాడు. సోలార్ మాగ్జిమంగా పేర్కొనే ఈ పరిస్థితులు ఊహించిన దానికంటే ముందే సంభవిస్తున్నట్టు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంసూర్యునిపై నిరంతర పేలుళ్లకు, సన్‌స్పాట్స్‌కు, సీఎంఈలకు దారి తీస్తుంది. ఇవి భూమిపై పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముంబై అతలాకుతలం
ముంబై: అకాల వర్షాలు, దుమ్మూ ధూళితో కూడిన బలమైన ఈదురుగాలులతో ముంబై సోమవారం అతలాకుతలమైంది. నగరంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ముంబైవ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు గంటల పాటు నరకం చవిచూశారు. దుమ్ముతో కూడిన గాలి దుమారం ధాటికి చాలామంది వాహనాలను వదిలి తలదాచుకోవడానికి చెల్లాచెదురయ్యారు. ఎక్కడ చూసినా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘట్కోపర్ ప్రాంతంలోని చెద్దానగర్ జంక్షన్ వద్ద 100 అడుగుల భారీ అక్రమంగా హోర్డింగ్ ఈదురుగాలుల ధాటికి సాయంత్రం కుప్పకూలింది. అది పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడటంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. హోర్డింగ్ కింద 100 మందికి పైగా చిక్కుకున్నట్టు అధికారులు చెబుతున్నారు! గాయపడ్డ 65 మందిని ఆసుపత్రికి తరలించారు. ఇంకా హోర్డింగ్ కిందే చిక్కుకున వారిని కాపాడేందుకు ప్రయతి్నస్తున్నట్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గగ్రానీ చెప్పారు. జాతీయ విపత్తు స్పందన బృందంతో పాటు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. భారీ హైడ్రా క్రేన్లు తదితరాలతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటన జరిగినప్పుడు పెట్రోల్ బంక్‌లో కనీసం 30కి పైగా ఆటోలు, బస్సులు, లగ్జరీ కార్లున్నట్టు ఒక కానిస్టేబుల్ తెలిపారు. వాటిలో పలు వాహనాలు హోర్డింగ్ కిందే చిక్కుకుపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రమాదస్థలిని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. రైళ్లు, విమానాలకు అంతరాయం గాలివాన ధాటికి ముంబైలో పలు ఇతర చోట్ల కూడా బిల్ బోర్డులు, హోర్డింగులు కూలిపడ్డాయి. వడాల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కూలి ముగ్గురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగిన ఉదంతాల్లో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కనీసం మరో నలుగురు మరణించినట్టు సమాచారం. ప్రతికూల వాతావరణం వల్ల సోమవారం గంటపాటు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గాలి దుమారం ధాటికి ఏమీ కనిపించని పరిస్థితి నెలకొనడంతో పలు విమానాలను దారి మళ్లించారు. మెట్రో, లోకల్ రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నగరంలో సోమవారం అర్ధరాత్రి దాకా ఈదరగాలులు, ఉరుములు, మెరుపులతో వాన కొనసాగింది. థానె, పాల్ఘర్ తదితర ప్రాంతాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. -
Licypriya Kangujam: నిండు సభలో... నిగ్గదీసి అడిగిన అగ్గిస్వరం
వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే మురిసే చిన్నారి హృదయాలకు ప్రకృతి ఆత్మీయ నేస్తం. అలాంటి అందమైన, ఆత్మీయమైన ప్రకృతి ఎదుట విలయ విధ్వంసం కరాళనృత్యం చేస్తుంటే... లిసిప్రియలాంటి చిన్నారులు ‘పాపం, పుణ్యం ప్రపంచ మార్గం’ అని ఊరుకోరు. ప్రకృతికి సంబంధించి మనం చేస్తున్న పాపం ఏదో, పుణ్యం ఏదో కళ్లకు కట్టేలా ప్రచారం చేస్తారు. దుబాయ్‌లో జరిగిన ‘యునైటెడ్ నేషన్స్ క్లైమెట్ చేంజ్ కాన్ఫరెన్స్–2023’లో తన నిరసనను బహిరంగంగా తెలియజేసింది మన దేశానికి చెందిన పన్నెండు సంవత్సరాల లిసిప్రియ కంగుజామ్. ‘శిలాజ ఇంధనాలను అంతం చేయండి... భవిష్యత్తును, భూగోళాన్ని కాపాడండి’ అంటూ నినదించింది. కొద్దిసేపు ప్రసంగించింది. ఆమె నిరసనను ప్రపంచ ప్రతినిధులు కొందరు చప్పట్లతో ఆమోదం పలికారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మణిపుర్‌కు చెందిన క్లైమెట్ యాక్టివిస్ట్ లిసిప్రియ గురించి.... లిసిప్రియ కంగ్జామ్ మణిపుర్‌లోని బషిక్హోంగ్లో జన్మించింది. తల్లిదండ్రుల ద్వారా, స్కూల్లో ఉపాధ్యాయుల ద్వారా విన్న పర్యావరణపాఠాలు ఈ చిన్నారి మనసుపై బలమైన ప్రభావాన్ని చూపాయి. పర్యావరణ సంరక్షణ కోసం తనవంతుగా ఏదైనా చేయాలనుకుంది. ఏడు సంవత్సరాల వయసులోనే అందరూ ఆశ్చర్యపడేలా పర్యావరణ సంబంధిత విషయాలు మాట్లాడేది. 2018లో ప్రకృతి విధ్వంసంపై మంగోలియాలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సులో తండ్రితో కలిసి పాల్గొంది. ఈ సదస్సులో వక్తల ఉపన్యాసాల నుంచి ఎన్నో కొత్తవిషయాలు నేర్చుకుంది. ఈ సదస్సు ప్రియ జీవితాన్ని మార్చేసిన సదస్సు అని చెప్పవచ్చు. ఈ సదస్సు స్ఫూర్తితో ‘చైల్డ్ మూమెంట్’ అనే సంస్థను మొదలుపెట్టింది. మొక్కల పెంపకం వల్ల ప్రకృతికి జరిగే మేలు, ప్రకృతి విధ్వంసం వల్ల జరిగే నష్టాలు... మొదలైన వాటి గురించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నో స్కూల్స్‌లో ప్రచారకార్యక్రమాలు విరివిగా నిర్వహించింది. 2019లో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగిన యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంది. ఇదే సంవత్సరం అంగోలా దేశంలో జరిగిన ఆఫ్రికన్ యూనియన్ సదస్సులో పాల్గొంది. ఈ సదస్సులో ఎంతోమంది దేశాధ్యక్షులతో పాటు ప్రియ ప్రసంగించడం విశేషం. చిన్నవయసులోనే ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరు తెచ్చుకుంది లిసిప్రియ. ప్రియకు డబ్బులను పొదుపు చేయడం అలవాటు. అవి తన భవిష్యత్ అవసరాలకు ఉద్దేశించి కాదు. సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించడం కోసం పొదుపు చేస్తుంటుంది. 2018లో కేరళ వరద బాధితులకు సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి లక్షరూపాయలు విరాళంగా ఇచ్చింది. దిల్లీలోని వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని‘సర్వైవల్ కిట్ ఫర్ ది ఫ్యూచర్’అనే డివైజ్‌కు రూపకల్పన చేసింది. ఈ జీరో బడ్జెట్ కిట్ వాయుకాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఎవరైనా, ఎక్కడైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని పంజాబ్ అసెంబ్లీలో లాంచ్ చేసింది ప్రియ. వాతావరణ మార్పులపై కార్యచరణ కోసం, మన దేశంలో క్లైమెట్ లా కోసం వందలాదిమందితో కలిసి దిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ప్రదర్శన నిర్వహించింది. ‘సందేశం ఇవ్వాలనుకోవడం లేదు. సమస్యను అర్థం చేసుకోమని చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను’ అంటుంది లిసిప్రియ. యాక్ట్ నౌ దుబాయ్‌లో జరిగిన క్లైమేట్ కాన్ఫరెన్స్–2023లో 190 దేశాల నుంచి 60,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నారి ప్రియ ధైర్యంగా వేదిక మీదికి వచ్చి ‘అవర్ లీడర్స్ లై, పీపుల్ డై’ అని గట్టిగా అరిచింది. సదస్సు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తరువాత ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ‘ఎవరు ఈ అమ్మాయి?’ అంటూ చాలామంది ఆరా తీశారు. చిన్న వయసు నుంచే పర్యావరణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న ప్రియ గురించి తెలుసుకొని ఆశ్చర్యానందాలకు గురయ్యారు. శిలాజ ఇంధనాలను అంతం చేయండి... భవిష్యత్తును, భూగోళాన్ని కాపాడండి. – లిసిప్రియ నా నేరం ఏమిటి? నిరసన తరువాత అధికారులు నన్ను 30 నిమిషాలకు పైగా నిర్బంధించారు. నేను చేసిన నేరం ఏమిటంటే పర్యావరణ సంక్షోభానికి ప్రధాన కారణం అయిన శిలాజ ఇంధనాలను దశల వారీగా తొలగించమని అడగడం. నన్ను ‘కాప్ 28’లో లేకుండా చేశారు. – లిసిప్రియ, యాక్టివిస్ట్ -
సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో సమాచారం
సాక్షి, అమరావతి: మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో మత్స్య సంపదను వేటాడే వేళ గంగపుత్రులు ఆపదలో చిక్కుకుంటే.. రక్షించేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఇస్రో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెల్ సిగ్నల్ అందకపోయినా.. రక్షణ పరిధిలోకి తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్ మైళ్ల వరకు రాష్ట్ర పరిధిలో ఉండగా.. 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు దేశీయ జలాలు. 200 నాటికల్ మైళ్ల దూరం దాటితే అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లు తీరం నుంచి 4 నాటికల్ మైళ్ల వరకు వెళ్తుంటాయి. మోటరైజ్డ్ బోట్లు 12 నాటికల్ మైళ్ల వరకు, మెకనైజ్డ్ బోట్లు 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు వెళ్లి వేట సాగిస్తుంటాయి. రాష్ట్రంలో 1,610 మెకనైజ్డ్, 22 వేల మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 1.60 లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఇప్పటివరకు వేట సాగించే మత్స్యకారులకు ఇన్కాయిస్ సంస్థ శాటిలైట్ ద్వారా సముద్రంలో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రదేశాలను (పీఎఫ్జెడ్–పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్) గుర్తించి బోట్లలో అమర్చే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏఐఎస్), మత్స్య శాఖ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్స్ ద్వారా 12 నాటికల్ మైళ్ల పైబడి దూరం వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు సమాచారం అందిస్తున్నాయి. ఈ సమాచారం సంప్రదాయ, మోటరైజ్డ్ బోట్లకు అందించే అవకాశం లేదు. పైగా ఇది 2–3 రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది. మరో వైపు ఏదైనా ఆపదలో ఉంటే తమ క్షేమ సమాచారం మొబైల్స్‌కు ఉండే సిగ్నల్స్‌పై ఆధారపడి ఉంటుంది. సిగ్నల్ మిస్ అయితే తీరానికి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. ఈ పరిస్థితికి ఇక చెక్ పెడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. 100 శాతం సబ్సిడీపై.. కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్‌పాండర్)ను 12 నాటికల్ మైళ్లకు పైబడి దూరం వెళ్లే మరబోట్లు, మెకనైజ్డ్ బోట్లకు అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.36,400 విలువైన ఈ పరికరాన్ని 100 శాతం సబ్సిడీతో అమర్చనున్నారు. తీరంలో గస్తీ కోసం అభివృద్ధి చేసిన ఐఆర్ఎన్ఎస్ (నావిక్), జీపీఎస్ శాటిలైట్స్‌తో ఈ డివైస్ అనుసంధానమై పనిచేస్తుంది. బోట్లలోని మత్స్యకారుల వద్ద ఉండే స్మార్ట్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే చాలు సిగ్నల్‌తో సంబంధం లేకుండా రెండువైపులా సమాచారాన్ని పరస్పరం పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సమయం వృథా కాకుండా.. మరోవైపు ఇన్కాయిస్ సంస్థ అందించే పీఎఫ్జెడ్ సమాచారాన్ని కచ్చితమైన లొకేషన్స్‌తో బోట్లలోని మత్స్యకారులకు పంపడం వలన వారు క్షణాల్లో అక్కడకు చేరుకొని వేట సాగించడం ద్వారా సమయం, ఆయిల్ ఆదా అవుతుంది. పట్టుబడిన మత్స్యసంపదను ఏ సమయంలో ఏ రేవుకు తీసుకొస్తే మంచి రేటు వస్తుందో కూడా ఈ డివైస్ ద్వారా సమాచారం పంపిస్తారు. దీంతో తీరానికి చేరుకున్న తర్వాత తగిన ధర లేక మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి ఉండదు. అయితే ఈ డివైస్ పనిచేయాలన్నా, సిగ్నల్‌తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ పనిచేయాలన్నా.. సంబంధిత బోట్లలో రీ జనరేట్ చేసుకునే పవర్ సిస్టమ్ అవసరం ఉంటుంది. వైపరీత్యాల వేళ అప్రమత్తం చేయొచ్చు తుపాను హెచ్చరికలు, అకాల వర్షాలు, ఈదురు గాలులకు సంబంధించిన సమాచారాన్ని ఈ డివైస్ ద్వారా లోతు జలాల్లో వేట సాగించే అన్నిరకాల బోట్లకు క్షణాల్లో పంపించి వారిని అప్రమత్తం చేయవచ్చు. లోతు జలాల్లో ఉన్నవారిని సాధ్యమైనంత త్వరగా తీరానికి చేరుకునేలా హెచ్చరికలు జారీ చేయొచ్చు. ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే ఈ డివైస్ ద్వారా సమాచారం పంపితే శాటిలైట్ ద్వారా గ్రౌండ్ స్టేషన్‌కు చేరుతుంది. అక్కడ నుంచి క్షణాల్లో ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేçస్తున్న మోనిటరింగ్ స్టేషన్స్తోపాటు కోస్ట్ గార్డు, మెరైన్, నేవీ విభాగాలతోపాటు సమీపంలో ఉండే కమర్షియల్ వెసల్స్‌కు కూడా సమాచారం అందిస్తారు. తద్వారా క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని ప్రాణాలతో రక్షించే అవకాశం ఉంటుంది. దశల వారీగా అమర్చుతాం కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్‌పాండర్)ను లోతు జలాల్లో మత్స్య వేట సాగించే బోట్లకు దశల వారీగా అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తొలి దశలో 4,484 బోట్లలో అమర్చనున్నాం. అక్టోబర్ నాటికి వీటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. – వీవీ రావు, జేడీ, మత్స్య శాఖ (సముద్ర విభాగం) -
Andhra Pradesh: రాష్ట్రం భగభగ
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో ఎండలు తీవ్ర ప్రతాపం చూపుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు భగభగమండగా కోస్తా జిల్లాల్లో వాటి ప్రభావం ఇంకా ఎక్కువ కనిపించింది. అనేక ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉ.11 గంటలకే చాలా ప్రాంతాల్లో 40–41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు బయటకురావడానికే బెంబేలెత్తిపోయారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, పల్నాడు, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఈ జిల్లాల్లో దాదాపు అన్నిచోట్లా 40–44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమో దయ్యాయి. అనకాపల్లి, విశాఖ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో అత్యధికంగా 44.8 డిగ్రీలు నమోదైంది. ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.7, కామవరపుకోటలో 44.5, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో 44.4, ఏలూరు జిల్లా రాజుపోతేపల్లిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మోకా తుపాను ప్రభావమే మోకా తుపాను ప్రభావంవల్లే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళాఖాతం నుంచి ఏపీకి వీచే గాలులను తుపాను లాగేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో మన ప్రాంతంలో గాలిలో తేమ శాతం తగ్గిపోయింది. కేవలం తేమలేని పొడిగాలులు వీస్తుండడంతో తీవ్రమైన ఉక్కపోత, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రాజస్థాన్, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం లేకపోవడంతో ఉక్కపోత, ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. తుపాను ప్రభావం తగ్గేవరకు అంటే నాలుగైదు రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని.. ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. -
కొట్టుకుపోయిన వడ్లు.. దెబ్బతిన్న పంటలు
నల్లగొండ/జగిత్యాలఅగ్రికల్చర్/డొంకేశ్వర్ (ఆర్మూర్): ఈదురుగాలులు.. అకాల వర్షంతో శుక్రవారం రాత్రి పలు జిల్లాల్లో పంటనష్టం వాటిల్లింది. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మార్కెట్‌యార్డులు, ఐకేపీ కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ఇంకొన్ని కేంద్రాల్లో వర్షపు నీటితో పాటే వడ్లు కొట్టుకుపోయాయి. వర్షం తగ్గిన తరువాత చీకట్లోనే రైతులు ధాన్యాన్ని కాపాడుకునే యత్నాలు చేశారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని 23,560 ఎకరాల్లో మామిడి, వందల ఎకరాల్లోని వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన పసుపు కుప్పలు తడిసిపోయాయి. -
మార్చిలోనే మండుతున్న సూరీడు.. భగభగ పక్కా! తీవ్రమైన వడగాడ్పులు
మార్చిలోనే సూరీడు మండిపోతున్నాడు. ఈ ఏడాది వేసవి భగభగలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండే ఎండలకు తోడు ఎన్నో సమస్యలు ఎదురు కానున్నాయి. వడగాడ్పులు, విద్యుత్ సంక్షోభం, నీటి ఎద్దడి బాధించనున్నాయి. 1901 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి అత్యంత వేడి నెలగా రికార్డులకెక్కింది. సగటు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు దాటాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కొంకణ్, కచ్ ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే వేడి గాడ్పులపై ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి నుంచి మే వరకు వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి గండాన్ని ఎలా ఎదుర్కొంటామన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి వేసవిని ఎదుర్కోవడానికి కావాల్సిన సన్నద్ధతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య నిపుణులు, స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి వేసవి కాలాన్ని ఎదుర్కోవడానికి ఏమేం చర్యలు చేపట్టాలన్న దానిపై చర్చించారు. ఏయే ప్రాంతంలో వడగాడ్పులు ఉండబోతున్నాయి మార్చి నుంచి మే వరకు దేశంలో ఉక్కబోత భరించలేనంతగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది.మధ్య భారతం, వాయవ్య రాష్ట్రాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. ఉత్తరాదితో పోల్చి చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా నమోదవుతాయి. ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) అంచనాల ప్రకారం వడగాడ్పులు తరచుగా వీస్తాయి. రానున్న సంవత్సరాల్లో ఎండవేడిమి మరింతగా పెరిగిపోతుంది. ఈ ఏడాది ఫసిఫిక్ మహాసముద్రంలో కాలానుగుణంగా వచ్చే మార్పుల కారణంగా ఎల్‌నినో పరిస్థితి ఏర్పడుతుందని అందువల్ల వేసవికాలం మరింత వేడిగా మారుతుందని అంచనాలున్నాయి. ఎల్‌నినో సంవత్సరాల్లో పంట దిగుబడి లేక కరువు కాటకాలు ఏర్పడతాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వేసవి కాలం ఎదుర్కోవడం అత్యంత దుర్లభంగా మారుతోందని హెల్త్ అండ్ క్లైమేట్ రెసిలెన్స్ ఎన్ఆర్డీసీ ఇండియా చీఫ్ అభియంత్ తివారీ చెప్పారు. గత ఏడాది మార్చి 100 ఏళ్లలోనే అత్యంత వేడి మాసంగా నమోదైతే, ఈ ఏడాది ఫిబ్రవరి 122 ఏళ్ల రికార్డుల్ని బద్దలు కొట్టిందని అన్నారు. ఈ సారి వేసవిలో వడగాడ్పులు ఎక్కువగా ఉండడంతో గోధుమ పంటపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో ఆహార సంక్షోభం, నిత్యావసర ధరలు పెరిగిపోవడం వంటివి జరగనున్నాయని ఆయన అంచనా వేశారు. విద్యుత్ కోతలు తప్పవా..? గత ఏడాది వేసవి కాలంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకొని సంక్షోభం ఎదురైంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుకోవచ్చునని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసింది. ఇక రాత్రి వేళల్లో కూడా 217 గిగావాట్లకు విద్యుత్ వినియోగం చేరుకునే అవకాశాలున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో రాత్రిపూట విద్యుత్ వినియోగం కంటే ఇది చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల వల్ల గ్రిడ్లపై ఒత్తిడి పెరిగిపోతుందని గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. థర్మల్ విద్యుత్ ప్లాంట్లకి బొగ్గు కొరత, జల విద్యుత్ ప్రాజెక్టులకి నీటి కొరత కారణంగా ఈ సారి వేసవి కూడా పెను విద్యుత్ సంక్షోభానికి దారి తీసే అవకాశాలున్నాయి. ఒడిశా బాటలో... మన దేశంలో ఒడిశా వేసవికాలంలో ఎదురయ్యే సమస్యల్ని ఒక ప్రణాళికా బద్ధంగా ఎదుర్కొని విజయం సాధించింది. ఇప్పటివరకు ఒడిశా మాత్రమే వేసవికాలాన్ని కూడా ఒక ప్రకృతి విపత్తుగా అధికారికంగా ప్రకటించింది. 1998లో వేసవికాంలో వడదెబ్బకు ఏకంగా 2,042 మంది పిట్టల్లా రాలిపోయారు. ఆ తర్వాత ఏడాది వడదెబ్బ మృతుల సంఖ్య 91కి, తర్వాత ఏడాదికి 41కి తగ్గించగలిగింది. దీనికి ఒడిశా ప్రభుత్వం చేసిందల్లా ఎండ తీవ్రత ఉన్నప్పుడు బయట ఎవరూ తిరగకూడదంటూ నిబంధనలు విధించింది. మిట్ట మధ్యాహ్నం సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసేసింది. రాష్టంలోని వీధివీధిలోనూ చలివేంద్రాలు, పందిళ్లు ఏర్పాటు చేసింది. విద్యుత్ కోతలు లేకుండా, నీటికి ఇబ్బంది లేకుండా ముందుగా ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రిపూట పనులు చేసేలా చర్యలు తీసుకుంది. వడదెబ్బతో మరణించే వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటోంది. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా ఒడిశా బాటలో నడిస్తే మంచిదన్న అభిప్రాయాలైతే వినిపిస్తూ ఉన్నాయి. వేసవి ప్రభావం ఇలా.. ► ప్రపంచ బ్యాంకు 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్‌లో వేసవి మరణాలు ఇక అధికం కానున్నాయి. కాంక్రీట్ జంగిళ్లుగా మారిన నగరాలు వడగాడ్పులతో వేడెక్కనున్నాయి. ► ఎండవేడిమికి 2000–04 నుంచి 2017–21 మధ్య 55శాతం మరణాలు పెరిగిపోయాయి. ► 2021లో ఎండలకి 16,700 కోట్ల కార్మికుల పని గంటలు వృథా అయ్యాయి. ► ఎండాకాలంలో కార్మికులు పనుల్లోకి వెళ్లకపోవడం వల్ల దేశ జీడీపీలో గత ఏడాది 5.4% ఆదాయం తగ్గిపోయింది. ► 2022లో దేశవ్యాప్తంగా 203 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. వందేళ్ల తర్వాత ఇదే అత్యధికం ► ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా 28 రోజులు, రాజస్తాన్‌లో 26 రోజులు, పంజాబ్, హరియాణాలో 34 రోజులు చొప్పున వడగాడ్పులు వీచాయి. ► వేసవికాలం వచ్చిందంటే కార్చిచ్చుల సమస్య వేధిస్తుంది. 2017లో కొండప్రాంతంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో 1,244 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చులు దహిస్తే 2021 నాటికి మూడు రెట్లు ఎక్కువగా 3,927 హెక్టార్లు కార్చిచ్చుతో నాశనమయ్యాయి. ► ఇప్పటికే హిమానీనదాలు కరిగిపోతూ ఉండడంతో సముద్ర తీర ప్రాంతాలు ముప్పులో ఉన్నాయి. వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటే మరింత మంచు కరిగి ముప్పు తీవ్రత ఎక్కువైపోతుంది ► ఢిల్లీ రాజధాని ప్రాంతంలో గత ఏడాది ఎంత తీవ్రతకి 300 పిట్టలు మృతి చెందాయి. వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకోవడానికి ఊళ్లపై పడి బీభత్సం సృష్టించే ఘటనలు పెరిగిపోతాయి. ► వేసవి కాలం ఎండలు ఎక్కువ ఉండడం రబీ సీజన్ పంటలపై తీవ్రంగా ç్రప్రభావం పడుతుంది. ముఖ్యంగా ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో ఈ ఏడాది గోధుమ దిగుబడిపై ప్రభావం ఉంటుందనే ఆందోళనలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇకపై తుపానుల ముప్పు ఎక్కువ
సాక్షి, అమరావతి: అంఫన్.. సూపర్ సైక్లోన్.. నిసర్గ.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ మూడు తుపానులు వరుసగా తూర్పు కోస్తా, పశ్చిమ కోస్తా, ఉత్తరాది రాష్ట్రాలపై విరుచుకుపడ్డాయి. గతంలో దశాబ్దానికి సగటున రెండు పెను తుపానులు దేశాన్ని ముంచెత్తేవి. తాజాగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే మూడు పెను తుపానులు సంభవించడాన్ని బట్టి చూస్తే.. వీటి పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీ) పెరిగిందని.. ఇకపై తరచుగా తుపానులు దేశంపై విరుచుకుపడే ప్రమాదం ఉందని ‘మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్’ అంచనా వేసింది. వర్షం పడే రోజులు (రెయిన్ డేస్) తగ్గడం, కురిసినప్పుడు అధిక వర్షపాతం నమోదు కావడం, వర్షానికి వర్షానికి మధ్య విరామం (డ్రై స్పెల్స్) అధికంగా ఏర్పడటం వల్ల వరుస కరువులు సంభవించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఈ పరిస్థితికి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడమే కారణమని వెల్లడించింది. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణాన్ని తగ్గించకపోతే.. ప్రజల జీవన ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాతావరణ మార్పులపై ‘మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్’ అధ్యయనం చేసింది. ఆ నివేదికను శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. నివేదికలోని ముఖ్యాంశాలివీ.. ► పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే గ్రీన్ హౌస్ (హరిత గృహ) వాయువుల్లో 90 శాతం పరిమాణాన్ని సముద్రాలే పీల్చుకుంటాయి. ఇది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడానికి దారి తీస్తోంది. ► సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగితే భూ ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. 1901 నుంచి 2018 మధ్య కాలంలో ఉష్ణోగ్రత ప్రపంచ వ్యాప్తంగా 0.3 డిగ్రీలు పెరిగితే.. దేశంలో 0.7 డిగ్రీలు పెరిగింది. 21వ శతాబ్దం ముగిసేనాటికి దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 4.4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ► దీనివల్ల ధృవ ప్రాంతాల్లో మంచు కరుగుతోంది. ఇదే రీతిలో హిమాలయ పర్వత శ్రేణుల్లోని హిమానీ నదాలు (గ్లేసియర్స్) కరుగుతున్నాయి. దీనివల్ల సముద్రం ఎత్తు పెరిగి.. భూ ఉపరితలంపైకి చొచ్చుకొస్తోంది. ► హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాల ఎత్తు పెరిగింది. ముంబై తీరంలో సముద్రం ఎత్తు సంవత్సరానికి 3.3 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతోంది. ఇదే సమయంలో బంగాళాఖాతం ఎత్తు ఏడాదికి సగటున 1.75 మిల్లీమీటర్లు పెరుగుతోంది. దుర్భిక్షం తీవ్రత పెరిగే అవకాశం.. ► సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదల రుతు పవనాల గమనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో 1951 నుంచి 1980 మధ్య కాలం కంటే.. 1951 నుంచి 2015 మధ్య కాలంలో వర్షపాత విరామాలు 27 శాతం పెరిగాయి. వర్షం పడే రోజులూ తగ్గాయి. వర్షం కురిసే రోజుల్లో మాత్రం అధిక వర్షపాతం నమోదవుతోంది. ► గత ఆరేడు దశాబ్దాలుగా దేశంలో వర్షపాతం క్రమేణా తగ్గుతోంది. వర్షపాత విరామాలు అధికంగా ఏర్పడటం కరువు పరిస్థితులకు దారి తీస్తుంది. దశాబ్దంలో సగటున రెండేళ్లు ద్వీపకల్ప భారతదేశం, ఈశాన్య, మధ్య భారతదేశంలోని ప్రాంతాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇకపై కరువు పరిస్థితుల తీవ్రత 1.3 శాతం పెరిగే అవకాశం ఉంది. వరుస తుపానులు తప్పవు ► 1901 నుంచి 2014 వరకూ దశాబ్దంలో సగటున రెండు తుపానులు దేశాన్ని ముంచెత్తేవి. కానీ.. 2014 నుంచి ఏటా తుపానులు ఏదో ఒక ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నాయి. ► గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు అడ్డుకట్ట వేయకపోతే తుపానులు మరింతగా దేశంపై దాడి చేసే అవకాశం ఉంది. -
తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు?
‘అంఫన్’ తుపాను.. ప్రస్తుతం విరుచుకుపడుతోంది. ‘అంఫన్’ అత్యంత తీవ్రమైన తుపాను అని, 1999 తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతి పెద్ద తుపానుగా భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. అసలు తుపానులకు పేర్లు ఎవరు.. ఎందుకు.. ఎలా పెడతారో తెలుసుకుందామా..? (అల్ల కల్లోలంగా ఉప్పాడ తీరం) సాక్షి, విశాఖటప్నం: హుద్‌హుద్.. తిత్లీ.. పెథాయ్ పేర్లు వేరైనా ఇవన్నీ మన రాష్ట్రంలో విరుచుకుపడిన తుపానులు. వాతావరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారం ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకే తుపానులకు పేర్లు పెట్టడం ఆనవాయితీ. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుపానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. ఆగ్నేయాసియాలో దేశాలే తుపానులకు పేర్లు పెడుతున్నాయి. ఉదాహరణకు తిత్లీ పేరును పాకిస్థాన్, గజను శ్రీలంక సూచించాయి. తాజాగా ఒడిశా, పశ్చిమ బంగాలను భయపెడుతున్న తుపానుకు అంఫన్ అని పేరు పెట్టింది థాయ్‌లాండ్. అంఫన్ అంటే థాయిలాండ్ భాషలో ఆకాశం అని అర్థం. ప్రస్తుత జాబితాలో చివరి పేరు అంఫన్.. కనీసం 61 కి.మీ. వేగం గాలులతో కూడిన తుపాను సంభవించినప్పుడే పేర్లు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అమెరికాలో తుపాన్లను టోర్నెడోలని, చైనాలో ఏర్పడే వాటిని టైఫూన్స్, హిందూ మహాసముద్రంలో సంభవించే వాటిని సైక్లోన్స్ అని పిలుస్తారు. అలాగే ఆ్రస్టేలియా పశ్చిమ తీరంలో సంభవించే తుపాన్లను విల్లీవిల్లీస్, వెస్ట్ ఇండీస్ (పశ్చిమ ఇండీస్) దీవుల్లోని తుపాన్ల ను హరికేన్స్ అంటారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుపానులకు పేర్లు పెట్టడం 2004 సెపె్టంబరులో మొదలైంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుపాన్లకు పేర్లు పెట్టారు. ఎవరైనా సరే తుపాన్లకు పేర్లు పెట్టవచ్చు. భారత వాతావరణ విభాగానికి ఈ పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమోదిస్తే ఆ పేరు భారత తరపున జాబితాలో చేరుతుంది. (కృష్ణా జలాల వినియోగంలో రికార్డు) 2018లో ఈ ప్యానెల్లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి. దీంతో ఈ దేశాల సంఖ్య 13కు చేరుకుంది. ఏప్రిల్‌లో ఈ దేశాలు 169 పేర్లు సూచించాయి. తర్వాత వచ్చే తుపానులకు నిసర్గా (బంగ్లాదేశ్), గతి(భారత్), నివార్ (ఇరాన్), బురేవి (మాల్దీవులు), తౌక్టే (మయన్మార్), యాస్ (ఒమన్) పిలుస్తారు. భారతదేశం గతితో పాటు తేజ్, మురాసు, ఆగ్, వ్యోమ్, జహర్, ప్రోబాహో, నీర్, ప్రభాజన్, ఘుర్ని, అంబుడ్, జలాధి, వేగా వంటి పేర్ల సూచించింది. వాతావరణ శాఖ నిబంధనల మేరకే ఈ పేర్లు పెడతారు. ఉచ్ఛరించడానికి సులువుగా, ఎనిమిది అక్షరాల లోపే పేర్లు ఉండాలి. ఎవరి భావోద్వేగాలు, విశ్వాసాలను దెబ్బతీయకూడదు. -
తీవ్ర తుఫానుగా మారిన ‘‘ఎంఫాన్’’
సాక్షి, అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ‘‘ఎంఫాన్’’ తుఫాను వాయువ్య దిశగా ప్రయాణించి తీవ్ర తుఫానుగా మారింది. ఆదివారం ఉదయం 08.30 గంటలకు తీవ్ర తుఫానుగా మారి అదే ప్రాంతంలో పారదీప్(ఒరిస్సా)కు దక్షిణ దిశగా 990 కి.మీ, డిగా(పశ్చిమ బెంగాల్) కు దక్షిణ నైఋతి దిశగా 1140 కి.మీ, ఖేపుపర(బంగ్లాదేశ్)కు దక్షిణ నైఋతి దిశగా 1260 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత తీవ్రమై రాగల 12 గంటలలో అతి తీవ్రతుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది తదుపరి 24 గంటలలో ఉత్తర దిశగా ప్రయాణించి తరువాత ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్ తీరాల వద్ద సాగర దీవులు(పశ్చిమ బెంగాల్), హతియా దీవులు(బంగ్లాదేశ్) మధ్య మే 20 వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రాలలో కొన్ని ప్రాంతాలకు ఈరోజు (మే 17 వ తేదీన) నైఋతి రుతుపవనాలు ప్రవేశించాయని వెల్లడించారు. రాగల 48 గంటలలో దక్షిణ బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులలో మిగిలిన ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమ: ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. -
ఉప్పెనలా ముప్పు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మన దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లోని 35 కోట్ల మంది రానున్న 30 ఏళ్లలో ముంపు ముప్పు ఎదుర్కోనున్నారని అమెరికా వాతావరణ సంస్థ క్లైమెట్ సెంట్రల్ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో దేశంలో గుజరాత్ తర్వాత అతి పొడవైన.. 974 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన మన రాష్ట్రం పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. పెను తుపాన్లు మహా విధ్వంసం సృష్టించడానికి కారణం భూతాపం పెరగటమేనని నేషనల్ క్లైమెట్ సెంటర్ నివేదిక స్పష్టం చేసింది. దీనివల్ల వాతావరణం వేడెక్కి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, ఫలితంగా తీరం భారీగా కోతకు గురవుతోందని పేర్కొంది. సమీప భవిష్యత్తులో సంభవించే తుపాన్లలో గాలి వేగం పెరుగుతుందని, వరద ఉధృతి తీవ్రత అధికమవుతుందని ఈపీసీసీ (ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్) నివేదికలో వెల్లడించింది. రక్షణ చర్యలు లేకపోవడం వల్లే.. 1876 అక్టోబర్ 8న సంభవించిన తుపాను 150 కిలోమీటర్ల గాలి వేగంతో విశాఖపట్నంపై విరుచుకుపడినట్లు 1907 విశాఖ జిల్లా గెజిట్ స్పష్టం చేస్తోంది. అప్పట్లో తీర ప్రాంతంలో మడ అడవులు, తాటి తోపులు ఎక్కువగా ఉండటం వల్ల పెద్దగా నష్టం వాటిల్లలేదు. 2014లో విశాఖ తీరాన్ని తాకిన హుద్‌హుద్ తుపాను ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. సహజ రక్షణ కవచాలైన మడ అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తేలింది. ఒక్క విశాఖ తీరంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సముద్ర తీరమంతటా రక్షణ చర్యలు కొరవడ్డాయి. పదేళ్ల కాలంలో పరిస్థితి మరీ దిగజారింది. సముద్ర అలల తాకిడి పెరిగినప్పుడు వచ్చే నీరు నిల్వ ఉండే ప్రాంతాలు (బ్యాక్ వాటర్ ల్యాండ్స్) పూర్తిగా కనుమరుగయ్యాయి. పదేళ్లుగా అభివృద్ధి, పరిశ్రమల పేరిట వాటిని ధ్వంసం చేశారు. అడ్డగోలుగా ఆక్రమించారు. 70 శాతం జనాభా తీర ప్రాంతాల్లోనే.. సముద్ర తీరం నుంచి 20 కి.మీ. భూభాగం పరిధిలో 70 శాతం జనాభా నివసిస్తున్నారు. వీరంతా ప్రమాదం అంచున ఉన్నారు. తుపానుల సమయంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతం బెంగాల్, బంగ్లాదేశ్ (10–13 మీటర్లు) తరువాత మన రాష్ట్రంలోనే (5–7 మీటర్లు) ఎక్కువ. ప్రమాదపు అంచున.. తీరానికి 300 మీటర్ల కంటే తక్కువ దూరంలో.. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలివీ. శ్రీకాకుళం జిల్లాలో డొంకూరు, బారువ, పితాలి, మీలా గంగువాడ, పల్లిసారధి నువ్వలరేవు, దేవునల్తాడ, నందిగం, కళింగపట్నం, ఇప్పిలి, కొవ్వాడ, చింతపల్లి బందరువానిపేట. విజయనగరం జిల్లాలో కోనాడ, భోగాపురం సమీప ప్రాంతాలు. విశాఖ జిల్లాలో చిననాగమయ్యపాలెం, పెద్ద నాగమయ్యపాలెం, భీమిలి, విశాఖ నగరం ఏరాడ, అప్పికొండ, గంగవరం, పూడిమడక, రేవు పోలవరం, పెద్దతీనర్ల, పెంటకోట, రాజానగరం, ముత్యాలమ్మపాలెం, రేవు పోలవరం. తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పాడ, గొల్ల ముసలయ్యపేట, కాకినాడ, కోరింగ, తాళ్లరేవు, మట్లపాలెం, పటవల, గోదావరి లంకలు, భైరవపాలెం, గాడిమొగ, పల్లంకుర్రు, సూరసేన యానాం, ఓడలరేవు, అంతర్వేదిపాలెం. పశ్చిమగోదావరి జిల్లాలో పేరుపాలెం, పోదు, ఇంటేరు, లంక గ్రామాలు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, మంగినపూడి, హంసలదీవి, కృష్ణా బ్యాక్ వాటర్ ప్రాంతాలు. గుంటూరు జిల్లా రేపల్లె, ప్రకాశం జిల్లాలో చీరాల, పెద్దగంజాం, కనుపర్తి, పాదర్తి, నెల్లూరు జిల్లాలో కొత్తపట్నం, ఈతముక్కల, రామయ్యపట్నం. 2014లో హుద్‌హుద్ తుపాను బీభత్సంతో విశాఖలో దెబ్బతిన్న రహదారి (ఫైల్) విధ్వంసక తుపాన్లు - దేశంలో వందేళ్ల తుపాన్ల చరిత్రను చూస్తే అతి భీకర తుపాన్లు 40 ఏళ్ల నుంచే ఎక్కువయ్యాయి. - 40 ఏళ్లలో మన రాష్ట్రంలో ఇప్పటివరకు 23 తుపాన్లు విధ్వంసం సృష్టించాయి. - 1977 నవంబర్ 19న 250 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన దివిసీమ ఉప్పెన పెను విధ్వంసం సృష్టించింది. - 1984 నవంబర్ 14న శ్రీహరికోట వద్ద 220 కిలోమీటర్ల వేగంతో పెను తుపాను తీరాన్ని దాటింది. - 1990 మే 9న మరో తుపాను 230 కిలోమీటర్ల వేగంతో మచిలీపట్నం పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. - 1996 నవంబర్ 6న సంభవించిన తుపాను 210 కిలోమీటర్ల వాయు వేగంతో కోనసీమపై విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించింది. - 2013 అక్టోబర్ 12న పైలీన్ పెను తుపాను 220 కిలోమీటర్ల గాలి వేగంతో దక్షిణ, ఒడిశా, ఉత్తర కోస్తాను తాకింది. - 2014 అక్టోబర్ 12న హుద్‌హుద్ తుపాను 260 కిలోమీటర్ల గాలి వేగంతో విశాఖ మహా నగరం, ఉత్తర కోస్తాలో విధ్వంసం సృష్టించింది. మడ అడవుల్ని పునరుద్ధరించాలి ప్రపంచ వ్యాప్తంగా యూకే, ఫ్రాన్స్, కెనడా, ఐర్లాండ్ దేశాలతో పాటు 1,175 నగరాలు వాతావరణ అత్యయిక పరిస్థితి (క్లైమెట్ ఎమర్జెన్సీ) ప్రకటించాయి. రానున్న విపత్తులను నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన మడ అడవులను పునరుద్ధరించుకోవాలి. – జేవీ రత్నం, పర్యావరణవేత్త కాలుష్యం, భూతాపం తగ్గించాలి చమురు, గ్యాస్ వెలికితీత వల్ల భూమి లోనికి దిగబడి సముద్ర మట్టం పెరుగుతోంది. అంతులేని కాలుష్యం వల్ల వేడి పెరుగుతోంది. ఈ పరిస్థితి అనర్థదాయకం. కాలుష్యం, భూతాపం తగ్గించడమే శరణ్యం. – ప్రొఫెసర్ బైరాగిరెడ్డి, పర్యావరణ విభాగం, ఆంధ్ర విశ్వవిద్యాలయం రూ.78 కోట్లతో షెల్టర్ బెల్ట్‌లు సముద్ర తీర ప్రాంత రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ (ఐసీజెడ్‌ఎం) కింద రూ.78 కోట్లతో మడ అడవుల పెంపకం, షెల్టర్ జోన్ ప్లాంటేషన్‌కు చర్యలు చేపట్టాం. – ఎన్.ప్రతీప్‌కుమార్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి -
పెనుతుఫానులో ప్రభువిచ్చిన తర్ఫీదు!
యేసుప్రభువుతో ఆయన శిష్యులు ఒకసారి గలిలయ సముద్రంలో ఒక చిన్నదోనెలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్లంతా ప్రభువు శిష్యులుగా మారిన తొలిరోజులవి. అప్పుడొక పెద్దతుఫాను చెలరేగి దోనె నీళ్లతో నిండి, అది మునిగే పరిస్థితి ఏర్పడింది. యేసు మంచి నిద్రలో ఉన్నాడు. అది చూసి శిష్యులు, ప్రభువా మీకు మా గురించి చింత లేదా? మేము నశించిపోతున్నామంటూ గగ్గోలు పెట్టారు. వెంటనే ఆయన లేచి గాలిని, సముద్రాన్ని కూడా గద్దించి పరిస్థితిని అదుపుజేశాడు (మార్కు 4:35–41). దేవుని నమ్మడం అనే ఆత్మీయాంశం చాలా లోతైనది, విశ్వాసికి ఆచరణలో మాత్రమే నేర్పించగలిగిన అంశమది. ప్రభువు వారికిస్తున్న శిక్షణలో భాగమా అన్నట్టుగా, వారి విశ్వాసానికి అదే గలిలయ సముద్ర ప్రయాణంలో ఈ విషమపరీక్ష ఏర్పడింది. మేమంటే మీకు చింత లేదా? అని శిష్యులు ప్రశ్నిస్తే, జవాబుగా అవిశ్వాసులారా!! అని ప్రభువు వారిని గద్దించవచ్చు. కానీ ఆయన వారిని కాక, సముద్రాన్ని, గాలిని గద్దించాడు. నిజానికి అద్దరికి వెళ్లేందుకు ఆ రాత్రి ప్రయాణానికి ప్రభువే వారిని బయలుదేర దీశాడు. ఎందుకంటే ప్రయాణం మధ్యలో దోనె తుఫానులో చిక్కుకున్నా సరే, అది సురక్షితంగా అద్దరికి చేరుతుందని ప్రభువుకు తెలుసు. పైగా అవతలి దరిలోని గెరాసేనీయుల దేశంలో తాను చెయ్యబోయే దైవకార్యాల తాలూకు స్పష్టమైన అవగాహన, ఆ కార్యాలు జరుగుతాయన్న విశ్వాసం ఆయనకుంది. తుఫానులు చెలరేగని జీవితాలంటూ ఉంటాయా? కానీ ఎంత పెద్దదైనా సరే ప్రతి తుఫానూ జీవితాన్ని ముంచేది కాదని కూడా తెలుసుకోవాలి. అప్పటికి శిష్యుల చేతుల్లో బైబిళ్లు లేవు కానీ, ఉండి వుంటే, నిన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు, దేవుడు మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు అన్న వాగ్దానాలను బైబిల్లో మీరు చదువలేదా? అని యేసుప్రభువు వారిని తప్పక మందలించి ఉండేవాడు. జీవితంలో తుఫానులెదురైనపుడే దేవుడెంత గొప్పవాడో, లోకం ఎంత నికృష్టమైనదో విశ్వాసికి స్పష్టమవుతుంది. ‘తప్పులు చేశావు, అందుకే నీ జీవితంలో ఈ తుఫాను’, నీ తలబిరుసుతనానికి దేవుని తీర్పు ఇది’ లాంటి ఇరుగుపొరుగువారు, సన్నిహితులు, బంధువుల సూటిపోటి మాటలు, వెక్కిరింతలు తుఫాను అలలకన్నా ఉవ్వెత్తున లేస్తాయి. కావాలంటే యోబు గ్రంథాన్ని ఒకసారి చదవండి. ఇతరుల ఈ అయాచిత సలహాలు, వ్యాఖ్యలు తుఫానుకన్నా ఎక్కువ నొప్పిని, నష్టాన్ని విశ్వాసికి కలుగజేస్తాయి. కాకుల్లాంటి ఈ లోకులను పక్కనపెడితే, దేవుడసలు నన్ను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే నా జీవితంలో ఈ తుఫానేందుకు? లాంటి ప్రశ్నల తుఫానులు మన అంతరంగంలోనే చెలరేగితే మాత్రం అది మరీ ప్రమాదం. కళ్లెదుట తాటిచెట్టంత ఎత్తున లేచే అలలు, మన జీవితం అనే చిన్న దోనెను అతలాకుతలం చేస్తుంటే, దేవుడు మనల్ని విడువక కాపాడుతాడని నమ్మడానికి అంతకన్నా ఎత్తైన అలలున్న విశ్వాస స్థాయి కావాలి. ఆ స్థాయి విశ్వాసమే దేవునికి మహిమను, మన జీవితంలోకి సాఫల్యాన్ని తెస్తుంది. అందుకు ప్రాథమికంగా కృతజ్ఞత కలిగిన హృదయాన్ని విశ్వాసులు కలిగి వుండాలి. ఆ కృతజ్ఞతాభారితమైన హదయం నుండే వినయం, ప్రార్థన, విశ్వాసం, న్యాయం, ధైర్యం, త్యాగం, ప్రేమ, సంతృప్తి, సంతోషం, సద్భావనల వంటి అన్ని క్రైస్తవ సద్గుణాలూ లోకానికి వెల్లడవుతాయి. మరి మన శక్తికి మించిన విషమ పరిస్థితులనుండి దేవుడు మనల్ని కాపాడినప్పుడే కదా విశ్వాసి హృదయంలో దేవునిపట్ల కృతజ్ఞతాభావం ఏర్పడేది? సముద్రంలో పెద్దతుఫానులో చిక్కిన వారి చిన్న దోనెను కాపాడి, అద్దరికి సురక్షితంగా చేర్చిన వారి బోధకుడు, రక్షకుడైన యేసుప్రభువు శక్తి, ప్రేమ ఆయన శిష్యరికంలో వారికి ఆరోజు అత్యంత అమూల్యమైన తొలి పాఠమయ్యింది. ఫలితంగా వారి హృదయాలు ఆయనపట్ల కృతజ్ఞతాభావనతో నిండి పోయాయి. మీ జీవితాల్లో గతంలో ఏం జరిగినా, ఇప్పుడు ఏమి సంభవిస్తున్నా, భవిష్యత్తులో మాత్రం దేవుడు మీకివ్వబోయే విజయాలను, ఆశీర్వాదాలను ఆపగలిగే శక్తి ఆ పరిణామాలకు, ప్రతికూలతలకు లేదన్న ‘స్థిరభావన’ కృతజ్ఞత కలిగిన హృదయంనుండే వెలువడుతుంది. క్రీస్తుప్రేమ నుండి విశ్వాసిని ఎడబాపగల శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదన్నది దేవుని అత్యంత స్పష్టమైన, ప్రేమామయమైన అభయం (రోమా 8;35). అది అర్థమయ్యేందుకు ఇలాంటి తుఫానులు, వాటి మధ్యలో దేవుని వైపే చూడగల స్థిరమైన విశ్వాసం, ఆ దేవునిపట్ల కృతజ్ఞతాభావం తప్పక కావాలి. ఈ అపొస్తలులంతా సువార్తను భూదిగంతాలకు తీసుకెళ్లి దేవునికోసం హతసాక్షులైనపుడు, భయంకరమైన శ్రమలు అలల్లాగా కాదు ఉప్పెనలా వారిమీద విరుచుకుపడ్డాయి. అయినా బెదరకుండా చిరునవ్వుతో, క్షమాప్రార్థనలతో వారు ఉరికంబాలెక్కారు. యేసుప్రభువిచ్చిన ఈ శిక్షణే దానికి కారణం! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ Email: prabhukirant@gmail.com -
రాజస్థాన్‌లో భారీ ఇసుక తుఫాన్
-
ప్రమాదంలో భూమి?!
సాక్షి, న్యూఢిల్లీ : సౌర మండంలో సంభవిస్తున్న సౌర తుఫానులు భూమికి అత్యంత ప్రమాదకరంగా పరణమిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో నక్షత్ర మండలం వైపు ప్రయాణించే సౌర తుఫానులు తమ గమనం మార్చుకుని భూమివైపు ప్రమాణిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పలు సౌర తుఫానులు భూ కక్షలోకి ప్రవేశించాయి. ఈ సౌర తుఫానుల వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ సర్వనాశనం దెబ్బతినే ప్రమాదముంది. సౌర తుఫానుల వల్ల శాటిలైట్లు మాడిమసి అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మన సౌర వ్యవస్థకు ఆవల నిబురు అనే ఊహాత్మక సౌర వ్యవస్థ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సౌర వ్యవస్థకు సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఉపగ్రహాలు అన్నీ ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. భూమిమీదకు వేగంగా..! మన సౌర వ్యవస్థకు మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న నిబురునుంచి ప్లానెట్ - X అనే ఉపగ్రహం భూమిని ఢీ కొట్టేందుకు అత్యంత వేగంగా వస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లానెట్ - X నిజంగానే భూమిని ఢీ కొడితే.. ఇక్కడ జీవరాశి మనుగడే ప్రమాదంలో పడుతుంది. 2012 నుంచే..! నిబురు గ్రహం, ప్లానెట్ - X గురించి 2012 నుంచి పుకార్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో భూమి మీద అనేక భీకర ప్రమాదాలు సంభవించాయి. అంతరిక్షంలోనూ ఊహించడానికి భమపడేంత స్థాయిలో విపరీతాలు జరిగాయి. తాజాగా సౌర తుఫానులు మన సమాచార వ్యవస్థలనే నాశనం చేసేలా వస్తున్నాయి. ఇవే అత్యంత ప్రమాదరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
యూపీలో వర్షాలకు 12 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గాలివానలు, పిడుగుపాటుతో రాష్ట్రవ్యాప్తంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్ బిల్హార్ ప్రాంతంలో ఇద్దరు మృతి చెందారు. మావు జిల్లాలో ఒకరు మరణించారు. వారణాసిలోని శివపురి ప్రాంతంలో చెట్టు కూలి మీద పడడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రామగావ్ లో మట్టి ఇల్లు కూలిపోవడంతో మహిళ దుర్మరణం పాలయింది. అజాంఘడ్ లోని అసండీహ్ గ్రామంలో పాఠశాల గేటు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఫరుఖహాబాద్ లో పిడుగుపాటుకు నలుగురు చనిపోయారు. మాధురాలో ఒకరు కరెంట్ షాక్ కు గురై మృత్యువాత పడ్డారు. వచ్చ 48 గంటల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్న టోర్నడోలు
టెక్సాస్: అగ్రరాజ్యం అమెరికాను భారీ తుఫాన్, టోర్నడోలు కుదిపేస్తున్నాయి. ఉత్తర టెక్సాస్‌లో తుఫాన్, టోర్నడోలు విరుచుకుపడటంతో 11 మంది చనిపోయారు. శనివారం సాయంత్రం తుఫాన్లు డల్లాస్ నగరాన్ని ఢీకొన్నాయి. ఇక్కడ వాతావరణం ఇంకా కల్లోలంగానే ఉంది. మృతుల్లో ఎక్కువమంది డల్లాస్‌లోని గార్లాండ్ వాసులే. తుఫాన్ కారణంగా మరో 15 మంది గాయపడ్డారని, 600 నిర్మాణాలు దెబ్బతిన్నాయని గార్లాండ్‌లో పోలీసులు తెలిపారు. కాలిన్ కౌంటీలోనూ తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. ఇక్కడ మరో ముగ్గురు చనిపోయినట్టు అధికారులు తెలిపారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడి జనజీవితాన్ని అతలాకుతలం చేసిన తుఫాన్ బీభత్సాన్ని అంచనా వేసి.. నష్టాన్ని లెక్కగట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
నాన్నకు ప్రేమతో.. టీజర్ విడుదల
-
‘సుడి’ తిరిగింది
ఫొటో అదిరింది కదూ.. అమెరికాలోని కొలరాడోలో తీశారీ చిత్రాన్ని.. టోర్నడోలను చిత్రీకరించడంలో స్పెషలిస్టైన బ్రయాన్ మోర్గాంటి జూన్ 4న ఈ ఫొటోను తీశారు. అమెరికాలో మే, జూన్ నెలల్లో సుడిగాలితో వచ్చే తుపానుల సంఖ్య ఎక్కువ. దీంతో గిరగిరా తిరుగుతూ అల్లకల్లోలం సృష్టించే ఈ టోర్నడోలను చిత్రీకరించడానికి జూన్ 4న తాను బయల్దేరానని.. ఏదో ఒకట్రెండు సుడిగాలుల చిత్రాలను తీస్తానని అనుకున్నానని.. కానీ ఆ రోజున మొత్తం 14 వేర్వేరు ట్విస్టర్ల చిత్రాలను తీశానని బ్రయాన్ చెప్పారు. 19 ఏళ్ల తన కెరీర్లో ఇది మరపురాని రోజని అన్నారు. వాటిల్లో తన ఫేవరెట్ ఈ చిత్రమేనట. -
కళ్లాల్లో ధాన్యం...కళ్లల్లో దైన్యం !
ఖరీఫ్ తరువాత రబీలో వేసిన మినుము, పెసర పూత దశకు వచ్చాయి. కోసిన వరి పంట ఇంకా కళ్లాల్లోనే ఉంది. కొన్ని చోట్ల నూర్పులు నూరుస్తున్నారు. ఈ తరుణంలో రెండు రోజుల నుంచి ముసురు పట్టుకుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల ధాన్యం తడిసి ముద్దయి పోయాయి. పొలాల్లో ఉన్న పంటలకు తెగుళ్లు సోకే అవకాశం ఉంది. దీంతో అన్నదాత తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. రెండు రోజుల నుంచి బితుకుబితుకుమని గడుపుతున్నాడు. తుపాను ప్రభావం బుధవారం కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మరింత ఆందోళనకు గురవుతున్నాడు. విజయనగరం వ్యవసాయం : తుపాను రైతన్నను వణికిస్తోంది. ఇప్పటికే నూర్పులు చేసిన ధాన్యం కళ్లాల్లో నిల్వ ఉండగా, మరి కొందరు నూర్పులు చేస్తున్నారు. ఈ సమయంలో బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం గా సోమవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల కొన్ని చోట్ల ధాన్యం తడిసిపోయాయి. జిల్లాలో లక్షా 20 వేల ెహ క్టార్లలో వరి పంటసాగైయింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా లక్షా 17 వేల హెక్టార్లలో పంటను కోసేశారు. చాలా వరకు కుప్పలు కూడా పెట్టేశారు. మూడు వేల హె క్టార్లలో నాట్లు ఆలస్యమవడంతో ఇప్పుడు కోతలు ప్రారం భించారు. ధాన్యం చేతికి వచ్చే కీలకమైన సమయంలో వర్షాలు పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకోడానికి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే నూర్పులు అయిన ధాన్యాన్ని వర్షంలోనే ఇళ్లకు తరలిస్తున్నారు. పరదాలు కప్పి పంటను కాపాడు కోడానికి నానా పాట్లు పడుతున్నారు. మరో వైపు తమపై కరుణిం చాలని, వర్షం పడకుండా చూడాలని దేవుడిని వేడుకుంటున్నారు. వర్షాలకు ధాన్యం తడిసి పోవడంతో రంగుమారే ప్రమాదం ఏర్పడింది. గంట్యాడ,విజయనగరం, జామి, ఎల్.కోట, బొండపల్లి,గజపతినగరం తదితర మండలాల్లో రైతులు నూర్పులు చేస్తున్నారు. చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దయిపోయాయి. అపరాలుకూ నష్టమే... తుపాను ప్రభావం బుధవారం కూడా ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో వరి పం ట కలిసిరాకపోవడంతో రైతులు అపరాలపైనే ఆశలు పెంచుకున్నారు. అయితే వర్షాలు పడుతుండడం వల్ల సాగులో ఉన్న మినుము, పెసర పంటలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు కొనసాగితే నీరు నిల్వ ఉండి మొక్కలు చనిపోతాయని రైతులు భయపడుతున్నారు. అవస్థలు పడుతున్న జనం చలితీవ్రత చాలా ఎక్కువుగా ఉంది. దీనికి తోడు చల్లటి గాలులు వీయడంతో జనం అల్లాడిపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులు, కూలీలు విధులకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో.... మండలం వర్షపాతం కొత్తవలస 21.4 మెరకముడిదాం 8.2 దత్తిరాజేరు 5.2 బొండపల్లి 18.2 గజపతినగరం 19.4 గుర్ల 15.2 గరివిడి 12.2 జామి 19.2 ఎల్.కోట 16.2 వేపాడ 9.6 ఎస్.కోట 2.4 చీపరుపల్లి 7.2 నెల్లిమర్ల 9.2 పూసపాటిరేగ 4.8 భోగాపురం 3.8 డెంకాడ 20.2 విజయనగరం 16.4 గంట్యాడ 7.4 తెర్లాం 4.2 -
తేరుకోకుండా సంబరాలా?
హుద్‌హుద్ తుపాను బారిన పడిన జిల్లా ఇంకా పూర్తిగా తేరుకోలేదు. నిలువ నీడకోల్పోయిన లక్షలాది మంది నేటికీ మొండిగోడల మధ్యే చలిని ఓర్చుకుంటూ పిల్లాపాపలతో జీవనపోరాటం సాగిస్తున్నారు. ప్రజల ఈతిబాధలు తమకేమి పట్టవన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్మానాలు.. సత్కారాలకు సిద్ధమవుతున్నారు. నగరవాసులు ఇంకాపూర్తి స్థాయిలో తేరుకోకుండానే కార్తీక వన మహోత్సవాలు.. బీచ్ సంబరాలు.. పుడ్ఫెస్టివల్స్ అంటూ నానా హంగామా చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. * కొలిక్కిరాని హుద్‌హుద్ నష్టం అంచనాలు * బాధితులకు అందని పరిహారం * బడుగు జీవులకు నేటికీ నిలువ నీడ కరువు * నెలన్నరగా గంగపుత్రులకు ఉపాధి శూన్యం * కార్తీక వనమహోత్సవాలు.. బీచ్ సంబరాలంటూ ప్రభుత్వం హంగామా సాక్షి, విశాఖపట్నం: నగరంతో పాటు ఉత్తరాంధ్ర మొత్తం ఈ పెనుతుపాను దె బ్బకు విలవిల్లాడిపోయింది. తుపాను మర్నాడే నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారంరోజుల పాటు మకాం వేసి యుద్ధప్రాతిపదికన సహాయ పునరావాసచర్యలు చేపట్టారు. బియ్యం, ఇతర నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు వారం పదిరోజుల్లోనే నగరంలో విద్యుత్‌ను పునరుద్ధరించగలిగారు. తాను ఉండ బట్టే సహాయ చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయంటూ ప్రజల్లో సీఎం ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పునరావాస చర్యలు నెమ్మదించాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ వెలుగులు విరజిమ్మక ప్రజలు ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నారు. ఇక 85వేల ఎకరాల్లో నేలకొరిగిన పంటలకు కనీసం ఇన్పుట్ సబ్సిడీ, పంటనష్ట పరిహారం ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు అల్లాడిపోతున్నారు. మరో పక్క విశాఖ నగరంతోపాటు ఉత్తరాంధ్రలో లక్షలాది మంది నిరుపేదల పూరిగుడెసెలు కుప్పకూలిపోయాయి. రేకులషెడ్లు, పెంకుటిళ్ల పైకప్పులు ఎగరిపోవడంతో కొంత మంది మొండిగోడల మధ్యే చలికి వణికిపోతూనే జీవనం సాగిస్తుంటే.. మరికొంతమంది టార్పాలిన్స్, ఫ్లెక్సీల మాటున తలదాచుకుంటున్నారు. కొండవాలుప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది ఇంకా మొండిగోడల మధ్యే జీవనం సాగిస్తున్నారు. గంగపుత్రుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. తుపానుకు వారం రోజుల ముందు నుంచి ఉపాధి కోల్పోయారు. వందలాది బోట్లు ధ్వంసం కావడంతో లక్షలాది మంది గంగ పుత్రులకు జీవనోపాధి లేకుండాపోయింది. అప్పోసప్పో చేసి బోట్లకు రిపేర్లు చేయించుకుని పదిరోజుల క్రితమే వేట సిద్ధమైనా బంగాళాఖాతంలో రోజుకో చోట వాయు గుండాలు.. అల్పపీడనాలు ఏర్పడడంతో మళ్లీ ఉపాధికి దూరమయ్యారు. లెక్కతేలని నష్టం ఇదంతా ఒక ఎత్తయితే ఎంతనష్టం జరిగిందో నేటికి లెక్కతేల్చలేకపోతున్నారు. 45 మంది చనిపోయినట్టు లెక్కతేల్చినా రాష్ర్టం తరపున 40 మంది కుటుంబాలకు రూ.5లక్షల వంతున పరిహారం అందజేశారు. మిగిలిన ఐదుగురికి ఐదు లక్షలతో పాటు మొత్తం 45 మంది కుటుంబాలకు కేంద్రం ప్రకటించిన రూ.2లక్షల సాయం నేటికీ అందలేదు. తొలుత లక్షా18వేలు..ఆ తర్వాత మరో 36వేల ఇళ్లు దెబ్బతిన్నట్టుగా లెక్కతేల్చిన అధికారులు వీటిలో కనీసం 10 వేల మందికి కూడా పరిహారం పంపిణీ చేయలేకపోయారు. ఇక మత్స్యకారులకు జీవనోపాధి కింద ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున పంపిణీ చేస్తామని చెప్పినా ఇప్పటివరకు ఏ ఒక్కరికి పంపిణీ చేయలేదు. ధ్వంసమైన బోట్లకు ఎలాంటి సాయం అందించలేదు. ఉచితం పేరుతో పంపిణీ చేసిన బియ్యంతో సహా నిత్యావసరాలు వందలాది టన్నులు పక్కదారి పట్టాయి. ఇలా తుపాను సహాయ, పునరావాస చర్యల్లో అడుగడుగునా నిర్లక్ష్యం.. అలక్ష్యంతో పాటు పెద్ద ఎత్తున చోటుచేసుకున్న అవినీతి.. అవకతవకలు కప్పిపుచ్చుకునేందుకు సర్కార్ సన్మానాలు..ఉత్సవాలతో హడావుడి చేస్తోంది. అంతా నగరవాసులు పూర్తిగా సాధారణ జనజీవనంలోకి వచ్చేశారు. అంతా బ్రహ్మాండం అంటూ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం నగరంలో వివిధ చోట్ల ఉత్సవాల నిర్వహణకు సిద్ధమయ్యారు. తుపాను తర్వాత నగరానికి వస్తున్న సీఎంను సత్కరిం చడంతో పాటు సహాయ చర్యల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని సీఎంచే సత్కరిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ఉత్సవాలు.. సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నగర వాసులు ఇంకా పూర్తి స్థాయిలో తేరుకోలేదు. ఇలాంటి తరుణంలో ఉత్సవాలేమిటంటూ మేధావులు, వివిధ రాజ కీయ పార్టీల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
హుద్‌హుద్, తుపానుకు నెల
-
విలయానికి... నెల
* ఇంకా కళ్లముందే కనిపిస్తున్న బీభత్సం * సాగుతున్న ఎన్యుమరేషన్ * నష్టాల బేరీజులో అధికారులు * నేటికి రూ.2వేల కోట్లు దాటిన నష్టం సాక్షి ప్రతినిధి, విజయనగరం: సరిగ్గా ముప్పై రోజుల కిందట రాకాసి గాలి సుడులు తిరుగుతూ జి ల్లాను వణికించేసింది. నేటికి నెలనాళ్లవుతున్నా ఆ విలయం ఆనవాళ్లు ఇంకా మాయలేదు. అధికారు ల అంచనాలు కూడా ఇంకా సా...గుతూనే ఉ న్నా యి. ఇప్పటికే రూ.2వేల కోట్ల మేర నష్టం జరిగినట్టు తేలింది. ఇంకెంత తేలనుందో తెలి యని పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టి విపత్తు ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నష్టం సంభవించింది. ఈ నష్టం అధికార వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. తుపాను గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న జిల్లా ప్రజలకు అది మిగిల్చిన నష్టాన్ని చూసి బెంబెలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. పునరుద్ధరణ పనులు ఇంకా సాగుతున్నాయి. పడిపోయిన చెట్లు, కూలి పోయిన ఇళ్లు ఎక్కడికక్కడ అలానే ఉన్నాయి. ఉద్యానవన తోటలైతే దిక్కుతోచని స్థితిలో ఉన్నా యి. తుపాను వెలిశాక నిత్యావసర సరుకులిచ్చి చేతులు దులుపుకున్న సర్కార్ పునరుద్ధరణ, పరి హారానికి సంబంధించి ఇంతవరకు పైసా కూడా విడుదల చేయలేదు. ఒకవైపు నష్టం అంచనాలకు అందని విధంగా ఉంది. అంతకంతకు పెరిగిపోతోంది. నెలరోజులగా ఎన్యుమరేషన్ చేస్తున్నా కొ లిక్కి రావడం లేదు. ఇదొక ప్రహసనంలా సాగిపోతోంది. ఇదెప్పటికి పూర్తవుతుందో? పునరుద్ధరణ జరిగేదెప్పుడో? పరిహారం వచ్చేదెప్పుడో? ప్రజ ల నష్టం తీరెదెప్పుడో తెలియని దుస్థితి నెల కొంది. ఇప్పటివరకైతే సుమారు రూ.2వేల కోట్ల నష్టం తేలింది. ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఎన్యుమరేషన్ అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి హుద్‌హుద్ బీభత్సం ఎంత మేర సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ నష్టాల వివరాలివి. ఊవ్యవసాయ శాఖ పరిధిలోకి వచ్చే 5,923.5హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతినగా 83.38 కోట్లు మేర నష్టం సంభవించింది. * 42,348హెక్టార్లలో ఉద్యానవన పంటలు నాశనమవ్వగా 21.23కోట్ల మేర నష్టం వాటిల్లింది. * పట్టు పరిశ్రమకు 11.90లక్షల నష్టం జరిగింది. * 15,991ఇళ్లు దెబ్బతినగా 8.70కోట్లు నష్టం ఏర్పడింది. * 23.96కోట్ల విలువైన జీవాలు చనిపోయాయి. * 77.69కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. * 11.44కోట్ల మేర కేంద్ర ప్రభుత్వ ఆస్తులు దెబ్బతిన్నాయి. * 22.01కోట్ల మేర ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లింది. * ఆర్అండ్బీ రోడ్లు, ఇతరత్రా ఆస్తులకు 194.73కోట్ల నష్టం సంభవించింది. * పరిశ్రమలకు రూ.874కోట్లు నష్టం జరిగింది. * ఐటీడీఏ పరిధిలో రూ.3.69కోట్ల నష్టం ఏర్పడింది. * పంచాయతీరాజ్ రోడ్లు, ఇతరత్రా ఆస్తులకు 183కోట్ల నష్టం వాటిల్లింది. * పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖకు 23. 99కోట్ల నష్టాన్ని మిగిల్చింది. * మున్సిపాలిటీల పరిధిలో 279.33కోట్ల మేర నష్టం జరిగింది. * చిన్న నీటిపారుదల శాఖకు 40.32కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. * గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగానికి 6.05కోట్ల నష్టాన్ని మిగిల్చింది. * మత్స్యశాఖ పరిధిలోకి వచ్చే వాటికి 28.37కోట్ల నష్టం ఏర్పడింది. * వైద్య ఆరోగ్య శాఖకు 29.62కోట్లు నష్టం జరిగింది. * ట్రాన్స్‌కోకు 41.48కోట్ల నష్టం సంభవించింది. -
లెక్కలు తప్పుతున్నాయి
ఇళ్ల నష్టం అంచనాలపై అనేక అనుమానాలు తుపానుకు దెబ్బతిన్న వారం రోజులకు ఎన్యూమరేషన్ ఇప్పటికే కొంత మంది ఇళ్లను బాగుచేయించుకున్న వైనం వీరికి పరిహారం మాటేమిటి? 2 రోజుల్లో అంచనాలు పూర్తవుతాయంటున్న మంత్రులు ఇంకా పలు ప్రాంతాలకు వెళ్లని బృందాలు తుపాను నష్టం అంచనాలపై అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. ఎన్యూమరేషన్ తీరు పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రుల భిన్న ప్రకటనలు తుపాను బాధితులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అంచనాల రూపకల్పన పూర్తవుతుందని చెబుతున్నప్పటికీ.. ఇంకా వేల మంది బాధితుల వివరాలు సేకరించాల్సి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గడువు సమీపిస్తున్నా అంచనా బృందాలు రాలేదన్న ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. విశాఖ రూరల్ : హుదూద్ ధాటికి జిల్లాలో లక్షకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో రోడ్ల మీదకు వచ్చారు. మరికొందరు దెబ్బతిన్న ఇళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. జిల్లా ప్రజల ఆస్తుల నష్టాలపై అధికారులు 176 బృందాలను ఏర్పాటు చేశారు. తొలిదశలో ఇళ్లు, ఇతర ఆస్తులు, మరణాలు, జంతు మరణాలును లెక్కించాలని మార్గదర్శకాలు జారీ చేశారు. దీని ప్రకారం మూడు రోజుల క్రింత ఈ బృందాలు ఎన్యుమరేషన్‌ను ప్రారంభించాయి. ఇప్పటి వరకు 90 శాతం బాధితుల వివరాలు సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 68,254 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగనుంది. ఇప్పటి వరకు జరిపిన పరిశీలనలో అర్బన్‌లో పక్కా గృహాలు 21, రూరల్‌లో 106 మొత్తం 127 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని లెక్కలు తేల్చారు. పూరిళ్లు అర్బన్‌లో 30, రూరల్‌లో 1720 మొత్తంగా 2050 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని గుర్తించారు. అలాగే పక్కా ఇళ్లు అర్బన్‌లో 203, రూరల్ 642, పూరిళ్లు అర్బన్‌లో 2229, రూరల్ 3065 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. అదే విధంగా పక్కా గృహాలు అర్బన్‌లో 1355, రూరల్‌లో 4627, పూరిళ్లు అర్బన్‌లో 14,740, పూరిళ్లు 17,970, గుడిసెలు అర్బన్‌లో 6774, రూరల్‌లో 14,472 స్వల్పం గా దెబ్బతిన్నట్లు బృందాలు పరిశీలనలో వెల్లడైంది. తుది గడువుపై గందరగోళం ఎన్యూమరేషన్ గడువుపై గందరగోళం నెలకొంది. ఈ నెల 22వ తేదీ నాటికి నష్టం అంచనా ప్రక్రియ పూర్తవుతుందని మంత్రులు చెబుతున్నారు.అసలు కొన్ని ప్రాంతాలకు బృందాలు వెళ్లలేదన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖ 29వ వార్డు అచ్చయ్యమ్మపేటలో సహాయ కార్యక్రమాలు అందించకపోగా నష్టం అంచనాలకు ఏ ఒక్కరు రాలేదని భారీ సంఖ్యలో మహిళలు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అలాగే చాలా ప్రాంతాలకు బృందాలు పర్యటించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్‌కు మరో వారం రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే మంత్రులు కేవలం రె ండు రోజుల్లో అంచనాలు పూర్తి చేస్తామని చెప్పడంతో నష్టపరిహారం తమకు అందదేమోనని బాధితుల్లో ఆందోళన నెలకొంది. ఇళ్లు బాగుచేయించుకున్న వారి పరిస్థితేమిటి తుపానుకు దెబ్బతిన్న ఇళ్లను కొందరు బాగు చేయించుకున్నారు. అంచనా బృందాలు వచ్చి పరిశీలన చేసినంత వరకు దెబ్బతిన్న ఇళ్లలో ఉండలేమని భావించి కొందరు అప్పులు చేసి ఇళ్లకు మరమ్మతులు చేపట్టారు. ఇటువంటి వారికి నష్టపరిహారం ఏ విధంగా అందిస్తారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. దీంతో అటువంటి బాధితుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయంపై అధికారులు, మంత్రులు దృష్టి సారించని పక్షంలో బాధితులకు న్యాయం జరిగే అవకాశముండదు. -
సాయంలో వివక్షా?
25కు బదులు 10 కిలోల బియ్యం పంపిణీపై ఆగ్రహం అమలాపురంలో రేషన్‌డిపో ముందు బాధితుల ధర్నా ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెడుతోందని ఆరోపణ నక్కపల్లి/నక్కపల్లి రూరల్: తుపాను సాయమందించడంలో ప్రభుత్వం వివక్ష పాటించడం తగదని, అందరికీ ఒకేలా బియ్యం పంపిణీ చేయాలని నక్కపల్లి మండలం అమలాపురంలో బాధితులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వారు నిరసనకు దిగారు. గ్రామంలో సగం మందికి 25 కిలోల వంతున బియ్యం పంచి మిగతావారికి 10 కిలోలు చొప్పున పంపిణీ చేయడాన్ని నిరసిస్తూ సర్పంచ్ సూరాకాసుల రామలక్ష్మి, వైఎస్సార్ సీపీ నాయకుడు సూరాకాసుల గోవిందుల ఆధ్వర్యంలో శనివారం బాధితులు ధర్నా చేశారు. సుమారు 800 తెల్ల రేషన్ కార్డులు కలిగిన అమలాపురం మత్స్యకార గ్రామంలో తుపాను సహాయం కింద బియ్యం పంపిణీ చేయడంలో చౌకడీపో డీలరు తాత్సారం చేశారని బాధితులు తెలిపారు. మత్స్యకారులు ఒత్తిడి చేయడంతో శుక్రవారం మత్స్యకారులకు 50 కిలోలు, ఇతర కులాల వారికి 25 కిలోల చొప్పున పంపిణీ చేశారని చెప్పారు. శనివారం డీలరు 10 కిలోలు మాత్రమే ఇవ్వడం ప్రారంభించారని, దీనిపై ప్రశ్నిస్తే అలాగే ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం పంపిణీ చేయకుండా అడ్డుకున్నారు. గత్యంతరం లేక డీలరు దుకాణం మూసి వెళ్లిపోయారు. డీలరు నిర్లక్ష్యం వల్ల నష్టపోయాం : డీలరు నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా జరిగిందని, సరుకు వచ్చిన రోజునే పంపిణీ చేసుంటే అందరికీ 25 కిలోల వంతున అందేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డీలరు తాత్సారం చేయడం వల్ల 15కిలోల బియ్యం నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌షాపు డీలరు బినామీ అని, తక్షణమే ఆయనను మార్చాలని డిమాండ్ చేశారు. మత్య్సకార గ్రామాల్లో నివ శించే మత్య్సకారేతరులకు కూడా 50 కిలోల చొప్పునే ఇవ్వాలని ఇప్పటికే పలు గ్రామాల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో 25కు బదులు 10 కిలోలే ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తమైంది. -
సేవ్ ఉత్తరాంధ్రకు రెవెన్యూ ఉద్యోగుల సహకారం
సీఎంకు ఏపీ ఆర్ఎస్ఏ నేతల హామీ విశాఖ రూరల్: సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో తుపాను వల్ల నష్టపోయిన మూడు జిల్లాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్(ఏపీ ఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సీఎం చంద్రబాబునాయుడుకు చెప్పారు. సీఎంను కలెక్టరేట్లో బుధవారం కలిశారు. తుపాను సహాయ కార్యక్రమాల్లో 1500 మంది రెవెన్యూ ఉద్యోగులు అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు. సామాజిక బాధ్యతగా నష్టం పరిహారం అందించే విషయంపై త్వరలోనే జేఏసీలో చర్చిస్తామని, రెవెన్యూ ఉద్యోగులు, వారి బంధువులు, ఇతరుల నుంచి భారీగా విరాళాలు సేకరించి సీఎం సహాయ నిధికి అందజేస్తామని చెప్పారు. రెవెన్యూ అసోసియేషన్, ఉద్యోగులు చేస్తున్న కృషిని సీఎం అభినందించారు. సీఎంను కలసిన వారిలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగేశ్వరరెడ్డి, ఇతర ప్రతినిధులు ఉన్నారు. నేడు పాడేరుకు సీఎం విశాఖ రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం పాడేరు వెళుతున్నారు. ఉదయం గం.7.30కు నగరం నుంచి బయలల్దేరతతారు. అక్కడ తుపాను బాధితులను, కాఫీ పంట నష్టాన్ని పరిశీలించనున్నారు. అనంతరం తిరిగి నగరానికి రానున్నారు. -
కలెక్టరేట్లో నరేంద్ర మోదీ
సందర్శించిన తొలి ప్రధాని నేతలు, అధికారులతో సమీక్ష విశాఖ రూరల్ : ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విశాఖ కలెక్టరేట్ భవనాన్ని సందర్శించారు. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ భవనాన్ని సందర్శించిన తొలి ప్రధాని ఆయన కావడం విశేషం. ఆయన కలెక్టరేట్లో 30 నిమిషాలు గడిపారు. 1914లో నిర్మించిన ఈ భవనాన్ని తొలుత ఆంగ్ల పాలకులు కలెక్టర్ కార్యాలయంగా వినియోగించారు. స్వాతంత్య్రం అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ భవనాన్ని కలెక్టరేట్‌గా వినియోగిస్తోంది. అప్పటి నుంచి ప్రధానులు జిల్లాకు వచ్చినా కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భాల్లేవు. హుదూద్ తుపాను జిల్లాకు తీవ్ర నష్టాన్ని మిగల్చడంతో స్వయంగా పరిస్థితిని పరిశీలించడానికి దేశ ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం నగరానికి వచ్చారు. మధ్యాహ్నం 1.10 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి జాతీయ రహదారి మీదుగా నగరానికి చేరుకున్నారు. పెదజాలరిపేటను సందర్శించాక వుడా పార్కు, ఆర్కే బీచ్ మీదుగా కలెక్టరేట్‌కు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఆయనకు స్వాగతం పలికాయి. ఆయన వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నారు. తుపాను నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను ప్రధాన మంత్రి తిలకించారు. అనంతరం తుపాను నష్టం, చేపడుతున్న చర్యలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో 25 నిమిషాల పాటు ప్రభుత్వ నేతలు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విమానాశ్రయానికి వెళ్లి ఢిల్లీకి పయనమయ్యారు. -
బీమా ధీమా కూడా లేదాయె!
తుపానుతో 4 జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం రైతుకు బీమా వర్తించకుండా పోయిన వైనం రుణమాఫీ హామీతో కొత్తగా రుణాలు ఇవ్వని బ్యాంకులు అప్పులిచ్చినట్టైతే బ్యాంకులు అప్పుడే బీమా ప్రీమియం తీసుకునేవి రుణాలు రాకపోవడంతో పునరుద్ధరణ కాని పంటల బీమా దిక్కుతోచని స్థితిలో రైతాంగం హైదరాబాద్: రుణ మాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ తుపానులో పంటలు కోల్పోయి న రైతుల పాలిట శాపంగా మారింది. రుణాలన్నీ మాఫీ అవుతాయని ఎదురుచూస్తున్న రైతులు తమ రుణాలను రెన్యువల్ చేయించుకోకపోవడమే కాకుండా పంటల బీమాను కూడా పునరుద్ధరించుకోలేదు. దీంతో హుదూద్ తుపాను కారణంగా భారీఎత్తున పంటలు నష్టపోయిన రైతులకు బీమా సౌకర్యం లేకుండా పోయింది. హు దూద్ బీభత్సంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాలలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నారుు. ప్రకృతి బీభత్సాలతో నష్టపోయే రైతుల్ని ఆదుకునేందుకు గ్రామం యూనిట్‌గా వర్షాధారిత పం టల బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పంట వేసింది మొదలు కోసిన తర్వాత పంట కల్లాల్లో ఉన్నప్పుడూ 14 రోజుల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుంది. మామూలుగా రైతు లు ఖరీఫ్ సీజన్లో (ఏప్రిల్ నుంచి జూలై మధ్య) బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. అప్పు ఇచ్చే సమయంలోనే బ్యాంకులు రైతులు వేసే పంటలకు అనుగుణంగా బీమా ప్రీమియా న్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని రైతులకు ఇస్తుంటాయి. అయితే రుణ మాఫీ హామీ నేపథ్యంలో ఏ రైతుకూ బ్యాంకులు ఇప్పటివరకు కొత్త రుణాలు ఇవ్వలేదు. పాత రుణాలు చెల్లిస్తేనే కొత్తవి ఇస్తామని స్పష్టం చేయడంతో పం టల బీమాను ఎవరూ పట్టించుకోలేదు. ఈ పథకం గడువు గత నెలాఖరుతో ముగిసింది. గడువు ముగిసిన రెండు వారాల్లోపే తుపాను వచ్చి రైతులకు అపార నష్టం మిగిల్చి వెళ్లింది. రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదారతపై ఆధారపడాల్సిందే తప్ప.. ఓ హక్కుగా బీమాను పొందే వీలును కోల్పోయారు. ఈనెల 22 తర్వా త తొలి విడతగా బ్యాంకులకు చెల్లింపులు చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలయ్యే లోపే నష్టం జరిగింది. ఈ జిల్లాల్లో వరి, చెరకు, కంది, పత్తి, సజ్జ, మొక్కజొన్న, ఆముదం, మిరప, వేరుశన గ, జీడిమామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లిం ది.రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ప్రైవేటు బీమా కంపెనీలతో మాట్లాడతానన్నారే గానీ వ్యవసాయ బీమా గురించి మాట్లాడకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వ్యవసా య బీమా అంతా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సం స్థలే చూస్తుంటాయి. ప్రభుత్వం నిర్దిష్టంగా ఉత్తర్వులు ఇస్తే తప్ప నిబంధనలు మార్చడానికి బీ మా సంస్థలు అంగీకరించవు. నీలం, పైలిన్ తుపాన్ల నష్టపరిహారమే ఇప్పటివరకు అందలేదు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో బీమా వస్తుందనుకోవడం అత్యాశే అవుతుందని అంటున్నారు. ప్రభుత్వం చేస్తామన్న రుణమాఫీకే నిధులకు కటకటలాడుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు రైతులకు పెట్టుబడి రాయితీని ప్రకటించారు. అరుుతే ఇది నిర్దిష్ట గడువులోపు అందితే తప్ప రైతులు కోలుకునే స్థితి లేదు. పంటల బీమాపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని, పరిహారం ఇవ్వదల్చుకుంటే ఎప్పటిలోగా ఇస్తారో ప్రకటించాలని అంటున్నారు. బీమా ఉంటే ఎకరాకు రూ. 23 వేల వరకు వచ్చేవి.. ఎవరూ పంట రుణాలు చెల్లించొద్దని చంద్రబాబు చెప్పడం వల్ల 90 శాతం మంది రైతులు రుణాలను రెన్యువల్ చేసుకోలేదు. దీంతో రైతులందరూ ఖరీఫ్‌లో బీమా అర్హత కోల్పోయారు. ప్రభుత్వం లేదా రైతులు సకాలంలో రుణాలు చెల్లించి రెన్యువల్ జరిగి ఉంటే తుపాను ప్రభావం వల్ల పంట పోయిన రైతులకు ఒక్కో ఎకరాకు రూ.23 వేల వరకు బీమా అందేది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే తీవ్ర సంక్షోభం ఎదుర్కోక తప్పదు. ఆర్బీఐ నిబంధనల మే రకు తీసుకున్న రుణ మొత్తం ఒకేసారి చెల్లిస్తే రెన్యువల్ చేసేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఏడాదికి 20శాతం మే ర చెల్లిస్తామంటే రైతులకు తిరిగి రుణం ఇచ్చే పరిస్థితి లేదు. పైగా వాటిని రాని బకాయిలు గా చూపి రైతులకు సంబంధించిన ఆస్తులను బ్యాంకులు జప్తు చేస్తాయి. పంట రుణాల రద్దు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే రైతులకు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. - రాంబాబు, కార్యదర్శి, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ పరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్యలే.. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం. తుపాను కారణంగా చెరకు, అరటి ఇతర పంటలన్నీ నేల కొరిగాయి. ఒక్కో ఎకరాకు లక్ష రూపాయల వరకు నష్టం సంభవించింది. తిరిగి పంట వేయాలన్నా ప్రభుత్వ తీరు కారణంగా బ్యాంక ర్లు రుణం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.ప్రభుత్వం, బ్యాంకర్లు స్పం దించకుంటే మున్ముందు పంటలు వేసుకోలేం. - సత్యనారాయణ, రైతు,సిరివాడ, తూ.గో.జిల్లా ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలి రైతులను ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వాలి. దెబ్బతిన్న పంట పొలాలను సందర్శిస్తున్నా సహాయంపై ఇప్పటివరకు ఎవరూ మా ట్లాడటంలేదు. సర్వే చేయిస్తామని చెబుతున్నా ఎక్కడా చేయించలేదు. ప్రభుత్వం స్పందించి పెట్టుబడి కోసం ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలి. - కె.రామచంద్రరావు,సిరివాడ,తూ.గో.జిల్లా రైతులకు రెండు విధాలా నష్టం రైతులకు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు రుణ మాఫీ చేయకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. రుణాలు రెన్యువల్ కాకపోవడంతో ఇన్సూరెన్స్ వర్తించని పరిస్థితి ఏర్పడింది. తుపానుతో పంట కోల్పోయిన రైతులు రుణమాఫీ అందక, బీమా రాక అప్పుల ఊబిలో మరింత మునిగిపోయూరు. - దడాల సుబ్బారావు, కౌలు రైతుల సంఘం గౌరవ అధ్యక్షుడు, తూర్పు గోదావరి జిల్లా -
భగ్గుమన్న ధరలు
పాల ప్యాకెట్ ధర రెట్టింపు కూరగాయలు, పళ్ల ధరలూ అంతే పెట్రోలు బంకుల ఎదుట బారులు సరిపడా నిల్వలున్నాయ్: చమురు పరిశ్రమ విశాఖపట్నం, విశాఖ రూరల్: తాత్కాలికమే అయినా తుపాను దెబ్బకు సరఫరాలు తగ్గిపోవటంతో పాల నుంచి పప్పు వరకు అన్ని ధరలూ ఒకేసారి భగ్గుమన్నాయి. రోడ్లపై అడుగడుగునా చెట్లు పడిపోవడంతో పాల వ్యాన్లు రాలేదు. దీంతో ప్రజలు కాలినడకనే తెగిపడిన చెట్లను దాటుకుంటూ ప్యాకెట్ల కోసం వెతుకులాడారు. దీంతో రూ.22 ప్యాకెట్‌ను రూ.40కి విక్రయించటం కనిపించింది. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ధరకు కూడా విక్రయించినట్లు తెలిసింది. ఇళ్లలో మంచినీరు సైతం లేకపోవడంతో టిఫిన్లు కూడా చేసుకొనే అవకాశం లేక బయటపెట్టిన తోపుడు బళ్లనే చాలామంది ఆశ్రయించారు. డిమాండ్ పెరగటంతో అక్కడా ధరల బాధ తప్పలేదు. ఆఖరికి పూర్ణామార్కెట్‌లో సైతం పళ్లు, కూరగాయల ధరలు బాగా పెంచేశారు. ఇక పెట్రోలు బంకుల వద్దనైతే చాంతాడు క్యూలు తప్పలేదు. సోమవారం మధ్యాహ్నానికి కొన్ని బంకులు మాత్రమే తెరవటంతో మళ్లీ దొరుకుతుందో లేదోనన్న రీతిలో జనం పెట్రోలు కోసం బారులు తీరారు. అయితే నగరంలో 15 రోజులకన్నా ఎక్కువ రోజులకు సరిపోయే పెట్రోలు, డీజిల్‌ను నిల్వ ఉంచామని, జనం భయపడి ఎక్కువ ఎక్కువ కొనాల్సిన పనిలేదని చమురు పరిశ్రమ రాష్ట్రస్థాయి కో-ఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అవసరమైనంత మేర కొనుక్కుంటే చాలునని, దెబ్బతిన్న బంకుల్ని యుద్ధ ప్రాతిపదికన పునుద్ధరించడానికి చమురు కంపెనీలు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయని వెల్లడించారు. -
రూ. 2 వేల కోట్లిచ్చి ఆదుకోండి!
కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం: విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర తుపాను సహాయ, పునరావాస చర్యల కోసం తక్షణ సాయంగా కేంద్రాన్ని రూ. 2 వేల కోట్లు ఇవ్వమని అడగనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను, బాధితులను చూశాక తన మనసు వికలమైందని సీఎం అన్నారు. విశాఖపట్నంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సహాయ, పునరావాస చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీతో ఇప్పటికి రెండుసార్లు చర్చించానన్నన్నారు. ప్రధాని మోదీ మంగళవారం విశాఖపట్నం వచ్చే అవకాశాలున్నాయని సీఎం చెప్పారు. ప్రస్తుతం బాధితలకు ఆహారం, తాగునీరు అందించడమే తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. రేషన్ దుకాణాల ద్వారా నెలకు సరిపడా సరుకులను వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. ఇతర జిల్లాల నుంచి పాలు, నీళ్ల ప్యాకెట్లను హెలికాప్టర్ల ద్వారా విశాఖపట్నానికి తరలించనున్నట్టు పేర్కొన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు సహాయ, పునరావాస చర్యల బాధ్యతలు అప్పగించామన్నారు. ఏరియల్ సర్వే ద్వారా తుపాను బాధిత ప్రాంతాలను చూసి తన మనసు చితికిపోయిందన్నారు. అందాల విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమని కానీ ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి దయనీయంగా మారిందని వ్యాఖ్యానించారు. పరిస్థితి చక్కబడే వరకు ఇక్కడే.. విశాఖలో విద్యుత్తు సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించనున్నట్టు సీఎం తెలిపారు. ఉత్తరాంధ్రలో తుపాను బాధిత ప్రజల కళ్లల్లో మళ్లీ కళ చూసేంతవరకు ఈ ప్రాంతంలోనే ఉండనున్నట్టు తెలిపారు. ప్రతి రోజూ రాత్రి 10 గంటలకు అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు బాబు చెప్పారు. -
‘అల'జడి
రేపల్లె: తీరంలో శనివారం ‘అల'జడి రేగింది. పెను తుపానుగా మారిన ‘హుదూద్' ప్రభావం సముద్ర తీరంలో స్పష్టంగా కనిపించింది. నిజాంపట్నం వద్ద సముద్రం అలలు ఎగసిపడుతున్నాయి. నాలుగుమీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. సాధారణ రోజుల కంటే భిన్నంగా మరింత ఎత్తుకు అలలు లేస్తుండడం కలకలం రేపుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగానే ఉంటున్నారు. నిజాంపట్నం ఓడరేవులో మూడవ నంబర్ ప్రమాద సూచీ ఎగురవేశారు. మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన బోట్లు ఒడ్డుకు చేరేలా మత్స్యకారులకు సమాచారం అందజేశారు. నిజాంపట్నం హార్బర్లోని 151 మెక్‌నైజ్డ్ బోట్లలో శనివారం నాటికి 147 ఒడ్డుకు చేరాయి. మరో నాలుగు బోట్ల రాక కోసం ఎదురు చూస్తున్నారు. వాటి కోసం అధికారులు,బోటు ఓనర్స్ అసోసియేషన్ నాయకులతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో శనివారం మధ్యాహ్నాం నుంచి రేపల్లె, నిజాంపట్నం,బాపట్ల ప్రాంతాల్లో ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. రాత్రికి గాలులు వేగం మరింత పెరిగింది. సముద్రం నాలుగు మీటర్ల మేర ముందుకు రావటంతో తీర ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ వద్ద తీరం దాటినా ఆ ప్రభావం గుం టూరు జిల్లాపై కూడా ఉంటుందనే హెచ్చరికలు తీరప్రాంత వాసుల్లో కలకలం రేపుతున్నాయి. తుఫాన్ ప్రభావం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా క్షణాల్లో అన్ని చర్యలు తీసుకునే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అదే విధంగా ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాం తాల్లో అధికారులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బోట్లను జాగ్రత్త చేసుకునే పనిలో మత్స్యకారులు... ఒడ్డుకు చేరిన బోట్లను జాగ్రత్త చేసుకోవటంతో మత్స్యకారులు నిమగ్నమయ్యారు. బోట్లను నిలుపుకునేందుకు సరిపడ జెట్టీ లేకపోవటంతో రేవుల ఒడ్డున నిలుపుకుని తాళ్లతో ఒడ్డున ఉన్న చెట్లకు కడుతున్నారు. దీంతో పాటు ఎంతో విలువైన ఐలు వలలను జాగ్రత్త చేసుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దం కొత్తపేట: పెను తుఫాన్ తాకిడి ప్రాంతాల్లో సహాయ చర్యలు నిమిత్తం ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్టు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎస్.ఎం.క్యూ జిలాని వెల్లడించారు. శనివారం జిల్లా అగ్నిమాపక కార్యాలయంలో ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అందించాల్సిన ర క్షక సహాయక చర్యలన ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లాలోని బాపట్ల, రేపల్లె, నిజాంపట్నం, తెనాలి ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. బాపట్లకు మూడు బృందాలు, రేపల్లెకు మరో మూడు బృందాలను సిద్ధం చేశామన్నారు. మొత్తం 30 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిపాటు లీడింగ్ ఫైర్మెన్లు ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు గుంటూరు ఈస్ట్: తుఫాన్ ప్రభావంతో కురిసే భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంత ప్రజలకు నష్టం కలగకుండా అధికారులు ముందస్తు చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. నిజాంపట్నం ఓడరేవులో మూడవ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలన్నారు.భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని జనరేటర్ వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పక చేయాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖ అధికారులు పునరావాస శిబిరాల వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. రెవెన్యూ అధికారులు శిబిరాలలోని ప్రజలకు మంచి ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి, పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలని కోరారు. జాయింట్ కలెక్టర్ శ్రీధర్ జిల్లా రిలీఫ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. తుఫాన్ అనంతరం పంటలు, ఇళ్లు, ఇరిగేషన్, విద్యుత్ వ్యవస్థల నష్టాలను కచ్చితంగా అంచనా వేయాలని కోరారు. నీలం తుపాను వచ్చిన సందర్భంలో ఎదుర్కొన్న సమస్యలు దృష్టిలో పెట్టుకొని సమర్థం ప్రణాళికాలు సిద్ధం చేసుకుని ఆమేరకు పనిచేయాలనికోరారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు జిల్లా అధికారులతో సంప్రదించి సహాయం తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో మంచినీటి సరఫరా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తహశీల్దారులు అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా పనిచేసి నష్ట నివారణకు కృషి చేయాలని కోరారు. అనధికారిక లేఅవుట్లపై చర్యలు.... జిల్లాలో అనధికారిక రియల్ ఎస్టేట్ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకోవా లని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమాలు ఉన్నా ఈ ప్రక్రియను అమలు జరపాలన్నారు. కృష్ణానది మొదలు అన్ని ప్రాంతాల్లో అనుమతి లేని లే అవుట్ల వివరాలు గ్రామ పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి తీసుకోవాలన్నారు. ల్యాండ్ కన్వర్షన్, అప్రూవల్ లేని ఏ ఒక్క వెంచర్నీ అనుమతించవద్దని తీవ్రంగా హెచ్చరించారు. -
పంజా విసురుతున్న హుదూద్
-
అక్టోబర్ టైర్రర్
కష్టాల తీరంలో సిక్కోలు విలవిల * ప్రతి ఏటా తుపాన్ల దాడి.. తీవ్ర నష్టం * ప్రస్తుత హుదూద్ దిశ మారితే జిల్లాకు కష్టమే * ఇప్పటికే అల్లకల్లోలంగా సముద్రం * ఎగిసిపడుతున్న అలలు * ముందుకు చొచ్చుకొస్తున్న సాగరం * కంటిమీద కునుకు కరువైన తీరగ్రామాలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తుపాన్ల ధాటికి శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. దాదాపు ప్రతి ఏటా పంటలు చేతికొచ్చే సమయంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు పంటలను, ఆస్తులను ఊడ్చేస్తున్నాయి. ఫలితంగా జిల్లా ఆర్థికంగా చితికిపోతోంది. ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్‌లో పెను విలయం సృష్టించిన పై-లీన్ తుపాను తొలుత కళింగపట్నం వద్దే తీరం దాటుతుందని అంచనా వేశారు. అయితే అది దిశ మార్చుకుని ఒడిశాలోని గోపాల్పూర్ వైపు మళ్లింది. అదే విధంగా ప్రస్తుతం కమ్ముకొస్తున్న హుదూద్ తుపాను విశాఖ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నా తీరం దాటే సమయంలో దిశ మార్చుకునే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. వాస్తవానికి కోస్తా తీరంలో ఇప్పటివరకు 43 తుపాన్లు సంభవించినట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తీరం దాటే సమయంలో ఇవి విధ్వంసం సృష్టిస్తుంటాయి. జిల్లాలోనూ పలు మార్లు తుపాన్లు తీరం దాటాయి. వాస్తవానికి అక్టోబర్‌లో వచ్చే తుపాన్లు నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుపాన్ల కంటే బలహీనమైనవిగా వాతావరణశాఖ చెబుతోంది. నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయి ఈశాన్యం వచ్చే క్రమంలో తుపాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరో రెండు రోజుల్లో తీరం దాటనున్న హుదూద్ తుపాన్ ప్రభావం ఎలా ఉంటుందోనన్న సిక్కోలు వాసులు గజగజలాడిపోతున్నారు. తరుముకొస్తున్న హుదూద్ విశాఖ సమీపానికి అతివేగంగా దూసుకొస్తున్న తీవ్ర పెనుతుపాను శనివారం నుంచి జిల్లాపై ప్రభావం చూపనుంది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతోఆపటు గంటకు 130 నుంచి 150 కి.మీ వేగంతో భీకర గాలులు వీచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన సముద్రం మరింత భీకర రూపం దాల్చి ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. ఇప్పటికే కళింగపట్నం పోర్టులో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హుదూద్ ప్రభావం మరింత తీవ్రమైతే సమాచార వ్యవ స్థ కుప్పకూలడం ఖాయమని, పక్కా ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, విద్యుత్ స్తంభాలు పడిపోతాయని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే వెళ్లినవారు వెనక్కు తిరిగి వచ్చేయాలని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు, తీరం ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈనెల 11, 12 తేదీల్లో జరగనున్న జన్మభూమి సభలను రద్దు చేయడంతోపాటు విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. తుపాను షెల్టర్లు, పునరావాస కేంద్రాలను సిద్ధం చేయడంతోపాటు వాటిలో ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతున్నారు. 70 గ్రామాల నుంచి సుమారు లక్ష మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు అవసరమైన వాహనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక ఆర్మ్డ్ ఫోర్సు బృందం ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. నేటి నుంచి భారీ వర్షాలకు అవకాశం పెను తుపాను తీరం వైపు దూసుకొస్తుండటంతో శనివారం నుంచి భీకర గాలులతోపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. కాగా శుక్రవారమే జిల్లాలో ఆకాశం మబ్బుపట్టింది. స్వల్పంగా గాలులు మొదలయ్యాయి. కళింగపట్నం సహా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. -
తరుముకొస్తోంది
కోస్తా ప్రాంతాలపై పంజా విసురుతున్న హుదూద్ పెను తుపానుగా రూపాంతరం విశాఖకు 460 కి.మీ., గోపాల్‌పూర్‌కు 510 కి.మీ. దూరంలో కేంద్రీకృతం సిద్ధంగా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ దళాలు 4 యుద్ధ నౌకలు, 6 విమానాలు, 6 హెలికాప్టర్లు, గజ ఈతగాళ్లు రెడీ ఆహారం, టెంట్లు, మందులు, ఇతరత్రా సామగ్రి సిద్ధం నేడు పాఠశాలలకు సెలవు.. పరిశ్రమలు రాత్రి షిఫ్టు రద్దు చేయాలని ఆదేశాలు విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, ఒడిశా కోస్తా ప్రాంతాలపై పెను ఉప్పెన పంజా విసురుతోంది. తీవ్రరూపం దాల్చిన హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలను హడలెత్తిస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో పోర్ట్‌బ్లెయిర్ వద్ద మొదలైన హుదూద్ తుపాను శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు తీవ్ర తుపానుగా రూపుదాల్చింది. విశాఖపట్నంకు 460 కి.మీ. దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు పశ్చిమ ఉత్తర దిశలో 510 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 10 కి.మీ. వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. రానున్న 12 గంటల్లో తుపాను తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం సమీపంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. రానున్న 24 గంటల్లో హుదూద్ తుపాను గమనం ఏమాత్రమైనా మారితే విశాఖపట్నంకు తూర్పు ఉత్తర దిశగా 30 కి.మీ. నుంచి 60 కి.మీ. దూరంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై ఇప్పుడే అధికారికంగా ఏమీ చెప్పలేమని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే విశాఖపట్నం సమీపంలోనే తీరాన్ని తాకే అవకాశాలున్నాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ రాంచంద్రావు తెలిపారు. తుపాను నష్టం తీవ్రంగా ఉండే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీరాన్ని దాటే ప్రాంతంలో కొండలు ఉన్నందువల్ల హుదూద్ తీవ్రత కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. తీవ్ర విధ్వంసం తప్పదా!? హుదూద్ తుపాను ఇదే తీవ్రతతో ఉంటే తీరాన్ని దాటే సమయంలో పెను ఉప్పెనతో విరుచుకుపడి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం కొన్నిచోట్ల ముందుకు వచ్చింది. గాలుల తీవ్రత పెరిగింది. తుపాను తీరాన్ని దాటే సమయంలో అత్యంత భారీ వర్షాలు, పెను గాలులతో బీభత్సాన్ని సృష్టించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి తుపాను తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచి సాధరణ స్థాయిలో వర్షాలు మొదలై, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, దక్షిణ ఒడిశాలలో 12.50 సెం.మీ. నుంచి 24.40 సెం.మీ. వరకు అతి భారీ వర్షపాతం నమోదు కావచ్చు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా సాధారణ నుంచి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం తీరం దాటే సమయంలో గంటకు 130 కి.మీ. నుంచి 150 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ఆ ప్రాంతాలకు రాకపోకలను వాయిదా వేసుకోవాలని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. రాష్ట్రంలో కృష్ణపట్నం తప్ప మిగిలిన అన్ని పోర్టుల్లోనూ మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం హుదూద్ తుపాను ప్రళయ భీకరంగా విరుచుకుపడుతుందన్న సంకేతాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, రక్షణ శాఖ బలగాలు సహాయ, పునరావాస చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బలగాలు రంగంలోకి దిగాయి. విశాఖపట్నం జిల్లాకు 6 బెటాలియన్లు, విజయనగరం జిల్లాకు ఒక బెటాలియన్, శ్రీకాకుళం జిల్లాకు రెండు బెటాలియన్ల ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపించారు. ఒక్కో బెటాలియన్‌లో 40 మంది ఉంటారు. నేవీ అధికారులు కూడా 30 రెస్క్యూ టీంలను విశాఖపట్నంలో సిద్ధంగా ఉంచారు. అవసరాన్ని బట్టి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కడికైనా వెళ్లేందుకు ఇవి పూర్తి పరికరాలతో సర్వసన్నద్ధంగా ఉన్నాయి. సహాయక చర్యల కోసం 4 యుద్ధ నౌకలు, 6 ఎయిర్ క్రాఫ్ట్‌లను తూర్పు నావికాదళం సిద్ధంగా ఉంచింది. నేవీ, ఎయిర్ఫోర్స్లకు చెందిన 6 హెలికాప్టర్లను సిద్ధం చేశారు. రెండు ఆర్మీ బెటాలియన్లు కూడా శనివారం ఉదయానికి విశాఖపట్నం చేరుకోనున్నాయి. ఆర్మీ బలగాల తరలింపు కోసం 36 వాహనాలను సిద్ధం చేశారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తూర్పు నావికా దళం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యా సంస్థలకు సెలవు తుపాను దృష్ట్యా అధికారులు విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. తీరప్రాంతాలకు సమీపంలో ఉన్న పరిశ్రమలు శనివారం రాత్రి షిఫ్ట్‌లను రద్దు చేయాలని ఆదేశించారు. -
అప్రమత్తంగా ఉండండి : ఉమా
కోడూరు/(చిలకలపూడి)మచిలీపట్నం : హుదూద్ తుపాను ప్రభావం నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సహకరించాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. శుక్రవారం రాత్రి కోడూరు మండలం పాలకాయతిప్ప సమీపంలోని సముద్ర తీరాన్ని జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుపాను వీడే వరకు అధికారులకు సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు. తీరంలో పరిస్థితిని బందరు ఆర్డీవో సాయిబాబు, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసుదనరావు వివరించారు. మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరి ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు బండే శ్రీనివాసరావు, ఎంపీపీ మాచర్ల భీమయ్య, మచిలీపట్నం మాజీ మున్సిపాల్ చైర్మన్ బచ్చుల అర్జునుడు, డ్రైనేజీ డీఈ మారుతీ ప్రసాద్, తహశీల్దార్ ఎంవీ సత్యనారాయణ, ఎంపీడీవో కె.జ్యోతి పాల్గొన్నారు. బందరులో సమీక్ష తుపానుపై మంత్రి దేవినేని ఉమా శుక్రవారం రాత్రి మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ మురళి, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు పాల్గొన్నారు. పులిచింతల నుంచి వచ్చే ఖరీఫ్‌కు 42 టీఎంసీల సాగునీరు కోడూరు : వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పులిచింతల ప్రాజెక్టు ద్వారా 42 టీఎంసీల నీటిని నిలువ చేసి, కృష్ణా డెల్టాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. కోడూరు మండలంలోని మాచవరం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో మంత్రి ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం రూ.30 కోట్లు పింఛన్లు ఇచ్చి పేదలకు భరోసా కల్పించినట్లు తెలిపారు. -
తీరం.. కల్లోలం...
హుదూద్ ఎఫెక్ట్ ఎగసిపడుతున్న అలలు మత్స్యకారుల వేటకు బ్రేక్ కోడూరు : ‘హుదూద్’ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కోడూరు మండలంలోని పాలకాయతిప్ప సమీపాన శుక్రవారం సముద్రపు అలలు రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతూ భయాందోళనలు కలిగిస్తున్నాయి. సముద్రం కాస్త ముందుకు చొచ్చుకు వచ్చింది. సాగర సంగమం వద్ద అలలు కృష్ణమ్మ పాదాలను తాకుతున్నాయి. సముద్ర ప్రాంతమంతా గోతులు ఏర్పడ్డాయి. అలల ధాటికి సాగర సంగమ ప్రాంతానికి వెళ్లే రహదారి కోతకు గురైంది. సాయంత్రం సముద్రంపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతోప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తమ పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. అధికారులు హుదూద్ తీవ్రరూపం దాల్చి, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడంతో తీరప్రాంతాల ప్రజలు 1977, నవంబర్ 19 తేదీన వచ్చిన దివిసీమ ఉప్పెనను గుర్తు చేసుకుని వణికిపోతున్నారు. వచ్చే నెల 17కు దివిసీమ ఉప్పెన వచ్చి 37ఏళ్లు పూర్తవుతుందని, మళ్లీ ఈ తరుణంలో హుదూద్ దూసుకొస్తోందని తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తీర ప్రాంతాల్లో భయం..భయం.. హుదూద్ ప్రభావం ఎలా ఉంటుందోనని కోడూరు మండలలోని హంసలదీవి, పాలకాయతిప్ప, రామకృష్ణాపురం, ఊటగుండం, ఇరాలి, జార్జీపేట, చింతకోళ్ల తదితర తీరప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఆదివారం లేక సోమవారం తుపాను తీరం దాటుతుందని అధికారులు చెప్పడంతో ఏ ప్రమాదం జరుగుతుందోనని వణికిపోతున్నారు. పాలకాయతిప్పలోని మత్య్సకారులు వేటకు వెళ్లకుండా వలలు అల్లుకునే పనిలో నిమగ్నమయ్యారు. భారీ వర్షాలు కురిస్తే వరి పైరు కూడా దెబ్బతింటుందని రైతులు చెబుతున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : హుదూద్ తుపాను దృష్ట్యా తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి, సోషల్ వెల్ఫ్‌ర్ డీడీ మాధుసుదనరావు సూచించారు. ఆయన శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తీర ప్రాంతాల గురించి తహశీల్దార్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో చిక్కుకున్న బోటు మచిలీపట్నం : హుదూద్ తుపాను ప్రభావం మచిలీపట్నంపై పడింది. ఓ బోటు సముద్రంలో చిక్కుకుంది. సాధారణంగా గిలకలదిండి హార్బర్ నుంచి దాదాపు 90 బోట్లు చేపలవేటకు వెళుతూ ఉంటాయి. హుదూద్ తుపాను ప్రభావం నేపథ్యంలో సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లను వెనక్కి రావాలని మత్స్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాలర్లు బోటుతో గిలకలదిండి హార్బర్‌కు సమీపంలోకి వచ్చే సరికి సముద్రం పాటుకు వెళ్లింది. దీంతో గిలకలదిండి హార్బర్ ముఖద్వారం వద్ద శుక్రవారం బోటును లంగరు వేసి నిలిపివేశారు. ఈ బోటులో డ్రైవర్ సురేష్, జాలర్లు యషియా, నరసింహం, వెంకటేశ్వరరావు, చిన నరసింహం, మరో ముగ్గురు ఉన్నారు. శనివారం ఉదయం 9గంటల వరకు వీరు బయటకు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం సముద్రం ప్రశాంతంగానే ఉందని, ఈ రాత్రికి ఏం జరుగుతుందోనని భయంగా ఉందని బోటు డ్రైవర్ సురేష్ ‘సాక్షి’కి తెలిపారు. -
హుదూద్ టై
రేపు మధ్యాహ్నం విశాఖ సమీపంలో తీరం దాటే అవకాశం జిల్లా యంత్రాంగం అప్రమత్తం కంట్రోల్ రూముల ఏర్పాటు రంగంలోకి భద్రతా బలగాలు నేడు విద్యా సంస్థలకు సెలవు పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు జిల్లాకు పెనుముప్పు పొంచి ఉంది. పెను తుపాను రూపంలో హుదూద్ శరవేగంగా దూసుకొస్తోంది. విశాఖకు సుమారు 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం మధ్యాహ్నానికి విశాఖ సమీపంలో తీరం దాటే అవకాశముంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక చర్యలకు సర్వసన్నద్ధంగా ఉంది. ఇప్పటికే నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. విశాఖ రూరల్ : హుదూద్ తీవ్ర పెనుతుపానుగా మారి మనవైపే దూసుకువస్తోంది. నగరం పరిసరాల్లోనే తీరం దాటుతుందనే వాతావరణ నిపుణుల సమాచారం కొంత కలవరపరుస్తోంది. వాస్తవానికి తుపానులు చాలాసార్లు ఏర్పడినా మనకు చేరువుగా తీరం దాటడం ఇదే ప్రప్రథమం. మునుపెన్నడూ ఇ లా విశాఖ వైపు దూసుకొచ్చిన సందర్భాలు లేవు. భౌగోళికంగా చుట్టూ ఉన్న కొండలు, సముద్ర అడుగు భాగంలో ఉన్న ప్రత్యేకమైన సహజ నిర్మాణం తుఫానును విశాఖ తీరానికి రాకుండా చేస్తున్నాయి. అనుకున్నట్టుగా హుదూద్ విశాఖ సమీపాన తీరం దాటితే చరిత్రే. జిల్లాలో పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ, గాజువాక, పెదగంట్యా డ, విశాఖ అర్బన్, విశాఖ రూరల్, భీమిలి మొత్తం 11 కోస్తా తీర మండలాలు ఉన్నాయి. వీటితో పాటు 16 మండలాలపై హుదూద్ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.వీటిలో 50 తీర ప్రాంత గ్రామాలకు తుపాను ప్రమాదం పొంచి ఉంది. 1967 నుంచి గత ఏడాది వరకు వచ్చిన తుపాన్లు ఏ ఒక్కటీ విశాఖ మీదుగా తీరం దాటలేదు. కానీ తుపాన్ల ధాటికి జిల్లా అతలాకుతలమైంది. అటువంటిది ఈ హుదూద్ విశాఖ మీదుగా తీరం దాటుతుండడంతో ఎటువంటి ఉపద్రవాన్ని మోసుకొస్తుందోనని అందరిలో ఆందోళన నెలకొంది. తీరం దాటే సమయంలో గాలులు గంటకు 140 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. సముద్రం 1.5 మీటర్ ముందు వస్తుంది. ఈ తీవ్రతను ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రెండు కంపెనీల మిలటరీ బలగాలు కూడా జిల్లాకు వస్తున్నాయి. 30 నేవీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఆరు ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లు జిల్లా నుంచి తుపాను ప్రభావిత మండలాలకు పయనమయ్యాయి. నేడు పునరావాస కేంద్రాలకు తరలింపు తుపాను ప్రభావిత, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు శనివారం ఉదయం నుంచి తరలిస్తారు. జిల్లాలో మొత్తం 125 పునరావాస కేంద్రాలను గుర్తిం చినప్పటికీ అవసరాన్ని బట్టి తొలి దశలో 40 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలో 10 మండలాల్లో 57 గ్రామాల నుంచి 89,776 మంది 40 పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి కేంద్రం వద్ద డిప్యూటీ తహశీల్దార్‌ను ఇన్చార్జ్గా నియమించారు. ఇప్పటికే ఈ కేంద్రాలకు బియ్యం, పప్పు, తాగునీరు, మందులు, ఇతర సదుపాయాలను సిద్ధం చేశారు. భారీ గాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగే అవకాశాలు ఉండడంతో వెంటనే వాటిని తొలగించడానికి జేసీబీలు, క్రేన్లు సిద్ధంగా ఉంచారు. భారీగా భద్రతా దళాలు :కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా దశలు జిల్లాకు చేరుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2 కంపెనీల మిలటరీ బలగాలను జిల్లాకు పంపిస్తోంది. శనివారం ఉదయానికి 36 వాహనాల్లో ఇవి జిల్లాకు రానున్నాయి. వీటికి అచ్యుతాపురంలో చేశారు. 30 నేవీ బృందాలు తమ సామగ్రితో సిద్ధంగా ఉన్నాయి. ప్రతి బృందంలో అయిదుగురు ఈతగాళ్లు ఉన్నారు. వీటితో పాటు జిల్లాకు నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినప్పటికీ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని భావించి మరో రెండు టీమ్‌లను జిల్లాకు కేటాయించారు. ఒక్కో బృందంలో 40 మంది సభ్యులు ఉండనున్నారు. ఈ టీమ్‌లు శనివారం ఉదయానికి 15 ప్రభావిత ప్రాంతాలకు చేరుకోనున్నాయి. వీటితో పాటు హైదరాబాద్ నుంచి రాష్ర్ట స్థాయి విపత్తు నిర్వహణ బృందం జిల్లాకు రానుంది. ఫైర్‌మెన్ టీమ్‌లను కూడా సిద్ధం చేశారు. హెలికాప్టర్లు సిద్ధం : అత్యవసర పరిస్థితుల కోసం జిల్లాలో 5 నేవీ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. వరదలప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వారికి ఆహారాన్ని అందించే విషయంలో వీటిని వినియోగించనున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మరో హెలికాప్టర్ కూడా హైదరాబాద్‌లో సిద్ధంగా ఉంది. రవాణా వ్యవస్థపై ప్రభావం : హుదూద్ తుఫాన్ ప్రభావం రైళ్లపై పడింది. ఎలాంటి విపత్తు సంభవించినా తూర్పు కోస్తా రైల్వే సర్వసన్నద్దంగా వుందని ఆశాఖ ప్రకటించింది. అన్ని మేజర్ రైల్వే స్టేషన్లలో కంట్రోల్ గదులను ఏర్పాటు చేసింది. విశాఖ మీదుగా నడిచే రైళ్లను రద్దు చేసింది. విశాఖ నుంచి బయలుదేరే రైళ్లు కూడా రద్దయ్యాయి.ముందుజాగ్రత్తగా శనివారం కూడా కొన్నింటిని రద్దు చేసింది. పలు రైళ్లను ఖరగ్‌పూర్, ఝార్సుగుడ, రాయపూర్, నాగపూర్ మీదుగా దారిమళ్లించారు. 12న విశాఖపట్నం, విజయనగరం, రాయగడ, పలాస, కోరాపుట్‌ల నుంచి బయలుదేరాల్సిన అన్ని పాసిం జర్ రైళ్లను రద్దు చే శారు. 12న ఆర్టీసీ బస్సులను నడిపే విషయంపై ఆ రోజు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోనునున్నారు. రిజర్వాయర్లపై దృష్టి : ప్రస్తుతం జిల్లాలో 7 జలాశయాల్లో నీటి మట్టాలు 50 శాతం తక్కువగానే ఉన్నాయి. భారీ వర్షాలు కురిసినా వెంటనే రిజర్వాయర్ల గేట్లు ఎత్తే అవకాశం లేదు. వాటి కింద గ్రామాలకు ప్రస్తుతానికి ఎటువంటి భయం లేదు. అయితే స్థానికంగా భారీ వర్షాలు పడితే ఇన్‌ఫ్లోను బట్టి నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. నేడు విద్యా సంస్థలకు సెలవు : పెను తుపాను నేపథ్యంలో శనివారం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలకు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ సెలవు ప్రకటించారు. యాజమాన్యాలు ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని సూచించారు. తీరప్రాంతంలో ఉన్న పరిశ్రమలు శనివారం రాత్రి షిఫ్ట్ నిర్వహించకూడదని ఆయా సంస్థలకు, ప్రధానంగా బ్రాండిక్స్‌కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సిద్ధంగా ఉన్నాం ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. ఈ నెల 12న భారీ వర్షాలతో పాటు గాలులు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. సముద్రం 1.5 మీటర్లు ముందు వస్తుంది. లోతట్టు ప్రాం తాల ప్రజలను శనివారం ఉదయం నుంచి 40 పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ ఎఫ్, ఫైర్‌మెన్, పోలీసులు, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు. ప్రజలు కూడా సహకరించాలి. - డాక్టర్ ఎన్.యువరాజ్, కలెక్టర్ ఏర్పాట్లు ఇలా... 274 మంది ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్, ఆహారం, పాలు, బ్రెడ్ సరఫరాకు ఏర్పాట్లు చేశారు. తుపాను కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించడం వల్ల గ్యాస్, కిరోసిన్, పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉండడంతో ప్రతి మండల కేంద్రంలో వీటిని సిద్ధంగా ఉంచుతున్నారు. 300 గ్యాస్ సిలిండర్లతో ఒక లారీ, 12 కిలోలీటర్లతో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పాలు ట్యాంకర్లు ప్రతి మండల కేంద్రంలో ఉండనున్నాయి. జిల్లాలో అన్ని మండలాల్లో వైర్లెస్ సెట్లు రెడీ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన 14 శాటిలైట్ ఫోన్లలో 8 జిల్లాలో వినియోగించనున్నారు. వర్షాలు, గాలులకు నెలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు 43 జేసీబీలను, 36 ట్రీ కటర్లను, 32 రంపాలను, 46 ట్రాక్టర్లను, 35 గన్నీ బ్యాగ్ సప్లయిర్లను సిద్ధం చేశారు. -
జిల్లాకు హుదూద్ ముప్పు
పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు.. ఆందోళనలో రైతులు సాక్షి, విజయవాడ : జిల్లాకు మరో తుపాను(హుదూద్) ముప్పు పొంచి ఉంది. అండమాన్ దీవులకు సమీపంలో ఏర్పడిన వాయిగుండం మచిలీపట్నం తీరానికి 1,700 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, దాని ప్రభావంతో రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో వాతవరణంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు, చాట్రాయి తదితర ప్రాంతాల్లో బుధవారం వర్షం కురిసింది. గత అనుభవాలను గుర్తు చేసుకుని మళ్లీ తుపానుల వల్ల కష్టాలు తప్పవని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. అసలే ఆలస్యంగా ప్రారంభమైన సాగు.. బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవటంతో ఈ ఏడాది సీజన్ నిర్ణీత కాలవ్యవధి కంటే రెండు నెలలు ఆలస్యంగా మొదలైంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 6.25 లక్షల ఎకరాల్లో వరి, 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 40 వేల ఎకరాల్లో చెరుకు, 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 6వేల ఎకరాల్లో పసుపు తదితర పంటలు సాగులో ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో వరి ఇంకా చిరుపొట్ట దశలోనే ఉంది. మిగిలిన పంటలు పిలకల దశలో ఉన్నాయి. బుధవారం వర్షం కురిసిన ప్రాంతాలైన ఉయ్యూరు, పెనమలూరు, కంకిపాడు ప్రాంతాల్లో వరి చిరుపొట్ట దశలోనే ఉంది. ఈ దశలో వర్షాలు కురిసి పొలాల్లో నీరు నిలిస్తే పంటకు పూర్తిగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది వచ్చిన మూడు తుపానుల్లో రెండు బందరు వద్దే తీరం దాటడంతో ఆ ప్రభావం వల్ల జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. సుమారు రూ.200 కోట్ల మేర పంటను నష్టపోయారు. -
నిండుకుండలా జలాశయాలు
చోడవరం : నాలుగురోజులుగా కురుస్తున్న తుపాను వర్షాలతో జిల్లాలో జలాశయాలు నిండుకుండలా మారాయి. గత 15 రోజులతో పోల్చిచూసుకుంటే ఇన్‌ఫ్లో బాగా పెరిగి రిజర్వాయర్లన్నింటిలో నీటిమట్టాలు భారీగా పెరిగాయి. ఎగువ ప్రాంతాల్లో వరదనీరు భారీగా రావడంతో పెద్దేరు, కోనాం, రైవాడ, కల్యాణపులోవ, తాండవ రిజర్వాయర్లలో నీటిమట్టాలు ఒకేసారి పెరిగాయి. ఈ రిజర్వాయర్ల కింద సుమారు 80 వేల ఎకరాల వరి సాగు జరగాల్సి ఉండగా ఇప్పుడు నాట్లు జోరుగా వేస్తున్నారు. కోనాం జలాశయం నుంచి దిగువ ఎగువ కాలువలకు 100 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పెద్దేరు గేట్లు ఎత్తి పెద్దేరు నదిలోకి అదనపు నీరు రెండువేల క్యూసెక్కులను వదులుతున్నారు. రైవాడ జలాశయం నుంచి 100 క్యూసెక్యుల నీరు విడుదల చేస్తున్నారు. శారదానదిలోకి 50 క్యూసెక్కుల నీరు కుడికాలువ ద్వారా విడుదల చేస్తున్నారు. కల్యాణపులోవ నుంచి 40 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పెద్దేరు రిజర్వాయరుకు ఇన్‌ఫ్లో భారీగా వస్తుండడంతో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. మరోపక్క వర్షాలు, రిజర్వాయర్ల నీరు రావడంతో పల్లం, మెట్ట ప్రాంతాల్లో దమ్ములు పట్టి వరినాట్లు ముమ్మరంగా వేస్తున్నారు. ఈ మూడ్రోజుల్లో సుమారు 20 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. ఎక్కడ చూసినా నాట్లువేసే పనిలో రైతులు బిజీగా ఉన్నారు. అయితే ఒకేసారి అందరూ నాట్లు వేయడంతో కూలీల కొరత ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మరో పది అడుగులే..
శివమొగ్గ : జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రముఖ జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. వానలు తగ్గడంతో వరదలు వచ్చిన ప్రాంతాల్లో సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయి. గత 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమకనుమల ప్రదేశాలైన మాణి డ్యాంలో 65 మిల్లీమీటర్లు, యడూరి 72 మి.మీ, హులికల్లు 70 మి.మీ, మాస్తీకట్టె 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక శివమొగ్గ 9.20 మి.మీ, తీర్థహళ్లి 72 మి.మీ, సాగర 15.40 మి.మీ, శికారిపుర 8.60 మి.మీ, సొరబ 16.40 మి.మీ, హొసనగర 21.20 మిల్లీమీటర్లు కురిసింది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఏడు తాలూకాల్లో 97.60 మి.మీ. వర్షపాతం నమోదైంది. లింగనమక్కి డ్యాం భర్తీకి పది అడుగులు మాత్రమే రాష్ట్రంలో ప్రముఖ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రమైన లింగనమక్కి డ్యాం భర్తీకి ఇక పది అడుగులు మాత్రమే మిగిలింది. డ్యాం గరిష్ట నీటిమట్టం 1,819 అడుగులు కాగా, శుక్రవారం ఉదయం 8.30 గంటలకు అందిన సమాచారం ప్రకారం నీటిమట్టం 1809.45 అడుగులకు చేరుకుంది. జలాశయ పరిసరాల్లో వర్షం తగ్గుముఖం పట్టడంతో డ్యాం ఇన్‌ఫ్లో 32,424 క్యూసెక్కులకు తగ్గింది. ఇక భద్రా జలాశయ నీటిమట్టం 186 అడుగులు కాగా, ఇప్పటికే గరిష్ట స్థాయి 184.10 అడుగులకు చేరుకుంది. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 29,667 క్యూసెక్కులు ఉండగా, అందులో 26,091 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగా జలాశయం ఇప్పటికే గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 60 వేల క్యూసెక్కులుండగా, అంతే పరిమాణంలో విడుదల చేస్తున్నారు. మాణి జలాశయం గరిష్ట నీటిమట్టం 594.36 అడుగులు కాగా, ప్రస్తుతం డ్యాంలో 586.63 అడుగుల నీరున్నాయి. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 4,484 క్యూసెక్కులు ఉంది. వర్షం తగ్గుముఖం పట్టడంతో పొంగి పొర్లుతున్న తుంగా, భద్రా, వరదా నదులు శాంతించాయి. ఎడతెరపిలేని వానల కారణంగా జిల్లాలో సుమారు రూ.100 కోట్లు న ష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. -
అన్నదాతకు పంట బీమా అందేనా?
వరుస తుపానులతో రైతుకు కష్టం 2.37 లక్షల ఎకరాల్లో రూ.200 కోట్ల నష్టం లెక్కలు తేల్చి ఉన్నతాధికారులకు అధికారులు 2,777 శాంపిళ్లతో నివేదిక పంట బీమాపై పెదవి విప్పని అధికారులు రైతుల్లో అయోమయం గత ఖరీఫ్‌లో వరుస వైపరీత్యాలు పంటను దెబ్బతీశాయి.. హెలెన్, లెహర్ తుపాన్లు రైతును నట్టేట ముంచాయి.. జిల్లా వ్యాప్తంగా 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా 2.37 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిందని, రూ.200 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనాలు కూడా వేశారు.. జిల్లా వ్యాప్తంగా పంటకోత ప్రయోగాల ద్వారా 2,777 ప్రాంతాల్లో వరి దిగుబడుల లెక్కలను తీసుకుని హైదరాబాదులోని బీమా కంపెనీకి నివేదిక అందజేశామని జిల్లా ప్రణాళికా విభాగం అధికారులు చెబుతున్నారు.. అయితే పంట బీమా ఎప్పుడు విడుదలవుతుందనే అంశంపై మాత్రం అధికారులు పెదవి విప్పటం లేదు. వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే ప్రణాళిక శాఖకు తెలుస్తుందని, ప్రణాళిక శాఖ అధికారులను అడిగితే వ్యవసాయశాఖకే తెలియాలని చెప్పి తప్పించుకుంటున్నారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : గత రెండేళ్లుగా జిల్లాలో సవరించిన జాతీయ పంట బీమా పథకం అమలవుతోంది. ఈ పథకం అమలులో భాగంగా పంట రైతు ఇంటికి చేరే వరకు ఏవైనా విపత్తులు సంభవించి పంట నష్టపోతే పంట బీమా చెల్లించాల్సి ఉంది. ఈ నిబంధనల మేరకే పంట బీమా ప్రీమియాన్ని రైతుల నుంచి సేకరించారు. నవంబరు 23న హెలెన్, 28న లెహర్ తుపానులు సంభవించాయి. అక్టోబర్ ఆఖరులో కురిసిన వర్షాల నేపథ్యంలో వ్యవసాయాధికారులు జిల్లా వ్యాప్తంగా పంట కోత ప్రయోగాలను నవంబరు మొదటి వారం నుంచే ప్రారంభించారని, ఈ నివేదికలనే బీమా కంపెనీలకు ఇచ్చారనే అనుమానాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. తుపానులు సంభవించిన అనంతరం రైతులు పంటలు పూర్తిగా కోల్పోయారని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముందుగానే పంటకోత ప్రయోగాలు చేయటంతో దిగుబడులు అధిక శాతం ఉన్నట్లు నమోదై ఉంటాయని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పమిడిముక్కల, మొవ్వ మండలాల్లో వరి దిగుబడి అధికంగానూ, కైకలూరు, మండవల్లి, బందరు, అవనిగడ్డ తదితర మండలాల్లో నిర్వహించిన పంటకోత ప్రయోగాల్లో తక్కువ దిగుబడులు నమోదైనట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రీమియం కట్టించుకునేది ఇలా... బ్యాంకులో పంట రుణం తీసుకునే సమయంలోనే సంబంధిత రైతు నుంచి పంట బీమా సొమ్మును మినహాయిస్తారు. ఎకరం వరి పంట సాగు చేస్తే రూ.22 వేలు పంట రుణంగా అందజేస్తారు. పంట రుణం ఇచ్చే సమయంలోనే ఐదు శాతం రైతు నుంచి బీమా సొమ్ముగా మినహాయిస్తారు. మరో తొమ్మిది శాతం నగదును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించి మొత్తం 14 శాతం పంట బీమాగా ఇన్సూరెన్స్ కంపెనీకి బ్యాంకులు చెల్లించాల్సి ఉంది. గత ఖరీఫ్‌లో పంటలు కోల్పోయిన నేపథ్యంలో రైతులకు పంట బీమా కచ్చితంగా అంది తీరాలి. 50 శాతం కన్నా అధికంగా పంట నష్టం జరిగితే అంత మొత్తానికి పంట బీమా చెల్లించాల్సి ఉంది. అయితే పంట కోత ప్రయోగాల ద్వారా వచ్చిన నివేదికలు గత మూడేళ్లుగా వచ్చిన దిగుబడులు, వర్షపాతం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పంట బీమా సొమ్మును విడుదల చేయాల్సి ఉంది. సవరించిన జాతీయ పంట బీమా పథకం జిల్లాలో అమలవుతున్న నేపథ్యంలో పంట కోల్పోయిన వెంటనే రైతులకు పంట బీమా అందించాల్సి ఉంది. గత ఏడాది నవంబరులో సంభవించిన తుపానుల కారణంగా పంటలు రైతులు కోల్పోగా మూడు నెలలుగా గడుస్తున్నా పంట బీమా విడుదల కాకపోవటం, ఎప్పుడు విడుదల అవుతుందో తెలియకపోవటంతో రైతుల్లో అయోమయం నెలకొంది. కౌలు రైతుల పరిస్థితేంటో... జిల్లాలో 3.8 లక్షల ఎకరాలు కౌలు రైతుల చేతుల్లోనే ఉన్నాయి. వరిసాగు చేసే కౌలు రైతులు సుమారు 1.30 లక్షల మంది ఉన్నారు. గత ఖరీఫ్‌లో పంట కోల్పోయిన కౌలు రైతులకు పంట బీమా అందుతుందా, లేదా అనే అంశంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో రెండు నెలల్లో రబీ సీజన్ కూడా ముగియనుంది. మళ్లీ ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి కౌలు రైతులు గత ఖరీఫ్‌లో సాగు చేసిన భూమినే సాగు చేసే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో గత ఖరీఫ్‌లో పంట కోల్పోయిన కౌలు రైతులకు పంట బీమా అందుతుందా, లేదా అనేది అనుమానమే. పంట నష్టపరిహారం ఎప్పటికందేనో... గత ఖరీఫ్‌లో వరుస తుపానులతో రైతులు పంట కోల్పోయారు. దిగుబడులు గణనీయంగా తగ్గాయి. పంట కోల్పోయిన వెంటనే రెండో పంట వేసుకునేందుకు పెట్టుబడిగా రైతులకు పంట నష్టపరిహారం ప్రభుత్వం అందించాలి. 2012లో సంభవించిన నీలం తుపాను నష్టపరిహారమే నేటికీ అందలేదు. 2013 నవంబరులో సంభవించిన తుపానుల కారణంగా పంటలు కోల్పోయిన రైతుల జాబితాలను తయారుచేశారు. 2.37 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా రూ.200 కోట్ల మేరకు పంట నష్టం జరిగిందని నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. త్వరితగతిన నష్టపరిహారం విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయాల నేపథ్యంలో పంట నష్టపరిహారం విడుదలవుతుందనే ఆశను రైతులు దాదాపు వదులుకున్నారు. పంట బీమా అయినా అందజేస్తే రైతులకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది. -
రబీ.. సాఫీగా సాగేనా
సాక్షి, ఏలూరు : వరుస తుపానులు, భారీవర్షాల కారణంగా సార్వా పంట తుడిచిపెట్టుకుపోవడంతో తల్లడిల్లిన రైతులు కోటి ఆశలతో రబీ సాగు ప్రారంభించారు. జిల్లాలో మెట్ట, సెమీ డెల్టాలో నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే దాళ్వా సాగు చివరి వరకు సాఫీగా సాగుతుందా అనే అనుమానాలు అన్నదాతలను పట్టి పీడిస్తున్నాయి. గోదావరిలో నీటి లభ్యత రెండు నెలల్లో సగానికి పైగా తగ్గుతుందని అధికారులు అంచనా వేయడంతో పాటు ఆధునికీకరణ పనుల కారణంగా మార్చి 31న కాలువలకు నీటి విడుదలను నిలిపివేస్తామని కలెక్టర్ ప్రకటించడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా సాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమా దం పొంచి ఉండడం వారిని కలవర పరుస్తోంది. దీంతో డెల్టా, మెట్ట ప్రాంతాల్లోని రైతులు వరిని వదిలి అపరాల సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. ముమ్మరంగా దాళ్వా నాట్లు మెట్ట, సెమీ డెల్టాలో నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొయ్యలగూడెం, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ప్రాంతాల్లోని 1,15,000 ఎకరాల్లో నాట్లు పూర్తైట్టు వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు వీడీవీ కృపాదాస్ ‘సాక్షి’కి తెలిపారు. గోదావరి కెనాల్ కింద 3,67,500 ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకు డెల్టాలో 52,500 ఎకరాల్లో, మెట్టలో 62,500 ఎకరాల్లో పూర్తయ్యాయి. మొక్కజొన్న 75 వేలు, పెసలు, మినుములు 1,375, వేరుశనగ 6 వేల ఎకరాల్లో వేశారు. తగ్గనున్న వరి సాగు విస్తీర్ణం ఈ ఏడాది జిల్లాలో 6,35,107.5 ఎకరాల్లో దాళ్వా సాగు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. 4,86,250 ఎకరాల్లో వరి, 1,11,330 ఎకరాల్లో మొక్కజొన్న, 13,215 ఎకరాల్లో మినుములు, 11,875 ఎకరాల్లో పెసలు, 12437.5 ఎకరాల్లో వేరుశనగ పంటలు వేయించాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే సాగునీటి ఎద్దడి పొంచి ఉండడం, లోసరి మెయిన్ కెనాల్‌తో పాటు ఇతర కాలువల ఆధునికీకరణ పనులతో నీటి విడుదల నిలిపివేయడంతో రైతులు వరి సాగుకు వెనక్కితగ్గారు. దీంతో వరి విస్తీర్ణం తగ్గనుంది. వంతులవారీ విధానం అమలయ్యే అవకాశం రబీలో సాగునీటి అవసరాలకు 43.72 టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం పశ్చిమ డెల్టాకు 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి నాటికి ఇన్‌ఫ్లో6 వేల క్యూసెక్కులకు పడిపోయే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే సాగునీటికి ఇక్కట్లు తప్పవు. మరోవైపు మార్చి 31తో కాలువలు మూసేసి తిరిగి జూన్ 15న తెరవాలని సాగునీటి సలహామండలి సమావేశంలో నిర్ణయించారు. కాలువలకు నీరు నిలిపివే సే సమయానికి పంటలు కోతకు వచ్చే అవకాశం లేదు. అంతేకాకుండా తాగునీటికి 4 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 0.20 టీఎంసీలు కావాలి. ఈ పరిస్థితుల్లో 2009లో పాటించిన వంతులవారీ విధానాన్ని మరోసారి అమలులోకి తెచ్చి నీటిని పొదుపుగా వాడుకుంటే తప్ప దాళ్వా గట్టెక్కాలా కనిపించడం లేదు. -
పరిహారం దక్కేనా... పంట బీమా అందేనా?
=వరుస విపత్తులతో గణనీయంగా తగ్గిన దిగుబడులు =తీరగ్రామాల్లో పూర్తికాని వరి కోతలు =నివేదికలకు మరింత జాప్యం వరుస విపత్తులతో నష్టపోయిన ఖరీఫ్ రైతులకు ప్రభుత్వ పరిహారం దక్కేనా.. పంట బీమా చేతికందేనా.. అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. గతేడాది పరిహారం పంపిణీనే ఇప్పటికీ పూర్తికాని పరిస్థితుల్లో ప్రస్తుత నష్టానికి పరిహారం ఎప్పటికి అందుతుందోనని ఆవేదన చెందుతున్నారు. పరిహారం త్వరగా అందితే అప్పుల నుంచి కొంతమేరకైనా బయటపడే అవకాశముంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : వరుస తుపానుల ప్రభావంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటలు కోల్పోయిన రైతులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం జిల్లాలో అమలవుతున్న నేపథ్యంలో పంట బీమా కూడా అందాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా తుపానుల ప్రభావంతో 2.25 లక్షల ఎకరాల్లో వరి, 15 వేల ఎకరాల్లో వివిధ రకాల వాణిజ్య పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. లక్షా 89 వేల మంది రైతులు పంటలు కోల్పోయినట్లు నిర్ధారించారు. పంట నష్టపరిహారం కోసం ఈ నివేదికలను ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. పంట బీమా రైతులకు అందాలంటే పంటకోత ప్రయోగాల ద్వారా వచ్చిన నివేదికలను బీమా కంపెనీలకు పంపాలి. వీటిని ప్రణాళిక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు హైదరాబాదులో ఉన్న బీమా కంపెనీ ప్రధాన కార్యాలయానికి పంపుతున్నారు. తీర ప్రాంతంలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లో వరి కోతలు మరో 20 రోజుల వరకు కొనసాగుతాయి. ఈ మండలాల నుంచి నివేదికలు బీమా కంపెనీకి పంపటంలో జాప్యం జరుగుతోందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తగ్గిన దిగుబడులు... ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు చేపట్టారు. వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలో వ్యవసాయాధికారులు ఎకరానికి 28 నుంచి 29 బస్తాల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. వరుస తుపానుల రాకతో 24, 25 బస్తాల దిగుబడి వస్తుందని అంచనాలను సవరించారు. వాస్తవానికి తుపానుల అనంతరం ఎకరానికి 15, 16 బస్తాలకు మించి దిగుబడి రావటం లేదు. గూడూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో 15, 16 బస్తాల దిగుబడి మాత్రమే వస్తోంది. ఈ వివరాలను వ్యవసాయ, పౌరసరఫరాలు, ప్రణాళిక శాఖల అధికారులు సేకరించి బీమా కంపెనీకి పూర్తిస్థాయి నివేదికలు అందజేస్తే రైతులకు పంట బీమా వచ్చే అవకాశం ఉంది. నివేదికలు పూర్తయిన తరువాత జేసీ, కలెక్టర్ లాంటి ఉన్నతస్థాయి అధికారులు బీమా కంపెనీలకు ఇక్కడ జరిగిన నివేదికలను ఒకటికి పదిసార్లు వివరిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యి పంట నష్టం వివరాలను బీమా కంపెనీలు అంచనా వేయాలంటే కనీసంగా మూడు నెలలైనా సమయం పడుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. డిసెంబరు పూర్తి కావస్తోంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ నివేదికలను బీమా కంపెనీ ప్రతినిధులు పరిశీలించి ఏ గ్రామంలో ఎంత పంట నష్టం జరిగింది, ఏ రైతుకు ఎంత బీమా అందించాలి తదితర అంశాలపై తుది నివేదిక తయారు చేయడానికి మరో నెల సమయం పడుతుందనేది వ్యవసాయాధికారుల వాదన. పంట బీమా చేతికందాలంటే ఏప్రిల్, మే నెలల వరకు ఆగాల్సిందేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. 2012లో సంభవించిన నీలం తుపాను పంట నష్టపరిహారం పంపిణీ ఇంకా పూర్తికాలేదు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం సొమ్ము మంజూరు కావాల్సి ఉంది. గత ఏడాది సంభవించిన పంట నష్టం రైతులకు అందజేయడానికి ఇంతకాలం పట్టింది. ఈ ఏడాది సంభవించిన పంట నష్టానికి సంబంధించి అధికారులు ప్రభుత్వానికి ఎప్పటికి నివేదికలు పంపుతారో.. అక్కడినుంచి నిధులు ఎప్పటికి విడుదలవుతాయో.. అవి తమ ఖాతాల్లోకి ఆన్లైన్ ద్వారా చేరాలంటే మరెంత సమయం పడుతుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోల్పోయి నష్టాల్లో ఉన్న సమయంలో పంట నష్టపరిహారంతో పాటు పంట బీమా వచ్చేలా అధికారులు కృషిచేస్తే అప్పుల నుంచి బయటపడతామని రైతులు చెబుతున్నారు. -
అల‘జడి’వాన
సాక్షి, సిటీబ్యూరో: తుపాను ప్రభావంతో గ్రేటర్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, సికింద్రాబాద్, అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, పాతనగరం తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తింది. ప్రధాన రహదారులపై రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు ఇళ్లకు చేరే వేళ ఇబ్బందులు పడ్డారు. రాత్రి 8.30 వరకు 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేటలోని వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో నగరంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయన్నారు. -
తుఫాన్లకు ముందే పేర్ల నిర్ణయం