tirupati corporation
-
ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి: ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో మరోసారి ఏపీ సత్తా చాటింది. తిరుపతి కార్పొరేషన్ జాతీయ అవార్డు దక్కించుకుంది. పులివెందుల మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు లభించింది. విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లు, పుంగనురు, సాలూరు అవార్డులు దక్కించుకున్నాయి. గత ఏడాదిలానే ఈ ఏడాది ఏపీకి ఆరు అవార్డులు దక్కాయి. అక్టోబర్ 2న అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్ తెలిపారు. చదవండి: అందుకే హెల్త్ యూనివర్శిటికీ వైఎస్సార్ పేరు.. వాస్తవాలివిగో.. -
అరరే.. తిరుపతిలో పరువు పాయే!
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి శృంగభంగమే ఎదురైంది. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, యువనేత భూమన అభినయ్‌రెడ్డి రాజకీయ చతురత ముందు సైకిల్ తునాతునకలైంది. భవిష్యత్‌లో తామే ఎమ్మెల్యే అభ్యర్థులమని చెప్పుకునే నేతలు సైతం ఓటమిపాలయ్యారు. సొంత డివిజన్లో గెలుపు వాకిట చేరకమునుపే బొక్కబోర్లా పడ్డారు. ఒక్క ఎన్నికతో మాజీ ఎమ్మెల్యే, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, తెలుగు యువత.. తదితర నేతల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టేసినట్టయ్యింది. సాక్షి, తిరుపతి: ఆధ్యాత్మిక నగరంలో దాదాపు 19 ఏళ్ల తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. మేయర్ పీఠంపై రాజకీయ పార్టీలు ఆసక్తి ప్రదర్శించాయి. 50 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో 49 డివిజన్లలో ఎన్నికలు నిర్వహిస్తే, అందులో 48 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. తెలుగుదేశం పార్టీ ఒక్క డివిజన్‌కే పరిమితమైంది. 22 డివిజన్లు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవంగా దక్కాయి. ఎన్నికలు జరిగిన 27 డివిజన్లలో 26 డివిజన్లలో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. తండ్రికి తగ్గ తనయుడు తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలను ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తన కుమారుడు భూమన అభినయ్‌రెడ్డికి అప్పగించారు. ప్రత్యక్షంగా కార్పొరేషన్ ఎన్నికల్లో పాల్గొన్న ఆయన 4వ డివిజన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్ పరిధిలో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టిసారించారు. 27 మంది పోటీ చేస్తే అందులో 25 మంది విద్యాధికుల్ని ఎంపిక చేశారు. ఇందులో ముగ్గురు వైద్యులు, ఏడుగురు బీటెక్, ముగ్గురు పోస్టు గ్రాడ్యుయేట్స్, 12 మంది గ్రాడ్యుయేట్స్ ఉండడం గమనార్హం. తాజా ఫలితాల్లో ఒక్కరు మినహా విద్యాధికులంతా విజేతలుగా నిలిచారు. యువనేత ముందు చూపు, రాజకీయ చతురతతోనే అద్భుత ఫలితాలు సాధించారని విశ్లేషకులు పేర్కొన్నారు. చదవండి: (ప్రజలు నమ్మటంలేదు.. మనపని అయిపోయింది..) టీడీపీ నేతల పరువు గల్లంతు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ నేతల పరువు గల్లంతైంది. నియోజకవర్గం, పార్లమెంటు, రాయల సీమ స్థాయి నేతలుగా చెప్పుకుంటున్న వారంతా, వారివారి డివిజన్లను కూడా దక్కించుకోలేక పోయారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మను మరాలు వెంకటకీర్తి 18వ డివిజన్లో బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. టీడీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, తుడా మాజీ చైర్మన్, టీడీపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు నరసింహయాదవ్ తమ్ముడు కృష్ణాయాదవ్ 3వ డివిజన్లో బరిలోకి దిగి ఓడిపోయారు. దాదాపు 1,081 ఓట్ల తేడాతో ప్రత్యర్థి చేతిలో చిత్తయ్యారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ భార్య జ్యోత్స్న 15వ డివిజన్లో పోటీచేసి ఓడిపోయారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టౌన్‌బ్యాంక్ మాజీ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి మద్దతుతో నిలిచిన అభ్యర్థులకూ శృంగభంగమే ఎదురైంది. తిరుపతిలో ఉనికి చాటుకునేందుకు నిత్యం అధికార పార్టీపై బురదచల్లే నవీన్‌కుమార్‌రెడ్డి తమ్ముడు భువన కుమార్‌రెడ్డిని స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దింపి భంగపడ్డారు. 31వ డివిజన్లో మబ్బు దేవనారాయణరెడ్డి బలపరిచిన పుష్పలత సైతం ఓటమిని చవిచూశారు. టౌన్‌బ్యాంక్ మాజీ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి సొంత డివిజన్ అయిన 26వ డివిజన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఎవరికి వారు ఉద్ధండులమని చెప్పుకునే నాయకులను ప్రజలు తిరస్కరించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. చదవండి: హిందూపురంలో బాలయ్యకు ఓటు దెబ్బ సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు.. మనస్తాపం చెంది! -
తిరుపతి తీర్పుతో విపక్షాల్లో వణుకు!
సాక్షి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ కైవశం చేసుకుంది. ఇక్కడ భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తిరుపతి కార్పొరేషన్లో విపక్షాలన్నీ సాధించిన ఓట్ల కంటే రెట్టింపు ఓట్లను పొంది వైఎస్సార్సీపీ విజయ బావుటా ఎగురవేయడం గమనార్హం. టీడీపీ, బీజేపీ–జనసేన ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్‌తోపాటు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలు పొందారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నూ అత్యధికులు వైఎస్సార్సీపీ అభిమానులే నెగ్గారు. తిరుపతి కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ, బీజేపీ, జనసేన లోపాయికారీ ఒప్పందంతో పరస్పరం మద్దతిచ్చుకున్నా ఫలితం లేకపోవడంతో ఉప ఎన్నికలపై తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ► తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 22 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఎన్నికలు జరిగిన 27 డివిజన్లలో వైఎస్సార్సీపీకి 47,745 ఓట్లు వచ్చాయి. టీడీపీ 18,712, బీజేపీ 2,546, జనసేన 231, సీపీఎం 1,338, సీపీఐ 619 ఓట్లు రాబట్టుకున్నాయి. ► సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 14 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 6,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ 2,380, బీజేపీ 874 ఓట్లు రాబట్టుకున్నాయి. ► నాయుడుపేట మున్సిపాలిటీలో 22 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 1,735 ఓట్లు వచ్చాయి. టీడీపీ 178, కాంగ్రెస్ 345 ఓట్లు దక్కించుకున్నాయి. ► వెంకటగిరి మున్సిపాలిటీలో 3 వారుల్ని వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా సాధించింది. 22 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 16,883 ఓట్లు లభించాయి. టీడీపీ, 8,369, బీజేపీ 41, జనసేన 202, సీపీఐ 43 ఓట్లు రాబట్టుకున్నాయి. శ్రీకాళహస్తి, గూడూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. -
చెత్త విద్యుత్‌కు షాక్
⇒‘చెత్త విద్యుత్’ ప్రాజెక్టుకు బాలారిష్టాలు ⇒ప్లాంట్‌కు అనుమతుల నిరాకరణ ⇒ఎస్టీ కాలనీ ఉండటమే కారణం ⇒మరో స్థలం కోసం అన్వేషణ రూ.200 కోట్ల భారీ ప్రాజెక్టుకు నేష నల్ పొల్యూషన్ బోర్టు మొకాలడ్డు వేసింది. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ (చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్రాజెక్టు) ను తిరుపతి కార్పొరేషన్ ప్రతిష్టాత్మకం గా చేపట్టింది. చంద్రగిరి మండలం శానంబట్ల సమీపంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయలని భావించింది.స్థల సేకరణ పూర్తయింది. పనుల ప్రారంభం కోసం రంగం సిద్ధం చేసుకునే సమయంలో బ్రేక్ పడింది. ప్లాంట్ నిర్మాణానికి ఈ ప్రాంతం అనువైంది కాదని, నిబంధనలకు విరుద్ధంగా ఉందని నేషనల్ పొల్యూషన్ బోర్టు అనుమతులను నిరాకరించింది. తిరుపతి తుడా: తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలో రోజు కు 192 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తవుతోంది. దీని సేకరణే ఓ సవాల్‌గా మారింది. ఇక సేకరించిన చెత్త గుట్టలు గుట్ట లుగా పేరుకుపోతోంది. కొతంకాలం వరకు తగులబెట్ట డం, మరి కొన్నాళ్లు పూడ్చేయడం వంటివి చేశారు. తద్వారా నీరు, భూమి, గాలి కాలుష్యం అవుతుండటంతో ఈ విధానానికి చెక్ పెట్టారు. తడి, పొడి చెత్తను వేరుచేసి కొంతవరకు వినియోగంలోకి తీసుకొచ్చారు. అయినా సగం నిల్వ ఉండటంతో పూర్తిస్థాయిలో చెత్తను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు భావించారు. ఢిల్లీ ప్రభుత్వం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తోంది. 90 శాతం చెత్తను కనుమరుగు చేయడంతోపాటు తద్వారా తక్కువ ధరకే విద్యుత్ అందిస్తోంది. ఇదే తరహాలో చెత్తనుంచి విద్యుత్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులు భావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపారు. గ్రీన్ సిగ్నెల్ రావడంతో 2016 ఏప్రిల్‌లో ప్లాంట్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. అనుమతులు నిరాకరణ.. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను ఢిల్లీకి చెందిన జిందాల్ కంపెనీ దక్కించుకుంది. ఆ కంపెనీ ప్రభుత్వంతో అన్ని ఒప్పందాలు పూర్తి చేసుకుంది. ఎయిర్‌పోర్టు, నేషనల్ పొల్యూషన్ బోర్డు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. మార్చిలో ప్లాంట్ పనులు ప్రారంభించేలా ముహూర్తం ఖరారు చేసుకుంది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సకాలంలో అనుమతులు అందాయి. పొల్యూషన్ బోర్డు ప్రతినిధుల బృందం చంద్రగిరి మండలం శానంబట్ల సమీపంలోని 16.22 ఎకరాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ప్లాంట్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించింది. ఈ స్థలానికి కూతవేటు దూరంలో తాటికోన ఎస్టీ కాలనీ ఉండటంతో ప్లాంట్ ఏర్పాటును పొల్యూషన్ బోర్టు సభ్యులు వ్యతిరేకించారు. తమ చట్టం ప్రకారం ఈ ప్లాంట్ ఏర్పాటు చట్ట విరుద్ధమని,, నిబంధనలు ఒప్పుకోవని తేల్చేశారు. దీంతో మరో స్థలాన్ని వెతుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముచ్చటగా మూడోసారి.. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు స్థల సేకరణపై కార్పొరేషన్ దృష్టి సారించింది. ఇప్పటికే డంపింగ్ యార్డుగా వినియోగిస్తున్న రామాపురంలో తొలుత ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించారు. ఈ ప్రదేశం అనువైంది కాదని జిందాల్ తిరస్కరించింది. చంద్రగిరి సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. అప్పటి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ శానంబట్ల సమీపంలోని సర్వే నంబర్ 1505, 1507లలో 16.22 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్థలం ప్లాంట్‌కు అనువుగా ఉండటంతో కంపెనీ వేగంగా అడుగులు వేసింది. ఇంతలో పొల్యూషన్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో మరోసారి స్థలం వెతుకులాటలో కార్పొరేషన్ తనమునకలైంది. ముచ్చటగా మూడోసారి చంద్రగిరి మండలంలోని సీ.మామండూరు సమీపంలో ప్రభుత్వ భూమిని గుర్తించారు. తమకు ఇక్కడ స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. ఇదీ లక్ష్యం.. చెత్తను పూర్తి స్థాయిలో వినియోగించి, తద్వారా కార్పొరేషన్‌కు లబ్ధిచేకూర్చడమే లక్ష్యంగా ప్రణాళికలు చేశారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో చెత్తను సేకరించడం, దాచడం, వినియోగించడం కార్పొరేషన్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు కొన్ని వందల మెట్రిక్ టన్నుల చెత్త నిల్వ ఉంటోంది. ప్లాంట్ ఏర్పాటుకు ఈ చెత్త సరిపోకపోవడంతో చిత్తూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, వెంకటగిరి ప్రాంతాల నుంచి సేకరించేలా ఒప్పందం కుదిరింది. మొత్తంగా రోజుకు 374 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి, తద్వారా రోజుకు 6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. -
జేసీకి సన్మానం
కర్నూలు(అగ్రికల్చర్): బదిలీపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా వెళ్తున్న జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్‌ను శనివారం జిల్లా అధికారులు ఘనంగా సత్కరించారు. జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు, జిల్లా పరిషత్ సీఈఓ ఈశ్వర్, డీఎస్ఓ సుబ్రమణ్యం, వికలాంగుల శాఖ ఏడీ భాస్కరరెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సోమశేఖర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు జేసీని ఆయన చాంబరులో కలసి సన్మానించారు. -
అక్టోబర్‌లో.. తిరుపతి సమరం!
తిరుపతి తుడా : తిరుపతి కార్పొరేషన్‌కు అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు, పురపాలికశాఖా మంత్రి నారాయణ సూచనప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాల యంలో మంగళవారం రాష్ట్రంలోని గ్రేటర్ విశాఖతోపాటు అన్ని మున్సిపల్, కార్పొరేషన్ల కమిషనర్లతో సీఎం, మంత్రి వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో నాలుగేళ్లకు పైగా ఎన్నికలు జరగకుండా పలు సమస్యలతో పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై సుదీర్ఘంగా చర్చిం చినట్లు తెలిసింది. ఆయా మున్సిపాలిటీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ గ్రేటర్ విశాఖతోపాటు పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఇదేమాట చెప్పడంతో ఎన్నికలు అక్టోబర్‌లో తధ్యమని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక కార్పొరేషన్ అధికారులు ఎన్నికల నగరాకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అన్ని రంగాల్లో వ్యతిరేకత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం ఎన్నికల్లో నిర్వహిస్తే అన్నివర్గాల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేసినట్టు సమాచారం. రీజనల్ డెరైక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను విజయవాడకు పిలిపించుకున్న ముఖ్యమంత్రి ప్రధానంగా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపైనే సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. అధికారులు ఏం చెప్పలేక నీళ్లు నమిలినా.. చివరకు చెప్పక తప్పని పరిస్థితిలో రుణమాఫీలు, నిరుద్యోగభృతి, ఇతర సంక్షేమ పథకాల అమలు తీరుపై జనం మండిపోతున్నారని తెలిపారని సమాచారం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలతో పాటు, బలిజ, కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెప్పుకొచ్చారని తెలిసింది. అయితే ఎన్నికలు నిర్వహించకుంటే అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయనీ, అందువల్ల ఎన్నికలు పోవాల్సిందేనని చెప్పినట్లు తెలుస్తోంది. -
అధికారపార్టీకి ఎన్నికల భయం
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలకు అన్నీ సిద్ధం చేసిన అధికారులు సర్వేలో అధికార పార్టీకి ఎదురుగాలి ఎన్నికలు జరిపేందుకు వెనుకడుగు పార్టీలో గ్రూపు తగాదాలతో సతమతం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది తిరుపతి కార్పొరేషన్ పరిస్థితి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి రూ.వేల కోట్లు ఇస్తున్నా వాటిని రాబట్టుకోలేని స్థితిలో ఉంది. దీనికి కారణం కార్పొరేషన్‌కి పాలకవర్గం లేకపోవడం. అయితే ఓటమి భయంతో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. ఏదో ఒక కారణం చూపుతూ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. తాజాగా తిరుపతి నగరపాలక సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు సుమారు రూ.600 కోట్లకు పైగా నిలిచిపోయాయి. దీంతో నగరపాలక సంస్థ అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. తిరుపతి నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహిం చేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేసినా ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తోంది. రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఎన్నికలు నిర్వహించేందుకు రెండు నెలల సమయం అవసరమని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల క మిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇప్పటికే పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో ఎన్నికలు జరిపేందుకు అన్నీ ఏర్పాట్లు లోలోపల జరిగిపోయాయి. సర్వేలో ఎదురుగాలి తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై అధికారపార్టీ ఇటీవల నిఘా వర్గాలతో సర్వే చేయించినట్లు సమాచారం. ప్రస్తు తం ఎన్నికలు నిర్వహిస్తే ఎదురీత తప్పదని, ప్రజాగ్రహా నికి గురయ్యే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలు జరిపేందుకు తట పటాయిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతున్నట్లు సమాచా రం. దీంతో అధికార పార్టీ ఎన్నికలను జాప్యం చేయాల నే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. అధికార పార్టీలో గ్రూపు తగాదాలు కార్పొరేషన్ ఎన్నికలు జరపాలని అధికార పార్టీ ఓ దశలో యోచించినా పార్టీలో గ్రూపు తగాదాలు కలవరపెడుతున్నట్లు సమాచారం. నగరంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఓ బీసీ నేత మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు సమాచారం. ఓ వర్గానికి టిక్కెట్టు ఇస్తే మరో వర్గం సహకరించదేమోననే భయం నగర నేతలను వెంటాడుతోంది. దీంతో పార్టీ అధినేతలకు అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం కంటే వాయిదా వేయడం మేలనే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర నిధులు ఆగిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగినా ఫర్వాలేదు కానీ ఎన్నికల్లో ఓడిపోతే పరువుపోతుందని భావిస్తున్నారని సమాచారం. సీఎం సొంత జిల్లాలో ఎదురుగాలి వీస్తే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా చూపుతుందనే భావనలో ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద నగరపాలక సంస్థ ఎన్నికలు అధికార పార్టీకి కత్తిమీద సాములా మారాయి. -
లక్ష మెజార్టీ బాధ్యతను పెంచింది
తిరుపతి కార్పొరేషన్ భర్త చనిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న తనను తిరుపతి ప్రజలు ఉప ఎన్నికల్లో 1.16 లక్ష ల ఓట్లతో గెలిపించి పెద్ద బాధ్యత అప్పగించారని ఎమ్మెల్యేగా గెలిచిన మన్నూరు సుగుణమ్మ చారిత్రాత్మక విజయం అందించినందుకు తిరుపతి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే సుగుణమ్మ మీడియాతో మాట్లాడారు. బయటకు రాలేని పరిస్థితి లో ఎన్నికల్లోకి వచ్చిన తనపై తిరుపతి ఓటర్లు సానుభూతి చూపించారన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తనపై అభ్యర్థిని పోటీకి దింపకపోవడం, ఆ పార్టీ తిరుపతి నాయకుల సహకారంతో పాటు బీజేపీ, సీపీఎం, సీపీఐల మద్ధతుతో చారిత్రాత్మక విజ యాన్ని సొంతం చేసుకున్నానని తెలిపారు. అందుకు కారణమైన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చింతా మోహన్ స్వార్థంతో తనపై పోటికి అ భ్యర్థిని దింపడం, చనిపోయిన వ్యక్తిపై అవినీతి ఆ రోపణలు చేశారని వి మర్శించారు. దీనిని తిరుపతి ప్రజలు నమ్మకపోగా ఓటు ఆయుధం తో తీర్పు చెప్పారని తెలిపారు. తన భర్త ఆశయాలను నెరవేరుస్తామన్నారు. తిరుపతి ప్రజలు వేసవిలో నీటిఎద్దడి ఎదుర్కొంటున్నారని, ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి సమ స్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆమె వెంట కుటుంబ స భ్యులు, పార్టీ నాయకులు శ్రీధర్‌వర్మ, దంపూ రి భాస్కర్, డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఆశాలత, మునిశేఖర్, ఆముదాల తులసీరామ్, పు ష్పావతి, విజ యల క్ష్మి, లతారెడ్డి, గంగులయ్య ఉన్నారు. -
తుడా.. నేల విడిచి సాము
నేల విడిచి సాము చేయడమంటే ఇదే..! నిధుల లభ్యత .. ప్రజావసరాలను విస్మరించి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది. ఆ క్రమంలో నగరాభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరునగరిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నవంబర్ 6, 1981న ప్రభుత్వం తుడాను ఏర్పాటుచేసింది. తిరుపతి కార్పొరేషన్‌తోపాటు రేణిగుంట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, వడమాలపేట, రామచంద్రాపురం, ఏర్పేడు, పుత్తూరు మండలాల్లోని 160 గ్రామాలను తుడా పరిధలోకి తెచ్చింది. రియల్ ఎస్టేట్ లే-అవుట్లకు ఆమోదం, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) ద్వారా వచ్చే ఆదాయం, వాణిజ్య దుకాణాల అద్దెలు, టీటీడీ, వివిధ పద్దుల కింద ప్రభుత్వం విడుదల చేసే నిధులతో తుడా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. ఆ మేరకు ఏటా బడ్జెట్‌ను రూపొందించుకుని.. అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. కానీ.. తుడా తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. నిధుల రాబడి.. లభ్యతతో నిమిత్తం లేకుండా ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది. ఆ ప్రాజెక్టుల అమలుకు నిధులు లేకపోవడంతో చేతులెత్తేస్తోంది. ఇదే సమయంలో నగరాభివృద్ధికి దోహదం చేసే.. ప్రజాసమస్యలు పరిష్కరించే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. తిరుపతిలో ట్రాఫిక్ నానాటికీ అధికమవుతోండటంతో పాదచారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనం రద్దీ అధికంగా ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్, ఎస్వీ మహిళా కాలేజీల వద్ద సబ్‌వేలు, లీలా మహల్ జంక్షన్, అన్నమయ్య జంక్షన్ వద్ద పుట్ ఓవర్ బ్రిడ్జిలను రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించడానికి ఓ ప్రాజెక్టును తుడా సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టును 2012-2016 మధ్య కాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. కానీ.. ఇప్పటికి కేవలం శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద మాత్రమే సబ్వే నిర్మించారు. నిధులు లేకపోవడంతో తక్కిన వాటిని పక్కన పెట్టేశారు. తిరుపతిలో వసతి లేకపోవడంతో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఇది ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. దీన్ని నివారించేందుకు శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుచానూరు ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం వద్ద రూ.30 కోట్లతో మల్టీస్టోర్ పార్కింగ్ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి తుడా ప్రాజెక్టును రూపొందిం చింది. ఈ ప్రాజెక్టును 2012-2016 మధ్యన పూర్తిచేయాలని నిర్ణయించింది. కానీ.. నిధులు లేకపోవడంతో ఇప్పటికీ ఆ ప్రాజెక్టులను చేపట్టలేని దుస్థితి నెలకొంది. డెయిరీ ఫామ్ సర్కిల్ లెవల్ క్రాసింగ్ నుంచి ప్రకాశం రోడ్డు వరకు ఒకటి, రాయలచెరువు రోడ్డు లెవల్ క్రాస్ వద్ద మరొక రోడ్ ఓవర్ బ్రిడ్జి, అన్నమయ్య జంక్షన్ నుంచి తిరుచానూరు వైపు ఫ్లై ఓవర్‌ను రూ.90 కోట్లతో నిర్మించేందుకు రూపొందించిన ప్రాజెక్టునూ 2012-16లోగా పూర్తిచేయాలని నిర్ణయించింది. కానీ.. నిధులు లేకపోవడంతో ఆ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండును రూ.47 కోట్లతో అభివృద్ధి చేసే ప్రాజెక్టుతో పాటు ఎన్నో ప్రాజెక్టులు నిధుల్లేక చేపట్టలేని దుస్థితి నెలకొంది. మింగ మెతుకు లేదు గానీ.. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే తుడా అధికారులు మాత్రం ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ప్రాజెక్టులను రూపొందించి.. అమలుచేయలేక చతికిలపడుతుండటం గమనార్హం. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజూ 75 వేల మంది భక్తులు తిరుపతికి వస్తోన్న నేపథ్యంలో.. రవాణాను మెరుగుపర్చడానికి శ్రీకాళహస్తి-చంద్రగిరి మధ్య 53 కిమీల మేర బస్సులు ప్రయాణించడానికి మాత్రమే రూ.1020 కోట్లతో బస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్(బీఆర్టీఎస్)ను రూపొందించారు. ఈ ప్రాజెక్టును 2012-16లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కానీ.. ఆ మేరకు నిధులు అందుబాటులో ఉంటాయా అన్న ఆలోచన కూడా అధికారులు చేయకపోవడం గమనార్హం. తిరుపతి పరిసర ప్రాంతాల్లో శ్రీనివాసమంగాపురం, గోవిందరాజస్వామి ఆలయం, ఇస్కా న్ టెంపుల్, కపిలతీర్థం, అలిపిరి గేట్, అలివేలు మంగాపురంను కలిపేలా 22 కి.మీల మేర పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్(పీఆర్టీఎస్)ను రూ.1100 కోట్లతో చేపట్టే ప్రణాళికను సైతం 2012-16లోగా పూర్తిచేయాలని తుడా అధికారులు నిర్దే శించుకోవడం గమనార్హం. కానీ.. ఆ ప్రాజెక్టును చేపట్టేందుకు నిధులే అందుబాటులో లేవు. ఈ ప్రాజెక్టుల కథ ఇలా ఉంటే.. తాజాగా శ్రీకాళహస్తి నుంచి రాచగున్నేరి, ఏర్పేడు, రేణిగుంట, తిరుపతి, చంద్రగిరి మీదుగా పనపాకం వరకూ 53 కిమీల మేర రూ.2650 కోట్లతో కంప్యూటర్ రైల్ సిస్టమ్(సీఆర్ఎస్)ను చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును 2017-21 మధ్య కాలంలో పూర్తిచేయాలని నిర్దేశించడం కొసమెరుపు. -
కీళ్ల వాతానికి ఆధునిక వైద్యం
తిరుపతి కార్పొరేషన్: ‘ఒక్కోసారి కీళ్లవాతం సమస్య ఏర్పడితే చక్కని నడకను కోల్పోవడం, ఇతర దీర్ఘకాలిక రోగాలు తలెత్తుతాయి. పైగా వారి దినచర్యలు దెబ్బతింటాయి. తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. అలాంటి వారికి రుమటాలజి కీళ్లవాతానికి అందించే ఆధునిక వైద్య విద్యావిధానంతో కీళ్లు, ఎముకల, కండరాల సమతుల్యం ద్వారా తిరిగి చక్కని నడక, ఆరోగ్యం కల్పించవచ్చు’ అని ప్రముఖ రుమటాలజి వైద్యులు డాక్టర్ పీ.దామోదరం తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ కీళ్లు, ఎముకలు, కండరాల సమస్యల నివారణకు చక్కటి నడక, రోజూ వ్యాయామం చేయడం వలన కఠినమైన వ్యాధులు దూరం చేయవచ్చని తెలిపారు. చిన్నవయసులో కీళ్లవాతం వస్తే అది వారి చదువుతో పాటు వివాహ సమస్యలు, తీవ్ర మానసిక ఒత్తిడి, కుటుంబ పరంగా పలు సమస్యలకు దారి తీస్తుందన్నారు. కీళ్లవాతంలో ముఖ్యమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అ న్నారు. ఇది ముఖ్యంగా నడివయస్సు కల్గిన స్త్రీలలో ఎక్కువగా వస్తుంటుం దని, జన్యువులు, హార్మోన్లు, ఇతర అంతుపట్టని కారణాలు ఈ వ్యాధికి కారణమన్నారు. దేశంలో రుమటాల జిస్టులు అందుబాటులో లేకపోవడం వల్ల చాలావరకు కీళ్లవాత రోగులు సరైన వైద్య సేవలు పొందలేక పోతున్నారని అన్నారు. ప్రాథమిక దశలోనే కీళ్లవాతం గుర్తించడం శులభమన్నారు. చేతివేళ్లు, కీళ్లు లేక మోకాళ్ల కీళ్లు, నడుములు, పాదాలు వాయడం లేక నొప్పి, ఉదయం సమయంలో కీళ్లు బిగిసుకుపోవడం వంటి లక్షణా లు కనిపిస్తే తక్షణమే రుమటాలజి వై ద్యుడిని సంప్రదించి మెరుగైన వైద్య సేవలు పొందాలని ఆయన సూచిం చారు. ఇప్పటికే రాయలసీమలోనే మొదటిగా తిరుపతిలో శుభోదయ రుమటాలజి సెంటర్‌ను ఏర్పాటు చే సి, ఎన్నో జఠిలమైన కీళ్ల సమస్యలు, అరుదైన కీళ్ల వాత జబ్బులను నయం చేస్తున్నామని గుర్తుచేశారు. సెంటర్ ఏర్పాటు చేసి ఈ ఆదివారం నాటికి రెండు వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. వందలాది మందికి మెరుగైన వైద్య సేవలు అందించినట్టు తెలి పారు. వ్యాధ్రిగస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
డెడ్ స్టోరేజ్
రుయాలో ‘శవ’ ఘోష ఎస్వీ మెడికల్ కళాశాల మార్చురీలో పనిచేయని మోటారు పదిహేను రోజులుగా మూతపడ్డ కోల్డ్ స్టోరేజ్ కుళ్లిపోతున్న శవాలు నిరుపయోగంగా మారిన మోడ్రన్ మార్చురీ భవనం తిరుపతి కార్పొరేషన్: వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న రుయా ఆస్పత్రి, దీనికి అనుబంధంగా ఉన్న ఎస్వీ మెడికల్ కళాశాలకు సంబంధించిన మార్చురీల్లో రెండు వారాలుగా మోటార్లు పనిచేయడం లేదు. దీంతో మృతదేహాలను భద్రపరిచే కోల్డ్ సోర్టేజ్లు పనిచేయకపోవడంతో ఇక్కడికి వచ్చే మృతదేహాలను రుయా ఆస్పత్రిలోని ఐడీహెచ్ సమీపంలోని పాడుబడిన శవాలగది (మార్చురీ)కి తరలించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో రెండు మూడు రోజుల్లోనే మృతదేహాలు కుళ్లిపోయి గుర్తుపట్టడానికి వీళ్లేని దుస్థితికి చేరుకుంటున్నాయి. ఎస్వీ మెడికల్ కళాశాల పరిధిలో 20 శవాలను భద్రపరిచే కోల్ట్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. అందులో కళాశాల బయట నిర్మించిన మోడర్న్ మార్చురీలో 12, మెడికల్ కళాశాలలోని పాత కోల్ట్‌స్టోరేజ్‌లో 8 ర్యాక్‌లు ఉన్నాయి. సాధారణంగా ఏదైనా పోలీస్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ, నాన్ ఎమ్మెల్సీ కేసుల్లో మృతదేహాలకు ఎస్వీ మెడికల్ కళాశాలలోని మార్చురీకి తరలిస్తారు. అవి చెడిపోకుండా కోల్డ్‌స్టోరేజ్‌లో నిల్వ ఉంచుతారు. అనంతరం వాటికి ఫోరెన్సిక్ ప్రొఫెసర్స్ పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్విహ స్తారు. ఒక్కోసారి గుర్తుతెలియని శవాలు రుయా మార్చురీకి వస్తుంటాయి. అలాంటి మృతదేహాలను 72 గంటల పాటు కోల్డ్‌స్టోరేజ్ మార్చురీలో భద్రపరుస్తారు. ఆ బాధ్యత ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌దే. ప్రస్తుతం పదిహేను రోజులకుపైగా మెడికల్ కళాశాలలోని కోల్డ్ స్టోరేజ్ పనిచేయడం లేదు. మోటార్లు చెడిపోవడంతో స్టోరేజ్‌ను తాత్కాలికంగా మూసేశారు. దీంతో ఎస్వీ మెడికల్ కళాశాలలోని మార్చురీల నుంచి మృతదేహాలను రుయాలోని ఐడీహెచ్ వార్డు సమీపంలో ఉన్న మార్చురీకి తరలిస్తున్నారు. ఇక్కడ కోల్డ్‌స్టోరేజ్ లేదు. కుళ్లిన మృతదేహాల నుంచి భరించలేని దుర్వాసన వెలుపలకు వ్యాపిస్తోంది. ఒక్కోసారి ఎలుకలు, శవాల వేళ్లను తింటున్నాయి. అధికారులేమన్నారంటే.. మెడికల్ కళాశాలలోని మార్చురీని తాము నిర్వహిస్తున్నా, వాటి మరమ్మతులు మాత్రం మెడికల్ కళాశాలే చేయాల్సి ఉందని రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరాస్వామి తెలిపారు. ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఎంఎస్.శ్రీధర్ మాట్లాడుతూ మార్చురీలో కోల్ట్స్టేరేజ్ పనిచేయడం లేదన్నది చిన్న విషయమని, ఇంత చిన్న విషయానికే ఇబ్బంది అంటే ఎలా అన్నారు. యంత్రాలన్నాక రిపేరు అవుతుంటాయి అన్నింటికీ నేనే ముందుండి చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు. -
హుదూద్ బాధితులను ఆదుకుందాం
తిరుపతి కార్పొరేషన్ : హుదూద్ సృష్టించిన పెను తుపానుతో నిరాశ్రయులుగా మిగిలిన విశాఖ జిల్లా బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ పిలుపునిచ్చారు. బాధితులను వైద్య పరంగా ఆదుకునేందుకు తిరుపతి శ్రీసాయిసుధా మల్టీ ఆసుపత్రి, శ్రీరాళ్లపల్లి రాఘవ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా రూ.2.12 లక్షల విలువైన మందులు ఏర్పాటు చేశారు. వీటిని హాస్పిటల్ డెరైక్టర్లు డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి సమక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ ద్వారా విశాఖపట్నంకు శుక్రవారం తరలించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు ఎంపీ శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రజల మనసు గొప్పదని నిరూపించారన్నారు. ఎంపీగా తన రెండు నెలల జీతంతో పాటు నిధులను కూడా బాధితులకు కేటాయిస్తామన్నారు. డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ విశాఖలోని బాధితులకు అండగా నిలిచేందుకు ప్రతి డాక్టర్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ వంతుగా రూ.2.12 లక్షల విలువైన పెయిన్ కిల్లర్లు, యాంటి బయాటిక్స్, డ్రెస్సింగ్ మెటీరియల్స్, సిరప్లు, ఎనర్జీ డ్రింక్‌లు, ప్రొటీన్ పౌడర్లు, సెలైన్ బాటిల్స్, డయేరియా వంటి వ్యాధులకు మందులు అందించామన్నారు. డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, డాక్టర్ శ్రీహరి, డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు ఐఎంఐ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో దంపూర్తి భాస్కర్, కృష్ణాయాదవ్, ఆర్సీ మునికృష్ణ, పత్తిపాటి వివేక్, దుగ్గాని జయరామ్ పాల్గొన్నారు. -
విజృంభించిన విషజ్వరాలు
తిరుపతి కార్పొరేషన్: జిల్లాలో విషజ్వరాలు ప్రబలాయి. ముఖ్యంగా విష జ్వరాలతో చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిలోని స్విమ్స్, రుయాతో పాటు నగరంలోని ప్రయివేట్ చిన్న పిల్లల ఆసుపత్రులు జ్వరం సోకిన చిన్నారులతో కిటకిలాడుతున్నాయి. తిరుపతి నగరం, రూరల్, చంద్రగిరి, పాకాల, దామలచెరువు, పీలేరు, ఏర్పేడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు, వడమాల పేట మండలాల్లో 15 రోజులుగా విష జ్వరాల బారిన పడుతున్నారు. ముఖం వాపులు రావడం, ఎర్రటి గుల్లలు ఏర్పడటం, విరేచనం నల్లగా కావడం వంటి లక్షణాలతో పెద్దాసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి విష జ్వరాలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రుయా చిన్న పిల్లల ఆసుపత్రిలో... ఒక్క రుయా చిన్న పిల్లల ఆసుపత్రిలోనే వందకు పైగా విష జ్వరాల కేసులు నమోదయ్యాయి. అందులో 30కి పైగా డెంగీ లక్షణాలను గుర్తించిన వైద్యులు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మొత్తం నాలుగు యూనిట్లు ఉండగా వందకు పైగా పిల్లలు వెద్య సేవలు పొందుతున్నారు. ఇక్కడ వ్యాధి నిర్ధారణ కోసం చేస్తున్న పరీక్షలకు, వ్యాధి తగ్గడానికి కనీసం వారం రోజులైనా సమయం పడుతోంది. దీంతో కొందరు మెరుగైన వైద్యం కోసమని స్విమ్స్‌కు పరుగులు తీస్తున్నారు. దీనిపై రుయా చిన్నపిల్లల వైద్యాధికారి డాక్టర్ రవికుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా చిన్న పిల్లలకు విష జ్వరాలు సోకుతున్న మాట వాస్తవమే అన్నారు. కాని గతంతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగానే ఉందన్నారు. వచ్చిన వారికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రైవేటు దోపిడీ.. విషజ్వరాల బారిన పడిన పిల్లలను తీసుకుని చాలా మంది ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ప్రయివేట్ వైద్యులు అందిన కాడికి దోచుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకున్నా రక్తపరీక్షలు, స్కానింగ్, ఎక్స్‌రేలు అంటూ నానా హడావిడి చేస్తున్నారు. దీనికి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు బిల్లు చేతిలో పెడుతున్నారు. ఇంత చేసినా బిడ్డకు ఫలానా జ్వరం అని చెప్పడం లేదని సావిత్రి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి జిల్లాలో పిల్లలకు సోకుతున్న విషజ్వరాలను నివారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కార్పొరేషన్లలో బదిలీలకు రంగం సిద్ధం
15 రోజుల్లో ఉద్యోగుల వివరాలు తెలపాలంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు రాజకీయ రంగు పులుముకుంటున్న మున్సిపల్ ఉద్యోగుల బదిలీలు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాలు తిరుపతి కార్పొరేషన్: కార్పొరేషన్, మున్సిపల్ ఉద్యోగుల బదిలీలకు తెలుగుదేశం పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలుపుకునేందుకు అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు ఆరు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఉన్న ఫలంగా బదిలీలు చేసేందుకు డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం జీవోఎంఎస్.నెం.186 ఫైనాన్స్ (డీసీఎం-2) డిపార్ట్.తేదీ 05.09.2014 ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ఆర్వోసీ.నెం.11163/2014/కే1-2 తేదీ 06.09.2014 పేరిట సర్క్యులర్‌ను విడుదల చేశారు. అది కూడా బదిలీకానున్న ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 15వ తేదీలోగా పంపించాలంటూ సంబంధిత మున్సిపల్, కార్పొరేషన్ల కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 30కి ఉన్న బదిలీల గడువును అక్టోబర్ 10 వరకు పొడిగించారు. అదే నెల 11 నుంచి బదిలీలపై నిషేధం ఉంటుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్లో పనిచేసే ప్రత్యేక డాక్టర్లు, లెక్చరర్లకు ప్రత్యేక గైడ్‌లైన్స్ ఇవ్వనున్నారు. ఏ ఉద్యోగులు ఎక్కడికి.. ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, అకౌంటెంట్లు, రెవెన్యూ అధికారులు, ఎవరైతే 23 సంవత్సరాలు పూర్తిచేసుంటారో వారిని బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈవివరాలను పూర్తిస్థాయిలో తమకు అందించాలని డీఎంఏ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఇక్కడి మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లు ఆ పనిలో తలమునకలై ఉన్నారు. విశ్వసనీయ స మాచారం మేరకు కార్పొరేషన్లో పనిచేసే రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వరకు జిల్లాలోనే బదిలీలు ఉంటాయి. సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులకు అనంతపురం రీజియన్ పరిధిలో బదిలీ చేస్తారు. సూపరింటెండెంట్, అకౌంటెంట్, రెవెన్యూ అధికారులు, మేనేజర్లకు రాష్ట్ర స్థాయిలో బదిలీలు ఉంటాయి. వీరితో పాటు ఇంజినీర్లు, డీఈ స్థాయి అధికారులను ఈఎన్సీ విభాగం, ఏఈలను ఎస్ఈ అధికారులు బదిలీ చేయనున్నారు. అసిస్టెంట్ సిటీప్లానర్, టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లను డెరైక్టర్ ఆఫ్ టౌన్‌ప్లానింగ్ విభాగపు ఉన్నతాధికారులు బదిలీలు చేయనున్నారు. ఇందులో డెప్యూటేషన్‌పై వచ్చిన సెక్రటేరియట్ ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయించారు. సర్వీసు రూల్స్ ఆమోదానికి ఓకే సాధారణంగా కార్పొరేషన్లలో సర్వీసు రూల్స్‌కు ఆమోదం లేకపోవడం వల్ల ఇక్కడి ఉద్యోగులకు బదిలీలు ఉండవు. అయితే ప్రస్తుతం సర్వీసు రూల్స్‌ను ఒకటి రెండు రోజుల్లో ఆమోదించేందుకు ఫైల్ సిద్ధంగా ఉంది. మాట వినని వారికి బెదిరింపులు తమకు అనుకూలమైన ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా అదే స్థానంలో కూర్చోబెట్టేందుకు ఒత్తిళ్లు తెస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ (అధికార)కి పనిచేయని, మాట వినని, తాము చెప్పినట్టు నడుచుకోని ఉద్యోగులను ఇక్కడి నుంచి సాగనంపేందుకు సిద్ధమయ్యారు. పైగా పరోక్షంగా వేధింపులకు పాల్పడుతూ, విజిలెన్స్, ఏసీబీ అధికారుల పేరుతో ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఉద్యోగులే బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటీవల కర్నూలు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఏసీపీ స్థాయి అధికారి వేధింపులు తాళలేక సెలవుపై వెళ్లిపోయినట్టు సమాచారం. అదే బాటలో ఉద్యోగ, కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొందిన ఓ అధికారితో పాటు పలువురు కీలకమైన ఉద్యోగులు కూడా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాలు మున్సిపల్ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. -
ఆర్టీఐ సామాన్యుడి ఆయుధం
రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియా మూడు రోజుల్లో 142 ఆర్టీఐ కేసుల విచారణ తిరుపతి కార్పొరేషన్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) సామాన్యుడికి ఆయుధం లాంటిదని ఆ చట్టం రాష్ట్ర కమిషనర్ లామ్ తాంతియా కుమారి తెలిపారు. తిరుపతిలో మూడు రోజులుగా నిర్వహించిన ఆర్టీఐకి సంబంధించిన కేసుల విచారణ శుక్రవారం ముగిసింది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మొత్తం 142 కేసులను ఆమె విచారించారు. సంతృప్తికరమైన సమాచారం వచ్చిన 21 కేసులను క్లోజ్ చేశారు, 16 కేసులను పరిష్కరించారు. 105 కేసులకు సంబంధించి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐవో)లు కమిషన్ ఎదుట హాజరు కాకపోవడం, సమాచారం ఇవ్వక పోవడం, కమిషన్‌ను తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి కారణాలతో సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జరిమాన విధించారు. అందులో తిరుపతి శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి ఒకరు. అనంతరం విలేకరుల సమావేశంలో కమిషనర్ తాంతియా కుమారి మాట్లాడారు. సమాచారం ఇవ్వడంలో తహశీల్దార్లు పూర్తిగా విఫలం చెందుతున్నారని మండిపడ్డారు. పైగా సమాచారం కోసం వచ్చే వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని అలాంటి వారిని కమిషన్ కఠినంగా శిక్షిస్తుందన్నారు. కార్వేటినగ రానికి చెందిన తులసీ అనే మహిళ ఓ భూమి వివరాలు కావాలని తహశీల్దార్‌ను కోరగా హరిప్రసాద్ అనే వ్యక్తి ఆమెను చంపుతామని బెదిరించాడన్నారు. పైగా తన వద్దకు విచారణకు వచ్చిన తులసిని వెంబడిని అతడిని అరెస్టు చేయించామన్నారు. ఇలాంటి సంఘటనలను అధికారులు ప్రోత్సహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజల నుంచి హుండీల రూపంలో కోట్లాది రూపాయలు వసూ లు చేస్తున్న టీటీడీ ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అన్నారు. కోర్టులో కేసులున్నాయన్న సాకుతో సమాచారం చెప్పనంటే కుదరదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఆకలితో అలమటించే పూజారులు, ధూప దీప నైవేద్యానికి కూడా నోచుకోని ఆలయాలు అనే కం ఉన్నాయని వాటికి సమాధానం చె ప్పి తీరాలన్నారు. ఆర్టీఐపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. -
అడిగిన సమాచారం ఇవ్వాల్సిందే
రాష్ట్ర ఆర్టీఐ కమిషన్ తాంతియా కుమారి వెల్లడి తిరుపతి కార్పొరేషన్ : సమాచార హక్కు చట్టం కింద ఆయా సంస్థలు సమాచారం ఇవ్వాల్సిందేనని అలా కాకుండా వారిని భయభ్రాంతులకు గురిచేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ లామ్ తాంతియా కుమారి అన్నారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం, వైఎస్ఆ ర్ సమావేశ మందిరంలో బుధవారం ఆర్టీఐ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను ఆమె విచారించారు. పీలేరుకు చెందిన అడ్వకేట్ ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తిరుపతి అర్బన్, అక్కారంపల్లెలో సెటిల్మెంట్ అర్డర్లపై సమాచారం అడిగితే రెండేళ్లుగా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. దీనికి డీఆర్వో ఒంగోలు శేషయ్య మాట్లాడుతూ తమవద్ద ఆ వివరాలు లేవని ఎండార్స్మెంట్ ఇచ్చామని వివరణ ఇచ్చారు. ఎండార్స్మెంట్ అంటే సమాచారం కాదు, అలా అని చేతులు దులుపుకుంటే సరికాదని కమిషనర్ సున్నితంగా హితవు పలికారు. ‘‘మీరు సరైన సమయంలో సమాచారం ఇస్తే మా వద్దకు రారుకదా, వారంలోగా సమాచారం ఇవ్వండి’’ అంటూ ఆదేశించారు. ద్రవిడవర్సిటీకి సంబంధించి కేసులు ఎక్కువగా ఉన్నా అప్లైంట్లు హాజరు కాకపోవడంపై రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. పరీక్షలకు హాజరు కాకపోతే ఇంప్రూవ్‌మెంట్‌కు ఎలా అనుమతిస్తారు. ఒకవేళ హాజరైతే అంతకు ముందు, వచ్చిన తరువాత ఏ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారో సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వలేదంటూ నిలదీశారు. విద్యార్థులకు సంబంధించిన సమాచారం ఎవరు అడిగినా దరఖాస్తు చేసుకున్న48 గంటల్లో ఇవ్వాలని ఆదేశించారు. అలాగే భాస్కర్ విజయసాయి పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకుంటే రూ.60వేలు కట్టించుకున్నారు. అప్లికేషన్లో మాత్రం నాట్ ఎలిజబుల్ అంటూ రిజెక్టు చేశారు, అసలు రిజెక్టు చేసిన వ్యక్తి నుంచి అంత డబ్బు ఎందుకు కట్టించుకున్నారు? దీనిపై సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీశారు. బాధితుని వద్ద కట్టించుకున్న రూ.60వేలకు వడ్డీతో కలిపి చెల్లించాలంటూ ఆదేశించారు. షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎలాగూ సమాచారం ఇవ్వడం మీకు చేతకాదు, సమాచారం కోసం వచ్చే వారిని భయభ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించడం సరికాదన్నారు. గతంలో హెచ్చరించినా మీలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. సమాచారం కోసం వచ్చేవారిని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. వంశీకృష్ణ అనే వ్యక్తికి సంబంధించిన కేసులో వడమాల పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కమిషన్ ముందు హాజరు కాకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.25వేల జరిమాన విధిస్తూ, షోకాజ్ నోటీసు జారీ చేస్తూ, తన ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఒకసారి షోకాజ్ ఇస్తే వారి ఇంక్రిమెంట్లు, పదోన్నతులు ఆగిపోతాయని దీనిని దృష్టిలో ఉంచుకుని పనిచేసుకోవాలని అధికారులకు సూచించారు. -
అంతర్యామీ...అలసితిమీ....!
నగరంలో 200కు పైగా పాతభవనాలు చర్యలు తీసుకోవడంలో అధికారుల వెనుకడుగు ప్రమాదం జరిగాక స్పందిస్తారా.. అని నిలదీస్తున్న ప్రజలు ‘‘తిరుమలేశా.. ఒకప్పుడు నీ పాదాల చెంత కొత్తూరుగా వెలసిన కుగ్రామం తిరుపతిగా మారింది. ఆ తర్వాత పట్టణమైంది.. ఇటీవల నగరంగా విస్తరించింది. నీ దర్శనానికి తిరుమల వచ్చే భక్తులకు సేవలందించే క్రమంలో మమ్మల్ని నిర్మించారు. టీటీడీ అధికారులు.. ఆధ్యాత్మిక గురువులు.. ప్రభుత్వ అధికారులు.. విద్యార్థులు.. వ్యాపారులకు వసతిగా ఉన్నాం. మా వయసు వందేళ్లు కావస్తోంది. సేవలందించే శక్తి సన్నగిల్లుతోంది. పటుత్వం తగ్గిపోయింది. మాకు ముక్తిని ప్రసాదించు స్వామీ’’ అంటూ తిరుపతిలోని పాత భవనాలు వేడుకుంటున్నాయి. తిరుపతి కార్పొరేషన్: తిరుపతి నగరంలో ఏ ప్రధాన వీధిలో చూసినా శిథిలావస్థకు చేరిన భవనాలు భయపెడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు రెండు వందలకు పైగానే ఉన్నాయి. ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న గాంధీరోడ్డు, గోవిందరాజ తేరు వీధి, కర్నాల వీధి, తీర్థకట్ట వీధి, చిన్న బజారు వీధుల్లో శిథిలావస్థకు చేరిన కొన్ని భవనాలకు యజమానులు పైపైన మెరుగులు దిద్ది అద్దెలకు ఇస్తున్నారు. గాంధీరోడ్డులోని కర్ణాటక సత్రం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో మూసివేశారు. గంగుండ్ర మండపానికి వెళ్లే వీధిలో ఉన్న ఓ పాత భవనంపై మొక్కలు పెరగడంతో గోడలు నెర్రెలు బారి ప్రమాదకరంగా మారింది. వీటి పక్కన వ్యా పారాలు చేస్తున్న దుకాణదారులు మాత్రం ఎప్పుడు కూలుతుందోనని బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. యాదవ వీధిలోని ఓ పాత భవనంపై మొక్క ఏపుగా పెరగడంతో భవనం కూలేందుకు సిద్ధంగా ఉంది. వీటిపై పలుమార్లు కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ భవనాలదీ అదే పరిస్థితి గోవిందరాజ స్వామి తేరువీధి లో ఉన్న సమాచార పౌర సం బంధాల శాఖకు చెందిన సహాయ సంచాలకుల కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడికి నిత్యం పాఠకులు వస్తూ, పోతుంటారు. గోవిందరా జస్వామి పుష్కరిణి సమీపంలోబాలతేజస్సు కేంద్రం నిర్వహిస్తున్న మున్సిపల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇందులోని సిబ్బం ది, వారి పర్యవేక్షణలో ఉండే పిల్లలు క్షణమొ క యుగంగా కాలం వెళ్లదీస్తున్నారు. వెస్ట్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని రాములవారి ఆలయానికి చెందిన పుష్పతోట (భవనం) శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం ఈ భవనాన్ని ఎస్వీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులకు వసతి గృహంగా ఉపయోగిస్తున్నారు. భవనం గదులపై నుంచి పెచ్చులూడి పడుతుండడంతో విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. టీటీడీ పాత పరిపాలనా భవనం, పాత ఆర్డీవో కా ర్యాలయ భవనంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయ భవనాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. 200 భవనాలకు నోటీసులు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్న 200లకు పైగా పాత భవనాల యజమానులకు ఇదివరకే నోటీసులు ఇచ్చామని కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. అందులో గాంధీరోడ్డు, గోవిందరాజ స్వామి ఆలయ మాడ వీధులు, పాత టీటీడీ భవనంతో పాటు పలు ప్రాంతాలు ఉన్నా యి. వీటికి నోటీసులు జారీచేసిన అధికారులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని చేతులు దులుపుకున్నట్టు ఆరోపణలు ఉన్నా యి. 60 ఏళ్లు నిండిన ప్రతి భవనమూ పటుత్వం కోల్పోతుందని అధికారులు చెబుతున్నారు. అలాంటి భవనాల వయసు, పునాదుల తీరు, వాడిన నిర్మాణ సామగ్రి, గోడ లు, పైకప్పు వంటివి పరిశీలించి భవన పటుత్వంపై ఇంజనీరింగ్ అధికారులతో నిర్ధారిం చుకోవాలి. ప్రమాదమని భావించిన వాటిని వెంటనే తొలగించాలి. అయితే అలాంటి నిబంధనలు ఇక్కడ అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరి గాక స్పందించడంకన్నా ముందుగానే అధికారులు మేల్కొంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని ప్రజలు సూచిస్తున్నారు. -
సామాన్యుడిపై ఎన్డీయే మొదటి దెబ్బ
తిరుపతి కార్పొరేషన్ : రైలు చార్జీలు భారీగా పెంచడం ద్వారా సామాన్యుడిపై ఎన్డీఏ ప్రభుత్వం మొదటి దెబ్బ వేసిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీయే అధికారం చేపట్టి నెలకూడా కాకముందే సామాన్యులపై రైలు చార్జీల భారం మోపడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. వేంకటేశ్వరుని దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు ప్రధానంగా రైళ్లను ఆశ్రయిస్తుంటారు. దేశం నలుమూలల నుంచి వచ్చే వీరికి రైల్వే చార్జీలు భారంగా మారన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఒక్కొక్కరు రైల్వే ప్రయాణ చార్జీల్లో రూ.100 నుంచి రూ.200 వరకు అదనంగా భారం మోయాల్సి ఉంటుంది. ఆ రకంగా తిరుమల శ్రీవారి దర్శణానికి వచ్చే నలుగురు సభ్యులుండే ఒక్కో కుటుంబం సరాసరి రూ.1000 రూపాయలు అదనపు భారం పడనుంది. ఏటా తిరుపతి కేంద్రంగా ప్రయాణాలు సాగిస్తున్న లక్షలాది మంది భక్తులకు ఒక రకంగా పెరిగిన చార్జీలు భరించలేని భారమే. అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, కోయంబత్తూరు, ముంబాయి వంటి ప్రాంతాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులకు కూడా రైలు చార్జీల పెంపు చుక్కలు చూపించనున్నాయి. నెల కూడా కాలేదు... మాది మధ్య తరగతి కుటుంబం. తిరుపతికి వచ్చి సంతోషంగా శ్రీవారిని దర్శించుకున్నాం. రైల్వే చార్జీలు భారీగా పెంచడం తో ఆ సంతోషం మాయమైంది. బీజేపీ అధికారంలోకి వచ్చి నెల కూడా కాకనే చార్జీలు పెంచడం మంచిది కాదు. - బి.భాస్కర్, ప్రయాణికుడు, సిరిసిల్ల సామాన్యులంటే చులకన కేంద్రంలోకి ఏప్రభుత్వం వచ్చినా వారికి సామాన్య ప్రజల సంక్షేమం పట్టదు. చార్జీలు తక్కువగా ఉండటంతో ప్రతి సామాన్యుడు రైలు ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చార్జీలు 14 శాతం పెంచితే ఎలా ప్రయాణించాలి. - వెంకటేశ్, ప్రయాణికుడు, బెంగళూరు చార్జీలు పెంపు దారుణం రైలు చార్జీలు భారీగా పెంచడం మా లాంటి వారికి చాలా ఇబ్బంది కర మే. ఇప్పటికే బస్సు ప్రయాణా లు పూర్తిగా మానేసిన మాకు ఇప్పుడు రైలు ప్రయాణం కూడా భారంగా మారనుంది. సామాన్యుడి దృష్టిలో ఉంచుకోకుండా చార్జీలను పెంచడం దారుణం. -లక్ష్మీనారాయణ, గుంటూరు ఇక ప్రయాణం చేయలేం ఇప్పటికే సామాన్య ప్రజలు బస్సు ప్రయాణం అంటే ఆమడ దూరంలో ఉన్నారు. ఇప్పుడు రైలు చార్జీలు పెంచడం వలన ప్రయాణం అంటే మానుకోవాల్సి వస్తోంది. కుటుంబంతో కలసి ప్రయాణం చేయాలంటేనే భయమేస్తోంది. పెంచిన చార్జీలను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి. - పద్మావతి, ప్రయాణికురాలు, విజయవాడ పెంచిన రైల్వే చార్జీలు తగ్గించాలి.... మోడీ సర్కారు పెంచిన రైల్వే చార్జీలను వెంటనే తగ్గించాలి. ఒక్కసారిగా 14 శాతం చార్జీలు పెంచడంతో సామాన్యుడిపై భారం పడుతుంది. అధిక శాతం ప్రయాణికులు రైల్వే మార్గం ద్వారానే గమ్యం చేరుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని చార్జీలు తగ్గించాలి. - మిద్దెలహరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ కన్వీనర్, జిల్లా ఆప్కో డెరైక్టర్ ఇదేనా సామాన్యుడి ప్రభుత్వం..... నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయితే ప్రతి సామాన్యుడుకి మేలు జరుగుతుంద ని బీజేపీకి పట్టం కట్టారు. అయితే సామాన్యప్రజలకు అనుకూలంగా ఉన్న రైలు ప్ర యాణాన్ని మరచి ఒక్కసారిగా భారీ మొ త్తంలో చార్జీలు పెంచడం దారుణం. వెంటనే తగ్గించ కుంటే ఉద్యమాలు తప్పవు. -సిరాజ్ బాషా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీల కార్యదర్శి -
‘టి’ బిల్లును పార్లమెంట్లో పెట్టకండి
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: అసెంబ్లీలో తిరస్కరించిన తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టకూడదని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, ఎన్.రాజారెడ్డి డి మాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సాప్స్ ఆధ్వర్యంలో తిరుపతి ము న్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సర్కిల్లో గురువారం ఆందోళనకు దిగారు. విశ్వం విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులతో కలిసి ర్యాలీగా కార్పొరేషన్ కా ర్యాలయం సర్కిల్ వరకు చేరుకున్నా రు. అక్కడ మానవహారంగా ఏర్పడి కేం ద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదా లు చేశారు. కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీలో తిరస్కరించారన్నారు. అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చరిత్ర ఇప్పటివరకూ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త సంప్రదాయాన్ని తీసుకొస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. రాజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ, రాయలసీమ ప్రజలు తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్ తదితర సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి కుసుమకుమారి, విశ్వం విశ్వనాథరెడ్డి, వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాలపై తీవ్ర స్థాయిలో మం డిపడ్డారు. ఏపీఎన్జీవో నాయకులు తాళ్లపాక సురేష్, మహేష్‌బాబు, ఐఎంఏ, తిరుపతి బార్ అసోసియేషన్ రమణ స్కూటర్లపై ర్యాలీగా వచ్చి మద్దతు ప్రకటించారు. మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి కుసుమకుమారి, గేట్, ఏటీఎన్ డిగ్రీ కళాశాల, చైతన్య, విజయవాడ నారాయణతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాల సర్కిల్లో ఏపీఎన్జీవోలు ఆందోళనకు దిగారు. సురేష్‌బాబు ఆధ్వర్యంలో నాయకులు హాజరయ్యారు.