hudood
-
కష్టాలబాటలో ఆశలవేట
హుదూద్ దెబ్బకు నష్టపోయిన మత్స్యకారులు 20రోజులుగా సాగరానికి దూరం ఇప్పుడిప్పుడే కదులుతున్న బోట్లు రోజుకు స్వల్పస్థాయిలో ఉత్పత్తి పరిహారమందక అప్పులపాలు జలపుత్రుల జీవన గమనంలో అడుగుడుగునా సుడి‘గండా’లే. వాటిని మెల్లగా దాటుకుంటూ బతుకు సయ్యాటలో భాగంగా గంగపుత్రులు మళ్లీ సాగరం బాట పట్టారు. హుదూద్ దెబ్బకు 20 రోజులుగా తీరానికి దూరంగా ఉన్న ఈ బడుగు జీవులు శనివారం నుంచి వేటకు ఉపక్రమించారు. అయినా మెజార్టీ మెకనైజ్డ్ బోట్లు లంగరేయడంతో రోజుకు నాలుగైదు టన్నులకు మించి మత్స్యసంపద దొరకని పరిస్థితి. సాక్షి, విశాఖపట్నం: హుదూద్ దెబ్బకు కకావికలమైన జిల్లా తేరుకుంటున్నా తీరం వెంబడి సముద్రంతో సహజీవనంచేసే మత్స్యకారు లు మాత్రం ఇంకా కుదుట పడలేదు. జిల్లాలోని 11 మండలాల్లో 132 కిలోమీటర్ల తీరం ఉంది. 62 మత్స్యకార గ్రామాల్లోని 30 వేల మంది రోజూ వేటకు వెళతారు. వీరిలో 30శాతం మందికి వేటలేకుంటే పూట గడవదు. సుమారు లక్ష మంది వేట ఆధారంగా జీవిస్తున్నారు. మరో లక్ష మంది పరోక్షంగా అనుబంధ రంగాలపై ఆధారపడి బతుకుతున్నారు. వీరందరికీ హుదూద్ వల్ల ఉపాధి లేకుండా పోయింది. తుఫాన్ వల్ల జిల్లాలో 40కి పైగా మత్స్యకార గ్రామాలు దెబ్బతిన్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్లో 670 మెకనైజ్డ్ బోట్లుంటే దాదాపు అన్నీ దెబ్బతిన్నాయి. సగానికి పైగా ధ్వంసమైతే మిగిలిన సగం బోట్లకు నష్టం వాటిల్లింది. వలలతో పాటు ఉన్న బోట్స్ 391 కొట్టుకుపోతే, వలలతో ఉన్న మరో 190 బోట్స్‌కు నష్టం వాటిల్లింది. ఇవి కాకుండా మరో 431బోట్స్, మరో 190 వలలు విడివిడిగా కొట్టుకుపోతే..మరో చిన్నా చితకా బోట్లు కలిపి 1301 వరకు దెబ్బ తిన్నాయి. బోట్స్,వలలకు రూ. 24 కోట్ల 61లక్షల 14వేలుగా అంచనా వేశారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా పరిహారం అందలేదు. లైవ్లీ హుడ్ కింద ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఇస్తామన్న పరిహారం కూడా ఏ ఒక్క మత్స్యకారునికి అందలేదు. దీంతో అప్పులతో బోట్లకు మరమ్మతులు చేసుకుంటున్నారు. స్వల్పంగా నష్టపోయిన బోట్లకు మరమ్మతులు చేయించుకున్న యజమానుల శనివారం నుంచి వేటకు వెళ్లడం మొదలు పెట్టారు. సుమారు 350కు పైగా బోట్లు వేటకు వెళ్లినట్టు అంచనా. నావలు,నాటుపడవలు,చిన్న బోట్లన్నీ తీరంలోనే వేట సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ప్రతీరోజు వేట ద్వారా హార్బర్‌కు 150 నుంచి 200 మెట్రిక్ టన్నుల మత్స్యసంపద వచ్చేది. ప్రస్తుతం కేవలం నాలుగైదు టన్నులకు మించి మత్స్య సంపద రావడంలేదు. పైగా ఇదంతా స్థానిక మార్కెట్ల అవసరాలకే ఉపయోగ పడే రకాలేతప్ప ఎగుమతికి ఉపయోగపడే రకం ఒక్క కిలో కూడా దొరకని దుస్థితి. ఒక్కొక్క మెకనైజ్డ్ బోటుపై 8 నుంచి 10 మంది వరకు పనిచేస్తుంటారు. ఈ విధంగా చూస్తే వేటకు వెళ్లిన బోట్లపై సుమారు రెండున్నరవేల మంది ఉపాధి పొందుతుండగా తీరంలో ఎండుచేపలు, పచ్చిచేపల వ్యాపారం చేసే వారు మరో 500 మంది వరకు ఉపాధి లభిస్తోంది. ఫిషింగ్ హార్బర్‌పై ఆధారపడి జీవనం సాగించే వేలాది మత్స్యకారులతో పాటు భీమిలి నుంచి పాయకరావుపేట వరకు తీరం వెంబడి వేటే జీవనాధారంగా బతికే వారుసైతం ఉపాధి లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. పూర్తిస్థాయిలో వేట ఎప్పుడు ప్రారంభమవుతుందా? పూర్వ వైభవం వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. -
వెళ్లేదెలా..
నేటి నుంచి జన్మభూమి-మా ఊరు పల్లెల్లో ప్రతిఘటన ఎదురవుతుందని అధికారుల్లో భయం హుదూద్ దెబ్బతో జిల్లాలో మారిన పరిస్థితులు అంధకారంలో పల్లెలు..గందరగోళంగా నష్టం అంచనాలు గిట్టుబాటు ధర దక్కక మండిపడుతున్న రైతులు జన్మభూమి-మావూరు మళ్లీ మొదలవుతోంది. గత నెల 2న ప్రారంభించి ఏడురోజులకే అర్ధంతరంగా వాయిదాపడిన ఈ కార్యక్రమాన్ని శనివారం నుంచి జిల్లాలో మళ్లీ చేపడుతున్నారు. పదిరోజుల పాటు గ్రామసభల అనంతరం పదకొండో రోజున ర్యాలీలు..మానవ హారాలతో అధికారులు ముగింపు పలకనున్నారు. పునర్నిర్మాణపనులు విశాఖలో జరిగినంతవే గంగా గ్రామీణంలో కానరాకపోవడంతో ప్రజల నుంచి ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయం అధికారులు, ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది. పల్లెలకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి-మావూరు కార్యక్రమాన్ని టీడీపీ సర్కార్ అక్టోబర్-2న చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని యోచించింది. హుదూద్ కారణంగా అర్ధంతంగా 9వ తేదీనే ఆగిపోయింది. తుఫాన్ విధ్వంసంతో జిల్లా కకావికలమైంది. విద్యుత్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్ప కూలిపోయాయి. విశాఖతో పాటు పల్లెలన్నీ అంధకారంలో చిక్కుకుపోయాయి. తాగునీటికి లక్షలాది మంది అల్లాడిపోయారు. రోజులు , వారాలు గడుస్తున్నా జిల్లాలో విద్యుత్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేకపోయారు. విశాఖ నగరానికి వెలుగులొచ్చినా.. కోతలతో శివారు ప్రాంత ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ నేటికి గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా జరగడంలేదు. అధికారికలెక్కల ప్రకారమే 4వేలకు పైగా పల్లెలు ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయి. వందలాది గ్రామాల్లో మంచి నీటి సరఫరా ఏ మాత్రం మెరుగుపడలేదు. అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. పునరావాస చర్యలతో పాటు తక్షణ సహాయం కింద ఉచితంగా పంపిణీ చేసిన బియ్యం, ఇతర నిత్యావసరాలు తెలుగుతమ్ముళ్లు టన్నుల కొద్ది పక్కదారిపట్టించారు. ఇక నష్టం అంచనాల్లో జన్మభూమి కమిటీలకే ప్రాధాన్యం ఇవ్వడంతో టీడీపీ కార్యకర్తలు తమకు నచ్చినవారికి ఒకలా.. నచ్చని వారికి మరోలా ఎన్యుమరేషన్ చేయిస్తూ అర్హుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నష్టం అంచనాల తయారీ దాదాపు పూర్తికావచ్చింది. ఈ జాబితాలను గ్రామసభల్లో ప్రదర్శించనున్నారు. ఒక పక్క విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో పునరుద్ధరించక పోవడం..మరో పక్క టీడీపీ నేతల కనుసన్నల్లో తయారయిన జాబితాలపై గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ భరోసా పేరిట పెంచిన పింఛన్లు అందుకోవాలన్న గంపెడాశతో మొన్నటి జన్మభూమి సభలకు వచ్చి నిరాశతో వెనుదిరిగిన లక్షలాదిమంది నిర్భాగ్యులు రెండు నెలల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీరితో పాటు పింఛన్ అర్హతకోల్పోయిన వేలాదిమంది కూడా ఈసభల్లో అధికారులను నిలదీసే అవకాశాలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే రుణమాఫీ పుణ్యమాని బీమాకునోచుకోని లక్షలాది మంది రైతులు ఆశలను తుఫాన్ చిదిమేసింది. కనీసం ఇన్పుట్ సబ్సిడీ, పరిహారమైనా దక్కకపోతుందా అన్నఆశగా వారు ఎదురు చూస్తున్నారు. వీరంతా గ్రామసభల్లో తమ ఆవేదనను వెలిబుచ్చే అవకాశాలున్నాయి. మరొక పక్క ప్రధాన ప్రతిపక్షమైనవైఎస్సార్సీపీకూడా తుఫాన్ బాధితులు, రైతుల తరపున జన్మభూమి సభలను వేదికగా చేసుకుని అధికారులను నిలదీసే అవకాశాలున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సభల్లో పాల్గొనేందుకు అధికారులు విముఖత ప్రదర్శిస్తున్నారు. -
ఇంకా అంధకారమే
జిల్లాలో లక్షన్నర ఇళ్లు ఇంకా చీకట్లోనే విశాఖలో 23 వేల కనెక్షన్లకు అందని సరఫరా గుడ్డిదీపాల వెలుగులో నర్సీపట్నం పునరుద్ధరణకు మరో నాలుగైదు రోజులు విశాఖపట్నం సిటీ: జిల్లాలో హుదూద్ సృష్టించిన చీకట్లు ఇంకా తొలిగిపోలేదు. దీపావళినాడు అందరి ఇళ్లల్లోనూ విద్యుత్ కాంతులు విరజిమ్మేలా ప్రయత్నిస్తున్నామని అధికారులు చేసిన ప్రకటన నాగులచవితి నాటికి కూడా సాధ్యమయ్యేలా కనబడడం లేదు. గ్రామీణ ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణంగా వుంది. గుడ్డిదీపాల వెలుగులోనే గడుపుతున్నారు. కొవ్వొత్తుల కాంతితోనే కాలం నెట్టుకొస్తున్నారు. జిల్లా అంతటా పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరో నాలుగు ఐదు రోజులు పట్టేటట్టు కనిపిస్తోంది. తుపాను ముగిసి రెండు వారాలు దాటినా జిల్లాను అంధకారం విడచిపెట్టడం లేదు. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సైతం విద్యుత్ ఇంజినీర్లను పరుగులు పెట్టించి పునరుద్ధరణ పనులు చేయిస్తున్నా జిల్లాను పూర్తిగా వెలుగులతో నింపలేకపోతున్నారు. ఆదివారం నాటికి జిల్లా మొత్తంగా 1.67 లక్షల సర్వీసులకు కరెంట్ అందని దుస్థితి. విశాఖ మహానగరంలో అందరికీ విద్యుత్ అందించినట్టు చెప్పుకుంటున్నా...ఇప్పటికీ 23 వేల కనెక్షన్లకు విద్యుత్ సౌకర్యం లేదు. చుట్టుపక్కల వారికి విద్యుత్ వెలుగులు వచ్చినా తమ ఇళ్లకే ఎందుకు రావడం లేదో తెలియక తెగ ఆందోళనచెందుతున్నారు. విశాఖ నగరంలోని వన్‌టౌన్ ఏరియాలో 110 కుటుంబాల వారు ఇప్పటికీ అంధకారంలో మగ్గుతున్నారు. కంచరపాలెం నుంచి గాజువాక పరిధిలో మరో 3 వేల మంది వినియోగదారుల ఇళ్లు చీకట్లోనే వున్నాయి. మధురవాడ పరిసర ప్రాంతాల్లో అయితే 20 వేల వినియోగదారులు నిత్యం విద్యుత్ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అంతటా కరెంట్ ఇచ్చేశారని తమకెప్పుడు విద్యుత్ వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు విద్యుత్ డివిజన్లలో 1.44 లక్షల కనెక్షన్లకు విద్యుత్ లేదు. జిల్లా వ్యాప్తంగా 11.31లక్షల మంది వినియోగదారులుంటే, ఆదివారం సాయంత్రానికి 9.64 లక్షల మందికి విద్యుత్‌ను పునరుద్ధరించగలిగారు. మిగిలిన 1.67 లక్షల కనెక్షన్‌దారులకు చీకట్లే గతయ్యాయి. వీరందరికీ సరఫరా పునరుద్ధరించాలంటే మరో నాలుగైదు రోజులు సమయం పట్టే అవకాశాలున్నాయని విద్యుత్ వర్గాలే పేర్కొంటున్నాయి. ఈపీడీసీఎల్ సీఎండీ ఎంవి శేషగిరి బాబు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులను అప్రమత్తం చేశారు. -
పాలుపోవట్లే..
కనిపించనినాగులచవితి సందడి కనుమరుగైన పుట్టలు దొరకని పూజా సామగ్రి ‘హుదూద్’ దెబ్బకు కళ తప్పిన మార్కెట్లు సాక్షి, విశాఖపట్నం: హుదూద్ ప్రభావం నాగుల చవితిపై కూడా పడింది. తుపాను దెబ్బ నుంచి జిల్లా వాసులు ఇంకా తేరుకోలేదు. కార్తీక మొదటి సోమవారంనాడు ఈ పండగ కావడంతో ముఖ్యంగా మహిళలు ఆదివారం సాయంత్రమే సామాన్లు సిద్ధం చేసుకుంటారు. పూజాసామగ్రి కొనుగోలుదారులతో మార్కెట్లు కళకళలాడుతాయి. కానీ ఈ సారి ఆ సందడి ఎక్కడా కనబడలేదు. అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, చోడవరం వంటి పట్టణాల్లోనూ మార్కెట్లు వెలవెలబోయాయి. ఈ పండగ పట్ల జనం పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. రోజుకో చోట వెలుస్తున్న రియ ల్ ఎస్టేట్ వెంచర్ల పుణ్యమా అని పల్లెల్లో పుట్టలు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే పట్టణ ప్రాంతంలో కృత్రిమ పుట్టలకు పూజలు చేసే దుస్థితి ఏర్పడింది. ఇటీవల వచ్చిన హుదూద్ తుపాను కారణంగా వేలాది చెట్లు కూలిపోయాయి. వాటి కింద పడి పుట్టలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో సంప్రదాయాన్ని కొనసాగించే పరిస్థితులు కానరావడం లేదు. అందుబాటులో లేని పూజా సామగ్రి నాగుల చవితికి కావాల్సిన పూజ సామగ్రి సైతం మా ర్కెట్లో అందుబాటులో లేదు. సాధారణంగా పుట్ట లో పాలు పోయడానికి వెళ్లేటప్పుడు చలివిడి, చిమ్నీ లు, అరటి పళ్లు, పాలు, చెరుకుగడ, కొబ్బరికాయ లు, బుర్రగుంజు, కోడిగుడ్లు, కమల, బత్తాయి తొన లు, గళ్ల తువ్వాలు తీసుకువెళుతుంటారు. సాధారణ రోజుల్లో అయితే ఇవన్నీ దొరికేవి. కొన్ని ఇంటి వద్దే తయారు చేసుకునేవారు. అలా కుదరకపోయినా ప్ర ముఖ స్వీట్ దుకాణాల్లో చిమ్మీ, చలివిడి విక్రయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చలివిడి పిండి, చిమ్నీ ఆడేందుకు పిండిమరలు విద్యుత్ సరఫరా లేక మూలనపడ్డాయి. బుర్రగుంజు(ఎండిన తాటిపండులో ఉండే గుజ్జు)తేగల పాతర నుంచి వచ్చేది. ప్రస్తుతం అలాంటి పాతరలే ఎక్కడాలేవు. చెరుకుతోటలు పడిపోవడంతో చెరకు ముక్కలు కూడా లేవు. దీంతో అక్కడక్కడా రైతు బజార్లలో మినహా మార్కెట్లలో ఎక్కడా నాగులచవితికి సంబంధించిన పూజ సామగ్రి, ఇతర వస్తువులు దొరకడం లేదు. టపాసులు కాల్చకుండా కేవలం దీపాలతో దీపావళి జరుపుకున్న నగరవాసులు ఇప్పుడు పాల తో నాగులచవితి జరుపుకోవడం కూడా కష్టంగా మారింది. -
హుదూద్ వెనుక వాస్తు హస్తం
హుదూద్ చంద్రబాబుకి నూతన వెలుగుని అమావాస్య పూట తెచ్చిపెట్టింది. ఏదీ ఊహించలేం. పెద్ద ప్రయత్నం ఒక్కోసారి తుస్సుమంటుంది. ఒక్కోసారి చిన్న ప్రయత్నం అద్భుతంగా క్లిక్ అవుతుంది. కలిసొచ్చే కాలంలో మీడియా ఆల్ ఎడిషన్స్‌లో స్పందించినా బొత్స సత్యనారాయణ రంకెలు వేసినా ఎవ్వరూ పట్టించుకోరు. అక్షర తూణీరం దినపత్రిక రాగానే తారీకు, వారం చూ సు కుని మనసులో పె ట్టుకోవడం అలవా టు. ఇవ్వాల్టిది కాదు, అరవై ఏళ్ల అలవాటు. క్రమంగా వారంతో బాటు వర్జ్యం, యమ గండం, రాహుకాలం కూడా చేర్చారు. పోటీ పెరిగేసరికి సూర్యో దయ, సూర్యాస్తమయ వేళలు ఇవ్వడం మొదలే శారు. ముస్లిం సోదరుల కోసం ప్రార్థన వేళలు సమకూర్చారు. రాను రాను పేపరులో అరచేతి విస్తీర్ణం ఈ రోజువారీ సమాచారానికి సరిపోయే పరిస్థితి వచ్చింది. సంతోషించాను. ఎందుకంటే, ఇదొక్కటే పూర్తిగా నమ్మదగిన భోగట్టా. ఆ మధ్యన ఒక ప్రముఖ దినపత్రికలో, అట్లాగని అప్రముఖ దినపత్రిక కూడా కాదు. అందులో పై చెప్పిన పంచాంగాంగ వివరణ కింద ‘‘ఇదే తే. వార. నక్షత్ర. వర్జ్య. యమగండాది వేళలు అన్ని ఎడిషన్లకు వర్తి స్తాయి-ఎడిటర్’’ అనే సూచన గమనించి ఉలిక్కి పడ్డాను. ఎడిషన్ల ప్రభావం అనుకున్నాను. ఈ మధ్య ఒక డైలీలో (సాక్షి కాదు) ‘‘ఫలానా వారు ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకు అన్ని ఎడిషన్లలోనూ మరణించారు.’’ అన్న వార్త చదివి విస్తుపోయాను. ఎందుకంటే ఈ ఎడిషన్లు మా తరానికి కొత్త. పి.వి. గారు పోయినపుడు ఈ సంగతి తెలంగాణ వరకు సరిపోతుందా, లేక ఆల్ ఎడిషన్స్‌కి అవసరమా అని శౌనకాది మహర్షులు సందిగ్ధంలో పడ్డారని చెప్పుకు న్నారు. రేప్ వార్తలు హాట్‌న్యూస్ కాబట్టి జ్యూరీ సెక్షన్ ఉండదు. అందరూ చదువుతారు- కొందరు ఇష్టంగా, మిగిలిన వారు అయిష్టంగా. హిందీ భాషలో ఏది స్త్రీలింగమో, ఏది పుంలింగమో చెప్పడానికి ఒక సూత్రం లేదు. ఒక నియమం లేదు. నిబంధన లేదు. ఏమాటకామాటే. ఇది ఫలానా అని తేల్చుకోవాలి. చాలా సరళంగా కనిపిస్తూ, వినిపిస్తూ ఉండే హిందీ భాషలో అత్యంత పరుషమైంది ఈ లింగ నిర్ధారణ. నరేంద్రమోదీనైనా అర్థం చేసుకో వచ్చుగాని ఈ పద నిర్ధారణ చేయజాలం అంటారు. అసలు సంగతికి వస్తే, ఏ వార్తని ఏ ఎడిషన్‌లో ఎక్కడ ఎంత స్పేస్‌లో వెయ్యాలన్నదే నేటి బ్రహ్మ విద్య. వ్యాపార ప్రకటనలంటారా, మిల్లీ మీటర్ల కొలతలతో లెక్క తీసుకుంటారు. కాబట్టి పేచీ లేదు. అనధికార ప్రకటనలుంటాయి వాటినే గోప్యంగా ఇన్సైడర్లు ‘పెయిడ్ న్యూస్’ అని ముద్దుగా పిలుచు కుంటూ ఉంటారు. వాటిని ఎడిషన్ బట్టి విచక్షణతో వ్యవహరించాలి. తగినంత పాత్రత, విశ్వసనీయత కల్పించకపోతే చెల్లింపు వార్తలు మరోసారి గుమ్మం లోకి రావు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే, దాన్ని అను కూలంగా మార్చుకుని ఆ విధంగా ముందుకు పోవాలి. హుదూద్ బీభత్సం సృష్టించింది. అన్ని ఎడిషన్లలో చంద్రబాబు ‘సంభవామి యుగే యుగే’ అన్న స్థాయిలో కంచుకాగడాలతో రంగప్రవేశం చేశారు. అయితే గతంలో అలిపిరి సంఘటన బాబుకి అనుకున్నంత కలిసిరాలేదు. ఆ నాటి దృశ్యం పునరుత్థానం లాగా రక్తసిక్తమై పైకి లేస్తూ పదే పదే కనిపించినా ఆ రసం ఏ మాత్రం పండలేదు. అదే మరి హుదూద్ చంద్ర బాబుకి నూతన వెలుగుని అమావాస్య పూట తెచ్చిపెట్టింది. ఏదీ ఊహించలేం. పెద్ద ప్రయ త్నం ఒక్కోసారి తుస్సుమంటుంది. ఒక్కోసారి చిన్న ప్రయత్నం అద్భుతంగా క్లిక్ అవుతుంది. కలిసొచ్చే కాలంలో మీడియా ఆల్ ఎడిషన్స్‌లో స్పందించినా బొత్స సత్యనారాయణ రంకెలు వేసినా ఎవ్వరూ పట్టించుకోరు. పైగా అపోజి షన్ అజ్ఞానం పొజిషన్లో ఉన్నోడికి కొండంత అండ! వచ్చిన వాడు చూసి వెళ్లొచ్చు గదా, ‘‘కేంద్ర సాయం ఎంత అడగాలో తెలియలేదు. ఇది చంద్రబాబు అనుభవ రాహిత్యానికి నిదర్శనం. హుదూద్ నష్టం డెబ్భై వేల కోట్ల పైనే ఉంటుందని మా ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే కేవలం రెండువేల కోట్లు అడిగారు. కేంద్రం వెయ్యి కోట్లు ఇచ్చింది. అదే లక్ష కోట్లు అడిగితే సగం ఇచ్చేవారు’’ అన్నట్టుగా మాట్లాడారు మెగాస్టార్. అందుకే పెద్ద లు అంటారు- జ్ఞానాన్ని ప్రదర్శించడం కంటే అజ్ఞా నాన్ని కప్పెట్టుకోవడం ముఖ్యమని. ఒక సంగతి, పైగా ఇది అన్ని ఎడిషన్లలోను వేయదగినది అని చెప్పకుండా ఉండలేను. హుదూద్ కోస్తాపై విరు చుకు పడడం వెనుక వాస్తు హస్తం ఉందట. చీలిక తరువాత కొలతలు మారాయి. దిశలు మారాయి. దాంతో దశలు మారాయి. బరువు తగ్గింది. తేడా లొచ్చే సరికి, ఎటో వెళ్లాల్సిన హుదూద్ పిలిచినట్టు ఈ విశాఖ రేవుకి వచ్చిందట. ‘‘అయితే ఈ మారిన వాస్తుని సరిచేసే మార్గం లేదా’’ అని బావురుమ న్నాను. ‘‘ఉంది ... లేకేమి. ఉంది. దాన్ని కాలమే సరిచేస్తుంది’’ అంటూ స్వామీజీ యోగంలోకి వెళ్లిపోయారు. (వ్యాసకర్త ప్రముఖ రచయిత) శ్రీరమణ -
కలప వృక్షం కనుమరుగు
లక్షలాది చెట్లు నేలమట్టం కుప్పకూలిన 100ఏళ్ల నాటి వృక్షాలు అటవీ రహదారులు ఛిద్రం రూ.100 కోట్లకు పైగా నష్టం సవాల్‌గా మారిన భారీ వృక్షాల తొలగింపు స్మగ్లర్లు రెచ్చిపోయే ప్రమాదం ఉష్ణోగ్రతలు 5డిగ్రీల మేర పెరిగే అవకాశం సాక్షి, విశాఖపట్నం : హుదూద్ ధాటికి అటవీ సంపద కనుమరుగైంది. విధ్వంసానికి మొక్కలు..చెట్లే కాదు.. వందేళ్ల నాటి మహావృక్షాలు తలలువాల్చాయి. విశాఖ మహానగరంలో సుమారు 5 లక్షలు, జిల్లాలో 4.7 లక్షల చెట్లు నేలమట్టమైనట్టు ప్రాథమిక అంచనా. నష్టం రూ.కోట్ల పైనే ఉంటుందంటున్నారు. ఈ ప్రభావంతో భవిష్యత్‌లో 3 నుంచి 5డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోనే అత్యధికం ఉత్తరాంధ్రలో మొత్తం 10లక్షలకు పైగా వృక్ష సంపద నేలమట్టం కాగా, ఒక్క విశాఖ నగరంలోనే ఐదులక్షలకుపైగా చెట్లు సర్వనాశనమైపోయాయి. అటవీ ప్రాం తంలో మరో 15 లక్షలకు పైగా వృక్షాలు మోడువారాయి. టేకు, సరుగుడు, యూకలిప్టస్, అకేషియా (ఆస్ట్రేలియా తుమ్మ), కేషియా, సిల్వర్‌ఓక్, వేగిస, బండారు లతో పాటు ఎర్రచందనం చెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 3.5 లక్షల హెక్టార్లలో సరుగుడు, 1.50 లక్షల హెక్టార్లలో టేకు, లక్ష ఎకరాల్లో యూకలిప్టస్ చెట్లు నేలకొరిగాయి. విశాఖ చుట్టు పక్కల కొండలైతే పూర్తిగా బోసిపోయాయి. సీతకొండ, కంబాలకొండ, నరవ, ఎర్రకొండ, గీల్మెన్ఫీల్డ్, అమనామ్ తదితరమైనవి బోడిగుండుల్లా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా ప్రకారం రూ.60కోట్ల నష్టం వాటిల్లినట్టుగా నిర్ధారించిన అటవీశాఖాధికారులు వాస్తవ నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ నష్టం వందకోట్లపైగానే ఉంటుందంటున్నారు. తొలగింపునకు ఏడాదిపైమాటే వందలాది పొక్లెయినర్లు, వేలాది మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేస్తున్నా మైదాన ప్రాం తాల్లో నేలకొరిగిన చెట్లను తొలగింపు కార్యక్రమం కనీసం 50 శాతం కూడా దాటలేదు. అలాంటిది లక్షలహెక్టార్లలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో నేలకొరిగిన వృక్షాలను తొలగించడం అధికారులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. కనీసం ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచార మేనని.. అటవీ బీట్ల వారీగా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఈనష్టం మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అటవీప్రాంతాలకు వెళ్లే దారులన్నీ ఛిద్రమై పోయాయి. లోపలికి వెళ్లేందుకు మార్గాలు కూడా లేకుండా ఎక్కడికక్కడ వేలాది చెట్లు అడ్డంగా కూలిపోయాయి. అయినప్పటికీ అటవీశాఖ ప్రత్యేక బృందాలను నియమించి క్షేత్ర స్థాయిలో జరిగిన వాస్తవ నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమైంది. ప్రాథమిక సమాచారం మేరకు నేలమట్టమైన అటవీసంపదను తొలగించేందుకు కనీసం రూ.5 కోట్లకుపైగా వ్యయం అవుతుందని అంచనా. స్మగ్లర్లకు కాసులపంటే.. : సాధారణ రోజుల్లోనే విలువైన చెట్టు కన్పిస్తే ఇట్టే మాయం చేసే స్మగ్లర్లు, అక్రమార్కులు ఇప్పుడు హుదూద్ విధ్వంసాన్ని తమకు అను కూలంగా చేసుకుని కోట్లు ఆర్జించేందుకు పథక రచన చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో లక్షల విలువైన ఎర్రచందనం, టేకు తదితర వృక్షాలు వేలాదిగా నేలమట్టంకావడంతో వాటిని కల్పతరువుగా మార్చుకుంటున్నారు. అధికార పార్టీ అండదండలతో విలువైన వృక్షసంపదను దారి మళ్లించేందుకు పావులు కదుపుతున్నారు. దీనికి కళ్లెం వేసేందుకు అటవీశాఖ ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపింది. ధ్వంసమైన అటవీ సంపదను పరిరక్షించేందుకు ఏజెన్సీలో గిరిజనులను భాగస్వాములను చేస్తున్నారు. మరో 30 ఏళ్లు పడుతుంది అటవీసంపద పూర్వవైభవాన్ని సంతరించుకోవడానికి మరో 30 ఏళ్లకు పైగా సమయంపడుతుంది. కొన్ని రేంజ్‌ల పరిధిలో కనుచూపు మేర లో భారీ వృక్షాలనేవే లేకుండా పోయాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు త్వరగా ఎదగాలన్న ఆలోచనతోనే గతంలో తురాయి వంటి వృక్షజాతుల పెంపకాన్ని ప్రోత్సహించాము. ఇప్పటికైనా విపత్తులను తట్టుకునే చెట్లను పెం చడం చాలా అవసరం. బొగడ, కానుగ, వేప, లెగిస్ట్రోమియా, బాహానియా, మర్రి, రావి జా తులను పెంచితే అవి పెనుగాలులను తట్టుకుం టాయి. ఏజెన్సీ భూముల్లో నేలకొరిగిన వృక్షసంపదను ఆయా రైతులకు ఇచ్చేం దుకు నిబంధనలను సరళతరం చేశాం. వీఆర్వో సర్టిఫైచేస్తే చాలు వారి భూముల్లో ఏఏ చెట్లు నేలమట్టమయ్యాయో నిర్ధారించి వారెక్కడకు తరలించుకునేందుకైనా అనుమతులివ్వాలని ఆదేశించాం. -పి.రామ్మోహనరావు, డిఎఫ్‌ఒ, విశాఖ జిల్లా -
లెక్కలు తప్పుతున్నాయి
ఇళ్ల నష్టం అంచనాలపై అనేక అనుమానాలు తుపానుకు దెబ్బతిన్న వారం రోజులకు ఎన్యూమరేషన్ ఇప్పటికే కొంత మంది ఇళ్లను బాగుచేయించుకున్న వైనం వీరికి పరిహారం మాటేమిటి? 2 రోజుల్లో అంచనాలు పూర్తవుతాయంటున్న మంత్రులు ఇంకా పలు ప్రాంతాలకు వెళ్లని బృందాలు తుపాను నష్టం అంచనాలపై అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. ఎన్యూమరేషన్ తీరు పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రుల భిన్న ప్రకటనలు తుపాను బాధితులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అంచనాల రూపకల్పన పూర్తవుతుందని చెబుతున్నప్పటికీ.. ఇంకా వేల మంది బాధితుల వివరాలు సేకరించాల్సి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గడువు సమీపిస్తున్నా అంచనా బృందాలు రాలేదన్న ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. విశాఖ రూరల్ : హుదూద్ ధాటికి జిల్లాలో లక్షకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో రోడ్ల మీదకు వచ్చారు. మరికొందరు దెబ్బతిన్న ఇళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. జిల్లా ప్రజల ఆస్తుల నష్టాలపై అధికారులు 176 బృందాలను ఏర్పాటు చేశారు. తొలిదశలో ఇళ్లు, ఇతర ఆస్తులు, మరణాలు, జంతు మరణాలును లెక్కించాలని మార్గదర్శకాలు జారీ చేశారు. దీని ప్రకారం మూడు రోజుల క్రింత ఈ బృందాలు ఎన్యుమరేషన్‌ను ప్రారంభించాయి. ఇప్పటి వరకు 90 శాతం బాధితుల వివరాలు సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 68,254 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగనుంది. ఇప్పటి వరకు జరిపిన పరిశీలనలో అర్బన్‌లో పక్కా గృహాలు 21, రూరల్‌లో 106 మొత్తం 127 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని లెక్కలు తేల్చారు. పూరిళ్లు అర్బన్‌లో 30, రూరల్‌లో 1720 మొత్తంగా 2050 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని గుర్తించారు. అలాగే పక్కా ఇళ్లు అర్బన్‌లో 203, రూరల్ 642, పూరిళ్లు అర్బన్‌లో 2229, రూరల్ 3065 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. అదే విధంగా పక్కా గృహాలు అర్బన్‌లో 1355, రూరల్‌లో 4627, పూరిళ్లు అర్బన్‌లో 14,740, పూరిళ్లు 17,970, గుడిసెలు అర్బన్‌లో 6774, రూరల్‌లో 14,472 స్వల్పం గా దెబ్బతిన్నట్లు బృందాలు పరిశీలనలో వెల్లడైంది. తుది గడువుపై గందరగోళం ఎన్యూమరేషన్ గడువుపై గందరగోళం నెలకొంది. ఈ నెల 22వ తేదీ నాటికి నష్టం అంచనా ప్రక్రియ పూర్తవుతుందని మంత్రులు చెబుతున్నారు.అసలు కొన్ని ప్రాంతాలకు బృందాలు వెళ్లలేదన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖ 29వ వార్డు అచ్చయ్యమ్మపేటలో సహాయ కార్యక్రమాలు అందించకపోగా నష్టం అంచనాలకు ఏ ఒక్కరు రాలేదని భారీ సంఖ్యలో మహిళలు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అలాగే చాలా ప్రాంతాలకు బృందాలు పర్యటించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్‌కు మరో వారం రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే మంత్రులు కేవలం రె ండు రోజుల్లో అంచనాలు పూర్తి చేస్తామని చెప్పడంతో నష్టపరిహారం తమకు అందదేమోనని బాధితుల్లో ఆందోళన నెలకొంది. ఇళ్లు బాగుచేయించుకున్న వారి పరిస్థితేమిటి తుపానుకు దెబ్బతిన్న ఇళ్లను కొందరు బాగు చేయించుకున్నారు. అంచనా బృందాలు వచ్చి పరిశీలన చేసినంత వరకు దెబ్బతిన్న ఇళ్లలో ఉండలేమని భావించి కొందరు అప్పులు చేసి ఇళ్లకు మరమ్మతులు చేపట్టారు. ఇటువంటి వారికి నష్టపరిహారం ఏ విధంగా అందిస్తారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. దీంతో అటువంటి బాధితుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయంపై అధికారులు, మంత్రులు దృష్టి సారించని పక్షంలో బాధితులకు న్యాయం జరిగే అవకాశముండదు. -
‘కాఫీ’ నేలపాలు!
కోతదశలో హుదూద్ ధ్వంసం రూ. కోట్లలో గిరిజన రైతులకు నష్టం మొక్కల పెంపకానికి ఏళ్ల సమయం పాడేరు : ఏజెన్సీలోని కాఫీ రైతుకు పెద్ద కష్టమొచ్చింది. హుదూద్ దెబ్బతో కోత దశలో పంటంతా నేలపాలైంది. ప్రస్తుతం లక్షా 40 వేల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. వీటిలో సగానికి పైగా ధ్వంసమయ్యాయి. కాఫీ మొక్కలకు నీడనిచ్చే సిల్వర్‌ఓక్ చెట్లు పెద్ద ఎత్తున కూలడంతో అపార నష్టం సంభవించింది. కాఫీ రైతుకు ఇంతటి కష్టం రావడం ఇదే తొలిసారి. రూ.కోట్ల లో నష్టం వాటిల్లింది. వీటిలో అంతర పంటగా చేపట్టిన మిరియాల పాదులూ ధ్వంసమయ్యా యి. పరిస్థితి కుదుట పడాలంటే ఏళ్లు పడు తుందని అధికారులే అంటున్నారు. ఈ ఏడాది అనుకూల వాతావరణంతో 90 వేల ఎకరాల్లోని కాఫీ మొక్కలు విరగ్గాశాయి. ప్రస్తుతం ఈ తోటల్లోని కాయలన్నీ పక్వానికి వచ్చి కోతదశకు చేరుకున్నాయి. గతేడాదీ కాఫీ సాగు ఆశాజనకంగా ఉంది. ఆరు వేల టన్నుల క్లీన్ కాఫీ గింజల దిగుబడితోపాటు గిట్టుబాటు ధర కూడా దక్కింది. అప్పట్లో కిలో రూ.150-200ల వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. గిరిజన రైతులు నాలు గు డబ్బులు వెనకేసుకోగలిగారు. ఈ ఏడాది కూడా సుమారు 6,500 నుంచి ఏడు వేల టన్నుల వరకు దిగుబడులు ఉంటాయని కాఫీ బోర్డు అధికారులు భావించారు. ఆదా యం బాగుంటుందని ఆదివాసీ రైతులు ఆశపడ్డారు. ఇప్పుడు దిగుబడి సగం కూడా రాని పరిస్థితి. సాగుకాలాన్ని పరిగణలోకి తీసుకుని పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఐదేళ్లలోపు తోటలకు హెక్టారుకు రూ.10 వేలు, ఆరు నుంచి పదేళ్లలోపు తోటలకు రూ.15వేలు, పదేళ్లు దాటిన తోటలకు రూ.20 వేలు పరిహారం ఇస్తారట. గతేడాది తుపాను నష్టపరిహారం మన్యంలో ఎలా సాగిందో అందరికీ తెలిసిందే. కాఫీ పంట వ్యవసాయ, ఉద్యానవనశాఖల పరిధిలో లేదు. నష్టం అంచనాకు శాస్త్రవేత్తలు రావాల్సిందే. ఎత్తయిన కొండలు ఎక్కి వారు పరిశీలించాల్సి ఉంది. దీనికి ఎక్కువ సమయమే పడుతుంది. ఈ పరిస్థితుల్లో 2019 నాటికి కాఫీ సాగు విస్తీర్ణం 2.44 లక్షలకు ఏ మేరకు చేరుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
హుకుం జారీచేసిన హుదూద్
ఆంధ్రప్రదేశ్ రాజధానికి విజయవాడ-గుంటూరు ప్రాంతాలు, ముఖ్యంగాఆ రెండు పట్టణాలూ ఎంత మాత్రం అనుకూలం కానివని ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు గుర్తించడం అవసరం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మంచిది.వందిమాగదుల మాటలకు విలువ ఇవ్వకుండా, ప్రభుత్వం మొండిపట్టు పట్టకుండా నిపుణులు సూచించినట్లు అన్నివిధాలా అనుకూలంగా, సముద్ర మట్టానికి 300-400 మీటర్ల ఎత్తులో ఉన్న దొనకొండ- వినుకొండ- బోళ్లపల్లి- మార్టూరు ప్రాంతాలలో కొత్త రాజధానికి హంగులు సమకూర్చుకోవడం అత్యంత అభిలషణీయంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు రాజకీయ పాలకశక్తుల పతనానికి దారితీస్తాయి. ఆ పరిస్థితులలో విపత్తును తమకు అనుకూ లంగా మలుచుకోవాలని రాజకీయ నాయకులు తరచూ ప్రయత్నిస్తారు. ఈ తొక్కిసలాటలో పాలకులు తమ ప్రయోజనం కోసం అధికారగణంతో ఘర్షణకు దిగుతారు. - ప్రొఫెసర్ సి. రాఘవులు (డీన్ ఆఫ్ సోషల్ సెన్సైస్, రిటైర్డ్ డెరైక్టర్, విపత్తుల నివారణ అధ్యయన కేంద్రం, నాగార్జున విశ్వవిద్యాలయం) చెన్నైలో ఇచ్చిన ప్రసంగం (1994) నుంచి. విపత్తుల తరువాత అలాంటి పరిస్థితులు తలెత్తకుం డా జాగ్రత్త పడడానికి నిపుణులు పాత, కొత్త నివేదికలలో పొందుపరిచిన సలహాలను పాటించడం పాలకులకే శ్రేయస్కరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలు రెండురకాలు: ఒకటి- రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపిక నిర్ణయం ఒక సంక్షోభ స్థాయికి చేరుకోవడం. రెండు- విభజన జరిగిన వెనువెంటనే కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రం ‘హుదూద్’ పెను తుపాను బారినపడటం. ఈ తుపాను నాలుగు జిల్లాలను, విశాఖ నగరం సహా పలు పట్టణాలను ఇప్పట్లో తేరుకోలేని విధంగా నష్టపరిచింది. ఈ రెండింటిలో ఒకటి మానవ కల్పితమైన వికారపు చేష్ట. ముఖ్యమంత్రి పదవుల వేటలో తెలుగుజాతిని యూపీఏ ప్రభుత్వం రెండుగా చీల్చింది. రెండవది, ప్రకృతి చేసిన విలయ తాండవం. నిజానికి పర్యావరణానికి మనిషి తలపెడుతున్న హాని కారణంగా ప్రకృతి వికటించిన ఫలితమిది. తక్షణం గుర్తించవలసిన వాస్తవం ప్రస్తుతం ఆ రెండు సమస్యల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజానీ కం నలిగిపోతున్నది. ప్రజలనూ, రాష్ట్రాన్నీ ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి ప్రతి ఒక్కరూ ఆలోచిం చాలి. విభజన తరువాత అధికారం చేపట్టిన పాలకులు దేనికోసమో ఉవ్విళ్లూరుతూ, తొందరపాటుతో విజయవా డ-గుంటూరులను కొత్త రాజధానిగా ప్రకటించారు. ఇవి జనంతో కిక్కిరిసి ఉండే నగరాలు. తీరా ప్రకటించిన తరు వాత గాని అసలు సమస్యలు తెలిసిరాలేదు. ఇలాంటి చోట రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో ఒక్కొక్కటిగా అనుభవానికి రావడం వెంటనే మొదలైంది. ఏదో రకంగా అధికారం చేపట్టగలిగామన్న ‘సంబడం’లో ఈ పాలకులు సమస్య ఆనుపానులను పట్టించుకోకుండా పక్కకు పెట్టేశారు. ప్రజాభిప్రాయాన్ని గాని, కొందరు చేసిన హెచ్చరికలను గాని పట్టించుకునే తీరిక వారికి లేకపోయింది. రాజధాని ఎంపిక మీద కేం ద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన సాధికారికి నివేదికలో ఏం చెప్పిందో తెలుసుకునే ఓపిక కూడా పాలకు లకు లోపించింది. ముందుగా తీసుకున్న నిర్ణయాన్నే అమ లుచేయడానికి ఒడిగట్టారు. నిగ్గుతేలిన హెచ్చరికల స్వరూపం ఈ సమస్యను అసలు శాసనసభలో చర్చకు కూడా రానీ యకుండా, శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన విలువైన సల హాలను ఏకపక్షంగా తోసిపుచ్చారు. కేంద్రంలో బీజేపీతో పొత్తు కలిపిన తెలుగుదేశం నిరంకుశ నిర్ణయాలకు అల వాటు పడి, ఇక్కడ శాసనసభలో విపక్షం గొంతు నొక్కే సింది. కానీ, ఆచరణ, అనుభవం ప్రకారం శివరామకృష్ణన్ చేసిన హెచ్చరికలు వాస్తవికమైనవేనని ఇప్పుడు రుజు వైంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దేశం మొత్తం మీద విపత్తులకు గురికావడానికి అత్యధిక అవకాశాలు ఉన్న రాష్ట్రాలలో ఒకటి ఆంధ్ర ప్రదేశ్. రాష్ట్రంలో ఎక్కువ భాగం తరచూ దుర్భిక్షానికి గుర వుతోంది. ఈ పరిస్థితిలో పట్టణ ప్రాంతాలకు నీటి భద్రత సమస్యగా మారిపోతోంది. ఇక గ్రామీణ ప్రాంత ప్రజానీ కం మీద దీని ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోస్తా ప్రాంతం తరచూ పెనుతుపానులకు గురవుతూ, ఆక స్మిక వరదల బారిన పడుతోంది. ప్రధాన నదులు ప్రవ హించే మార్గంలోనే జనావాసాలు ఉండడంతో ఈ సమస్య తప్పడం లేదు. భూకంపాలు తరచుగా రాకపోయినా, వచ్చినప్పుడు కోస్తాలోని ప్రధాన పట్టణ కేంద్రాలలో భవ నాలు కుదుపునకు గురవుతున్నాయి. ఈ తీవ్ర పరిణామా లకూ త్వరితగతిన జరుగుతున్న పట్టణ ప్రాంతాల విస్తర ణకూ సంబంధం ఉంది. వాతావరణ మార్పులు మున్ముం దు పెను తుపానులకు, వాటి విస్తరణకూ, ఫలితంగా సముద్రంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని శివరామకృష్ణన్ కమిటీ నిపుణులు పేర్కొన్నారు. అందువల్లనే ‘విజయ వాడ-గుంటూరు- మంగళగిరి- తెనాలి’, పరిసర ప్రాంతా లూ (వీజీఎంటీ) నూతన రాజధాని నిర్మాణానికి అనువై నవి కావని విస్పష్టంగా సలహా ఇచ్చింది. అందరి మాటా అదే శివరామకృష్ణన్ నివేదికలోని ఈ అంశాలను జాతీయ స్థాయిలో ప్రణాళికా, భవన నిర్మాణ కేంద్రం (ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్) డెరైక్టర్ ఎన్.శ్రీధరన్ కూడా బలపరి చారు. ఏటా అక్టోబర్-నవంబర్ మాసాల్లో కోస్తాను పెను తుపానులు చుట్టుముట్టి భారీ ఎత్తున ధన, ప్రాణనష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇది కూడా ప్రభుత్వానికి తీవ్ర సమస్యగా పరిణమించిందని (14-10-2014) పేర్కొనడం విశేషం! మొత్తం ఆంధ్ర కోస్తా అంతా పెనుతుపానులకు సంబం ధించినంత వరకు తీవ్రనష్టాలకు గురిచేసే మండలాల్లోనే విస్తరించి ఉందని నిపుణులు తాజాగా కూడా హెచ్చరిం చారు. ఈ దృష్ట్యానే శ్రీధరన్ ప్రస్తుత పట్టణాభివృద్ధి కేం ద్రాలు, తూర్పు కోస్తా ఆర్థిక లావాదేవీల నడవ (కారిడార్) సహా, ఇటు చెన్నై నుంచి అటు కోల్‌కతా వరకూ భారీ తుపానుల దెబ్బకు గురయ్యేంత సమీపంలో ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న తటస్థ మండలంలో 15 ప్రథమశ్రేణి పట్టణాలు, 15 ద్వితీయ శ్రేణి పట్టణాలు, 13 తృతీయ శ్రేణి, నాల్గవ స్థాయి పట్ట ణాలు ఉన్నాయి. హుదూద్ విలయం ముగిసిన వారం తరువాత కూడా కోస్తా ప్రాంతాలకు వాటిల్లిన కష్టనష్టాలు ఎంతటివో ఇప్పటికి స్పష్టం కాని పరిస్థితి. ప్రాణనష్టం నలుగురితో ఆగిందని మొదట్లో ఆ బాధ మధ్యనే తృప్తి పడ్డాం. రెండు రోజులకే ఆ సంఖ్య 43కి చేరుకోవడం, విశా ఖపట్టణానికి, యావత్తు ఉత్తర కోస్తా మూడు జిల్లాలకు, తూర్పు గోదావరి జిల్లాకు జరిగిన భారీ నష్టం రూ.70 వేల కోట్లని ముఖ్యమంత్రే ప్రకటించటమూ గమనార్హం! ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలి ఈ పూర్వరంగంలో ఏపీ రాజధానికి విజయవాడ-గుంటూ రు ప్రాంతాలు, ముఖ్యంగా ఆ రెండు పట్టణాలూ ఎంత మాత్రం అనుకూలం కానివని ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు గుర్తించడం మంచిది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మంచిది. వందిమాగదుల మాటలకే విలువ ఇవ్వకుండా, మొండిపట్టు పట్టకుండా నిపుణులు సూచించినట్లు అన్ని విధాలా అనుకూలంగానూ, సముద్ర మట్టానికి 300-400 మీటర్ల ఎత్తులో ఉన్న దొనకొండ-వినుకొండ-బోళ్లపల్లి- మార్టూరు ప్రాంతాలలో కొత్త రాజధానికి హంగులు సమకూర్చుకోవడం అత్యంత అభిలషణీయంగా ఉంటుం ది. అందుకే రాజధానికి మూడు జోన్లతో పాటు, నాలుగు, ప్రాంతాలను శివరామకృష్ణన్ కమిటీ తుది నివేదికలో అనువైన, పరిశీలనార్హమైనవిగా ప్రతిపాదించింది. వాటిలో భాగంగా దొనకొండ ప్రాంతాలను కూడా చేర్చింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు సారవంతమైన వ్యవసాయ భూములకు ప్రసిద్ధి. అవి భారతదేశ ధాన్యాగా రాలలో విశిష్టమైనవి. కాబట్టి భూములను వ్యవసాయేతర పనులకు వినియోగించబోవటం ప్రజల ఆహార భద్రతకు చేటని కమిటీ అభిప్రా యపడింది. విజ్ఞత ప్రదర్శించాలి ఇంత వివరమైన హెచ్చరికల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పాలకుల పునరాలోచించకుండా ఇంకా ‘గుళ్లో ప్రదక్షిణలు’ మాదిరిగానే విజయవాడ-గుంటూరు ప్రాంతంలోనే రాజ ధాని నిర్మాణమంటూ మంకు పట్టు పడుతున్నారు. ఇందు కోసం భూములు ఇవ్వకపోతే ఆర్డినెన్స్ ద్వారానైనా రైతుల నుంచి గుంజుకుంటామని బెదిరింపులకు దిగడం సంస్కా రమూ కాదు, క్షంతవ్యమూ కాదు. రాజధాని ఎంపికపై కమిటీ నిపుణులు చేసిన ప్రతిపాదనలు సలహాలు మాత్ర మే, వాటిని రాష్ర్ట ప్రభుత్వం తలదాల్చవలసిన అవసరం లేదని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల ఇప్పటికీ మోరాయి స్తున్నారు. శివరామకృష్ణన్ నివేదిక బయటకు వచ్చిన తరు వాత కూడా తనకు ఏ నివేదికా అందలేదని సీఎం కోత కోస్తూవచ్చారు. నిజానికి పాలకులు వినమ్రతతో మెలగి రాష్ట్ర రాజధాని ఎంపిక నిర్ణయాన్ని పునరాలోచించక తప్ప ని పరిస్థితులను ‘హుదూద్’ సృష్టించింది. ఇలాంటి నిరం తర సంక్షోభం, సంకటాలకు రాష్ట్ర ప్రజలను వదిలిపెట్ట కుండా ప్రకటించిన నిర్ణయం గురించి పాలకులు పునరా లోచించడం మంచిది. నిపుణులు చేసిన హెచ్చరికలే నేడు వాస్తవంగా కళ్ల ముందు నిలిచాయని పాలకులు గుర్తించి విజ్ఞతతో మెలగాలనీ, తెలివి తెచ్చుకోవాలనీ ఆశిద్దాం. అంతేగాని ‘కరువునొక్క దాసరి’ అన్నట్టుగా ఈ పాలకుల పాలనా కాలం కరువుతో ప్రారంభమై, కరువు భారంతో సాగి, కరువు బాధతోనే ముగిసిపోకూడదు. ఏబీకే ప్రసాద్ -
హుదూద్ బాధితులను ఆదుకుందాం
తిరుపతి కార్పొరేషన్ : హుదూద్ సృష్టించిన పెను తుపానుతో నిరాశ్రయులుగా మిగిలిన విశాఖ జిల్లా బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ పిలుపునిచ్చారు. బాధితులను వైద్య పరంగా ఆదుకునేందుకు తిరుపతి శ్రీసాయిసుధా మల్టీ ఆసుపత్రి, శ్రీరాళ్లపల్లి రాఘవ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా రూ.2.12 లక్షల విలువైన మందులు ఏర్పాటు చేశారు. వీటిని హాస్పిటల్ డెరైక్టర్లు డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి సమక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ ద్వారా విశాఖపట్నంకు శుక్రవారం తరలించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు ఎంపీ శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రజల మనసు గొప్పదని నిరూపించారన్నారు. ఎంపీగా తన రెండు నెలల జీతంతో పాటు నిధులను కూడా బాధితులకు కేటాయిస్తామన్నారు. డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ విశాఖలోని బాధితులకు అండగా నిలిచేందుకు ప్రతి డాక్టర్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ వంతుగా రూ.2.12 లక్షల విలువైన పెయిన్ కిల్లర్లు, యాంటి బయాటిక్స్, డ్రెస్సింగ్ మెటీరియల్స్, సిరప్లు, ఎనర్జీ డ్రింక్‌లు, ప్రొటీన్ పౌడర్లు, సెలైన్ బాటిల్స్, డయేరియా వంటి వ్యాధులకు మందులు అందించామన్నారు. డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, డాక్టర్ శ్రీహరి, డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు ఐఎంఐ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో దంపూర్తి భాస్కర్, కృష్ణాయాదవ్, ఆర్సీ మునికృష్ణ, పత్తిపాటి వివేక్, దుగ్గాని జయరామ్ పాల్గొన్నారు. -
సామాజిక భద్రత గాలిలో దీపం!
హుదూద్ విలయాన్ని ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్నదని ప్రచారం సాగుతోంది. నాలుగు రోజుల ముందే తెలిసి సంభవించిన ఉత్పాతాన్ని ఎదుర్కోవడానికి పూర్తిగా సంసిద్ధమై ఉంటే విద్యుత్ పునరుద్ధరణ ఇంత ఆలస్యమయ్యేదా? జనం తాగునీటి కోసం సైతం ఇంకా కటకటలాడాల్సి వచ్చేదా? తొలి తెలంగాణ ప్రభుత్వ హయాంలో 250 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఆత్మహ త్యలకు పాల్పడవచ్చని తెలుసు. కానీ, ఊరూరా, వాడవాడలా జేఏసీలను నిర్మించి ఉద్యమ ప్రస్థానం సాగించిన పార్టీ ప్రభుత్వానికి.. రైతులకు ధైర్యం చెప్పే కార్యక్రమం చేపట్టడం సాధ్యం కాలేదా? సాంఘికశాస్త్రం ‘దేశమంటే మనుజులోయ్’ అన్నది గురజాడ మాట. ‘దేశమంటే ఓటరోయ్’ అన్నది నేటి ఏలికల మాట. నాలుగు ఓట్లను వెనకేసుకునేందుకు కావాల్సిన రాజకీయ వ్యూహాలంటే మన నాయకులకు బోలెడంత శ్రద్ధ. పౌర సంక్షేమం, సాంఘిక భద్రతలతో ముడిపడిన విషయాలపై అలాంటి ముందస్తు ఆలోచనలు చేయడంలో మాత్రం ఆ ఆసక్తి కనబడదు. సమాజంలో అవాంఛనీయమైన ధోరణులు తలెత్తబోతున్నాయనే సూచనలు కనిపించినప్పుడుగానీ, విపత్తులు ఎదురు కాబోతున్నాయనే హెచ్చరికలు అందినప్పుడుగానీ ప్రభుత్వాలకు ఉండవలసిన సన్నద్ధత, ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం మృగ్యం. పెపైచ్చు గోరంత పనికి కొండంత ప్రచార రాగం తీసే విపరీత ధోరణి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిణామాలనే తీసుకుందాం. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక జీవనాడిగా భాసిల్లుతుందని భావిస్తున్న విశాఖ పట్నం(ఉత్తరాంధ్రసహా) పై పెనుగాలులతో ప్రకృతి విరుచుకు పడింది. తెలం గాణ రాష్ట్రం ఏర్పడిన ఈ నాలుగున్నర మాసాల్లో సుమారు 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వార్తలొస్తున్నాయి. ఈ రెండు ఉత్పాతాలను రెండు ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొంటున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ నెల పన్నెండో తేదీ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు హుదూద్ తుపాను విశాఖపట్నం వద్ద తీరం దాటింది. గంటకు 200 కిలో మీటర్ల వేగపు పెనుగాలులతో విధ్వంసం సృష్టించి వెళ్లింది. అంతకు ముందురోజు... అంటే పదకొండో తేదీనాటి వాతావరణ హెచ్చ రికను ఒకసారి చూడండి. తుపాను తీరం దాటే సమయానికి పన్నెండు గంటల ముందు నుంచి ఆ తర్వాత మరో 24 గంటలపాటు- మొత్తంగా 36 గంటలసేపు 160 నుంచి 180 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని స్పష్టంగా చెప్పింది. ఇంకోరోజు ముందుకెళ్దాం. పదో తేదీ నాటి వాతావరణ హెచ్చరిక... హుదూద్ తుపాను విశాఖపట్నం వద్దే తీరం దాటబోతోంది. ఆ సమయంలో భీకరమైన గాలులు వీస్తాయి. అక్టోబర్ 9 నాటి వాతావరణ హెచ్చరిక... విశాఖపట్నం- గోపాల్పూర్ (ఒడిశా)ల మధ్య హుదూద్ తుపాను 12వ తేదీన తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. విశాఖపట్నాన్ని ప్రచండ మారుతం తాకబోతోందన్న విషయం మూడు రోజుల ముందే స్పష్టంగా తెలుసు. ఒక్కోరోజు గడుస్తున్న కొద్దీ మరింత స్పష్టంగా, లెక్కకట్టిన చందంగా తుపాను ప్రభావాన్ని వాతావరణ శాస్త్రం కళ్లకు కట్టింది. ఈ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రప్రభుత్వం తీరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కేంద్రప్రభుత్వం నౌకాదళాన్ని, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే ఎన్డీఆర్ఎఫ్ను సమాయత్తం చేసింది. పదమూడో తేదీ మధ్యాహ్నం సమయానికి ముఖ్యమంత్రి విశాఖ పట్నం చేరుకున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహించి, సహాయ కార్యక్రమాలను సమన్వయం చేసే పనిని ప్రారంభించారు. స్థూలంగా ఇదీ ప్రభుత్వ స్పందన. ఈ మాత్రం పనిని ఆకాశానికెత్తే స్తోత్ర కైవారాలు మూడోరోజు నుంచే మొదలయ్యాయి. కొందరు అధికారులు, మరికొందరు మేధావులనుకునేవాళ్ల ఇంటర్వ్యూలు కొన్ని పత్రికల్లో అచ్చవుతున్నాయి. కొన్ని చానళ్లలో ప్రసారమ వుతున్నాయి. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించడం ఎప్పుడూ చూడలేదం టారు వారు. అసలు ముఖ్యమంత్రి విశాఖపట్నంలో మకాం వేయడమేమిటని ఆశ్చర్యపోతారు. ప్రధానమంత్రి స్వయంగా సమీక్షలో పాల్గొనడమేమిటని నివ్వెరపోతారు. అసలు ఈ ప్రభుత్వం ఉన్నది కనుకే ఇంత తక్కువమంది (36 మంది) చనిపోయారని కొందరు సూత్రీకరిస్తారు. ‘‘అనుభవమండీ... అనుభ వం, నేనందుకే చెప్పాను అనుభవజ్ఞుడు పాలకుడవ్వాలని’’ మరొకాయన తన దూరదృష్టిని జనానికి గుర్తుచేస్తారు. ఈ తుపాను ప్రమాదాన్ని ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నదని తామే ఒక నిర్ధారణకు వచ్చేసి, ప్రజ లంతా ఇదే అభిప్రాయాన్ని నమ్మితీరాలని చేస్తున్న ఈ ప్రచారం ఇలావుంటే... సామాన్యుల బుర్రలను మాత్రం అనేక సందేహాలు తొలిచేస్తున్నాయి. ప్రచం డమైన గాలులు వీస్తాయని మూడు నాలుగు రోజుల ముందే తెలుసుకదా... ఆ స్థాయి గాలులకు కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పడిపోతాయనీ, చెట్లు కూలిపోతాయని ఎందుకు ఊహించలేకపోయారు? అంధకారం ఆవరించే అవకాశంవుందని ఎందుకు అంచనా వేయలేకపోయారు? అంచనా వేసివుంటే తుపాను తీరం దాటడానికి ముందుగానే విద్యుత్ సిబ్బందిని, పరికరాలను సమీకరించి, ఎందుకు సిద్ధం చేయలేదు. అలా చేసి వున్నట్టయితే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ ఇంత ఆలస్యమయ్యేది కాదుగదా? ముందస్తు వ్యూహం ఉన్నట్లయితే విపత్తు సంభవించాక ఇన్ని రోజుల తర్వాత కూడా జనం తాగు నీటి కోసం ఎందుకు క్యూల్లో నిలబడాల్సివస్తోంది. కాలకృత్యాలు తీర్చుకోవ డానికీ ఎందుకు అవస్థలు పడాల్సివస్తోంది. పాలు, కూరగాయలను గంటల తరబడి నిలబడి మరీ అధిక ధరలకు ఎందుకు కొనుక్కోవలసి వస్తోంది? ఐదు రోజుల తర్వాత బంగాళదుంపల కోసం బెంగాల్ ముఖ్యమంత్రికి ఫోన్ చేయడ మేమిటి? ఈ పని ముందుగానే చేయలేరా? ఐదు రోజుల తర్వాత కూడా విశాఖ వీధుల్లో ఆకలికేకలు ఎందుకు వినాల్సివస్తోంది? తాను విశాఖలో ఉండటంవల్ల ప్రజలకు, అధికారులకు నైతిక బలాన్నిచ్చినట్టవుతుందని భావిస్తున్న ముఖ్య మంత్రి తుపానుకు ముందురోజే అక్కడ ఎందుకు మకాం వేయలేదు? ఇక తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యలు కొత్తగా ఇప్పుడు ప్రారంభమైనవి కాకపోవచ్చు. కానీ, ఈ నాలుగు మాసాల్లో పెరిగాయి. విద్యుత్ సమస్య కూడా ఈ ప్రభుత్వం సృష్టించింది కాకపోవచ్చు. కానీ, మరింత జటిలంగా మారింది. ఈ నాలుగు మాసాల్లో సుమారు 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రని చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ మరో రెండు మూడు వారాల్లో పూర్తవుతుం దనగా ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. ఇక పంటల దిగుబడి మీద ఆశలు పూర్తిగా అడుగంటడంతో, చేసిన అప్పులు గుర్తుకొచ్చి రైతులు పిట్టల్లా రాలు తున్నారు. ఈ సంవత్సరం సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. అయి నాసరే సాధారణ సాగులో 90 శాతానికి పైగా రైతులు సాగుచేశారు. ఏరువాక జూన్‌లో వుంటే మన బ్యాంకులు ఖరీఫ్ అప్పులను అక్టోబర్ నాటికి గానీ ఇవ్వవు. అప్పటికే ఖరీఫ్ పూర్తయ్యే దశలో ఉంటుంది. ప్రైవేట్ అప్పులను అధిక వడ్డీకి తీసుకొని రైతులు సాగు ప్రారంభిస్తారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు 180 శాతం పెరిగితే ఇదేకాలంలో మద్ధతు ధర 10 శాతం పెరి గింది. ఇన్ని కష్టాలతో సాగు ప్రారంభించిన రైతును వర్షాలు తొలిదెబ్బ తీస్తే, కరెంట్ మలిదెబ్బ తీసింది. ఒక మడి పూర్తిగా తడిసిన తర్వాతే రెండో మడిలోకి నీరు పారేలా ఉంటుంది మన వ్యవసాయ పద్ధతి. ఉదయం-రాత్రి... ఇలా రెం డు దఫాలుగా కరెంటు ఇవ్వడంతో తడిపిన ప్రతిసారీ మొదటి మడి తడవడమే తప్ప రెండో మడిలోకి నీరు పారదు. ఇచ్చిన కరెంట్ ఒకేసారి ఇస్తే కొంతైనా ఫలితముండేదేమో! పొట్టకొచ్చిన పంట చివరి తడులు లేక కళ్లముందే మాడి పోయింది. రుణాలు రెన్యువల్ అయివుంటే అక్టోబర్ నాటికైనావచ్చే బ్యాంకు రుణాలతో పీకల మీదున్న అప్పులను రైతు తీర్చుకునేవాడు. రుణమాఫీ ప్రక్రి య పూర్తికాకపోవడంతో ఆ ఆశాలేదు. అవమానభారాలు గుర్తుకొచ్చి బతుకు మీద ఆశ చస్తోంది. అరువుకు దొరికే మద్యం చావడానికి ధైర్యాన్నిస్తోంది. ఈ వ్యవహారంలో తొలి తెలంగాణ ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తుందని ప్రజలు ఆశించారు. ఎందుకంటే, ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఉద్యమానికి సారథ్యం వహించిన పార్టీ. కానీ, ఈ మొత్తం సీజన్లో ఏ దశలోనూ ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషించలేదు. పంటలు ఎండిపోతున్నాయని తెలుసు. రైతు లు ఆత్మహత్యలకు పాల్పడతారనీ తెలుసు. కానీ, గ్రామగ్రామాన ఆత్మహత్య లకు వ్యతిరేకంగా ఉద్యమస్ఫూర్తితో జన చేతన కార్యక్రమాలు నిర్వహించాలన్న శ్రద్ధ మాత్రం దానికి కలుగలేదు. ఊరూరా, వాడవాడనా, జేఏసీలను నిర్మించి ఉద్యమ ప్రస్థానం సాగించిన పార్టీకి రైతులకు ధైర్యం చెప్పే కార్యక్రమం చేపట్ట డం సాధ్యం కాలేదా? నాలుగు వేలమంది తెలంగాణ కళాకారులను గుర్తించి వారికి ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీనిచ్చిన ప్రభుత్వానికి, కళాబృందాలతో గ్రామగ్రామానా ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి మనసు రాలేదా? ఉద్యమపార్టీ రాజకీయ పార్టీగా పరివర్తన చెందింది కాబట్టి బహుశా ఇక అటువంటి ఆలోచనలు రాకపోవచ్చు. తక్కువ శ్రమతో ఎక్కువ ప్రచారం దొరికే బతుకమ్మలు, గోల్కొండ కోటలు, ట్యాంక్‌బండ్ విగ్రహాలు వుండగా సాంస్కృతికోద్యమాలు, సాంఘికోద్యమాలు ఎవరు తలకెత్తుకుంటారు? వర్థెల్లి మురళి -
ఆంధ్రా చాంబర్ విరాళం రూ.2కోట్లు
విజయవాడ : హుదూద్ ధాటికి విలవిలలాడిన ఉత్తరాంధ్రా జిల్లాలు, విశాఖ నగరాన్ని ఆదుకోవడం అందరి తక్షణ కర్తవ్యమని, అందాల విశాఖ కకావికలమైన తీరు ప్రతి వారి గుండెను కలిచివేస్తోందని ఆంధ్రా చాంబర్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చాంబర్ కార్యదర్శి సీహెచ్.ఆర్.కె.ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పి.భాస్కరరావు ఒక ప్రకటన విడుదల చేస్తూ నాలుగు జిల్లాల ప్రజల కష్టాలను పూర్తిగా తీర్చిలేక పోయినా, కనీసం కన్నీళ్లు తుడిచేందుకు చాంబర్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. తమవంతు బాధ్యగా తుపాను బాధితులకు చాంబరు సభ్యులు, అఫ్లియేట్ సంఘాల నుంచి రూ. 2కోట్ల వరకూ వసూలు చేసి సీఎం సహాయ నిధికి అందిచినట్లు వివరించారు. ఎవరెవరు ఇచ్చారంటే.. విరాళాలు ఇచ్చిన వారిలో ఎయిర్‌కోస్తా అధినేత లింగమనేని రమేష్ రూ.25 లక్షలు, పెట్రోల్ డీలర్స్ సంఘం తరఫున ఎం.నారాయణప్రసాద్ రూ.10 లక్షలు, హైదరాబాద్ ఫోనిక్స్ సంస్థ తరపున చుక్కపల్లి సురేష్ రూ.10 లక్షలు, ఆంధ్రా చాంబరు కార్యదర్శి చుక్కపల్లి ప్రసాద్ కుశలవ సంస్థల తరఫున రూ.5 లక్షలు, ఇన్కాప్ అధినేత సి.భగవంతరావు రూ.6.5 లక్షలు, (దీనిలో రూ.6లక్షలు విలువగల పవర్ ఇన్సులేటర్స్), ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున జి.వి.రామారావు, వి.రాఘవప్రసాద్ రూ.7.5 లక్షలు, కేసీపీ సంస్థల తరఫున రూ.10 లక్షలు ఇవ్వగా, కేసీపీ షుగర్ మిల్స్ తరఫున కోటి విరాళం సేకరించనున్నారు. ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ తరఫున జి.పున్నయ్యచౌదరి రూ.50 లక్షలు, కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున రూ.10 లక్షలు, నవత సంస్థ తరఫున పి.వి.కోటేశ్వరరావు రూ.5 లక్షలు, ఫ్లైవుడ్ డీలర్స్ అసోసియేషన్ రూ.5 లక్షలు, పాపులర్ షూమార్ట్స్ తరఫున చుక్కపల్లి అరుణ్‌కుమార్ రూ.10 లక్షలు, కళానికేతన్ తరఫున వి.నాగభూషణం రూ.30 వేలు, లయనర్స్ సంస్థల తరఫున రూ.లక్ష విరాళం అందజేశారు. రేవేళ్ల సతీష్ రూ.1.5 లక్షలు, శేషసాయి నిట్టింగ్స్ సంస్థ తరపున టి.చంద్రశేఖరరావు రూ.లక్ష , ప్రకాశ ఇంజినీరింగ్ వర్క్స్ అధినేత టి.జె.జి.ప్రసాద్ రూ.లక్ష, రామ్కోర్ అధినేత కె.వి.ఎస్.ప్రకాశరావు రూ.50వేలు, సేఫ్ ఎన్విరాన్మెంట్స్ అధినేత వెలగపూడి వెంకటేశ్వరరావు రూ.50 వేలు, వి.కృశ్ఛేవ్ రూ.10వేలు, అమ్మ అసోసియేషన్ తరఫున రూ.5 లక్షలు, కొండపల్లి ఇండస్ట్రీస్ తరఫున రూ.5 లక్షలు అందజేశారు. టింబరు మర్చంట్స్ తరఫున చలసాని సుబ్బారావు రూ.50 వేలు, పొట్లూరి భాస్కరరావు రూ.10వేలు, టైమ్ హాస్పటల్ ఎండీ మైనేని హేమంత్ రూ.3 లక్షల విలువైన నిత్యావసరాలు అందించారు. ఈ విరాళాలతో పాటు, ఆంధ్రా చాంబర్ తరఫున 16 టన్నుల సామగ్రి, రెండు ట్రక్కుల పాలు, మంచినీరు, ఆహార పదార్థాలు, రొట్టెలు, బిస్కెట్లు, బియ్యం, కొవ్వొత్తులు గురువారం పంపించినట్లు వారు తెలిపారు. ఈ విరాళాల సేకరణ, ఆహార పదార్థాల సరఫరా మరింత కాలం చేపట్టనున్నట్లు ప్రసాద్, భాస్కరరావు వివరించారు. ప్రాఫిట్షూ కంపెనీ విరాళం గాంధీనగర్ : హుదూద్ బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రాఫిట్ షూ కంపెనీ యాజమాన్యం, సిబ్బంది రూ.3.10 లక్షలు విరాళం ప్రకటించారు. హనుమాన్‌పేటలోని ప్రాఫిట్ షూకంపెనీ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు ఎండీ బోడేపూడి శివ కోటేశ్వరరావు విరాళం చెక్కును అందజేశారు. కంపెనీ రూ. 2లక్షలు, మరో లక్షా పదివేల రూపాయలను సిబ్బంది నుంచి విరాళంగా సేకరించినట్లు ఎండీ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు, కంపెనీ డెరైక్టర్ బి.తేజ, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. -
పిల్ల కుంకవు.. నాకు చెప్పేంత వాడివా..!
విజయనగరం: తీరప్రాంత ప్రజ లందరికీ 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలిని కూడా తట్టుకొనే విధంగా పక్కా ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తుపాను దెబ్బకు నష్టపోయిన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం, ముక్కాం గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థాని కులు తమ గోడును తెలియజేశారు. తుపాను సమయంలో తమను ఎవరూ పట్టించుకోలేదని, నష్టం జరిగిన తరువాత కూడా అధికారులెవరూ రాలేదని దిబ్బలపాలెంవాసులు వాపోయారు. అయితే చంద్రబాబు వారిని పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం వల్లే ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టాన్ని మాత్రం ఆపలేకపోయామని సీఎం చెప్పారు. రాష్ట్ర విభజనతో కొన్ని ఇబ్బందులన్నా, బాధితులను ఉదారతతో ఆదుకుంటామన్నారు. తుపాను వల్ల జిల్లాలో 8 మంది మృతి చెందారని, వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రూ. 2 లక్షలు ఇస్తామన్నారు. ముక్కాంలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేశారు. తుపాను వల్ల దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలతో ఐఏవీ కింద పునర్నిర్మిస్తామని చెప్పారు. నష్టపోయిన కచ్చా ఇళ్లకు రూ.25 వేలు, పూరి ల్లుకు రూ.5 వేలు ఇస్తామన్నారు. పడిపోయిన ఒక్కొక్క కొబ్బరి చెట్టుకు రూ.1,000 పరిహారం చెల్లిస్తామని, ఉపాధి పథకం కింద బాధితులందరికీ పనులు కల్పిస్తామని చెప్పారు. దెబ్బ తిన్న అన్ని పంటలకు పరిహారం అందిస్తామని తెలిపారు. సముద్రంలో కొట్టుకుపోయిన మత్స్యకారుల పడవలకు రూ.10 వేల చొప్పున పరి హారం చెల్లిస్తామని ప్రకటించారు. మత్స్యకారులకు జీవనోపాధి కింద రూ.10 వేలు అందిస్తామని, నిత్యావసరాలు ఇస్తామని తెలి పారు. పిల్ల కుంకవు.. నాకు చెప్పేంత వాడివా..! సీఎం ముక్కాం నుంచి తిరిగి వస్తుండగా ముంజే రు గ్రామం వద్ద ప్రజలు కాన్వాయ్కి అడ్డుపడి, చంద్రబాబు మాట్లాడాలని అడిగారు. దీంతో ఆయన కాన్వాయ్ దిగి మాట్లాడారు. ఇంతలో మహిళలతో సహా గ్రామస్తులంతా ముక్తకంఠంతో నిరసన తెలిపారు. ఇంతవరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ రాలేదని అన్నారు. దీనికి బాబు స్పందిస్తూ ఎంపీడీఓ ఎక్కడని అధికారులను అడిగారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో వెనుకనున్న ఒక వ్యక్తి ‘‘ఉద్యోగాలు ఇవ్వలేదు నువ్వేం సీఎంవి? మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలి’’ అని గట్టిగా అన్నాడు. దీంతో సీఎం ఆవేశానికి లోనయ్యారు. ‘‘ఏం తమాషా చేస్తున్నావు! నీవు పిల్లకుంకవు. నాకు చెప్పేంత వాడివా? దేనికి వచ్చావు? అల్లరి చేయడానికా? ఊరుకో.. గట్టిగా మాట్లాడకు’’అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నష్టం అంచనాకు 2 రోజుల్లో కేంద్ర బృందం విశాఖ రూరల్: హుదూద్ తుపాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రెండు మూడు రోజుల్లో కేంద్ర బృందం వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. బుధవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తుపాను నష్టాన్ని అధిగమించిన విధానంపై ఒక బ్లూబుక్ రూపొందిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడ భారీ తుపాన్లు వచ్చినా ఈ బ్లూబుక్ ఉపయోగపడుతుందన్నారు. తుపాను వచ్చిన రోజు ప్రజలెవరూ బయటకు రాలేకపోయారని చెప్పారు. తాను అతి కష్టం మీద తరువాతి రోజు విశాఖకు రాగలిగానన్నారు. ఓ నగరాన్ని ఇంత భారీ తుపాను తాకడం ఇదే తొలిసారన్నారు. 48 గంటల్లో మంచినీరు ఇచ్చామని, పెట్రోల్ సమస్య లేకుండా చేశామని, 6 లక్షల ఆహార పొట్లాలు అందించామని వివరించారు. తుపాను సృష్టించిన నష్టం రూ.60 వేల కోట్లా లేక రూ.70 వేల కోట్లా అనే విషయం అంచనాలకు అందడంలేదని చెప్పారు. పూర్తిస్థాయిలో సర్వే చేసిన తర్వాతే నష్టాన్ని అంచనా వేయగలమని చెప్పారు. పక్కకు ఒరిగిన బాబు ట్రాక్టర్ సీఎం చంద్రబాబు బుధవారం శ్రీకాకుళం జిల్లా కింతలి గ్రామంలో పర్యటిస్తుండగా ఆయన ఎక్కిన ట్రాక్టర్ నీటిలో ఒరిగిపోయింది. సీఎం కాన్వాయ్ కింతలి రహదారి వరకు వచ్చింది.గ్రామంలోని రోడ్డు నీటిలో ముని గిపోవడంతో బాబు, కొందరు ప్రజాప్రతినిధులు ఓ ట్రాక్టర్ ఎక్కారు. వారు గ్రామంలోకి వెళ్తుండగా అది ఒరిగిపోయింది. భద్రతా సిబ్బంది సీఎంను పట్టుకున్నారు. ఇదే గ్రామం వద్ద కాజ్వే వద్ద ట్రాక్టర్ ఆగిపోయింది. దీంతో గ్రామస్తులు కలిసి ట్రాక్టర్నునెట్టి కాజ్‌వేను దాటించారు. -
తేరుకోని మహానగరం
ఆదుకోని యంత్రాంగం మూడోరోజు స్తంభించిన కమ్యూనికేషన్స్ అత్యవసర వైద్యం అందక రోగుల ఇక్కట్లు సీఎం, పీఎం సేవలో ఉన్నతాధికారులు నత్తనడకన సహాయ, పునరావాస కార్యక్రమాలు మనోనిబ్బరంతో ముందడుగేస్తున్న నగరవాసులు నిత్యావసరాలందక లూటీ చేస్తున్న బాధితులు విశాఖపట్నం: హుదూద్ సృష్టించిన పెనువిధ్వంసం నుంచి కకావికలమైన విశాఖపట్నం ఇంకా విషాదం నుంచి తేరుకోలేక పోతోంది. 48గంటలు గడుస్తున్నా నగరవాసులు ఆ షాక్ నుంచి బయటపడలేకపోతున్నారు. పెనువిషాదం మిగిల్చిన శిథిలాల మధ్య బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మూడో రోజు కూడా గుక్కెడు నీళ్లు కూడా దొరక్క నరకయాతనపడ్డారు. నెట్వర్కింగ్ వ్యవస్థ చిద్రమైపోవడంతో కమ్యూనికేషన్స్‌లేక పడరాని పాట్లు పడుతున్నారు. జాతీయ రహదారితో పాటు నగరంలోని అంతర్గత రహదారులపై నేలకొరిగిన మహావృక్షాలను యుద్ధప్రాతిపదికన తొలగించడంతో రాక పోకలు సుగమం అయినప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేకపోయారు. సోమవారం సాయంత్రానికే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మంగళవారం కూడా ఆచరణకు నోచుకోలేదు. దీంతో అంధకారంలో చిక్కుకున్న ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు పడుతున్న బాధలైతే వర్ణనాతీతంగా ఉన్నాయి. నీళ్లకోసం జనరేటర్ కష్టాలు గుక్కెడు నీళ్లకోసం విశాఖ నగరవాసులు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. అపార్టుమెంట్‌వాసులు గంటకు రూ.2వేల అద్దెతో జనరేటర్లను ఏర్పాటు చేసుకుని వాటర్ ట్యాంకుల్లో మంచినీళ్లు తోడుకుంటున్నారు. జనరేటర్లు దొరకని ప్రజలు సమీపంలో ఉన్న లాడ్జీల్లో రూమ్‌లు తీసుకుని కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నగరంలో ఏమూలకెళ్లినా బోరుల వద్ద జనం బారులు తీరి కన్పిస్తున్నారు. మంచినీళ్ల కోసం సిగపట్లకు దిగుతున్నారు. పెదజాలరిపేట, చినజాలరిపేటవంటి మత్స్యకార ప్రాంతాల్లో గోతులు తవ్వి చలమల్లో ఊటనీరు పట్టుకుంటున్నారు. ఇక విద్యుత్ సరఫరాలేక కేజీహెచ్ సహా కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలందక రోగులు నరకం చవిచూస్తున్నారు. డీప్ ఫ్రిజ్‌లలో ఉంచాల్సిన మందులు పాడైపోతుండడంతో వెంటిలేటర్స్‌పై ఉన్న రోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇక ప్రతీ బాధిత కుటుంబానికి ఆహార పొట్లాలు-మంచినీళ్లు, అరలీటర్ పాలప్యాకెట్లు అందిస్తామని ఇచ్చిన హామీ కూడా నీటిమూటగానే మిగిలిపోయింది. మూడో రోజు కూడా ఇళ్లు నేలమట్టమైన మురికివాడల్లో సైతం ఎక్కడా పునరావాస చర్యలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాని పరిస్థితి. కొన్ని చోట్ల స్థానిక నాయకులు పంపిణీ చేస్తున్నా కట్టుబట్టలతో రోడ్డునపడ్డ నిర్వాసితులకు అందక అర్ధాకలితో అలమటిస్తున్నారు. మత్స్యకారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇళ్లన్నీ కుప్ప కూలిపోవడంతో వంటచేసుకునే వీలులేక రోడ్లపైనే సహాయం కోసం అర్థిస్తున్నారు. అందని ప్రభుత్వ సాయం ఐదులీటర్ల కిరోసిన్‌తోపాటు సాధారణ బాధితులకు 25కేజీల బియ్యం, మత్స్యకారులకు 50 కేజీల బియ్యం పంపిణీ యుద్ధప్రాతిపదికన చేపడతామన్న ప్రభుత్వం కనీసం నామమాత్రంగా కూడా శ్రీకారం చుట్టలేదు. నిత్యావసర ధరలు అందుబాటులోకి వచ్చినప్పటికీ డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆవేదనతో ఉన్న బాధితులు నిత్యావసరాలను లూటీ చేసే పరిస్థితి ఏర్పడింది. నగర వాసులకోసం వివిధ జిల్లాలను నుంచి ఏడు లారీలలో రప్పించిన నిత్యావసరాల్లో రెండు లారీల నిత్యావసరాలను జిల్లా పాలనా కేంద్రమైన కలెక్టరేట్‌వద్దే బాధితులు అందినకాడకి పట్టుకుపోవడం వారి ఆక్రందనకు అద్దంపడుతోంది. ఎన్డీఆర్ఎఫ్తోపాటు ఏపీ ఫైర్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది నేలకూలిన భారీవృక్షాలను రాకపోకలకు ఇబ్బందిలేకుండా తొలగించడంతో ఆర్టీసీ సిటీ సర్వీసులతోపాటు ఆటోలు కూడా రోడ్డెక్కాయి. ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మోడువారిన చెట్లు తొలగిస్తుండడంతో నగరంలో ఎక్కడా పచ్చదనం మచ్చుకైనా కన్పించే పరిస్థితి లేకుండా పోయింది. క్షేత్ర స్థాయిలో కొరవడిన పర్యవేక్షణ కేంద్ర రాష్ర్టమంత్రులతోపాటు ఎనిమిదిమంది ఐఏఎస్ అధికారులను నగరానికి డివిజన్ల వారీగా ఇన్చార్జిలుగా నియమించినా వారంతా నగరంలో మకాం వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు నగరాన్ని చూసేందుకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సేవలో ఉండడంతో క్షేత్రస్థాయిలో సహాయ పునరావాస చర్యలను పర్యవేక్షించే నాథుడు లేకుండా పోయారు. నెట్వర్కింగ్ లేకపోవడంతో ఏ మూల ఏ పనులు జరుగుతున్నాయో తె లుసుకునే వీలులేకుండా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే నెట్వర్క్ యాజమాన్యాల తీరుపై మండిపడడమే ఇందుకు నిదర్శనం. బీఎస్ఎన్ఎల్ సహా వివిధ నెట్‌వర్క్‌ల సిగ్నలింగ్ వ్యవస్థ కుప్పకూలడంతో ప్రజల మధ్య సెల్ కమ్యూనికేషన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఏటీఎంలు పనిచేయక చేతిలో ఉన్న కాస్త డబ్బులు అయిపోయి ఆర్థికంగా ఇక్కట్ల పాలవుతున్నారు. ఇక తమ కష్టార్జితం హుదూద్ విధ్వంసంలో సర్వనాశనమైనా భవిష్యత్‌పై గంపెడాశలతో ఉన్న ప్రజలు మాత్రం మనోనిబ్బరంతో రేపటి కోసం ముందడుగు వేస్తున్నారు. -
నాగావళి ఉగ్రరూపం
విజయనగరం: పైలీన్ తుపాను విలయాన్ని మర్చిపోకముందే శ్రీకాకుళం జిల్లాపై హుదూద్ దాడి చేసింది. నాగావళి నది ఉగ్రరూపం దాల్చడంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. శ్రీకాకుళం పట్టణంతో పాటు 11 తీర మండలాల్లోని 107 గ్రామాలకు ఇపుడు వరదముప్పు పొంచి ఉంది. వంశధారలోనూ నీటి ప్రవాహం కొద్దికొద్దిగా పెరుగుతోంది. గొట్టా బ్యారేజీ వద్ద సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు 47,462 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రస్తుతానికి వరద ముప్పు లేకపోయినా.. అప్రమత్తంగా ఉండాలని నదీతీరంలోని 11 మండలాలకు చెందిన 124 గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో తుపాను నష్టం సుమారు రూ.500 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా. 72 వేల హెక్టార్లలో పంటలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. విద్యుత్ పునరుద్ధరణకు మరో రెండురోజులు పడుతుందని చెబుతున్నారు. జిల్లాలో పలు ప్రధాన రోడ్లు, కాలువలకు గండ్లు పడ్డాయి. పక్కా ఇళ్లు, పూరిళ్లు అనే తేడాలేకుండా వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. హుదూద్ ధాటికి విజయనగరం జిల్లా అతలాకుతలమైంది. 70 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనావేస్తోంది. సుమారు రూ. 300 కోట్లు నష్టం ఉండవచ్చని ప్రాథమిక అంచనా. కొబ్బరి, అరటి తోటలతో పాటు వివిధ కూరగాయల పంటలు నే లమట్టమయ్యాయి. విద్యుత్ నష్టాల విలువ సుమారు రూ.20 కోట్లు దాటుతుందని అంచనా. చిన్నతరహా నీటి వనరులు కూడా దెబ్బతిన్నాయి. చెరువులకు గండ్లు పడితాగునీరు కూడా కలుషితమయింది. వందలాది కోళ్లు, పశువులు మృత్యువాత పడ్డాయి. ఇక మత్స్యకారుల బోట్లు, వలలు కొట్టుకుపోయాయి జీవనం భారమైపోయింది. -
కనీవినీ ఎరుగని నష్టం
తుపాను వచ్చివెళ్లాక ఉత్తరాంధ్ర ప్రాంతం, మరీ ముఖ్యంగా విశాఖ నగరం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నాయి. హుదూద్ చేసిన విధ్వంసం విస్తృతి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఈ తుపానువల్ల కోలుకోలేని నష్టం సంభవించింది. విశాఖ పేరు చెబితే గుర్తొచ్చే బీచ్ రోడ్డు, నిత్యం ఎంతో సందడితో కళకళలాడే జగదాంబ జంక్షన్, పూర్ణా మార్కెట్, సీతమ్మధార వంటివన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయి. వేలాదిమంది మత్స్యకార కుటుంబాలకు ఆలంబనగా ఉండే ఫిషింగ్ హార్బర్లో పెను విధ్వంసం చోటుచేసుకుంది. ఎటు చూసినా ధ్వంసమైన ఇళ్లు, భవనాలు, కూలిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, కొట్టుకుపోయిన రోడ్లు కనబడుతున్నాయి. ఆర్మీ, నేవీ, జాతీయ విపత్తు ఉపశమన దళం(ఎన్డీఆర్ఎఫ్)వంటివి రంగంలోకి దిగి చాలామంది ప్రాణాలను కాపాడ గలిగాయి. లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మృతుల సంఖ్య కనిష్ట స్థాయిలో ఉండటం వెనక వీరి కృషి ఉంది. అయితే, నిన్నటి రోజంతా ప్రాణాలు అరచేతబట్టుకుని మంచినీరూ, ఆహారం లేక అలమటించిపోయిన ప్రజలకు సోమవారం రాత్రి వరకూ ఎలాంటి సాయమూ అందలేదని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తాయి. ఈ వైపరీత్యాన్ని ఎదుర్కొనడానికి విస్తృత చర్యలు తీసుకున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పిన మాటలను వాస్తవం వెక్కిరిస్తున్నది. అలాంటి చర్యలే ఉన్నట్టయితే విశాఖలోని చాలా ప్రాంతాల్లో జనం ఆకలిదప్పులతో అలమటించాల్సిన దుస్థితి ఎదురయ్యేది కాదు. తుపాను వెలిశాక ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అంచనా లేకపోవడం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి రుజువు. కొందరు వ్యాపారులు అరచేయి ప్రమాణంలేని దోసె రూ. 70, డజను అరటిపళ్లు రూ. 150, ప్యాకెట్ పాలు రూ. 100 వరకూ విక్రయించారంటే... రోజంతా పస్తుండి, ఏదో ఒకటి దొరక్కపోతుందా కడుపాకలి తీరకపోతుందా అని రోడ్లపైకి వచ్చిన సామాన్యులు నిస్సహాయంగా వెనుదిరగాల్సివచ్చిందంటే దోపిడీ ఏ స్థాయిలో ఉన్నదో అంచనావేసుకోవచ్చు. నిన్నంతా కృషిచేసి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచిగానీ, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంనుంచిగానీ తెల్లారేసరికల్లా నిత్యావసరాలను బాధిత ప్రాంతాలకు తరలించివుంటే ఈ పరిస్థితిని నివారించడం సాధ్యమయ్యేది. కనీసం గొంతు తడుపుకోవడానికి మంచినీళ్లను అందించినా ప్రజలు ఆనందించేవారు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అటు ప్రధాని మోదీతోనూ, కేంద్రంలోని ఇతర ముఖ్యులతోనూ మాట్లాడి అందరినీ కదిలించారు. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే అధికార యంత్రాంగం హుదూద్ తాకిడి సమయంలోనూ, అటు తర్వాతా చేష్టలుడిగి ఉండిపోయిందని అర్ధమవుతుంది. ప్రకృతి వైపరీత్యాల ఆనవాళ్లను ముందుగా పసిగట్టి, అది సృష్టించగల విధ్వంసాన్ని అంచనావేసి ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప దాన్ని నివారించడం ఎవరికీ సాధ్యంకాదు. ఉన్నంతలో మనం చేయగలిగేదల్లా ప్రజలు ఆపదబారిన పడకుండా కాపాడటానికి ప్రయత్నించడమే. అది నిష్ర్కమించాక సహాయ చర్యలను సమర్ధవంతంగా చేపట్టడమే. సాంకేతిక విజ్ఞానం ఎంతగానో అభివృద్ధిచెందిన ప్రస్తుత సమయంలో దాన్ని సంపూర్ణంగా వినియోగించగలిగిన సామర్థ్యం ఉండాలి. సమాచారం అందిన వెంటనే ఎలాంటి అవరోధాలనైనా అధిగమించి ముందుకు దూసుకుపోగలిగిన సుశిక్షితులైన, మెరికల్లాంటి మనుషులుండాలి. వీరందరిమధ్యా సరైన సమన్వయాన్ని సాధించగలిగే వారుండాలి. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు అలాంటి సమన్వయ సాధనలో తలమునకలై ఉండాలి. కానీ, చంద్రబాబు విశాఖ నగరం వెళ్లి సమీక్షించాక ఈ విషయంలో ఎన్ని లోటుపాట్లున్నాయో బయటపడ్డాయి. విశాఖ నగరవాసులే సహాయ చర్యల విషయంలో ఫిర్యాదు చేస్తున్నారంటే ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఏపాటి సాయం అందిందో ఊహించడం కష్టమేమీ కాదు. హుదూద్ కారణంగా వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. దీనికితోడు విశాఖ హార్బర్లో నిల్వ చేసిన వేలాది టన్నుల ఎరువులు తడిసి ముద్దవడంతో రబీ అవసరాలను తీర్చడం అసాధ్యం కావొచ్చునని, పర్యవసానంగా తుపాను నష్టం పెద్దగా లేని ఇతర జిల్లాల్లో పంటలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తుపాను ప్రాంతాల పర్యటనకు వచ్చే ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వ్యవసాయరంగానికి వచ్చిపడిన ఈ ముప్పును ప్రత్యేకించి తెలియజెప్పి తగిన సహాయసహకారాలను పొందాలి. ప్రకృతి వైపరీత్యాలను నివారించే శక్తి మనకు లేకున్నా మనం తీసుకునే కొన్ని ముందు జాగ్రత్తలతో అవి మహోగ్రరూపం దాల్చకుండా చేయవచ్చు. అభివృద్ధి పేరిట సాగుతున్న కార్యకలాపాలు సముద్ర తీరాన్ని కాలుష్యమయం చేసి జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పరిశ్రమల వ్యర్థాలన్నీ సముద్రంలోనే కలుస్తున్నాయి. దాదాపు వేయి కిలోమీటర్ల మేర ఉన్న తీరప్రాంతం దెబ్బతినకుండా చూసేందుకు కోస్టల్ రెగ్యులేటరీ జోన్(సీఆర్‌జడ్) నిబంధనలున్నా వాటి అమలును పట్టించుకుంటున్నవారు లేరు. పర్యావరణ విధ్వంసం ఫలితంగానే తుపానులు, వాయుగుండాలు, భారీ వర్షాలు క్రమేపీ పెరుగుతున్నాయని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఇప్పుడు సంభవించిన విపత్తునుండి కోలుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న కార్యకలాపాలను అదుపుచేయడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. తమ విధానాల్లోని లోపాలను సవరించుకోవాలి. జనావాసాలను ముంచి లక్షలాదిమంది ప్రాణాలకు ముప్పు తీసుకురావడంతోపాటు ఆహారపంటలను దెబ్బతీస్తున్న ఇలాంటి వైపరీత్యాలను అరికట్టడానికి ఇది తప్పనిసరి. హుదూద్ తుపాను సృష్టించిన విలయంలో అంతర్లీనంగా ఉన్న హెచ్చరిక ఇదే. -
విశాఖలో పనిచేయని సెల్ఫోన్లు
విశాఖపట్నం: హుదూద్ పెను తుఫాన్ నుంచి విశాఖ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తుపాను తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. క్రమంగా ఈదురుగాలులు తగ్గి వాతావరణం సాధారణ స్థితికి వస్తోంది. తుఫానుతో అతలాకుతలమైన విశాఖలో సోమవారం ఉదయం సహాయక చర్యలు మొదలయ్యాయి. ప్రభుత్వ బలగాలతో పాటు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు విశాఖలో నష్టాన్ని అంచనా వేసేందుకు తొమ్మిది ప్రత్యేక బృందాలు నగరంలో మకాం వేశాయి. మరోవైపు నగర ప్రజలు ఇళ్లనుంచి బయటకు వస్తున్నారు. తాగునీరు, నిత్యావసరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల కోసం జనాలు అవస్థలు పడుతున్నారు. ఇక అపార్ట్మెంట్లు, సెల్లార్లలో వర్షపునీరు నిలిచింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగ్‌లు కూలిపోయాయి. తుఫాను దాటికి సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలటంతో నగరం అంధకారంలోనే ఉంది. దాంతో సెల్ఫోన్లు కూడా పనిచేయటం లేదు. -
విశాఖ విలవిల
తీరమా..ఘోరమా.. చెదిరిన విశాఖ ముఖచిత్రం విశాఖ చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రకృతి విలయం హుదూద్ ప్రభావంతో ఉక్కిరి బిక్కిరి పెనుగాలులతో బీభత్సం,కుండపోతగా వర్షం జల దిగ్బంధంలో జిల్లా, నగరం పూడిమడక వద్ద తీరం దాటిన తుఫాన్ కరెంటు లేక అంతటా చిమ్మ చీకట్లే ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు ముగ్గురు వ్యక్తులు మృత్యువాత వేలాదిగా వృక్షాలు నేల మట్టం,భారీ విధ్వంసం బస్సు,రైలు, విమాన సర్వీసులన్నీ రద్దు హైవేలో ఎక్కడి వాహనాలు అక్కడే.. ‘పయోధర ప్రచండ ఘోష, ఝంఝానిల షడ్జధ్వానం’ విశాఖను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ‘హుదూద్’ పెను తుఫాన్ రూపంలో ప్రకృతి విసిరిన జల ఖడ్గం సుందర సాగర తీరాన్ని ఛిన్నాభిన్నం చేసింది. జిల్లా యావత్తూ అతలాకుతలం అయింది. దాదాపు 24 గంటలకుపైగా జనజీవనం స్తంభించి, జల జీవనంగా మారింది. ఎటు చూసినా చెట్లు కూలిన దృశ్యాలు, కరెంటు తీగలు తెగిపడిన విద్యుత్ స్తంభాలు, మొండి గోడలుగా మారిన పూరిళ్లు, శ్లాబులతో సహా నేల వాలిన పక్కా గృహాలు, ధ్వంసమైన వందలాది కార్లు, ద్విచక్రవాహనాలు..దర్శనమిస్తున్నాయి. రోడ్లపై వందలాది మూగజీవాల మృత కళేబరాలు పడి ఉన్నాయి. జిల్లాలోని తీరప్రాంతమంతా ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలతో, హోరు గాలులతో భీకరాకారం దాల్చింది. శనివారం అర్ధరాత్రి మొదలైన ‘హుదూద్’ ప్రభావం ఆదివారం తెల్లవారుజామయ్యే సరికి విలయంగా మారింది. కాళరాత్రిగా మారి చెవులు చిల్లులు పడేలా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులకు తోడు కుండపోతగా భారీ వర్షం కురిసింది. ఈ భయానక వాతావరణం దాదాపు 20 గంటలకుపైగా కొనసాగింది. విశాఖ చరిత్రలో తొలిసారిగా ఇలాంటి ప్రకృతి బీభత్సం చోటు చేసుకుంది. ముందే అధికార యంత్రాంగం మేలుకోవటంతో జననష్టం నివారించగలిగినా, ఆస్తి నష్టంభారీగానే జరిగింది. బంగాళాఖాతంలో జిల్లా నడిబొడ్డు పూడిమడకలో తీరం దాటిన వేళ ప్రచండ గాలులు భయకంపితుల్ని చేశాయి. సాక్షి, విశాఖపట్నం : గంటా, రెండు గంటలా? ఏకంగా 20 గంటల పాటు విశాఖ వణికిపోయింది. చెవులు చిల్లులుపడేలాంటి హోరుగాలులు, కుంభవృష్టితో హుదూద్ తుపాన్ విలయతాండవం చేసింది. చెట్లు, విద్యుత్ స్థంభాలను నేలకూల్చింది. అడుక్కో చెట్టు, స్తంభం కూల్చేసి అడుగు ముందుకు పడకుండా అడ్డుకట్టవేసింది. ఎన్నో ఇళ్లు, భవనాలను నేలమట్టం చేసేసింది. ముగ్గురిని మింగేసింది. అందరినీ ప్రాణభీతిలో అల్లాడించింది. ఒక్కమాటలో చెప్పాలంటే విశాఖ చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత బీభత్సాన్ని సృష్టించింది. అందాల నగరాన్ని కకావికలం చేసింది. ఇది మన వైజాగేనా? అనుకునేంత అందవిహీనంగా మార్చేసింది. వెరసి విశాఖ వాసులకు హర్రర్ సినిమాలో సన్నివేశాలను ప్రత్యక్షంగా చూపించింది! శనివారం అర్థరాత్రి నుంచే మొదలైన హదూద్ వికృతరూపం ఆదివారం ఉదయానికి మరింత ఉధృతమైంది. గంటగంటకూ ఉగ్రరూపం దాల్చడం మొదలైంది. మధ్యాహ్నానికి తీరం దాటే సమయంలో మరింత బీభత్సం సృష్టించింది. తీరం దాటాక ఫర్వాలేదనుకున్న వారికి ఆ ఆశలు తల్లకిందులు చేస్తూ విధ్వంసకాండను కొనసాగించింది. పెనుగాలులు ఒకపక్క చెట్లు, స్తంభాలు కూలుతుండగా, మరోపక్క ఇళ్ల పైకప్పుల రేకులు అరటి ఆకుల్లా ఎగిరిపడ్డాయి. ఎక్కడ చూసినా ఇవి ఆకాశంలో నాట్యం చేస్తూ కనిపించాయి. కిటికీల అద్దాలు, తలుపులు, ఇళ్లలోని వస్తువులు ధ్వంసమయ్యాయి. ఈ బీభత్సానికి పిల్లాపాపలతో ప్రాణాలరచేతిలో పెట్టుకుని ఇళ్లలోనే బందీలయ్యారు. శనివారం అర్థరాత్రి నుంచే విద్యుత్ సరఫరా లేక బయట ఏం జరుగుతుందో టీవీల ద్వారా తెలుసుకోలేకపోయారు. ఫోన్ల ద్వారానైనా తెలుసుకుందామంటే నెట్వర్క్ సమస్యతో అవికూడా మూగబోయాయి. కానీ విశాఖలో హదూద్ సృష్టిస్తున్న విలయానికి తమ వారికి ఏంజరుగుతుందోనన్న భయంతో దూర ప్రాంతాల్లో ఉన్న వారు అతికష్టంపై క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. దుకాణాలు, హోటళ్లు, సినిమాహాళ్లు, మూతపడ్డాయి. ముందస్తు హెచ్చరికలతో రైళ్లు, బస్సు సర్వీసులు ఎక్కడివక్కకే నిలిచిపోయాయి. రైల్వే, బస్స్టేషన్లు బోసిపోయాయి. ఆటోలు, ఇతర వాహనాలు తిరిగే సాహసం చేయలేకపోయాయి. రోడ్లపై మనుషులకు బదులు చెట్లు, స్తంభాలే కనిపించాయి. మరోవైపు అడుగడుగుకీ చెట్లు కూలిపోయాయి. అనేకచోట్ల రోడ్లు తెగిపోయాయి. అత్యవసర పనులపై బయటకు వచ్చిన ఎంతదూరమైనా కాలినడకే శరణ్యమైంది. అయినా ఏ ముప్పు ముంచుకొస్తుందోనన్న భయం వెంటాడింది. ఇక హైవేపై కూలిన చెట్లు పడకేసినట్టుగా కనిపించాయి. ఒక్క వాహనం కూడా వెళ్లకుండా అడ్డుకట్టవేశాయి. ఇలా అన్ని వైపులా హుదూద్ విజృంభించి విశాఖను అష్టదిగ్బంధనం చేసింది. విద్యుత్ సరఫరా లేక ఇటు నగరం, అటు జిల్లా అంధకారంలో మగ్గిపోయి శతాబ్దం కిందటి రోజులను మళ్లీ గుర్తుకు తెచ్చింది. జిల్లాలో పరిస్థితి కూడా భయానకంగానే ఉంది. హుదూద్ ధాటికి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేల ఎకరాల్లో వరిపంట నీట మునగగా, చెరకు పంట పెనుగాలుల తీవ్రతకు నేలవాలింది. తుపాన్ తీరం దాటినట్టుగా భావిస్తున్న అచ్యుతాపురం మండలం పూడిమడక ప్రాంతంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. తీరం దాటే సమయానికి తుపాను ఉధృతికి అక్కడ స్థానికులు, సహాయక చర్యల్లో ఉన్న అధికారులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఎన్నో తుపాన్లను చవిచూసిన విశాఖ నగర, జిల్లా వాసులు హుదూద్ తుపాన్ అంతటి విపత్కర పరిస్థితిని ఎన్నడూ చవిచూడలేదంటూ ఆవేదన చెందుతున్నారు. ముగ్గురు మృత్యువాత కాగా హుదూద్ తుపాను కారణంగా ఆదివారం ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో విశాఖ నగరంలోని రామ్‌నగర్ ప్రాంతంలో గాలులకు ఎగిరిపడ్డ రేకు పడి గుర్తు తెలియని వ్యక్తి మృత్యువాతపడ్డాడు. పద్మనాభం మండలం బీఆర్ పాలవలసలో వర్షం నీటిలో జారిపడి ఎర్రయ్య (58) మరణించాడు. అనకాపల్లి మండలం కూండ్రంగిలో చంద్రవతి అనే మహిళ మరణించింది. -
పలు రైళ్ల ర ద్దు.. దారి మళ్లింపు
కాజీపేట రూరల్ : రైల్వే రవాణపై హుదూద్ ప్రభావం పడింది. భారీ తుపాన్ కారణంగా ఆదివారం కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లే ప లు రద్దు కాగా మరికొన్ని రైళ్లు దారి మళ్లిం చారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దైయిన రైళ్లు ఇవే.. భువనేశ్వర్ నుంచి ముంబయి వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11020), ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019), విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్ (22203), సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్ (22204), హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ (12728), విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727), సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గరీభ్థ్ ్రఎక్స్‌ప్రెస్ (12740), నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్లే నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (18510) రద్దయిన ట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దారి మళ్లించిన రైళ్లు.. నాందేడ్ నుంచి సంబల్పూర్ వెళ్లే సంబల్‌పూ ర్ ఎక్స్‌ప్రెస్ (18310 ) వయూ విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉండగా వయా బల్లార్షా మీదుగా... హైదరాబాద్ నుంచి హౌరా వెళ్లే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18640 )వయా బల్లార్షా మీదుగా, హైదరాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్ (12704) వయా బల్లార్షా మీదుగా దారి మళ్లించారు. కాజీపేటలో హెల్ప్‌లైన్ ఏర్పాటు హుదుద్ ప్రభావం నేపథ్యంలో కాజీపేట జంక్షన్లో హెల్ప్‌లైన్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. 0870-2576430, రైల్వే నంబర్ 82660కు ఫోన్ చేయూలని రైల్వే అధికారులు ప్రయూణికులకు విజ్ఞప్తి చేశారు. -
గండం గడిచింది
తప్పిన హుదూద్ ముప్పు ఊపిరి పీల్చుకున్న రైతులు, తీరప్రాంతవాసులు రెండు రోజుల పాటు భారీ వర్షసూచన బందరు నుంచి తుపాను గమనం పరిశీలన మచిలీపట్నం : హుదూద్ తుపాను గండం తప్పింది. హుదూద్ పెను తుపాను ఆదివారం విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద తీరాన్ని దాటినప్పటికీ జిల్లాపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఆదివారం మొత్తం ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం కురవలేదు. భారీ వర్షం కురిస్తే పంట పొలాలు మునిగిపోతాయనే భయంతో ఉన్న రైతులు గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నారు. తుపాను ప్రభావం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలపై అధికంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న బంధువుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. తుపాను ప్రభావంతో జిల్లా పరిధిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మంగినపూడి బీచ్‌తో పాటు హంసలదీవి వద్దకు పర్యాటకులను అనుమతించలేదు. కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణ జిల్లాలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలో విసృ్తత ఏర్పాట్లు చేశారు. నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మోపిదేవి, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాలకు ప్రత్యేకాధికారులను నియ మించారు. ప్రత్యేకాధికారులంతా మండల కేంద్రాల్లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి తెలియజేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు అధికారులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, నిత్యావసర సరుకులు, మందులను సిద్ధంగా ఉంచారు. మచిలీపట్నం రాడార్ కేంద్రం నుంచి సమాచారం విశాఖపట్నంలో పెను తుపాను కారణంగా అక్కడి రాడార్ కేంద్రంలో సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో మచిలీపట్నంలోని రాడార్ కేంద్రం నుంచి తుపాను గమన వివరాలను హైదరాబాద్, ఢిల్లీలోని వాతావరణ కేంద్రాలకు పంపారు. తుపాను తీరం దాటిన అనంతరం భూమిపై దాని ప్రభావం ఉంటుందని, అయితే కృష్ణా జిల్లాలో ఈ ప్రభావం తక్కువగా ఉందని మచిలీపట్నం రాడార్ కేంద్రం అధికారి తెలిపారు. తుపాను ప్రభావంతో కోస్తా తీరం వెంబడి రెండు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. -
తప్పిన ముప్పు
రేపల్లె హమ్మయ్య.. జిల్లాకు హుదూద్ తుఫాను ముప్పు తప్పింది. ఎప్పుడేం జరుగుతుందోనని శనివారమంతా ఆందోళన చెందిన తీరప్రాంత వాసులు ఆదివారం మధ్యాహ్నం తుపాను విశాఖ సమీపాన తీరం దాటిందని, జిల్లాపై దాని ప్రభావం పెద్దగా ఉండదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం ఉదయం మాత్రం సముద్రతీరంలో అలలు ఎగసిపడ్డారుు. దీంతో నిజాంపట్నం హార్బర్లో లంగరేసిన బోట్లు ఏమవుతాయోనని మత్స్యకారులు ఆందోళన చెందారు. ఆకాశం మేఘావృతమై కొద్దిపాటి ఈదురుగాలులు వీచినా వర్షం లేకపోవడంతో ఊరట చెందారు. నిజాంపట్నం హార్బర్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరో రెండు రోజులపాటు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. సూర్యలంక ప్రశాంతం.: బాపట్ల రూరల్: విశాఖ జిల్లాలో హుదూద్ తుఫాన్ తీరం దాటిన సమయంలో సూర్యలంక తీరం వద్ద 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్రంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్ శాఖాధికారులు తీర ప్రాంత గ్రామాల్లో మకాం వేసి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. అగ్నిమాపక శాఖాధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తీరం వద్ద గస్తీ నిర్వహించారు. తీర ప్రాంతంలోకి ఎవరూ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం కావడంతో కొందరు పర్యాటకులు సూర్యలంక తీరం వద్దకు వచ్చారు. పోలీసులు అనుమతించకపోవడంతో వెనుదిరిగారు. -
ప్రళయ భీకరం!
అంచనావేసినట్టే పెను తుపాను హుదూద్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరప్రాంతాల వాసులను భయకంపితుల్ని చేసింది. అది తీరం దాటుతుండగా 200 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులతో, దాంతోపాటు వచ్చిన కుండపోత వర్షాలతో ఉత్తరాంధ్ర, మరీ ముఖ్యంగా విశాఖ నగరం చిగురుటాకులా వణికాయి. గోదావరి జిల్లాల తీరప్రాంతాలు కూడా గణనీయంగా దెబ్బతిన్నాయి. ప్రచండమైన గాలులతో కరెంటు స్తంభాలన్నీ కూలిపోగా, అపార్టుమెంట్లు కూడా బీటలువారి అందులో నివాసముంటున్నవారు భయభ్రాంతులయ్యారు. ఏదో ఉన్మాదం ఆవహించినట్టు సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంపొడవునా పలుచోట్ల జనావాస ప్రాంతాలవైపు సముద్ర జలాలు చొచ్చుకొచ్చాయి. ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఆసరాగా నిలవడంతో... జాతీయ విపత్తు ఉపశమన దళం (ఎన్డీఆర్ఎఫ్), ఆర్మీ, నేవీ బలగాలు రంగంలోకి దిగడంతో ప్రాణనష్టం కనిష్ట స్థాయికి పరిమితమైంది. అయితే, ఆస్తి నష్టం మాత్రం అపారంగా ఉన్నట్టు వివిధ ప్రాంతాలనుంచి అందుతున్న సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. హుదూద్ తీరందాటింది గనుక రానున్న 72 గంటలూ అధికార యంత్రాంగానికీ, ప్రజలకూ పరీక్షా సమయం. ఇంతవరకూ వచ్చిన కుండపోత వర్షాలను మించిన వర్షాలు కురుస్తాయంటున్నారు. కనుక అధికార యంత్రాంగం మరింత అప్రమత్తతతో మెలగాల్సి ఉంటుంది. రవాణా సదుపాయాలన్నీ దెబ్బతిన్న ప్రస్తుత తరుణంలో ఇదంతా కత్తి మీది సాము. ఈసారి తుపానుపై కేంద్ర ప్రభుత్వంకూడా చురుగ్గానే కదిలింది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించడంతో పాటు యూపీలోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరపాల్సిన పర్యటనను కూడా వాయిదా వేసుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించడం బాగానే ఉన్నా ఇతర ప్రాంతాల ప్రజలకు సంబంధించి మరికొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఉదాహరణకు కుండపోత వర్షాలు, పెనుగాలుల కారణంగా ఎవరూ వెలుపలకు రావొద్దని అధికారులు ఇప్పుడు సూచిస్తున్నారుగానీ వారి ఇతర అవసరాల గురించి తీసుకున్న ముందు జాగ్రత్తలేమిటి? బయటికొచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చుగనుక కనీసం నాలుగు రోజులకు సరిపడా మంచినీరు, ఇతర నిత్యావసరాలు అందుబాటులో ఉంచుకోవాలని ముందే చెప్పి, చైతన్యపరిస్తే... అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసివుంటే ఉపయోగమయ్యేది. సముద్రం మీదికి వెళ్లొద్దని మత్స్యకారులకు చేసే హెచ్చరికల తరహాలోనే ఇవి కూడా ఉండాలి. ఒకపక్క నిమిషం కూడా తెరిపి ఇవ్వకుండా కురుస్తున్న వర్షాలకు తోడు మనిషిని సైతం విసిరిపారేసేంతగా పెనుగాలులు వీస్తుండటంతో వణుకుతున్న జనం చాలాచోట్ల కనీసం గొంతు తడుపుకోవడానికి నీళ్లులేక, కూరగాయలు అందుబాటులో లేక అవస్థలుపడుతున్నారని ఆ ప్రాంతాలనుంచి సమాచారం అందుతున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివారు బయటికెళ్లినా లభ్యమయ్యేది ఏమీ ఉండదు. గాలీ, వానా ఉపశమిస్తే తప్ప వారికి సాయం అందజేయడం అధికారులకు సాధ్యమయ్యేలా లేదు. ఇక ముందస్తు వైద్య సదుపాయాల పరిస్థితీ అదే. ఇక ఆ ప్రాంతాల్లోని తమ ఆప్తులు ఎలా ఉన్నారో తెలుసుకుందామని ప్రయత్నించే వారికి ఎమర్జెన్సీ నంబర్లంటూ ఇచ్చినవేమీ అక్కరకు రాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. పుష్కరకాలం క్రితం ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే తుపానులు ఇప్పుడు ఏడాది పొడవునా పలకరిస్తున్నాయి. వాయుగుండాలు, అకాల వర్షాలు సరేసరి. ఇలా వైపరీత్యాలు సర్వసాధారణంగా మారినప్పుడు సహాయ కార్యక్రమాలకు సంబంధించి కూడా శాశ్వత ప్రాతిపదికన తగిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సివుంది. ఈ యంత్రాంగం ఏడాది పొడవునా సంభవిస్తున్న తుపానులు... ఆ సందర్భంగా ముందుజాగ్రత్తల్లోగానీ, సహాయ చర్యల్లోగానీ వెల్లడైన లోటుపాట్లను అధ్యయనం చేస్తే మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి శాశ్వత యంత్రాంగం లేకపోబట్టే ఆంధ్రా యూనివర్సిటీలాంటి చోట కూడా హాస్టల్ విద్యార్థులు పస్తులతో గడపాల్సివచ్చిందని గుర్తుంచుకోవాలి. ప్రతియేటా అక్టోబర్-నవంబర్ నెలల మధ్య వచ్చే తుపానులతో రైతాంగం కుదేలవుతున్నది. అదునుకు వర్షాలు పడక మొన్నటివరకూ రైతులు ఆదుర్దాపడ్డారు. చివరకు ఎంతో కొంత లోటుతో వానాకాలం ముగిసిందని ఊపిరిపీల్చుకునేంతలో హుదూద్ వచ్చిపడింది. ఈ పెనుతుపాను ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోని వేలాది ఎకరాల వరి, చెరకు, జొన్న, పత్తి పంటలను, కూరగాయల సాగును దెబ్బతీసిందని అంటున్నారు. సెల్ టవర్లు ధ్వంసమై కమ్యూనికేషన్ల వ్యవస్థ కుప్పకూలడంతో, ముఖ్యంగా రాడార్ కేంద్రం సైతం పనిచేయకపోవడంతో జరిగిన నష్టాన్ని అంచనావేయడం అసాధ్యంగా మారిందని అధికార వర్గాలు చెబుతున్న మాట. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో తుపాను కారణంగా వేలాది విద్యుత్ స్తంభాలు కూలడంతో ఆ ప్రాంతమంతా అంధకారం అలముకుంది. తుపాను పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది గనుక ఇప్పుడు జరిగిన నష్టంపై వెనువెంటనే సవివరమైన నివేదిక సమర్పించి తగిన సాయాన్ని పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషిచేయాలి. అలాగే, పంట నష్టపోయిన రైతాంగానికి సుదీర్ఘకాలం నిరీక్షిస్తే తప్ప పరిహారం దక్కడంలేదు. పైలిన్, హెలెన్, లెహర్, నీలం తుపానుల్లో కలిగిన నష్టానికి ఎంతో ఆలస్యంగా... అది కూడా అరకొరగా పరిహారం అందజేశారు. కౌలు రైతులదైతే అత్యంత దయనీయమైన స్థితి. పంట నష్టపోయినప్పుడు వారికి దక్కేదేమీ ఉండదు. విపత్తులు సంభవించినప్పుడు తీసుకునే చర్యలే కాదు... అనంతరకాలంలో చేపట్టాల్సిన ఇలాంటి చర్యల విషయంలో కూడా ప్రభుత్వాలు శ్రద్ధవహించాలి. -
అన్నివిధాలా సిద్ధం: ఏపీ సీఎం
హుదూద్ బాధితుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1100 హైదరాబాద్: తుపానుతో కలిగే నష్టాన్ని కనిష్ట స్థాయిలో ఉంచడానికి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పా రు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం గా ఉన్నట్లు తెలిపారు. హుదూద్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, ‘క్రౌడ్ సోర్సింగ్’ పేరిట నూ తన విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. శనివారం లేక్‌వ్యూ క్యాంపు కార్యాలయంలో ఏర్పా టుచేసిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడా రు. తుపాను బాధితులకు సహాయం, అవసరమైన సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1100 ఏర్పాటు చేశామని చెప్పారు. సచివాలయం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల అధికారులతో సీఎం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడానికి వీలుగా ఢిల్లీ నుంచి 120 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విమానంలో శనివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. వారు జిల్లాలకు తరలివెళ్లడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నాలుగు జిల్లాల్లో 19 ఎన్టీఆర్ఎఫ్ బృందాలు మోహరించారుు. -
ఒడిశాలో తీవ్ర ప్రభావం!
సహాయ కార్యక్రమాలు ప్రారంభం భువనేశ్వర్ (ఒడిశా): హుదూద్ ప్రభావం ఒడిశాలోని నాలుగు జిల్లాలపై తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై గంజాం, గజపతి, మల్కన్‌గిరి, కొరాపుట్ జిల్లాల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తుపాను పరిస్థితిపై కేబినెట్ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి మేరకు ఐదు హెలికాప్టర్లను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలను ఒడిశా ప్రభుత్వం ప్రారంభిం చింది. రాష్ట్రం మీదుగా వెళ్లే రెండు విమానాలు, 39 రైళ్లు రద్దయ్యూరుు. కోరాపుట్, మల్కాన్‌గిరి, నవరంగ్‌పూర్, రాయగడ, గజపతి, గంజాం, కల హండి, కాంధమాల్ జిల్లాల కలెక్టర్లు ప్రజలను తరలించే విధుల్లో నిమగ్నమైనట్టు ప్రత్యేక సహాయ కమిషనర్ పి.కె.మొహాపాత్ర చెప్పారు. సుమారు 3.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిపారు. -
పంజా విసురుతున్న హుదూద్
-
అక్టోబర్ టైర్రర్
కష్టాల తీరంలో సిక్కోలు విలవిల * ప్రతి ఏటా తుపాన్ల దాడి.. తీవ్ర నష్టం * ప్రస్తుత హుదూద్ దిశ మారితే జిల్లాకు కష్టమే * ఇప్పటికే అల్లకల్లోలంగా సముద్రం * ఎగిసిపడుతున్న అలలు * ముందుకు చొచ్చుకొస్తున్న సాగరం * కంటిమీద కునుకు కరువైన తీరగ్రామాలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తుపాన్ల ధాటికి శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. దాదాపు ప్రతి ఏటా పంటలు చేతికొచ్చే సమయంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు పంటలను, ఆస్తులను ఊడ్చేస్తున్నాయి. ఫలితంగా జిల్లా ఆర్థికంగా చితికిపోతోంది. ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్‌లో పెను విలయం సృష్టించిన పై-లీన్ తుపాను తొలుత కళింగపట్నం వద్దే తీరం దాటుతుందని అంచనా వేశారు. అయితే అది దిశ మార్చుకుని ఒడిశాలోని గోపాల్పూర్ వైపు మళ్లింది. అదే విధంగా ప్రస్తుతం కమ్ముకొస్తున్న హుదూద్ తుపాను విశాఖ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నా తీరం దాటే సమయంలో దిశ మార్చుకునే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. వాస్తవానికి కోస్తా తీరంలో ఇప్పటివరకు 43 తుపాన్లు సంభవించినట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తీరం దాటే సమయంలో ఇవి విధ్వంసం సృష్టిస్తుంటాయి. జిల్లాలోనూ పలు మార్లు తుపాన్లు తీరం దాటాయి. వాస్తవానికి అక్టోబర్‌లో వచ్చే తుపాన్లు నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుపాన్ల కంటే బలహీనమైనవిగా వాతావరణశాఖ చెబుతోంది. నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయి ఈశాన్యం వచ్చే క్రమంలో తుపాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరో రెండు రోజుల్లో తీరం దాటనున్న హుదూద్ తుపాన్ ప్రభావం ఎలా ఉంటుందోనన్న సిక్కోలు వాసులు గజగజలాడిపోతున్నారు. తరుముకొస్తున్న హుదూద్ విశాఖ సమీపానికి అతివేగంగా దూసుకొస్తున్న తీవ్ర పెనుతుపాను శనివారం నుంచి జిల్లాపై ప్రభావం చూపనుంది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతోఆపటు గంటకు 130 నుంచి 150 కి.మీ వేగంతో భీకర గాలులు వీచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన సముద్రం మరింత భీకర రూపం దాల్చి ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. ఇప్పటికే కళింగపట్నం పోర్టులో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హుదూద్ ప్రభావం మరింత తీవ్రమైతే సమాచార వ్యవ స్థ కుప్పకూలడం ఖాయమని, పక్కా ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, విద్యుత్ స్తంభాలు పడిపోతాయని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే వెళ్లినవారు వెనక్కు తిరిగి వచ్చేయాలని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు, తీరం ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈనెల 11, 12 తేదీల్లో జరగనున్న జన్మభూమి సభలను రద్దు చేయడంతోపాటు విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. తుపాను షెల్టర్లు, పునరావాస కేంద్రాలను సిద్ధం చేయడంతోపాటు వాటిలో ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతున్నారు. 70 గ్రామాల నుంచి సుమారు లక్ష మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు అవసరమైన వాహనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక ఆర్మ్డ్ ఫోర్సు బృందం ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. నేటి నుంచి భారీ వర్షాలకు అవకాశం పెను తుపాను తీరం వైపు దూసుకొస్తుండటంతో శనివారం నుంచి భీకర గాలులతోపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. కాగా శుక్రవారమే జిల్లాలో ఆకాశం మబ్బుపట్టింది. స్వల్పంగా గాలులు మొదలయ్యాయి. కళింగపట్నం సహా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. -
తరుముకొస్తోంది
కోస్తా ప్రాంతాలపై పంజా విసురుతున్న హుదూద్ పెను తుపానుగా రూపాంతరం విశాఖకు 460 కి.మీ., గోపాల్‌పూర్‌కు 510 కి.మీ. దూరంలో కేంద్రీకృతం సిద్ధంగా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ దళాలు 4 యుద్ధ నౌకలు, 6 విమానాలు, 6 హెలికాప్టర్లు, గజ ఈతగాళ్లు రెడీ ఆహారం, టెంట్లు, మందులు, ఇతరత్రా సామగ్రి సిద్ధం నేడు పాఠశాలలకు సెలవు.. పరిశ్రమలు రాత్రి షిఫ్టు రద్దు చేయాలని ఆదేశాలు విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, ఒడిశా కోస్తా ప్రాంతాలపై పెను ఉప్పెన పంజా విసురుతోంది. తీవ్రరూపం దాల్చిన హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలను హడలెత్తిస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో పోర్ట్‌బ్లెయిర్ వద్ద మొదలైన హుదూద్ తుపాను శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు తీవ్ర తుపానుగా రూపుదాల్చింది. విశాఖపట్నంకు 460 కి.మీ. దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు పశ్చిమ ఉత్తర దిశలో 510 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 10 కి.మీ. వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. రానున్న 12 గంటల్లో తుపాను తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం సమీపంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. రానున్న 24 గంటల్లో హుదూద్ తుపాను గమనం ఏమాత్రమైనా మారితే విశాఖపట్నంకు తూర్పు ఉత్తర దిశగా 30 కి.మీ. నుంచి 60 కి.మీ. దూరంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై ఇప్పుడే అధికారికంగా ఏమీ చెప్పలేమని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే విశాఖపట్నం సమీపంలోనే తీరాన్ని తాకే అవకాశాలున్నాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ రాంచంద్రావు తెలిపారు. తుపాను నష్టం తీవ్రంగా ఉండే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీరాన్ని దాటే ప్రాంతంలో కొండలు ఉన్నందువల్ల హుదూద్ తీవ్రత కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. తీవ్ర విధ్వంసం తప్పదా!? హుదూద్ తుపాను ఇదే తీవ్రతతో ఉంటే తీరాన్ని దాటే సమయంలో పెను ఉప్పెనతో విరుచుకుపడి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం కొన్నిచోట్ల ముందుకు వచ్చింది. గాలుల తీవ్రత పెరిగింది. తుపాను తీరాన్ని దాటే సమయంలో అత్యంత భారీ వర్షాలు, పెను గాలులతో బీభత్సాన్ని సృష్టించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి తుపాను తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచి సాధరణ స్థాయిలో వర్షాలు మొదలై, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, దక్షిణ ఒడిశాలలో 12.50 సెం.మీ. నుంచి 24.40 సెం.మీ. వరకు అతి భారీ వర్షపాతం నమోదు కావచ్చు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా సాధారణ నుంచి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం తీరం దాటే సమయంలో గంటకు 130 కి.మీ. నుంచి 150 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ఆ ప్రాంతాలకు రాకపోకలను వాయిదా వేసుకోవాలని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. రాష్ట్రంలో కృష్ణపట్నం తప్ప మిగిలిన అన్ని పోర్టుల్లోనూ మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం హుదూద్ తుపాను ప్రళయ భీకరంగా విరుచుకుపడుతుందన్న సంకేతాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, రక్షణ శాఖ బలగాలు సహాయ, పునరావాస చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బలగాలు రంగంలోకి దిగాయి. విశాఖపట్నం జిల్లాకు 6 బెటాలియన్లు, విజయనగరం జిల్లాకు ఒక బెటాలియన్, శ్రీకాకుళం జిల్లాకు రెండు బెటాలియన్ల ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపించారు. ఒక్కో బెటాలియన్‌లో 40 మంది ఉంటారు. నేవీ అధికారులు కూడా 30 రెస్క్యూ టీంలను విశాఖపట్నంలో సిద్ధంగా ఉంచారు. అవసరాన్ని బట్టి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కడికైనా వెళ్లేందుకు ఇవి పూర్తి పరికరాలతో సర్వసన్నద్ధంగా ఉన్నాయి. సహాయక చర్యల కోసం 4 యుద్ధ నౌకలు, 6 ఎయిర్ క్రాఫ్ట్‌లను తూర్పు నావికాదళం సిద్ధంగా ఉంచింది. నేవీ, ఎయిర్ఫోర్స్లకు చెందిన 6 హెలికాప్టర్లను సిద్ధం చేశారు. రెండు ఆర్మీ బెటాలియన్లు కూడా శనివారం ఉదయానికి విశాఖపట్నం చేరుకోనున్నాయి. ఆర్మీ బలగాల తరలింపు కోసం 36 వాహనాలను సిద్ధం చేశారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తూర్పు నావికా దళం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యా సంస్థలకు సెలవు తుపాను దృష్ట్యా అధికారులు విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. తీరప్రాంతాలకు సమీపంలో ఉన్న పరిశ్రమలు శనివారం రాత్రి షిఫ్ట్‌లను రద్దు చేయాలని ఆదేశించారు. -
తీరం.. కల్లోలం...
హుదూద్ ఎఫెక్ట్ ఎగసిపడుతున్న అలలు మత్స్యకారుల వేటకు బ్రేక్ కోడూరు : ‘హుదూద్’ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కోడూరు మండలంలోని పాలకాయతిప్ప సమీపాన శుక్రవారం సముద్రపు అలలు రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతూ భయాందోళనలు కలిగిస్తున్నాయి. సముద్రం కాస్త ముందుకు చొచ్చుకు వచ్చింది. సాగర సంగమం వద్ద అలలు కృష్ణమ్మ పాదాలను తాకుతున్నాయి. సముద్ర ప్రాంతమంతా గోతులు ఏర్పడ్డాయి. అలల ధాటికి సాగర సంగమ ప్రాంతానికి వెళ్లే రహదారి కోతకు గురైంది. సాయంత్రం సముద్రంపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతోప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తమ పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. అధికారులు హుదూద్ తీవ్రరూపం దాల్చి, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడంతో తీరప్రాంతాల ప్రజలు 1977, నవంబర్ 19 తేదీన వచ్చిన దివిసీమ ఉప్పెనను గుర్తు చేసుకుని వణికిపోతున్నారు. వచ్చే నెల 17కు దివిసీమ ఉప్పెన వచ్చి 37ఏళ్లు పూర్తవుతుందని, మళ్లీ ఈ తరుణంలో హుదూద్ దూసుకొస్తోందని తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తీర ప్రాంతాల్లో భయం..భయం.. హుదూద్ ప్రభావం ఎలా ఉంటుందోనని కోడూరు మండలలోని హంసలదీవి, పాలకాయతిప్ప, రామకృష్ణాపురం, ఊటగుండం, ఇరాలి, జార్జీపేట, చింతకోళ్ల తదితర తీరప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఆదివారం లేక సోమవారం తుపాను తీరం దాటుతుందని అధికారులు చెప్పడంతో ఏ ప్రమాదం జరుగుతుందోనని వణికిపోతున్నారు. పాలకాయతిప్పలోని మత్య్సకారులు వేటకు వెళ్లకుండా వలలు అల్లుకునే పనిలో నిమగ్నమయ్యారు. భారీ వర్షాలు కురిస్తే వరి పైరు కూడా దెబ్బతింటుందని రైతులు చెబుతున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : హుదూద్ తుపాను దృష్ట్యా తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి, సోషల్ వెల్ఫ్‌ర్ డీడీ మాధుసుదనరావు సూచించారు. ఆయన శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తీర ప్రాంతాల గురించి తహశీల్దార్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో చిక్కుకున్న బోటు మచిలీపట్నం : హుదూద్ తుపాను ప్రభావం మచిలీపట్నంపై పడింది. ఓ బోటు సముద్రంలో చిక్కుకుంది. సాధారణంగా గిలకలదిండి హార్బర్ నుంచి దాదాపు 90 బోట్లు చేపలవేటకు వెళుతూ ఉంటాయి. హుదూద్ తుపాను ప్రభావం నేపథ్యంలో సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లను వెనక్కి రావాలని మత్స్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాలర్లు బోటుతో గిలకలదిండి హార్బర్‌కు సమీపంలోకి వచ్చే సరికి సముద్రం పాటుకు వెళ్లింది. దీంతో గిలకలదిండి హార్బర్ ముఖద్వారం వద్ద శుక్రవారం బోటును లంగరు వేసి నిలిపివేశారు. ఈ బోటులో డ్రైవర్ సురేష్, జాలర్లు యషియా, నరసింహం, వెంకటేశ్వరరావు, చిన నరసింహం, మరో ముగ్గురు ఉన్నారు. శనివారం ఉదయం 9గంటల వరకు వీరు బయటకు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం సముద్రం ప్రశాంతంగానే ఉందని, ఈ రాత్రికి ఏం జరుగుతుందోనని భయంగా ఉందని బోటు డ్రైవర్ సురేష్ ‘సాక్షి’కి తెలిపారు. -
హుదూద్ టై
రేపు మధ్యాహ్నం విశాఖ సమీపంలో తీరం దాటే అవకాశం జిల్లా యంత్రాంగం అప్రమత్తం కంట్రోల్ రూముల ఏర్పాటు రంగంలోకి భద్రతా బలగాలు నేడు విద్యా సంస్థలకు సెలవు పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు జిల్లాకు పెనుముప్పు పొంచి ఉంది. పెను తుపాను రూపంలో హుదూద్ శరవేగంగా దూసుకొస్తోంది. విశాఖకు సుమారు 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం మధ్యాహ్నానికి విశాఖ సమీపంలో తీరం దాటే అవకాశముంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక చర్యలకు సర్వసన్నద్ధంగా ఉంది. ఇప్పటికే నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. విశాఖ రూరల్ : హుదూద్ తీవ్ర పెనుతుపానుగా మారి మనవైపే దూసుకువస్తోంది. నగరం పరిసరాల్లోనే తీరం దాటుతుందనే వాతావరణ నిపుణుల సమాచారం కొంత కలవరపరుస్తోంది. వాస్తవానికి తుపానులు చాలాసార్లు ఏర్పడినా మనకు చేరువుగా తీరం దాటడం ఇదే ప్రప్రథమం. మునుపెన్నడూ ఇ లా విశాఖ వైపు దూసుకొచ్చిన సందర్భాలు లేవు. భౌగోళికంగా చుట్టూ ఉన్న కొండలు, సముద్ర అడుగు భాగంలో ఉన్న ప్రత్యేకమైన సహజ నిర్మాణం తుఫానును విశాఖ తీరానికి రాకుండా చేస్తున్నాయి. అనుకున్నట్టుగా హుదూద్ విశాఖ సమీపాన తీరం దాటితే చరిత్రే. జిల్లాలో పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ, గాజువాక, పెదగంట్యా డ, విశాఖ అర్బన్, విశాఖ రూరల్, భీమిలి మొత్తం 11 కోస్తా తీర మండలాలు ఉన్నాయి. వీటితో పాటు 16 మండలాలపై హుదూద్ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.వీటిలో 50 తీర ప్రాంత గ్రామాలకు తుపాను ప్రమాదం పొంచి ఉంది. 1967 నుంచి గత ఏడాది వరకు వచ్చిన తుపాన్లు ఏ ఒక్కటీ విశాఖ మీదుగా తీరం దాటలేదు. కానీ తుపాన్ల ధాటికి జిల్లా అతలాకుతలమైంది. అటువంటిది ఈ హుదూద్ విశాఖ మీదుగా తీరం దాటుతుండడంతో ఎటువంటి ఉపద్రవాన్ని మోసుకొస్తుందోనని అందరిలో ఆందోళన నెలకొంది. తీరం దాటే సమయంలో గాలులు గంటకు 140 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. సముద్రం 1.5 మీటర్ ముందు వస్తుంది. ఈ తీవ్రతను ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రెండు కంపెనీల మిలటరీ బలగాలు కూడా జిల్లాకు వస్తున్నాయి. 30 నేవీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఆరు ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లు జిల్లా నుంచి తుపాను ప్రభావిత మండలాలకు పయనమయ్యాయి. నేడు పునరావాస కేంద్రాలకు తరలింపు తుపాను ప్రభావిత, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు శనివారం ఉదయం నుంచి తరలిస్తారు. జిల్లాలో మొత్తం 125 పునరావాస కేంద్రాలను గుర్తిం చినప్పటికీ అవసరాన్ని బట్టి తొలి దశలో 40 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలో 10 మండలాల్లో 57 గ్రామాల నుంచి 89,776 మంది 40 పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి కేంద్రం వద్ద డిప్యూటీ తహశీల్దార్‌ను ఇన్చార్జ్గా నియమించారు. ఇప్పటికే ఈ కేంద్రాలకు బియ్యం, పప్పు, తాగునీరు, మందులు, ఇతర సదుపాయాలను సిద్ధం చేశారు. భారీ గాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగే అవకాశాలు ఉండడంతో వెంటనే వాటిని తొలగించడానికి జేసీబీలు, క్రేన్లు సిద్ధంగా ఉంచారు. భారీగా భద్రతా దళాలు :కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా దశలు జిల్లాకు చేరుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2 కంపెనీల మిలటరీ బలగాలను జిల్లాకు పంపిస్తోంది. శనివారం ఉదయానికి 36 వాహనాల్లో ఇవి జిల్లాకు రానున్నాయి. వీటికి అచ్యుతాపురంలో చేశారు. 30 నేవీ బృందాలు తమ సామగ్రితో సిద్ధంగా ఉన్నాయి. ప్రతి బృందంలో అయిదుగురు ఈతగాళ్లు ఉన్నారు. వీటితో పాటు జిల్లాకు నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినప్పటికీ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని భావించి మరో రెండు టీమ్‌లను జిల్లాకు కేటాయించారు. ఒక్కో బృందంలో 40 మంది సభ్యులు ఉండనున్నారు. ఈ టీమ్‌లు శనివారం ఉదయానికి 15 ప్రభావిత ప్రాంతాలకు చేరుకోనున్నాయి. వీటితో పాటు హైదరాబాద్ నుంచి రాష్ర్ట స్థాయి విపత్తు నిర్వహణ బృందం జిల్లాకు రానుంది. ఫైర్‌మెన్ టీమ్‌లను కూడా సిద్ధం చేశారు. హెలికాప్టర్లు సిద్ధం : అత్యవసర పరిస్థితుల కోసం జిల్లాలో 5 నేవీ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. వరదలప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వారికి ఆహారాన్ని అందించే విషయంలో వీటిని వినియోగించనున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మరో హెలికాప్టర్ కూడా హైదరాబాద్‌లో సిద్ధంగా ఉంది. రవాణా వ్యవస్థపై ప్రభావం : హుదూద్ తుఫాన్ ప్రభావం రైళ్లపై పడింది. ఎలాంటి విపత్తు సంభవించినా తూర్పు కోస్తా రైల్వే సర్వసన్నద్దంగా వుందని ఆశాఖ ప్రకటించింది. అన్ని మేజర్ రైల్వే స్టేషన్లలో కంట్రోల్ గదులను ఏర్పాటు చేసింది. విశాఖ మీదుగా నడిచే రైళ్లను రద్దు చేసింది. విశాఖ నుంచి బయలుదేరే రైళ్లు కూడా రద్దయ్యాయి.ముందుజాగ్రత్తగా శనివారం కూడా కొన్నింటిని రద్దు చేసింది. పలు రైళ్లను ఖరగ్‌పూర్, ఝార్సుగుడ, రాయపూర్, నాగపూర్ మీదుగా దారిమళ్లించారు. 12న విశాఖపట్నం, విజయనగరం, రాయగడ, పలాస, కోరాపుట్‌ల నుంచి బయలుదేరాల్సిన అన్ని పాసిం జర్ రైళ్లను రద్దు చే శారు. 12న ఆర్టీసీ బస్సులను నడిపే విషయంపై ఆ రోజు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోనునున్నారు. రిజర్వాయర్లపై దృష్టి : ప్రస్తుతం జిల్లాలో 7 జలాశయాల్లో నీటి మట్టాలు 50 శాతం తక్కువగానే ఉన్నాయి. భారీ వర్షాలు కురిసినా వెంటనే రిజర్వాయర్ల గేట్లు ఎత్తే అవకాశం లేదు. వాటి కింద గ్రామాలకు ప్రస్తుతానికి ఎటువంటి భయం లేదు. అయితే స్థానికంగా భారీ వర్షాలు పడితే ఇన్‌ఫ్లోను బట్టి నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. నేడు విద్యా సంస్థలకు సెలవు : పెను తుపాను నేపథ్యంలో శనివారం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలకు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ సెలవు ప్రకటించారు. యాజమాన్యాలు ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని సూచించారు. తీరప్రాంతంలో ఉన్న పరిశ్రమలు శనివారం రాత్రి షిఫ్ట్ నిర్వహించకూడదని ఆయా సంస్థలకు, ప్రధానంగా బ్రాండిక్స్‌కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సిద్ధంగా ఉన్నాం ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. ఈ నెల 12న భారీ వర్షాలతో పాటు గాలులు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. సముద్రం 1.5 మీటర్లు ముందు వస్తుంది. లోతట్టు ప్రాం తాల ప్రజలను శనివారం ఉదయం నుంచి 40 పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ ఎఫ్, ఫైర్‌మెన్, పోలీసులు, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు. ప్రజలు కూడా సహకరించాలి. - డాక్టర్ ఎన్.యువరాజ్, కలెక్టర్ ఏర్పాట్లు ఇలా... 274 మంది ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్, ఆహారం, పాలు, బ్రెడ్ సరఫరాకు ఏర్పాట్లు చేశారు. తుపాను కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించడం వల్ల గ్యాస్, కిరోసిన్, పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉండడంతో ప్రతి మండల కేంద్రంలో వీటిని సిద్ధంగా ఉంచుతున్నారు. 300 గ్యాస్ సిలిండర్లతో ఒక లారీ, 12 కిలోలీటర్లతో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పాలు ట్యాంకర్లు ప్రతి మండల కేంద్రంలో ఉండనున్నాయి. జిల్లాలో అన్ని మండలాల్లో వైర్లెస్ సెట్లు రెడీ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన 14 శాటిలైట్ ఫోన్లలో 8 జిల్లాలో వినియోగించనున్నారు. వర్షాలు, గాలులకు నెలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు 43 జేసీబీలను, 36 ట్రీ కటర్లను, 32 రంపాలను, 46 ట్రాక్టర్లను, 35 గన్నీ బ్యాగ్ సప్లయిర్లను సిద్ధం చేశారు. -
విశాఖకు పొంచి ఉన్న పెను తుఫాను
ఆంద్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు పెను తుఫాను ముప్పు పొంచి ఉంది. 'హుదూద్' తుఫాను ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి గురువారం రాత్రిలోపు తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయానికి అది పెను తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 12వ తేదీన విశాఖపట్నం- గోపాల్పూర్ మధ్య ఇది తీరాన్ని తాకే అవకాశం ఉంది. దాంతో 11వ తేదీన గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. తుఫాను తీరం దాటే సమయంలో అయితే గాలుల వేగం గంటలకు 130-150 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అన్ని ప్రధాన పోర్టుల్లో రెండోనెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఈనెల 11వ తేదీ నుంచే తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. దాంతో ఏపీ, ఒడిశాలకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం పంపిది. విశాఖకు నాలుగు మిలటరీ దళాలను కూడా పంపింది.