గండం గడిచింది
- తప్పిన హుదూద్ ముప్పు
- ఊపిరి పీల్చుకున్న రైతులు, తీరప్రాంతవాసులు
- రెండు రోజుల పాటు భారీ వర్షసూచన
- బందరు నుంచి తుపాను గమనం పరిశీలన
మచిలీపట్నం : హుదూద్ తుపాను గండం తప్పింది. హుదూద్ పెను తుపాను ఆదివారం విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద తీరాన్ని దాటినప్పటికీ జిల్లాపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఆదివారం మొత్తం ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం కురవలేదు. భారీ వర్షం కురిస్తే పంట పొలాలు మునిగిపోతాయనే భయంతో ఉన్న రైతులు గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నారు.
తుపాను ప్రభావం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలపై అధికంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న బంధువుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. తుపాను ప్రభావంతో జిల్లా పరిధిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మంగినపూడి బీచ్‌తో పాటు హంసలదీవి వద్దకు పర్యాటకులను అనుమతించలేదు.
కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణ
జిల్లాలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలో విసృ్తత ఏర్పాట్లు చేశారు. నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మోపిదేవి, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాలకు ప్రత్యేకాధికారులను నియ మించారు. ప్రత్యేకాధికారులంతా మండల కేంద్రాల్లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి తెలియజేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు అధికారులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, నిత్యావసర సరుకులు, మందులను సిద్ధంగా ఉంచారు.
మచిలీపట్నం రాడార్ కేంద్రం నుంచి సమాచారం
విశాఖపట్నంలో పెను తుపాను కారణంగా అక్కడి రాడార్ కేంద్రంలో సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో మచిలీపట్నంలోని రాడార్ కేంద్రం నుంచి తుపాను గమన వివరాలను హైదరాబాద్, ఢిల్లీలోని వాతావరణ కేంద్రాలకు పంపారు. తుపాను తీరం దాటిన అనంతరం భూమిపై దాని ప్రభావం ఉంటుందని, అయితే కృష్ణా జిల్లాలో ఈ ప్రభావం తక్కువగా ఉందని మచిలీపట్నం రాడార్ కేంద్రం అధికారి తెలిపారు. తుపాను ప్రభావంతో కోస్తా తీరం వెంబడి రెండు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.