సాక్షి, పీలేరు : జూనియర్ డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసుపై ప్రభుత్వం స్పందించింది. ఆత్మహత్యకు ప్రొఫెసర్ రవికుమార్ కారణమని బంధువులు ఆందోళనకు దిగడంతో రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. శిల్ప ఆత్మహత్యపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయాలని ఆదేశించారు. డీఎంఈ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రొఫెసర్లను కాకుండా ఒక్క రవికుమార్‌నుమాత్రమే సస్పెండ్ చేయడంపై జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా ఇద్దరు ఫ్రొఫెసర్లు డాక్టర్ కిరీటి, శివకుమార్‌లను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
శిల్ప ఆత్మహత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. శిల్పను ప్రొఫెసర్ రవికుమార్ లైంగిక వేధింపులకు గురిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా నిన్న సాయంత్రం విడుదలైన పీజీ ఫలితాల్లో శిల్ప ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారనే కోపంతోనే కావాలని ప్రొఫెసర్లు ఫెయిల్ చేశారని, ఆ బాధతోనే శిల్ప ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published Tue, Aug 7 2018 4:15 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment