నిర్లక్ష్యమే ఉసురు తీసిందా!? | Doctor Shilpa Suicide Case Officials Negligence | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యమే ఉసురు తీసిందా!?

Published Sat, Aug 11 2018 9:48 AM | Last Updated on Sat, Aug 11 2018 1:44 PM

Doctor Shilpa Suicide Case Officials Negligence - Sakshi

పీలేరులో శిల్ప ఇంటి వద్ద సీఐడీ అధికారులు

తిరుపతి అర్బన్‌: తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్‌ శిల్ప మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకెదురవుతున్న లైంగిక వేధింపులపై చేసిన ఫిర్యాదుపై సాక్షాత్తు రాష్ట్ర గవర్నరే స్పందించినా అదే స్థాయిలో ఇతర అధికారులు స్పందించకపోవడం, విచారణ చేసి నాలుగు నెలలైనా వాస్తవాలేమిటో వెల్లడించకపోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. బాధితురాలు విచారణ నివేదిక బహిర్గతం చేయాలని ఎన్నోసార్లు మొత్తుకున్నా ఆమె ఘోష అరణ్య రోదనే అయ్యింది. మరోవైపు– కాలేజీలో వేధింపుల పర్వం మరింత ఎక్కువైందని జూనియర్‌ డాక్టర్ల వాదన. ఈ నేపథ్యంలో పీజీ పరీక్షలు జరిగాయి.

పీజీ పరీక్షల్లోనూ డాక్టర్‌ శిల్ప కు ముగ్గురు సమస్యలు సృష్టించారని ప్రచారంలోకి వచ్చింది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పిడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ రవికుమార్‌తోపాటు ప్రొఫెసర్లు డాక్టర్‌ కిరీటి, డాక్టర్‌ శశికుమార్‌ ఇబ్బందులు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..‘‘మహిళలను వేధిస్తే కఠినంగా వ్యవహరిస్తాం..వారి రక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటాం..’ అని వివిధ సందర్భాల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించినా, మహిళలను వేధిస్తే ఖబడ్దార్‌ అనే లెవెల్లో పోలీసులు ఊదరగొట్టినా శిల్పకు ఎవరి అండా లభించలేదని, అడుగడుగునా అవరోధాలే ఎదురయ్యాయని వైద్య విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఆమె ఫిర్యాదులపై సకాలంలో స్పందించి, విచారణ వేగవంతం చేసి, నివేదిక బహిర్గతం చేసి ఉంటే ఒక నిండుప్రాణం బలయ్యేది కాదని వైద్య విద్యార్థి లోకం ఘోషిస్తోంది.

‘అధికార’ రాజకీయ ఒత్తిళ్లు
తనను వేధిస్తున్నారంటూ డాక్టర్‌ శిల్ప గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న డాక్టర్, ఆయనకు సహాయంగా ఉంటున్నారన్న ఇద్దరు ప్రొఫెసర్లకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆమెపై వివిధ రూపాల్లో ‘కాముకాసురులు’ రెచ్చిపోయారు. ఈ కాముకాసురులు వేధింపులు శృతి మించుతుండడంతో శిల్ప అలిపిరి పోలీసులను కూడా ఆశ్రయించారు. అయితే  అధికార, రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా కావడంతో విధిలేక ఆమె ఫిర్యాదును వెనక్కు తీసుకున్నట్లు కాలేజీ వర్గాల్లో బలంగా వినబడుతోంది. అటు ఉన్నత స్థాయి అధికారులే కాకుండా చివరకు పోలీసు వ్యవస్థ కూడా ఆమెకు అండగా నిలబడకపోవడం శాపమైంది. దీంతో మానసిక ఒత్తిళ్లతో ఆమె నలిగిపోయారు. పీజీ పరీక్షల ఫలితాలతో మరింత కుంగుబాటుకు గురైనట్లు తెలుస్తోంది. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న తనకే న్యాయం జరగలేదంటే, మిగిలిన వారి పరిస్థితి ఏమిటో? అని సన్నిహితుల వద్ద ఆమె కన్నీటిపర్యంతమైనట్లు తెలియవచ్చింది.

అంతటా ఆధిపత్య పోరే
మెడికల్‌ కాలేజీలో విభాగాధిపతులు, వైద్య అధ్యాపకులు, వైద్యుల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న పోరు, ఆధిపత్యం, వివాదాలకు ప్రతిసారీ వైద్య విద్యార్థులే పావులుగా మారుతున్నారనే వాదన వినిపిస్తోంది. విభాగాధిపతులతో సన్నిహితంగా ఎవరు వ్యవహరించినా మరో వర్గం దానిని భూతద్దంలో చూపేందుకు ప్రయత్నిస్తూంటుందని మరో వాదన. ఇలాంటి కోవకే పీజీ విద్యార్థిని శిల్ప వ్యవహారం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ వైద్య విద్య కోర్సులతో పాటు ఎంబీబీఎస్, ఎండీ కోర్సులను సుదూర ప్రాంతాల విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వారు బస చేసే హాస్టళ్లలోను వైద్య విభాగా«ధిపతులు, ప్రొఫెసర్లు రాత్రి వేళల్లో మకాం వేసి, తమకు అనుకూలంగా వ్యవహరించేలా వారిపై నయానో భయానో ఒత్తిళ్లు తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో వచ్చిన విద్యార్థులకు వీరి చర్యలు కంపరం కలిగిస్తున్నా మౌనంగా భరిస్తున్నారని, ఒకవేళ తెగించి గళం విప్పితే, ముప్పేటలా దాడి చేసి, చివరకు వారికి జీవితమే లేకుండా చేస్తున్నారనడానికి శిల్ప ఉదంతమే ఓ ఉదాహరణ అని విద్యార్థిలోకం, మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. తల్లి, తండ్రి తర్వాత గురువే దైవమని చెప్పుకునే మన సంస్కృతిలో ఇప్పుడు గురువుల స్థానం ఏమిటో ఇలాంటి ఉదంతాలు సమాజానికి ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటాయని సైకాలజిస్టులు అంటున్నారు. కొందరు గురువుల తీరు మారకపోతే నష్టపోయేది సమాజమే. ఇకనైనా ప్రభుత్వం ఇబ్బందులు లేని విద్యాభ్యాసానికి భరోసా ఇచ్చే దిశగా కార్యాచరణకు పూనుకోవాలని పలువురు కోరుతున్నారు.

పీలేరులో సీఐడీ అధికారుల విచారణ
పీలేరులోని శిల్ప ఇంట శుక్రవారం సీఐడీ అధికారులు ఆమె తల్లిదండ్రులను కలిశారు. కుటుంబ సభ్యులను విచారణ చేశారు. శిల్ప ఆత్మహత్యకు దారితీసిన సంఘటనలు గురించి అడిగి తెలుసుకున్నారు.

సీఎం చంద్రబాబు దృష్టికి డాక్టర్‌ శిల్ప మృతి ఘటన
చిత్తూరు కలెక్టరేట్‌ : ఎస్వీ మెడికల్‌ కాలేజ్‌ పీజీ వైద్యవిద్యార్థిని శిల్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి కలెక్టర్‌ ప్రద్యుమ్న తీసుకెళ్లారు. శుక్రవారం కలెక్టర్‌ అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. శిల్ప మృతితో ఎస్వీ మెడికల్‌ కాలేజీలో చోటుచేసుకున్న పరిణామాలు, జూనియర్‌ డాక్టర్ల ఆందోళనలు, శిల్ప తల్లిదండ్రుల డిమాండ్లు తదితర అంశాలను ముఖ్యమంత్రికి ఆయన నివేదించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి శిల్ప మృతి సంఘటనపై సీఐడీ విచారణను వేగవంతంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే జూనియర్‌ డాక్టర్లు, ప్రభుత్వ డాక్టర్లతో సమావేశం నిర్వహించి, నిరుపేద రోగులకు వైద్య సేవలను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement