మహిళను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న సీఐ
ఆడపిల్లకు జన్మనిచ్చిందని కట్టుకున్నోడు వదిలేశాడు..చంటిబిడ్డతో తల్లిదండ్రులందరి చేరితే అక్కున చేర్చుకోవాల్సిన వారు కర్కశంగా వ్యవహరించారు. ఇంట ఉంటే తమ్ముడికి వివాహం కాదంటూ ఆమెను నిర్దయగా గెంటివేశారు. దీంతో అందరూ ఉన్నా అనాథ అయ్యాయని ఆమె కుంగిపోయింది. ఆత్మహత్య చేసుకునేందుకు తిరుపతికి వచ్చింది. సకాలంలో షీటీమ్ స్పందించింది. రైలు కింద కడతేరిపోవాలనుకున్న ఆమెను కాపాడింది.
సాక్షి, తిరుపతి క్రైం : జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యతో తనువు చాలించాలనుకున్న ఓ వివాహితను సకాలంలో శక్తి టీమ్ ఏఎస్‌ఐ సుమతి స్పందించి కాపాడారు. శని వారం ఈ సంఘటన వెస్ట్ రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ సీఐ వెంకటప్పయ్య కథనం..చిన్నగొట్టిగల్లుకు చెందిన సుబ్రమణ్యం, భువనేశ్వరి(26) భార్యాభర్తలు. వీరికి 2 నెలల పాప ఉంది. భువనేశ్వరికి గ్రహణ దోషం ఉండడంతో వివాహ సమయంలో ఆమె తల్లిదండ్రులు అల్లుడికి కట్నం అధికంగానే ఇచ్చారు. ఈ నేపథ్యంలో భువనేశ్వరి ఆడపాపకు జన్మనిచ్చింది. మగ బిడ్డకు జన్మనివ్వలేదని ఆగ్రహించి ఆమె భర్త పుట్టింటికి తరిమేశాడు. చంటిబిడ్డతో తల్లిదండ్రుల చెంతకు చేరిన ఆమెకు నిరాదరణే ఎదురైంది. నువ్వు ఇంట్లో ఉంటే మీ తమ్ముడికి పెళ్లి కాదంటూ –భువనేశ్వరిని తల్లిదండ్రులు ఇంటి నుంచి గెంటివేశారు.
దీంతో పోలీస్ స్టేషన్లకు, న్యాయస్థానానికి తిరగలేని బాధితురాలు తిరుపతిలోని వెస్ట్ రైల్వే స్టేషన్‌కు చంటిబిడ్డతో చేరుకుంది. ఆత్మహత్యకు చేసుకునేందుకు సిద్ధమైంది. అదృష్టవశాత్తు అప్పటికింకా ఏ రైలూ రాలేదు. అదే సమయంలో అటుగా వెళ్లిన షీటీమ్ ఏఎస్‌ఐ సుమతి ఆ వివాహితను గమనించింది. కుమిలి..కుమిలి ఏడుస్తున్న ఆమె వాలకం గమనించి అనుమానిం చింది. ఆమె దరిచేరి ప్రశ్నించింది. ఆమె గోడు తెలుసుకుంది. చంటిబిడ్డతో సహా ఆమెను సీఐ వద్దకు తీసుకువచ్చింది. అనంతరం తిరుచానూరు మహిళా ప్రాంగణంలో తల్లీబిడ్డకు ఆశ్రయం కల్పించారు. ఆ తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యుల్ని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పిలిపించి చిన్నపాటి క్లాసు పీకారు. దీంతో వారు దారికొచ్చారు. భువనేశ్వరిని బాగా చూసుకుంటామని చెప్పి తీసుకెళ్లారు. ఏఎస్‌ఐ సుమతిని పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment