తిరుపతి కార్పొరేషన్ : హుదూద్ సృష్టించిన పెను తుపానుతో నిరాశ్రయులుగా మిగిలిన విశాఖ జిల్లా బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ పిలుపునిచ్చారు. బాధితులను వైద్య పరంగా ఆదుకునేందుకు తిరుపతి శ్రీసాయిసుధా మల్టీ ఆసుపత్రి, శ్రీరాళ్లపల్లి రాఘవ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా రూ.2.12 లక్షల విలువైన మందులు ఏర్పాటు చేశారు. వీటిని హాస్పిటల్ డెరైక్టర్లు డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి సమక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ ద్వారా విశాఖపట్నంకు శుక్రవారం తరలించారు.
ఈ కార్యక్రమాన్ని చిత్తూరు ఎంపీ శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రజల మనసు గొప్పదని నిరూపించారన్నారు. ఎంపీగా తన రెండు నెలల జీతంతో పాటు నిధులను కూడా బాధితులకు కేటాయిస్తామన్నారు. డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ విశాఖలోని బాధితులకు అండగా నిలిచేందుకు ప్రతి డాక్టర్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తమ వంతుగా రూ.2.12 లక్షల విలువైన పెయిన్ కిల్లర్లు, యాంటి బయాటిక్స్, డ్రెస్సింగ్ మెటీరియల్స్, సిరప్‌లు, ఎనర్జీ డ్రింక్‌లు, ప్రొటీన్ పౌడర్లు, సెలైన్ బాటిల్స్, డయేరియా వంటి వ్యాధులకు మందులు అందించామన్నారు. డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, డాక్టర్ శ్రీహరి, డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు ఐఎంఐ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో దంపూర్తి భాస్కర్, కృష్ణాయాదవ్, ఆర్‌సీ మునికృష్ణ, పత్తిపాటి వివేక్, దుగ్గాని జయరామ్ పాల్గొన్నారు.
హుదూద్ బాధితులను ఆదుకుందాం
Published Sat, Oct 18 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM
Advertisement