ఎస్వీ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్
ఫేర్‌వెల్ డే ప్రాక్టీస్ ముసుగులో తీవ్ర వేధింపులు
హడలిపోతున్న జూనియర్లు
సర్దుకు పోవాలంటున్న అధ్యాపకులు
తిరుపతి మెడికల్: దశాబ్దాల చరిత్ర కలిగిన తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పరిచయం పేరుతో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేస్తుండడంతో హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు హడలిపోతున్నారు. చిత్ర, విచిత్ర, వెకిలి చేష్టలతో తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారని బాధిత విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోక పోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ధైర్యం చేసి ఒకరిద్దరు మౌఖికంగా ఫిర్యాదు చేసినా.. సర్దుకోండి అంటూ అధ్యాపకులు చెప్పి పంపేస్తున్నారని కొందరు జూనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2016-17 విద్యా సంవత్సరానికి గాను ఈనెల 3వ తేదీ నుంచి అనాటమి, పిజియాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాలలో తరగతులు ప్రారంభం అయ్యాయి. ఫేర్‌వెల్ డే ప్రాక్టీస్ పేరుతో తరగతులు ముగిసి చీకటి పడ్డాక కూడా డే స్కాలర్‌లను ఇళ్లకు పంపకుండా ర్యాగింగ్ చేస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినుల పరిస్థితి మరీ ఘోరంగా మారిందని సమాచారం. కాగా, ర్యాగింగ్ నిరోధానికి చర్యలు తీసుకున్నామని, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని అధ్యాపకులు చెబుతున్న మాటల్లో ఇసుమంతైనా వాస్తవం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. శనివారం రాత్రి పొద్దుపోయేదాకా హాస్టల్‌లో ర్యాగింగ్ కొనసాగినట్లు సమాచారం.