చికిత్స పొందుతున్న సుబ్బన్న, చిన్నక్క
చిత్తూరు, మదనపల్లె టౌన్ : భార్య మరో వ్యక్తితో వెళ్లి పోవడాన్ని జీర్ణించుకోలేక ఓ వ్యక్తి సోమవారం తన ముగ్గురు బిడ్డలకు విషపు ఆకు గుళికలు మింగించి తాను ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన కురబలకోట మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు, ముదివేడు పోలీసుల కథనం మేరకు.. తెట్టు పంచాయతీ ఎలకలవారిపల్లెకు చెందిన బీఏ వెంకటేష్ కుమారుడు సుబ్బయ్య(39), వెంకటమ్మ దపంతులకు కవల పిల్లలు రామక్క(16), లక్షుమక్క(16), చిన్నక్క అలియాస్ చిన్ని(9) బిడ్డలు ఉన్నారు. కవలలు మదనపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా చిన్ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. సుబ్బయ్య, వెంకటమ్మ గ్రామ సమీపంలోని బండపై కంకర రాళ్లు కొట్టుకుని కుటుంబాన్ని పోషించుకునేవారు. బండ పనిలో కూలీలు గిట్టుబాటు కావడం లేదని వెంకటమ్మ ఏడాదిగా మదనపల్లె టమాటా మార్కెట్ యార్డులో కూలి పనులకు వెళుతోంది.
ఈ క్రమంలో వెంకటమ్మకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నెలకొంది. ఈ విషయాన్ని ఆరు నెలల క్రితం సుబ్బయ్య చూసి భార్యతో తరచూ గొడవ పడేవాడు. వెంకటమ్మ వారం క్రితం ఆ వ్యక్తితో వెళ్లి పోయింది. దీంతో పెళ్లీడుకొచ్చిన బిడ్డలు మథనపడటం, వారి చదువులకు ఇబ్బందిగా మారడంతో సుబ్బన్న తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అంతేగాక అవమానంగా భావించాడు. విషం తాగి మూకుమ్మడిగా చనిపోదామని మాట్లాడుకున్నారు. అప్పటికే తెచ్చుకున్న విషపు ఆకుల గులికలను సుబ్బన్న తన ముగ్గురు బిడ్డలకు మింగించాడు. తర్వాత తానూ మింగాడు. వారు కడుపు నొప్పితో పెనుగులాడుతుండగా గమనించిన పక్కింటివారు స్థానిక అమ్మచెరువు మిట్టలో కాపురం ఉంటున్న సుబ్బన్న అన్న బీఏ రాజుకు, 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని నలుగురినీ మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వారికి అత్యవసర చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న రూరల్ సర్కిల్ సీఐ మురళీక్రిష్ణ, ఎస్‌ఐ నెట్టికంఠయ్య మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి విచారించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment