తరుముకొస్తోంది
కోస్తా ప్రాంతాలపై పంజా విసురుతున్న హుదూద్
పెను తుపానుగా రూపాంతరం
విశాఖకు 460 కి.మీ., గోపాల్‌పూర్‌కు 510 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
సిద్ధంగా ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీ దళాలు
4 యుద్ధ నౌకలు, 6 విమానాలు, 6 హెలికాప్టర్లు, గజ ఈతగాళ్లు రెడీ
ఆహారం, టెంట్లు, మందులు, ఇతరత్రా సామగ్రి సిద్ధం
నేడు పాఠశాలలకు సెలవు.. పరిశ్రమలు రాత్రి షిఫ్టు రద్దు చేయాలని ఆదేశాలు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, ఒడిశా కోస్తా ప్రాంతాలపై పెను ఉప్పెన పంజా విసురుతోంది. తీవ్రరూపం దాల్చిన హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలను హడలెత్తిస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో పోర్ట్‌బ్లెయిర్ వద్ద మొదలైన హుదూద్ తుపాను శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు తీవ్ర తుపానుగా రూపుదాల్చింది. విశాఖపట్నంకు 460 కి.మీ. దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు పశ్చిమ ఉత్తర దిశలో 510 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 10 కి.మీ. వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. రానున్న 12 గంటల్లో తుపాను తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం సమీపంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. రానున్న 24 గంటల్లో హుదూద్ తుపాను గమనం ఏమాత్రమైనా మారితే విశాఖపట్నంకు తూర్పు ఉత్తర దిశగా 30 కి.మీ. నుంచి 60 కి.మీ. దూరంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై ఇప్పుడే అధికారికంగా ఏమీ చెప్పలేమని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే విశాఖపట్నం సమీపంలోనే తీరాన్ని తాకే అవకాశాలున్నాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ రాంచంద్రావు తెలిపారు. తుపాను నష్టం తీవ్రంగా ఉండే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీరాన్ని దాటే ప్రాంతంలో కొండలు ఉన్నందువల్ల హుదూద్ తీవ్రత కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.
తీవ్ర విధ్వంసం తప్పదా!?
హుదూద్ తుపాను ఇదే తీవ్రతతో ఉంటే తీరాన్ని దాటే సమయంలో పెను ఉప్పెనతో విరుచుకుపడి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం కొన్నిచోట్ల ముందుకు వచ్చింది. గాలుల తీవ్రత పెరిగింది. తుపాను తీరాన్ని దాటే సమయంలో అత్యంత భారీ వర్షాలు, పెను గాలులతో బీభత్సాన్ని సృష్టించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి తుపాను తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచి సాధరణ స్థాయిలో వర్షాలు మొదలై, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, దక్షిణ ఒడిశాలలో 12.50 సెం.మీ. నుంచి 24.40 సెం.మీ. వరకు అతి భారీ వర్షపాతం నమోదు కావచ్చు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా సాధారణ నుంచి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం తీరం దాటే సమయంలో గంటకు 130 కి.మీ. నుంచి 150 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ఆ ప్రాంతాలకు రాకపోకలను వాయిదా వేసుకోవాలని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. రాష్ట్రంలో కృష్ణపట్నం తప్ప మిగిలిన అన్ని పోర్టుల్లోనూ మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
హుదూద్ తుపాను ప్రళయ భీకరంగా విరుచుకుపడుతుందన్న సంకేతాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్, రక్షణ శాఖ బలగాలు
సహాయ, పునరావాస చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీ బలగాలు రంగంలోకి దిగాయి. విశాఖపట్నం జిల్లాకు 6 బెటాలియన్లు, విజయనగరం జిల్లాకు ఒక బెటాలియన్, శ్రీకాకుళం జిల్లాకు రెండు బెటాలియన్ల ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలను పంపించారు. ఒక్కో బెటాలియన్‌లో 40 మంది ఉంటారు. నేవీ అధికారులు కూడా 30 రెస్క్యూ టీంలను విశాఖపట్నంలో సిద్ధంగా ఉంచారు. అవసరాన్ని బట్టి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కడికైనా వెళ్లేందుకు ఇవి పూర్తి పరికరాలతో సర్వసన్నద్ధంగా ఉన్నాయి. సహాయక చర్యల కోసం 4 యుద్ధ నౌకలు, 6 ఎయిర్ క్రాఫ్ట్‌లను తూర్పు నావికాదళం సిద్ధంగా ఉంచింది. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు చెందిన 6 హెలికాప్టర్లను సిద్ధం చేశారు. రెండు ఆర్మీ బెటాలియన్లు కూడా శనివారం ఉదయానికి విశాఖపట్నం చేరుకోనున్నాయి. ఆర్మీ బలగాల తరలింపు కోసం 36 వాహనాలను సిద్ధం చేశారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తూర్పు నావికా దళం ఒక ప్రకటనలో తెలిపింది.
విద్యా సంస్థలకు సెలవు
తుపాను దృష్ట్యా అధికారులు విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. తీరప్రాంతాలకు సమీపంలో ఉన్న పరిశ్రమలు శనివారం రాత్రి షిఫ్ట్‌లను రద్దు చేయాలని ఆదేశించారు.