డెడ్ స్టోరేజ్
- రుయాలో ‘శవ’ ఘోష
- ఎస్వీ మెడికల్ కళాశాల మార్చురీలో పనిచేయని మోటారు
- పదిహేను రోజులుగా మూతపడ్డ కోల్డ్ స్టోరేజ్
- కుళ్లిపోతున్న శవాలు
- నిరుపయోగంగా మారిన మోడ్రన్ మార్చురీ భవనం
తిరుపతి కార్పొరేషన్: వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న రుయా ఆస్పత్రి, దీనికి అనుబంధంగా ఉన్న ఎస్వీ మెడికల్ కళాశాలకు సంబంధించిన మార్చురీల్లో రెండు వారాలుగా మోటార్లు పనిచేయడం లేదు. దీంతో మృతదేహాలను భద్రపరిచే కోల్డ్ సోర్టేజ్‌లు పనిచేయకపోవడంతో ఇక్కడికి వచ్చే మృతదేహాలను రుయా ఆస్పత్రిలోని ఐడీహెచ్ సమీపంలోని పాడుబడిన శవాలగది (మార్చురీ)కి తరలించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో రెండు మూడు రోజుల్లోనే మృతదేహాలు కుళ్లిపోయి గుర్తుపట్టడానికి వీళ్లేని దుస్థితికి చేరుకుంటున్నాయి.
ఎస్వీ మెడికల్ కళాశాల పరిధిలో 20 శవాలను భద్రపరిచే కోల్ట్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. అందులో కళాశాల బయట నిర్మించిన మోడర్న్ మార్చురీలో 12, మెడికల్ కళాశాలలోని పాత కోల్ట్‌స్టోరేజ్‌లో 8 ర్యాక్‌లు ఉన్నాయి. సాధారణంగా ఏదైనా పోలీస్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ, నాన్ ఎమ్మెల్సీ కేసుల్లో మృతదేహాలకు ఎస్వీ మెడికల్ కళాశాలలోని మార్చురీకి తరలిస్తారు. అవి చెడిపోకుండా కోల్డ్‌స్టోరేజ్‌లో నిల్వ ఉంచుతారు. అనంతరం వాటికి ఫోరెన్సిక్ ప్రొఫెసర్స్ పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్విహ స్తారు.
ఒక్కోసారి గుర్తుతెలియని శవాలు రుయా మార్చురీకి వస్తుంటాయి. అలాంటి మృతదేహాలను 72 గంటల పాటు కోల్డ్‌స్టోరేజ్ మార్చురీలో భద్రపరుస్తారు. ఆ బాధ్యత ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌దే. ప్రస్తుతం పదిహేను రోజులకుపైగా మెడికల్ కళాశాలలోని కోల్డ్ స్టోరేజ్ పనిచేయడం లేదు. మోటార్లు చెడిపోవడంతో స్టోరేజ్‌ను తాత్కాలికంగా మూసేశారు. దీంతో ఎస్వీ మెడికల్ కళాశాలలోని మార్చురీల నుంచి మృతదేహాలను రుయాలోని ఐడీహెచ్ వార్డు సమీపంలో ఉన్న మార్చురీకి తరలిస్తున్నారు. ఇక్కడ కోల్డ్‌స్టోరేజ్ లేదు. కుళ్లిన మృతదేహాల నుంచి భరించలేని దుర్వాసన వెలుపలకు వ్యాపిస్తోంది. ఒక్కోసారి ఎలుకలు, శవాల వేళ్లను తింటున్నాయి.
అధికారులేమన్నారంటే..
మెడికల్ కళాశాలలోని మార్చురీని తాము నిర్వహిస్తున్నా, వాటి మరమ్మతులు మాత్రం మెడికల్ కళాశాలే చేయాల్సి ఉందని రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరాస్వామి తెలిపారు. ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఎంఎస్.శ్రీధర్ మాట్లాడుతూ మార్చురీలో కోల్ట్‌స్టేరేజ్ పనిచేయడం లేదన్నది చిన్న విషయమని, ఇంత చిన్న విషయానికే ఇబ్బంది అంటే ఎలా అన్నారు. యంత్రాలన్నాక రిపేరు అవుతుంటాయి అన్నింటికీ నేనే ముందుండి చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు.