Prakasam Crime News
-
చదివింది ఏడు.. మోసాల్లో పీహెచ్డీ..!
సాక్షి, ఒంగోలు: ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 150 కేసుల్లో నిందితుడు..సాధారణంగా పోలీసులంటే ఎవరైనా భయపడతారు.. కానీ ఇతను మాత్రం ఎక్కువగా పోలీసులనే టార్గెట్ చేస్తాడు. చదివింది ఏడో తరగతే అయినా ఇంటర్నెట్లో వచ్చే వార్తల ఆధారంగా పోలీసులనే బెదిరించడం, భయపెట్టడం, ఆపై కేసు మాఫీ చేయిస్తానంటూ లక్షలు డిమాండ్ చేయడం అతని నైజం..ఆ ప్రాంతం..ఈ ప్రాంతమని సంబంధం లేకుండా మోసాలకు పాల్పడుతున్న రాచంపల్లి శ్రీనివాసులు అలియాస్ మంగలి శ్రీను పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో అతని నేర చరిత్ర, నేర పంథాను తెలుసుకొని పోలీసులకు మతిపోయినంత పనైంది. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలోని గెలాక్సీ సమావేశమందిరంలో సోమవారం ఏర్పాటు విలేకరుల సమావేశంలో నిందితుడి హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. (‘గ్యాంగ్’పై బహిష్కరణ వేటు) మంగలి శ్రీను నేరాల చిట్టాల్లో కొన్ని.. ► 2019 మార్చి 26న ఏఆర్ ఆర్‌ఎస్సైకి ఒకరికి ఫోన్‌చేసి డీఐజీ కార్యాలయం నుంచి ఫోన్చేస్తున్నానని, నీపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలంటే రూ.50వేలు బ్యాంకు ఖాతాకు జమ చేయాలని సూచించాడు. అయితే ఆయన తిరస్కరించాడు. ► అదే రోజు ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ ఖాశింకు ఫోన్‌చేసి డీఐజీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని మహిళా సిబ్బందిపై రాత్రిపూట డ్యూటీలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనకు సంబంధించి సస్పెన్షన్ ఎత్తివేయాలంటే రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా కానిస్టేబుల్ తిరస్కరించాడు. ► 2020 జనవరి 11న ఒంగోలు తాలూకా పీఎస్ పరిధిలోని కానిస్టేబుల్ ఆనంద్‌ను ఓరల్ ఎంక్వయిరీ నుంచి తప్పించేందుకు రూ.లక్ష డిమాండ్ చేసి విఫలమయ్యాడు. పలు కేసుల్లో కొంతమంది అతనితో నేరుగా వచ్చి కలుస్తామనడంతో ఆ తర్వాత వారితో ఎటువంటి సంబంధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ► అనకాపల్లిలో ఒక హెడ్మాస్టర్పై అక్కడి మహిళలు అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపించారు. ఈ వార్తను ఇంటర్నెట్లో చదివిన మంగలి శ్రీను అతని ఫోన్‌నంబర్ సంపాదించి ఇంటెలిజెన్స్ డీఐజీ ఆఫీసు నుంచి అంటూ బెదిరించి, సస్పెండ్ కాకుండా ఉండాలంటే అంటూ డబ్బులు కాజేశాడు. ► నెల్లూరులో ఒక కానిస్టేబుల్ గాంబ్లింగ్ కేసులో సస్పెండ్ కాగా దానిని ఎత్తివేయిస్తానని అంటూ డబ్బులు కొట్టేసినట్లు ప్రాథమిక సమాచారం. ఇదే విధంగా ప్రొద్దుటూరు, కడప వంటి అనేక చోట్ల ఇదే తరహా నేరాల్లో నగదు తీసుకున్నట్లు సమాచారం.తాజాగా శ్రీకాకుళంలో ఒక నేరంలో అరెస్టు అయి బయటకు వచ్చి మరో నేరం చేసేందుకు యత్నిస్తూ గిద్దలూరు పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో విస్తుగొల్పే విషయాలు.. మంగలి శ్రీను నేర చరిత్రను పరిశీలిస్తే దాదాపు 150కిపైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు అంచనా. 80 కేసులు కొట్టివేయగా..ప్రస్తుతం 50 నుంచి 60 కేసుల వరకు నడుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఏకంగా 18 మందిని మోసం చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తించారు. ఇతనిపై బెంగళూరు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 20 కేసుల్లో నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పీలేరు, హిందూపూర్, నెల్లూరు, కడప, పొద్దుటూరు, వనపర్తి, జమ్మలమడుగు, ఆత్మకూరు ప్రాంతాల్లో కూడా దాదాపు ఇదే తరహాలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులను, పోలీసులను, జైలు సిబ్బందిని, ప్రైవేటు వ్యక్తులను కూడా చీటింగ్ చేసినట్లు విచారణలో తేలింది. ప్రాథమికంగా రూ.11.80 లక్షలు చీటింగ్ చేసినట్లు నిర్థారణకు వచ్చారు. పోలీసుల విచారణలో తనకు ఇంగ్లిష్ రాకపోవడంతో ఉన్నతాధికారులను టార్గెట్ చేయలేకపోయానని చెప్పడం విశేషం. (నన్ను నేను చూసుకోలేక పోయాను: మహిమా చౌదరి) నగదు బదిలీకి సరికొత్త ఎత్తుగడ.. చదువుకున్నది ఏడో తరగతి అయినా టెక్నాలజీ వినియోగంలో అత్యంత తెలివితేటలు ప్రదర్శించేవాడు మంగలి శ్రీను. అత్యంత తక్కువ ధరలో ఉండే 2జీ ఫోన్లు వాడేవాడు. నిత్యం ఇంటర్నెట్లో నేరవార్తలు తెలుసుకుంటూ ఏదైనా నేరంలో చిక్కుకుని మానసికంగా మధనపడుతున్నవారిని, ఏదైనా నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని గుర్తించి వారి సమాచారం సేకరించి టార్గెట్ చేసేవాడు. ఈ తరహాలోనే గిద్దలూరు కేసులో శ్రీనివాసులు వద్ద నుంచి రూ.2లక్షలను తిరుపతిలోని ఒక పరిచయం లేని ఖాతాకు జమచేయించాడు. తన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో ఉన్నారని, తన ఖాతాకు సంబంధించి డబ్బు డ్రా చేసేందుకు అవకాశం లేనందున అకౌంట్ నంబర్ ఇస్తే అందులో తన బంధువులు డబ్బులు వేస్తారని, అందుకు లక్షకు రూ.2 వేల చొప్పున కమీషన్ కూడా ఆఫర్ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అపరిచిత వ్యక్తులకు డబ్బులు బదిలీ చేయవద్దు: ఎస్పీ పెద్దగా చదువుకోని మంగలి శ్రీను సాంకేతికతను వినియోగించుకుంటూ అక్రమ పద్ధతిలో డబ్బును సంపాదిస్తూ బెట్టింగ్ వ్యసనంలో పోగొట్టుకుంటున్నట్లు గుర్తించామని, బాగా చదువుకున్న వారు కూడా సైబర్ క్రైంల వ్యవహారంలో మోసపోవడం బాధగా ఉంటుందని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్‌చేసి అకౌంట్లలో డబ్బులు వేయమంటే వేయడం సరికాదని, అపరిచిత వ్యక్తులు ఫోన్‌చేసి అకౌంట్ వివరాలు అడిగితే తెలపరాదన్నారు. వైట్ కాలర్ నేరాలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏటీఎంల వద్ద జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కేసుల్లో ఉన్నతాధికారినని చెప్పి సస్పెన్షన్లు ఎత్తివేయిస్తాడనే ఉద్దేశంతో మంగలి శ్రీను సూచించిన ఖాతాలకు డబ్బులు జమచేసిన వారి వ్యవహారంపై కూడా దృష్టిసారించామని, ఆధారాలు లభ్యం కాగానే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర నేరస్తుడిని పట్టుకోవడంతో పాటు కర్నాటక, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలోని అనేక నేరాలకు సంబంధించిన వ్యవహారాలను బయటకు రప్పించడంలో కృషి చేసిన మార్కాపురం డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి, గిద్దలూరు సీఐ ఉప్పటూరి సుధాకర్, గిద్దలూరు ఎస్సై షస్త్రక్ సమంధార్వలి, గిద్దలూరు సర్కిల్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. చైన్‌స్నాచింగ్‌లతో మొదలు.. అనంతరంపురం జిల్లా నల్లమడ మండలం వేలమద్ది గ్రామానికి చెందిన మంగలి శ్రీనుకు 20 ఏళ్లకు పైగా నేర చరిత్ర ఉంది. తొలినాళ్లలో చైన్‌స్నాచింగ్‌లు, మోటార్ బైక్‌ల దొంగతనాలు, గృహ దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లాడు. ఆ కేసుల్లో కోర్టుకు హాజరయ్యే సమయంలో జైలు నుంచి తనకు ఎస్కార్టుగా వచ్చే సిబ్బందిని, పలువురు జైలు సిబ్బందిని ప్రలోభపెట్టి అనారోగ్యంతో ఉన్నట్లు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చూపించేవారు. కానీ అతను మాత్రం ఆస్పత్రిలో ఉండకుండా కర్నాటకలో దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఎస్కార్టు సిబ్బందితో పాటు జైలు సిబ్బంది కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ కేసు అనంతరం మంగలి శ్రీను తన నేర పం«థాను మార్చుకున్నాడు. తన కారణంగా సస్పెండైన కడప జైలులోని ఒక కానిస్టేబుల్‌కు ఫోన్‌చేసి ఇంటెలిజెన్స్ డీఐజీని మాట్లాడుతున్నానంటూ తొలుత బెదిరించాడు. ఆపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటే తాను చెప్పిన బ్యాంకు ఖాతాకు డబ్బులు వేయాలంటూ కొంత మొత్తం గుంజాడు. పట్టుబడిందిలా..! 2019 సాధారణ ఎన్నికల సమయంలో గిద్దలూరు పరిధిలోని దిగువమెట్ట చెక్‌పోస్టు వద్ద ఎం శ్రీనివాసులు అనే వ్యక్తి వద్ద పోలీసులు రూ.29.47 లక్షలు సీజ్‌చేశారు. ఈ విషయాన్ని ఇంటర్నెట్ వార్తల తెలుసుకున్న మంగలి శ్రీను నగదు సీజ్ చేసిన పోలీసుస్టేషన్‌కు ఫోన్‌చేసి అక్కడ ఉన్న సిబ్బందితో ఇంటెలిజెన్స్ ఐజీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానంటూ ‘ ఏం చేస్తున్నారు, ఆ డబ్బు ఏం చేశారంటూ హెచ్చరించడంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది కొంత డైలమాలో పడి కేసు వివరాలను అతనికి చెప్పారు. దీంతో అతను నంధ్యాలకు చెందిన ఎం.శ్రీనివాసులతో(ఎన్నికల సమయంలో పోలీసులు డబ్బులు సీజ్ చేసింది ఇతని వద్దే) మాట్లాడి వ్యవసాయపరంగా సంపాదించిన సొత్తు కనుక దాన్ని వెనక్కి ఇప్పిస్తానంటూ నమ్మించాడు. అయితే ఇందుకు తాను సూచించిన ఖాతాకు రూ.2 లక్షలు పంపాలని సూచించడంతో..ఆ వ్యక్తి ఆ మొత్తాన్ని జమ చేశాడు. నెల్లూరులో కూడా ఇదే తరహా ఘటనపై ఫిర్యాదు రావడంతో జిల్లా ఎస్పీ స్పెషల్ టాస్క్ఫోర్సును ఏర్పాటుచేసి నిందితున్ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి గిద్దలూరు పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించి రూ.1.60 లక్షలు, నెల్లూరులో జరిగిన ఘటనకు సంబంధించి రూ.1.20 లక్షలు మొత్తం రూ.2.80 లక్షలు సీజ్ చేశారు. -
నకిలీ కరెన్సీ కలకలం
ఒంగోలు: నగరంలో నకిలీ కరెన్సీ ముఠా హల్చల్ చేస్తోందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చిల్లర కావాలంటూ ఆగంతకుడు ఏకంగా రూ.31 వేలకు ఓ డెయిరీ నిర్వాహకుడిని మోసం చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో రాజా వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి దొడ్ల డెయిరీ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి ఓ వ్యక్తి అతని వద్దకు వచ్చి తన వద్ద పెద్ద నోట్లు ఉన్నాయని, తనకు చిల్లర అవసరం ఉందని చెప్పాడు. చిల్లర నోట్లు ఇస్తే పెద్ద నోట్లు ఇస్తానని నమ్మబలికాడు. తన వద్ద రూ.500 నోట్లు 68 ఉన్నాయని చెప్పాడు. డెయిరీ నిర్వాహకుడు తన వద్ద చిన్న నోట్లు ఎక్కువగా ఉండటంతో అతనికి పెద్ద నోట్లు ఇస్తే పోయేదేముందనే ఉద్దేశంతో తన వద్ద ఉన్న వంద రూపాయల నోట్లు 340 ఇచ్చాడు. అతను తన వద్ద ఉన్న రూ.500 నోట్లు 68 ఇచ్చి వంద నోట్లు తీసుకెళ్తుంటే డెయిరీ యజమాని ఒకసారి లెక్క పెట్టుకోమన్నాడు. తాను మెషీన్‌పై లెక్క పెట్టుకుంటానులే అంటూ వెళ్లిపోయాడు. అతను వెళ్లిన తర్వాత పరిశీలించుకుంటే ఆ నోట్లలో అన్నింటిపై ఒకే నెంబర్ ఉంది. ఆరు నోట్లపై మాత్రం వేర్వేరు నంబర్లు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే పైన ఉన్న ఆరు నోట్లు మాత్రమే మంచివి. మిగితావన్నీ కలర్ జిరాక్స్ పేపర్లుగా స్పష్టమైంది. ఆవేదన చెందిన సుబ్బారెడ్డి హుటాహుటిన ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయాన్ని వివరించి కలర్ జిరాక్స్ నోట్లు 62 సీఐ భీమానాయక్‌కు అందజేశాడు. మొత్తం రూ.31 వేలకు ఆగంతకుడు మోసం చేసినట్లు స్పష్టమైంది. సీఐ వెంటనే అప్రమత్తమై ఘటన జరిగిన సమయానికి గంట అటూ ఇటుగా సీసీ కెమెరాల ఫీడ్ బ్యాక్ తీసుకురావాలంటూ సిబ్బందిని పురమాయించాడు. షాపు యజమాని చెప్పిన గుర్తుల ఆధారంగా ఆగంతకుడిని గుర్తించేందుకు పోలీసుశాఖ ఏర్పాటు చేసిన కెమెరాలే కాకుండా ఆ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు ఉన్నా పేటేజీలు తీసుకునేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. కలర్ జిరాక్స్ మెషీన్ల ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నట్లు తాజాగా వెల్లడైంది. ఇటీవల స్థానిక కేబీ రెస్టారెంట్ వద్ద విదేశీయుల మాదిరిగా ఉన్న రెండు జంటలు ఒక వ్యక్తిని ఆపి అతని వద్ద ఉన్న నగదును చెక్ చేసినట్లు నటిస్తూ రూ.6 వేలు చోరీ చే శారు. -
పాడేరు టు తమిళనాడు
నెల్లూరు(క్రైమ్): విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు నుంచి తమిళనాడుకు గంజాయి అక్రమరవాణా చేస్తున్న ఇద్దరు మహిళలను నెల్లూరులోని చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.50 లక్షల విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి వివరాలను వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా ఉత్తమపాళ్యం తేవారం గ్రామానికి చెందిన తంగమాయన్ మణిమాల కొంతకాలంగా విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడుకు తరలించేది. అక్కడ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోసాగింది. పాడేరు, చోడవరం పోలీసులు గతంలో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కొంతకాలం క్రితం ఆమెను నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 15 రోజుల క్రితం కండీషన్ బెయిల్ (ప్రతి గురువారం నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో హాజరవ్వాలి)పై ఆమె జైలు నుంచి విడుదలైంది. వియ్యంకురాలితో కలిసి.. పలుమార్లు జైలుకు వెళ్లినా మణిమాల ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ నేపథ్యంలో ఆమె తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా ఉత్తమపాళ్యం కులంతేవర్కు చెందిన తన వియ్యంకురాలు జయపాల్ తమిళ్రాశితో కలిసి గంజాయి అక్రమరవాణా చేయసాగింది. అందులో భాగంగా వారు రెండురోజుల క్రితం పాడేరు దాని పరిసర ప్రాంతాల్లో రూ.2.20 లక్షలు విలువచేసే 22 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని ఎవరికీ అనుమానం రాకుండా ప్యాక్ చేసి తమిళనాడుకు బయలుదేరారు. అయితే గురువారం కండిషన్ బెయిల్ నిమిత్తం నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాల్సి ఉండడంతో తిరిగి తమ గ్రామం నుంచి రావడం కష్టం అవుతుందని మణిమాల భావించింది. నెల్లూరులో దిగి రెండురోజులు ఏదో ఒక లాడ్జిలో ఉండి గురువారం పోలీస్‌స్టేషన్‌లో హాజరై తిరిగి తమ గ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మణిమాల తన వియ్యంకురాలికి తెలియజేసి ఇద్దరూ కలిసి ఈనెల 18వ తేదీ సాయంత్రం నెల్లూరుకు చేరుకున్నారు. మద్రాస్ బస్టాండ్‌లో ఓ హోటల్ సమీపంలో ఆటో కోసం వేచి ఉండగా వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందనే సమాచారం చిన్నబజారు ఇన్స్పెక్టర్ ఎం.మధుబాబుకు సమాచారం అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్దనున్న బ్యాగుల్లో గంజాయిని గుర్తించారు. గంజాయి ప్యాకెట్లతోపాటు రెండు సెల్ఫోన్లు, రూ.1,450 నగదు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని విచారించి కేసు నమోదుచేసి అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. సిబ్బందికి అభినందన నిందితులను అరెస్ట్ చేసి పెద్దఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకునేందుకు కృషిచేసిన ఇన్స్పెక్టర్ మధుబాబు, ఎస్సై రవినాయక్, ఏఎస్సై శ్రీహరి, హెడ్‌కానిస్టేబుల్ భాస్కర్‌రెడ్డి, క్రైమ్ కానిస్టేబుల్ రాజా తదితరులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ ఎం.మధుబాబు, ఎస్సై రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఫేస్బుక్, వాట్సప్‌ల నుంచి ఫొటోలు, నంబర్లు
ప్రకాశం, కొండపి: మహిళను వాట్సప్ ద్వారా వేధిస్తున్న యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సింగరాయకొండ సీఐ యు.శ్రీనివాసరావు వివరాల మేరకు.. వలేటివారిపాలెం మండలం కలవల్ల గ్రామానికి చెందిన మోదేపల్లి నరేష్ కొంతకాలంగా ఫేస్బుక్ , వాట్సప్‌ల నుంచి మహిళల ఫొటోలు, ఫోన్ నంబర్లు పొంది తనది గోల్డ్‌షాప్ అని పరిచయం చేసుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. తనతో మాట్లాడకుంటే ఫొటోలు ఫేస్బుక్లో పెడతానని బెదిరించేవాడు. ఇటీవల కొండపి మండలంలోని కె.ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఓ మహిళను మానసిక క్షోభకు గురిచేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐఎంఈఐ నంబర్ల ద్వారా యువకుడిని కలవల్ల గ్రామం బస్ స్టాప్ వద్ద గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రసాద్, ఏఎస్ఐ సుబ్బయ్య, కానిస్టేబుళ్లను ఒంగోలు డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
భార్య, ప్రియురాలు ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి
వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో ఇద్దరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాక్షి, అద్దంకి: భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని తెలిసి ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది తెలిసి భర్త అప్రమత్తమై తన ప్రియురాలితో ఇక మన మధ్య వివాహేతర సంబంధం కుదరదని తేల్చి చెప్పాడు. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె గుండ్లకమ్మ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కాపాడబోయిన అతడు నదిలో దూకి గల్లంతై మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని తిమ్మాయపాలెం సమీపంలోని గుండ్లకమ్మ నది వద్ద సోమవారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అద్దంకి మండలం నాగులపాడుకు చెందిన గారపాటి వెంకట్రావుకు, చీమకుర్తి మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన మల్లేశ్వరికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మల్లేశ్వరిని బయటకు తీసుకొస్తున్న 108 సిబ్బంది వెంకట్రావు బతుకు దెరువు కోసం హైదరాబాద్‌లోని ఓ అపార్టుమెంటు వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తుండగా భార్య మల్లేశ్వరి బేల్దారి కూలీగా పనిచేసేది. అద్దంకి పట్టణం ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న ధనలక్ష్మి భర్త గుంజి వేణుబాబు(45)తో బేల్దారి పని చేసే సమయంలో మల్లేశ్వరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం మల్లేశ్వరి హైదరాబాద్ నుంచి అద్దంకి వచ్చి ప్రియుడు వేణును కలిసింది. వేణు ఆదివారం సినిమాకు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పి బయటకు వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. సినిమాకని చెప్పి బయటకు వెళ్లిన భర్త రాకపోవడంతో భార్య సోమవారం మధ్యాహ్నం ఫోన్ చేసి ఇంటికి రమ్మని కోరింది. ఇంతలో ఓ సంచిలో మల్లేశ్వరితో కలిసి తీయించుకున్న ఫొటో చూసి ఇదేమిటని ఫోన్లోనే భార్య తన భర్తను ప్రశ్నించింది. అనంతరం తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని మనస్తాపం చెంది ఆమె పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను బంధువులు స్థానిక వైద్యశాలలో చేర్చగా చికిత్స పొందుతోంది. క్షణికావేశంతో నదిలోకి దూకిన మల్లేశ్వరి ఈ విషయం ఇలా ఉంటే వేణుబాబు, మల్లేశ్వరి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని అప్పటికే చీమకుర్తి వెళ్లి ఉన్నారు. భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిసి ఇద్దరూ అద్దంకి పయనమయ్యారు. మార్గంమధ్యలో మనకు వేర్వేరుగా పెళ్లిళ్లు జరిగి పిల్లలున్నారని, ఇక వివాహేతర సంబంధం కొనసాగించడం మంచిది కాదని మల్లేశ్వరితో మార్గమధ్యలో వేణు అన్నాడు. అప్పటికే వారు ప్రయాణిస్తున్న బైకు గుండ్లకమ్మ బ్రిడ్జిపైకి చేరుకుంది. క్షణికావేశానికి గురైన మల్లేశ్వరి తాను నిన్ను విడిచి బతకలేనంటూ బైకు నుంచి కిందకు దిగి గుండ్లకమ్మ బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయి.. మల్లేశ్వరి నదిలోకి దూకడంతో హడావుడిగా కిందకు దిగి నదిలో మునిగిపోతున్న ఆమెను కాపాడేందుకు వేణు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వేణు నదిలో గల్లంతయ్యాడు. కొటికలపూడికి చెందిన తిప్పాబత్తిన బ్రహ్మయ్య అనే యువకుడు ఆటో నుంచి తాడు తీసుకుని ఆమెకు అందించాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది అతికష్టం మీద ఆమెను కాపాడారు. చికిత్స కోసం వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆమె చికిత్స పొందుతోంది. పోలీసులు కొత్తపట్నం నుంచి రెస్క్యూ టీమ్‌ను పిలిపించి వేణును బయటకు తీశారు. అప్పటికే అతడు మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు వేణుకు భార్య ధనలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తండ్రి మృతి చెందిన విషయం తెలుసుకున్న కుమార్తెలు విలపించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న భార్యకు బంధువులు భర్త మృతి విషయం తెలియనివ్వలేదు. -
నమ్మకంగా ఉంటూ చోరీలు
ఒంగోలు: నమ్మకం నటిస్తూ వీలు చూసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న మాయ లేడి పన్నిబోయిన శ్రీదేవిని అరెస్టు చేసినట్లు ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితురాలు గతంలో పలు నేరాలకు పాల్పడిందన్నారు. బాపట్ల పోలీసులు ఆమెను మూడు కేసుల్లో అరెస్టు చేసి రిమాండ్‌కు కూడా పంపారని తెలిపారు. రిమాండ్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఆమె తర్వాత గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకరోడ్డులోని టి.నగర్ నుంచి కొత్తపట్నం మండలానికి మకాం మార్చిందన్నారు. ఇక్కడ మొక్కలు అమ్మడం ప్రారంభించి ప్రజలను నమ్మిస్తూ వారు ఇంటి తాళాలను ఎక్కడ పెడుతున్నారనేది గమనించేదన్నారు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్లో గమళ్లపాలెంలో బలగాని వెంకటేశ్వర్లు ఇంట్లో 12 సవర్లు, ఈ ఏడాది జనవరి 25న కె.పల్లెపాలెంలో నాయుడు అంకమ్మ ఇంట్లో 4 సవర్లు, జనవరి 27న కె.పల్లెపాలెం బీచ్‌లో కె.రాజేష్ అనే వ్యక్తికి చెందిన 4 సవర్ల బంగారపు ఆభరణాలను చోరీ చేసిందన్నారు. వరుసగా జరుగుతున్న నేరాల్లో నిందితుల కోసం ఒంగోలు టూటౌన్ సీఐ రాజేష్, కొత్తపట్నం ఎస్సై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించగా కొత్తపట్నం పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న జియోలు సాయి, బాలులు కీలక సమాచారాన్ని తీసుకువచ్చారన్నారు. ఈ క్రమంలో తమ సిబ్బంది కె.పల్లెపాలెం బీచ్‌వద్ద అనుమానాస్పదంగా కనిపించిన శ్రీదేవిని అదుపులోకి తీసుకుని విచారించగా మూడు నేరాలను ఒప్పుకోవడంతో పాటు మూడు కేసుల్లో 18 సవర్ల బంగారు ఆభరణాలు ఆమె వద్ద లభ్యమయ్యాయన్నారు. ఈ సందర్భంగా కేసు చేధించేందుకు కృషిచేసిన వారందరినీ డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..
చీరాల టౌన్: వారంతా వేర్వేరు కుటుంబాలకు చెందిన వారైనా ఒకే కుటుంబంలా కలిసి మెలసి ఉండేవారు. సంక్రాంతి సెలవులను సరదాగా గడిపేందుకు తమ చుట్టాల వారు పిలిస్తే పెద్దలు, పిల్లలు 11 మంది కలిసి జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు వెళ్లి చివరకు రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు. అప్పటి వరకు దేవాలయాల్లో ఆనందంగా... భక్తి పారవశ్యంతో గడిపిన వారు తిరుగు ప్రయాణంలో శాశ్వత నిద్రలోకి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న 9 మందిలో ఐదుగురు మృత్యువాతపడగా.. తీవ్రంగా గాయపడిన నలుగురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈనెల 8 తేదీన రైలులో అహ్మదాబాద్ వెళ్లి ద్వారక, కేదార్నాథ్ దేవాలయాలను సందర్శించిన వీరు తిరుగు ప్రయాణంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబం మొత్తం మరణించగా, మరొక కుటుంబంలో కొడుకు, వేరే కుటుంబంలో ఇంటి యజమానురాలిని కోల్పోయారు. కళ్లెదుటే తమ వారు మృత్యువాత పడటం.. భాష రాకపోవడం.. కనీసం మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు కూడా సాయం చేసే వారు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఒక్కో కుటుంబానిది ఒక్కో దీనగాథ. ఆ కుటుంబంలో ఎవ్వరూ మిగల్లేదు..! జాండ్రపేట విద్యానగర్‌కు చెందిన కామిశెట్టి సుబ్రహ్మణ్యం (43), భార్య రాజేశ్వరి (38), కుమారుడు గణేష్ (24) ఈనెల 8న అహ్మదాబాద్‌కు వెళ్లారు. చేనేత వృత్తిని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జాండ్రపేటకు చెందిన సమీప బంధువు బొడ్డు నాగేంద్రం అహ్మదాబాద్‌లో పనిచేస్తుండటంతో తనకు దగ్గరలోనే ఉన్న సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించవచ్చని చెప్పడంతో నాగేంద్రం భార్య దుర్గా భవాని (24), సుబ్రహ్మణ్యం తమ్ముడు శివప్రసాద్, కృష్ణవేణి పిల్లలు అఖిల్ (12), మాధురిలతో అహ్మదాబాద్‌కు వెళ్లారు. ద్వారక, కేదార్నాథ్ ఆలయాలను సందర్శించుకున్నారు. అయితే తిరుగు ప్రయాణంలో ఉన్న వారు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ వాహనం ఆదివారంగుజరాత్ రాష్ట్రం సురేంద్రనగర్ జిల్లాలోని దేవ్‌పరా వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. వాహనంలో ప్రయాణిస్తున్న 9 మందిలో సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి, గణేష్, అఖిల్, దుర్గా భవానీలు అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారిలో మాధురి, కుచలత, రుషిత్, నాగేంద్రం తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, తండ్రి, కుమారుడు మృతి చెందగా ఈ కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు. దీంతో ఆ కుటుంబ బంధువులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతదేహాలు అహ్మదాబాద్‌లోని సివిక్ హాస్పిటల్లో ఉన్నాయి. వాటిని తీసుకొచ్చేందుకు వారి బంధువులు నలుగురు అహమ్మదాబాద్ వెళ్లారు. అయితే మృతదేహాలను స్వగ్రామాలకు తెచ్చేందుకు ప్రైవేటు అంబులెన్స్‌లను అడిగితే రూ.2 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో వారి దిక్కుతోచని స్థితిలో సాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు. రైలులో తీసుకురావాలన్నా ప్రభుత్వ సహాయం అవసరం. ఆ ఇంటి దీపం ఆరిపోయింది: కామిశెట్టి శివప్రసాద్, కృష్ణవేణి దంపతులకు అఖిల్ (12), మాధురిలు సంతానం. తన అన్న సుబ్రహ్మణ్యం, వదిన రాజేశ్వరి, అన్న కొడుకు గణేష్‌లు సోమ్‌నాథ్, కేదార్నాథ్, ద్వారక వెళ్తుండటంతో తమ పిల్లలను కూడా ఈ యాత్రకు పంపారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తన అన్న, వదిన, అన్నకొడుకుతో పాటుగా రక్తం పంచుకుని పుట్టిన అఖిల్(12) సంఘటనా స్థలంలోనే మృతిచెందగా కుమార్తె మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకు హఠాన్మరణం చెందడం, కూతురు హాస్పిటల్లో విషమ స్థితిలో ఉండటంతో ఆ కుటుంబం రోదిస్తున్న తీరు కలచివేసింది. నాగేంద్రానికి తోడు కరువు... అందరు వస్తే సోమ్‌నాథ్ ఆలయం దర్శించవచ్చని చెప్పి అందరినీ తీసుకుని వెళ్లిన నాగేంద్రం 9 మందితో కలిసి హాయిగా యాత్ర చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తన భార్య దుర్గా భవాని (23) కళ్లముందే తనను విడిచి వెళ్లడంతో కన్నీరు మున్నీరయ్యాడు. ప్రభుత్వం ఆదుకుంటేనే మా వారిని ఆఖరి చూపు దక్కేనా.. పండుగ వేళ అందరూ ఆనందంగా తీర్ధయాత్రలు చేస్తున్నారు.. మరో రెండు రోజుల్లో ఆనందంగా ఇంటికి చేరుతారని ఆశించిన వారి ఆశలు అడియాసలయ్యాయి. మా వారిని కడసారి చూపు చూసుకోవడానికి ప్రభుత్వం సాయమందించాలని జాండ్రపేట వాసులు వేడుకుంటున్నారు. ఊరు కాని ఊరు..భాష రాదు..మా వారిని మాకు ఆఖరి చూపు చూపించేందుకు అధికారులు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించాలని వేడుకుంటున్నారు. విషాదంలో జాండ్రపేట: నిత్యం మగ్గాల శబ్దాలతో, పిల్లల కేరింతలతో సందడిగా ఉండే జాండ్రపేట విద్యానగర్ ప్రాంతంలో ప్రస్తుతం నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జాండ్రపేటకు చెందిన ఐదుగురు ఒకేసారి మరణించడం, నలుగురు ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో గ్రామంలో విషాదం నెలకొంది. -
భర్త దూరం కావడంతో..
ప్రకాశం, యర్రగొండపాలెం: భర్త దూరం కావడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి యర్రగొండపాలెంలో జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అంబేడ్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఎం.ధనలక్ష్మి(28) భర్తకు విడాకులు ఇచ్చింది. కుమార్తెతో కలిసి తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఆమె కొంతకాలంగా కలత చెందుతున్నట్టు ఆమె బంధువులు తెలిపారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ధనలక్ష్మి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు ఒక కూతురు ఉంది. ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై పి.ముక్కంటి తెలిపారు. -
గుట్టు రట్టు
అద్దంకి: కర్నూల్లో తీగ లాగితే అద్దంకిలో నకిలీ మద్యం, పురుగుమందుల తయారీ భాగోతం బట్టబయలైంది. పట్టణం నడిబొడ్డున నకిలీ మద్యం, పురుగుమందులు బయో ఉత్పత్తులు తయారీ కేందాన్ని బుధవారం గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు అవాక్కయ్యారు. దాడుల్లో నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే రెట్టిఫైడ్ స్పిరిట్, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా పట్టణానికి చెందిన రావూరి శ్రీనివాసరావు తన ఇంటికి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కారు పెట్టుకునేందుకు వేసిన రేకుల షెడ్డులో చేస్తున్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావుతో పాటు ఆయన భార్య శ్రీదేవిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ డీసీ శ్రీమన్నారాయణ కథనం ప్రకారం..మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లాలో నకిలీ మద్యం తయారీ కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుల సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా స్టేట్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ హరికుమార్ అప్రమత్తమయ్యారు. ఆయన ఆదేశాల మేరకు పట్టణంలోని సాయి నగర్లో నివాసం ఉంటున్న రావూరి శ్రీనివాసరావు గృహంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అతని ఇంటి పక్కన వేసిన రెకుల షెడ్డులో 125 నకిలీ ఇంపీరియర్ బ్లూ క్వార్టర్ బాటిళ్లు, మద్యం తయారు చేసేందుకు ఉపయోగించే 175 లీటర్ల (నాలుగు క్యానుల్లో ఉంచిన) రెట్టిఫైడ్ స్పిరిట్, 510 ఎంసీ విస్కీ ఖాళీ బాటిళ్లు, 40 లీటర్ల ఖాళీ క్యానులు రెండు, 20 లీటర్ల ఖాళీ క్యాను ఒకటి సీజ్ చేశారు. 172 లీటర్ల నకిలీ పురుగు మందుల (బయో ఉత్పత్తులు) డబ్బాలు, ఖాళీ డబ్బాలు, వాటికి వేసే స్టిక్కర్లు, పురుగుముందుల డబ్బాలకు మూతలు అమర్చే మిషన్‌ను స్వాధీనం చేసుకుని వాటిని వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. నిందితుడు రావూరి శ్రీనివాసరావును విచారించగా తాను కర్నూలు జిల్లాకు చెందిన రాంబాబు ద్వారా నకిలీ మద్యం తయారు చేసే వినోద్ఖల్లాల్కు రూ.లక్ష అప్పుగా ఇచ్చానని, ఆ బాకీ ఇవ్వకపోవడంతో తనకు 2019 ఫిబ్రవరి నెలలో 14 క్యానుల స్పిరిట్, నకిలీ మద్యం బాటిళ్లు ఇచ్చారని చెప్పకొచ్చాడు. ఆగస్టులో రెండు దఫాలుగా వచ్చి 10 క్యానుల స్పిరిట్ తీసుకుని 128 ఖాళీ బాటిళ్లు ఇచ్చాడని చెప్పాడు. వినోద్ఖల్లాల్ మొత్తం 315 క్వార్టర్ నకిలీ మద్యం బాటిళ్లు ఇవ్వగా నాలుగు నెలల కాలంలో 190 బాటిళ్లను విక్రయించినట్లు శ్రీనివాసరావు అంగీకరించాడు. నకిలీ మద్యం బాటిళ్లపై ఉన్న కోడ్‌ను స్కాన్ చేయగా ఆ మద్యం బాటిళ్లు కర్నూలు నుంచే వచ్చినట్లు గుర్తించామని డీసీ చెప్పారు. నిందితుడిపై పీడీ యాక్ట్, 420 కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరింత లోతుగా విచారిస్తే నకిలీ మద్యం కేసుకు సంబంధించి మరికొంత మంది దొరికే అవకాశం ఉందని డీసీ వివరించారు. సమావేశంలో ఈఎస్ జి. నాగేశ్వరరావు, ఏఈఎస్ శ్రీనివాసులునాయుడు, ఎన్ఫోర్స్మెంట్ సీఐలు లీనా, తిరుపతయ్య, అద్దంకి ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి ముడిసరుకు నకిలీ పురుగుమందులకు సంబంధించిన ముడిసరుకును నిందితులు హైదరాబాద్‌లోని ముత్తుస్వామి, పొన్నుస్వామిల వద్ద తెస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామ్మూర్తి చెప్పారు. నకిలీ పురుగు మందులు తయారీ కేంద్రాన్ని గుర్తించినట్లు తెలుసుకున్న జేడీఏ అద్దంకి ఎక్సైజ్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ నిందితుడు శ్రీనివాసరావు వైరల్ హిట్ పేరుతో పురుగుమందు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆ మందును పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. నిందితుడిపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. విచారణలో మరింత సమాచారం రావాల్సి ఉందని జేడీ చెప్పారు. ఆయనతో పాటు ఏడీఏలు మాలకొండారెడ్డి, ధన్‌రాజ్, వ్యవసాయాధికారి వెంకటకృష్ణ ఉన్నారు. -
కన్నవారికి గుండె కోత
ప్రకాశం, మార్కాపురం: సరదాగా గడపాల్సిన ఆదివారం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం విద్యార్థి జీవితాన్ని కబళించింది. పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో పెద్ద వాటర్ ట్యాంక్ దగ్గర మోటార్ సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థిని లారీ ఢీ కొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణంలోని శివాజీనగర్ 6వ లైనులో నివాసం ఉండే దూదేకుల చిన్న జీజీర్ కుమారుడు కరీముల్లా (15) స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఎన్సీసీ డ్రిల్‌కు వెళ్లి బయటకు వచ్చిన తరువాత స్నేహితుడి మోటార్ బైక్ తీసుకుని తర్లుపాడు రోడ్డు వైపు వెళ్తుండగా వినుకొండ నుంచి రాగుల లోడుతో వస్తున్న లారీ పెద్ద వాటర్ ట్యాంక్ వద్దకు రాగానే లారీడ్రైవర్ తన వాహనాన్ని లెఫ్ట్ వైపు కట్ చేస్తుండగా అప్పుడే మోటార్ సైకిల్‌పై వస్తున్న కరీముల్లాకు తగలటంతో లారీ కింద పడి దుర్మరణం చెందాడు. వార్త విన్న తల్లిదండ్రులు సంఘటన స్థలానికి వచ్చి రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. మార్బుల్ రాళ్ల కూలీగా పని చేస్తున్న చిన్న జజీర్‌కు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. మృతుడు కరీముల్లా ఆఖరి అబ్బాయి. బాగా చదివించి మంచి ఉద్యోగం చేస్తాడని కలలు కంటుండగా ఊహించని రీతిలో లారీ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చి కుటుంబంలో విషాదం నింపిందని కుటుంబ సభ్యులు రోదించారు. శివాజీనగర్ 6వ లైనులో ఉంటున్న కరీముల్లా ఆ ప్రాంతంలో అందరికీ తలలో నాలుకలా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతని మృతితో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఉదయం 6 గంటల వరకు తమతో ఉన్న కుమారుడు 9గంటల కల్లా మృతదేహంగా రోడ్డుపై పడి ఉండటాన్ని తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి ఖాకీ
ప్రకాశం, మద్దిపాడు: మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జి.వీర్రాజు మంగళవారం ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ట్రాన్స్‌పోర్టు కంపెనీ లారీకి యాక్సిడెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ.5 వేలు డిమాండ్ చేయడంతో విధిలేని పరిస్థితిలో ఏసీబీని సదరు కంపెనీ మేనేజర్ ఆశ్రయించాడు. అందిన వివరాల ప్రకారం మండల పరిధిలోని దొడ్డవరప్పాడు సమీపంలో ఈనెల 15 తేదీ తెల్లవారు జామున లారీ ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ వద్దకు తరలించారు. ఈ నేపథ్యంలో ముందు వెళ్తున్న వాహనానికి సంబంధించిన వ్యక్తి తనకు కేసు అవసరం లేదంటూ వెళ్లిపోయాడు. లారీ డ్రైవర్ ట్రాన్స్‌పోర్టు కంపెనీ మేనేజర్ కరీమ్ ఖాన్‌కు ఫోన్ చేయగా అతను 15వ తేదీ, సాయంత్రం వచ్చి స్టేషన్లో విచారించాడు. ఈక్రమంలో లారీ ముందు భాగం దెబ్బతినడంతో ఇన్‌స్రూెన్స్ నిమిత్తం యాక్సిడెంట్ సర్టిఫికెట్ కోసం స్టేషన్ రైటర్ వీర్రాజును సంప్రదించగా అతను సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ.6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. స్టేషన్ రైటర్ మాట్లాడిన మాటలను వీడియో రికార్డింగ్ చేసి తాను అంత ఇవ్వలేనని తెలుపగా రూ.5 వేలు లేకపోతే నీపని కాదని రైటర్ కరాఖండిగా చెప్పడంతో కరీంఖాన్ నేరుగా ఒంగోలు చేరుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించి వీడియో క్లిప్పింగ్‌లు చూపాడు. వారు విషయాలను పరిశీలించి నిర్ధారణకు వచ్చిని ఏసీబీ అధికారులు కరీంఖాన్కు ఐదు వేల రూపాయల నగదు ఇచ్చి మంగళవారం ఉదయం మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌కు పంపారు. అతను నగదు రైటర్‌కు ఇచ్చిన వెంటనే ఏసీబీ అడిషనల్ ఎస్పీ గుంటూరు, ప్రకాశం జిల్లా ఇన్చార్జి ఏ సురేష్‌బాబు తన సిబ్బందితో కలిసి దాడిచేసి రైటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన నగదును రైటర్ టైబుల్ డ్రాయర్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో స్టేషన్ ఎస్ఐ ఖాదర్‌బాషా వేరే కేసు నిమిత్తం ఘటనా స్థలికి వెళ్లగా ఎస్ఐను పిలిపించి విషయం తెలిపారు. వీర్రాజును కస్టడీలోకి తీసుకుని నెల్లూరు ఏసీబీ కోర్టులో బుధవారం ప్రవేశ పెట్టనున్నట్లు ఏసీబీ ఏఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎన్.రాఘవరావు ఎ.వెంకటేశ్వర్లు ఏసీబీ సిబ్బంది పలువురు ఉన్నారు. దాదాపుగా 8 సంవత్సరాల తరువాత మద్దిపాడు మండలంలో ఏసీబీ అధికారులు దాడి చేయడం ఇదే ప్రథమం. గతంలో రెవెన్యూశాఖలో పని చేస్తున్న ఆర్ఐ రామానాయుడు ఇసుక ట్రాక్టర్ యజమాని వద్ద డబ్బులు డిమాండ్ చేసి లంచం తీసుకుంటున్న సమయంలో ఒంగోలులోని లింగయ్య భవనం సమీపంలో ఏసీబీ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. ఆ తరువాత తాజాగా మంగళవారం ఏసీబీ అధికారులు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రైటర్‌ను పట్టుకోవడం మండల ప్రజల్లో చర్చనీయాంశమైంది. రెండు రోజులు స్టేషన్ చుట్టూ తిప్పిబెదిరించాడు రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిప్పి బెదిరించాడు. ఎస్ఐ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పినా రైటర్ డబ్బు డిమాండ్ చేసి ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తాననడంతో ఏసీబీని ఆశ్రయించాల్సి వచ్చింది.– కరీంఖాన్,విజయవాడ ట్రాన్స్‌పోర్టు కంపెనీ మేనేజర్ బాధితులు ఎవరైనా ఫిర్యాదుచేయవచ్చు ఎవరైనా ఏసీబీకి ఫిర్యా దు చేయవచ్చు. తగిన ఆధారాలతో వారిని అరెస్టు చేస్తాం. ఎవరైనా అధికారులు అవినీతి పనులు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తే మాకు తెలియచేయండి. ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉంటాం.– ఏ.సురేష్‌బాబు, ఏసీబీ అడిషనల్ ఎస్పీ ప్రకాశం జిల్లా ఇన్చార్జి -
ఒంటరి మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి
సాక్షి, ప్రకాశం: ఒంటరిగా ఉన్న మహిళల పట్ల కామాంధులు ఆగడాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి...ఇటీవల ప్రియాంక రెడ్డి (దిశా)పై జరిగిన అమానుష ఘటన మరువక ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మహిళలపై అఘాయిత్యాల పర్వం ఎక్కువవుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ఒంటరిగా ఉన్న మహిళపై(విజయలక్ష్మి) కన్నేసిన కిషోర్ అనే యువకుడు ఆమెను అత్యాచారం చేయబోయాడు. ఆ మహిళ గట్టిగా ప్రతిఘటించడంతో, మహిళలపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. మహిళ గొంతుపై కత్తితో గాయం చెయ్యడంతో మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురై పడిపోవడంతో ఆమెను స్థానికులు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు , మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని చర్చించుకుంటున్నారో, ఆ యువకుడు కిషోర్ అయ్యప్ప మాల ధరించి ఉండటం గమనార్హం..నిందితుడు మానసిక పరిస్థితి బాగోలేదని స్థాయినికులు చెప్తున్నారు -
విద్యార్థినిపై ఏబీవీపీ నాయకుడి దాడి
సాక్షి, ఒంగోలు: తమ కార్యక్రమానికి పిలిస్తే రాలేనన్నందుకు ఏబీవీపీ నాయకుడు హనమంతు తనపై భౌతిక దాడికి దిగాడని ఒంగోలు శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థిని బుధవారం ఒంగోలు వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. బుధవారం స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏబీవీపీ నాయకులు మిషన్ సాహసి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యారి్థనీ, విద్యార్థులను పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు స్థానిక రంగారాయుడు చెరువు పక్కన ఉన్న శ్రీ చైతన్య ఒంగోలు క్యాంపస్‌కు వెళ్లి తరగతి గదుల్లో ఉన్న విద్యారి్థనులను కార్యక్రమానికి రావాలని ఏబీవీపీ నాయకులు హుకుం జారీ చేశారు. ఫిర్యాది తనకు అనారోగ్యంగా ఉందని, తాను రాలేనని చెప్పడంతో ఆగ్రహించిన హనుమంతు తన చున్నీ పట్టుకుని లాగి ఎగ్జామ్ ప్యాడ్‌తో తన ఎడమ భుజంపై కొట్టాడని, రాకుంటే అంతు చూస్తానని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత విద్యారి్థని ఫిర్యాదు మేరకు ఏబీవీపీ నాయకుడు హనుమంతుపై ఒన్‌టౌన్ జియో హనుమంతురావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదేం విధానం? కాలేజీకి విద్యార్థుల కోసం వెళ్తే తల్లిదండ్రులను సైతం దూరంగా ఉంచే కాలేజీ సిబ్బంది, ఒక విద్యార్థి సంఘ నాయకులు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే నేరుగా తరగతి గదుల్లోకి ఎలా అనుమతిచ్చారంటూ విద్యార్థి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ దారుణమేనని, తామే తమ బిడ్డపై చేయి చేసుకోమని, మీరెవరు చేయి చేసుకోవడానికి అంటూ నిలదీశారు. గతంలో కూడా ఇదే కాలేజీలో ఓ విద్యార్థి సంఘ నాయకుడు మీటింగ్ ఏర్పాటు చేసి ఏకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరిన విషయం రచ్చరచ్చగా మారిన విషయం విదితమే. అదే క్యాంపస్‌లో మరోమారు ఘటన జరగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కొడుకుని చంపిన తండ్రికి జీవిత ఖైదు
సాక్షి, ఒంగోలు సెంట్రల్: కొడుకును చంపిన కేసులో ఓ తండ్రికి యావజ్జీవ జైలు శిక్షను విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వి జ్యోతిర్మయి బుధవారం తీర్పు చెప్పారు. సంతమాగులూరు మండలం వెలల్లచెరువుకు చెందిన కొశ్చిరి బ్రహ్మనాయుడు అనే వ్యక్తి కూలీ పని చేసుకుంటూ తన ఇద్దరి కుమారులతో కలిసి నివసిస్తుంటాడు. పెద్ద కొడుకు కొశ్చిరి సంపత్‌కుమార్ గుంటూరులో ఎల్ఇడీ టీవీలను శుభకార్యాలకు సరఫరా చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో 2018వ సంవత్సరం జనవరి 13న బ్రహ్మనాయుడు ఇంట్లో దాచిపెట్టిన రూ.5000 కనిపించడంలేదని, తన కొడుకు సంపత్‌ను అడిగి, గొడవ పెట్టుకున్నాడు. అనంతరం అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో ఊరిలోని అంగన్ వాడీ కేంద్రం పక్కనే ఉన్న బెంచీపై నిద్రపోతున్న సంపత్‌ను రోకలిబండతో కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని నిందితుడు గుంటూరులో ఉన్న తన బంధువు రాజేష్‌కు సమాచారం అందించడంతో రాజేష్ నిందితుడి చిన్న కొడుకు సందీప్ కుమార్‌కు సమాచారం అందించడంచాడు. దీంతో సందీప్ పోలీసులకు ఫిర్మాదు చేయడంతో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్. శివరామకృష్ణ ప్రసాద్ నిందితుడికి శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ వాదనలను వినిపించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ యావజ్జీవజైలు శిక్షతో పాటు రూ. 1000 జరిమాన విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
‘కిలేడీ’ కేసులో మరో కొత్తకోణం
ఒంగోలు: జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిన సుమలత కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మహిళే మగ వేషం ధరించి బాలికలపై కృత్రిమ సాధనాలతో లైంగిక దాడికి పాల్పడిందనేందుకు మరో బలమైన ఆధారం పోలీసులకు లభ్యమైంది. సుమలతే మగవాడిలా విగ్ పెట్టుకొని సాయి అనే పేరుతో చలామణి అయినట్టు తెలుస్తోంది. కంఠంతోపాటు మగవాడిలా వేషం మార్చి కథ నడిపిందన్న బాగోతం వెలుగులోకి రావడంతో అందుకు సంబంధించిన ఆధారాలుసేకరించే పనిలో పడ్డారు పోలీసులు. నిందితురాలు సుమలత భర్త ఏడుకొండలు ఆత్మహత్య చేసుకోవడం, ఫోక్సో కేసులో ఆమె రిమాండ్‌లో ఉండడంతో దర్యాప్తు కోసం సాంకేతిక సహకారంతోపాటు భౌతిక సాక్ష్యాల కోసం వేట మొదలు పెట్టారు. కేసును విచారణలో భాగంగా సింగరాయకొండ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్ శుక్రవారం సుమలత నివాసం ఉండే ఒంగోలు మారుతీనగర్‌లోని పెంట్ హౌస్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఏడు ప్రేమ లేఖలను సీజ్ చేశారు. అవన్నీ నోటు పుస్తకాలను చించి రాసినట్లుగా ఉన్నాయి. వాటిలో మూడు లేఖలు ‘హాయ్’ పేరుతో ఉంటే మరో నాలుగు లేఖలు మాత్రం ‘సాయి చరణ్’ పేరుతో ఉన్నాయి. దీంతో సాయిచరణ్ అన్న పేరు కేవలం కల్పితం అన్న విషయం రూఢీ అయింది. పొడవాటి జుట్టును ఎలా కప్పి పెట్టి ఉంటుందనే సంశయం కూడా తాజా తనిఖీలలో గుర్తించిన విగ్‌తో వీగిపోయింది. పొడవాటి జడ సైతం అందులో ఇమిడి పోయే మగవారు ధరించే విగ్ శుక్రవారం తనిఖీల్లో పోలీసులకు లభ్యమైంది. దీంతో బాలికలను ఆకట్టుకునే క్రమంలో సుమలతే సాయిచరణ్‌గా వేషం ధరించేదనే నిర్ధారణకు వచ్చారు. ప్రేమ లేఖలపై సస్పెన్స్.. పోలీసులు సీజ్ చేసిన ఏడు ప్రేమ లేఖల్లో ఒకే చేతిరాత ఉన్నప్పటికీ ఎక్కడా దిగువన సంతకాలు మాత్రం లేవు. దీంతో వాటిని రాసింది ఎవరనేది నిర్థారణ చేయాల్సి ఉంది. సుమలత జీవితానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడం ద్వారా ఆమె ఎందుకు ‘షీ మ్యాన్’లా వ్యవహరిస్తుందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. (చదవండి: ఆమె ఇంట్లో కృత్రిమ లైంగిక సాధనాలు, ప్రేమలేఖలు) -
ఇంటి దొంగను ‘ఈశ్వరుడే’ పట్టుకున్నాడు!
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనేది సామెత. అయితే.. ఇంటివారే దొంగలను ఉపయోగించి దేవుని పటం వెనుక ఉంచిన సొత్తును అపహరించారు. కానీ చివరకు పోలీసులు దొంగలను పట్టుకోవడంతో అసలు బండారం బయటపడింది. సాక్షి, మార్కాపురం: పట్టణంలోని పేరంబజార్‌లో ఈ ఏడాది అక్టోబర్ 25న గుర్తు తెలియని వ్యక్తులు గృహంలోకి ప్రవేశించి 21 తులాల బంగారం దొంగతనం చేసిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 25న ఉదయం 3.30 నుంచి 5 గంటల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దేవుడి గదిలో అయ్యప్ప స్వామి పటం వెనుక ఉన్న బంగారు బ్రాస్లెట్లు 3, చైన్ 1, గాజులు 4, చెవి కమ్మలు 1జత, నల్లపూసల దండలు 2, బంగారు ఉంగరాలు 2 కలిపి మొత్తం 21 తులాల బంగారాన్ని దొంగిలించినట్లు గొట్టెముక్కల శ్రీదేవి అనే మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ కేవీ రాఘవేంద్ర, పట్టణ ఎస్సై కిశోర్‌బాబులు తమ సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ద్వారా దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఫిర్యాది కుటుంబ సభ్యులను, చుట్టు పక్కల వారిని విచారణ చేసి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇందులో భాగంగా నిందితులైన విజయవాడకు చెందిన ఓగిరాల సాయి రాజే‹Ù, గుంటూరు జిల్లా వెల్లటూరుకు చెందిన కూరాళ్ల శశాంక్లను అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం 11గంటల సమయంలో సీఐ రాఘవేంద్ర, ఎస్సై కిశోర్‌బాబులు సిబ్బందితో కలిసి మార్కెట్ యార్డు వద్ద సంచరిస్తుండటంతో అదుపులోకి తీసుకున్నారు. డామిట్.. కథ అడ్డం తిరిగింది.. నిందితులను విచారించగా అక్టోబర్ 25న అర్ధరాత్రి మార్కాపురం వచ్చామని, ఫిర్యాది కుటుంబ సభ్యుల్లో ఒకరు బంగారు ఆభరణాలను దొంగిలించి వారికి ఇచ్చి దాచి ఉంచాలని చెప్పినట్లు తెలిపారు. బంగారు ఆభరణాలను అమ్ముకుందామని తిరుగుతున్నట్లు వారు తెలిపారన్నారు. దొంగతనం కేసులో ఫిర్యాది కుటుంబ సభ్యులు ఉండటంతో పాటు పరిసర ప్రాంతాల వారిని విచారణ చేయటంతో దొంగతనం కేసు పలు మలుపులకు దారితీసిందని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ రాఘవేంద్ర, ఎస్సై కిశోర్‌బాబు, సిబ్బందిని ఆయన అభినందించారు. కచ్చితమైన సమాచారం ఇవ్వాలి మార్కాపురం డివిజన్లో ఎలాంటి దొంగతనాలు జరిగినా కచ్చితమైన సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదులో ఇవ్వాలని డీఎస్పీ తెలిపారు. దొంగతనం సమయంలో పోయిన వస్తువులతో పాటు మరి కొన్ని వస్తువులను జత చేసి ఫిర్యాదు ఇవ్వటం సరికాదన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు గమనిస్తుండాలన్నారు. తప్పుడు కేసులను పోలీసుల దృష్టికి తెచ్చి విలువైన సమయాన్ని వృథా చేయవద్దని పేర్కొన్నారు. -
లైంగిక ఆరోపణలు: అవమానభారంతో ఆత్మహత్య
సాక్షి, ఒంగోలు: భవనంపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జిల్లా కేంద్రం ఒంగోలులో కలకలం రేపింది. ఓ కేసు విచారణలో భాగంగా ఇంట్లో సోదాలు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఒంగోలు ఇన్చార్జి డీఎస్పీ రవిచంద్ర తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 4వ తేదీన స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ బాలిక తనపై ఒక వ్యక్తి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై జరుగుమల్లి పోలీసుస్టేషన్లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కేసును సింగరాయకొండ సీఐ టి.అజయ్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా బాలిక తెలిపిన వివరాల మేరకు ఎస్ఐ కమలాకర్ ఒంగోలు మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న గోనుకుంట ఏడుకొండలు ఇంట్లో బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఏడుకొండలు ఒక బ్యాగును దాచేందుకు యత్నించబోతుండగా పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగును పరిశీలించిన పోలీసులకు ప్లాస్టిక్‌తో తయారైన కృత్రిమ లైంగిక సాధనం, దానికి ఉపయోగించే బెల్టు ఇతర పరికరాలు కనిపించాయి. వాటిని బయటకు తీసి వివరాలు అడుగుతుండగా ఏడుకొండలు ఇదంతా తన భార్య వల్లే జరిగిందంటూ వాపోయాడు. ఒక్కసారిగా ఆత్మన్యూనతా భావంతో ఆ భవనం పెంట్ హౌస్ నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసు సిబ్బంది కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఏడుకొండలు కొద్దిసేపటికి మృతి చెందాడు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని, అవమాన భారంతోనే ఏడుకొండలు ఆత్మహత్య చేసుకున్నాడని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. మృతుడి భార్య మగవారి గొంతు, వేషధారణలతో బాలికలను లోబర్చుకుని లైంగిక దాడికి పాల్పడేదని ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగిందనే చర్చ జరుగుతోంది. -
దేవుడా.. ఎంత పని చేశావయ్యా!
ఇరవై రెండేళ్ల ఓ యువకుడు తన కాళ్లపై తాను నిలబడాలనుకున్నాడు. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉపాధి కోసం సౌదీకి వెళ్లాడు. పదేళ్ల పాటు అక్కడే ఉండి కుటుంబపోషణకు సరిపడా నాలుగు రాళ్లు సంపాదించుకున్నాడు. తిరిగొచ్చి వివాహం చేసుకున్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిన్నర దాటినా పిల్లలు కలగలేదని దేవుడికి మొక్కుకుందామనుకున్నాడు. తల్లి, భార్యను బైక్‌పై ఎక్కించుకుని గుడికి వెళ్తుండగా వారిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కుమారుడు మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. ఈ విషాద ఘటన కొమరోలు మండలం కత్తులవానిపల్లెవద్ద మంగళవారం జరిగింది. కొమరోలు (గిద్దలూరు): ఆర్టీసీ బస్సు–మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందారు. ఈ సంఘటన కొమరోలు మండలం కత్తులవానిపల్లె వద్ద మంగళవారం జరిగింది. ప్రమాదంలో అదే మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు సిద్ధమ్మ (55), నడిపి భూపాల్ (35) మృతి చెందగా భూపాల్ భార్య చంద్రకళకు తీవ్ర గాయాలయ్యాయి. అందిన సమాచారం ప్రకారం.. భూపాల్ తన భార్య చంద్రకళ, తల్లి సిద్ధమ్మతో కలిసి మోటారు సైకిల్‌పై గుడికి వెళ్తున్నారు. కడప–గుంటూరు రహదారిపైకి వస్తుండగా అదే సమయంలో కడప నుంచి విశాఖపట్టణం వెళ్తున్న ఆర్టీసీ గరుడ బస్సు ఢీకొంది. మోటారు సైకిల్‌పై ఉన్న భూపాల్‌తో పాటు అతని తల్లి సిద్ధమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. భార్య చంద్రకళకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భూపాల్‌తో సిద్ధమ్మ మృతి చెందారు. చంద్రకళ చికిత్స పొందుతోంది. కళ్లెదుటే కన్న కుమారుడు, భార్య మృతి చెందడంతో పాటు కోడలు గాయాలతో చికిత్స పొందుతుండటాన్ని చూసిన భూపాల్ తండ్రి చిన్న నరసింహులు గుండెలవిసేలా విలపిస్తున్నాడు. పిల్లలు లేరని గుడికి వెళ్తుండగా ప్రమాదం.. ఉరియా నడిపి భూపాల్ సౌదీఅరేబియాకు వెళ్లి పదేళ్ల పాటు పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించేంత వరకు సంపాదించుకుని రెండేళ్ల క్రితం స్వగ్రామం అయ్యవారిపల్లె వచ్చాడు. ఏడాదిన్నర క్రితం వైఎస్సార్ జిల్లా బాకరాపేటకు చెందిన చంద్రకళను వివాహం చేసుకుని ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లయి ఏడాదిన్నర కావస్తున్నా పిల్లలు లేకపోవడంతో వైఎస్సార్ జిల్లాలోని ఓ గ్రామంలోని ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. పూజలు రాత్రి వేళ చేయాల్సి రావడంతో సాయంత్రమే మోటారు సైకిల్‌పై బయల్దేరారని, లేని పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఉన్న కొడుకు దూరమయ్యాడని కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. మృతుడికి అన్న, తమ్ముడు ఉన్నారు. అన్న ఆర్మీలో, తమ్ముడు రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో తల్లి, కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ మళ్లికార్జున కేసు నమోదు చేసి దర్మాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పరిశీలించిన ఆయన పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. -
ప్రాణాలు తీసిన కోడి పందెం
సాక్షి, చీరాల(ప్రకాశం) : కోడి పందెం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. సరదా కోసమో ఆట విడుపు కోసమో కోడి పందేలకు వెళ్లి ఇద్దరి ప్రాణాలు నీటిలో కలసి పోగా మరొకరు ఆచూకీ కనిపించలేదు. కోడి పందేలు ఆడుతుండగా ఒక్కసారిగా పోలీసులు దాడులు మొదలు పెట్టారు. సుమారు 200 మందికి పైగా కోడి పందేల పాల్గొన్నారు. వారిలో కొందరు పారిపోగా మరికొందరు పోలీసులకు చిక్కారు. ఎలాగైనా పోలీసుల నుంచి తప్పించుకోవాలని నిశ్ఛయించుకుని నిండుగా ప్రవహిస్తూ ప్రమాదంగా ఉన్న ఈపురుపాలెం స్ట్రయిట్ కట్ కాలువలో దూకేశారు. కాలువలో అధికంగా బురద ఉండడంతో దూకిన వారు దూకినట్లే బురదలో చిక్కుకుని ప్రాణాలొదిలారు. అయితే ఇప్పటికే ఇద్దరు మృత దేహాలు లభ్యం కాగా మరొక వ్యక్తి ఆచూకీ గల్లంతయ్యింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో చోటుచేసుకుంది. వివరాలు.. చీరాల మండల పరిధిలోని విజయనగర్ కాలనీ శివారు ప్రాంతమైన ఈపురుపాలెం స్ట్రయిట్ కట్ కాలువ సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై మంగళవారం ఈపురుపాలెం పోలీసులు దాడి చేశారు. ఎస్సై సుధాకర్ తన సిబ్బందితో ఆకస్మికంగా దాడి చేస్తున్నారనే సమాచారం అందుకున్న కోడి పందెగాళ్లు పోలీసులు కొద్ది దూరంలో ఉండడం చూసి తలో దిక్కుకు పారిపోయారు. వారిలో కొందరు పొలాల్లోకి పారిపోగా మరి కొందరు సమీపంలోని స్ట్రయిట్ కట్ కాలువలోకి దూకి తప్పించుకున్నారు. సుమారుగా 30 మంది కోడి పందెం ఆడుతున్న వారు కాలువలోకి దూకగా వారిలో చీరాల ఐఎల్టిడి రామ్ నగర్‌కు చెందిన మేనపాటి శ్రీనివాసన్ (35) అనే వ్యక్తితో పాటు గుంటూరు జిల్లా వెదుళ్లపల్లికి చెందిన చౌట ఇర్మియా అలియాస్ మధు కృష్ణ (37), మరోవ్యక్తి గల్లంతయినట్టు గుర్తించారు. మధు కృష్ణ మృతదేహాన్ని ముంగళవారం రాత్రి 10 గంటల సమయంలో వెలికి తీయగా చీకటి పడడంతో గాలిపుం చర్యలు నిలిపివేశారు. బుధవారం ఉదయం శ్రీనివాసన్ మృత దేహాన్ని వెలికి తీశారు. శ్రీనివాసన్‌కు భార్య శ్రావణి, పదేళ్ల వయస్సు గల రషీష్, ఐదేళ్ల వయస్సు గల ప్రణీత్‌లు ఉన్నారు. అలానే మృతి చెందిన మధు కృష్ణ ఆటో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి భార్య మాధవి ఉన్నారు. ఇతనికి పిల్లలు లేరు. విచారణకు ఆదేశించిన ఎస్పీ కోడి పందేలు వేస్తుండగా పోలీసులు చేసిన దాడిలో ఇద్దరు ప్రమాద వశాత్తు కాలువలో పడి మరణించడంతో వెంటనే జిల్లా ఎస్పీ సిద్థార్డ్ కౌశల్ విచారణకు ఆదేశించారు. ఎస్పీ దర్శి డీఎస్పీ కె. ప్రకాశ్ రావులను చీరాలకు పంపించారు. అసలు తప్పిదం ఎవరిది దాడులు చేసే సమయంలో పోలీసులు తీసుకునే జాగ్రత్తలు పాటించారా లేదా అనే విషయాలపై ఆరా తీయించారు. పోలీసులు దాడిచేసే సమయంలో సమయ స్ఫూర్తిగా వ్యవహరించారా లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కేసు విచారణ అధికారిగా దర్శి డిఎస్పీ ప్రకాష్ రావుతో పాటు టూ టౌన్ సీఐ ఎండి.ఫిరోజ్‌ను నియమించారు. శోక సంద్రంలో మృతుల కుటుంబాలు ఆస్పత్రిలో ఉన్న మృత దేహాలను కడ సారిగా చూసుకునేందుకు మృతుల భార్యలు పిల్లలతో పాటు వారి బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు తరలి వచ్చారు. మృత దేహాలను చూసిన వారు శోక సంద్రంలో మునిగిపోయారు. సరదాగా ఆడేందుకు వెళుతుంటారని ఇలా విగత జీవులుగా తిరిగి వస్తారని అనుకోలేదని, ఇక తమకు దిక్కెవరంటూ రోధిస్తున్నారు. తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. పోలీసుల వైఫల్యమే: ప్రజా సంఘాలు రెండు నిండు ప్రాణాలను పోలీసులు బలి తీసుకున్నారని మృతుల బంధువులతో పాటు ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఆస్పత్రి వద్ద ఆరోపిస్తు నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల బారినుండి తప్పించునేందుకు కాలువలోకి దూకిన వారిని పోలీసులు రక్షించాల్సింది పోయి కనికరం లేకుండా వదిలివేయడంతోనే వారు మృతి చెందారని వారు పేర్కొన్నారు. ఎస్సై సుధాకర్‌తో పాటు పోలీసులు కోడి పందెగాళ్ల వెంట పడడంతో గత్యంతరం లేని పరిస్థితిలోనే వారంతా కాలువలో దూకి నిండు ప్రాణాలను బలి తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి పోలీసుల వైఫల్యంగానే భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. çపోలీసులే ఈ సంఘటనకు బాధ్యత వహించాలన్నారు. -
కూతురికి ఉరేసి.. తానూ ఉరేసుకొని ఆత్మహత్య
సాక్షి, గుడ్లూరు(ప్రకాశం): వ్యసనాలకు బానిసైన భర్త వేధింపులతోనే శ్రీలేఖ తన కుమార్తెకు ఉరేసి తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువు గండికోట రమణయ్య ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేవూరులో రాయని శ్రీలేఖ తన మూడేళ్ల కుమార్తె వర్షితకు ఉరేసుకొని తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. పెళ్లయిన మూడేళ్ల వరకు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. కొంత కాలం నుంచి భర్త చెంచుబాబు వ్యవసనాలకు అలవాటు పడి శ్రీలేఖను వేధించాడు. ఆ వేధింపులు భరించలేకే శ్రీలేఖ ఇలా అఘాయిత్యానికి పాల్పడిందని రమణయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రమణయ్య ఫిర్యాదు మేరకు భర్త చెంచుబాబు, అత్త,మామ యానాది, కోటేశ్వరమ్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పాండురంగారావు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ పాండురంగారావు పేర్కొన్నారు. -
బైకును ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా
బైకును వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని బోల్తాపడటంతో ఇద్దరు మృతిచెందగా 24 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మార్కాపురం మండలం దరిమడుగు సమీపంలో మహ్మసాహెబ్ కుంట వద్ద ఆదివారం జరిగింది. సాక్షి, మార్కాపురం రూరల్(ప్రకాశం): బైకును ఓ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టి బోల్తా పడటంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, 24 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని దరిమడుగు సమీపంలోని మహ్మసాహెబ్ కుంట వద్ద ఆదివారం జరిగింది. ప్రమాదంలో ఎస్కే అబ్దుల్ రహిమాన్ (30), ఎస్కే జిందాసాహిద్ (18)లు మృతి చెందగా అవ్వారు ఉమాదేవి, పి.పార్వతికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుంచి వైఎస్సార్ జిల్లా వెళ్తోంది. అందులో 26 మంది ప్రయాణికలు ఉన్నారు. పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ రహిమాన్ బైకుపై దోర్నాల బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి మార్కాపురం వస్తున్నాడు. అదే బైకుపై విద్యార్థి ఎస్కే జిందాసాహిద్ ఉన్నాడు. దోర్నాల–ఒంగోలు జాతీయ రహదారి మహ్మసాహెబ్ కుంట వద్ద ఓవర్ టేక్ చేయబోయి బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టి బోల్తా పడింది. బైకుపై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అబ్దుల్ రహిమాన్ పట్టణంలోని పదో వార్డులో నివాసం ఉంటూ పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయనకు భార్య రుక్షాన, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విద్యార్థి దరిమడుగులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిప్లమో సెకండియర్ చదువుతున్నాడు. ఇతడిది కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలం జూటూరు గ్రామం. తండ్రి రహంతుల్లా ఎలక్ట్రికల్ షాపు నడుపుతూ కుంటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బస్సులో ఉన్న 26 మంది ప్రయాణికుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌కు బాషాతో పాటు 24 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఉమాదేవి, పార్వతిది వైఎస్సార్ జిల్లాలోని కోణపేట మండలం అప్పన్నవల్లి. వీరు కుటుంబంతో శ్రీశైలం పుణ్యక్షేత్రం దర్శించుకుని తిరుగు ప్రయాణం చేస్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటన స్థలాన్ని సీఐ రాఘవేంద్ర, ఎస్ఐ గంగుల వెంకట సైదులు, పెద్దారవీడు ఎస్ఐ రామకృష్ణ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ రాఘవేంద్ర, ఇతర పోలీసు అధికారులు -
రుణాలిప్పిస్తామంటూ బురిడీ
సాక్షి, గిద్దలూరు(ప్రకాశం/కడప) : దురాశపరులకు గాలమేసి, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని చూసే కేటుగాళ్లు, మాయ లేడీలకు నేటి సమాజంలో కొదువలేదు. గిద్దలూరులోని మెప్మా కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కూడా ఇదే బాటలో నడిచి ఎలాగైనా పెద్ద మొత్తంలో నగదు సంపాదించాలని భావించారు. సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని, ఇంటి రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికి కొందరి నుంచి లక్షల్లో నగదు వసూలు చేశారు. వీరిరువురు గత ఏడాదిన్నర కాలంలో రూ.రెండు కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. బురిడీ కొట్టించేదిలా.. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. ఒక్కో లోనుకు ముందుగా రూ.50 వేలు చెల్లిస్తే మీ బ్యాంకు ఖాతాలో రూ.5.50 లక్షలు వస్తాయని, ఇందులో రూ.3 లక్షలు బ్యాంకు లోను, మరో రూ.2.50 లక్షలు ప్రభుత్వ రాయితీ ఉంటుందని ఆశకల్పించారు. దీంతో ఆశావహులు నాకు ఒకటి కాదు.. వేరేవాళ్ల పేరుతో మరో రెండు లోన్లకు డబ్బులు చెల్లిస్తామని ఆశపడ్డారు. ఇలా కొందరు 10 వరకు రుణాలు కావాలంటూ రూ.50 వేల చొప్పున వీరికి చెల్లించారు. ఇలా దాదాపు 300కు పైగా యూనిట్లకు రూ.50వేల చొప్పున రూ.కోటిన్నర వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అనుమానం వచ్చిన వారికి స్వచ్ఛాంధ్ర మహిళా సంఘం పేరుతో ఉన్న బ్యాంకు చెక్కుల్లో రూ.5.50 లక్షలు రాసి ఇస్తారు. ఈ చెక్కులు ఎక్కువ రోజులు చెల్లవని తిరిగి కొత్త చెక్కులు ఇస్తామని చెప్పి చెక్కులు ఇవ్వకుండా తిప్పుకున్న సంఘటనలు ఉన్నాయి. గృహాలకు లోన్లు మంజూరు చేస్తామని... పక్కా గృహాలకు రుణాలు మంజూరు చేయిస్తామని ఒక్కో ఇంటికి రూ.3.50 లక్షలు వస్తుందని, ఇందులో రూ.1.50 లక్షలు సబ్సిడీ, రూ.2 లక్షలు బ్యాంకు లోనుగా చెప్పారు. ఇందుకు తమకు రూ.50 వేలు ఇవ్వాలని, ముందుగా రూ.13 వేల చొప్పున వసూలు చేశారు. ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే పూరి గుడిసెలు ఉన్న ప్రాంతంలో ఫొటోలు తీయించుకోవాలని చెప్పడంతో ఏడాది క్రితం 50 మంది వరకు ఆటోల్లో దిగువమెట్టకు వెళ్లి అక్కడ పూరి గుడిశెల వద్ద ఫొటోలు తీయించుకున్నారు. ఇలా దళితులు తమ ఆర్థిక స్థోమతను బట్టి ఒక్కొక్కరు రెండు, మూడు గృహాలకు నగదు చెల్లించారు. ఇలా రూ.50 లక్షలకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. కడప, కర్నూలు జిల్లాల్లోనూ బాధితులు.. బాధితుల్లో ఎక్కువగా గిద్దలూరు పట్టణంతో పాటు, మండలంలోని గ్రామాలు, రాచర్ల, కొమరోలు మండలాల్లోనూ, వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు, పోరుమామిళ్ల, కర్నూలు జిల్లాలోని మహానంది, నంద్యాల ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు రోజుల క్రితం గౌతవరం గ్రామానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ మధ్యవర్తిగా ఉంటూ 15 మందితో నగదు కట్టించినట్లు సమాచారం. ఇతని ద్వారా నాలుగు రుణాలకు నగదు చెల్లించేందుకు ముందుకొచ్చిన ఓ యువకుడు రూ.1.,90 లక్షలు చెల్లించి మిగిలిన రూ.10వేలు ఇచ్చేందుకు గిద్దలూరు రాగా తాను మోసపోయానని గ్రహించి వాపోయాడు. యడవల్లికి చెందిన ఓ తలారి రూ.లక్ష, రంగారెడ్డిపల్లెకు చెందిన ఓ యువకుడు రూ.2లక్షలు, కర్నూలు జిల్లా అల్లీనగరంకు చెందిన ఓ మహిళ రూ.3.50 లక్షలు, సత్యవోలుకు చెంది ఓ చిరుద్యోగి రూ.60 వేలు, అదే గ్రామానికి చెందిన మరికొందరు రూ.4 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం పోరుమామిళ్లలో రూ.6 లక్షలు చెల్లించినట్లు సమాచారం. సబ్సిడీ రుణాలు ఇస్తున్నట్లు ఓ బ్యాంకు మేనేజరు (ప్రస్తుతం బదిలీపై వెళ్లిన)తోనూ చెప్పించారని, ఆ నమ్మకంతోనే తాను అప్పు తెచ్చి రూ.3.50 లక్షలు చెల్లించినట్లు ఓ బాధితురాలు వాపోయింది. వీరి మోసాలకు ఓ బ్యాంకు మేనేజరు, వెలుగు ఏపీఎం, ఉయ్యాలవాడకు చెందిన రంగయ్య, స్పందన ఫైనాన్స్ కంపెనీలో పనిచేసిన బసవయ్య, నంద్యాలకు చెందిన ఓ యువకుడితో పాటు, గిద్దలూరుకు చెందిన ఓ అంగన్వాడీ టీచర్, గౌతవరంకు చెందిన ఆటో డ్రైవర్ సహకరించారని, వారికి పరిచయం ఉన్నవారితోనూ నగదు కట్టించినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి నింధితులపై చర్యలు తీసుకుని తమ డబ్బు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. స్పందనలో ఫిర్యాదు.. దీనిపై సీఐ సుధాకర్‌రావును వివరణ కోరగా ముగ్గురు బాధితులు స్పందనలో ఫిర్యాదు చేశారని, ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు పంపనున్నట్లు ఆయన తెలిపారు. -
వంతెనపై నుంచి దూకి విద్యార్థిని బలవన్మరణం
సాక్షి, అద్దంకి(ప్రకాశం) : గుండ్లకమ్మ నది వంతెనపై నుంచి దూకి 9వ తరగతి విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. అందిన సమాచారం మేరకు మండలంలోని మోదేపల్లి గ్రామానికి చెందిన పాలెపోగు మార్తమ్మ పదేళ్ల నుంచి అద్దంకి పట్టణంలోని సంజీవనగర్‌లో మూడేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఈమెకు పాలెపోగు దేవి (15) అనే కుమార్తె ఉంది. బాలిక ప్రకాశం ప్రభుత్వ బాలికల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతూ, బీసీ హాస్టల్లో ఉంటోంది. అయితే ఏమైందో ఏమో కానీ ఆదివారం మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ నదిపైన వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అద్దంకి వైపు నుంచి దర్శి వైపు వెళ్తున్నమాజీ ఎస్సై సుబ్బరాజు వంతెనపై జనం గుమికూడి ఉండడం, ఒక దిమ్మెపై గాజులు, వాచీ మరి కొంత దూరంలో సూసైడ్ నోట్ దానిపై ఐదు రూపాయల నాణెం పెట్టి ఉండటాన్ని గమనించి విషయాన్ని స్థానిక ఎస్సై ఎం.శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లతో మృతదేహం వెలికితీత.. బాలిక నదిలో దూకిన తరువాత ఆమె మృతదేహం బయటకు తీయడం కోసం ఎస్సై శ్రీనివాసరావు గజ ఈతగాళ్లను పిలిపించారు. అలాగే ఒంగోలుకు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందానికి కబురు చేశారు. అక్కడకు చేరుకున్న ఈతగాళ్లు వలల్లో గాలిస్తూ మూడు గంటల తర్వాత బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. అదే సమయంలో ఒంగోలు నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడకు చేరుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక తల్లి మార్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీవు నా బెస్ట్ ఫ్రెండ్‌వి.. బాలిక వంతెనపై నుంచి దూకే ముందు ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టి నీళ్లలోకి దూకింది. అందులో ‘నేను ఎందుకంటే నెత్తురుతో రాసింది. నీవు నా బెస్ట్ ఫ్రెండ్‌వి, నేను సంతోషంగా ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా..’ అని రాసి ఉంది. ఆత్మహత్యకు గల కారణం ఏమిటనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
అత్తింటి ఆరళ్లకు యువతి బలి
సాక్షి, పెట్లూరు (ప్రకాశం): ఆ యువతికి వివాహమై ఏడాదిన్నరే. ఏమైందో ఏమో గానీ అత్తారింట్లో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని పెట్లూరులో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి కుమార్తె శవాన్ని చూసి తమ కుమార్తెను భర్త, అత్తమామలు చంపి ఉరేశారని ఎస్ఐ, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. పెట్లూరు ఎస్సీ కాలనీకి చెందిన ఆరితోటి వినోద్‌కు బల్లికురవ మండలం వైదన గ్రామానికి చెందిన మేరిమ్మ అలియాస్ స్వాతి (21)తో సుమారు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. మేరిమ్మ తాను నిద్రించిన గది నుంచి బయటకు వచ్చి టాయిలెట్‌కి వెళ్లి పక్కనే ఉన్న మరో గదిలొ శ్లాబ్ కొక్కేనికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కోడలు గదిలో నిర్జీవంగా వేలాడుతూ ఉండటాన్ని చూసిన అత్త బిగ్గరగా కేకలేసింది. ఇంట్లోని కుమారులు, కాలనీలోని మరి కొందరు వచ్చి చూన్నీ కోసి మేరిమ్మను కిందకు దించగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి ఇది ముమ్మాటికీ హత్యేనని పోలీసులు తహసీల్దార్ ఎదుట వాపోయారు. తమ కుమార్తెను అత్తింటివారే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అఘాయిత్యం ఎందుకు జరిగిందని చనిపోయిన కుమార్తె మృతదేహం వద్ద రోధించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. తహసీల్దార్ సుజాత సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి మృతురాలి తల్లిదండ్రులు, అత్తమామలు, భర్తతో మాట్లాడి వివరా>లు సేకరించారు. -
వ్యభిచార గృహంపై దాడి
సాక్షి, చీరాల రూరల్ (ప్రకాశం): చీరాల రామకృష్ణా పురం పంచాయతీలోని బోడిపాలెంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యభిచార గృహంపై చీరాల ఒన్‌టౌన్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో గృహ నిర్వాహకులతో పాటు ఒక పురుషుడు, నలుగురు మహిళలను అరెస్టు చేశారు. వారివద్ద రూ. 9,230 నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి ఒన్‌టౌన్ సీఐ నరహరి నాగ మల్లేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు. రామకృష్ణాపురం పంచాయతీలోని బోడిపాలెంలో నివాసముండే అన్నపురెడ్డి కోటమ్మ, శంకర్, గిరిబాబులు గత కొంతకాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. వీరు డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడే మహిళలను, కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తలకు దూరంగా ఉండే మహిళలను గుర్తిస్తారు. వారికి డబ్బులు ఆశచూపించి లోబరుచుకుని వ్యభిచార కూపంలోకి బలవంతంగా దించుతారు. అంతేకాక వారు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ఇతర ప్రదేశాలకు కూడా విస్తరించారు. ఈ విధంగా వారు వ్యాపార పరంగా చీరాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వ్యభిచార మహిళలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఈ క్రమంలోనే వారు చీరాల, ఈపురుపాలెం, విజయవాడ, గుంటూరు, వైజాగ్, వంటి ప్రాంతాలకు చెందిన మహిళలను చీరాలకు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని సిఐ తెలిపారు. అయితే ఇటువంటి సంఘటనలపై తరచు ఫిర్యాదులు అందుతుండడంతో ఆయా ప్రదేశంపై పోలీసులు ఎప్పటినుండో నిఘా పెట్టారు. పూర్తి సమాచారం అందుకున్న ఒన్‌టౌన్ సీఐ నాగ మల్లేశ్వరరావు తమ సిబ్బందితో రామకృష్ణాపురంలోని బోడిపాలెం వ్యభిచార గృహంపై దాడిచేశారు. ఈ దాడిలో ఒక పురుషుడితో పాటు నలుగురు మహిళలను పోలీసులు అదుపులోని తీసుకుని అరెస్టు చేశారు. వారితో పాటు గృహ నిర్వాహకులైన అన్నపురెడ్డి కోటమ్మ, శంకర్, గిరిబాబులను కూడా అరెస్టు చేశారు. వారిని తనిఖీలు చేయగా వారివద్ద రూ. 9,230 నగదు పట్టుబడినట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన నగదుతో పాటు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోని దించినట్లయితే కఠినంగా శిక్షిస్తామని సీఐ హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
చెన్నకేశవ ఆలయ ఈవో దుర్మరణం
సాక్షి, కనిగిరి: మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో అందె వెంకట నారాయణరెడ్డి (50) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇదే ప్రమాదంలో ఆయన కారు డ్రైవర్, అంటెండర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కనిగిరి మండలం చల్లగిరిగిల్ల సమీపంలోని ఎస్సీ కాలనీ వద్ద గురువారం ఉదయం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. నారాయణరెడ్డి మార్కాపురం చెన్నకేశవస్వామి ఆలయ రెగ్యులర్ ఈవోగా, వెలుగొండ దేవాలయాల గ్రూపు, భైరవకొన, కనిగిరి గ్రూపు దేవాలయాలకు ఇన్చార్జి ఈవోగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. నారాయణరెడ్డి కారులో కనిగిరి నుంచి మార్కాపురానికి బయల్దేరారు. కనిగిరి మండలం చల్లగిరిగిల్ల సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎస్సీ కాలనీ వద్ద చప్టాను ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఈవో ఏవీ నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ ముప్పూరి సాయి తేజకు కాలు విరిగింది. అటెండర్ మల్లికార్జున్ తలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగ్రాతులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. ఈ మేరకు ఎస్ఐ జి.శివన్నారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నేరుగా వెళ్లి ఉంటే మృత్యువు తప్పేదేమో? ఉద్యోగరీత్యా కనిగిరి ఏరియాలోని దేవాలయలకు ఇన్చార్జి ఈవోగా పనిచేస్తున్న నారాయణరెడ్డి నాలుగు రోజులుగా కనిగిరిలోనే ఉంటున్నారు. బుధవారం ఉదయం దేవదాయ శాఖ కమిషనర్ పద్మతో కలిసి భైరవకొన ప్రాంత అభివృద్ధి పనుల పరిశీలనకు వెళ్లారు. రాత్రి బాగా పొద్దు పోవడంతో కనిగిరిలోనే బస చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయాన్నే కారులో మర్కాపురం బయల్దేరారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత గదిలో ఏటీఎం కార్డు మరిచిపోయినట్లు గుర్తుకొచ్చి వెంటనే కారును ఆపి వెనక్కి తిరిగి కనిగిరి వచ్చారు. నారాయణరెడ్డి తన గదిలో ఉన్న ఏటీఎం కార్డు తీసుకుని తిరిగి మార్కాపురం బయల్దేరారు. మార్గమధ్యంలో చల్లగిరిగిల్ల వద్ద మృత్యు ఒడికి చేరారు. తిరిగి వెళ్లకుండా కనిగిరిలోనే ఆగి ఉన్నా.. లేకా తిరిగి వెనిక్కి రాకుండా మార్కాపురం వెళ్లి ఉన్నా మృత్యు ఘడియలు తప్పేవేమోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. నిన్నటి వరకు కనిగిరిలో ఈవోగా పనిచేస్తూ ఇటీవల బదిలీల్లో మార్కాపురం వెళ్లిన ఏవీ నారాయణరెడ్డి అందరికి సుపరిచుతుడే. స్నేహశీలిగా పేరొందారు. నారాయణరెడ్డి మృతదేహాన్ని పలువురు నాయకులు, అధికారులు సందర్శించి ఘన నివాళులర్పించారు. సంఘటన స్థలాన్ని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నారాయణరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నారాయణరెడ్డి మృతదేహానికి త్వరగా పోస్టుమార్టం నిర్వహించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. -
యాచకురాలిపై లైంగికదాడి..
ప్రకాశం, జరుగుమల్లి (సింగరాయకొండ): మానసిక దివ్యాంగురాలైన యాచకురాలిపై మద్యం మత్తులో ఇద్దరు కామాంధులు లైంగిక దాడికి విఫలయత్నం చేశారు. బాధితురాలు బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఈ సంఘటన జరుగుమల్లి మండలం చింతలపాలెం ఎస్సీ కాలనీ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. అందిన వివరాల ప్రకారం కొద్ది రోజులుగా సుమారు 35 ఏళ్ల మహిళ చింతలపాలెంలో యాచక వృత్తి చేసుకుంటూ జీవిస్తోంది. ఈమె మానసిక దివ్యాంగురాలు. వేకువ జామున సుమారు ఒంటిగంట సమయంలో గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన నలమల మాల్యాద్రి (50), మెండా సుబ్బారావు(27)లు మద్యం మత్తులో ఆమెపై లైంగిక దాడికి విఫలయత్నం చేశారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకునేందుకు బిగ్గరగా కేకలు వేసింది. యాచకురాలి కేకలు విని ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చిన కాలనీ వాసులు వీరిద్దరినీ గమనించి పట్టుకుని తప్పించుకుని వెళ్లకుండా చెట్టుకు కట్టేశారు. యాచకురాలు నిందితుల నుంచి కాపాడుకునే ప్రయత్నంలో ఆమె గొంతుపై గాయమైంది. స్థానికులు సుమారు 4.30 గంటల సమయంలో 108 సిబ్బందికి సమాచారం అందించి ఆమెను రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌కు చేరిన యాచకురాలు ఆస్పత్రి నుంచి పరారైంది. పోలీసులు యాచకురాలిని వెతికే ప్రయత్నం చేసినా ఆమె దొరకలేదు. ఈలోగా గ్రామస్తులు నిందితులను తీవ్రంగా దూషించారు. తెల్లారిన తర్వాత స్థానిక పోలీసులకు అప్పగించారు. వీరిద్దరిలో మాల్యాద్రికి గతంలో మోటారు సైకిల్ దొంగగా పోలీసులకు సుపరిచితుడు. సుబ్బారావు ఓ సీఫుడ్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు. -
రజియాను చంపింది ప్రియుడే
ప్రకాశం ,కనిగిరి: మర్రిపూడి మండలంలోని కొండ గుహల్లో రజియా(35)ను ఆమె ప్రియుడే కిరాతకంగా చంపినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మాయ మాటలు చెప్పి..నమ్మకంగా కొండ గుహల్లోకి తీసుకెళ్లి చున్నీతో గొంతు నులిమి కత్తితో గొంతుపై పొడిచి చంపినట్లు సమాచారం. హత్య జరిగిన తర్వాత రోజు మళ్లీ వెళ్లి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టి అనవాళ్లు లేకుండా చేసినట్లు తెలుస్తోంది. రజియా ప్రియుడు ఖాదర్‌బాషా ప్రధాన నిందితుడుకాగా అతడికి సాయంగా తన సమీప బంధువు మరొకరు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. పట్టణంలోని కూచిపుడిపల్లికి చెందిన యానిమేటర్ రజియాను ప్రియుడు ఖాదర్‌బాషా శనివారం ఆమె కార్యాలయం నుంచి నమ్మకంగా బైక్‌పై ఎక్కించుకెళ్లాడు. ఎప్పుడూ సరదాగా వెళ్లి గడిపే కూచిపుడిపల్లిలోని కొండ గుహల్లోకి తీసుకెళ్లాడు. ఆమెను మాటల్లో పెట్టాడు..మైకంలోకి దించాడు. ఒక్క సారిగా రాక్షసత్వం ప్రదర్శించాడు. చున్నీతో గొంతు నులిమి ఆపై కత్తితో గొంతులో కసితీరా పొడిచి చంపినట్లు తెలిసింది. తిరిగి ఇంటికి వచ్చిన ఖాదర్‌బాషా ఏమీ తెలియనట్లు కనిగిరిలో తిరిగాడు. ఆదివారం ఇంట్లోని సొంత భార్య, పిల్లలను బయటకు పంపించి ఇంటికి తాళం వేశాడు. ఖాదర్‌బాషా స్నేహితుడు, దగ్గరి బంధువైన పట్టణంలోని అంకాళమ్మ గుడి వీధికి చెందిన మరొకరిని మద్యం తాగేందుకంటూ ఆదివారం బయటకు తీసుకెళ్లాడు. గార్లపేటలో ఇద్దరూ పూటుగా మద్యం తాగారు. ఆ తర్వాత ఖాదర్‌బాషా, అతని బంధువు పెట్రోలు తీసుకుని శవం ఉన్న కొండ ప్రాంతానికి వెళ్లారు. మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టి అనవాళ్లు లేకుండా చేశారు. ఘటన జరిగిన నాలుగు రోజులకు ఖాదర్‌బాషానే స్వయంగా వెల్లడించిన మాటల మేరకే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని సంఘటన స్థలాన్ని గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు మర్రిపుడి పోలీసులు, కనిగిరి పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. రజియాగా నిర్థారణ తొలుత కాలిన శవం రజియాదా కాదా అనే అనుమానంలో ఉన్న పోలీసులు శుక్రవారం ఆ శవం కనిగిరికి చెందిన యానిమేటర్ రజియాదిగానే నిర్థారణకు వచ్చారు. కందుకూరు డీఎస్పీ రవిచంద్ర పర్యవేక్షణలో పూర్తి విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు ఖాదర్‌బాషాతో పాటు అతడి సమీపం బంధువును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు ఇచ్చిన సమాచారం మేరకు కాలిబూడిదైన శవం రజియాదని తేల్చారు. రజియా మృతదేహానికి పోస్టుమార్టం మర్రిపూడి: మండలంలోని ఆండ్ర రామలింగేశ్వర స్వామి కొండ గుహల్లో హత్యకు గురైన రజియా (35) మృతదేహానికి శుక్రవారం పంచనామాతో పాటు పోస్టుమార్టం చేసినట్లు ఎస్ఐ సుబ్బారాజు శుక్రవారం తెలిపారు. కందుకూరు డీఎస్పీ రవిచంద్ర సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హత్యకు గురైన చోటే రజియా మృతదేహానికి రిమ్స్ వైద్యుడు సుబ్బారావు ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేశారు. రజియాను ఆండ్ర రామలింగేశ్వరస్వామి కొండ గుహల్లో పెట్రోల్ పోసి అతి కిరాతకంగా కాల్చి చంపిన ప్రియుడు ఖాదర్‌బాషాను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. ఆయన వెంట కనిగిరి సీఐ ప్రతాప్‌కుమార్ ఉన్నారు. -
వివాహిత హత్య.. ప్రియుడే హంతకుడు..
కనిగిరి: కనిగిరిలో అదృశ్యమైన వివాహిత రజియా (32) మర్రిపుడి మండలం కూచిపుడి కొండల్లో హత్యకు గురై కాలి బూడిదగా మారింది. రజియా ప్రియుడు ఖాదర్‌బాషానే ఆమెపై అనుమానంతో కొండ గుహల్లోకి తీసుకెళ్లి హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. వివరాలు.. మండలంలోని కంచర్లవారిపల్లికి చెందిన ఎస్కే చాంద్‌బాషా, మీరాబీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె రజియా. కనిగిరి మూడో వార్డుకు చెందిన రసూల్బాషాతో సుమారు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నేళ్లుగా దంపతుల మధ్య సంబంధాలు లేవు. పదో తరగతి వరకు చదివిన రజియా కంచర్లవారిపల్లిలోనే ఉంటూ ఐకేపీలో యానిమేటర్‌గా పని చేస్తోంది. పట్టణంలోని ఓ షోరూమ్‌లో కంప్యూటర్ అపరేటర్‌గా పనిచేస్తోంది. ఇలా రోజూ కనిగిరి వస్తూ..పోతోంది. రోజూ ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో రాక పోకలు సాగిస్తూ కనిగిరి బీసీ కాలనీకి చెందిన వివాహితుడైన స్కూల్ బస్సు డ్రైవర్ ఖాదర్‌బాషాతో సన్నిహితం పెంచుకుని చివరకు సహజీవనం చేసేంత వరకూ వెళ్లింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆమె కుటుంబం కనిగిరికి మకాం మార్చింది. పట్టణంలోని కూచిపుడిపల్లిలో నివాసం ఉంటున్నారు. ప్రియుడు ఖాదర్‌బాషా తన ప్రియురాలు రజియాపై అనుమానం పెంచుకున్నాడు. స్కూల్ బస్సుకు, సొంత భార్య, పిల్లల వద్దకు వెళ్లకుండా రజియా చుట్టూ కాపాలాగా తిరుగుతుండే వాడు. మద్యం తాగి వచ్చి ఇంట్లో ఆమెను కొట్టేవాడు. సంపాదించుకున్న కొద్దిపాటి డబ్బులు కూడా లాక్కుని గందరగోళం చేసేవాడు. కొద్ది రోజుల క్రితం రజియా, ఆమె తల్లి మీరాబీలు కనిగిరి పోలీసుస్టేషన్లో ఖాదర్‌బాషాపై ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని పిలిచి తీవ్రంగా మందలించారు. వారి వద్ద తీసుకున్న నగదు తిరిగి ఇవ్వాలని, వారి ఇంటికి వెళ్లవద్దని హెచ్చరించారు. ఐదు నెలలుగా అతడు అలాగే వెళ్లడం లేదు. ఇటీవల రజియాతో మళ్లీ మాటలు కలిపినట్లు సమాచారం. శనివారం యానిమేటర్ విధులకు వెళ్లిన రజియా తిరిగి ఇంటికి రాలేదు. రెండు రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో కూచిపుడి కొండల్లో కాలి బూడిదైనట్లు సమాచారం అందుకుని భోరున విలపిస్తున్నారు. అనుమానంతోనే చంపేశాడా? ప్రియుడు ఖాదర్‌బాషా అనుమానంతోనే ఆమెను నమ్మకంగా తీసుకెళ్లి హత్య చేసి కాల్చాడని తెలుస్తోంది. సుమారు ఐదేళ్ల సహజీవనం చేసిన తర్వాత అందంగా ఉండే రజియాపై అతడు అనుమానం పెంచుకున్నాడు. ఎవరితో మాట్లాడినా సహించే వాడు కాదని, పెళ్లిళ్లకు వెళ్లినా, ఏదైనా ఊరికి వెళ్లినా కాపాలాగా తిరిగే వాడని తెలిసింది. ఈ క్రమంలోనే ఆమె తనను వదిలించుకుని ఇంకొకరి సొంతమవుతుందేమోననే అనుమానంతో చంపేసి ఉంటాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. రజియాను పెళ్లి చేసుకున్న భర్త రసూల్ మూడు నెలల క్రితం చనిపోయాడు. సీఐ ఏమంటున్నారంటే.. కనిగిరి సీఐ టీవీవీ ప్రతాప్‌కుమార్‌ను “సాక్షి’ వివరణ కోరగా కూచిపుడి సమీపంలోని ఆండ్రా కొండల్లో కాలి బూడిదైన శవం మహిళదిగా తెలుస్తోందన్నారు. ఆ శవం కనిగిరిలో అదృశ్యమైన రజియాదా.. లేక వేరొకరిదా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహం 90 శాతం కాలడంతో అనావాళ్లు గుర్తుపట్టలేకపోతున్నామన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ వివరించారు. కూచిపూడి (మర్రిపూడి): మండలంలోని కూచిపూడి ఆండ్ర రామలింగేశ్వరస్వామి కొండ గుహల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గురువారం గుర్తించినట్లు ఎస్ఐ సుబ్బరాజు తెలిపారు. కూచిపూడికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామలింగేశ్వరస్వామికొండ గుహల్లో 90 శాతం కాలిన మహిళ మృతదేహం గుర్తించినట్లు చెప్పారు. మృతురాలు కనిగిరి మండలంలో అదృశ్యమైన ఎస్కే రజియా(32)గా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు సాగుతోందన్నారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. సంఘటన స్థలాన్ని పొదిలి, కనిగిరి సీఐలు మొయిన్, ప్రతాప్ పరిశీలించారు. -
విశాఖలో బైక్ దొంగల ముఠా అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం, ప్రకాశం : విశాఖ జిల్లాలో మోటర్ బైక్‌లు దొంగతనం చేస్తున్న ముఠాను నగర పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా పరచూరు మండలం దేవరాపల్లి గ్రామానికి చెందిన 37 ఏళ్ల వెలగ వీరయ్య చౌదరి ఇంటర్ చదివిన తర్వాత జల్సాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. 2005లో హైదరాబాద్‌లోని ఓ కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ కంప్యూటర్లు దొంగతనం చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. జైలులో బైక్ మెకానిక్‌లైన పాత నేరస్తులతో పరిచయాలు పెంచుకున్న వీరయ్య విడుదలయ్యాక హైదరాబాద్‌లో బైక్ మెకానిక్‌గా పనిచేస్తూనే దొంగతనాలకు పాల్పడేవాడు. అక్కడి నుంచి 2011లో విశాఖ జిల్లాకు వచ్చి నగర శివార్లలో బైక్ మెకానిక్‌గా పనిచేసేవాడు. పలు ప్రాంతాల్లో పార్క్ చేసిన బైక్‌లను మారు తాళాలతో దొంగిలించడం ప్రారంభించాడు. అతనితో పాటు విశాఖకు చెందిన రాజన నాగేశ్వరరావు(32), ఒడిసా వాసి డొక్కినపల్లి బాబీ (37) కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారు. ఒకే కంపెనీకి చెందిన బైకులే లక్ష్యం.. ఒకే కంపెనీకి చెందిన బైకులు మాత్రమే దొంగిలించడం వీరి ప్రత్యేకత. దొంగిలించిన బైక్‌ల స్పేర్‌పార్టుల్ని విడదీసి అమ్ముకొని సొమ్ము చేసుకునేవారు. కమిషనరేట్ పరిధిలో ఏటా బైక్ దొంగతనాల కేసులు పెరుగుతుండటంతో కమిషనర్ ఆర్కే మీనా ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 8న స్టీల్‌ప్లాంట్ పరిధిలో బైక్ పోయిందంటూ ఒక వ్యక్తి ఫిర్యాదు చెయ్యడంతో పహరా కాసిన స్పెషల్ టీమ్ ఈ నెల 11న పరవాడలో ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన పోలీసులకు ఆరేళ్లుగా చేస్తున్న దొంగతనాల గురించి, దొంగిలించిన బైక్‌లను ఏయే ప్రాంతాల్లో దాచి పెట్టారో వివరించడంతో వాటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైక్‌లతో పాటు రూ.90 వేల నగదు, 5 బైక్ ఇంజిన్లు, రూ.5,01,000 విలువచేసే 167 చ.గజాల స్థలం డాక్యుమెంట్లు, 30 బాక్సుల బైక్‌ల విడిభాగాలు, నకిలీ నంబర్ ప్లేట్లు, తాళాలు స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్‌లో గురువారం మీడియా సమావేశంలో కమిషనర్ ఆర్కే మీనా చోరీల వివరాలు వెల్లడించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 2002 నుంచి 2011 మధ్య కాలంలో ఏకంగా 118 నేరాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నట్లు తమ విచారణలో తేలిందని సీపీ వివరించారు. 2013 నుంచి ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో 130 బైక్ చోరీ కేసులు వీరయ్య చౌదరిపై నమోదయ్యాయని సీపీ వివరించారు. ముగ్గురు నిందితులతో పాటు స్పేర్‌పార్టులు కొనుగోలు, అమ్మకాలు చేస్తున్న మరో 14 మందిని అరెస్టు చేసినట్లు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. -
నగదు కవర్ లాక్కెళ్లిన దొంగలు
ప్రకాశం, తాళ్లూరు: అప్పుడే బ్యాంకులో నగదు డ్రా చేసుకుని ఇంటికి వస్తున్న మహిళ నుంచి ఇద్దరు కేటుగాళ్లు కవర్ లాక్కెళ్లారు. అందులో సుమారు రూ.90 వేల నగదు, సెల్‌ఫోన్, బ్యాంకు పాస్‌పుస్తకం ఉన్నాయి. ఈ సంఘటన మండలంలోని తూర్పు గంగవరంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన బొలినేని సుబ్బరత్నం స్థానిక ఆంధ్రా బ్యాంకుకు వెళ్లి రూ.90 వేల నగదు డ్రా చేసుకుని ఆ నగదును చిన్న బ్యాగులో పెట్టుకుని పోస్టాఫీస్ పక్కన ఉన్న నివాసానికి బయల్దేరింది. దాహంగా ఉండటంతో మధ్యలో కొబ్బరి బొండా తాగింది. నివాసం సమీపంలోకి వచ్చి గేటు తీస్తున్న సమయంలో అప్పటి వరకు అక్కడే చెట్టు కింద బైక్‌పై సెల్ చూసుకుంటూ ఉన్న ఇద్దరు యువకులు ఆమె వద్దకు వచ్చారు. గ్రామంలో ఉన్న ఒక ఇంటి పేరు, కులం పేరుతో సుబ్బరత్నమ్మను చిరునామా అడిగారు. ఆ ఇంటి పేరు ఉన్న వారు ఆ కులంలో లేరని చెబుతుండగానే ఆమె చేతిలో ఉన్న చిన్న బ్యాగును లాక్కొని బైక్‌పై వేగంగా బొద్దికూరపాడు వైపు వెళ్లారు. షాక్‌కు గురైన మహిళ తక్షణమే తేరుకుని కేకలు వేయడంతో సమీపంలోని బంధువులు, రైతులు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలు కలియదిరిగారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బొద్దికూరపాడు వైపు పరిశీలిస్తూ వెళ్లారు. అప్పటికే నిందితులు పారిపోయారు. వీధి ప్రారంభం పంచాయతీ కార్యాలయం వద్ద బట్టల దుకాణం యజమాని ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలో పుటేజీని పరిశీలించి అప్పడు ఆ దారిలో వెళ్లిన యువకుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
కార్యాలయం ఉద్యోగులే దొంగలు!
సాక్షి, ఒంగోలు : కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులే ఆ సంస్థలో వస్తువులను కాజేశారు. ఈ సంఘటన స్థానిక ఏనుగుచెట్టు సమీపంలోని డీటీడీసీ కార్యాలయంలో వెలుగు చూసింది. ఒన్‌టౌన్ సీఐ ఎం.భీమానాయక్ కేసు నమోదు చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేసి సోమవారం మీడియా ముందు హాజరు పరిచారు. సీఐ కథనం ప్రకారం.. డీటీడీసీ కార్యాలయం నిర్వాహకుడు జొన్నగలగడ్డ శ్రీనివాసరావు ఇటీవల పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. డెలివరీ చేయాల్సిన పార్శిల్ వస్తువులు చోరీ అయ్యాయనేది ఆ ఫిర్యాదు సారాంశం. చోరీ సొత్తు విలువ రూ.4 లక్షలు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు ముందుగా డీటీడీసీ కార్యాలయంలోని సీసీ పుటేజి ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. అందులో లభించిన సమాచారం ఆధారంగా రాత్రి వేళ కార్యాలయంలో విధుల్లో పనిచేసిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు నిఘా ఉంచి దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న అయినాబత్తిన చిరంజీవి, అతడిచ్చిన సమాచారంతో అదే కార్యాలయంలో పనిచేసే కాకా మణికంటేశ్వరరావులను ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి వివిధ కంపెనీలకు చెందిన 11 మొబైల్ ఫోన్లు, వైర్లెస్ స్పీకర్–1, సన్ గ్లాసెస్–1, బైక్ హారన్–1, రిస్ట్వాచి–1 స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.1.20 లక్షలుగా నిర్థారించారు. ఈ కేసులో మరో నిందితుడు హరిప్రసాద్ అలియాస్ హరి కోసం గాలిస్తున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో ఎస్ఐ నఫీజ్ బాషా, సిబ్బంది కృషి చేశారంటూ వారిని సీఐ భీమానాయక్ అభినందించారు. -
బెట్టింగ్‌రాయుళ్ల ఒత్తిళ్లతో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, గుంటూరు రూరల్ : బెట్టింగ్ రాయుళ్ల ఒత్తిళ్లతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని అంకిరెడ్డిపాలెంలో గురువారం వెలుగులోకి వచ్చింది. నల్లపాడు సీఐ కె.వీరాస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వాకా వెంకటేశ్వరరెడ్డి (40) అలియాస్ పిల్లారెడ్డి మిర్చియార్డులో కమీషన్ కొట్టు ద్వారా తన అన్నతో కలిసి వ్యాపారం చేస్తుండేవాడు. పదేళ్ల కిందట నగరంలోని హౌసింగ్ బోర్డుకు నివాసాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలో బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. ఏడాది క్రితం బెట్టింగ్‌లో మధ్యవర్తిత్వం చేస్తూ పల్నాడు, మిర్చియార్డు తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి నగదును బెట్టింగ్ కోసం వసూలు చేశాడు. ఆ నగదును మార్కాపురానికి చెందిన సానికొమ్ము సుబ్బారెడ్డి అనే వ్యక్తితో బెట్టింగ్ పెట్టి సుమారు రూ.1.75 కోట్లు ముట్టజెప్పాడు. ఈ క్రమంలో బెట్టింగ్‌లలో ఓడిపోయాడు. అనంతరం వెంకటేశ్వరరెడ్డి వద్ద బెట్టింగ్ పెట్టిన వ్యక్తులు బెట్టింగ్‌లో తాము గెలిచినందున నగదు ఇవ్వాలని వెంకటేశ్వర్‌రెడ్డిని ఒత్తిడి చేశారు. వెంకటేశ్వర్‌రెడ్డి సుబ్బారెడ్డిని ఒత్తిడి చేశాడు. సుబ్బారెడ్డి ఎంతకూ తిరిగి నగదు ఇవ్వక పోవడంతో మార్కాపురంలో సుబ్బారెడ్డిపై వెంకటేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆతడిని పిలిపించి సుబ్బారెడ్డి నుంచి సుమారు కోటి రూపాయల వరకూ తిరిగి ఇప్పించారు. మిగిలిన రూ.75 లక్షల్లో వెంకటేశ్వర్‌రెడ్డి సుమారు రూ.20 లక్షలకుపైగా తన ఆస్తులను అమ్ముకుని బెట్టింగ్ రాయుళ్లకు ముట్ట జెప్పాడు. మిగిలిన వ్యక్తులు నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో నగదుకు వడ్డీ కలిపి మరింత పెరిగింది. ఈ క్రమంలో మిగిలిన నగదు ఇవ్వాలని వెంకటేశ్వర్‌రెడ్డి సుబ్బారెడ్డిని కోరగా ఆయన తప్పించుకుని తిరుగుతున్నాడు. వెంకటేశ్వర్‌రెడ్డి వద్ద బెట్టింగ్ పెట్టిన వ్యక్తులు తమకు రావాల్సిన నగదుకు వడ్డీతో కలిపి వెంటనే ఇవ్వాలని ఒత్తిడి చేయటం ప్రారంభించారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం ఉదయం స్థానిక బార్లో మద్యం తీసుకుని అంకిరెడ్డిపాలెం సమీపంలోని పొలాల్లోకి వెళ్లి మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు కారణం బెట్టింగ్ పెట్టిన వ్యక్తులు, సుబ్బారెడ్డి కారణమని సూసైడ్ లెటర్ సైతం రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య కొండమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మద్యానికి బానిసై మగువ కోసం..
సాక్షి, కందుకూరు (ప్రకాశం): వారంతా నిండా పాతికేళ్లు కూడా నిండని యువకులు. ప్రస్తుతం కాలేజీల్లో ఇంటర్, బీటెక్, ఎంబీఏ వంటివి చదువుతున్నారు. కానీ ఏం లాభం మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. ఇంకేముంది.. చదువులను పక్కన పెట్టి తిరగడం మొదలుపెట్టారు. జులాయిగా తిరగడానికి అవసరమైన డబ్బుల కోసం చోరీల బాటపట్టారు. ఎవరో తెలియని వారి ఇంట్లో దొంగతనం చేయడం కంటే సొంత బంధువులు ఇళ్లయితే సులువని భావించారు. బంధువుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు, డబ్బులు కాజేసి జల్సాలు చేశారు. అయితే ఇక్కడ దొంగతనం బాధితులంతా మేనమామలు, పెద్దనాన్న కావడం, దొంగతనం చేసిన వారు వారి మేనళ్లులే కావడం విచిత్రంగా మారింది. కందుకూరు ప్రాంతంలో జరిగిన కేసులను పోలీసులు చేధించగా ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి వివరాలను కందుకూరు డీఎస్పీ రవిచంద్ర బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కందుకూరు పట్టణంలోని సాయినగర్ 7వ లైన్లో చిప్స్ వ్యాపారి మాలెం లక్ష్మీనారాయణ నివాసం ఉంటున్నాడు. లక్ష్మీనారాయణ ఇంట్లో గత నెలలో దొంగతనం జరిగింది. ఇంట్లోని 14 సవర్ల బంగారం చోరీకి గురైంది. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ దొంగతనం చేసింది అతని మేనల్లుడు ప్రణీత్రెడ్డిగా నిర్ధారించాడు. ప్రణీత్‌రెడ్డి ప్రస్తుతం విజయవాడలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వ్యసనాలకు అలవాటు పడ్డ ప్రణీత్‌రెడ్డి మేనమామ ఇంట్లోనే దొంగతనం చేసి డబ్బులు కాజేయాలని పన్నాగం పన్నాడు. ముందుగానే ఆ ఇంటి డూప్లికేట్ తాళం చేయించి ఉంటాడు. గత నెల 22న మేనమాన ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుసుకున్న ప్రణీత్‌రెడ్డి తన వద్ద ఉన్న డూప్లికేట్ తాళం సహాయంతో ఇంట్లోకి వెళ్లాడు. తరువాత బీరువా పగలగొట్టి అందులోని 14 సవర్ల బంగారం తీసుకున్నాడు. అయితే లాకర్లలో మరికొంత బంగారం ఉన్న విషయం తెలియక వదిలేశాడు. తరువాత పోలీసులకు వేలిముద్రలు దొరకకూడదనే ఉద్దేశంతో బీరువాలోని విలువైన వస్తువులన్నీ తగలబెట్టాడు. వీటిలో వేల రూపాయల విలువ చేసే చీరలు కూడా ఉన్నాయి. తరువాత పక్క ఇంట్లో ఉన్న బైక్ తీసుకుని పారిపోయాడు. చోరీ చేసిన బంగారంలో ఓ చైన్‌ను రూ. 10వేలకు విక్రయించి జల్సా చేశాడు. మిగిలిన బంగారం కూడా అమ్మే ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించడంతో ఓ యువకుడు బైక్ తీసుకెళ్లినట్లు సమాచారం ఇచ్చారు. దీని ఆధారంగా పోలీసులు ప్రణీత్‌రెడ్డిని అరెస్టు చేసి, ఆ యువకుడి వద్ద ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురితో కలిసి.. ఉలవపాడులోని రిజర్వు కాలనీవాసి రసూల్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని ఇంట్లో దొంగతనం జరిగి 4 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసులోనూ 9వ తరగతి చదువుతున్న రసూల్ మేనల్లుడే ప్రధాన నిందితుడు. నిందితుడు బీటెక్ చదివే అబ్దుల్ మజీద్, బంగారు పనిచేసే సర్వేపల్లి నాగరాజు, కంచర్ల తేజ అనే యువకులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు. అంతా కలిసి నాలుగు సవర్ల బంగారం కాజేసి జల్సాల కోసం ఖర్చు చేశారు. పెదనాన్న ఇంట్లోనే చోరీ.. ఉలవపాడు మండలం మన్నేటికోటలో జరిగిన మరో దొంగతనం కేసు ఆసక్తికరంగా ఉంది. గ్రామానికి బీఎస్ఎన్ఎల్ లైన్మెన్ తాటికొండ శ్రీనివాసరావు ఇంట్లో దొంగతనం జరిగి 10 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. పోలీసుల విచారణలో శ్రీనివాసుల తమ్ముడి కొడుకే దొంగ అని తేలింది. అతను ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. చెన్నైలో ఎంబీఏ చదువుతున్న పొదిలి అవినాష్ అనే యువకుడితో కలిసి చోరీకి పాల్పడ్డాడు. కాజేసిన బంగారాన్ని అమ్ముకుని జల్సాలు చేశారు. అయితే పోలీసులు చోరీ అయిన బంగారం మొత్తాన్ని రికవరీ చేశారు. సిబ్బందికి ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా మూడు కేసులను చేధించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రవిచంద్ర ప్రత్యేక అభినందనలు తెలిపారు. దొంగతనాలకు నిందితులను అరెస్టు చేయడంతో పాటు, సొత్తు రికవరీ చేశామన్నారు. కృషి చేసిన ఎస్సైలు, కానిస్టేబుల్స్, ఐడీ పార్టీ సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ విజయ్‌కుమార్, పట్టణ, ఉలవపాడు ఎస్సైలు కేకే తిరుపతిరావు, శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మద్యానికి.. మగువకి ఖర్చు.. మూడు కేసుల్లో మొత్తం ఏడుగురు యువకులను అరెస్టు చేశారు. మిగిలిన ఐదుగురు విద్యార్థులే కావడం గమనార్హం. 9,10వ తరగతి చదివే స్కూల్ పిల్లలు ఉండడంతో పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దొంగతనం చేసి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం ఈ వయసులో వారికి ఏమొచ్చిందని పోలీసులు ఆరా తీస్తే వారు చెప్పిన మాటలు విని నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి. చోరీ చేసిన బంగారాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవడం మద్యం తాగడానికి, వ్యభిచార గృహాలకు ఖర్చు చేసినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న విచారణలో తేలింది. మగువ కోసమే ఒక్కొక్కరు రూ 5వేల వరకు ఖర్చు చేశారనే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. నిండా 25 ఏళ్లు కూడా నిండని విద్యార్థులు ఈ వ్యసనాలకు బానిసలు కావడంపై పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య
సాక్షి, ఒంగోలు: తల్లి మందలించిందని మనస్తాపంతో ఓ యువతి మామిడిపాలెం వద్ద ఉన్న ఒకటో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో దూకి ఆత్మహత్యచేసుకుంది. ఈ ఘటనలో స్థానిక విజయనగర్ కాలనీకి చెందిన గుంజా రేణుక(20) మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. యువతి సమ్మర్ స్టోరేజీ ట్యాంకులోకి దూకి పెద్దగా కేకలు వేస్తున్న సమయంలో సుదూరంగా ఉత్తరం దిక్కులో కట్టమీద ఉన్న ఓ వ్యక్తి గమనించి పరుగు పరుగుల వచ్చి చిన్నకర్ర సాయంతో ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ కుదరకపోవడంతో అతను చూస్తుండగానే ఆమె మునిగిపోయింది. దీంతో డయల్ 100కు సమాచారం అందించడంతో తాలూకా పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని యువకున్ని విచారించారు. యువతి మునిగిపోయే ముందు ఒడ్డుమీద ఉంచిన వస్తువులను స్వాధీనం చేసుకొని ఆమె కోసం అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో వారు చెరువు వద్దకు చేరుకొని బోటుసాయంతో చెరువులో గాలించారు. గంట పాటు గాలించిన అనంతరం యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. కుమార్తె మృతిచెందిన విషయం తెలుసుకున్న నాగేంద్రమ్మ, ఆమె కుమారుడు , వారి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. అసలు ఏం జరిగిందంటే..? స్థానిక విజయనగర్ కాలనీకి చెందిన నాగేంద్రమ్మకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఆమె భర్తకు దూరంగా ఉంటూ బిడ్డలతో కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా నాగేంద్రమ్మ కుమార్తె రేణుక వినాయక మండపం వద్ద నృత్య ప్రదర్శన చేసింది. ఈ విషయం తల్లికి తెలియడంతో ఆమె మందలించింది. మంగళవారం ఉదయం నాగేంద్రమ్మ రేణుకు సర్దిచెప్పి టీ పెట్టి ఇచ్చింది. అనంతరం సైకిల్‌కు ఎక్కి అమ్మా వెళ్లొస్తా అంటూ తాను నిత్యం వేరే వాళ్ల ఇళ్లల్లో చేసే పనులకు బయల్దేరింది. అనంతరం సైకిల్‌మీద సమ్మర్ స్టోరేజీ ట్యాంకు వద్దకు వచ్చి సైకిల్‌ను కట్ట వద్ద పార్కు చేసి చున్నీపై తన తల్లి నాగేంద్రమ్మ ఫొటో ఉంచి అనంతరం సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫోటోనే ఆధారంగా.. సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు సమీపంలోనే విజయనగర్ కాలనీ ఉండండం, కట్టమీద రేణుక వదిలిన తల్లి పాస్‌పోర్టు ఫొటో ఉండటంతో ఆమె ఎవరనేది గుర్తించేందుకు సాధ్యపడింది. విజయనగర్ కాలనీకి చెందిన పలువురు ఎవరో యువతి ఆత్మహత్య చేసుకుందని తెలిసి అక్కడకు చేరుకొని నాగేంద్రమ్మ ఫొటో చూసి గుర్తుపట్టి ఆమెను చెరువు కట్టవద్దకు తీసుకువచ్చారు. కూతురు మృతదేహాన్ని చూసి నాగేంద్రమ్మ బోరున విలపించింది. తాలూకా ఎస్సై దేవకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకున్న రేణుక ఘటనను తలుచుకొని అక్కడకు చూసేందుకు వచ్చిన అందరి హృదయాలు కలతకు గురయ్యాయి. -
అయ్యో పాపం.. ఆడపిల్ల
నాగరిక ఎంత అభివృద్ధి చెందినా... సాంకేతికంగా ఎంత పురోగమిస్తున్నా ఈ లోకంలో ఆడ జన్మకు కష్టాలు మాత్రం తప్పడం లేదు. నవ మాసాలు కడుపులో మోసి బిడ్డను కనటానికి తల్లి నరక బాధను అనుభవిస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో.. అప్పుడే ఈ లోకంలోకి అడుగుపెట్టిన శిశువును నడిరోడ్డుపైనే వదిలేసి వెళ్లింది. రోడ్డుపై మాంసం ముద్దలా విగత జీవిగా పడి ఉన్న ఆ శిశువును చూసి స్థానికుల కళ్లు చెమర్చాయి. చందాలు వేసుకుని మరీ ఆ శిశువుకు దహన సంస్కారాలు చేశారు. ఈ హృదయ విదారక ఘటన గురువారం చీరాలలో చోటుచేసుకుంది. సాక్షి, చీరాల రూరల్(ప్రకాశం) : అది చీరాల పట్టణంలోని విఠల్ నగర్ ప్రాంతం. ఊరు పేరు తెలియని నిండు గర్భిణి... ఎవరి చేతిలోనైనా మోసానికి గురైందో లేక ఆ తల్లికి ఏ కష్ట మొచ్చిందో తెలియదు బుధవారం రాత్రి స్థానిక రెడ్డిగారి స్కూలు వద్దకు చేరుకుంది. నా అనేవారు ఎవరూలేని ఆ అభాగ్యురాలు స్కూలు సమీపంలోని రహదారిపై ఏ సమయంలో పురుడు పోసుకుందో ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువును అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఉదయాన్నే మృత శిశువును చూసిన స్థానికులు తీవ్ర కలత చెందారు. పేగు కూడా కత్తిరించని స్థితిలో మాతృమూర్తి కడుపులోని అవయవాలు కూడా రోడ్డుపైనే పడివున్నాయి. అప్పటికే ఆ ఆడ శిశువు అచేతనంగా రోడ్డుపై పడి ఉంది. ఈ దృశ్యన్ని చూసిన స్థానికులు తీవ్ర మనో వేదనకు గురయ్యారు. కొందరు మహిళలు కంటతడి పెట్టారు. తలో కొంత డబ్బులు చందాలు రూపంలో వసూలు చేసుకుని గురువారం ఆ శిశువుకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఆడపిల్ల పుడితే కుటుంబానికి భారం కాకూడదని ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నా మానవత్వాన్ని మరచిన కొందరు కఠిన హృదయులు ఇటువంటి దురాగతాలకు పాల్పడటం శోచనీయం. -
చీరాల ఎమ్మెల్యే పై కేసు నమోదు
-
చీరాల ఎమ్మెల్యే బలరాంపై కేసు నమోదు
సాక్షి, చీరాల(ప్రకాశం) : చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై బుధవారం చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ యడం రవిశంకర్‌ను దుర్భాషలాడి, బెదిరించడంతో ఆయన వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు సూచనల మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. చదవండి : నా జోలికొస్తే.. నీ అంతు చూస్తా..! ఈనెల 15న ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరుగుతున్న జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయమై ఎమ్మెల్యేను యడం రవిశంకర్ ప్రశ్నించగా నన్నే ప్రశ్నిస్తావా... నేనేంటో చూపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో యడం రవిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కోర్టు ఆదేశాలతో కరణం బలరామకృష్ణమూర్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. -
చెరబట్టబోయాడు.. చనిపోయింది!
సాక్షి, ఒంగోలు: మాయ మాటలతో మరదలను లొంగదీసుకోవాలనునకున్న బావ వ్యవహారంతో మనస్తాపానికి గురైన బాధితురాలు బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానిక వేణుగోపాలస్వామి ఆలయం వీధిలోని కుమ్మరిపాలెంలో చోటుచేసుకుంది. 1972లో కర్ణాటకలో తుఫాన్లు వచ్చిన సమయంలో దాదాపు 30 కుటుంబాల వారు ఒంగోలుకు వచ్చి స్థిరపడ్డారు. వారిలో ఒకరైన నాగేంద్రం.. కుమ్మరిపాలెంలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. నాగేంద్రం పబ్లిక్ హెల్త్‌లో చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు. దశాబ్ద కాలం క్రితం కొత్తపట్నం మండలం చింతలకు చెందిన పాటిబండ్ల సుధాకర్‌బాబు అనే వ్యక్తి వీరి ఇంట్లోని ఒక భాగాన్ని అద్దెకు తీసుకున్నాడు. టీ ప్యాకింగ్ చేసుకుంటూ వ్యాపారం నిర్వహించుకుంటుండేవాడు. ఈ క్రమంలో ఇంటి యజమాని కుమార్తె మాధవితో ప్రేమ వ్యవహారం నడిపి కులం వేరు అయినా తాళికట్టాడు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. సుధాకర్‌బాబు స్వతహాగానే ఆస్తిపరుడు. అయితే మాధవి పెద్ద చెల్లెలు అయిన మౌనికపై బావ కన్నుపడింది. ఆమె డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం డీఎస్సీతోపాటు ఇతర పోటీ పరీక్షలకు ఇంటి వద్దనే ఉంటూ ప్రిపేరవుతోంది. ఆమెను మాయమాటలతో లొంగదీసుకోవాలని యత్నించాడు. కుదరక పోవడంతో తనను పెళ్లి చేసుకోవాలంటూ నిత్యం వేధిస్తున్నాడు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో అతనిని ఇంటినుంచి వెళ్ళిపోవాలని హెచ్చరించారు. నీ భార్యను నువ్వు తీసుకువెళ్లాలన్నారు. అయితే ఆ తర్వాత ఇతను ఇంటి సమీపంలో తచ్చాడుతూ మరదలిని తీవ్రంగా హెచ్చరించడమే కాకుండా ఆమెకు వస్తున్న పెళ్ళి సంబంధాలను చెడగొడుతున్నాడు. తననే పెళ్లిచేసుకోవాలని వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన మౌనిక (24) ఇంట్లోనే తెల్లవారు జామున ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మౌనికను కిందకు దించి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే కొద్దిసేపటికే సుధాకర్‌బాబు కూడా అక్కడకు చేరుకున్నాడు. మౌనిక మరణించిందని తెలిసి.. కేసు గీసు అంటే అంతు చూస్తానంటూ హెచ్చరించి వెళ్ళిపోయాడు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య చెల్లెలి మృతికి కారణమైన భర్త పాటిబండ్ల సుధాకర్ బాబుపై స్థానిక వన్‌టౌన్ పోలీసులకు ఆయన భార్య ఫిర్యాదు చేసింది. తన భర్త తన సోదరిపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా ఆమె మృతికి కారణమయ్యాడని తెలిపింది. వన్‌టౌన్ సీఐ భీమానాయక్ కేసు నమోదు చేసి మౌనిక మృతదేహానికి ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తిచేశారు. ఇంత జరిగినా నిందితుడు మాత్రం గత 20 రోజుల నుంచి అడ్రెస్ లేడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటుండడం గమనార్హం. -
తండ్రి వివాహేతర సంబంధం.. కుమార్తె ఆత్మహత్య
ప్రకాశం ,పర్చూరు: మద్యానికి బానిసైన తండ్రి ఎంత చెప్పినా మారక పోవడంతో తీవ్ర మనస్తాపం చెంది మైనర్టీ తీరని కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని నూతలపాడులో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రంగనాథ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మైనర్ కుంచాల పౌలేశ్వరి (15) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పౌలేశ్వరి రెండు రోజుల క్రితం తన తండ్రి కుంచాల సుబ్బారావుతో మాట్లాడింది. ఇక నుంచి మద్యం తాగొద్దని, తనకు పెళ్లి ఈడు వస్తోందని, తనను పట్టించుకోవాలని కోరింది. అయినా సుబ్బారావు మద్యం తాగి ఇంటికి రావడంతో మనస్తాపానికి గురైన బాలిక తాను ఉంటున్న తాత, నాయనమ్మల ఇంట్లోని దులానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సుబ్బారావు దంపతులు 14 ఏళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పౌలేశ్వరి తండ్రి వద్ద ఉంటోంది. చిన్న కుమార్తె తల్లి పాపమ్మ వద్ద దుద్దుకూరులోని ఆమె పుట్టింట్లో ఉంటోంది. తండ్రి బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సుబ్బారావు మద్యానికి బానిస కావడంతో పాటు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో కుమార్తె పలుమార్లు మానుకోమని హెచ్చరించినా మారలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెంది పెద్ద కుమార్తె పౌలేశ్వరి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంగనాథ్ తెలిపారు. -
బైక్ మోజులో పడి.. మేనత్తకే కన్నం
ప్రకాశం ,కందుకూరు: అధునాతన బైక్ మోజులో పడి ఓ యువకుడు సొంత మేనత్త ఇంటికే కన్నం వేశాడు. మేనత్త డబ్బులతో బైక్ అయితే కొన్నాడుగానీ చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన కందుకూరు పట్టణంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ విజయ్‌కుమార్ వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. పాలేటి హైమావతి అనే మహిళ పట్టణంలోని కోటకట్ట వీధిలో నివాసం ఉంటోంది. ఆమె మేనల్లుడు శబరీష్. అతడికి సాయి, అన్వీకుమార్ అనే పేర్లు కూడా ఉన్నాయి. శబరీష్‌కు ఆధునిక బైక్ అంటే మోజు. తాను నచ్చిన బైక్ కొనేందుకు మేనత్త ఏటీఎం కార్డును కాజేశాడు. సొంత మేనల్లుడే కావడంతో ఆమె కార్డు పిన్ నంబర్ శబరీష్ తెలుసుకున్నారు. కార్డు తీసుకుని మిత్రులు గుర్రం సిద్ధార్థ, ఇండ్లా ప్రవీణ్, దేవర్ల సాయికుమార్‌తో కలిసి సింగరాయకొండ వెళ్లారు. అక్కడ ఏటీఎం సాయంతో రూ.48 వేలు డ్రా చేశారు. కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ విజయ్‌కుమార్ అనంతరం నెల్లూరు వెళ్లారు. అక్కడ ద్విచక్ర వాహన షోరూమ్‌కు వెళ్లి కెటిఎం డుకే–2000 బైకు కొన్నాడు. దీనికి రూ.70 వేలు కార్డు ద్వారా స్వైప్ చేశారు. బైక్‌కు అన్ని హంగులు అమర్చేందుకు రూ.1,31,000 నగదు పద్మ పూజిత ఫైనాన్స్ నుంచి తీసుకున్నారు. ఈ క్రమంలో తన ఏటీఎం పోయిన విషయాన్ని హైమావతి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు విచారణ చేయడంతో అసలు విషయం బయట పడింది. మేనత్త ఇంట్లో కార్డు దొంగలించిన శబరీష్‌తో పాటు మిగిలిన ముగ్గురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 వేల నగదుతో పాటు బైకును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరిలో గుర్రం సిద్ధార్థ, ఇండ్లా ప్రవీన్ అనే వారు మైనర్లు కావడంతో ఒంగోలు జువైనల్ కోర్టుకు, మిగిలిన ఇద్దరిని స్థానిక కోర్టులో హాజరు పర్చనున్నట్లు సీఐ వివరించారు. ఆయనతో పాటు పట్టణ ఎస్ఐ కేకే తిరుపతిరావు, ఇతర సిబ్బంది ఉన్నారు. -
వైన్స్‌లో కల్తీ మద్యం
సాక్షి, పొదిలి (ప్రకాశం): స్థానిక ఆర్టీసీ సెంటర్ గేట్ ఎదుట ఉన్న జీఆర్ వైన్స్‌లోని పర్మిట్ రూమ్‌పై ఎన్ఫోర్స్మెంట్ సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్కడ కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం వైన్స్‌పై కూడా దాడులు నిర్వహించారు. స్థానిక ఎక్సైజ్ పోలీసుస్టేషన్లో సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో కల్లీ మద్యం తయారీ, విక్రయాలకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని విక్రయిస్తున్న ఇద్దరితో పాటు, లైసెన్స్‌దారుడు, నిర్వాహకులు మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. దుకాణం సిబ్బందిని విచారించగా దుకాణం లీజుదారుడి సూచనల మేరకే తాము ఈ పని చేస్తున్నట్లు అంగీకరించారన్నారు. లైసెన్స్ మద్యం దుకాణం ద్వారా కల్తీకి పాల్పడుతున్నందున జీఆర్ దుకాణం లైసెన్స్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫారస్ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. లైసెన్స్‌దారుడు వి.అనిల్, లీజుదారుడు జి.రమణారెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు. దుకాణంలో ఉన్న 2604 మద్యం సీసాలు, 216 బీరు బాటిళ్లు, రూ.5003 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుకాణంలో పనిచేస్తున్న షాహిద్, అబ్దుల్ జబ్బార్‌లను అరెస్టు చేశామన్నారు. లైసెన్స్‌దారుడు, లీజుదారుడిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని చౌదరి వివరించారు. వెంటనే సమాచారం ఇవ్వాలి మద్యం దుకాణాలకు సంబంధించి అక్రమాలు జరుగుతుంటే వెంటనే సమాచారం అందించాలని చౌదరి కోరారు. కల్తీ జరుగుతున్నా, అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా, గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నా తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు. మర్రిపూడి మండలం జంగాలపల్లి దుకాణంపై దాడి చేసి లోపాలు గుర్తించి లైసెన్స్ ఆపేందుకు ఉన్నతాధికారులకు సిఫారస్ చేశామని చెప్పారు. వై.పాలెం, గిద్దలూరు, కనిగిరి, చీరాల పరిధిలో నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించి దాడులు నిర్వహించామని స్పష్టం చేశారు. -
కూలీలపై మృత్యు పంజా
సాక్షి, యర్రగొండపాలెం: కొందరు కూలీలు పొట్ట చేతబట్టుకొని రోడ్డుపైకి వచ్చారు. సహచర కూలీలతో కలిసే పని ప్రదేశానికి వెళ్తుండగా మృత్యు పంజా విసిరింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మండలంలోని మెట్టబోడు తండాకు సమీపంలో వారు ప్రయాణిస్తున్న లారీ బోల్తా పడింది. నరసాయపాలెం, అమానిగుడిపాడు గ్రామాలకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందగా సుమారు 30 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నరసాయపాలేనికి చెందిన ఈర్ల వింగయ్య (58), గాయం సుబ్బులు(54) అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు.. మండలంలోని నరసాయపాలెం, అమానిగుడిపాడు గ్రామాలకు చెందిన కొందరు కూలీలు పనుల కోసం తరుచూ సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి తమ స్వగ్రామాలకు లారీలు, ఇతర వాహనాల్లో చేరుతుంటారు. ఆ విధంగా వెళ్తేనే వారికి పూటగడిచేది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాలకు చెందిన కూలీలు వారం రోజులుగా దాదాపు 130 కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా ఆలియా ప్రాంతానికి బత్తాయి కోతల కోసం వెళ్తున్నారు. బత్తాయి కోతలు ముగించుకొని తిరిగి స్వగ్రామాలకు లారీలో వస్తున్నారు. మెట్టబోడు తండా వద్ద హైవేపై ఓ గేదె చనిపోయి ఉంది. దాన్ని లారీ డ్రైవర్ గుర్తించలేక పోయాడు. వేగంగా వస్తున్న లారీ మృతి చెందిన గేదెను బలంగా ఢీకొంది. లారీ అదుపుతప్పి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా 30 మంది కూలీలు గాయపడ్డారు. లారీని అదుపులోకి తెచ్చేందుకు డ్రైవర్ విశ్వప్రయత్నాలు చేశాడు. వర్షం వస్తే కూలీలు తడవకుండా ఏర్పాటు చేసిన పట్ట ఘోర ప్రమాదం జరగకుండా కాపాడిందని పలువురు కూలీలు చెబుతున్నారు. లేకుంటే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ ముక్కంటి ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి క్షతగాత్రులకు సకాలంలో వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన నరసాయపాలేనికి చెందిన ఆరుగురు, అమానిగుడిపాడుకు చెందిన ఐదుగురిని మెరుగయిన వైద్యం కోసం గుంటూరు, నరసరావుపేట వైద్యశాలలకు తరలించారు. మంత్రి ఆదేశాలతో కదిలిన యంత్రాంగం విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్థానిక వైఎస్సార్ సీపీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన మార్కాపురం ఆర్డీఓ ఎం.శేషిరెడ్డి, తహసీల్దార్ కె.నెహ్రూబాబు, సీఐ మారుతీకృష్ణ, ఎస్ఐ ముక్కంటిలకు ఫోన్లు చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆర్డీఓ బుధవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అధైర్యపడొద్దని కూలీలకు ఆయన ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ నెహ్రూబాబు క్షతగాత్రులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం తక్షణమే అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తక్షణ సహాయక చర్యలకు రూ.40 వేలు అందజేశారని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కె.కిరణ్‌గౌడ్ తెలిపారు. -
ఆర్టీసీ బస్సు..ఆటో ఢీ
సాక్షి, ప్రకాశం(కనిగిరి) : ఆర్టీసీ బస్సు ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం జరిగింది. పొదిలి డిపోకు చెందిన హైదరాబాద్ సర్వీసు బస్సు కనిగిరి వెళుతోంది. చింతలపాలెంకు చెందిన ఆటో కనిగిరి వైపు వెళుతుండగా రెండు వాహనాలు డిపో సమీపంలో ఢీ కొన్నాయి. దీంతో ఆటో నడుపుతున్న చెంచలరాజ్‌కు, ఆటోలో ప్రయాణిస్తున్న తలారి రాజుకు, ఎస్కే నాసర్‌బీ, ఎస్కే మాబులాకు గాయాలయ్యాయి. వీరిలో ఆటో డ్రైవర్‌కు, నాసర్‌బీ, మాబులాకు తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ఈమేరకు ఎస్సై ఎస్. శివన్నారాయణ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
షాపు మూసి భార్యపై హత్యాయత్నం
సాక్షి, ఒంగోలు : స్థానిక వీఐపీ రోడ్డు ఆదిత్య ప్రధానమంత్రి జన జీవన ఔషధి కేంద్రంలోకి శనివారం సాయంత్రం ఓ వ్యక్తి హడావుడిగా వచ్చాడు. లోపలకు వెళ్లి షట్టర్ బిగించి కత్తితో ఆ షాపులో పనిచేస్తున్న తన భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె పెనుగులాడుతూ బిగ్గరగా కేకలేసింది. స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చారు. షట్టర్ లోపల లాక్ చేసి ఉందని గుర్తించి గడ్డ పలుగుతో బలవంతంగా షట్టర్ పైకి లేపి యువతిని బయటకు తీసుకొచ్చి ఆమెను స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మరో వైపు లోపల ఉన్న యువకుడిని బయటకు రానీయకుండా షట్టర్ మూశారు. ఈ క్రమంలో యువకుడు తన చేతిని కోసుకొని హల్చల్ చేశాడు. అక్కడకు చేరుకున్న రక్షక్ పోలీసులు హుటాహుటిన అతడిని అదుపులోకి తీసుకొని రిమ్స్‌కు తరలించారు. భర్త పెనుగులాడటంతో గొంతు మీద కోయాలనే అతని యత్నం ఫలించక గడ్డం, ఛాతి భాగం, పొట్టపై పలుచోట్ల కత్తిగాట్లు పడ్డాయి. రక్తం పెద్ద మొత్తంలో పోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను గుంటూరు తరలించారు. ఇదీ..కథ క్షతగాత్రురాలి పేరు బుర్రా జ్యోతి. మైనంపాడుకు చెందిన సుబ్రహ్మణ్యంతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. జ్యోతి కుటుంబం ఒంగోలులోని వీఐపీ రోడ్డులో నివాసం ఉంటున్నారు. సుబ్రహ్మణ్యానికి ఎటువంటి ఆదాయం లేకపోవడంతో జ్యోతి తమ ఇంటికి సమీపంలోని జన ఔషధి కేంద్రంలో పనిచేస్తోంది. ఇటీవల దాదాపు లక్ష రూపాయల వరకు సుబ్రహ్మణ్యం పలుచోట్ల అప్పులు చేశాడు. అంతే కాకుండా జ్యోతి సోదరి పేరుతో ఒక మొబైల్‌ను ఈఎంఐలో తీసుకొని వాయిదాలు చెల్లించడం మానేశాడు. కుటుంబంలో వివాదం ప్రారంభమైంది. ఇటీవల చెప్పకుండా వెళ్లిపోయిన సుబ్రహ్మణ్యం శనివారం నేరుగా ఆమె పనిచేసే షాపులోకి వెళ్లి షాపు యజమాని లేని సమయంలో దాడికి పాల్పడ్డాడని బంధువులు పేర్కొంటున్నారు. వీరికి మూడేళ్ల పాప, ఒక ఏడాది బాబు ఉన్నాడు. విషయం తెలుసుకున్న తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్, ఎస్ఐ దేవప్రభాకర్‌లు సంఘటన స్థలానికి, ఆస్పత్రికి చేరుకొని మహిళ బంధువులను విచారించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న సుబ్రహ్మణ్యాన్ని కూడా విచారించారు. -
ఉసురు తీసిన ‘హైటెన్షన్’
సాక్షి, ఒంగోలు : హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈ సంఘటన స్థానిక అంజయ్యరోడ్డులో బుధవారం సాయంత్రం 6గంటల సమయంలో చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అద్దంకి భవానీ సెంటర్ దామావారిపాలెంకు చెందిన షేక్ అఫ్రిది(21) స్థానిక మధు ఫ్లెక్సీ సంస్థలో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. బుధవారం స్థానిక అంజయ్యరోడ్డులోని విజయభారతి కోచింగ్ సెంటర్‌కు చెందిన ఫ్లెక్సీ కట్టేందుకు ఆఫ్రిదితో పాటు స్థానిక కరణం బలరాం కాలనీకి చెందిన షేక్ ఆసిఫ్ కూడా డాబా పైకి ఎక్కారు. అయితే హైటెన్షన్ వైర్లు కేవలం కొద్దిపాటి ఎత్తులోనే ఉండడం, ఫ్లెక్సీకి ఐరన్ ఫ్రేమ్ ఉండడంతో విద్యుత్ ఫ్లెక్సీ ఫ్రేమ్‌కు సోకింది. దీంతో హై టెన్షన్ విద్యుత్ కావడంతో దానిని బలంగా పట్టుకున్న ఆఫ్రిది దానిని పట్టుకున్నట్లుగానే కుప్పకూలిపోయి మృతి చెందగా , రెండో వ్యక్తి ఆసిఫ్ మాత్రం స్వల్పగాయాలతో బతికి బయటపడ్డాడు. పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు సంఘటన జరగగానే ఆఫ్రిది, ఆసిఫ్ ఇరువురు నుంచి వెలువడిన గావుకేకలతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. సమీపంలోని వారు హైటెన్షన్ విద్యుత్ ప్రసారం అవుతుంది పైకి ఎవరు వెళ్లవద్దంటూ కేకలు వేయడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. సమాచారం అందడంతోనే పోలీసులు, అగ్నిమాపక శాఖ, విద్యుత్‌శాఖ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. గాయపడ్డ ఆసిఫ్‌ను కిందకు దించి వైద్యం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. విద్యుత్ ప్రసారాన్ని పూర్తిగా నిలుపుదల చేయించి ఆఫ్రిది మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో అంజయ్యరోడ్డులో పెద్ద ఎత్తున జనం గుమికూడారు. ఆ అనుమతులు ఏమైనట్లు ? వాస్తవానికి ఈ హైటెన్షన్ వైర్లను నగరంలో నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున గతంలో ఆందోళనలు జరిగాయి. అనేక మంది అమాయకులు వీటి కారణంగా బలయ్యారు. బుధవారం జరిగిన సంఘటన ఈ ఏడాదిలో మూడోది కావడం గమనార్హం. ట్రాన్స్‌కో అధికారులు హైటెన్షన్ వైర్ల నుంచి ప్రమాదం జరగకుండా ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రూ.54.32కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ మేరకు ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ ప్రస్తుతం ఉన్న హైటెన్షన్ వైర్లను తొలగించి వాటి స్థానంలో 132 కేవీ డీసీ ఎక్స్ఎల్పీఈ అండర్ గ్రౌండ్ కేబుల్ వైర్లను ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకు న్యూఢిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్/ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్/ ఇతర నిధులను అందించే సంస్థల నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి ఏపీ ట్రాన్స్‌కో నుంచి పరిపాలనా పరమైన అనుమతి కూడా మంజూరైనట్లు ట్రాన్స్‌కో పరిపాలన విభాగం పేర్కొంటూ రూ.54కోట్ల 32 లక్షల 15వేలుకు ఆమోదం తెలిపింది. హైటెన్షన్ కారణంగా ప్రమాదం జరిగిందని తెలియడంతోనే విద్యుత్ ప్రసారాన్ని నిలుపుదల చేయించి హుటాహుటిన చేరుకున్నాం. విజయభారతి కోచింగ్ సెంటర్ ఉన్నం చంద్రరావు నిర్వహిస్తున్నారని, ఆ సంస్థకు చెందిన ఫ్లెక్సీని కడుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. అయితే ఈ ఫ్లెక్సీని ప్రమాదకరమైన ప్రాంతంలో కట్టమని ఎవరు ప్రోత్సహించారనే దానిపై విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముందస్తు చర్యలు తీసుకుని అన్ని డిపార్టుమెంట్లను సమన్వయం చేసుకున్నట్లు తెలిపారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
దారుణం : స్నేహితులతో కలిసి సోదరిపై..
సాక్షి, పామూరు(ప్రకాశం) : తొమ్మిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ల బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన బుధవారం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పామూరు మండలం కోడిగుంపల గ్రామానికి చెందిన 13 సంవత్సరాల బాలిక తమ గ్రామానికి సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈనెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని వాగుకు బహిర్భూమికి వెళ్లింది. ఈ సందర్భంలో బాలికకు అన్న వరసయ్యే అయ్యే యువకుడు జడ సునీల్ మాట్లాడాలంటూ బాలికను సమీపంలోని తెల్లరాయి క్వారీ వద్దకు తీసుకెళ్లాడు. సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయబోగా బాలిక వారించింది. అనంతరం యువకుడు గ్రామానికి చెందిన మరో ఇద్దరు స్నేహితులు కొడవటికంటి బాబు, శేషం భానుప్రసాద్‌లకు ఫోన్ చేసి పిలిపించాడు. ముగ్గురూ ఆమెను బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించడంతో ఆమె ఇంట్లో కూడా విషయం చెప్పలేదు. రోజూ యథావిధిగా పాఠశాలకు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో మరలా 30వ తేదీ మంగళవారం ఉదయం బాలిక స్కూల్‌కు వెళ్తుండగా మార్గంమధ్యలో అటకాయించారు. తమతో రావాలని, లేదంటే విషయం గ్రామంలో చెబుతామని బెదిరించారు. భయపడుతూ వడివడిగా పాఠశాలకు వెళ్లిన బాలికి ఇంటికి తిరిగి వచ్చాక విషయం తల్లితో చెప్పింది. బందువులతో కలిసి తల్లి బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయగా ఎస్సై అంబటి చంద్రశేఖర్ నిందితులు ముగ్గురిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లి కోరింది. నిందితుడు బాలికకు పరిచయస్తుడేనా..? నిందితుల్లో శేషం భానుప్రసాద్‌కు వివాహితుడు ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మిగిలిన ఇద్దరు బేల్దారీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. కాగా జడ సునీల్‌తో బాలిక కొన్ని మాసాలుగా సన్నిహితంగా ఉంటున్నట్టు గ్రామస్తులు, చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఘటనపై సోమ, మంగళవారాల్లో గ్రామంలో రాజీ యత్నాలు జరిగినట్లు, ఘాతుకానికి పాల్పడ్డ వారిలో ఒకరిని వివాహానికి ఒప్పించే యత్నాలు చేయగా అవి బెడిసి కొట్టడంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. -
భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి చంపాడు
సాక్షి, ప్రకాశం : పెద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామం ఎస్సీ పాలెంలో మంగళవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ పాలెంకు చెందిన తంగిరాల యోహాను, శ్రావణి (28) భార్యభర్తలు. మద్యానికి బానిసైన యోహాను నిత్యం భార్యను వేదించేవాడు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున ఇంటికి వచ్చిన యోహాను శ్రావణితో గొడవపడ్డాడు. విచక్షణ కోల్పోయిన యోహాను కరెంటు షాక్ ఇవ్వడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కాగా నిందితుడితో పాటు అతని కుటుంబసబ్యులు పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ దంపతులకు ఒక బాబు(4), పాప(2) ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. -
కన్నా.. కనిపించరా..!
రెండేళ్ల బాలుడు తోటి పిల్లలతో ఆరుబయట ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. అప్పటి వరకు కళ్ల ముందే ఉన్నవాడు కనిపించకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. బిడ్డ జాడ కోసం చుట్టు పక్కలంతా వెదికింది. ఎంతకీ ఆచూకీ తెలియక కన్నీరు మున్నీరవుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదంతా నెల రోజుల కిందటి మాట. అప్పటి నుంచీ కంటి మీద కునుకు లేదు. కుమారుడి కోసం వెదకని చోటు లేదు. ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి చేరతాడని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆ బాలుడి తల్లిదండ్రులు. మూడు రోజుల కిందట కిడ్నాపైన తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన బాలుడు జసిత్ క్షేమంగా ఇంటికి చేరడంతో తమ బిడ్డ కూడా తిరిగొస్తాడని ఆశ చిగురిచింది. దీంతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సాక్షి, దర్శి (ప్రకాశం): దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలోని రెడ్డినగర్‌కు చెందిన మేడగం అశోక్‌రెడ్డి, జ్యోతి దంపతుల కుమారుడు 25 నెలల వయసున్న ఆరూష్‌రెడ్డి. జూన్ 24 తేదీన ఇంటి వద్ద ఆరుబయట ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. దీనిపై ముండ్లమూరు ఎస్ఐ అంకమ్మ కేసు నమోదు చేశారు. దర్శి డీఎస్పీ రాంబాబు, సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. పలు చోట్ల వెదికినా ఫలితం లేదు. దీంతో ప్రతి రోజు ఆరూష్ కోసం తల్లిదండ్రులు తమ బంధువుల గ్రామాలలో చుట్టు పక్కల పట్టణాలలో, తండాలలో, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్, ఇతర పట్టణాలలో వెదుకుతూనే ఉన్నారు. 32 రోజులు అయినా ఫలితం లేక పోవటంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని ముక్కోటి దేవతలను వేడుకున్నారు. తమ వంతుగా ఎస్పీని కలసి విన్నవించుకున్నారు. అదే రోజు డీఎస్పీతో మాట్లాడి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట బాలుడు జసిత్ గురువారం తల్లిదండ్రుల చెంతకు చేరడంతో ఆరూష్‌రెడ్డి తల్లిదండ్రుల్లో కొత్త ఆశలు చిగురించాయి. దీంతో గురువారం ఒంగోలు వచ్చి, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్‌ను కలిసి, తమ బిడ్డ ఆచూకీ గుర్తించాలని విన్నవించుకున్నారు. ఒడిశా వారి పైనే అనుమానం... మొదటగా తల్లిదండ్రులు వెలు బుచ్చిన పలు అనుమానాల ప్రకారం పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఈ సమయంలో దర్శి కేంద్రంగా పలు పరీక్షలు రాయటానికి వచ్చిన ఒడిశాకు చెందిన వారిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదిశగా విచారణ చేస్తే ఫలితం ఉండొచ్చని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలతో దర్యాప్తు జాప్యం.. బాలుడు అదృశ్యమైన సమయంలో ఉన్న పోలీస్ అధికారులు తర్వాత వరస బదిలీలు కావటంతో ఈ కేసు దర్యాప్తు జాప్యమైందని స్థానికులు భావిస్తున్నారు. కిడ్నాప్ సమయంలో ఉన్న ఎస్ఐ అంకమ్మ రావు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో రామక్రిష్ణ వచ్చారు. దర్శి డీఎస్పీ నాగరాజు బదిలీపై వెళ్లి ప్రకాశరావు వచ్చారు. దర్శి సీఐ శ్రీనివాసరావు బదిలీపై వెళ్లిన సీఐ కరుణాకర్‌రావు ఆయన వెళ్లి సీఐ ఎండీ మొయిన్ వచ్చారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. -
తెల్లారేసరికి విగతజీవులుగా..
సాక్షి, దర్శి (ప్రకాశం): పట్టణంలోని అద్దంకి రోడ్డు సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న అన్నపురెడ్డి వెంకటరెడ్డి (70), ఆదెమ్మ (51) దంపతులు ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వెంకటరెడ్డి, ఆదెమ్మ దంపతులు ఆదివారం రాత్రి ఇంటి వెనుక వైపు రేకుల పంచలో పడుకుని నిద్రపోయారు. వారి కుమారుడు నారాయణరెడ్డి ఇంటి ముందు పంచలో పడుకున్నాడు. తెల్లవారి లేచే సరికి వెంకటరెడ్డి, ఆదెమ్మలు అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించారు. కుమారుడు పోలీసులకు సమాచారం అందించారు. వెల్లువెత్తుతున్న అనుమానాలు వెంకటరెడ్డి దంపతులు వెనుక వైపు రేకుల పంచలో పడుకున్నారు. అయితే వారి మృతదేహాలు ఇంట్లో ఉన్నాయి. మంచంపై ఆదెమ్మ మృతదేహం ఉండగా నేలపై వెంకటరెడ్డి మృతదేహం కనిపించింది. బయట రేకుల పంచలో పడుకున్న ప్రాంతంలో రక్తం మరకలు కనిపించాయి. రక్తాన్ని తుడిచిన వస్త్రం ఆ ప్రాంతంలోనే పడి ఉంది. ఆదెమ్మ చేతి మణికట్టు వద్ద మారణాయుధంతో కోసినట్లు కనిపిస్తోంది. వెంకటరెడ్డి తలపై కొట్టిన గాయం, మెడపై, చేతి మణికట్టు వద్ద కోసిన గాట్లు కనిపిస్తున్నాయి. కుమారుడు బయట పడుకుని ఉండగానే నివాసంలోకి వెళ్లి ఎవరు హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెనుక వైపు ఉన్న బీరువా తలుపు తెరిచి ఉంది. దీన్ని బట్టి డబ్బు కోసం బయటే హత్య చేసి మృతదేహాలు లోపలకు తీసుకొచ్చి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వృద్ధులకు హత్యతో ఉపయోగం ఎవరికి ఉంటుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరెడ్డి తలపై గాయాలు ఉండటంతో ఇది హత్యే అన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మృతుడికి ఆదెమ్మ రెండో సంబంధం. వారి కుమారుడే నారాయణరెడ్డి. నారాయణరెడ్డికి వివాహామై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వెంకటరెడ్డి దంపతులు తమ స్వగ్రామం మర్లపాలెం వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మృతుల పేరుపై ఎటువంటి పొలం, ఆస్తులు లేవని స్థానికులు చెప్తున్నారు. వృద్ధ దంపతులు అన్యోన్యంగా ఉంటారని స్థానికులు చెప్తున్నారు. డీఎస్పీ కె.ప్రకాశ్‌రావు, సీఐ మహ్మద్ మొయిన్, ఎస్ఐ ఆంజనేయులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుమారుడు నారాయణరెడ్డి నుంచి పోలీసు అధికారులు పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు నుంచి డాగ్ స్క్యాడ్ వచ్చి ఇంటి చుట్టూ కలియతిరిగింది. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించింది. -
దండుపాళ్యం ముఠా కన్నుపడితే అంతే..
సాక్షి, చీరాల (ప్రకాశం): పగలు లేదు..రాత్రి లేదు.. ఎప్పుడైనా వారి టార్గెట్ ప్రేమ జంటలే. అందులోనూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న వారినే టార్గెట్ చేస్తారు. రాత్రి వేళ్లల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే దంపతులను కూడా వదలరు. చీకట్లో మాటు వేసి అందినంత దోచుకోవడం ఆపై విచక్షణ మరిచి సామూహిక లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. వీలుకాకుంటే చితకబాది జేబులో ఉన్న డబ్బులు, ఒంటిపై ఉన్న నగలు దోచేస్తారు. వీరి అకృత్యాలు దండుపాళ్యం సినిమాలో ఘటనలు తలదన్నేలా ఉంటాయి. గతంలోనూ విచ్చల విడిగా అరాచకాలకు పాల్పడ్డారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పలు రకాలు కేసులు బనాయించి కొందరిని జైలుకు పంపడంతో కొద్ది రోజులుగా మిన్నకున్నారు. మళ్లీ ఈ బ్యాచ్ కొద్ది నెలలుగా తమ వికృత చేష్టలకు పదును పెట్టింది. దండుబాటలో దారి దోపిడీలకు పాల్పడుతోంది. కారంచేడు బ్రిడ్జి సమీపంలో లైంగిక దాడులకు తెరలేపింది. రామాపురం బీచ్‌లో ప్రేమజంటలను టార్గెట్ చేస్తోంది. ఉజిలీపేటకు చెందిన ఈ ముఠా కొద్ది రోజులు వ్యవధిలోనే ఏడు జంటలపై లైంగిక దాడులకు పాల్పడిందంటే నిందులు ఎంతటి దుర్మార్గులో ఆర్థం చేసుకోవచ్చు. దాడులు, ఆపై లైంగిక దాడులు చీరాల విఠల్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేదాలు వచ్చి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన శివారెడ్డితో ఆమెకు పరిచయమైంది. వీరు చీరాల సమీపంలోని కారంచేడు సరిహద్దుల్లోని ఏకాంత ప్రాంతానికి వెళ్లారు. కొద్దికాలంగా అనుసరిస్తున్న ఉజిలిపేటకు చెందిన ముఠా వీరిపై కన్నేసింది. చీకట్లో కాలువ కట్టపైకి వెళ్లిన కొద్ది సేపటికి వారి వెనుకే వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రియుడి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్ దోచుకున్నారు. తనపై కూడా దాడి చేస్తారనే భయంతో అతడు కూడా దూరంగా ఉండిపోయాడు. విషయం బయటకు వస్తే చంపేస్తామని, మీ పరువే పోతుందని ఆమెను భయపెట్టారు. బాధితురాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న ఎస్పీ కూడా కేసును సీరియస్‌గా తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ సమయంలో విస్తుకొల్పే విషయాలు వెల్లడయ్యాయి. కొద్ది రోజుల్లోనే మొత్తం ఏడు జంటలపై దాడులు, లైంగిక దాడులకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం. అందులో విఠల్‌నగర్‌కు చెందిన మహిళ తప్ప మిగిలిన ఆరు జంటల్లో ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందు రాలేదు. పోలీసులు, మరెవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందని, కుటుంబంలో వివాదాలు ఏర్పడి తమ కాపురాలు ఎక్కడ పోతాయనే మౌనం దాల్చారు. ఎక్కువగా వీరు వివాహేతర సంబంధాలు ఉన్నవారు కావడంతో ముందుకు వచ్చి నోరు మెదపకలేక పోతున్నారు. దండుబాటే డేంజర్ దండుబాట రోడ్డులో రెండు ముఠాలు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాయి. చీరాల నుంచి స్వర్ణకు దండుబాట మీదగా రాత్రి 11 గంటల వరకు ద్విచక్ర వాహనాలు వెళ్తుంటాయి. స్వర్ణకు వెళ్లే రోడ్డులో మలుపు వద్ద వాహనాలను వేగం తగ్గిస్తారు. ఇక్కడే మాటు వేసిన ముఠాలు వాహనదారులను చితకబాది నగదు దోచుకుంటున్నాయి. వారం రోజుల క్రితం ఓ మోటార్ సైకిల్ నుడుపుతున్న వ్యక్తిపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్ దోచుకున్నారు. ఈ ఘటనపై ఒన్టౌన్పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దండుబాట నుంచి చీరాల నగర్‌కు వెళ్లే దారిలో సరివితోటలతో పాటు పొలాలు ఉండడంతో వివాహేతర సంబంధం ఉన్న జంటలు ఆ చీకటి ప్రాంతాలకు వెళ్తుంటాయి. అక్కడే మాటు వేసి ఉండే ఈ ముఠాలు నిశితంగా పరిశీలించి వారిపై లైంగిక దాడులతో పాటు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. అరాచాకాలకు అంతే లేదు వాడరేవు సముద్ర తీర ప్రాంతాని పర్యాటకులు, నూతనంగా పెళ్లయిన వారు, కొందమంది ప్రేమికులు జంటలుగా వాడరేవుకు వస్తుంటారు. ఇదే అదునుగా భావించిన కొందరు అగంతకులు పర్యాటకులపై మానవత్వాన్ని మరిచి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తీరంలో జంటగా వెళ్లిన వారిని అటకాయించి వారి వద్ద ఉన్న నగదు, బంగారం, సెల్ఫోన్లు బలవంతంగా లాక్కుంటున్నారు. ప్రతిఘటించిన వారిపై దాడులకు దిగి గాయపరిచిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒకటా..రెండా? వాడరేవు నుంచి రామాపురం తీరానికి వెళ్లే దారిలో ఉన్న తీరానికి ఓ ప్రేమజంట వెళ్లింది. తీరం వెంట ఉండే అటవీ శాఖకు చెందిన సరివి తోపుల వద్ద జంట ఉంది. వెళ్లిన కొద్ది సేపటికే చీరాల ప్రాంతంలోని పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు ఆరుగురు ఆ జంట వద్దకు వెళ్లి తాము పోలీసులమని బెదిరించడంతో పాటు ప్రియుడిని కట్టేసి అతని వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌తో పాటు ప్రియురాలి చెవులకు ఉన్న దుద్దులు దోచుకున్నారు. సొత్తు దోచుకోవడంతో పాటు ఆరుగురూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఊరుకోకుండా మానవ మృగాళ్లుగా మారి ఆమె నగ్న దృశ్యాలను సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఆమె సెల్ నంబర్ తీసుకుని ఆ తర్వాత జంటను వదిలేశారు. ఆ ప్రేమ జంటది వివాహేతర సంబంధం కావడంతో బయటపడితే తమ పరువు పోవడంతో పాటు కాపురాలు దెబ్బతింటాయని మౌనంగా ఉంది. చివరకు ఆమెకు బెదిరింపులు అధికం కావడంతో పోలీసులను ఆశ్రయించింది. తనకు కేసు వద్దని, పోయిన బంగారాన్ని ఇప్పించాలని కోరడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదు. నిందితుల్లో కొందరిపై మాత్రం దోపిడీ కేసు మాత్రమే నమోదు చేశారు. తీరంలో జోరుగా దోపిడీలు జిల్లాలోనే సముద్ర తీర పర్యాటక ప్రాంతంగా పేరుగంచిన చీరాల వాడరేవులో ప్రస్తుతం పర్యాటకులకు అశాంతి, అభద్రత నెలకొంది. అరాచక ముఠాలు ఎప్పుడు లైంగిక దాడులు, దొంగతనాలు చేస్తాయో తెలియక పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చీరాల వాడరేవు తీరానికి విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, వరంగల్ జిల్లాలతో పాటుగా బెంగళూరు, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు వస్తుంటారు. చీరాల వాడరేవు, రామాపురంలో వసతి సౌకర్యాలతో పాటు సముద్రంలో స్నానాలు చేసేందుకు మంచి అనువైన ప్రదేశం కావడంతో నిత్యం పర్యాటకులతో వాడరేవు కళకళలాడుతుంటుంది. పెట్రోలింగ్‌ను వేగవంతం చేశాం దండుబాట నుంచి స్వర్ణ వేళ్లే రోడ్డులో రాత్రి 12 గంటల వరకు పెట్రోలింగ్ చేస్తున్నాం. ఇక్కడ గతంలో దాడులు జరిగాయి. నిందితుల ఆట కట్టించేందుకు త్వరలోనే వెహికల్ చెకింగ్, ప్రత్యేకంగా సిబ్బందితో గస్తీ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందించాలి. వివరాలు అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. - నాగమల్లేశ్వరరావు, ఒన్‌టౌన్ సీఐ, చీరాల -
యువకుడి దారుణ హత్య
సాక్షి, కె.బిట్రగుంట (ప్రకాశం): మతిస్థిమితం లేని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట సమీపంలోని పాలేరు బ్రిడ్జి కింద వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కనిగిరి మండలం లింగారెడ్డిపల్లెకు చెందిన పత్తి ప్రసాద్‌రెడ్డి (38)కి చాలా కాలంగా మతిస్థిమితం సక్రమంగా లేదు. వ్యవసాయం చేసుకుంటున్న తన అన్న వద్దే ఉంటున్నాడు. ప్రసాద్‌రెడ్డికి వివాహం చేసినా భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆదివారం ఒంగోలు ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇలా శవమై ఉండటంతో అతని అన్న, బంధువులు విలపించారు. వాస్తవానికి కనిగిరి నుంచి ఒంగోలుకు బస్సు మార్గం అనుకూలంగా ఉంటుంది. అటువంటిది కనిగిరి నుంచి ఒంగోలు వెళ్లకుండా ఈ మార్గంలోకి ఎందుకు వచ్చాడో.. అది కూడా పాలేరు బ్రిడ్జి కింద ఎలా హత్యకు గురయ్యాడో పోలీసులకు మిస్టరీగా మారింది. సంఘటన స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ పరిశీలించారు. కేసును ఇన్చార్జి ఒంగోలు రూరల్ సీఐ సుబ్బారావు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ కమలాకర్ వివరించారు. -
ఓటీపీ చెప్పాడు.. లక్షలు వదిలించుకున్నాడు
గిద్దలూరు: రియల్ వ్యాపారులకు మధ్యవర్తిగా వ్యవహరించే ఓ వ్యక్తి ఖాతా నుంచి గుర్తు తెలియని వ్యక్తి లక్షా 78వేల రూపాయలు మాయం చేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. మండలంలోని గడికోట గ్రామానికి చెందిన సంకుల కాశీరావు కుమారునికి వ్యాపారం పెట్టించేందుకు నగదు సిద్ధం చేసుకున్నాడు. సుమారు రూ.2.50 లక్షల వరకు నగదును బ్యాంకు ఖాతాలో భద్రపరచుకున్నాడు. కాగా మంగళవారం కాశీరావుకు గుర్తు తెలియన వ్యక్తి ఫోన్ చేసి తాను సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానని.. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అని అడిగాడు. పిల్లలు పెద్దవారయ్యారని.. ఉద్యోగం రాకపోవడంతో వ్యాపారం పెట్టించాలని ప్రయత్నిస్తున్నానని కాశీరావు అతనికి బదులిచ్చాడు. మాటలు కలిపిన గుర్తు తెలియని వ్యక్తి కాశీరావు కుటుంబ వివరాలు తెలుసుకుని బ్యాంకు అకౌంట్ వివరాలు అడిగాడు. దీంతో కాశీరావు తన బ్యాంకు అకౌంట్ నంబర్, ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్‌తో పాటు, సీవీవీ నంబర్ చెప్పేశాడు. అన్నీ తెలుసుకున్న ఫోన్‌చేసిన వ్యక్తి నీ సెల్‌కు మెసేజ్ వస్తుందని.. ఆ నంబర్ చెప్పాలనడంతో వెంటనే చెప్పేశాడు. దీంతో సదరు వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఫ్లిప్ కార్డులో వస్తువులు రూ.12వేలు, రూ.18వేలు చొప్పున ఒక్క రోజే రూ.90 వేలు డ్రా చేశాడు. అయినప్పటికీ తాను మోసపోయానని గుర్తించని కాశీరావు ప్రశాంతంగానే ఉన్నాడు. తిరిగి బుధవారం ఫోన్ చేసి మరోసారి ఓటీపీ చెప్పాలన్నాడు. ఇన్ని పర్యాయాలు ఎందుకు ఫోన్ చేస్తున్నాడోనన్న అనుమానం వచ్చిన కాశీరావు ఓటీపీ చెప్పలేదు. దీంతో కాశీరావు బ్యాంకు ఖాతాలో ఉన్న నగదులో మరో రూ.88 వేలు గుర్తు తెలియని వ్యక్తి తన పేటీఎంలో వేసుకున్నాడు. ఇలా మొత్తం రూ.1.78 లక్షలు కాశీరావు ఖాతాలోంచి మళ్లించాడు. తాను మోసపోయానని గుర్తించిన కాశీరావు బ్యాంకుకు వెళ్లి అకౌంట్‌బుక్‌లో ప్రింటింగ్ వేయించుకోగా నగదు ఖాళీ అయింది. దీంతో ఆయన స్థానిక ఎస్సై సమందర్‌వలిని ఆశ్రయించాడు. కాశీరావు ఫిర్యాదును స్వీకరించిన ఎస్సై కాశిరావు ఖాతాలోని నగదు ఎక్కడెక్కకు వెళ్లిందో గుర్తించి నిందితుడు ఫ్లిప్‌కార్డులో కొనుగోలు చేసిన ఆర్డర్లను క్యాన్సిల్ చేయాలని సంస్థ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. పే టీఎం సంస్థ యాజమాన్యం, బ్యాంకు అధికారులతో మాట్లాడి నగదును బ్లాక్ చేయాల్సిందిగా ఎస్సై కోరారు. ఇలా కాశీరావు నగదు డ్రా కాకుండా అడ్డుకున్నాడు. రెండు లేదా మూడు రోజుల్లో కాశీరావు ఖాతాలోంచి డ్రా అయిన నగదు తిరిగి ఖాతాలోకి వస్తుందని ఎస్సై చెబుతున్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై సూచించారు. ఓటీపీ నంబర్ ఎవరికీ చెప్పవద్దని, అలా చెప్పడం వలన తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. -
రెవెన్యూ అధికారులే చంపేశారు
ఒంగోలు సబర్బన్/నాగులుప్పలపాడు: రెవెన్యూ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం రైతును బలితీసుకున్నాయి. నాగులుప్పలపాడులోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో ఎలుకల మందు తిని వినోదరాయునిపాలెం గ్రామానికి చెందిన రైతు నడిపినేని రత్తయ్య (68) ఆత్మహత్య చేసుకోవడానికి స్థానిక రెవెన్యూ అధికారులే కారణమని అతని కుటుంబ సభ్యులు, కుమారుడు శ్రీనివాసులు ఆరోపించారు. రైతు మృతదేహానికి ఒంగోలు రిమ్స్‌లో బుధవారం పోస్టుమార్టం పూర్తికాగా, అతని కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. నాగులుప్పలపాడు మండలంలోని వినోదరాయునిపాలెం గ్రామానికి చెందిన నడిపినేని రత్తయ్యకు భార్య వరమ్మ, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె ఉన్నారు. కుమారుడు చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గ్రామంలో తమకు ఉమ్మడిగా ఉన్న 4.54 ఎకరాల పొలంలో రత్తయ్య వ్యవసాయం చేస్తున్నాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, వరుస కరువుతో పంటలు చేతికిరాక పెద్ద మొత్తంలో అప్పుల చేయాల్సి వచ్చింది. నాలుగేళ్లుగా వర్షాలు లేక కనపర్తి ఎత్తిపోతల పథకం కింద మాగాణి సాగు నిలిచిపోయింది. గుండ్లకమ్మ ఎడమ కాలువ కింద గత నాలుగేళ్లలో అధికారులు చుక్క నీరు వదల్లేదు. దీంతో భూములు బీళ్లుగా మారాయి. దీంతో అప్పు తీర్చే దారి లేక ఉన్న ఇంటిని తెలిసిన వారి వద్ద రత్తయ్య తాకట్టు పెట్టాడు. అప్పుకు సంబంధించి ప్రతి నెలా వడ్డీలు చెల్లించాలి. ఇప్పటికే అప్పులు రూ.15 లక్షలు దాటడంతో తమకు ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మి అప్పులు తీరుద్దామని అనుకున్నాడు. కానీ, ఆ పొలం ఆన్లైన్లో తన తండ్రి రంగయ్య పేరుతో ఉంది. వెబ్ ల్యాండ్ నమోదులో ఏర్పడిన పొరపాటును సరిదిద్దాలని నాగులుప్పలపాడు రెవెన్యూ అధికారుల చుట్టూ రెండేళ్లుగా రత్తయ్య ప్రదక్షిణలు చేస్తున్నా వారు కనికరించలేదు. అవినీతికి అలవాటుపడిన రెవెన్యూ అధికారులు.. రత్తయ్య నుంచి మామూళ్లు అందలేదన్న కారణంతో అతని పని గురించి పట్టించుకోలేదు. ఒకవైపు అప్పులోళ్ల ఒత్తిళ్లు.. మరోవైపు రెవెన్యూ అధికారుల వేధింపులు వెరసి చివరకు తనువు చాలించడమే పరిష్కారమార్గమని రత్తయ్య భావించాడు. గత సోమవారం రాత్రి పొద్దుపోయాక నాగులుప్పలపాడులోని మండల కార్యాలయాల సముదాయంలో గల గృహనిర్మాణ శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం మంగళవారం ఉదయం వెలుగులోకి రాగా, సీఐ సుబ్బారావు, ఎస్సై సోమశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించగా, బుధవారం పోస్టుమార్టం పూర్తిచేశారు. రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయాలి : రైతు సంఘాల నేతల డిమాండ్ రైతు రత్తయ్య ఆత్మహత్యకు కారణమైన నాగులుప్పలపాడు మండల రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వివిధ రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. స్థానిక రిమ్స్‌లో రత్తయ్య మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల ధనదాహం వల్లే రైతు రత్తయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడని ధ్వజమెత్తారు. ఆన్లైన్ అక్రమాలతో రైతుల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రత్తయ్య కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో రైతు సంఘాల నేతలు చుండూరు రంగారావు, వడ్డె హనుమారెడ్డి, చావల సుధాకర్, వల్లంరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బైరపనేని సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. -
టోల్‌ప్లాజా వద్ద 70 కేజీల గంజాయి పట్టివేత
మార్టూరు: జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద బుధవారం ఉదయం అధికారులు వలపన్ని అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఒక మహిళ సహ 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న ముందస్తు సమాచారం అందుకున్న అధికారులు తమ సిబ్బందితో బుధవారం వేకువజామున బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద నిఘా ఉంచి వాహనాలు తనిఖీ నిర్వహించసాగారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి నెల్లూరు వెళ్లే రెండు ఆర్టీసీ బస్సులను అధికారులు తనిఖీ చేసి అనుమానస్పదంగా ఉన్న 9 మంది ప్రయాణికులను బస్సులో నుంచి కిందకు దింపి పరిశీలించారు. వాసన రాకుండా సీలు వేసిన 23 గంజాయి ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను విచారించగా వారిలో 5 గురు చీమకుర్తి ప్రాంతానికి చెందిన వారిగా ఒక వ్యక్తి, మధురైకి చెందిన వ్యక్తిగానూ మహిళ సహ మిగిలిన ముగ్గురు కందుకూరు ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. వీరు విశాఖ, విజయవాడ వైపు నుంచి గంజాయిని వారివారి ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పట్టుబడిన గంజాయి 70 కేజీలు ఉన్నట్లు బహిరంగ మార్కెట్లో దాని విలువ రూ.5 నుంచి రూ.6 లక్షల ఉండవచ్చని సీఐ తిరుపతయ్య తెలిపారు. అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గిద్దలూరు వాసి చిత్తూరులో ఆత్మహత్య
సాక్షి, గిద్దలూరు: స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న బిజ్జం నాగేశ్వరరెడ్డి (47) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు చిత్తూరు జిల్లాలో ఆదివారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. పట్టణానికి చెందిన నాగేశ్వరరెడ్డి కొన్నేళ్లుగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఔట్ సోర్సింగ్ విధానంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిది నెలలుగా వేతనాలు అందక పోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు అప్పులు చేశాడు. వేతనాలు రాకపోవడంతో పాటు కుటుంబం కోసం చేసిన అప్పులు తీర్చలేక మనోవేదనతో రైలెక్కి కర్ణాటక వెళ్లినట్లు బంధువులు తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖాధికారులు, ఏజెన్సీ నిర్వాహకులకు తమ సమస్యను వివరించినా వారు స్పందించకపోవడంతో చేసేది లేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
అంత్యక్రియల అనంతరం నిలదీస్తే.. ఒప్పుకొన్న భర్త
సాక్షి, యద్దనపూడి: అనారోగ్యంతో చనిపోయిందని భావించిన వివాహత మృతి వ్యవహారం ఆ తర్వాత హత్యగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మండల కేంద్రం యద్దనపూడిలో జరిగింది. స్థానికులు, సీఐ రాంబాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నూతలపాటి లక్ష్మీరాజ్యం (50) అనారోగ్యంతో ఈ నెల 11వ తేదీ గురువారం వేకువ జామున మృతి చెందినట్లు భావించి కుటుంబ సభ్యులు శుక్రవారం అంత్యక్రియలు చేశారు. మృతురాలి కుమార్తె లావణ్య తన తల్లి మరణం సహజంగా జరిగింది కాదని అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో బంధువులు, గ్రామ పెద్దలు మృతురాలి భర్త నూతలపాటి వేణుగోపాలరావును నిలదీశారు. తన భార్యను తానే హత్య చేసినట్లు అతడు నేరం అంగీకరించాడు. మృతురాలి కుమార్తె లావణ్య స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇంకొల్లు సీఐ రాంబాబు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. వికలాంగుడైన వేణుగోపాలరావు ఒక్కడే హత్యకు పాల్పపడి ఉండడని, ఇంకా ఎవరైనా సహకరించి ఉంటారనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. -
లారీనుంచి డ్రమ్ములు నూతన వధూవరులపై పడడంతో..
సాక్షి, మహానంది(కర్నూలు) : వారిద్దరికీ కొత్తగా పెళ్లి అయింది. పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు బంధుమిత్రులతో కలిసి మహానందికి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. నంద్యాల–గిద్దలూరు ఘాట్‌రోడ్డులో లారీపైన ఉన్న డ్రమ్ములు నూతన వధూవరుల బైక్‌పై పడ్డాయి. దీంతో బైక్ నడుపుతున్న శిరిగిరి శ్రీనివాసులు(32) తీవ్రంగా గాయపడి కోలుకోలేక మృతి చెందాడు. అలాగే ఆయన భార్య లక్ష్మీశిరీషకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన శిరిగిరి శ్రీనివాసులు మెడికల్ రెప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన లక్ష్మీశిరీషతో ఈ నెల 16న వివాహం జరిగింది. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు బైక్‌లపై లక్ష్మీశిరీష చెల్లెలు సృజన, మరదలు బిందు, బంధువులు శ్రీను, సుబ్బయ్య, వెంకట్‌లతో కలిసి ఉదయం మహానందికి వచ్చారు. మహానందీశ్వరుడిని దర్శించుకుని మూడు బైక్‌లలో వచ్చిన వీరు బయలు దేశారు. ముందు బైక్‌లో నూతన దంపతులు ఉన్నారు. అయితే పచ్చర్ల దాటిన తర్వాత గిద్దలూరు వైపు నుంచి ట్రైలర్ వాహనం వస్తుండగా.. గాజులపల్లె వైపు నుంచి వెళ్తున్న డీసీఎం లారీ ఢీకొట్టింది. దీంతో డీసీఎం లారీ కింద పడగా అందులో ఉన్న ఆయిల్ డ్రమ్ములు నూతన దంపతులు వెళ్తున్న బైక్‌పై పడ్డాయి. దీంతో వారు ఇద్దరూ తీవ్రగాయాలపాలయ్యారు. శ్రీనివాసులు మోచేయి విరగడంతో పాటు ఛాతీ, ఉదరభాగాన తీవ్రంగా గాయమైంది. వెంటనే లక్ష్మీశిరీష చెల్లెలు సృజన, ఇతరులు గుంటూరువైపు వెళ్తున్న కారును ఆపి గాజులపల్లెకు తీసుకుని వచ్చారు. అక్కడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక శ్రీనివాసులు మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువు లక్ష్మీశిరీషను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. నడుముల దగ్గర తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. -
ఇంటర్ విద్యార్థి దారుణ హత్య
ప్రకాశం ,గిద్దలూరు రూరల్: ఇంటర్ మొదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్ష రాయాల్సి ఉన్న విద్యార్థిని దుండగులు దారుణంగా హత్య చేసి పూడ్చి పెట్టారు. ఈ సంఘటన మండలంలోని కొంగలవీడు సమీపం అంకాలమ్మ గుడికి కూతవేటు దూరంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. కొంగలవీడు ఎస్టీ కాలనీకి చెందిన రోశయ్య కుమారుడు, ఇంటర్ విద్యార్థి రమణయ్య (19)ను మంగళవారం రాత్రి సమయంలో అంకాలమ్మ గుడి నుంచి రాజానగర్ మీదుగా వెళ్లే కొండ రోడ్డు ప్రాంతంలో కొందరు అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. మృతదేహాన్ని అక్కడే పూడ్చి పెట్టి అనంతరం అక్కడ ఉన్న పాత సిమెంట్ రేకులను పైన కప్పి వెళ్లిపోయారు. పూడ్చి పెట్టిన మట్టి కుప్ప వద్ద చిల్లర డబ్బులు పడి ఉన్నాయి. హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలతో పాటు ఈడ్చుకెళ్లిన గుర్తులు ఉన్నాయి. కత్తికి ఉండాల్సిన కర్ర పిడి ముక్కను సైతం అక్కడే వదిలేశారు. రోడ్డుపై ఉన్న రక్తపు మరకలను గమనించిన కొంగలవీడుకు చెందిన పొలం యజమాని వెంకటేశ్వర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వలి సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు మరకల ఆధారంగా పూడ్చి పెట్టిన రమణయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని చూసిన కొంగలవీడు గ్రామస్తులు మృతుడు ఎస్టీ కాలనీకి చెందిన రోశయ్య కుమారుడు రమణయ్యగా గుర్తించారు. అనంతరం మృతుడి తల్లిందడ్రులకు సమాచారం అందించారు. తల, మెడపై బలమైన కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. హత్యకు కారణాలు పోలీసుల విచారణలో బయట పడాల్సి ఉంది. -
పూజారిని మాటల్లోపెట్టి..
ఒంగోలు:ఎంతటి నేరస్తుడైనా ఆలయాలు అనగానే భక్తిశ్రద్ధలు పాటిస్తుంటాడు. అందునా అమ్మవారిని చూడగానే చేతులెత్తి మొక్కుతాడు. కానీ ఓ వ్యక్తి మాత్రం పూర్తిగా భిన్నంగా వ్యవహరించడం ప్రారంభించాడు. అమ్మవారి ఆలయాలను టార్గెట్ చేసి వాటిలో కొలువై ఉండే అమ్మవార్ల మెడల్లో అలంకరించిన బంగారు ఆభరణాలను తస్కరిస్తుండడం ప్రస్తుతం పోలీసులకు సవాల్‌గా మారింది. చోరీ ఇలా: నేరస్తుడు ఎంతో భక్తి ప్రపత్తుడిలా ఉదయం 6 గంటలకే ఆలయాలకు చేరుకుంటాడు. అప్పుడే పూజారి ఆలయం తెరుస్తుండడంతో ఆయన దేవతామూర్తులను అలంకరించడం, ఇతరత్రా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటాడు. వచ్చిన భక్తుడు ఆలయంలో ఉన్నట్లుగానే వ్యవహరిస్తూ పూజారికి కొబ్బరికాయలు తెచ్చేవారు ఎవరైనా ఉన్నారా, పూజా సామగ్రి ఎక్కడ దొరుకుతుంది తదితరాలతో మాటలు ప్రారంభించి అమ్మవారి శక్తి గురించి చర్చలు లేవదీస్తాడు. అచ్చమైన భక్తుడిలా వచ్చిన ఆ వ్యక్తిని చూసిన పూజారి ఆయనకు సమాధానం ఇస్తూనే తన కార్యకలాపాల్లో నిగమ్నమై అతనిపై పెద్దగా దృష్టిసారించరు. ఈ క్రమంలోనే ఆ ఆగంతకుడు అమ్మవారి మెడలో ఉన్న బంగారు గొలుసులను సొంతం చేసుకుంటాడు. పూజారికి ఏమాత్రం అనుమానం రాకుండానే అక్కడ నుంచి జారుకుంటూ ఉండడం ఇతని నైజం. తొలుత ఎలా ఆభరణాలు మాయం అయి ఉంటాయంటూ పోలీసులు ప్రాథమికంగా పరిశీలించినా అనుమానం రాలేదు. కానీ వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ఐడీ పార్టీ పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వారు ప్రత్యేకంగా దృష్టిసారించి సంబంధిత ఆలయాలకు చేరుకొని పూజారులతో మాట్లాడుతూ దొంగ ఎలా ఉంటాడనే దానిపై ఒక స్పష్టతకు వచ్చారు. దాంతో సంబంధిత ఆకారం కలిగిన వ్యక్తిని గుర్తించేందుకు పలు ప్రాంతాలలో పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే అత్యధికం: స్థానిక గోపాలనగరం తిరుపతమ్మ ఆలయంలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం నగరంలోని పలు ఆలయాలతో పాటు జిల్లాలోని అనేక ఆలయాల్లో ఈ నిందితుడు చేతివాటం చూపాడు. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అంశాలను పరిశీలిస్తే స్థానిక గోపాలనగరం, కరణం బలరాం కాలనీ, కమ్మపాలెం, వడ్డెపాలెం, గద్దలగుంట, ఒంగోలు మండలం యరజర్ల, మద్దిపాడు మండలం కొలచనకోట, సంతనూతలపాడు మండలాల్లోని భక్తులు తక్కువుగా ఉండే ఆలయాలపైనే దృష్టిసారిస్తున్నట్లు దీనిని బట్టి స్పష్టం అవుతుంది. ఇటీవలి వరకు నోట్లు ఎరవేసి పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళుతున్నవారి నుంచి లాక్కొని పరారైన దొంగలను చూశాం కానీ, ఏకంగా ఆలయాల్లోని అమ్మవారి మెడల్లోని బంగారు ఆభరణాలనే తస్కరిస్తున్న ఈ దొంగ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. -
నకిలీ బంగారం విక్రయిస్తున్న ఇరువురి అరెస్ట్
ప్రకాశం, పామూరు: స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని తక్కువధరకే ఇస్తామని నమ్మబలికి నకిలీ బంగారం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, నకిలీ బంగారు కాసులు స్వాధీనం చేసుకున్నట్లు కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నకిలీ బంగారం విక్రయాలకు సంబంధించిన కేసు వివరాలను విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరించారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కలగల్లు గ్రామానికి చెందిన సాకే నవీన్‌కుమార్, కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కూడ్లి తాలూకా బట్టనహళ్లి గ్రామానికి చెందిన సాతుపుడి అజ్జప్ప ఇరువురు బంధువులు. నవీన్ కుమార్ అనంతపురంలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతూ క్రమేణా చెడు అలవాట్లకు, జల్సాలకు బానిసై తనకు బంధువైన సాతుపుడి అజ్జప్పతో కలిసి అమాయకులను ఎంచుకుని వారిని మాయమాటలతో మోసంచేసి నగుదు కాజేయసాగాడు. నగదుతీసుకుని నకిలీ బంగారం అమ్ముతూ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామానికి చెందిన కురుమై పెంచలరావు బాడుగ నిమిత్తం ఒక నెలరోజుల కిందట కర్నాటక వెళ్లాడు. ఈ సందర్భంలో పెంచలరావుకు నవీన్‌కుమార్‌తో పరిచయమయింది. పెంచలరావు సెల్‌నంబర్ తీసుకున్న నవీన్‌కుమార్ తరచూ ఫోన్‌చేసేవాడు. ఇటీవల నవీన్‌కుమార్ పెంచలరావుకు ఫోన్‌చేసి తాము పునాదులు తవ్వుతుంటే 5 కేజీల మేలిమి బంగారం దొరికిందని తక్కువధరకే ఇస్తామని కావాలంటే చెప్పమని నమ్మబలికారు. ఈ సందర్భంలో ఒక కేజీ బంగారం రూ. 3 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. 20 రోజుల కిందట నిందితులు నాకే నవీన్‌కుమార్, సాతుపుడి అజ్జప్ప ఇరువురు పామూరుకు వచ్చి పెంచలరావుకు నిజమైన బంగారం 2 కాసులు ఇచ్చి నీకు ఇష్టం వచ్చిన నగల దుకాణంలో పరీక్షచేయించుకోవాలని చెప్పారు. రెండు కాసులను పరీక్షించగా అవి నిజమైన బంగారం కావడంతో పెంచలరావు రూ. 3 లక్షల నగదు ఇచ్చి కేజీ తూకం గల బంగారు వర్ణంలో ఉన్న కాసులను తీసుకోగా వారు వెళ్లిపోయారు. అనంతరం పెంచలరావు మిగతా కాసులను నగల దుకాణంలో పరీక్షింపగా నకిలీవి కావడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు సీఐ ఎ.వి.రమణ అధ్యక్షతన ఎస్సై టి.రాజ్‌కుమార్, సిబ్బంది ముమ్మర గాలింపు చేస్తున్నారు. ఈ సందర్భంలో సోమవారం ఇరువురు నిందితులు నకిలీ బంగారం కాసులతో మరొకరిని మోసంచే సేందుకు సిద్ధమవుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వారిని అరెస్ట్‌చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, నకిలీ బంగారు కాసులు స్వాధీనం చేసుకుని వారిని కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ కండె శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం కేసులో నిందితులను పట్టుకోవడానికి కృషిచేసిన పోలీస్‌సిబ్బంది రమణయ్య, ఇతర సిబ్బందిని అభినందించి ప్రోత్సాహకాలు అందజేశారు. మోసపూరిత మాటలు నమ్మొద్దు ఎవరైనా మోసపూరిత మాటలతో తక్కువధరకే బంగారు నగలు ఇస్తామని, దేవతా మూర్తుల విగ్రహాలు ఇస్తామని, మెరుగుపెడతామని చెప్పే మాటలు నమ్మవద్దన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. -
ఆటో..ద్విచక్రవాహనం ఢీ
ప్రకాశం, యర్రగొండపాలెం టౌన్: వేగంగా వస్తున్న ద్విచక్రవాహనం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొన్న సంఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు ఆటో డ్రైవర్, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తూ గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ సంఘటన యర్రగొండపాలెం మండలంలోని మార్కాపురం రోడ్లో అన్నకుంట సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం యర్రగొండపాలెం పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న పి.మల్లారెడ్డి మార్కాపురం నుంచి ద్విచక్ర వాహనంపై యర్రగొండపాలెం వస్తుండగా, బోయలపల్లె గ్రామానికి చెందిన పిన్నిక వెంకటేశ్వర్లు, పిన్నిక శివమ్మ(దంపతులు) ఆవులమంద నర్సమ్మ, నక్కా కోటేశ్వరరావులు యర్రగొండపాలెం నుంచి యల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ శ్రీను ఆటోలో బోయలపల్లెకు వెళుతున్నారు. మార్గం మధ్యలోని అన్నకుంట సమీపంలో యర్రగొండపాలెం వైపు వేగంగా వస్తున్న హోంగార్డు మల్లారెడ్డి ద్విచక్ర వాహనం బోయలపల్లె వైపు వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న మల్లారెడ్డి, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు, ఆటో డ్రైవర్ శ్రీనులు గాయపడ్డారు. ప్రమాదంలో హోంగార్డు మల్లారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఇతని కుడికాలి వేళ్లు తెగి పోయాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఆవులమంద నర్సమ్మ(వృద్ధురాలు) ఎడమచేయి గూడ తొలిగిపోయి, తీవ్రంగా గాయపడింది. ఆటోడ్రైవర్ శ్రీను కుడికాలు విరిగి, తీవ్రంగా గాయపడ్డాడు. పిన్నిక వెంకటేశ్వర్లుకు తలకు, రెండు మోకాళ్లకు, ఎడమ చేయి మణికట్టుకు గాయాలయ్యాయి. పిన్నిక శివమ్మకు కుడి మోకాలు, ఎడమకాలు పాదానికి గాయాలయ్యాయి. నక్కా కోటేశ్వరరావుకు మోకా ళ్లకు, తలకు స్వల్పగాయాలయ్యాయి. సమీపంలోని కొందరు గాయపడిన వారిని ఆటోలో స్థానిక ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన హోంగార్డు మల్లారెడ్డి, ఆటో డ్రైవ ర్ శ్రీనులను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట వైద్యశాలకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఆవులమంద నర్సమ్మను వినుకొండ వైద్యశాలకు తరలించారు. పిన్నిక వెంకటేశ్వర్లు, శివమ్మలు స్థానిక వైద్యశాలలో చికిత్స పొందుతుండగా, స్వల్పంగా గాయపడిన కోటేశ్వరరావు ప్రాథమిక చికిత్స అనంతరం స్వగ్రామం బోయలపల్లెకు వెళ్లాడు. ఎస్సై ఎం.దేవకుమార్ ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. -
ఐదు సవర్ల బంగారం చోరీ
ప్రకాశం,కనిగిరి: పట్టణంలోని 8వ వార్డు బాదుల్లా వారి వీధిలో విశ్రాంత ఉద్యోగి ఎస్కే ఖాజామొహిద్దీన్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. బంధువుల కథనం ప్రకారం.. విశ్రాంత వర్క్ ఇన్స్పెక్టర్ ఖాజామొహిద్దీన్ సుమారు 3 నెలల క్రితం (జమాత్‌కు) బయటకు వెళ్లాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉద్యోగ రీత్యా హైదరాబాద్, వైజాగ్‌లో ఉంటున్నారు. ఆయన భార్య ఖాజాబీ మాత్రమే ఇంట్లో ఉంటోంది. 15 రోజుల క్రితం ఖాజాబీ కూడా చిన్న కుమారుడు వద్దకు (హైదరాబాద్) వెళ్లింది. ఆమె చెల్లెలు అప్పుడప్పుడూ వచ్చి ఇంట్లోని చెట్లకు నీరు పోస్తుంటోంది. ఈ క్రమంలో సోమవారం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి డోర్లు తెరిచి ఉన్నాయి. వెంటనే బంధువులు, ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చారు. దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు ఇంటి బయట తాళం పగులగొట్టి ప్రధాన గేటు తాళం తీసుకుని లోపలికి ప్రవేశించారు. ఇంట్లో బీరువా తాళం, లాకర్ పగులకొట్టి అందులోని చిన్న పిల్లల పట్టీలు, కాడలు, పెద్ద పట్టీలు మొత్తం సుమారు 10 జతల వెండి వస్తులు (సుమారు ఒకటిన్నర కేజీ), చిన్న పిల్లల ఉంగరాలు 12, చెవి కమ్మలు, చిన్న చైను వగైరా వస్తువులు 5 సవర్ల బంగారు అభరణాలు అపహరించుకెళ్లారు. పక్కనే ఉన్న సెల్ఫ్‌లు తెరిచి అందులోని చీరలు ఇతర దుస్తులు అపహరించుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. సీఐ జి. సంగమేశ్వరరావు తన సిబ్బందిలో సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బంధువులు, బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఒంగోలు నుంచి క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించింది. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ప్రకాశం, చీరాల రూరల్: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం స్థానిక కారంచేడు రోడ్డులోని లారీ యూనియన్ కార్యాలయం ఎదుట చిల్లచెట్ల మధ్య ఉన్న కాలువలో వెలుగు చూసింది. మృతుని జేబులో దొరికిన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు గుంటూరు జిల్లా లక్కరాజు గార్లపాడుకు చెందిన కట్టవరపు వీరాంజనేయులుగా గుర్తించినట్లు టూటౌన్ ఎస్ఐ కోటయ్య తెలిపారు. సుమారు 35 నుంచి 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం కారంచేడు రోడ్డులోని లారీ యూనియన్ కార్యాలయానికి ఎదురుగా చిల్లచెట్ల మధ్య కాలువలో పడి ఉందనే సమాచారంతో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు ఎస్ఐ చెప్పారు. మృతుని జేబులో ఆధార్ కార్డు దొరికిందని, దాని ఆధారంగా మృతుడు గుంటూరు జిల్లా లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన కట్టవరపు వీరాంజనేయులుగా గుర్తించినట్లు చెప్పారు. వీరాంజనేయులు మూడు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని, మృతదేహం కుళ్లి దుర్వాసన వస్తున్నట్లు తెలిపారు. మృతదేహానికి సమీపంలో హెచ్డీ మద్యం సీసాతో పాటు పురుగుమందు సీసాను గుర్తించినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీఆర్వో జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. -
బైకును ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
ప్రకాశం , హనుమాన్ జంక్షన్ కుంట (పెద్దారవీడు): బైకుపై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని తోకపల్లె పంచాయతీ హనుమాన్‌జంక్షన్ కుంట సిద్దార్థ హైస్కూల్ ఎదుట శనివారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..హనుమాన్‌జంక్షన్ కుంట నుంచి పొలిశెట్టి వెంకటేష్ తన బంధువైన శివకుమార్‌తో కలిసి ఎర్రగొండపాలేనికి మోటార్ సైకిల్‌పై వెళ్తున్నారు. తోకపల్లె పంచాయతీ హనుమాన్‌జంక్షన్ కుంట సిద్దార్థ హైస్కూల్ ఎదుట ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న వెంకటేష్‌కు (18) బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కుర్చొన్న శివకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు. రోడ్డు పక్కనే డీప్‌బోరు వేస్తుండగా దుమ్ము గాలికి పైకి లేవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదం జరిగింది. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. వెంకటేష్ స్నేహితుడు శివకుమార్ విజయవాడ నుంచి ఎర్రగొండపాలెం వస్తున్నాడు. కుంట వద్ద దిగాలని చెప్పడంతో శివకుమార్ అక్కడ దిగాడు. ఇద్దరూ కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ రాజ్‌కుమార్ తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు, బంధవులు కన్నీరుమున్నీరయ్యారు. -
పెళ్లయిన సంవత్సరం వ్యవధిలోనే..
గుంటూరు, చిలకలూరిపేట రూరల్: వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారిద్దరి మనసులు విద్యార్థి దశలోనే కలిశాయి. వయసుతో పాటు వారి మధ్య బంధం కూడా పెరిగింది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయాన్ని పెద్దలకు చెప్పగా యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. యువకుడి తరఫున పెద్దలు యువతి తల్లిదండ్రులకు నచ్చజెప్పి అంగీకరింపజేశారు. ఎట్టకేలకు అందరి అంగీకారంతో ప్రేమికులు భార్యాభర్తలయ్యారు. వివాహ బంధం ఏడాది పూర్తికాకుండానే ఆమె మృతిచెందింది. ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతుంటే తమ కుమార్తెను అత్తింటివారే వేధించి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక మృతదేహం, మృతురాలి తల్లిని వివరాలు అడిగితెలుసుకుంటున్న తహసీల్దార్, ఎస్ఐ మృతురాలి తల్లి రోజారమణి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మృతురాలి తల్లి కథనం ప్రకారం.. ప్రియాంక (23) ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన నవీన్‌ను ప్రేమించింది. తొలుత తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా ఆ తర్వాత కూతురి ప్రేమను అంగీకరించి పెళ్లి చేశారు. నవీన్ మార్టూరులో గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాడు. కొద్ది మాసాల నుంచి నవీన్, ప్రియాంకల మధ్య ఆర్థిక వివాదాలు నడుస్తున్నాయి. గుంటూరు వెళ్లి తల్లిదండ్రుల నుంచి మరికొంత నగదు తీసుకు రావాలని నవీన్ తన భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. పెళ్లయిన సంవత్సరం వ్యవధిలోనే పలు విడతలు డబ్బులు సర్దుబాటు చేశాం. ఈ నేపథ్యంలో గురువారం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో ప్రియాంకకు తల్లి ఫోన్ చేస్తే స్పందించలేదు. అనుమానం వచ్చి మార్టూరు రాగా ప్రియాంక సీలింగ్‌కు ఉరేసుకుని తల్లికి కనపించింది. చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందింది. తమ కుమార్తెను భర్త నవీన్, అత్త, మామ హింసించి, వేధించి హత్య చేశారని ప్రియాంక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
కొంపముంచిన ఫ్లెక్సీ!
ప్రకాశం , నాగులుప్పలపాడు: పొట్ట చేతబట్టుకొని వాహనాల్లో మైళ్లకొద్దీ ప్రయాణం చేసి కూలీనాలి చేసుకొనే ఆ పేదల బతుకులు క్షణాల్లో తెల్లారాయి. ఫ్లెక్సీ రూపంలో మృత్యువు కబళించింది. ఓ ఫ్లెక్సీ అడ్డుగా ఉండటంతో దారి కనిపించక కూలీల ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. మండలంలోని అమ్మనబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఎస్టీ కాలనీ నుంచి కొందరు కూలీలు పోతవరంలోని రైతుకు మిరప కాయలు కోసేందుకు స్వగ్రామం నుంచే నేరుగా ఆటో మాట్లాడుకొని రోజూ వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఆటోలో డ్రైవర్‌తో పాటు 12 మంది మహిళా కూలీలు మిరపకాయల కోతకు వెళ్తున్నారు. కూలీలతో ఉన్న ఆటో పోతవరం సమీపంలోని సలివేంద్రం కుంటకు వచ్చే సరికి తిమ్మనపాలెం బైపాస్ నుంచి నిడమానూరు మీదుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఆటో రోడ్డు పక్కనే ఉన్న మైలేజ్ రాయిని ఢీకొని రెండు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పొలంలో పడింది. ఆటోలో ఉన్న ఇండ్ల రమణమ్మ (62) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ పాలపర్తి సుభాషిణమ్మ (60) ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది. రోడ్డు పక్కనే ఉన్న ఫ్లెక్సీ చాటుగా ఉండటంతో అటు వైపుగా వెళ్లే వాహనం కనిపించక ప్రమాదం జరిగిందని లారీ డ్రైవర్ పోలీసులతో చెప్పాడు. ఇటీవల కాలంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు నూతన సంవత్సరం సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ కుంట మీద ఏర్పాటు చేయడంతో నిడమానూరు, పోతవరం గ్రామాల వైపు నుంచి వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ఇటీవల రెండు మోటారు సైకిళ్లు కూడా ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టుకున్నాయి. లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటోలోని కూలీలను స్థానికులు, పోలీసులు రక్షించారు. అనంతరం 108లో రిమ్స్‌కు తరలించారు. పాదర్తి ధనలక్ష్మి, కూచిపూడి కుమారి పరిస్థితి విషమంగా ఉండటంతో వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మిగిలిన తొమ్మిది మందికి రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఒంగోలు రూరల్ సీఐ దుర్గాప్రసాద్, ఎస్ఐ బాజీ నాగేంద్ర ప్రసాద్ పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పరువు తీస్తోందనే కోపంతో కుమార్తెను..
ఆస్పత్రికి వెళ్లాలంటూ కాలేజి బస్సు దిగిన ఓ యువతి ప్రియుడి సూచన మేరకుతల్లిదండ్రులకు తెలియకుండా తిరుపతి వెళ్లిందోరోజు. ఆచూకీ తెలుసుకొని ఇంటికితీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చాక వారి కళ్లుగప్పి ఇంటి నుంచి పరారైంది ఇంకోరోజు.ప్రేమలొద్దు బుద్దిగా చదువుకోమని కన్నవారు, బంధువులు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టిందని, ప్రవర్తన మార్చుకోకుండా కుటుంబ పరువు తీస్తోందనే కోపంతో డిగ్రీ చదువుతున్న కుమార్తెను హతమార్చారు. సోమవారం వేకువజామున తాళ్లూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాళ్లూరు: చెప్పిన మాట పెడచెవిన పెట్టి, ప్రవర్తన మార్చుకోమని చెప్పినా వినకుండా కుటుంబ పరువు తీస్తోందన్న కోపంతో కుమార్తె గొంతు నులిమి చంపాడు ఓ తండ్రి. ప్రకాశం జిల్లాలో సోమవారం ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు తాళ్లూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన కోట వెంకటరెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రెండో కుమార్తె వైష్ణవి (20) జిల్లా కేంద్రం ఒంగోలులోని ఓ ప్రవేట్ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. రోజూ కళాశాలకు చెందిన బస్సులోనే వెళ్లేది. అదే కళాశాలలో చదివే లింగసముద్రం గ్రామానికి చెందిన యువకుడితో వైష్ణవి ప్రేమలో పడింది. గత గురువారం కళాశాల బస్సులో వస్తూ ఆస్పత్రికి వెళ్లాలని తోటివారికి చెప్పి మధ్యలో దిగిన వైష్ణవి ప్రియుడి సూచన మేరకు తిరుపతి చేరుకుంది. తెలుసుకున్న కుటంబ సభ్యులు వెళ్లి తీసుకొచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు కౌల్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఆ మర్నాడే స్నానం చేయడానికి అని చెప్పి స్నానాల గదికి వెళ్లిన వైష్ణవి అక్కడి నుంచి మాయమైంది. మార్కాపురంలో ఉందని తెలుసుకుని మళ్లీ తీసుకొచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా వైష్ణవి పద్దతి మార్చుకోక పోవటం, మంచి చెప్పిన బంధువులపై కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతుండటంతో ఆదివారం రాత్రి తండ్రి, కూతురి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున వైష్ణవికి ఆరోగ్యం బాగా లేదంటూ తల్లిదండ్రులు ఆర్ఎంపీ వైద్యుడ్ని ఇంటికి పిలిపించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ దాచేపల్లి రంగనాథ్, దర్శి సీఐ శ్రీనివాసరావు ఘటనాస్థలాన్ని, మృతదేహాన్ని పరిశీలించారు. యువతి ముఖంపై గాయాలు, మెడపై కమిలినట్టు ఉండటం గమనించారు. గొంతు నులిమి హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వీఆర్ఓ యలమందారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
భర్త కిడ్నాప్..అదుపులో భార్య, వైద్యుడు..
ప్రకాశం , కంభం: కంభంలో సంచలనం రేకెత్తించిన అర్ధవీడు మండలం నాగులవరానికి చెందిన నులక జగన్ కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. జగన్ కిడ్నాప్ వ్యవహారంలో కంభం మండలం ఎల్.కోటకు చెందిన వైద్యుడు, ఓ కొత్త పార్టీ నేత హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్రెడ్డిని అడ్డు తొలగించుకునేందుకు ఆయన భార్య.. ఆ డాక్టర్‌తో కలిసి పథకం ప్రకారం కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. జగన్ జేసీబీలు, ట్రాక్టర్లు, డ్రోజర్లు అద్దెకిస్తూ పిల్లలను చదివించుకునేందుకు స్వగ్రామం నుంచి వచ్చి కంభంలో భార్య రజనితో కలిసి నివాసం ఉంటున్నాడు. కిడ్నాపైన జగన్ భార్యతో ఆ డాక్టర్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముందుగా సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం.. మంగళవారం రాత్రి వైద్యుడి బంధువు జగన్ ఇంటికి వచ్చాడు. ఆయన తాను కర్నూలులో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నానంటూ పరిచయం చేసుకొని డాక్టర్‌కు నీకు మధ్య ఉన్న సమస్యను చర్చల ద్వారా పరిష్కరిస్తానని నమ్మించి తనతో పాటు కారులో బయటకు తీసుకెళ్లాడు. ఈ విషయం సీసీ టీవీ పుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మార్గంమధ్యలో వైద్యుడు కారులో ఎక్కినట్లు తెలిసింది. రావిపాడు రోడ్డు మీదుగా గొట్లగట్టు వైపు వెళ్లే మార్గంలో వెళ్లినట్లు సమాచారం. వైద్యుడు బుధవారం తెల్లవారు జామున తిరిగి జగన్ ఇంటికి వెళ్లి వచ్చినట్లు బయట ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మధ్యాహ్నం వరకు జగన్ కనిపించక పోవడంతో ఆయన తండ్రి నారాయణరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ శ్రీహరి సీసీ టీవీ పుటేజీలు, కాల్‌డేటా ప్రకారం వైద్యుడే కిడ్నాప్‌నకు పథకం రచించాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బుధవారం రాత్రి పోలీసులు వైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందిని తమదైన శైలిలో విచారించగా వైద్యుడు గుంటూరులో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు డాక్టర్‌ను పట్టుకొని పెద్దారవీడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. జగన్ భార్యను కూడా పెద్దారవీడు పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఇద్దరినీ విచారించారు. డాక్టర్ బంధువు, కానిస్టేబుల్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారిస్తున్నట్లు సమాచారం. జగన్‌కు ఇద్దరు కుమరులు ఉన్నారు. కంభం, అర్ధవీడు పరిసర ప్రాంతాల్లో జగన్‌కు సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరుంది. విషయం తెలుసుకున్న అన్ని సామాజిక వర్గాల ప్రజలు అయ్యో పాపం..అంటున్నారు. అనుమానితులను కంభం, పెద్దారవీడు పోలీసుస్టేషన్లలో విచారిస్తున్నారన్న సమాచారం రావడంతో జగన్ బంధువులు, గ్రామస్తులు, మిత్రులు భారీ స్థాయిలో ఆయా పోలీసుస్టేషన్ల వద్దకు చేరుకున్నారు. ప్రత్యేక బలగాల మోహరింపు ఈ నేపథ్యంలో కంభంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించారు. స్థానిక వెంకట రమణ హాస్పిటల్ వద్ద, వైజంక్షన్, కందులాపురం సెంటర్, పోలీసుస్టేషన్ సమీపంలో పోలీసులు మోహరించారు. జగన్ బంధువులు కోపంతో ఎటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడకుండా పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేశారు. -
బెట్టింగ్ పేరుతో భారీ మోసం
ఒంగోలు: బెట్టింగ్ పేరుతో ఓ విద్యార్థిని భయపెట్టి అతని నుంచి రూ.30 లక్షల సొత్తును చోరీ చేసిన యేమిరెడ్డి నరేంద్రరెడ్డిని అరెస్టు చేసినట్లు ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు తెలిపారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి వివరాలను ఆయన వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. బాధిత బీటెక్ విద్యార్థికి నరేంద్రరెడ్డి పరిచయం అయ్యాడు. క్రికెట్, ప్రోకబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్ గేమ్స్ వంటి ఆడటం ద్వారా డబ్బులు బాగా వస్తున్నాయని, నీవు కూడా బెట్టింగ్ పెడితే బాగా లాభాలు సంపాదించవచ్చంటూ బీటెక్ విద్యార్థిని నమ్మించాడన్నారు. తండ్రి మరణంతో వచ్చిన బీమా సొమ్ము మొత్తం బ్యాంకులో ఉండగా వ్యాపారం పేరుతో ఆ నగదును బీటెక్ విద్యార్థి బయటకు తీసి విడతల వారీగా నరేంద్రరెడ్డికి ఇచ్చాడు. చివరకు 300 గ్రాముల తూకం ఉండే మూడు బంగారు బిస్కెట్లను కూడా హస్తగతం చేసుకోవడంతో పాటు ఇంకా పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరిస్తున్న నేపథ్యంలో చేసేదిలేక బీటెక్ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి 300 గ్రాముల తూకం ఉండే మూడు బంగారు బిస్కెట్లు, రూ.12.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా బెట్టింగ్ ఆడటమే ఒక నేరమైతే, బెట్టింగ్ పేరుతో డబ్బులు తీసుకొని బెట్టింగ్‌లో డబ్బులు పెట్టకుండానే చీట్ చేసిన నేరం మరొకటి వెలుగు చూసింది. డబ్బులతో బెట్టింగ్ ఆడవచ్చంటూ నిందితుడు యేమిరెడ్డి నరేంద్రరెడ్డిని ప్రోత్సహించిన మహేష్ అనే మరొకడు పరారీలో ఉన్నాడు. అతడికి బెట్టింగ్ కోసం రూ.6.30 లక్షలు ఇచ్చినట్లు నరేంద్రరెడ్డి పోలీసులతో చెప్పాడు. మహేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన డీఎస్పీ రాధేష్ మురళి, ఒంగోలు టూటౌన్ సీఐ రాంబాబుతో పాటు సిబ్బంది రఘు తదితరులను ఎస్పీ అభినందించారు. కాలేజీ విద్యార్థులూ..తస్మాత్ జాగ్రత్త! బెట్టింగ్ వైపు దృష్టి సారించి విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్‌ను రూపుమాపేందుకు పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. అందులో భాగంగా అన్ని కాలేజీల్లో బెట్టింగ్ వంటి వాటితో విద్యార్థుల జీవితాలు ఎలా నాశనం అవుతాయనే దానిపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. బెట్టింగ్ కేసుల్లో అరెస్టయిన వారికి భవిష్యత్తులో పాస్‌పోర్టులు మంజూరు కావని, నేడు ప్రైవేటు సెక్యూరిటీ గార్డు పోస్టుకు సైతం ఎంక్వయిరీ తప్పనిసరైనందున ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు సైతం అనర్హులుగా మిగిలిపోతారని ఎస్పీ హెచ్చరించారు. బెట్టింగ్ బ్యాచ్‌ని గుర్తించేందుకు చర్యలు ఇదిలా ఉంటే క్రికెట్ ఆటలు ఆడే విద్యార్థులు, యువకుల వద్దకు వెళ్లి యువతను ప్రలోభ పెట్టే బ్యాచ్‌ను గుర్తించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని ఎస్పీ సత్యఏసుబాబు తెలిపారు. బీటెక్ విద్యార్థిని మోసం చేసిన కేసులో రెండో నిందితుడైన మహేష్‌ను అరెస్టు చేసి విచారిస్తే బెట్టింగ్ యాప్ గురించిన వివరాలు కూడా వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామన్నారు. త్వరగా డబ్బు సంపాదించాలనే కోరిక ఇందుకు కారణంగా ఉంటుందని, బెట్టింగ్ రాయుళ్ల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇవే కాకుండా వన్‌టైం పాస్‌వర్డు పేరుతో ప్రలోభపెట్టి డబ్బును ఆన్లైన్ ద్వారా కాజేసే ఆర్థిక నేరగాళ్లు పెరిగిపోయారని, ఇందులో బాధితులు ఉన్నత విద్యావంతులు కావడం బాధకలిగిస్తోందన్నారు. తాజాగా ఆన్లైన్ ద్వారా రుణం ఇప్పిస్తామంటూ కూడా మోసం చేసే బ్యాచ్‌లు రంగంలోకి వచ్చాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మోసాలు అరికట్టాలంటే ప్రజలు బ్యాంకింగ్‌కు సంబంధించి రహస్య సమాచారాన్ని ఇతరులకు తెలియజేయవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. -
బెట్టింగ్ భూతం
ఒంగోలు: బెట్టింగ్ పేరుతో ఒక ఫిజికల్ డైరెక్టర్ వేసిన పన్నాగానికి బీటెక్ విద్యార్థి చిక్కాడు.రూ.29.45లక్షల సొమ్ము పోగొట్టుకోవడమే కాకుండా మరో రూ.10లక్షలు చెల్లించాలంటూ వస్తున్న ఒత్తిడితో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ ఘటనపై ఎట్టకేలకు బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు గుట్టురట్టు చేసే దిశగా విచారణ సాగిస్తున్నారు. ఒంగోలు సంతపేటకు చెందిన మోహన్‌కుమార్ (పేరు మార్చాం) స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం సీఈసీ చదువుతున్నాడు. ఇతనికి క్రికెట్ అంటే పిచ్చి. ఈ పిచ్చితోనే ఇతను క్రికెట్ పోటీలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఇతనికి మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వాసి, మేదరమెట్ల సెయింట్ ఆర్నాల్డ్స్ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వేమిరెడ్డి నరేంద్రరెడ్డితో పరిచయం అయింది. క్రికెట్ బెట్టింగ్ ద్వారా సులువుగా డబ్బులు సంపాదించవచ్చంటూ నమ్మబలికాడు. దీనికి మోహన్‌కుమార్ అతడి ట్రాప్‌లో పడిపోయాడు. అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే అందుకు మార్గాలు బోలెడు అంటూ వివరించాడు. ఓటమి బారిన పడుతుందని అందరు అనుకున్న జట్టు గెలుస్తుందని పందెం కాస్తామంటే పది నుంచి 20 రెట్లు పందెం ఆన్లైన్లో పెడతారన్నాడు. ఇందుకు కనీసంగా పదివేల నుంచి మొదలవుతుందంటూ వివరించాడు. పోతే పదివేలు, వచ్చిందా లక్ష నుంచి రూ.2 లక్షలు. ఇలా పది పందేలు కాద్దాం. అందులో అయిదు పందేలు కట్టినా పోతే రూ.50వేలు, వస్తే రూ.5 లక్షల నుంచి 10లక్షలు అంటూచెప్పడంతో విద్యార్థి ఓకే అంటూ డబ్బు ముట్టచెప్పడం ప్రారంభించాడు. ఇంకా రూ.10 లక్షలు చెల్లించాలంటూ తీవ్ర ఒత్తిడి: బీటెక్ విద్యార్థి, ఫిర్యాది అయిన మోహన్‌కుమార్‌కు క్రికెట్‌తోపాటు తన కాలేజీలో తోటి స్నేహితులతో రూ.500 నుంచి రూ.1000 వరకు క్రికెట్ బెట్టింగ్‌లు పెట్టేవాడు. ఆ క్రమంలోనే ఆన్లైన్ బెట్టింగ్ అయితే బాగా సంపాదించవచ్చనుకున్నాడు. తండ్రి చలువాడి పుల్లారావు అకాల మరణంతో బీమా సొమ్ము పెద్ద మొత్తంలో వచ్చింది. తల్లి రోల్డ్‌గోల్డ్ బిజినెస్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో బ్యాంకులో ఉన్న డబ్బును కదిలించలేదు. బెట్టింగ్ ఆశలో పడిన పవన్‌కుమార్ తల్లితో తాను ఆన్లైన్ వ్యాపారం చేస్తానని, మంచి లాభాలు వస్తాయంటూ నమ్మించాడు. తల్లి నుంచి చెక్కుల మీద సంతకాలు తీసుకొని డబ్బును మార్చుకున్నాడు. ఆ డబ్బును నరేంద్రరెడ్డికి ఇచ్చాడు. ఇలా బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేసి ఇచ్చాడు. కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు. అంతే కాకుండా బాగా నష్టపోయావు. నా డబ్బులు పెడతానంటూ ఎదురు పెట్టుబడి పేరుతో నరేంద్రరెడ్డి మరో నాటకం ప్రారంభించాడు. ఇందులో కూడా రూ.20లక్షలు పోయాయని, మొత్తం చెల్లించాలంటూ విద్యార్థిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో చేసేది లేక ఇంట్లో ఉన్న 300 గ్రాముల విలువైన బంగారు బిస్కెట్లను అప్పగించాడు. అయినా ఇంకా మరో రూ.10 లక్షలు చెల్లించాలంటూ నరేంద్రరెడ్డి నుంచి ఒత్తిడి అధికమైంది. ఈ క్రమంలోనే ఇంట్లో బంగారం మాయం కావడంతో తల్లి బిడ్డలను నిలదీసింది. తొలుత తెలియదన్నా చివరకు జరిగిన విషయం చెప్పి బోరుమన్నాడు. దీంతో దిగ్భ్రాంతి చెందడం తల్లి వంతైంది. తల్లి సూచనతో తాను ఎలా మోసపోయింది వివరిస్తూ బాధిత విద్యార్థి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు బెట్టింగ్ ఆనవాళ్లు లేవు.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు అసలు బెట్టింగే లేదని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో బెట్టింగ్‌ల విషయంలో ముందుగానే అకౌంట్లో నగదు ఉండాల్సి ఉంటుంది. సంబంధిత వ్యక్తి వివరాలు కూడా అందులో పొందుపరుస్తారు. కానీ ఇటువంటి అంశాలేమీ లేనట్లు గుర్తించారు.అంతే కాకుండా వేమిరెడ్డి నరేంద్రరెడ్డి, బీటెక్ విద్యార్థి మోహన్‌కుమార్ నుంచి వస్తున్న మొత్తం నగదును తన తండ్రికి ఇచ్చినట్లుగా గుర్తించారు. దీంతో అతను బాకీలు తీర్చుకున్నట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు మాత్రం ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి ఉంటే ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా కొంత మొత్తమైనా నగదు తిరిగి వస్తుందని, కానీ ఒక్క రూపాయి కూడా రాలేదని చెబుతున్న దృష్ట్యా అసలు ఆన్లైన్ బెట్టింగ్ జరగలేదని భావిస్తున్నారు. దీంతో నిందితుడు వేమిరెడ్డి నరేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తే పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామని, ఈ మేరకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సీఐ రాంబాబు తెలిపారు. -
అనుమానంతో ఉసురు తీశాడు
ప్రకాశం , మార్కాపురం: అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. తాళికట్టిన భార్యను కిరాతకంగా గొడ్డలితో నరకటంతో అక్కడికక్కడే చనిపోయింది. సంక్రాంతి పండుగ రోజున ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. పోలీసుల కథనం మేరకు.. మార్కాపురంలోని కంభం రోడ్డులో శ్రీనివాస థియేటర్ పక్కన వీధిలో నివాసం ఉంటున్న ఎన్.శరభయ్య తన భార్య పార్వతి (30)ని బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో గొడ్డలితో నరికి పరారయ్యాడు. ఈ సంఘటనలో పార్వతి అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు జ్ఞానేశ్వర్ (10), వైశాలి(8) ఉన్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్‌రెడ్డి, పెద్దారవీడు ఎస్సై ముక్కంటి పరిశీలించి మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పార్వతి పిల్లలు, పార్వతి మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్రీధర్‌రెడ్డి వివరాలు పట్టణంలో నివాసం ఉండే బలభద్రుని రంగయ్య, లక్ష్మీదేవిల మూడో కుమార్తె పార్వతిని కంభం రోడ్డులో నివాసం ఉండే శరభయ్యకు ఇచ్చి పదేళ్ల కింద ట వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. పార్వతి ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుండగా, శరభయ్య ముఠా కూలీగా ఉన్నాడు. ఇటీవల కాలంలో భార్యపై అనుమానం పెంచుకుని తరచుగా వేధించసాగాడు. మద్యానికి అలవాటు పడి భార్యను కొట్టేవాడు. విషయం పార్వతి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు వచ్చి కూతురు, అల్లుడితో మాట్లాడి కలిసి ఉండాలని సర్ది చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన శరభయ్య గొడ్డలితో పార్వతి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలం నుంచి శరభయ్య పరారయ్యాడు. విలపించిన తల్లిదండ్రులు: సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు లక్ష్మీదేవి, రంగయ్యలు కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. పార్వతిని గొడ్డలితో కొట్టడంతో రక్తం ధారలా ప్రవహించింది. పార్వతి పిల్లలు ఇద్దరూ తల్లి మృతదేహాన్ని చూసి రోదించారు. తల్లిని పట్టుకుని లేమ్మా అంటూ పిలవటం అక్కడ ఉన్న వారి కంట కన్నీరు తెప్పించింది. వృద్ధాప్యంలో తమకు కడుపు కోత మిగిల్చి పోయిందని పార్వతి తల్లిదండ్రులు విలపించారు. మృతదేహాన్ని చూసేందుకు ఆ ప్రాంత ప్రజలు తరలివచ్చారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఆ ప్రాంత పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఉండే పార్వతి చని పోవడం చూసి మహిళలు ఆవేదనకు గురయ్యారు. -
ప్రార్థన పేరుతో నయవంచన
ఒంగోలు, మద్దిపాడు: మండలంలోని రాచవారిపాలెం ఎస్సీ కాలనీలో పాస్టర్‌గా పని చేస్తున్న గంగుల జాన్సన్ తనను మోసం చేశాడని ఆదే గ్రామానికి చెందిన ఓ యువతి సోమవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందిన వివరాల ప్రకారం.. రాచవారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు మహిళలు ప్రార్థన కోసం చర్చికి వెళ్తుంటారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పాస్టర్ ఆమెను లోబరుచుకున్నాడు. ఆ తర్వాత ఆమె తల్లిని కూడా మాయమాటలతో లోబరుచుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె వద్ద 4 లక్షల 75 వేల రూపాయలు తీసుకుని సొంతానికి వాడుకున్నాడు. డబ్బు ఇచ్చిన విషయం కేవలం తనకు, పాస్టర్కు, ఆయన భార్యకు మాత్రమే తెలుసని బాధితురాలు చెబుతోంది. గత జూన్ నుంచి తల్లీకుమార్తెను బయట ప్రాంతాల్లో తిప్పుతూ మూడు నెలల నుంచి ఒంగోలులో ఉంచాడు. పాస్టర్కు తన తల్లి ఇచ్చిన విçషయం తెలుసుకున్న యువతి తమ డబ్బు తమకు ఇవ్వాలని, లేకుంటే ప్రార్థన జరిగే సమయంలో పెద్దల మధ్యకు వస్తానని పాస్టర్కు మెసేజ్ పెట్టింది. ఆయన ఫిర్యాది తల్లికి ఫోన్ చేసి ఫిర్యాదిని చంపేస్తే ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉంటుందని, మన మధ్య అడ్డు లేకుండా పోతుందని పాస్టర్ చెప్పాడు. అందులో భాగంగా ఫిర్యాదిని చంపేందుకు ఒంగోలుకు చెందిన వ్యక్తితో ప్లాన్ చేశాడు. తనను చంపేందుకు ప్లాన్ చేసిన వ్యక్తి మాట్లాడిన మాటలు, పాస్టర్ మాటలు రికార్డు చేసి తనకు ప్రాణభయం ఉందని ఆమె పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాలనీ వాసులు మాట్లాడుతూ పూర్తిగా నమ్మిన పాస్టర్ ఈ విధంగా మోసపూరితంగా వ్యవహరించి మహిళలను లోబరచుకుంటున్నాడని ఆరోపించారు. ఆయన ఇప్పటి వరకూ సుమారు ఎనిమిది మంది మహిళలను యువతులను మోసపూరిత మాటలతో లొంగబరుచుకున్నాడని, వారి నుంచి డబ్బు వసూలు చేశాడని ధ్వజమెత్తారు. కాపురం పోతుందన్న భయంతో మహిళలు బయటకు రావడం లేదని పేర్కొన్నారు. సాయంత్రం పాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్టేషన్ బయట కాలనీ వాసులు గుమిగూడి తమకు పాస్టర్‌ను చూపాలని, అతనితో మాట్లాడాలని కొరడంతో ఎస్ఐ గ్రామానికి చెందిన పెద్దమనుషులను లోపలికి పిలిచి వారితో మాట్లాడారు. ఈ క్రమంలో బయట నిలబడిన పలువురు కాలనీ వాసులు తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఇళ్లకు వెళ్లేది లేదని భీíష్మించడంతో ఎస్ఐ వారితో మాట్లాడుతూ ఫాదర్‌ను పూర్తిస్థాయిలో విచారించి అతడిని కోర్టుకు పంపుతామని తెలిపారు. -
డెత్ మిస్టరీ
ఒంగోలు: నగర శివారు పేర్నమిట్ట శ్రీ ప్రతిభ కాలేజీ వద్ద గురువారం అర్ధరాత్రి 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థి సజీవ దహనం మిస్టరీగా మారింది. కాలేజీ నుంచి అదృశ్యమై 24 గంటలు గడవక ముందే కాలేజీకి పట్టుమని పది అడుగుల దూరంలో గేటుకు ఆవలి వైపు మృతి చెంది కనిపించడం కలకలం రేపుతోంది. కొద్దిసేపు మృతదేహాన్ని గుర్తించలేని తల్లి రాత్రికి బంధువులతో కలిసి వచ్చి మృతదేహం తమ కుమారుడిదేనంటూ నిర్థారించింది. వివరాలు.. కనుమర్ల సుబ్బలక్షమ్మ స్వగ్రామం అర్ధవీడు మండలం నాగులవరం. భర్త 12 ఏళ్లు క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. అప్పటి నుంచి పిల్లలను చదివించుకుంటోంది. పెద్ద కుమారుడు రాజారెడ్డిని, చిన్న కుమారుడు రాహుల్‌రెడ్డిని ప్రతిభ విద్యా సంస్థల్లో చేర్పించింది. రాజారెడ్డి జూనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతుండగా చిన్న కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. ప్రోకబడ్డీ వంటి వాటిపై కాలేజీలో చిన్న చిన్న బెట్టింగులు పెట్టుకుంటూ డబ్బులు పోగొట్టుకొని రాజారెడ్డి తన తమ్ముడి నుంచి 50 రూపాయలు తీసుకొని కాలేజీ నుంచి అదృశ్యమయ్యాడు. గతంలో కూడా కాలేజీ నుంచి అదృశ్యమై తర్వాత తిరిగి వచ్చే వాడు. మంటలు రావడంతో ఆందోళన నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రతిభ కాలేజీలో విద్యార్థులు డ్యాన్స్‌లు నేర్చుకుంటున్నారు. అర్ధరాత్రి దాటినా విద్యార్థులు డ్యాన్స్‌లు వేస్తుండటంతో ఇన్చార్జి బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జూనియర్ లెక్చరర్ సుబ్బారెడ్డి ఇక పడుకోండంటూ విద్యార్థులకు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో కాలేజీ ప్రహరీ అవతలి వైపు పొలంలో మంటలు కనిపించాయి. ఏదో తగలబడుతోందని భావించిన విద్యార్థులు, లెక్చరర్లు అక్కడకు పరుగున చేరుకున్నారు. గేటు వేసి ఉండటంతో గేటుకు ఉన్న రంధ్రం నుంచి పరిశీలించారు. బయట ఓ యువకుడు తగలబడుతున్నట్లు గుర్తించారు. గేటు తాళం బలవంతంగా తెరిచి నీటితో విద్యార్థులు మంటలు ఆర్పేశారు. కానీ మృతుడు ఎవరనేది విద్యార్థులు గుర్తించలేకపోయారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించి ఇన్చార్జి బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సుబ్బారెడ్డి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. విచారణపై ప్రత్యేక దృష్టి విషయం తెలియగానే ఎస్పీ సత్యఏసుబాబు పోలీసు అధికారులను పరుగులెత్తించారు. ట్రైనీ ఎస్పీ బిందు మాధవ్, టౌన్ డీఎస్పీ రాథేష్ మురళి, సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు, తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లుతో పాటు డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణులు రంగ ప్రవేశం చేశారు. కాలేజీ ఆవరణ నుంచి విద్యార్థులు పారిపోయేందుకు అవకాశం ఉన్న రెండు ప్రాంతాలను గుర్తించారు. అందులో ఒకటి ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతం. పోలీసు జాగిలం కాలేజీలోని వంటగది తదితరాలను పరిశీలించింది. వేలిముద్రల నిపుణులు ఘటన స్థలంలోని మట్టి నమూనాలు, వెంట్రుకలు సీజ్ చేశారు. అనంతరం కాలేజీ సిబ్బంది, విద్యార్థులను విచారించి కాలేజీ నుంచి గురువారం ఉదయం అదృశ్యమైన రాజారెడ్డి ఆచూకీ కోసం సీసీ టీవీ పుటేజిని పరిశీలించారు. బుధవారం రాత్రి తమ్ముడు నుంచి రూ.50లు తీసుకున్న తర్వాత నుంచి అదృశ్యమైనట్లు నిర్థారణకు వచ్చారు. గురువారం కర్నూల్ రోడ్డులోని అన్నా క్యాంటీన్లో కూడా భోజనం చేసినట్లు నిర్థారించుకున్నారు. రాత్రికి సమతానగర్ వద్ద ఒక పెట్రోలు బంకులో ఒక యువకుడు అరలీటరు పెట్రోలును ఒక థమ్సప్ బాటిల్లో కొట్టించుకున్నట్లు గుర్తించి పెట్రోలు బంకులో సీసీ పుటేజి పరిశీలనలో నిమగ్నమయ్యారు. వ్యక్తమవుతున్న అనుమానాలు రాజారెడ్డి వ్యవహారంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఘటన స్థలిని పరిశీలిస్తే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మంటల ధాటికి పరుగులు పెడతారు. ఎక్కడా పరిగెత్తిన ఆనవాళ్లు లేవు. ఒకచోట మాత్రమే తగలబడినట్లు ఉండటంతో ఎవరైనా చంపి తీసుకొచ్చి కాలేజీ వద్ద పడేశారా..అనే అనుమానం వ్యక్తం అవుతోంది. దానికితోడు కాలేజీ వరకు వచ్చిన విద్యార్థి అక్కడ తగలబెట్టుకోవాల్సిన అవసరం ఏమిటనేది అంతుబట్టడంలేదు. ఇది కాకుండా కాలేజీలో విద్యార్థుల మధ్య ఏదైనా వివాదం చోటుచేసుకొని అందులోకి ప్రైవేటు వ్యక్తులు రంగంలోకి దిగారా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. విద్యార్థులను ఎంత తరచి ప్రశ్నించినా వివాదం వంటి అంశాలు ఎక్కడా వెలుగులోకి రాలేదు. మరో వైపు పేర్నమిట్ట శ్రీచైతన్య కాలేజీ సమీపంలో గురువారం రాత్రి 11 నుంచి 11.30 గంటల సమయంలో ఒక కారు, నాలుగు బైకులపై ఉన్న ఏడెనిమిది మంది వ్యక్తుల మధ్య వివాదం జరిగిందని ప్రచారం జరుగుతోంది. దాని ప్రభావం ఏమైనా ఈ అంశంలో చోటుచేసుకుందా అనే మరో అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గురువారం రాత్రి ముగ్గురు విద్యార్థులతో కలిసి రాజారెడ్డి మొదటి ఆట సినిమాకు వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం వారిలో ఒకరితో కలిసి సెకండ్ షో సినిమాకూ వెళ్లాడు. ఆ తర్వాత బస్టాండ్‌కు వెళ్లి ఇద్దరూ విడిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత అక్కడ నుంచి ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. -
ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యం
టీ.నగర్: చెన్నైలో ఇంజినీరింగ్ చదువుతున్న ఆంధ్రకు చెందిన విద్యార్థిని అదృశ్యమైనట్లు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా కొండపి మండలం చోడవరం గ్రామానికి చెందిన స్వర్ణ వెంకటనరసు అనే రైతు కుమార్తె స్వర్ణ ప్రియాంక చెన్నై తాంబరం భారత్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ (సీఎస్డీ) నాలుగో ఏడాది చదువుతోంది. కళాశాల అనుమతితో ప్రైవేటు గృహాన్ని అద్దెకు తీసుకుని కడపకు చెందిన ఇతర అమ్మాయిలతో కలిసి ఉండేది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం చెన్నై ఎగ్మూరు నుంచి బయల్దేరే సర్కార్ ఎక్స్‌ప్రెస్‌కు వస్తున్నానని.. ఒంగోలు రైల్వే స్టేషన్లో తనను రిసీవ్ చేసుకోమని తల్లిదండ్రులకు ఫోను చేసి తెలిపిందని, అయితే సదరు విద్యార్థిని ఒంగోలులో దిగలేదని, ఆమె సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయగా రింగవుతున్నా లిఫ్ట్ కాలేదని తెలిసింది. ఇదిలా ఉండగా స్వర్ణ ప్రియాంక 20వ తేదీ తన స్నేహితురాళ్లతో కలిసి కడపకు వెళ్తున్నట్టు కొందరికి చెప్పినట్టు తెలిసింది. 22వ తేదీ సాయంత్రం వరకు ఫోన్ రింగవుతూనే ఉండగా తండ్రి వెంకటనరుసు చెన్నై చేరుకుని ద్రావిడదేశం అధ్యక్షుడు కృష్ణారావు తరఫున తాంబరం సేలయూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇలా ఉండగా 22 సాయంత్రం తర్వాత అమ్మాయి సెల్‌ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఉందని, చివరిగా సెల్‌ఫోన్ సిగ్నల్ రాయపురం ప్రాంతంలో వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలో కేసు పరిష్కరిస్తామని తెలిపారు. -
గ్రామీణ దంపతుల వద్ద బంగారం అపహరణ
ప్రకాశం, చీరాల రూరల్: పండుగ రోజుల్లో దుకాణాల వద్ద జనం కిటకిటలాడిపోతుండగా దొంగలు మాత్రం తమ పని తాము ఎంచక్కా చేసుకుపోతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కాచుకుని కూర్చొంటున్న దొంగలు ఎవరెవరు ఏయే ఊర్ల నుంచి వస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు.. ఏవేమి వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.. పథకాలు రచిస్తూ తిరుగుతున్న దొంగలు అందినకాడికి దోచుకెళ్తున్నారు. నూతన వస్త్రాలు, బంగారం, వెండి, పచారీలు సామాన్లు వంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు ముఖ్యంగా పల్లె వాసులు చీరాల పట్టణానికి పది రోజులుగా విపరీతంగా చేరుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన దొంగలు సందట్లో సడేమియాలా తమపని సులువుగా కానిస్తున్నారు. దొంగల బారిన పడిన పల్లె వాసులు బావురుమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి ఘటన పట్టణంలో శనివారం వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం.. చినగంజాం మండలం చింతగుంపల్లె గ్రామానికి చెందిన బెజ్జం ప్రభుదాసు, రాణి దంపతులు బట్టలు, వెండి, బంగారు వస్తువులు కొనుగోలు చేసేందుకు శనివారం మధ్యాహ్నం చీరాల వచ్చారు. ఈ క్రమంలో వారిరువురు మార్కెట్ సెంటర్లో ఆటో దిగి నేరుగా మార్కెట్ సమీపంలోని ఓ జ్యూయలరీ దుకాణంలోకి వెళ్లి పది వేలు విలువ చేసే రెండు జతల కాళ్ల పట్టీలు, జత కమ్మలు కొనుగోలు చేశారు. అనంతరం వారిరువురు కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి ఎంజీసీ మార్కెట్ సెంటర్ వద్ద రోడ్డు పక్కగా నిలిపిన గాజుల బండిపై గాజులు కొనుగోలు చేశారు. డబ్బులు ఇచ్చేందుకు కర్రల సంచీ వైపు చూడగా బ్లేడుతో గుర్తు తెలియని దొంగలు సంచీని కోసి ఉండటం గమనించారు. అలానే సంచీలోని వెండి, బంగారు వస్తువులు కూడా కనిపించకపోవడంతో అపహరణకు గురయ్యాయని గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ ఒన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజీలతో దొంగలను పోలీసులు పట్టుకుని ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి. ఇటువంటి సంఘటనలు నిత్యం పట్టణంలో జరుగుతున్నాయి. పోలీసు స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరగకపోగా పోలీసులు యక్ష ప్రశ్నలు వేసి వేధింపులకు గురిచేస్తారనే భయంతో బాధితులు తమకు కేసులు ఎందుకులే అనుకుని ఉసూరుమంటూ ఇంటిదారిన పట్టే వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. -
భార్యను హతమార్చిన భర్త
ప్రకాశం, సతుకుపాడు (సింగరాయకొండ): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను ఓ భర్త హతమార్చాడు. నల్లగట్ల రెడ్డెమ్మ (48)ను ఆమె భర్త కోటేశ్వరరావు హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి జరుగుమల్లి మండలం సతుకుపాడు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నల్లగట్ల కోటేశ్వరరావుకు ముగ్గురు భార్యలు. రెడ్డెమ్మ అతని రెండో భార్య. కొంతకాలంగా కోటేశ్వరరావు తన రెండో భార్య రెడ్డెమ్మను పట్టించుకోకుండా మూడో భార్యతోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. దీంతో రెడ్డెమ్మ నెల రోజుల క్రితం భర్తతో గొడవపడి దూరంగా ఉంటుంది. ఈ నేథ్యంలో సోమవారం రాత్రి రెడ్డెమ్మ వద్దకు వచ్చిన కోటేశ్వరరావు ఆమెతో మాట్లాడుతూనే కత్తితో పొడిచి చంపేశాడు. అయితే స్థానికుల కథనం మరో విధంగా ఉంది. కోటేశ్వరరావు స్వతహాగా దొంగతనాలకు పాల్పడుతుంటాడని అనేక కేసుల్లో ముద్దాయి అని తెలిపారు. ఇతనికి ఇద్దరు భార్యలు కాగా రెడ్డెమ్మ మొదటి భార్య అని తెలిపారు. ఈమెకు పిల్లలు లేకపోవటంతో ఒక కుర్రాడిని పెంచుకుని వివాహం కూడా చేసింది. అయితే రెడ్డెమ్మ తన అన్న కొడుకుతో చనువుగా ఉండటంతో వారి ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో కోటేశ్వరరావు ఈ హత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. రెడ్డెమ్మను కత్తితో పొడవగానే ఆమె బాధతో పెద్దగా కేకలు వేయడంతో ఇంటిలో ఉన్న కోడలు సుహాసిని వెంటనే తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పొలంలో కాపలాకి వెళ్లిన అతను హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో 108కు సమాచారం అందించారు. వారు వచ్చేసరికి సుమారు గంటకు పైగా సమయం పట్టింది. రెడ్డెమ్మను పరీక్షించి చనిపోయిందని ధ్రువీకరించుకుని వెనుతిరిగారని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని సింగరాయకొండ సీఐ బనగాని ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్ పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు రిజిష్టరు చేసి దర్యాప్తు చేస్తున్నామని కోటేశ్వరరావు కోసం గాలిస్తున్నామని వివరించారు -
గృహంలో గంజాయి వనం
ప్రకాశం, బల్లికురవ: ఇంటి అవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం మేరకు మంగళవారం అద్దంకి ఎస్ఐ, సీఐ తిరపతయ్య మండలంలోని గుంటుపల్లి గ్రామంలో తనిఖీ నిర్వహించారు. సీఐ అందించిన వివరాల ప్రకారం గుంటుపల్లి గ్రామంలో అద్దేటి ఏడుకొండలు ఇంటి ఆవరణలో కూరగాయలు ఆకుకూరల మొక్కల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. తనిఖీల్లో భాగంగా 3 గంజాయి మొక్కలను గుర్తించి ఏడుకొండలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి బుధవారం అద్దంకి కోర్టుకు హజరుపరుస్తామని చెప్పారు. గంజాయి మొక్కలు పెంచటం, అమ్మటం చట్టరీత్యా నేరమని ఎంతటివారపైన అయినా కేసు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. -
కుటుంబంలో వివాదం
ప్రకాశం, కంభం: తల్లిదండ్రుల మధ్య వివాదం చోటుచేసుకున్న నేపథ్యంలో వారి ఐదేళ్ల పసిబాలుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం దర్గా గ్రామంలో జరిగింది. వివరాలు.. మండలంలోని దర్గా గ్రామానికి చెందిన పెద్ద బ్రహ్మయ్య, అతని భార్య యశోధల మధ్య ఓ వివాదం జరిగింది. కుటుంబ సభ్యులు, పిల్లలు, బంధువులతో కలిసి దంపతులు స్థానిక పోలీసుస్టేషన్‌కు వచ్చారు. పోలీసుస్టేషన్ వద్ద ఉన్న సమయంలో పిల్లలు కొనుక్కునేందుకు హైవే అవతలి వైపునకు వెళ్తుండగా అదే సమయంలో మార్కాపురం నుంచి కంభం వైపు వస్తున్న కారు బాలుడిని ఢీకొట్టడంతో యువరాజ్ (5) అనే బాలుడు ఎగిరి కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. పాపం పసికందు తల్లిదండ్రుల తప్పిదానికి పోలీసుస్టేషన్ వరకు వారితో కలిసి వచ్చిన పసికందు రోడ్డుపైకి వెళ్లి ప్రమదానికి గురయ్యాడు. వెంటనే బాలుడిని వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించండంతో ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందడంతో తిరిగి కంభం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. ముగ్గురు పిల్లల్లో ఓ కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు మృతదేహం వద్ద భోరున విలపిస్తున్నారు. ఏఎస్ఐ రంగస్వామి వైద్యశాల వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసుల అదుపులో నిందితుడు? రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. కారును పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. -
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
ప్రకాశం, మేదరమెట్ల: కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్లో శ్రీకాకుళానికి చెందిన యువకుడు ఉరేసుకొని బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం సింగన్నపాలెం గ్రామానికి చెందిన జీవన్‌కుమార్ (25) అనే యువకుడు కొంతకాలం నుంచి గ్రోత్ సెంటర్లో గ్రానైట్ పాలిష్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సెలవు పెట్టి స్వగ్రామానికి వెళ్లి వచ్చాడు. నాలుగు రోజుల నుంచి అనారోగ్యంగా ఉండటంతో పనికి కూడా వెళ్లడం లేదు. తోటి స్నేహితులతో కలిసి ఊరికి వెళ్తున్నానని చెప్పిన జీవన్‌కుమార్ గది లోపల గడియ పెట్టుకొని దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పనికి వెళ్లి తిరిగి రూమ్‌కు వచ్చిన సహచరులు లోపల గడియ పెట్టి ఉండటాన్ని గమనించి కిటికీ నుంచి లోపలకు చూడగా జీవన్‌కుమార్ ఉరేసుకొని కనిపించడంతో మేదరమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న మేదరమెట్ల ఎస్ఐ వై.పాండురంగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీవన్‌కుమార్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.