Tirupati Crime News
-
20 నిమిషాల్లో కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
సాక్షి, తిరుమల: తిరుమలలో కలకలం సృష్టించిన కిడ్నాప్ కేసును పోలీసులు 20 నిమిషాల్లో ఛేదించారు. ఆదివారం శ్రీవారి దర్శనానికి వచ్చిన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన హనుమంతరావును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు దుండగలను పోలీసులు అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏఎస్పీ ముని రామయ్య సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆదివారం రాత్రి నెల్లూరు జిల్లాకు చెందిన హనుమంత రావు అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు తిరుమలలో కిడ్నాప్ చేశారని చెప్పారు. భర్త కిడ్నాప్‌కు గురి కావడంతో హనుమంతరావు భార్య 100కు డయల్ చేసి సమాచారం అందించారని తెలిపారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న రక్షక సిబ్బంది ఇన్నోవా వాహనాన్ని వెంబడించి అలిపిరి వద్ద కిడ్నాపర్స్‌ను 20 నిమిషాల వ్యవధిలోనే పట్టుకున్నట్లు వెల్లడించారు. ఆర్థిక లావాదేవిల కారణంగానే హనుమంత రావును కిడ్నాప్ చేసిన ఏఎస్పీ పేర్కొన్నారు. నిందితులైన కుమార్, సురేష్, మూర్తినలు అదుపులోకి తీసుకుని ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేశామన్నారన్నారు. వీరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు నమోదు చేసిన రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. దుండగుల ఇన్నోవా వాహనాన్ని వేగవంతంగా వెంబడించి కేసును 20 నిమిషాల్లో ఛేదించిన రక్షక టీం కానిస్టేబుల్స్ మణికంఠ, శేఖర్ హోంగార్డు వెంకటేష్‌లకు ప్రశంస్తూ వారికి ఏఎస్పీ రివార్డు అందజేశారు. -
భార్యతో గొడవపడి ఆత్మహత్య
చిత్తూరు,కాణిపాకం(యాదమరి): ఐరాల మండలం కాణిపాకం పరిధిలోని జంగాలపల్లె గ్రామంలో భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. పాకాలకు చెందిన విజయభాస్కర్(44)కు ఐరాల మండలం జంగాలపల్లెకు చెందిన అమృతతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆయన తిరుమలలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పాకాలలో కొన్ని రోజులు, తిరుమలలో కొన్ని రోజులు నివాసం ఉన్నారు. ప్రస్తుతం అత్తగారి ఇల్లు అయిన జంగాలపల్లెలో నివాసం ఉంటున్నారు. రోజూ మద్యం తాగి వస్తుండడంతో అమృత భర్తతో గొడవపడేది. ఇదే విషయమై సోమవారం మధ్యాహ్నం ఇద్దరూ ఘర్షణ పడ్డారు. తన భర్త రోజూ తాగొచ్చి కొడుతున్నాడని అమృత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం ఇంటికెళ్లే సరికి దూలానికి చీరతో ఉరేసుకుని విజయభాస్కర్ మృతిచెంది ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదం: క్షతగాత్రుల నరకయాతన..
పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవరు, అటెండెంట్ దుర్మరణం పాలయ్యారు. 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 34 మంది తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన వారు, విజయవాడకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, జిల్లాకు చెందిన నలుగురు, నెల్లూరు జిల్లాకు చెందిన మరో ప్రయాణికుడు ఉన్నారు. సాక్షి, చంద్రగిరి/తిరుపతి: మరో రెండు గంటల్లో గమ్యానికి చేరుకునే వేళ చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ప్రయాణికులకు పీడకలగా మారింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఆర్టీసీ ఓల్వో బస్సు ప్రమాదం తాలూకు క్షతగాత్రుల హాహాకారాలతో కాశిపెంట్ల దద్దరిల్లింది. కృష్ణా జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్, సహాయకుడు మృతి చెందగా, పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలవడం స్థానికులను దిగ్భ్రాంతి కలిగించింది. ఆర్టీసీ రెండవ డ్రైవర్ సత్యనారాయణ దీనికి ప్రత్యక్ష సాక్షిగా మిగిలారు. అమరావతి నుంచి కుప్పంకు బయల్దేరిన ఏపీ16 జెడ్ 0586 ఓల్వో బస్సును కాశిపెంట్ల వద్ద ప్రైవేటు ట్రావెల్స్ ఓల్వో స్లీపర్ బస్సు ఢీకొని ముందరి భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అవడం చూస్తే పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమేనని ప్రమాదం తీవ్రత అద్దం పట్టింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా, దిండి మండల కేంద్రానికి చెందిన అయ్యప్ప భక్తులతో శబరిమల యాత్ర ముగించుకుని తిరుమలకు వస్తున్న ఈ ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసు అమరావతి నుంచి కుప్పంకు వెళ్తున్న ఆర్టీసీ ఓల్వో బస్సును ఢీకొంది. (చదవండి: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం) తిరుపతిలో డ్యూటీకి ఎక్కిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ రమేష్‌తోపాటు సహాయకుడు ప్రసాద్ తీవ్రగాయాలతో మరణించారు. బస్సు ముందరి భాగం నుజ్జైన ధాటికి తీవ్రగాయాల పాలై, కేబిన్‌లోనే ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ లక్ష్మీనారాయణ ఇరుక్కుపోయాడు. ఆర్టీసీ ఓల్వో బస్సులో ఆరుగురు ప్రయాణికులు, ప్రైవేటు బస్సులో 32 మంది అయ్యప్పస్వాముల తలలకు గాయాలవడంతోపాటు కొందరికి చేతులు, కాళ్లు విరిగిపోవడంతో నరకయాతన అనుభవించారు. వారి హాహాకారాలు, ఆర్తనాదా లకు కాశిపెంట్ల వాసులు అక్కడికి పరుగులు తీశారు. క్షతగాత్రులను శ్రమలకోర్చి పోలీసులు స్థానికులు, ఇతర ప్రయాణికుల సహకారంతో వెలికి తీసి తిరుపతికి తరలించారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్యసేవలు కాశిపెంట్ల ప్రమాద క్షతగాత్రులకు రుయా ఆస్పత్రి అత్యవసర విభాగంలో వైద్యసేవలు హుటాహుటిన అందించారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రమణయ్య పర్యవేక్షణలో సీఎంవోలు, విభాగాధిపతులు, రుయా అధికారులు యుద్ధప్రాతిపదికన వైద్యపరీక్షలు చేయడంతోపాటు చికిత్స చేశారు. ఇద్దరి పరిస్థితి విషమం ఆర్టీసీ ఓల్వో బస్సు డ్రైవర్ రమేష్, అటెండెంట్ ప్రసాద్ మృతదేహాలను రుయా మార్చురీకి తరలించారు. గాయపడిన వారిలో మెరుగైన వైద్యం కోసం ఆరుగురిని చెన్నై, హైదరాబాద్, నెల్లూరుకు తరలించారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పళణి చెన్నై ఆస్పత్రికి, ఇదే యూనివర్సిటీలో పీజీ చదువుతున్న ఉషాకిరణ్‌ను నెల్లూరుకు తరలించారు. రుయాలో 28 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. 19 మంది ఆర్థో వార్డు, ముగ్గురు చిన్నపిల్లల ఆస్పత్రి, ఆరుగురు జనరల్ సర్జరీలో వైద్యసేవలు పొందుతున్నారు. తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ లక్ష్మీనారాయణ, జయపాల్ పరిస్థితి విషమంగా ఉందని రుయా సూపరింటెండెంట్ తెలిపారు. ఇదలా ఉంచితే, క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.10 వేలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 2వేల చొప్పున అందజేసినట్లు ఆర్టీసీ ఆర్ఎంవో చంగల్‌రెడ్డి తెలిపారు. క్షతగాత్రులకు రుయా అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మెన్ బండ్ల చంద్రశేఖర్ సొంత డబ్బులతో అల్పాహారం, ఫ్లూయిడ్స్‌ను అందజేశారు.. నిర్లక్ష్యమే కారణం? తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా, దిండికి చెందిన ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసు డ్రైవర్ లక్ష్మీనారాయణ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోనే ఇంత ఘోరం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాస్తవానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిబంధనల ప్రకారం రోడ్డుకు ఎడమ వైపు వెళ్తుండగా. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తాను నడుపుతున్న వాహనాన్ని రోడ్డులో కుడివైపు వెళ్లి, ఆర్టీసీ ఓల్వోను ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు రోడ్డు ఆరు లేన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ తాను వస్తున్న మార్గం ఆరులేన్లదిగా భావించి, కుడివైపు వాహనాన్ని నడిపినట్లు అధికారులు భావిస్తున్నారు. విశ్రాంతి లేకుండా వారం రోజులుగా వాహనాన్ని నడుపుతుండడంతో తెల్లవారిజామున కునుకు తీసి కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దురదృష్టకరం : కలెక్టర్ రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరమని జిల్లా కలెక్టర్ నారాయణభరత్‌గుప్తా వ్యాఖ్యానించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్‌తో కలసి క్షతగాత్రులను రుయా ఆస్పత్రి లో ఆయన పరామర్శించి మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నామన్నారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని తెలిపారు. అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ, ప్రమాదానికి పూర్తి కారణాలు తెలుసుకుని ఆదిశగా చర్యలు తీసుకుంటామన్నారు. -
తిరుపతిలో రౌడీషీటర్ హత్య
-
ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
సాక్షి, చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారంటూ వారి తల్లిదండ్రులు గురువారం రాత్రి పోలీసులను ఆశ్రయించారు. వన్‌టౌన్ ఎస్ఐ మనోహర్ కథనం మేరకు.. గిరింపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు వి.కౌశల్య, ఎ.ఢిల్లీబాబు, ఆర్.సౌమ్య దసరా సెలవులు పూర్తికావడంతో గురువారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లారు. సాయంత్రమైనా ముగ్గురు విద్యార్థులు తిరిగి ఇంటికి రాలేదు. కంగారుపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి విచారించగా.. అసలు పిల్లలు పాఠశాలకే వెళ్లలేదని తెలుసుకున్నారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లల వివరాలు తెలిస్తే తమకు ఫోన్ నంబరు 94407 76705లో సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. -
భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు
సాక్షి, తిరువళ్లూరు(చిత్తూరు) : భర్తను హత్య చేసినందుకు ఓ మహిళకు జీవిత ఖైదు శిక్షతో పాటు ఐదు వేలు రూపాయల జరిమానా విధిస్తూ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి దీప్తి అరువునిధి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు చిత్తూరు జిల్లా నాగాలాపురం బీసీ కాలనీకి చెందిన గౌరి(23)కి తిరువళ్లూరు జిల్లా పట్టాభిరాం తండరై ప్రాంతానికి చెందిన రాజీ(27)తో వివాహం జరిగింది. మద్యానికి బానిసైన రాజీ తరచూ గౌరీని వేధించేవాడు. ఈ నేపథ్యంలో 2016 ఫిబ్రవరి 13న మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజీ భార్యతో ఘర్షణకు దిగాడు. భర్త వేధింపులను తట్టుకోలేనీ గౌరి అతని తలపై రుబ్బురోలు రాయితో కొట్టి హత్య చేసింది. తిరువళ్లూరు జిల్లా అదనపు కోర్టులో ఈ కేసు విచారణ సాగింది. నేరం రుజువు కావడంతో శుక్రవారం సాయంత్రం న్యాయమూర్తి దీప్తి అరువునిధి తీర్పును వెలువరించారు. గౌరికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.ఐదు వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నాలుగు నెలల పాటు శిక్షను అనుభవించాలని తీర్పు వెలువరించినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్‌రావు మీడియాకు వివరించారు. అనంతరం ముద్దాయిని పుళల్ జైలుకు తరలించారు. -
మితిమీరిన వేగం తెచ్చిన అనర్థం
చిత్తూరు ,మదనపల్లె టౌన్ : లారీ డ్రైవర్ మితిమీరిన వేగానికి ఓ భవన నిర్మాణ కార్మికుడు బలయ్యాడు. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. గురువారం ఈ సంఘటన మదనపల్లె లో చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, ఒకటో పట్టణ పోలీసుల కథనం..తంబళ్లపల్లె మండలం ఎరమద్దివారిపల్లెకు చెందిన టి.సహదేవ(42) బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం మదనపల్లెకు వచ్చాడు. బెంగుళూరు రోడ్డులో ఉన్న నక్కల దిన్నె తాండాలో నివాసం ఉంటున్నాడు. భవన నిర్మాణ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సహదేవ గురువారం ఉదయం కురబలకోట మండలం అంగళ్లులో భవన నిర్మాణ పనులకు కోటవారిపల్లెకు చెందిన నరసింహులు(37)ను తీసుకుని తన మోటార్ సైకిల్లో బయల్దేరాడు. మార్గమధ్యంలో నీరుగట్టువారిపల్లె టమాట మార్కెట్‌యార్డు సమీపాన ప్రమాదానికి గురయ్యాడు. అక్కడ స్పీడు బ్రేకర్ల వద్ద బైక్‌పై నెమ్మదిగా వెళుతుండగా అదే సమయంలో వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ సహదేవ, నరసింహులు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో సహదేవ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన నరసింహులును అక్కడి ప్రజలు ఆటోలో హుటా హుటిన స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ ఎస్ఐ సోమశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వివరాలు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య భాగ్యమ్మ, పిల్లలు తనుజ, జయశ్రీ తమ బంధువులతో అక్కడికి చేరుకుని ‘ఇక మాకు దిక్కెవ్వరు? అంటూ గుండెలవిసేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని మరొకరు.. వాల్మీకిపురం: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన గురువారం మండలంలోని చింతపర్తిలో చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని ఎగువబూడిదవేడుకు చెందిన ఆవుల ద్వారకనాథ రెడ్డి (32) చింతపర్తి బాహుదానది బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి మదనపల్లెకు వెళ్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బాధితుది తల నుజ్జునుజ్జై అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ మోహన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు ఢీకొని మహిళ మృతి బంగారుపాళెం: కారు ఢీకొని మహిళ దుర్మరణం చెందిన సంఘటన గురువారం మండలంలోని కేజీ సత్రం వద్ద చెన్నై–బెంగళూరు బైపాస్‌రోడ్డుపై చోటుచేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ కథనం.. చీకూరుపల్లెకు చెందిన లేట్ లక్ష్మయ్య భార్య లక్ష్మమ్మ(56)పొలం వద్దకు వెళ్లి రోడ్డు దాటుతుండగా చిత్తూరు నుంచి పలమనేరు వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ సంఘటన స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్ఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చచ్చిపోవాలని రైల్వేస్టేషన్‌కొచ్చింది! ఆపై..
ఆడపిల్లకు జన్మనిచ్చిందని కట్టుకున్నోడు వదిలేశాడు..చంటిబిడ్డతో తల్లిదండ్రులందరి చేరితే అక్కున చేర్చుకోవాల్సిన వారు కర్కశంగా వ్యవహరించారు. ఇంట ఉంటే తమ్ముడికి వివాహం కాదంటూ ఆమెను నిర్దయగా గెంటివేశారు. దీంతో అందరూ ఉన్నా అనాథ అయ్యాయని ఆమె కుంగిపోయింది. ఆత్మహత్య చేసుకునేందుకు తిరుపతికి వచ్చింది. సకాలంలో షీటీమ్ స్పందించింది. రైలు కింద కడతేరిపోవాలనుకున్న ఆమెను కాపాడింది. సాక్షి, తిరుపతి క్రైం : జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యతో తనువు చాలించాలనుకున్న ఓ వివాహితను సకాలంలో శక్తి టీమ్ ఏఎస్ఐ సుమతి స్పందించి కాపాడారు. శని వారం ఈ సంఘటన వెస్ట్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ సీఐ వెంకటప్పయ్య కథనం..చిన్నగొట్టిగల్లుకు చెందిన సుబ్రమణ్యం, భువనేశ్వరి(26) భార్యాభర్తలు. వీరికి 2 నెలల పాప ఉంది. భువనేశ్వరికి గ్రహణ దోషం ఉండడంతో వివాహ సమయంలో ఆమె తల్లిదండ్రులు అల్లుడికి కట్నం అధికంగానే ఇచ్చారు. ఈ నేపథ్యంలో భువనేశ్వరి ఆడపాపకు జన్మనిచ్చింది. మగ బిడ్డకు జన్మనివ్వలేదని ఆగ్రహించి ఆమె భర్త పుట్టింటికి తరిమేశాడు. చంటిబిడ్డతో తల్లిదండ్రుల చెంతకు చేరిన ఆమెకు నిరాదరణే ఎదురైంది. నువ్వు ఇంట్లో ఉంటే మీ తమ్ముడికి పెళ్లి కాదంటూ –భువనేశ్వరిని తల్లిదండ్రులు ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో పోలీస్ స్టేషన్లకు, న్యాయస్థానానికి తిరగలేని బాధితురాలు తిరుపతిలోని వెస్ట్ రైల్వే స్టేషన్‌కు చంటిబిడ్డతో చేరుకుంది. ఆత్మహత్యకు చేసుకునేందుకు సిద్ధమైంది. అదృష్టవశాత్తు అప్పటికింకా ఏ రైలూ రాలేదు. అదే సమయంలో అటుగా వెళ్లిన షీటీమ్ ఏఎస్ఐ సుమతి ఆ వివాహితను గమనించింది. కుమిలి..కుమిలి ఏడుస్తున్న ఆమె వాలకం గమనించి అనుమానిం చింది. ఆమె దరిచేరి ప్రశ్నించింది. ఆమె గోడు తెలుసుకుంది. చంటిబిడ్డతో సహా ఆమెను సీఐ వద్దకు తీసుకువచ్చింది. అనంతరం తిరుచానూరు మహిళా ప్రాంగణంలో తల్లీబిడ్డకు ఆశ్రయం కల్పించారు. ఆ తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యుల్ని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పిలిపించి చిన్నపాటి క్లాసు పీకారు. దీంతో వారు దారికొచ్చారు. భువనేశ్వరిని బాగా చూసుకుంటామని చెప్పి తీసుకెళ్లారు. ఏఎస్ఐ సుమతిని పలువురు అభినందించారు. -
పిల్లి కోసం తల్లడిల్లుతూ..
సాక్షి, రేణిగుంట : ‘గుజరాత్ రాష్ట్రం సూరత్‌కు చెందిన దంపతులు గత 25రోజులుగా రేణిగుంటలో తచ్చాడుతూ తెలియని భాష మాట్లాడే వ్యక్తుల మధ్య కనిపించిన వారందరినీ వాకబు చేస్తున్నది ఓ పిల్లి కోసం అంటే నమ్మశక్యం కాని విషయం... కానీ నమ్మి తీరాలి.. పిల్లలు లేని తమ జీవితంలో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లిని కన్న బిడ్డ కంటే ఎక్కువగా భావించిన వారు నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు తప్పిపోయిన పిల్లి ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారంటే.. అందరూ నోరెళ్లబెడుతున్నారు. కానీ వారి అన్వేషణకు అంతమెప్పుడన్నది దేవుడే నిర్ణయించాలి. వారి ఎదురుచూపులు సుఖాంతమై.. తప్పిపోయిన పిల్లి దొరకాలని విషయం తెలిసిన జంతుప్రేమికులు అభిలషిస్తున్నారు.’’ విషయానికొస్తే... గుజరాత్ రాష్ట్రం సూరత్‌కు చెందిన జయేష్‌బాబు, మీన దంపతులు బట్టల వ్యాపారులు. వీరికి పిల్లలు లేరు. వీరు ప్రేమగా పెంచుకున్న పిల్లిని కంటికి రెప్పలా ప్రాణం పెట్టి పెంచుకున్నారు. దాని పేరు బాబు. తిరుమల శ్రీవారి దర్శనార్థం సూరత్‌లో బయల్దేరి గత నెల 9న పిల్లితో సహా రైలు మార్గాన తిరుపతికి వచ్చారు. తిరుమలేశుని దర్శనానంతరం వారు తిరుగు ప్రయాణంలో గత నెల 13న రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్లో రైలుకోసం వేచి ఉన్న తరుణంలో తమ వద్దనున్న పిల్లి ఒక్కసారిగా మాయమైంది. కొద్ది నిమిషాల్లోనే తప్పిపోయిన పిల్లికోసం తాము తిరుమలలో పిల్లితో కలిసి ఇష్టంగా తీసుకున్న ఫొటోను చూపిస్తూ స్టేషన్ ప్రాంగణమంతా జల్లెడ పట్టారు. ఎంతకీ పిల్లి ఆచూకీ లభించకపోవడంతో స్వస్థల ప్రయాణాన్ని విరమించుకుని స్టేషన్ ప్రాంగణమే కాక, రేణిగుంట మొత్తం తిరుగాడుతూ పిల్లికోసం అలుపెరగని వెదుకులాట ప్రారంభించారు. తప్పిపోయిన పిల్లిని వెదికిపెట్టాలని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. పోలీసులు వారిని చూసి నిశ్చేష్టులయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. వారే కనిపించిన వారందరినీ పిల్లి కోసం ఆరా తీశారు. రేణిగుంటకు చెందిన కొందరు ఆకతాయిలు పిల్లిని వెదికిపెడతామని, అక్కడ కనిపించింది... ఇక్కడ కనిపించిందంటూ నమ్మబలికి వారి వద్ద రూ.50వేలు నగదు తీసుకుని మోసం చేసినట్లు ఆ దంపతులు వాపోతున్నారు. అయినా వారు రేణిగుంటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పిల్లికోసం వెతుకుతూనే ఉన్నారు. పిల్లి ఆచూకీ తెలిస్తే 9824876542 నంబరుకు సమాచారం అందించాలని వారు వేడుకుంటున్నారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.20వేలు బహుమానం ఇస్తామని వారు తెలిపారు. -
వివాహమైన నాలుగు నెలలకే జవాను భార్య..
చిత్తూరు, కాణిపాకం(పూతలపట్టు) : వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పూతలపట్టు మండలం బండపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన యశోద (22)కు నాలుగు నెలల క్రితం వివాహమైంది. ఆమె భర్త వృత్తిరీత్యా జవాను కావడంతో వివాహమైన 50 రోజుల అనంతరం విధులకు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో యశోద తన అత్త, ఆడపడుచుతో కలిసి ఉంటోంది. వారి మధ్య చిన్నపాటి గొడవలు తలెత్తేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం చెరువు వద్ద విగతజీవిగా కనిపించింది. గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం చేరవేశారు. ఎస్ఐ మల్లేష్‌యాదవ్ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మెడ చుట్టూ నల్లటి చారిక ఉండడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందా? అన్నది పోలీసులు స్పష్టం చేయలేదు. ఒకవేళ ఉరి వేసుకుని ఉంటే ఎక్కడ వేసుకుంది? ఎవరు మృతదేహాన్ని దించారు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మృతికి కారణాలేమిటో పోస్టుమార్టం నివేదికలో వెల్లడి కావాల్సి ఉంది. -
నవవధువు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె సిటీ: పెళ్లైన రెండు నెలలకే భర్త రైలు ప్రమాదంలో మృతి చెందడంతో తట్టుకోలేక ఓ నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం బి.కొత్తకోటలో చోటుచేసుకుంది. బాధితుల కథనం..బి.కొత్తకోటకు చెందిన భరత్, శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన లావణ్య(25) గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న ఇద్దరూ మూడు రోజుల క్రితం టెక్కలి నుంచి బి.కొత్తకోటకు వచ్చేందుకు నౌపడ రైల్వేస్టేషన్లో రైలు ఎక్కుతూ ప్రమాదశాత్తు జారి పడి భరత్ మృతి చెందాడు. భర్త కర్మకాండలకు బి.కొత్తకోటలో ఉన్న లావణ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో టాయిలెట్ క్లీనర్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరునాళ్లకు వచ్చి.. మృత్యుఒడికి
రాయచోటి టౌన్ : చిన్నమండెం మండలం మల్లూరులో మల్లూరమ్మ తిరునాళ్లకు వచ్చిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం.. వల్లూరు మండలం నాగిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎం.ఓబుల్‌రెడ్డి (48) తిరునాళ్లకోసం ఈనెల 20న మల్లూరుకు వచ్చారు. అదేరోజున తన తోడల్లుడి కుమార్తె భార్గవి, అల్లుడు మహేశ్వరరెడ్డి కూడా గుర్రంకొండ నుంచి వచ్చారు. భార్గవి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. గురువారం రాయచోటిలో పరీక్ష రాయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తనకు రాయచోటిలో పని ఉందని, తానే భార్గవిని తీసుకెళ్తాంటూ ఓబుల్‌రెడ్డిని ఆమెను తీసుకుని బైక్‌లో బయల్దేరారు. రాయచోటి సమీపంలోని ఏజీ గార్డెన్ మలుపువద్ద మృత్యువాత పడ్డారు. కడప నుంచి బెంగళూరు వెళుతున్న అమరావతి బస్సు వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓబుల్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన భార్గవిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
పెళ్లైన రెండు నెలలకే నవ వధువు..
చిత్తూరు, కుప్పం: మూడుముళ్ల బంధం తాలూకు కాళ్ల పారాణి ఆరనే లేదు..పెళ్లైన రెండు నెలలకే ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో బలవన్మరణం చెందింది. శనివారం ఇది పట్టణంలో ఇది చర్చనీయాంశమైంది. వివరాలు..గుడుపల్లె జెడ్పీ హైస్కూలులో టీచర్‌గా పనిచేస్తున్న చంద్రజ్యోతి (29)కి వి.కోట డీసీసీ బ్యాంకులో పనిచేస్తున్న శ్రీకాళహస్తి వాసి శరత్‌కు రెండు నెలల క్రితం వివా హమైంది. వీరిద్దరూ స్థానిక హెచ్‌పీ రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రజ్యోతి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెం దడం శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివాహమైన కొన్ని రోజులకే దంపతుల నడుమ తరచూ గొడవలు చోటుచేసుకున్నాయని, అల్లుడే తమ కుమార్తెను వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమార్తె ఇక తనకు అవసరం లేదని, వచ్చి తీసుకెళ్లాలని శుక్రవారం రాత్రి శరత్ ఫోన్ చేశాడని, అతడే చంద్రజ్యోతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు. తమ కుమార్తె మృతిపై పోలీ సులకు ఫిర్యాదు చేశారు. శరత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్లి ఒత్తిడితోనే పారిపోయా..
చిత్తూరు , కలికిరి: వైఎస్సార్ జిల్లా సుండుపల్లె మండలం మాచిరెడ్డిగారిపల్లెకు చెందిన యువతి (17) అదృశ్యం కేసు సుఖాంతమైంది. కలికిరి మండలం తుమ్మలపేట లోని తన అమ్మవారి ఇంటికి వచ్చి ఈ నెల రెండో తేదీన ఆమె అదృశ్యమైన విషయం విదితమే. మూడు రోజుల పాటు వెతికిన ఆమె తల్లిదండ్రులు 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అదృశ్యమైన విద్యార్థిని వైఎస్సార్ జిల్లా కడపలో ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులతో సహా మంగళవారం కలికిరి మండల మెజిస్ట్రేట్ కులశేఖర్ ముందు హాజరుపరిచారు. తల్లిదండ్రులు వివాహం చేసుకోవాలని తనపై ఒత్తిడి చేయడంతోనే ఇంటి నుంచి అదృశ్యమైనట్లు సదరు యువతి అధికారులకు వెల్లడించింది. 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, విద్యార్థినిని చదివించాలని ఆదేశించారు. అనంతరం పోలీసుల సమక్షంలో విద్యార్థినిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
22 ఏళ్ల తర్వాత హత్య కేసులో నిందితుడి అరెస్టు
చిత్తూరు ,కురబలకోట/మదనపల్లె : హత్య కేసులో 22 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసిన సంఘటన కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం ముదివేడు ఎస్ఐ నెట్టి కంఠయ్య తెలిపిన వివరాలు.. ముదివేడుకు చెందిన అమీర్‌ఖాన్ 1997 అక్టోబర్ 7న తన పొలం వద్ద హత్య కు గురయ్యారు. ముదివేడు ప్రాంతానికి చెందిన సత్తార్‌ఖాన్, ఇంతియాజ్Œ ఖాన్, ఇలియాజ్‌ఖాన్, బి.కొత్తకోటకు చెందిన టైలర్ మొహిద్దీన్ఖాన్ ఇతన్ని భూతగాదాల నేపథ్యంలో గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. వీరిలో మొహిద్దీన్ తప్ప ముగ్గురిని అరెస్టు చేశారు. అంతేగాకుండా 2000 ఫిబ్రవరి 4న మదనపల్లె 1వ ఏడీజే కోర్టు వీరికి జీవిత ఖైదు, జరిమానా విధించింది. వీరు జైలు శిక్ష కూడా పూర్తి చేసుకుని విడుదలయ్యారు. 4వ ముద్దాయి అయిన టైలర్ మొహిద్దీన్ ఖాన్ అలియాస్ బుజ్జీ మాత్రం 22 ఏళ్లుగా పరారీలో ఉండడంతో మదనపల్లె కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటు అప్పట్లోనే జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పెండింగ్ కేసులు, నాన్ బెయిలబుల్ కేసుల నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. డీఎస్పీ చిదానందరెడ్డి పర్యవేక్షణలో రూరల్ సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ముదివేడు ఎస్ఐతోపాటు హెడ్ కానిస్టేబుల్ శివరామకృష్ణయ్య, కానిస్టేబుళ్లు రాఘవేంద్రరెడ్డి, శ్రీనివాసులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. టైలర్ మొహిద్దీన్ఖాన్పై దృష్టి సారించారు. మూడు నెలల క్రితం ఇతని అక్క చనిపోయింది. అతను వస్తాడని వల పన్నారు. ఇది పసికట్టిన అతను రాలేదు. అతని సెల్ నంబర్ సేకరించి సాంకేతికత పరిజ్ఞానంతో పోలీసులు అతడి కదలికలు పసిగట్టారు. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులో ఇతన్ని అరెస్టు చేశారు. ఇతను హత్యానంతరం విజయవాడ, బెంగళూరు, ముంబైలో గడిపాడని, ఇప్పుడు బెంగళూరులో టైలర్‌గా ఉంటూ నేర ప్రవృత్తిని దాచి వివాహం కూడా చేసుకున్నట్లు తేలింది. నిందితుడి అరెస్టులో కృషి చేసిన ప్రత్యేక బృందాన్ని డీఎస్పీతో పాటు ఉన్నతాధికారులు అభినందించారు. అలాగే, పెండిం గ్ కేసుల్లో భాగంగా నాన్ బెయిలబుల్ వారెం టున్న 16 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
నీరుగారుతున్న అవినీతి కేసులు
అవినీతి అధికారుల ఆట కట్టించడానికి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు శక్తి చాలడం లేదు. గత నాలుగేళ్ల కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా 10 మందికిపైగా అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కానీ కేసుల్లో బలం లేకపోవడం, చట్టంలో ఉన్న లొసుగులు, సాక్షులను బెదిరించడం..ఇత్యాది కారణాల వల్ల ఈ కేసులు నీరుగారిపోతున్నాయి. పలువురు అవినీతిపరులు మళ్లీ నెలల వ్యవధిలోనే ఉద్యోగంలో చేరుతున్నారు! కొందరు ఏకంగా ప్రమోషన్లు కూడా పొందారు. దీనికి అధికార పార్టీ నాయకులు ఇతోధికంగా సహకరించడమే కారణమనే విమర్శలొస్తున్నాయి. చిత్తూరు, సాక్షి: ఒక చిరుద్యోగి చిన్న తప్పు చేస్తే సస్పెండ్ చేస్తున్నారు. అయితే, అధికారులు వేలా ది రూపాయలు లంచంగా పుచ్చుకుని ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే అతన్ని కూడా సస్పెండ్ చేస్తున్నారు. పలువురు ఉద్యోగులు వేతనానికి మించి 10 నుంచి 15 రెట్లు లంచాలు తీసుకుంటున్నారంటే అవినీతి ఎంతగా వేళ్లూనుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీనికి చెక్ పెట్టాల్సిన ఏసీబీ పనితీరు కూడా సక్రమంగా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏసీబీకి పట్టుబడిన లంచావతారులు మూడు నుంచి ఆరు నెలలు తిరగక ముందే మళ్లీ దర్జాగా ఉద్యోగాల్లో చేరుతున్నారు. మళ్లీ లం చాలతారులై పీడిస్తున్నారు. కేసుల మాఫీ కోసం ఖర్చుపెట్టిన సొమ్ముకు రెండింతలు లంచాల రూపేణా ప్రజల నుంచి పిండుకుంటున్నారు. అన్నీ ఉత్తమాటలే.. ‘అక్రమార్కులను వదిలేదు..ఎంతటివారైనా సహించేది లేదు..చట్టం తన పని తాను చేసుకుపోతుంది...కఠినంగా శిక్షిస్తాం’ అని చెప్పే ఏసీబీ అధికారులు మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు. ఈ నాలుగేళ్లలో ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వోద్యోగులు ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.? ఎన్ని ఫిర్యాదులు వస్తే ఎంతమందిపై దాడులు చేశారు..? విజిలెన్స్ దాడుల్లో పట్టుబడిన బడా అక్రమార్కులు ఎంత మందిని కటకటాల పాల్జేశారు? ఈ లెక్కలు తీస్తే ఏసీబీ వైఫల్యం ఇట్టే అవగతమవుతుంది. అవినీతి అధికారికి శిక్షపడకుండా కేసులు పెడుతూ.. కోర్టుకు బలహీనమైన సాక్ష్యాలు దాఖలు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. దాదాపు నాలుగు నెలల క్రితం సమాచార శాఖలో ఇంజినీర్ నాగేశ్వరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేవలం నాలుగు నెలలు జైల్లో ఉండి దర్జాగా ఆయన బయటికొచ్చాడు. మరో రెండు మూడు వారాల్లో ఉద్యోగంలో చేరుతాడని అధికారులు చెబుతున్న సమాచారం. జిల్లాలో ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క అవినీతి అధికారికి కూడా శిక్ష పడలేదంటే లోపాలేమిటో ఏసీబీ పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటోంది. కలకడలో రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఓ మహిళా తహసీల్దార్ సంవత్సరం తిరక్కుండానే మళ్లీ విధుల్లో చేరింది. చేయి తడపనిదే.. ఇప్పుడు జిల్లాలో ఏ ప్రభుత్వ శాఖలోకి వెళ్లినా చేయి తడపనిదే పనులు కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ కార్యాలయాల్లో కార్యదర్శిని కలవాలంటే ముందు బయట ఉండే గుమస్తాకు రూ.50 ఇస్తేనే ఆయన దర్శనభాగ్యం కలుగుతుంది. తహసీల్దార్‌ను కలిసి తమ సమస్యను చెప్పుకోవాలని ఆఫీసుకు వెళితే ఎర్రబిళ్ల జవానుకు రూ.100 ఇవ్వాల్సిందే. ఎంపీడీఓ కార్యాలయంలో పని కావాలంటే జూనియర్, సీనియర్ అసిస్టెంట్ల నుంచి ఎంపీడీఓ వరకు ఒక్కొక్కరికి వారి స్థాయిని బట్టి జేబుల్లో నోట్లు ఇచ్చుకుంటూ పోతే తప్ప పనులు కావడం లేదు. డబ్బులు ఇవ్వకపోతే సదరు వ్యక్తి ఫైలు నెలలేమిటి? ఏళ్ల తరబడి కార్యాలయంలోనే బూజుపట్టి పెండింగ్‌లో ఉంటోంది. ప్రజల జీవన విధానంలో తహసీల్దార్ కార్యాలయంలో పలు పనులు ముడిపడి ఉన్నాయి. నిత్యం ఆయా మండలాల పరిధిలోని గ్రామాల నుంచి వందలాది మంది కార్యాలయాలకు వస్తుంటారు. వీరిలో నూటికి 80 శాతం ప్రజానీకం ఆయా కార్యాలయాల్లో దిగువ సిబ్బంది నుంచి పై అధికారి వరకు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా పరిశీలిస్తే రోజుకు వివిధ పనులకు గాను ప్రజలు చెల్లించే లంచం రూ.2 కోట్లు పైమాటే ఉంటుందని అనధికార అంచనా. మంచి ఆదాయం ఉన్న శాఖల్లో కుర్చీల కోసం పలువురు అధికారులు వెంపర్లాడుతున్నారు. అధికారపార్టీ నేతలను ప్రసన్నం చేసుకుని లక్షలు వెచ్చించి వారికి కావాల్సిన స్థానాన్ని దక్కించుకుంటున్నారు. ఇది అన్ని పట్టణాలు, మండలాల్లో జరిగే తంతే! అధిక సంపాదనకు కొన్ని కార్యాలయాలు అడ్డాగా మారాయి. రెవె న్యూ, ఎంపీడీఓ, ఉపాధి, ఆర్డబ్ల్యూఎస్, పంచా యతీరాజ్, ఇరిగేషన్, ఐసీడీఎస్, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు, సోషల్ వెల్ఫేర్, నీటిపారుదల, వ్యవసాయశాఖ, డ్వామా, సబ్ రిజిస్ట్రార్, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి అనకొం డలు ఉన్నాయి. ఆ శాఖలోని ఫైళ్లు ఎలా పేరుకుపోతున్నాయో అలాగే కుర్చీలు వదలడం లేదు. చేయి తడపనిదే పనిచేయడం లేదంటే అతిశయోక్తి లేదు. పనికో రేటుతో పిండేస్తున్నారు. -
దొంగల కుటుంబం
చిత్తూరు, తిరుపతి క్రైం : తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు వద్ద దారిదోపిడీకి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు 60, 51,400 రూపాయల విలువగల బంగారు, డైమండ్, వెండి ఆభరణాలను తిరుపతి సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి క్రైం సబ్ డివిజన్ డీఎస్పీ ఆర్.రవిశంకర్‌రెడ్డి కథనం...ఈనెల 7న కోయంబత్తూరు వద్ద దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. 1965.530 గ్రాముల బంగారు, 15.140 గ్రాముల డైమండ్ నగలు, 248.200 గ్రాముల వెండి ఆభరణాలు దోచుకున్నారు. తమిళనాడులో దీనిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, గురువారం తెల్లవారుజామున తిరుపతి టీటీడీ శ్రీకోదండరామస్వామి ధర్మశాల 3వ సత్రం ఎదురుగా ఉన్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పదంగా తచ్ఛాడుతున్న ఒక మహిళ, యువకుడిని తిరుపతి సీసీఎస్ ఇన్స్పెక్టర్ సి.భాస్కర్‌రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారిద్దరూ తల్లీకొడుకులని, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పంజన్ తంగాళ్ రోడ్డు, జీఆర్ నగర్‌కు చెందిన రసూల్ భార్య షమా(46), ఆమె కుమారుడు మహమ్మద్ సలీం(29) అని తేలింది. అంతేకాకుండా వారి వద్ద నున్న నల్లటి బ్యాగులను తెరచి పరిశీలించగా లక్షల విలువ చేసే బంగారు, డైమండ్, వెండి నగలు ఉండటంతో విస్తుపోయారు! వీళ్లు ఘరానా దొంగలనే కోణంలో విచారణ చేసేసరికి దోపిడీ వ్యవహారం బట్టబయలైంది. షమా ఇద్దరు కుమారులు మహ్మద్ సలీం, ఫైరోజ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని, వారిద్దరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదైనట్టు గుర్తించారు. షమా తన చిన్నకుమారుడు, తన స్నేహితులతో కలసి కోయంబత్తూరులో దోపిడీకి పాల్పడి ఈ నగలు కాజేసినట్టు వెల్లడైంది. ఈ నగలు ఇంటి వద్ద దాచి ఉంచినపక్షంలో తమిళనాడు పోలీసులు గుర్తించి పట్టుకుంటారనే ఉద్దేశంతో తన పెద్దకొడుకుతో కలిసి రెండుమూడు రోజులుగా తిరుపతిలోని వివిధ ప్రదేశాలలో ఉంటున్నట్టు షమా నోరువిప్పింది. ఈ నగలను తిరుపతిలో విక్రయించి వెళ్లాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఇక్కడికి వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. దోపిడీ ఘటన సమాచారాన్ని కోయంబత్తూరు జిల్లా కేజీ చావిడి పోలీసు స్టేషన్‌కు తిరుపతి పోలీసులు చేరవేశారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వివిధ చోట్ల దోపిడీ చేసిన∙సొత్తును బాధితులకు అప్పగించనున్నట్టు డీఎస్పీ ఆర్.రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన సీఐలు భాస్కర్‌రెడ్డి, కె.శరత్చంద్ర, టి.అబ్బన్న, ఎస్ఐ డి.రమేష్ బాబు, హెడ్‌కానిస్టేబుల్ రాజేంద్ర, ఆర్.పద్మావతి, కానిస్టేబుళ్లు భగవతి ప్రసాద్, బారుసా, రవికుమార్, రెడ్డెమ్మను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. వీరికి రివార్డులను సిఫారసు చేశారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
చిత్తూరు, పిచ్చాటూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన బుధవారం మధ్యాహ్నం మండలంలోని వెంగళత్తూరు దళితవాడలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. నగరి మండలం నెత్తం గ్రామానికి చెందిన శరవణ(30) చిత్తూరుకు చెందిన సత్య (20)ను మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగకని మూడు రోజుల క్రితం శరవణ తన అక్క సుమతి గ్రామమైన వెంగళత్తూరు దళితవాడకు తన భార్యతో కలిసి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం సుమారు 3 సమయంలో సుమతి ఇంట్లో హఠాత్తుగా కేకలు వినిపించాయి. చుట్టు పక్కలవారు వెళ్లి చూడగా సత్య కత్తిపోట్లకు గురై, రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. క్షణాల వ్యవధిలోనే ఆమె ప్రాణాలు విడిచింది. హతురాలి భర్త, అతని అక్క, బావ కలిసి రక్తపు మరకలను శుభ్రంగా కడిగేశారు. ఇంట్లోని నులక మంచంపై సత్య మృతదేహాన్ని పడుకోబెట్టిన స్థితిలో ఉంచి సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో పుత్తూరు డీఎస్పీ సౌమ్యలత, నగరి సీఐ మల్లిఖార్జున్, ఎస్ఐ రామాంజనేయులుతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హతురాలి భర్త, అతని బంధువులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ చేశారు. అయితే శరవణ పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. హత్యకు దారితీసిన కారణాలేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సత్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
గుండెలు పిండే విషాదమే మిగిలింది
చిత్తూరు, ములకలచెరువు: ‘దేవుడా! మా కుటుంబంపై ఎందుకీ పగ?.. ఒక్కసారిగా అందరినీ కడతేర్చావు..మా కుటుంబం కలలన్నీ సమాధి చేశావే..!’ అంటూ వీఎస్ఎస్ వర్మ రోదించడం అక్కడివారిని కంటతడి పెట్టించాయి. బుధవారం గుంటూరు జిల్లా యడ్లపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెం దడం విదితమే. వీరిలో భారతి(53), సుష్మ(28), సాయి కస్విక(2)మృతదేహాలను శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు సోంపాళ్యం వద్ద వీఎస్ఎస్ వర్మ ఫామ్‌హౌస్‌కి తీసుకొచ్చారు. ఇదేరోజు పలువురి కన్నీటి నివాళుల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. వర్మ అన్న కుమారుడైన సుందరరామరాజు(38)కు కాకినాడలో దహనక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ, విశాఖపపట్నం, కర్ణాటక రాష్ట్రం మైసూరు, బెంగళూరు నుంచి బంధువులు హాజరయ్యారు. కడసారి చూపులకు నోచుకోని సునీల్‌వర్మ రోడ్డు ప్రమాదంలో సునీల్‌వర్మ(35) తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. ఆయన భార్య సుష్మ, తల్లి భారతి, కుమార్తె కస్విక కడసారి చూపులకు కూడా నోచుకోకపోవడం ప్రతి ఒక్కరినీ విచలితుల్ని చేసింది. తాతయ్య చేతుల్లో కస్విక మృతదేహాన్ని చూసి పలువురు అయ్యో! అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దహనక్రియలకు స్థానికులు సహకారం అందించారు. -
ఇద్దరు మహిళలు దారుణ హత్య
జిల్లాలో ఒకే రోజు ఇద్దరు వివాహితలు దారుణ హత్యకు గురవడం సంచలనం సృష్టించింది. పీలేరు మండలంలో పశువుల మేతకు వెళ్లిన వివాహితను తలపై బండరాయితో మోది హతమార్చారు. పుత్తూరు మండలంలో మరో మహిళను గొంతు కోసి పొట్టన పెట్టుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలకమైన ‘క్లూ’లు లభించాయి. చిత్తూరు, పీలేరు: పశువులు మేపడానికి వెళ్లిన మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని వేపులబైలు వద్ద చోటు చేసుకుంది. పీలేరు ఎస్ఐ పీ.వీ. సుధాకర్కరెడ్డి కథనం.. వేపులబైలు పంచాయతీలోని వరంపాటివారిపల్లెకు చెందిన శేషాద్రి భార్య వరలక్ష్మి(36) బుధవారం ఆటోలో సోమల మండలం కందూరుకు వెళ్లి పశువులకు దాణా తీసుకువచ్చింది. అనంతరం తమ పశువులు మేపడానికి ఇంటికి తాళం వేసి వెళ్లింది. భర్త శేషాద్రి మేస్త్రీ కావడంతో పని కోసం పీలేరుకు వచ్చారు. వీరి ఇద్దరు కుమారులు తేజ, దినేష్ పాఠశాలకు వెళ్లారు. మేస్త్రీ పనికి వెళ్లిన భర్త, స్కూలుకు వెళ్లిన ఇద్దరు కుమారులు సాయంత్రం ఇంటికి వచ్చారు. వరలక్ష్మి ఇంటి వద్ద లేకపోవడంతో చుట్టుపక్కల ఆరా తీశారు. అప్పటికే మేతకు వెళ్లిన పశువులు సైతం ఇంటికి వచ్చేశాయి. రాత్రి అయినా వరలక్ష్మి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు. గ్రామ సమీపంలోని పొలాలు, బావులు, చెరువుల వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం మళ్లీ గాలింపు ముమ్మరం చేశారు. ఇంతలో మదరసా సమీపాన చెరువు సమీపంలో వరలక్ష్మి మృతదేహాన్ని ఆమె భర్త గురించి నిశ్చేష్టుడయ్యాడు. బండరాయితో తలపై మోది వరలక్ష్మిని హత్య చేసినట్టు ఉండడంతో పీలేరు పోలీసులకు, వీఆర్ఓ సమాచారం చేరవేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్ఐ, వరలక్ష్మి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి ధరించిన నగలు అలాగే ఉండటం, దుస్తులు చెక్కుచెదరకుండా ఉండటం గుర్తించారు. హతురాలి భర్త, బంధువులు, గ్రామస్తులతో మాట్లాడారు. హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. వివాహేతర సంబంధమేమై నా హత్యకు దారితీసిందా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. పీలేరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదేరోజు అంత్యక్రియలు నిర్వహించారు. చిత్తూరు, పుత్తూరు రూరల్ : వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం స్థానిక ఎన్టీఆర్ కాలనీ సమీపంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం..మండలంలో వేపగుంట క్రాస్ రోడ్డులోని ఎన్టీఆర్ కాలనీలో శంకరయ్య, ఆయన భార్య దేవకి (43) నివాసం ఉంటున్నారు. శంకర్ ఓ ప్రైవేట్ కాటన్ మిల్లో పని చేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెల్లో ఇటీవలే ఒక కుమార్తెకు వివాహం చేశారు. దేవకి పశువులను మేపేది. ఈ నేపథ్యంలో బుధవారం ఇంటికి అవసరమైన వంటచెరకు (ముళ్లకంపలు) తెచ్చేందుకు వెళ్లింది. రాత్రి అయినా ఆమె జాడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం ముళ్లపొదల మధ్య ఆమె మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తిం చారు. గొంతు కోసి ఆమెను దుండగలు దారుణంగా హత్య చేశారని గుర్తించారు. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పుత్తూరు పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. సంఘటన స్థలంలో మూడు తాగి పడేసిన మద్యం బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు, మాంసాహారం తిన్నట్లు ఆనవాళ్లు గుర్తించారు. మృతదేహం ఉన్న స్థితి బట్టి బుధవారం రాత్రి హత్యకు గురై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అలాగే, కంపలు కొట్టే ఒక కొడవలిని అక్కడ స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌తో గాలింపు సంఘటన స్థలానికి పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. అక్కడి నుంచి జాగిలాలు నేరుగా హతురాలి ఇంటి సమీపంలో ఉన్న మరో ఇంటి వద్దకు వెళ్లి ఆగాయి. దీంతో పోలీసులు సమీప ప్రాంతంలోని 30–35 ఏళ్లున్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హతురాలి కుటుంబ సభ్యులు వినియోగిస్తున్న పశువుల కొట్టం స్థలంపై వివాదం ఉన్నట్టు తెలియవచ్చింది. ఈ వివాదం నేపథ్యంలో హత్య చేశారా? మరే ఇతర కారణాలా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్చి ఉంది. గస్తీ పటిష్టం చేయండి : ఎమ్మెల్యే రోజా సంఘటనా స్థలాన్ని నగరి ఎమ్మెల్యే రోజా కూడా పరిశీలించారు. ఇటీవల పుత్తూరు పరిసర ప్రాంతాల్లో మూడు నాలుగు హత్యలు జరిగాయని వాటిని గుర్తు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గస్తీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, సీసీ కెమెరాల పనితీరునూ సమీక్షించాలని పోలీసులకు సూచించారు. -
తెల్లబోయే ఎర్ర నిజాలు
అడవులు స్మగ్లర్ల గొడ్డలి వేటుకు అంతరించి పోతున్నాయి. ప్రపంచాన్నే తన వైపు తిప్పుకునే శేషాచలంలో అటవీ సంపద హరించుకుపోతోంది. స్వార్థపరుల వ్యాపార దాహానికి ఇక్కడి అరుదైన ఎర్రచందనం వృక్షాలు నేలకొరిగిపోతున్నాయి. దుర్భేద్యమైన అడవుల్లో స్మగ్లర్లు అమూల్య వనరులను కాజేస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, దేశ సరిహద్దులను దాటిస్తున్నారు. వన సంపద దొంగల పాలవడమే కాకుండా పర్యావరణానికి కూడా పెనుముప్పు వాటిల్లుతోంది. రోజుకో వాహనం, పదుల సంఖ్యలో ఎర్ర కూలీలు పట్టుబడుతున్నా.. దీనికి ఎక్కడా పుల్‌స్టాప్ పడడం లేదు. చిత్తూరు, భాకరాపేట: అమూల్యమైన సంపదను కాపాడాల్సిన అటవీ శాఖకు ఖాళీ పోస్టుల సమస్య సవాలు గా మారింది. ఎర్రచందనం వృక్షాలున్న ప్రాంతా ల్లో సైతం పోస్టులు భర్తీ కావడం లేదు. తిరుపతి వన్యప్రాణి విభాగం డీఎఫ్ఓ పరిధిలో చామల, బాలపల్లె అటవీ రేంజ్‌లు ఉన్నాయి. చిత్తూరు జిల్లా చామల, వైఎస్ఆర్ జిల్లా బాలపల్లె రేంజ్లో 28 బీట్లు ఉన్నాయి. ఇందులోని 18 బీట్లలో భారీ ఎత్తున ఎర్రచందనం ఉంది. ఈ ప్రాంతాల్లోనే ఎర్రదండు తరుచూ చొరబడుతోంది. ఇక్కడ సుమారు 50 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో పనిచేయడానికి సిబ్బందెవరూ ముందుకు రావడంలేదు. దీంతో స్థానికంగా ఉం డే 90 మందిని ప్రొటెక్షన్ వాచర్లుగా తీసుకున్నా రు. వీరి ఏంపికలో అధికారులు అవలంబిస్తున్నతీరుపై విమర్శలున్నాయి. వీరి నియామకం వెనుక ఎర్ర స్మగ్లర్లు, నాయకుల హస్తముందనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు పట్టుబడ్డ తరువాతే.... దొరికితే దొంగలన్న చందంగా ఎవరైనా అటవీ శాఖకు చెందిన వారు ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడ్డ తరువాతే ఆ శాఖ స్పందించి చర్యలు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. చామలరేంజ్ పరిధిలో ఇటీవల ఎర్రావారిపాళెం మండలం నెరబైలు సెక్షన్లోనే ఆరుగురు వాచర్లు పట్టుబడ్డారు. వాహనాలను, దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రాబట్టి న సమాచారంతో ఎఫ్‌బీవో చొక్కలింగాన్ని సస్పెం డ్ చేశారు. భాకరాపేట ఫారెస్టు కార్యాలయంలోని గౌడన్ల నుంచి దుంగలు గోడపై నుంచి దాటవేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మదనపల్లెకు చెందిన ఓ స్మగ్లర్‌ను వాచర్‌గా పెట్టుకుని అభాసుపాలయ్యారు. ఇలా పట్టుబడ్డాక చర్యలు తీసుకునే కంటే వారిపై ముందుగానే నిఘావేయాల్సి ఉంది. అటవీ శాఖకు ఆయుధాలు కొరత.. ఆయుధాలు కొరత కూడా సమస్యగా తయారైనట్లు తెలిసింది. ఇద్దరు అధికారులు స్మగ్లర్ల చేతిలో హతమయ్యాక ఎర్రకూలీలను అడ్డు కోవాలంటే వారికి అత్యాధునికి ఆయుధాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అమెరికా నుంచి 200 అధునాతన ఆయుధాలను దిగుమతి చేసుకుంది. ఇవి ఇక్కడకు చేరలేదు. ఢిల్లీలోనే ఇవి తుప్పుబడుతున్నాయని తెలిసింది. ఎర్రచందనం అమ్మి భారీగా నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేసుకున్న ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీకి రూ.29 లక్షలు చెల్లించనందుకు అవి విమానాశ్రయం దాటలేదని భోగట్టా. కాగా అటవీశాఖలో జరిగే అవినీతికి యువ ప్రొటెక్షన్ వాచర్లను తమకు రక్షణ కవచంగా అటవీ అధికారులు మల్చుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఏదో ఒక ఉద్యోగం అనుకుని చేరి చివరికి జైలు ఊసలు లెక్కపెడుతున్నారు చాలా మంది యువకులు. అటవీ అధికారులే వారిని ఆ విధంగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెరబైలు సెక్షన్లో పట్టుబడ్డ వాచర్లు తమ అధికారుల తీరును తప్పుబట్టినట్లు తెలిసింది. పట్టించుకోని ప్రభుత్వం.. అటవీశాఖలో అవినీతిని ప్రభుత్వం ఏమాత్రం పట్టిం చుకోవడంలేదు. టెండర్ల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించడంలో ఉన్న శ్రద్ధ ఎర్రచందనం కాపాడడంలో లేదు. అమ్మకంలో వచ్చిన ఆదాయంలో 30 శాతం రక్షణకు వెచ్చిస్తున్నట్లు చెబుతున్నా ఆమేరకు నిధులు విడుదల కావడం లేదు. రోజు పదుల సంఖ్యలో ఎర్ర కూలీలు పట్టుబడుతున్నారు. వీరి నుంచి సమాచారాన్ని రాబట్టి కోర్టుకు హాజరు పరిచేలోపు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇందుకు ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోవడం కూడా అవినీతికి కారణంగా భావిస్తున్నారు. -
ప్రమాదాల్లో ఐదుగురి మృతి
జిల్లాలో, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరదాపురం రైల్వేస్టేషన్ సమీపంలో రైళ్లు ఢీకొని ఇద్దరు కీమెన్లు దుర్మరణం చెందారు. దట్టంగా కురుస్తున్న మంచులో రైళ్లు కనిపించక వారు మృత్యువాత పడ్డారు. చిత్తూరు, కలకడ : ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న దుర్ఘటనలో మండలానికి చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు–వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం.. తిప్పిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆరుగురు వ్యక్తులు గురువారం ఉదయం 7గంటల సమయంలో ఇటుకల కోసం ట్రాక్టర్లో కలకడకు బయలుదేరి వస్తుండగా పీలేరు నుంచి రాయచోటి వైపు వెళుతున్న కెఎ 01 ఎజె 4424 నంబరు గల లారీ జిల్లా సరిహద్దులో ఢీకొంది. ఈ ప్రమాదంలో తిప్పిరెడ్డిగారిపల్లె వాసి చిన్నకోట్ల వెంకట్రమణ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ ఎస్.మునాఫ్ (23), రఫీ (17), లక్ష్మీపతి తదితరులను 108లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మునాఫ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రఫీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతికి రెఫర్ చేశారు. కడప జిల్లా సంబేపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనతో తిప్పిగారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. రైళ్లు ఢీకొని ఇద్దరు కీమెన్లు..–మంచు తెచ్చిన ముప్పు గుడుపల్లె/కుప్పం రూరల్: రైళ్లు ఢీకొని ఇద్దరు రైల్వే కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన గుడుపల్లె సమీపంలోని సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రం వరదాపురం రైల్వేస్టేషన్ సమీపాన గురువారం చోటుచేసుకుంది. బంగారుపేట రైల్వే పోలీసుల కథనం.. కీమెన్లుగా రామస్వామి (24) బెంగళూరు ట్రాక్ మార్గంలో, రాజప్ప (26) చెన్నై మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 4 గంటల సమయంలో ఇద్దరు వరదాపురం రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రెండు పట్టాలపై రైళ్లు వీరిని ఢీకొన్నాయి. దీంతో రామస్వామి, రాజప్ప అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రామస్వామి శాంతిపురం మండలం, సీ.బండపల్లెకు చెందిన వ్యక్తి కాగా, రాజప్ప మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా రైల్వే పోలీసులు గుర్తించారు. రామస్వామి కాంట్రాక్టుపై పని చేస్తుండగా, రాజప్ప రెగ్యులర్ ఉద్యోగి. ఉదయం మంచులో రైళ్లను గమనించకపోవడం వల్లనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం వీరి మృతదేహాలను బంగారుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బంగారుపేట రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైలు కింద పడి యువకుడు.. కురబలకోట : రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం మధ్యాహ్నం కురబలకోట రైల్వేస్టేషన్ దగ్గర చోటుచేసుకుంది. పట్టాల మధ్యనే మృతదేహం పడి ఉంది. కదిరి రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చినట్లు రైల్వే స్టేషన్ మాస్టర్ Ðð తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా, లేదా అత్మహత్యా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
గమ్యం చేర్చింది.. ప్రాణం తీసింది
చిత్తూరు, సూళ్లూరుపేట: గమ్యం చేర్చిన బస్సే ఆమె ప్రాణం తీసింది. ఈ ఘటన మంగళవారం సూళ్లూరుపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం సంతవేలూరుకు చెందిన కుప్పాని కవిత (35) సూళ్లూరుపేటలోని నారాయణ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె మంగళవారం విధులకు హాజరయ్యేందుకు సంతవేలూరులో సూళ్లూరుపేట – శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్సు ఎక్కింది. స్థానిక వినాయకుడి గుడి సెంటర్లోని బస్‌స్టాప్‌లో దిగుతుండగా చీర డోర్‌కు ఇరుక్కుని అదుపుతప్పి కింద పడిపోయింది. బస్సు డ్రైవర్ ఆమె దిగిందనుకుని వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. వెనుక టైర్ ఆమె మీదకు ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కొన ఊపిరితో ఉందనుకుని వెంటనే స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్ నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి కారులో ఎర్రచందనం
తిరుపతిసిటీ: పెళ్లికి ముస్తాబు చేసిన కారులో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నలుగురు స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ వాసు కథనం మేరకు.. కరకంబాడి రోడ్డులోని మంగళం క్వార్టర్స్ గృహాల మధ్య కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు నిర్మానుష్య ప్రాంతంలో పెళ్లికి ముస్తాబు చేసిన స్క్వాడా కారు కనిబడింది. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీ చేశారు. ఎర్రచందనం దుంగలు కనిపించాయి. నలుగురు వ్యక్తులు వుండడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిండ్ర మండలానికి చెందిన దొరవేలు, మంగళంకు చెందిన దిలీప్‌కుమార్, తేజ, నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన మస్తాన్‌లుగా గుర్తించారు. -
అంతర్రాష్ట్ర కార్ల దొంగల ముఠా అరెస్టు
చిత్తూరు అర్బన్: తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో కార్లను చోరీ చేసే అంతర్రాష్ట్ర ముఠాను పలమనేరు బైపాస్ రోడ్డులోని దండపల్లె క్రాస్ వద్ద శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ విక్రాంత్‌పాటిల్ తెలిపారు. ఆయన చిత్తూరు నగరంలోని పోలీస్ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. వరుస కార్ల చోరీల నేపథ్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గంగవరం, పలమనేరు బైపాస్, దండపల్లె క్రాస్‌ల్లో తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలో కుప్పం నుంచి పలమనేరు వైపు వరుసగా ఏడు కార్లు వస్తుండగా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారని తెలిపారు. కార్లను డ్రైవర్లు వదిలి పరారయ్యారని పేర్కొన్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన దినేశ్‌కుమార్ (32)ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఏడు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. పరారైన దొంగలు ఆరుగురు తమిళనాడు వాసులని విచారణలో తేలిందన్నారు. వేర్వేరు ప్రాంతాల్లో కార్ల చోరీ దుండగులు ఆగస్టులో వరదయ్యపాళ్యం, శ్రీకాళహస్తి ప్రాంతంలో మూడు ఇన్నోవా కార్లు, సెప్టెంబర్‌లో విజయవాడలో మారుతి స్విఫ్ట్ కార్లు, బెంగళూరులో ఒక కారును చోరీ చేశారని ఎస్పీ తెలిపారు. వాటి విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందన్నారు. దినేశ్‌కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు ముఠా నాయకుడు మదురైకి చెందిన పరమేశ్వరన్‌ను అక్టోబర్ 16న వి.కోటలో అరెస్టు చేసినట్లు తెలిపారు. పరమేశ్వరన్ భార్య విజయలక్ష్మీ, దినేశ్‌కుమార్, దేవ పథకం ప్రకారం కార్లను చోరీ చేసి చెన్నై కొరత్తూరులోని సెకండ్ హ్యాండ్ షోరూమ్‌లో విక్రయిస్తున్నారని వివరించారు. ఆర్సీ నెంబర్లు, చాయిస్ నంబర్లను కూడా మార్చి చోరీ చేసిన కార్లను సులువుగా విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ద్విచక్ర వాహనానికి ఉండాల్సిన నంబర్లు కార్లకు, కార్లకు ఉండాల్సిన నంబర్లు ద్విచక్ర వాహనాలకు ఉన్నట్లు పేర్కొన్నారు. త్వరలో పరారైన మిగతా ఆరుగురు నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. అనంతరం ముఠాను పట్టుకోవడానికి అధికారులతో పాటు కృషి చేసిన పలమనేరు క్రైమ్ పార్టీ హెడ్‌కానిస్టేబుల్ దేవరాజులురెడ్డి, శ్రీనివాసులునాయుడు, గజేంద్ర, జయకృష్ణ, కానిస్టేబుళ్లు ప్రకాశ్‌నాయుడు, సతీశ్, జ్ఞానప్రకాశ్, అల్లావుద్దీన్, వెంకటేశ్, గౌస్, ఎల్లప్ప, విశ్వనాథ్, సురేష్, హెచ్‌జీ శివ, లోకనాథ్ లను ఎస్పీ అభినందించారు.