భార్య, ప్రియురాలు ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి | Wife And Lover Suicide Attempt Husband Died in Prakasam | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం ఖరీదు నిండు ప్రాణం

Published Tue, Feb 11 2020 1:10 PM | Last Updated on Tue, Feb 11 2020 1:21 PM

Wife And Lover Suicide Attempt Husband Died in Prakasam - Sakshi

మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ టీమ్, ఆటో యువకుడు, స్థానికులు

వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో ఇద్దరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

సాక్షి, అద్దంకి: భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని తెలిసి ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది తెలిసి భర్త అప్రమత్తమై తన ప్రియురాలితో ఇక మన మధ్య వివాహేతర సంబంధం కుదరదని తేల్చి చెప్పాడు. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె గుండ్లకమ్మ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కాపాడబోయిన అతడు నదిలో దూకి గల్లంతై మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని తిమ్మాయపాలెం సమీపంలోని గుండ్లకమ్మ నది వద్ద సోమవారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అద్దంకి మండలం నాగులపాడుకు చెందిన గారపాటి వెంకట్రావుకు, చీమకుర్తి మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన మల్లేశ్వరికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

మల్లేశ్వరిని బయటకు తీసుకొస్తున్న 108 సిబ్బంది

వెంకట్రావు బతుకు దెరువు కోసం హైదరాబాద్‌లోని ఓ అపార్టుమెంటు వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తుండగా భార్య మల్లేశ్వరి బేల్దారి కూలీగా పనిచేసేది. అద్దంకి పట్టణం ఎన్టీఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ధనలక్ష్మి భర్త గుంజి వేణుబాబు(45)తో బేల్దారి పని చేసే సమయంలో మల్లేశ్వరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర  సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం మల్లేశ్వరి హైదరాబాద్‌ నుంచి అద్దంకి వచ్చి ప్రియుడు వేణును కలిసింది. వేణు ఆదివారం సినిమాకు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పి బయటకు వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. సినిమాకని చెప్పి బయటకు వెళ్లిన భర్త రాకపోవడంతో భార్య సోమవారం మధ్యాహ్నం ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని కోరింది. ఇంతలో ఓ సంచిలో మల్లేశ్వరితో కలిసి తీయించుకున్న ఫొటో చూసి ఇదేమిటని ఫోన్‌లోనే భార్య తన భర్తను ప్రశ్నించింది. అనంతరం తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని మనస్తాపం చెంది ఆమె పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను బంధువులు స్థానిక వైద్యశాలలో చేర్చగా చికిత్స పొందుతోంది. 

క్షణికావేశంతో నదిలోకి దూకిన మల్లేశ్వరి
ఈ విషయం ఇలా ఉంటే వేణుబాబు, మల్లేశ్వరి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని అప్పటికే చీమకుర్తి వెళ్లి ఉన్నారు. భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిసి ఇద్దరూ అద్దంకి పయనమయ్యారు. మార్గంమధ్యలో మనకు వేర్వేరుగా పెళ్లిళ్లు జరిగి పిల్లలున్నారని, ఇక వివాహేతర సంబంధం కొనసాగించడం మంచిది కాదని మల్లేశ్వరితో మార్గమధ్యలో వేణు అన్నాడు. అప్పటికే వారు ప్రయాణిస్తున్న బైకు గుండ్లకమ్మ బ్రిడ్జిపైకి చేరుకుంది. క్షణికావేశానికి గురైన మల్లేశ్వరి తాను నిన్ను విడిచి బతకలేనంటూ బైకు నుంచి కిందకు దిగి గుండ్లకమ్మ బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. 

ఆమెను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయి..
మల్లేశ్వరి నదిలోకి దూకడంతో హడావుడిగా కిందకు దిగి నదిలో మునిగిపోతున్న ఆమెను కాపాడేందుకు వేణు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వేణు నదిలో గల్లంతయ్యాడు. కొటికలపూడికి చెందిన తిప్పాబత్తిన బ్రహ్మయ్య అనే యువకుడు ఆటో నుంచి తాడు తీసుకుని ఆమెకు అందించాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది అతికష్టం మీద ఆమెను కాపాడారు. చికిత్స కోసం వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆమె చికిత్స పొందుతోంది. పోలీసులు కొత్తపట్నం నుంచి రెస్క్యూ టీమ్‌ను పిలిపించి వేణును బయటకు తీశారు. అప్పటికే అతడు మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు వేణుకు భార్య ధనలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తండ్రి మృతి చెందిన విషయం తెలుసుకున్న కుమార్తెలు విలపించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న భార్యకు బంధువులు భర్త మృతి విషయం తెలియనివ్వలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement