SV Medical College
-
వైద్యులు పరిశోధనలపై దృష్టి సారించాలి
తిరుపతి తుడా: అంతర్జాతీయ సదస్సులో జరిగే చర్చలు సమాజానికి మేలుకలిగేలా ఉండాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ఆవరణలోని ప్రేమసాగర్‌రెడ్డి భవనంలో ఎస్వీ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఐ.ఎం.ఎ. సహకారంతో ‘న్యూరో సైన్సెస్’పై నిర్వహించిన 15వ అంతర్జాతీయ సదస్సును ఆదివారం ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, పరిశోధకులు, ప్రాక్టీస్ చేసే న్యూరాలజిస్టులు, వర్థమాన విద్యార్థులు తమ పరిశోధన ఫలితాలను ప్రపంచ నిపుణులతో పంచుకోవాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లకు అంతర్జాతీయ వేదికను ఎంచుకోవడం వల్ల వారిలో కొత్త ఆలోచనలను ప్రేరేపించవచ్చని చెప్పారు. న్యూరాలజీ స్పెక్ట్రమ్ అంతటా న్యూరోలాజికల్ సమస్యలతో జీవిస్తున్న వారి జీవితాలను మెరుగుపరచడం, మానసిక ఆరోగ్య శాస్త్రవేత్తలు, అభ్యాసకుల వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు పరస్పరం ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రపంచ ఆరోగ్యానికి కొత్త సాంకేతికత అప్లికేషన్లు, డయాగ్నస్టిక్ టెక్నిక్‌ల అభివృద్ధికి కొత్త శాస్త్రీయ విధానాలు ఎంతైనా అవసరమని చెప్పారు. వైద్యులు పరిశోధనలపై దృష్టిసారించాలని కోరారు. సుమారు 1,500 మంది వైద్యులు పాల్గొంటున్న ఈ సదస్సులో మనదేశం నుంచి 12 మంది వక్తలు, విదేశాల నుంచి ఏడుగురు అంతర్జాతీయ ప్రసిద్ధ వక్తలు తమ వైద్య వృత్తిలోని జ్ఞానాన్ని అందించడం సంతోషించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. తిరుపతి నుంచి నిర్వాహక కమిటీ చైర్మన్, ఐఎంఏ ఎస్వీఎంసీ ప్రెసిడెంట్ డాక్టర్ రాయపు రమేష్, జనరల్ సెక్రటరీ డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ సతీష్ పాల్గొన్నారు. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సహజానంద్ ప్రసాద్‌సింగ్, ఏపీడీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి.వెంగమ్మ, డాక్టర్ థామస్ మాథ్యూ, డాక్టర్ అతుల్ గోఝల్, తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు. -
జూనియర్ డాక్టర్ల మెరుపు సమ్మె..
-
డాక్టర్ శిల్ప మృతి కేసు విచారణలో జాప్యం!
సాక్షి, తిరుపతి : ఎస్వీ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్లర్లు మెరుపు సమ్మెకు దిగారు. డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో విచారణ పేరుతో జాప్యం చేస్తుండటంపై జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. శిల్ప ఆత్మహత్య అంశంపై సీఐడీ విచారణ జరిపి.. నిజానిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. శిల్ప మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం అత్యవసరంగా భేటీ అయిన జూడాలు 24 గంటలపాటు మెరుపు సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. -
కళాశాలలో విషాద‘గీతిక’
తిరుపతి అర్బన్: తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మెడికోలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు సంచలనం సృష్టించాయి. తక్కువ కాల వ్యవధిలో ఇద్దరు తనువు చాలించడంపై విస్తృత చర్చ జరుగుతోంది. వరుస సంఘటనలు జరగడంతో కళాశాలలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. సహచరులు సోమవారం ఆందోళన చెందా రు. విషాద వాతావరణం అలముకుంది. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఆది వారం ఆత్మహత్య చేసుకున్న ఎంబీబీ ఎస్ విద్యార్థిని పి.గీతిక మృతదేహాన్ని సోమవారం ఆయన రుయా మార్చురీలో పరిశీలించారు. ఆమె కుటుంబ స భ్యులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రుయా ప్రభుత్వ వైద్యులు, జూడాల సంఘం నాయకులు సోమవారం మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్, ప్రభుత్వ వైద్యుల సంఘం కోశాధికారి డాక్టర్ శ్రీనివాసరావు, జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరమణ, సభ్యురాలు లావణ్య తదితరులు హాజరై ఇద్దరు వైద్య విద్యార్థుల చిత్ర పటాలకు పుష్పాంజలితో నివాళులర్పించారు. వారిద్దరి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ గీతిక మృతదేహానికి రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ ఆధ్వర్యంలో సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. తిరుపతి ఈస్ట్ డీఎస్పీ మునిరామ య్య మీడియాతో మాట్లాడుతూ గీతిక మృతి పూర్తిగా వ్యక్తిగతమని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ డివిజన్ మే జిస్ట్రేట్ (ఆర్డీఓ), తహసీల్దార్ల పర్యవేక్షణలో పోస్టుమార్టం పూర్తి చేసినట్లు వెల్లడిం చారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. గీతిక మృతికి మెడికల్ కాలేజీలో వేధింపులు, ఇతర సమస్యలు కారణం కాదని, చదు వులో వెనుకబాటుతనం మాత్రమే ఉందని ఆమె తల్లి చెప్పినట్లు స్పష్ట్టం చేశారు. గీతిక సూసైడ్ నోట్లో కూడా ఎవరి పేర్లు లేవని, ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదని డీఎస్పీ పేర్కొన్నారు. గీతిక మృతదేహానికి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పోస్టుమార్టం పూర్తిచేసి స్వస్థలం కడప నగరానికి తరలించారు. -
ఒక్క క్షణం ఆలోచించండి
చిత్తూరు అర్బన్: ‘శిల్ప పిడియాట్రీషియన్ చదువుతున్న వైద్యురా లు. కళాశాలలో అధ్యాపకుల వేధింపులు తాళలేక వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. మానసికంగా కుంగిపోయి తన వద్దకు వచ్చేవారికి ధైర్యం చెప్పి బతుకుపై ఆశ కల్పించాల్సిన వైద్యురాలి బలవన్మరణంతో సమస్యలు తీరిపోయాయా..? తీరినా పోయిన ప్రాణం తిరిగొచ్చిందా..?’ ‘నిన్నటికి నిన్న తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గీతిక ఇంట్లో ఉరేసుకుని మృతి చెందారు. పరీక్షలకు భయపడో, వ్యక్తిగత సమస్య ఏదైనా ఆమెను ఆత్మహత్మకు పురుగొలిపి ఉండవచ్చని స్నేహితులు భావిస్తున్నారు. భర్త మృతితో కుంగిపోయిన గీతిక తల్లి బిడ్డ చదువు కోసం చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదులుకుని తిరుపతి వచ్చేశారు. ప్రాణం తీసుకోవాలనుకున్న మానసిక సంఘర్షణలో తల్లి పడ్డ కష్టాన్ని గీతిక గుర్తుకు తెచ్చుకోలేకపోయారు.’ వీరిద్దరే కాదు.. చిన్నపాటి సమస్యకే కుంగిపోయి ఆత్మహత్యలవైపు అడుగులు వేస్తున్నవారి సంఖ్య జిల్లాలో ఇటీవల ఎక్కువైంది. అది కూడా విద్యావంతులు, వృత్తిపరంగా రాణిస్తున్నవారు, నలుగురికీ ధైర్యం చెప్పి సమాజాన్ని నడిపించాల్సిన వారే ఇలా ఆత్మహత్యకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. చదవులు, వేధింపులు, ఒత్తిడి, ప్రేమ.. కారణం ఏదైనా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతోంది. చమటోడ్చి, కష్టపడి పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివిస్తున్న తల్లిదండ్రులకు తీరని వేదనను మిగులుస్తోంది. ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే జీవితం పూలబాటగా మారుతుంది. లక్ష్యం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని విద్యతో వికసింప చేసుకోవాలని ఆశిస్తుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ చదువుల్లో ఎదుగుతూ గమ్యం వైపు నడవాలని ప్రయత్నిస్తారు. ఈ సమయంలో అడుగులు తడబడడం, ఒత్తిళ్లు, ఆకర్షణ, వేధింపులు ఇలా అనేకం ఎదురవుతాయి. జీవితమంటేనే పోరాటం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పోరాటం చేసి విజయం సాధించినప్పుడు కలిగే ఆనందం అంతాఇంతాకాదు. అంతేగాని సమస్య వచ్చిందని మానసికంగా కుంగిపోయి జీవితాన్ని అర్ధంతరంగా ముగించడం మంచిదికాదు. చనిపోవడం ఒక్కటే పరిష్కారమని భావించేవాళ్లు ఒక్క క్షణం ఆలోచిస్తే గమ్యం.. గమనం తప్పకుండా మారతాయి. జీవిత లక్ష్యాలు, తల్లిదండ్రులు, వారు పడుతున్న కష్టాన్ని తరచూ మననం చేసుకోవడం వల్ల ఆత్మహత్య ఆలోచనల నుంచి బటయపడొచ్చు. జీవితం ఆనందంగా సాగుతుంది. ఒత్తిళ్లు ఇలా దూరం.. ♦ ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉటుంది. విద్యార్థులయితే నిరంతరం ప్రణాళికతో అభ్యసనం చేయాలి. దైన్నైనా ఆశావహ దృక్పథంతో తీసుకుని ముందుకు సాగాలి. ఏదైనా ఒక అంశం సరిగ్గా రాకపోతే రెండు మూడు సార్లు ప్రయత్నించడం వల్ల ఫలితం సాధించవచ్చు. ♦ ప్రతి విషయాన్ని ఒత్తిడిగా భావించి కుంగిపోకూడదు. ఇప్పుడున్న యువత ప్రతి ఒక్క విషయాన్ని స్నేహితులు, తల్లిదండ్రులతో పంచుకుంటున్నారు. ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. చనిపోవాలనే పరిస్థితులు ఎదురైనప్పుడు తమ భావాలను ఎవ్వరితోనూ పంచుకోలేకపోతున్నారు. మన సమస్యను నమ్మకస్తుల వద్ద పంచుకుంటే మనసు తేలికపడుతుంది. కన్నీళ్లు ఉప్పొంగి బయటికొస్తే బాధ దూరమవుతుందనే విషయాన్ని గుర్తించుకోవాలి. ♦ చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. అలాగని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. మనిషికి చదువు సంస్కారాన్ని నేర్పుతుందనే విషయాన్ని మరచిపోవద్దు. సమాజంలో ఎలా బతకాలో నేర్పించేది చదువు. ♦ బాధ ఉన్న సమయంలో చిన్నపిల్లలు ఉన్న చోట ఆడుకోవడం, అన్నీ మరచిపోయి వారితో కాసేపు సరదాగా గడపడం వల్ల కూడా ఒత్తిడి దూరమవుతుందని ఇటీవల పరిశోధనలు రుజువు చేశాయి. ♦ ప్రధానంగా సామాజిక మాధ్యమాలను మనకు ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. అనవసరమైన చర్యలు, సంబంధంలేని విషయాలను వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం వల్ల సమయం వృథా అవుతుంది. అంతేగాక మనపై ఒత్తిడి పెంచుతుందనే విషయాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులే ప్రధానం దేశాన్ని మార్చే శక్తి యువతలోనే ఉంది. సమాజంలో తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించేది కూడా యువతే. అలాంటప్పుడు విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటి..? లక్ష్యంవైపు అడుగులు వేసేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. వాటి పరిష్కారానికి ప్రయత్నించాలి. లేదంటే ఇంట్లో పెద్దలకు చెప్పాలి. ప్రపంచంలో అమ్మానాన్నలు మాత్రమే మీ సమస్యను పరిష్కరిస్తారు, దారి చూపిస్తారనే విషయాన్ని మర్చిపోవద్దు. – డాక్టర్ పి.సరళమ్మ,జిల్లా ప్రభుత్వ వైద్యశాలలసమన్వయాధికారిణి చర్చించండి మూడేళ్లలో మహిళలపై జరిగిన వేధింపుల కేసులు 1,372 నమోదయ్యాయి. అందులో ఈ ఒక్క ఏడాదిలోనే 2,083 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ వేధింపులు పెరిగాయని కాదు. మహిళలు ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి వారి సమస్యలు చెబుతున్నారు. పరిష్కారాలు చూపిస్తున్నాం. సమస్య ఉంటే అమ్మా, నాన్న, స్నేహితులతో చర్చించాలి. గుడికి వెళ్లి దేవుడికి దన్నంపెట్టి బాధను చెప్పుకున్నట్లే ధైర్యంగా స్టేషన్‌కు రండి. రోడ్డుపై భిక్షమెత్తుకునే 90 ఏళ్ల వృద్ధురాలికి కూడా సమస్య ఉంది. అలాగని ఆమె ఆత్మహత్య చేసుకోలేదే. దయచేసి బతుకుపై ఉన్న ధైర్యాన్ని వదలొద్దు. – నారాయణస్వామిరెడ్డి,మహిళా స్టేషన్ డీఎస్పీ, చిత్తూరు -
నిందితులను వదిలే ప్రసక్తేలేదు
చిత్తూరు అర్బన్: తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప మృతికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని కలెక్టర్ పిఎస్.ప్రద్యుమ్న తెలిపారు. ఆయన ఆదివారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడతూ శిల్ప ఆత్మహత్మకు కారకులపై ప్రాథమికంగా చర్యలు తీసుకున్నామన్నారు. అధ్యాపకులను విధుల నుంచి తొలగించామని, ప్రిన్స్‌పాల్‌ను బదిలీ చేశామన్నారు. మరికొందరు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కళాశాలలో మహిళలపై వేధింపులను నివారించడానికి ఉన్న కమిటీలు రద్దు చేసి, కొత్త వాటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మహిళలకు ఏవైనా ఇబ్బందులొస్తే వెంటనే చర్యలు తీసుకునేలా కమిటీలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. సీఐడీ నివేదిక ఆధారంగా నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కొనసాగుతున్న సీఐడీ విచారణ పీలేరు: డాక్టర్ శిల్ప ఆత్మహత్యపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించింది. కేసును సీఐడీకి అప్ప గించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం పీలేరు అర్బన్ సీఐ సిద్ధ తేజమూర్తి కేసుకు సంబందించిన రికార్డులను సీఐడీ డీఎస్పీ రమణకు అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ అధికారుల బృందం మృతురాలి తల్లిదండ్రులు రాధ, రాజగోపాల్, సోదరి శృతి, భర్త డాక్టర్ రూపేష్‌కుమార్‌రెడ్డి, ఇతర కుటుంబ సబ్యులను వేర్వేరుగా విచారిస్తున్నారు. మృతికి దారితీసిన వివరాలను సేకరించినట్టు తెలిసింది. అలాగే శిల్ప ఆత్మహత్య చేసుకున్న అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేశారు. ప్రొఫెసర్ల వేధింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన శిల్ప ఎటువంటి ఆరోపణలు, వాంగ్మూలం లేకుండానే ఎలా చనిపోయిందన్న కోణంలో సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. విచారణపై సీఐడీ అధికారులు ఎటువంటి వివరాలు వెల్లడించడం లేదు. విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు. -
గీతిక సూసైడ్ నోట్ దొరికింది
సాక్షి, తిరుపతి: పోలీసుల చేతికి మెడికో గీతిక సూసైడ్ నోట్ దొరికింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న గీతిక ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. గీతిక ఇటీవల ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తల్లికి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందులో భాగంగా గీతిక, తన తల్లి హరితా దేవికి ఇటీవల ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. మనస్తాపం చెందిన గీతిక, పెళ్లికి తల్లి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించి బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పిరికి దానిని కాదని..తప్పని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో తెలిపింది. ప్రేమించిన మనిషితో పెళ్లి జరగకుండా ఉండలేనని, జీవితంలో ఓడిపోతానని ఎప్పుడూ అనుకోలేదని, తనను క్షమించాలని పేర్కొంది. అయితే చదువులో వత్తిడి వల్లే తన కుమార్తె గీతిక ఆత్మహత్య చేసుకుందని, మరే ఇతర కారణాలు లేవని ఆమె తల్లి హరితా దేవి పేర్కొన్నారు. కాగా, గీతిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పూర్తి విచారణ చేసి వాస్తవాలు వెల్లడిస్తామని డీఎస్పీ ముని రామయ్య తెలిపారు. గీతిక రాసిన సూసైడ్ నోట్.. -
నిన్న శిల్ప.. నేడు గీతిక
తిరుపతి అర్బన్ : మెడికోల వరుస బలవన్మరణాలతో తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ఉలిక్కిపడింది. ఐదు రోజుల క్రితం పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతం మరువకముందే ఆదివారం సాయంత్రం ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గీతిక బలవన్మరణం విద్యార్థులను, వైద్యులను కలవరపాటుకు గురిచేసింది. వ్యక్తిగత కారణాలతోనే గీతిక ఆత్మహత్య చేసుకుందని తల్లి అంటున్నప్పటికీ వారంలోనే ఒకే మెడికల్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అశువులు బాయటం సర్వత్రా ఆందోళనకు తావిస్తోంది. భావి డాక్టర్ల బలవన్మరణాలు సమాజాన్ని అలజడికి గురిచేస్తున్నాయి. మెడికల్ కళాశాలలో అసలు ఏమి జరుగుతోందంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఇంటర్నల్ పరీక్షలు.. మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సోమవారం పాథాలజీ అంశంలో ఇంటర్నల్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే గీతిక మృతితో ఆ పరీక్షలు వాయిదా పడే అవకాశముందని వైద్య విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. పరీక్షలకు భయపడేంత విధంగా ఇంటర్నల్ పరీక్షలు జరగవని జూడాల నాయకులు చెబుతుండగా, పరీక్షల్లో ఏమైనా ఇబ్బందులకు భయపడి గీతిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా...? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కళాశాలలోనూ గీతిక ఎక్కువగా ఎవరితోనూ కలివిడిగా ఉండేది కాదని విద్యార్థులు అంటున్నారు. భరోసా ఇచ్చే చర్యలు శూన్యం.. ఒక్క ఎస్వీ మెడికల్ కళాశాలలోనే కాకుండా ఏ విద్యా సంస్థలోనైనా, విధి నిర్వహణ ప్రాంతా ల్లోనైనా వేధింపులు ఎదురైనప్పుడు వారికి భరోసా కలిగించే చర్యలు లేవనే చెప్పాలి. ఈ విషయంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు నిర్లక్ష్యంగానే ఉంటున్నారన్న ఆరోపణలకు ప్రస్తుత ఈ రెండు ఘటనలే నిదర్శనాలుగా నిలిచాయి. ఏదో ఘటన జరిగిన సందర్భంలో మాత్రమే హడావుడి చేసి, ఆ తర్వాత మిన్నకుండిపోవడం కూడా ఇలాంటి ఘటనలకు కారణ మవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్యలకు వ్యతిరేకంగాఅవగాహన కల్పించాలి.. కళాశాలల్లో, విధి నిర్వహణ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆత్మహత్యకు పాల్పడకుండా ఉండేలా నిరంతరం అవగాహనా సదస్సులు నిర్వహిస్తూ ధైర్యం నూరిపోయాలి. ఆ దిశగా అన్ని ప్రభుత్వ శాఖలూ శ్రీకారం చుట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ ప్రద్యుమ్న సూ చించిన వేధింపుల నివారణ కమిటీల ఏర్పాటునూ వేగవంతం చేయాలన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. అవసరమైతే ఈ అంశాలను హైస్కూల్ స్థాయిలోని పాఠ్యాంశాల్లోనే చొప్పించాల్సిన అవసరముంది. -
తిరుపతిలో మరో మెడికో ఆత్మహత్య
-
మరో మెడికో ఆత్మహత్య
తిరుపతి అర్బన్: తిరుపతి ఎస్వీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆదివారం రాత్రి తిరుపతిలో చోటుచేసుకున్న ఈ ఘటన తిరుపతిలో సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని మారుతీనగర్‌కు చెందిన హరితాదేవి తన కుమార్తె గీతికతో కలిసి తిరుపతి శివజ్యోతినగర్‌లో ఉంటున్నారు. గీతిక ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సోమవారం కాలేజీలో పాథాలజీ ఇంటర్నల్ పరీక్ష హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఎప్పటిలాగే ఇంట్లో భోజనం చేశాక గదిలోకి వెళ్లి చదువుకునేందుకు తలుపు వేసుకుందని ఆమె తల్లి హరితాదేవి తెలిపారు. కానీ, సాయంత్రం ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం కలిగి తలుపు తీసి చూస్తే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను హుటాహుటిన 108 వాహనంలో రుయా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందిందన్నారు. గీతిక మృతికి కారణాలు తెలియలేదు. కానీ, తమ కుమార్తె వ్యక్తిగత కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని హరితాదేవి తెలిపారు. కాగా, గీతిక తండ్రి వైఎస్సార్ కడప జిల్లాలో న్యాయవాదిగా పనిచేస్తూ రెండేళ్ల క్రితమే మృతిచెందారు. తల్లి హరితాదేవి కూడా కడపలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేసేవారు. అయితే, కుమార్తె మెడిసిన్ చదువు కోసమని రెండేళ్ల క్రితం టీచర్ వృత్తిని వదులుకుని తిరుపతిలో ఉంటున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గీతిక మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. వైద్య విద్యార్థుల దిగ్భ్రాంతి గీతిక ఆత్మహత్యతో వైద్య వర్గాలు, వైద్య విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె మృతి వార్త తెలుసుకుని నిర్ఘాంతపోయామని ప్రభుత్వ వైద్యుల సంఘం, జూనియర్ డాక్టర్ల సంఘం నేతలు శ్రీనివాసరావు, వెంకటరమణ, లావణ్య తెలిపారు. గీతిక మృతదేహాన్ని సందర్శించి హరితాదేవిని పరామర్శించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, నాయకులు కిశోర్, దాస్, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, డీవైఎఫ్ఐ నాయకులు రుయాకు చేరుకుని సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే పేద విద్యార్థుల వరుస ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న గీతిక మృతదేహాన్ని పరిశీలించారు. -
‘అలా చేసుంటే శిల్ప బతికేది’
సాక్షి, తిరుపతి: తన భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ముందే స్పందించివుంటే ఆమె బతికేదని డాక్టర్ శిల్ప భర్త రూపేశ్ అన్నారు. ఫిర్యాదు చేసిన ప్రతిసారీ శిల్పను చిన్నచూపు చూశారని వెల్లడించారు. మానసిక సంఘర్షణకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకునివుంటే శిల్ప ఆత్మహత్య చేసుకునేది కాదని ఆమె తండ్రి రాజగోపాల్ అన్నారు. తమను పరామర్శించిన వివిధ సంఘాల నాయకులతో వారు మాట్లాడారు. ఏడాదిన్నర పోరాడింది చిన్నప్పటి నుంచి శిల్పను గారాబంగా పెంచుకున్నామని, గోల్డ్ మెడల్ విద్యార్థి కావడంతో మెడిసిన్ పూర్తి చేసిందని రాజగోపాల్ తెలిపారు. పీజీ కోర్సు కూడా అయిపోతే తమ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని ఆశించామని, ఇలా జరుగుతుందని అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంత మంది ప్రొఫెసర్లు వ్యవహరిస్తున్న తీరుపై శిల్ప ఫిర్యాదు చేసిందని, ఏ స్థాయిలోనైనా చర్యలు తీసుకునివుంటే తమకు కడుపుకోత మిగిలేది కాదన్నారు. మెడికల్ కాలేజీలో జరుగుతున్న అన్యాయాలపై ఏడాదిన్నరగా శిల్ప పోరాడుతూనే ఉందని, ఎన్నోమార్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. మే నెలలో గవర్నర్ కూడా ఫిర్యాదు చేసిందని, దీంతో కక్ష కట్టి పరీక్షల్లో శిల్పను ఫెయిల్ చేశారని ఆరోపించారు. దోషులను చట్టప్రకారం శిక్షించాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాలని వేడుకున్నారు. ఇద్దరిపై కేసులు డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతంలో ఆమె సోదరి శృతి ఫిర్యాదు మేరకు రవికుమార్, కిరీటి శశికుమార్ లపై కేసులు నమోదు చేసినట్టు పీలేరు సిఐ సిద్ధ తేజోమూర్తి తెలిపారు. ఐపీసీ 354 డీ,509, 506, 306, 34 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు పెట్టినట్టు వెల్లడించారు. కాగా, శిల్ప ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని ఎస్వీ మెడికల్ కాలేజీ జూనియర్ వైద్యులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నిర్లక్ష్యమే ప్రాణం తీసింది డాక్టర్ శిల్ప ఫిర్యాదు చేసినప్పుడే స్పందించివుంటే ఇంత అమానుషం జరిగేది కాదని మహిళా ఐక్యవేదిక, సీపీఎం అనుబంధ సంస్థ ఐద్వా సభ్యులు అన్నారు. శిల్పను నమ్ముకున్న కుటుంబ సభ్యులు, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా శోకం మిగిలిందని పేర్కొన్నారు. శిల్ప కుటుంబ సభ్యులను శనివారం మహిళా సంఘాల ప్రతినిధులు పరామర్శించారు. -
నిర్లక్ష్యమే ఉసురు తీసిందా!?
తిరుపతి అర్బన్: తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకెదురవుతున్న లైంగిక వేధింపులపై చేసిన ఫిర్యాదుపై సాక్షాత్తు రాష్ట్ర గవర్నరే స్పందించినా అదే స్థాయిలో ఇతర అధికారులు స్పందించకపోవడం, విచారణ చేసి నాలుగు నెలలైనా వాస్తవాలేమిటో వెల్లడించకపోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. బాధితురాలు విచారణ నివేదిక బహిర్గతం చేయాలని ఎన్నోసార్లు మొత్తుకున్నా ఆమె ఘోష అరణ్య రోదనే అయ్యింది. మరోవైపు– కాలేజీలో వేధింపుల పర్వం మరింత ఎక్కువైందని జూనియర్ డాక్టర్ల వాదన. ఈ నేపథ్యంలో పీజీ పరీక్షలు జరిగాయి. పీజీ పరీక్షల్లోనూ డాక్టర్ శిల్ప కు ముగ్గురు సమస్యలు సృష్టించారని ప్రచారంలోకి వచ్చింది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్‌తోపాటు ప్రొఫెసర్లు డాక్టర్ కిరీటి, డాక్టర్ శశికుమార్ ఇబ్బందులు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..‘‘మహిళలను వేధిస్తే కఠినంగా వ్యవహరిస్తాం..వారి రక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటాం..’ అని వివిధ సందర్భాల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించినా, మహిళలను వేధిస్తే ఖబడ్దార్ అనే లెవెల్లో పోలీసులు ఊదరగొట్టినా శిల్పకు ఎవరి అండా లభించలేదని, అడుగడుగునా అవరోధాలే ఎదురయ్యాయని వైద్య విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఆమె ఫిర్యాదులపై సకాలంలో స్పందించి, విచారణ వేగవంతం చేసి, నివేదిక బహిర్గతం చేసి ఉంటే ఒక నిండుప్రాణం బలయ్యేది కాదని వైద్య విద్యార్థి లోకం ఘోషిస్తోంది. ‘అధికార’ రాజకీయ ఒత్తిళ్లు తనను వేధిస్తున్నారంటూ డాక్టర్ శిల్ప గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న డాక్టర్, ఆయనకు సహాయంగా ఉంటున్నారన్న ఇద్దరు ప్రొఫెసర్లకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆమెపై వివిధ రూపాల్లో ‘కాముకాసురులు’ రెచ్చిపోయారు. ఈ కాముకాసురులు వేధింపులు శృతి మించుతుండడంతో శిల్ప అలిపిరి పోలీసులను కూడా ఆశ్రయించారు. అయితే అధికార, రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా కావడంతో విధిలేక ఆమె ఫిర్యాదును వెనక్కు తీసుకున్నట్లు కాలేజీ వర్గాల్లో బలంగా వినబడుతోంది. అటు ఉన్నత స్థాయి అధికారులే కాకుండా చివరకు పోలీసు వ్యవస్థ కూడా ఆమెకు అండగా నిలబడకపోవడం శాపమైంది. దీంతో మానసిక ఒత్తిళ్లతో ఆమె నలిగిపోయారు. పీజీ పరీక్షల ఫలితాలతో మరింత కుంగుబాటుకు గురైనట్లు తెలుస్తోంది. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న తనకే న్యాయం జరగలేదంటే, మిగిలిన వారి పరిస్థితి ఏమిటో? అని సన్నిహితుల వద్ద ఆమె కన్నీటిపర్యంతమైనట్లు తెలియవచ్చింది. అంతటా ఆధిపత్య పోరే మెడికల్ కాలేజీలో విభాగాధిపతులు, వైద్య అధ్యాపకులు, వైద్యుల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న పోరు, ఆధిపత్యం, వివాదాలకు ప్రతిసారీ వైద్య విద్యార్థులే పావులుగా మారుతున్నారనే వాదన వినిపిస్తోంది. విభాగాధిపతులతో సన్నిహితంగా ఎవరు వ్యవహరించినా మరో వర్గం దానిని భూతద్దంలో చూపేందుకు ప్రయత్నిస్తూంటుందని మరో వాదన. ఇలాంటి కోవకే పీజీ విద్యార్థిని శిల్ప వ్యవహారం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ వైద్య విద్య కోర్సులతో పాటు ఎంబీబీఎస్, ఎండీ కోర్సులను సుదూర ప్రాంతాల విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వారు బస చేసే హాస్టళ్లలోను వైద్య విభాగా«ధిపతులు, ప్రొఫెసర్లు రాత్రి వేళల్లో మకాం వేసి, తమకు అనుకూలంగా వ్యవహరించేలా వారిపై నయానో భయానో ఒత్తిళ్లు తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో వచ్చిన విద్యార్థులకు వీరి చర్యలు కంపరం కలిగిస్తున్నా మౌనంగా భరిస్తున్నారని, ఒకవేళ తెగించి గళం విప్పితే, ముప్పేటలా దాడి చేసి, చివరకు వారికి జీవితమే లేకుండా చేస్తున్నారనడానికి శిల్ప ఉదంతమే ఓ ఉదాహరణ అని విద్యార్థిలోకం, మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. తల్లి, తండ్రి తర్వాత గురువే దైవమని చెప్పుకునే మన సంస్కృతిలో ఇప్పుడు గురువుల స్థానం ఏమిటో ఇలాంటి ఉదంతాలు సమాజానికి ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటాయని సైకాలజిస్టులు అంటున్నారు. కొందరు గురువుల తీరు మారకపోతే నష్టపోయేది సమాజమే. ఇకనైనా ప్రభుత్వం ఇబ్బందులు లేని విద్యాభ్యాసానికి భరోసా ఇచ్చే దిశగా కార్యాచరణకు పూనుకోవాలని పలువురు కోరుతున్నారు. పీలేరులో సీఐడీ అధికారుల విచారణ పీలేరులోని శిల్ప ఇంట శుక్రవారం సీఐడీ అధికారులు ఆమె తల్లిదండ్రులను కలిశారు. కుటుంబ సభ్యులను విచారణ చేశారు. శిల్ప ఆత్మహత్యకు దారితీసిన సంఘటనలు గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి డాక్టర్ శిల్ప మృతి ఘటన చిత్తూరు కలెక్టరేట్ : ఎస్వీ మెడికల్ కాలేజ్ పీజీ వైద్యవిద్యార్థిని శిల్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి కలెక్టర్ ప్రద్యుమ్న తీసుకెళ్లారు. శుక్రవారం కలెక్టర్ అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. శిల్ప మృతితో ఎస్వీ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న పరిణామాలు, జూనియర్ డాక్టర్ల ఆందోళనలు, శిల్ప తల్లిదండ్రుల డిమాండ్లు తదితర అంశాలను ముఖ్యమంత్రికి ఆయన నివేదించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి శిల్ప మృతి సంఘటనపై సీఐడీ విచారణను వేగవంతంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వ డాక్టర్లతో సమావేశం నిర్వహించి, నిరుపేద రోగులకు వైద్య సేవలను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రుయాలో ముదురుతున్న వివాదం
సాక్షి, తిరుపతి : ఎస్వీ మెడికల్ కాలేజీ విద్యార్థి డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసు రోజురోజుకు ముదురుతోంది. శిల్ప మృతి ఘటనలో ప్రొఫెసర్లపై చర్యలను నిరసిస్తు రుయాలో సీనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. రోజు గంటపాటు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయనున్నట్లు డాక్టర్లు ప్రకటించారు. దీనిపై సోమవారం ప్రభుత్వం చర్చలు జరుపునున్నామని డాక్టర్లు తెలిపారు. మరోవైపు ప్రొఫెసర్లపై చర్యలు ఉపసంహరించుకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామంటూ జూడాలు హెచ్చరిస్తున్నారు. కాగా ఎస్వీ మెడికల్ కాలేజీ విద్యార్థి శిల్ప ప్రొఫెసర్ల వేధింపుల కారణంగా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వివాదం కారణంగా కాలేజీలో జూనియర్, సీనియర్ డాక్టర్ల్ మధ్య తీవ్ర విభేదాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో కాలేజీ ప్రిన్సిపల్ రమణయ్యను సస్పెండ్ చేయడాన్ని సీనియర్ డాక్టర్లు తప్పుపడుతున్నారు. శిల్ప ఆత్మహత్య తరువాత జరిగిన పరిణామాలపై సీనియర్ డాక్టర్లు అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రిన్సిపల్ రమణయ్యను తిరిగి విధుల్లోకి చేర్చాలంటూ సీనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తుండగా.. అదే సమయంలో ప్రిన్సిపల్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే ఉద్యమం తప్పదంటూ జూనియర్ డాకర్లు హెచ్చరిస్తున్నారు. జూనియర్ డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకోవడానికి వైద్యులు కారణం కాదని, కుటుంబ వ్యవహారాలే కారణమని ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
డాక్టర్ శిల్ప మృతిపై సమగ్ర విచారణ జరగాలి
-
సీనియర్ డాక్టర్లు వర్సెస్ జూనియర్ డాక్టర్లు
సాక్షి, తిరుపతి : ఎస్వీ మెడికల్ కాలేజీ విద్యార్థి డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసును ప్రభుత్వం స్పేషల్ ఇన్వేష్టిగేషన్ టీం (సిట్)కు అప్పగించింది. సిట్ అధికారిగా చిత్తూరు డీఎస్పీ రమణ కుమార్‌ను నియమించారు. శిల్ప మృతికి కారణమైన ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆమె కుటుంబ సభ్యులు కోరారు. కాగా ఎస్వీ మెడికల్ కాలేజీ విద్యార్థి డాక్టర్ శిల్ప ప్రొఫెసర్ల వేధింపులు కారణంగా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సీనియర్ డాక్టర్లు వర్సెస్ జూనియర్ డాక్టర్లు డాక్టర్ శిల్ప మృతి ఘటనలో ప్రిన్సిపల్ రమణయ్యను సస్పెండ్ చేయడాన్ని సీనియర్ డాక్టర్లు తప్పుపడుతున్నారు. శిల్ప ఆత్మహత్య తర్వాత జరిగిన పరిణామాలపై సీనియర్ డాక్టర్లు అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రిన్సిపల్ రమణయ్యను తిరిగి విధుల్లోకి చేర్చాలంటూ సీనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రిన్సిపల్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే ఉద్యమం తప్పదంటూ జూనియర్ డాకర్లు హెచ్చరిస్తున్నారు. శిల్ప మృతికి వైద్యుల కారణం కాదు జూనియర్ డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకోవడానికి వైద్యులు కారణం కాదని, కుటుంబ వ్యవహారాలే కారణమని ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. శిల్ప మృతికి సంబంధించి సమగ్ర విచారణ జరగాలని అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. డాక్టర్లను కామాంధులుగా చిత్రీకరించడం బాధగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. డాక్టర్లపై చర్యలు ఎమోషనల్‌గా తీసుకున్న నిర్ణయాలగా పేర్కొన్న వెంకటేశ్వర్లు.. ప్రిన్సిపల్‌ను విధులు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదన్నారు. పీలేరులో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య -
వేధింపులే చంపేశాయి
-
అధ్యాపకులే కాలయములు
సాక్షి, తిరుపతి /పీలేరు: అధ్యాపకులే అపర కీచకుల్లా వ్యవహరించారు. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన వైద్య విద్యార్థినిని లైంగికంగా వేధింపులకు గురిచేశారు. వివాహిత కూడా అయిన ఆమె వీరి వేధింపులు భరించలేక గతంలో పలుమార్లు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన పట్టించుకోలేదు. వేధింపులు కొనసాగడంతో గత ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు, మంత్రి లోకేశ్‌కు సదరు విద్యార్థిని ఫిర్యాదు చేసింది. దీంతో కక్షగట్టిన ప్రొఫెసర్లు పరీక్షల్లో ఫెయిల్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవంతంగా తన ప్రాణాలు తీసుకుంది. విద్యార్థుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన రాజగోపాల్, రాధ దంపతుల మొదటి సంతానం శిల్ప. ఐదేళ్ల క్రితం శిల్పకు రూపేష్ కుమార్‌తో ప్రేమ వివాహం జరిగింది. శిల్ప ప్రస్తుతం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో పీడీయాట్రిక్ విభాగంలో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు అయిన రవికుమార్, శశికుమార్, కిరీటి తనను లైంగికంగా వేధిస్తున్నట్టు ఆమె గతంలో పలుమార్లు కళాశాల ప్రిన్సిపల్ రమణయ్యకు ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపల్ వైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో గత ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, మంత్రి నారా లోకేశ్‌కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. స్పందించని మంత్రి... విచారణకు ఆదేశించిన గవర్నర్ శిల్ప ఫిర్యాదుపై మంత్రి లోకేశ్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. గవర్నర్ నరసింహన్ మాత్రం స్పందించి, ఫిర్యాదుపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీని ఆదేశించారు. వీసీ ఆ ఫిర్యాదును ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌కు పంపారు. డిపార్ట్మెంట్ వారితో విచారణకు ఓ కమిటీని నియమించిన ప్రిన్సిపల్.. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేశారు. ఈ నేపథ్యంలో శిల్ప ఆరోపించినట్లుగా ఏమీ జరగలేదంటూ కళాశాలలో ప్రచారం జరిగింది. దీంతో శిల్ప డిపార్ట్మెంట్తో సంబంధం లేని అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ ప్రద్యుమ్న తిరుపతి సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ నివేదిక ఇప్పటికీ వెలువడలేదు. ఇంతలో ఫైనల్ ఇయర్ పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షల్లో శిల్ప థియరీలో పాసై ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ అయ్యింది. ఆత్మహత్య చేసుకున్న శిల్ప ఈ నేపథ్యంలో.. చిత్తూరు జిల్లా పీలేరులోని జాగృతి అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న శిల్ప సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భర్త రూపేష్‌కుమార్ తన వైద్యశాల నుంచి మంగళవారం ఉదయం నివాసానికి చేరుకున్నారు. ఎంత పిలిచినా భార్య స్పందించకపోవడంతో తలుపు పగలగొట్టి చూశారు. శిల్ప ఫ్యానుకు ఉరివేసుకుని కన్పించింది. విషయం తెలుసుకున్న సహచర జూనియర్ డాక్టర్లు కళాశాలలో విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. శిల్ప ఆత్మహత్యకు కారణమైన వారందరిపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు శిల్ప ఆత్మహత్యకు ప్రొఫెసర్లు రవికుమార్, శశికుమార్, కిరీటే కారణమంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థుల ఆందోళన అంతకంతకూ తీవ్రం కావడం, పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో.. ప్రొఫెసర్ రవికుమార్‌ను సస్పెండ్ చేస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బాబ్జి ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు బుధవారం తిరుపతిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. అదే విధంగా శిల్ప ఆత్మహత్యపై తనతో సహా ముగ్గురితో మరోసారి కమిటీని ఏర్పాటు చేశారు. అయినా శాంతించని విద్యార్థులు శిల్ప ఆత్మహత్యకు కారణమైన వారినందరిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. విద్యార్థిని చనిపోతే తప్ప స్పందించరా? అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే శిల్ప చనిపోయి ఉండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేధింపులు ఒక్క శిల్పకే కాదని, అన్ని విభాగాల్లో విద్యార్థినులు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ రాత్రి కూడా కళాశాలలోనే బైఠాయించారు. కేసు సీఐడీకి జూనియర్ డాక్టర్ శిల్ప ఆత్మహత్యపై పీలేరు పోలీస్ స్టేషన్లో కేసు ( క్రైమ్ నంబర్ 101/18) నమోదు చేసినట్టు డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఎమ్మెల్యే ఆర్కే రోజా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ఆమె మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, డాక్టర్ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డాక్టర్ శిల్ప మృతదేహం వద్ద పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి రోజా నివాళులర్పించారు. ముగ్గురు ప్రొఫెసర్లను 24 గంటలలోపు అరెస్ట్ చేíసి రిమాండ్‌కు తరలించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు, విద్యార్థులతో ఉద్యమిస్తామని హెచ్చరించారు. జిల్లాలోని ఐదుమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం త్వరలోనే గవర్నర్‌ను కలసి శిల్ప ఆత్మహత్యపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. చాలా విభాగాల్లో ఇదే పరిస్థితి డాక్టర్ శిల్ప ఫిర్యాదు చేసినా సకాలంలో బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఇలాంటి వేధింపులు చాలా విభాగాల్లో ఉన్నాయి. భవిష్యత్‌లో ఇలాంటి వేధింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ వెంకట రమణ, జూడా అసోసియేషన్ అధ్యక్షుడు కారకులను కఠినంగా శిక్షించాలి నాన్ డిపార్ట్మెంటల్ కమిటీ నివేదికను బయట పెట్టాలి. కారకులకు కఠిన శిక్ష పడాలి. అన్ని విభాగాల్లో పీజీ, యూజీ విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. – డాక్టర్ మౌర్య, పీజీ విద్యార్థి అత్యవసర విధులు బహిష్కరణ శిల్ప మరణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకు అత్యవసర విధులు కూడా బహిష్కరిస్తున్నాం. కళాశాలలో విద్యార్థినులకు రక్షణ కావాలి. మాకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. – డాక్టర్ లావణ్య, పీజీ విద్యార్థిని -
శిల్ప ఆత్మహత్య కేసు : ప్రొఫెసర్‌పై వేటు
సాక్షి, పీలేరు : జూనియర్ డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసుపై ప్రభుత్వం స్పందించింది. ఆత్మహత్యకు ప్రొఫెసర్ రవికుమార్ కారణమని బంధువులు ఆందోళనకు దిగడంతో రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. శిల్ప ఆత్మహత్యపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయాలని ఆదేశించారు. డీఎంఈ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రొఫెసర్లను కాకుండా ఒక్క రవికుమార్నుమాత్రమే సస్పెండ్ చేయడంపై జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా ఇద్దరు ఫ్రొఫెసర్లు డాక్టర్ కిరీటి, శివకుమార్లను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శిల్ప ఆత్మహత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. శిల్పను ప్రొఫెసర్ రవికుమార్ లైంగిక వేధింపులకు గురిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా నిన్న సాయంత్రం విడుదలైన పీజీ ఫలితాల్లో శిల్ప ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారనే కోపంతోనే కావాలని ప్రొఫెసర్లు ఫెయిల్ చేశారని, ఆ బాధతోనే శిల్ప ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముసుగు వీడేనా..!
తిరుపతి (అలిపిరి) : ఎస్వీ మెడికల్ కళాశాల పిడియాట్రిక్ పీజీ ఫైనలియర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వైద్యులపై చేపట్టిన విచారణ ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వ అధికారులతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ పది రోజుల పాటు వైద్యులను, విద్యార్థులతోపాటు బాధితురాలిని విచారించింది. కమిటీ సభ్యులు మరో రెండు రోజుల్లో నివేదికను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు అందజేయనున్నారు. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుల్లో టెన్షన్ మొదలైంది. పకడ్బందీగా విచారణ ఎస్వీ మెడికల్ కళాశాల పిడియాట్రిక్ వైద్యుల లైంగిక వేధింపుల ఆరోపణలపై జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. ఇందులో చిత్తూరు అడిషనల్ ఎస్పీ, ఐసీడీఎస్ పీడీ, డీఎం అండ్ హెచ్‌వో, తిరుపతి ఇన్చార్జ్ ఆర్డీవో, తుడా సెక్రటరీ ఉన్నారు. ఈ కమిటీ విచారణను పకడ్బందీగా చేపట్టింది. పిడియాట్రిక్ వైద్యులు, విద్యార్థులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటు బాధిత విద్యార్థినిని విచారించింది. విచారణకు సంబంధించిన విషయాలు బయటకు పొక్కకుండా కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. విచారణకు సంబంధించిన నివేదికను మరో రెండు రోజుల్లో తుదిరూపునకు తీసుకొచ్చి కలెక్టర్‌కు సమర్పించనున్నారు. పిడియాట్రిక్ విభాగాధిపతిపై ప్రత్యేక విచారణ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్‌ను కమిటీ ప్రత్యేకంగా విచారించింది. గతంలో ఆయన ప్రవర్తన తీరు ఎలా ఉంది, ఆరోపణలు ఉన్నాయా.. అన్న కోణంలోనూ విచారణ చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు వైద్యులు డాక్టర్ కిరీటి, డాక్టర్ శశికుమార్‌ను విడివిడిగా విచారించినట్లు సమాచారం. వైద్య విద్యార్థిని వెనుక ఒక ప్రొఫెసర్ ఉండి రెచ్చగొట్టడం వల్లే తమపై ఇలా ఆరోపణలు చేసినట్లు సంబంధిత వైద్యులు చెప్పుకొచ్చినట్లు సమాచారం. కొందరు పిడియాట్రిక్ వైద్య విద్యార్థులు సాక్షితో మాట్లాడుతూ కమిటీ లైంగిక వేధింపులపై ప్రశ్నించినప్పుడు వైద్యులు విద్యార్థినులపై మండిపడడం సహజమేనని, లైంగిక వేధింపులు జరిగాయా అన్నది తమకు తెలియదని చెప్పుకొచ్చారు. వైద్యులను కాపాడే ప్రయత్నం లైంగిక వేధింపులపై ఎస్వీ మెడికల్ కళాశాల పిడియాట్రిక్ వైద్య విద్యార్థిని గవర్నర్‌కు లేఖ రాయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ ఆదేశాల మేరకు ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణయ్య అధ్యక్షతన సీనియర్ వైద్యులు జమున, జయాభాస్కర్, సిద్ధానాయక్ ఈ నెల ఒకటో తేదీ నుంచి వారం రోజులు విచారణ చేపట్టారు. కమిటీకి అధ్యక్షత వహించిన డాక్టర్ రమణయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, డాక్టర్ కిరీటి, డాక్టర్ శశికుమార్‌కు అనుకూలంగా ప్రకటన చేసి నివేదికను లీకు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేపట్టారు. ఎస్వీఎంసీ ప్రిన్సిపాల్ రమణయ్య, ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ కిరీటీలదీ తెనాలి కావడంతో సహచర బృందాన్ని ఎలాగైనా కాపడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌కు నివేదిక అందిన తరువాత నేరుగా చర్యలు తీసుకుంటారా..? వైద్య ఆరోగ్య శాఖకు రెఫర్ చేస్తారా..? హెల్త్ వర్సిటీ వీసీకి పంపుతారా.. అన్నది తెలియాల్సి ఉంది. మూడేళ్లుగా వేధించిన తీరును వివరించా మూడేళ్లుగా తనను లైంగికంగా వేధించిన తీరును కమిటీకి వివరించా. అసలు పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్ ఒక ప్రొఫెసర్‌గా అనర్హుడని చెప్పా. నా దగ్గర ఉన్న సాక్షాలను కమిటీకి అందజేశా. – పిడియాట్రిక్ వైద్య విద్యార్థిని, ఎస్వీఎంసీ, తిరుపతి -
ఎస్వీ మెడికల్ కాలేజీలో జూడాల సమ్మె
తిరుపతి: తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. తమ సమస్యలు తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జూడాల సమ్మెతో వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే సమ్మెను తీవ్రతరం చేస్తామని వారు చెబుతున్నారు. -
ఇక వైద్య కళాశాలల్లో ఈ–శవాలు
-
ఇక వైద్య కళాశాలల్లో ఈ–శవాలు
⇒ శరీర ధర్మశాస్త్రం తెలుసుకునేందుకు శవాలే అక్కర్లేదు ⇒ ఎలక్ట్రానిక్ శవాల ద్వారా శస్త్రచికిత్సలతో పాటు సరికొత్త అధ్యయనానికి శ్రీకారం ⇒ సిమ్యులేటరీ ల్యాబొరేటరీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ⇒ ముందుగా రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏర్పాటు సాక్షి, అమరావతి: వైద్య విద్యార్థులకు శరీర ధర్మశాస్త్రం వివరించాలంటే ఇకపై శవం కోసం వేచియుండాల్సిన అవసరం లేదు. బ్లాక్ బోర్డుపై బొమ్మలు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. సరికొత్త సాంకేతిక వైద్య విద్యలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాలే శవాలుగా వచ్చాయి.తద్వారా అధ్యయనం చేసుకునే అవకాశం మన విద్యార్థులకూ దక్కనుంది. రాష్ట్రంలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సిమ్యులేటరీ ల్యాబొరేటరీల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం అనుమతించింది. దీనికోసం ఒక్కో కళాశాలకు రూ.20 కోట్ల వ్యయం కానుంది. ఆపరేషన్ చేసిన అనుభూతి.. సిమ్యులేటరీ విధానం అనేది ఒక ఎలక్ట్రానిక్ వైద్య విద్య. మానవ భౌతికకాయం తరహాలోనే సృష్టించిన ఎలక్ట్రానిక్ శవం. గుండె, నరాలు, మెదడు, ఎముకలకు సంబంధించిన శస్త్రచికిత్సల కోసం ఇందులో ఒక ప్రోగ్రామ్ తయారై ఉంటుంది. దీని ద్వారా నేరుగా శస్త్రచికిత్స చేసినంత అనుభూతి కలుగుతుంది. ఆ సమయంలో రక్తస్రావం జరుగుతున్నట్టు, గుండె కొట్టుకుంటున్నట్టు, ఊపిరితిత్తుల్లో శ్వాసప్రక్రియ జరుగుతున్న అనుభూతి కలుగుతుంది. గుండెపోటు వచ్చిన వ్యక్తికి స్టెంట్ వేసే పరిస్థితి క్లిష్టంగా ఉంటే.. ముందుగా దానిని సిమ్యులేటరీ పరికరంలో అధిగమించి.. ఆ తర్వాత రోగికి శస్త్రచికిత్స చేయొచ్చు. ఇలా మోకాలి నుంచి మెదడు శస్త్రచికిత్సల వరకూ ఏదైనా సరే ముందు మనిషి అవయవాలతో పోలిన కృత్రిమ యంత్రాలపై చేసుకునే అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్స అయిపోగానే తిరిగి ఆ ప్రోగ్రామ్‌ను యథాస్థితిలోకి తీసుకురావచ్చు. మూడు కళాశాలలకు అనుమతి కేంద్రం ఏపీలో స్కిల్ ల్యాబ్స్(సిమ్యులేటరీ) ఏర్పాటుకు మూడు కళాశాలలను గుర్తించింది. ఇందులో తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కళాశాల, విశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాల, గుంటూరు మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఇప్పటికే తిరుపతి ఎస్వీ కళాశాలకు దీనిని మంజూరు కూడా చేశారు. ప్రస్తుతానికి ఎంబీబీఎస్ అభ్యర్థులకే ఇది అందుబాటులోకి తెస్తున్నారు. భవిష్యత్‌లో పీజీ వైద్య విద్యా రులూ ఈ విద్యను అభ్యసించే అవకాశం కల్పించనున్నారు. -
ఎస్వీ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్
ఫేర్వెల్ డే ప్రాక్టీస్ ముసుగులో తీవ్ర వేధింపులు హడలిపోతున్న జూనియర్లు సర్దుకు పోవాలంటున్న అధ్యాపకులు తిరుపతి మెడికల్: దశాబ్దాల చరిత్ర కలిగిన తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పరిచయం పేరుతో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేస్తుండడంతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు హడలిపోతున్నారు. చిత్ర, విచిత్ర, వెకిలి చేష్టలతో తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారని బాధిత విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోక పోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ధైర్యం చేసి ఒకరిద్దరు మౌఖికంగా ఫిర్యాదు చేసినా.. సర్దుకోండి అంటూ అధ్యాపకులు చెప్పి పంపేస్తున్నారని కొందరు జూనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016-17 విద్యా సంవత్సరానికి గాను ఈనెల 3వ తేదీ నుంచి అనాటమి, పిజియాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాలలో తరగతులు ప్రారంభం అయ్యాయి. ఫేర్వెల్ డే ప్రాక్టీస్ పేరుతో తరగతులు ముగిసి చీకటి పడ్డాక కూడా డే స్కాలర్లను ఇళ్లకు పంపకుండా ర్యాగింగ్ చేస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థినుల పరిస్థితి మరీ ఘోరంగా మారిందని సమాచారం. కాగా, ర్యాగింగ్ నిరోధానికి చర్యలు తీసుకున్నామని, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని అధ్యాపకులు చెబుతున్న మాటల్లో ఇసుమంతైనా వాస్తవం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. శనివారం రాత్రి పొద్దుపోయేదాకా హాస్టల్లో ర్యాగింగ్ కొనసాగినట్లు సమాచారం. -
జూడాల ఆందోళన.. జీవో కాపీల దహనం
తిరుపతి కార్పొరేషన్ : ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 107 ప్రతులను జూనియర్ డాక్టర్లు దాహనం చేశారు. జూనియర్ డాక్టర్లు చేపడుతున్న సమ్మెలో భాగంగా రెండవ రోజైన మంగళవారం రుయాలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిం చారు. వీరికి సీనియర్ రెసిడెన్సీ డాక్టర్లు మద్దతు పలికారు. జూడాలు రుయా ప్రధాన కార్యాలయం నుంచి ర్యాలీగా ఎస్వీ మెడికల్ కళాశాల ఆడిటోరియం వరకు చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదలు చేశారు. మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ పైలాన్ వద్దకు చేరుకున్న జూనియర్ డాక్టర్లు 107 జీవో నెంబరును తగలబెట్టారు. జూడా ప్రధా న కార్యదర్శి ఇజాజ్ మాట్లాడుతూ వైద్య వృత్తి ఉనికికే ప్రమాదకరంగా మారిన ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. రూరల్ సర్వీసుకు తాము ఎంత మా త్రమూ వ్యతిరేకం కాదని, అయితే తమ ను శాశ్వత వైద్యులుగా నియమిస్తే పేదలకు అంకిత భావంతో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రూరల్ సర్వీసు చేయాలంటే అక్కడ రెసిడెన్సీ, నెలనెలా సరైన వేతనాలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. మరి అవి ఏవీ ఏర్పాటు చేయకుండానే సర్వీసు చేయమంటే ఎలా సాధ్యమో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇవి ఏవీ చేయనప్పుడు తమ చేత రూ.20 లక్షల బాండును ఎందుకు బలవంతంగా తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. పైగా మంత్రి వ్యాఖ్యలు అప్రజాస్వామ్యం గా ఉన్నాయని, ఉద్యమాలను హేళన చేస్తే జూడాల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. ఇప్పటికైనా మంత్రి వ్యాఖ్యలు వె నక్కి తీసుకోవాలని, లేకుంటే నేటి నుం చి అత్యవసర సేవలను బంద్ చేసేం దుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. -
జూనియర్ డాక్టర్ల సమ్మె బాట
తిరుపతి కార్పొరేషన్ : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. ముందుగా ప్రకటించిన విధంగానే సోమవారం ఉదయం విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు రుయా ఆస్పత్రి వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. రుయా ఆస్పత్రితో పాటు మెటర్నటీ హాస్పిటల్, ఎస్వీ మెడికల్ కళాశాలకు చెందిన పీజీ,యూజీ, హౌస్ సర్జన్లు క్యాజువాలిటీ, ఐసీయూ, ఏఎంసీ, ఆర్ఐసీయూ విభాగాల్లో మినహా మిగిలిన వైద్య సేవలను బహిష్కరించారు. రుయా ఆస్పత్రి ఆవరణలో పెద్ద ఎత్తున జూడాలు గుమికూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వానిది బ్లాక్‌మెయిలింగ్ ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ తమను ప్రభుత్వం బ్లాక్‌మెయిలింగ్ చేస్తోందన్నారు. పీజీలో ఏడాదిపాటు విధిగా గ్రామీణప్రాంతంలో పనిచేయాలనే నిబంధన పెడుతున్నారన్నారు. లేకుంటే నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల జామీనుతో కూడిన రూ.20 లక్షలు బాండ్ తీసుకుంటున్నారని ఆరోపించారు. నిరుపేదలు, గ్రామీణ ప్రాంతం, రైతు కుటుంబాల నుంచి వచ్చిన తాము రూ.20 లక్షలు ఏ విధంగా బాండ్ ఇస్తారని నిలదీశారు. పోనీ గ్రామీణ ప్రాంతంలో వైద్యసేవలు చేయిస్తారా అంటే అదీ లేదన్నారు. కేవలం ఎంసీఐ వారికి కళాశాలలో సీట్ల సంఖ్యను చూపించుకునేందుకు తమను ఎరగా వాడుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. పీహెచ్‌సీల్లో పోస్టులు భర్తీ చేయండి గ్రామీణ ప్రాంతంలోని పీహెచ్సీలో పర్మినెంట్ వైద్యుల పోస్టులను భర్తీ చేయకుండా, ఆ పోస్టుల్లో పేరుకు జూనియర్ డాక్టర్లను హౌస్సర్జన్లుగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. పర్మినెంట్ పోస్టులు కల్పిస్తే పల్లెకు పోవడానికి మామే సిద్ధం. మమ్మల్ని శాశ్వత ఉద్యోగానికి పంపడానికి మీకు దమ్ముందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఏడాది పాటు వైద్య సేవలు చేయమంటే ఎలా సాధ్యమవుతుందన్నారు. పైగా ఆ హాస్పిటల్స్‌లో ఖాళీలను భర్తీచేస్తే వేతనాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వం స్వార్థం కోసం జూనియర్ డాక్టర్లను వాడుకుని వదిలేస్తోందని ధ్వజమెత్తారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే అత్యవసర సేవలను కూడా స్తంభింప జేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో జూడా అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి ఇజాజ్, ఉపాధ్యక్షుడు నిఖిల్ప్రవీణ్, సంయుక్త కార్యదర్శి నాగరాజు రాయల్, రామ్‌భూపాల్‌రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.