దండుపాళ్యం ముఠా కన్నుపడితే అంతే.. | Dandupalyam Robbery Gang In Prakasam | Sakshi
Sakshi News home page

దారి దోపిడీల్లో దండు పాళ్యం ముఠా

Published Tue, Jul 23 2019 10:31 AM | Last Updated on Tue, Jul 23 2019 11:34 AM

Dandupalyam Robbery Gang In Prakasam - Sakshi

బాధితురాలిని పరామర్శిస్తున్న మహిళా కమిషన్‌ సభ్యురాలు రమాదేవి (ఫైల్‌)

సాక్షి, చీరాల (ప్రకాశం): పగలు లేదు..రాత్రి లేదు.. ఎప్పుడైనా వారి టార్గెట్‌ ప్రేమ జంటలే. అందులోనూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న వారినే టార్గెట్‌ చేస్తారు. రాత్రి వేళ్లల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే దంపతులను కూడా వదలరు. చీకట్లో మాటు వేసి అందినంత దోచుకోవడం ఆపై విచక్షణ మరిచి సామూహిక లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. వీలుకాకుంటే చితకబాది జేబులో ఉన్న డబ్బులు, ఒంటిపై ఉన్న నగలు దోచేస్తారు. వీరి అకృత్యాలు దండుపాళ్యం సినిమాలో ఘటనలు తలదన్నేలా ఉంటాయి.

గతంలోనూ విచ్చల విడిగా అరాచకాలకు పాల్పడ్డారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పలు రకాలు కేసులు బనాయించి కొందరిని జైలుకు పంపడంతో కొద్ది రోజులుగా మిన్నకున్నారు. మళ్లీ ఈ బ్యాచ్‌ కొద్ది నెలలుగా తమ వికృత చేష్టలకు పదును పెట్టింది. దండుబాటలో దారి దోపిడీలకు పాల్పడుతోంది. కారంచేడు బ్రిడ్జి సమీపంలో లైంగిక దాడులకు తెరలేపింది. రామాపురం బీచ్‌లో ప్రేమజంటలను టార్గెట్‌ చేస్తోంది. ఉజిలీపేటకు చెందిన ఈ ముఠా కొద్ది రోజులు వ్యవధిలోనే ఏడు జంటలపై లైంగిక దాడులకు పాల్పడిందంటే నిందులు ఎంతటి దుర్మార్గులో ఆర్థం చేసుకోవచ్చు. 

దాడులు, ఆపై లైంగిక దాడులు
చీరాల విఠల్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేదాలు వచ్చి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన శివారెడ్డితో ఆమెకు పరిచయమైంది. వీరు చీరాల సమీపంలోని కారంచేడు సరిహద్దుల్లోని ఏకాంత ప్రాంతానికి వెళ్లారు. కొద్దికాలంగా అనుసరిస్తున్న ఉజిలిపేటకు చెందిన ముఠా వీరిపై కన్నేసింది. చీకట్లో కాలువ కట్టపైకి వెళ్లిన కొద్ది సేపటికి వారి వెనుకే వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రియుడి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌ దోచుకున్నారు. తనపై కూడా దాడి చేస్తారనే భయంతో అతడు కూడా దూరంగా ఉండిపోయాడు. విషయం బయటకు వస్తే చంపేస్తామని, మీ పరువే పోతుందని ఆమెను భయపెట్టారు. బాధితురాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సమాచారం తెలుసుకున్న ఎస్పీ కూడా కేసును సీరియస్‌గా తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ సమయంలో విస్తుకొల్పే విషయాలు వెల్లడయ్యాయి. కొద్ది రోజుల్లోనే మొత్తం ఏడు జంటలపై దాడులు, లైంగిక దాడులకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం. అందులో విఠల్‌నగర్‌కు చెందిన మహిళ తప్ప మిగిలిన ఆరు జంటల్లో ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందు రాలేదు. పోలీసులు, మరెవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందని, కుటుంబంలో వివాదాలు ఏర్పడి తమ కాపురాలు ఎక్కడ పోతాయనే మౌనం దాల్చారు. ఎక్కువగా వీరు వివాహేతర సంబంధాలు ఉన్నవారు కావడంతో ముందుకు వచ్చి నోరు మెదపకలేక పోతున్నారు.

దండుబాటే డేంజర్‌
దండుబాట రోడ్డులో రెండు ముఠాలు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాయి. చీరాల నుంచి స్వర్ణకు దండుబాట మీదగా రాత్రి 11 గంటల వరకు ద్విచక్ర వాహనాలు వెళ్తుంటాయి. స్వర్ణకు వెళ్లే రోడ్డులో మలుపు వద్ద వాహనాలను వేగం తగ్గిస్తారు. ఇక్కడే మాటు వేసిన ముఠాలు వాహనదారులను చితకబాది నగదు దోచుకుంటున్నాయి. వారం రోజుల క్రితం ఓ మోటార్‌ సైకిల్‌ నుడుపుతున్న వ్యక్తిపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్‌ దోచుకున్నారు. ఈ ఘటనపై ఒన్‌టౌన్‌పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దండుబాట నుంచి చీరాల నగర్‌కు వెళ్లే దారిలో సరివితోటలతో పాటు పొలాలు ఉండడంతో వివాహేతర సంబంధం ఉన్న జంటలు ఆ చీకటి ప్రాంతాలకు వెళ్తుంటాయి. అక్కడే మాటు వేసి ఉండే ఈ ముఠాలు నిశితంగా పరిశీలించి వారిపై లైంగిక దాడులతో పాటు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. 

అరాచాకాలకు అంతే లేదు 
వాడరేవు సముద్ర తీర ప్రాంతాని పర్యాటకులు, నూతనంగా పెళ్లయిన వారు, కొందమంది ప్రేమికులు జంటలుగా వాడరేవుకు వస్తుంటారు. ఇదే అదునుగా భావించిన కొందరు అగంతకులు పర్యాటకులపై మానవత్వాన్ని మరిచి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తీరంలో జంటగా వెళ్లిన వారిని అటకాయించి వారి వద్ద ఉన్న నగదు, బంగారం, సెల్‌ఫోన్లు బలవంతంగా లాక్కుంటున్నారు. ప్రతిఘటించిన వారిపై దాడులకు దిగి గాయపరిచిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

ఒకటా..రెండా?
వాడరేవు నుంచి రామాపురం తీరానికి వెళ్లే దారిలో ఉన్న తీరానికి ఓ ప్రేమజంట వెళ్లింది. తీరం వెంట ఉండే అటవీ శాఖకు చెందిన సరివి తోపుల వద్ద జంట ఉంది. వెళ్లిన కొద్ది సేపటికే చీరాల ప్రాంతంలోని పాలిటెక్నిక్‌ చదువుతున్న విద్యార్థులు ఆరుగురు ఆ జంట వద్దకు వెళ్లి తాము పోలీసులమని బెదిరించడంతో పాటు ప్రియుడిని కట్టేసి అతని వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌తో పాటు ప్రియురాలి చెవులకు ఉన్న దుద్దులు దోచుకున్నారు. సొత్తు దోచుకోవడంతో పాటు ఆరుగురూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఊరుకోకుండా మానవ మృగాళ్లుగా మారి ఆమె నగ్న దృశ్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

ఆమె సెల్‌ నంబర్‌ తీసుకుని ఆ తర్వాత జంటను వదిలేశారు. ఆ ప్రేమ జంటది వివాహేతర సంబంధం కావడంతో బయటపడితే తమ పరువు పోవడంతో పాటు కాపురాలు దెబ్బతింటాయని మౌనంగా ఉంది. చివరకు ఆమెకు బెదిరింపులు అధికం కావడంతో పోలీసులను ఆశ్రయించింది. తనకు కేసు వద్దని, పోయిన బంగారాన్ని ఇప్పించాలని కోరడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదు. నిందితుల్లో కొందరిపై మాత్రం దోపిడీ కేసు మాత్రమే నమోదు చేశారు.

తీరంలో జోరుగా దోపిడీలు
జిల్లాలోనే సముద్ర తీర పర్యాటక ప్రాంతంగా పేరుగంచిన చీరాల వాడరేవులో ప్రస్తుతం పర్యాటకులకు అశాంతి, అభద్రత నెలకొంది. అరాచక ముఠాలు ఎప్పుడు లైంగిక దాడులు, దొంగతనాలు చేస్తాయో తెలియక పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చీరాల వాడరేవు తీరానికి విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, వరంగల్‌ జిల్లాలతో పాటుగా బెంగళూరు, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు వస్తుంటారు. చీరాల వాడరేవు, రామాపురంలో వసతి సౌకర్యాలతో పాటు సముద్రంలో స్నానాలు చేసేందుకు మంచి అనువైన ప్రదేశం కావడంతో నిత్యం పర్యాటకులతో వాడరేవు కళకళలాడుతుంటుంది.

పెట్రోలింగ్‌ను వేగవంతం చేశాం
దండుబాట నుంచి స్వర్ణ వేళ్లే రోడ్డులో రాత్రి 12 గంటల వరకు పెట్రోలింగ్‌ చేస్తున్నాం. ఇక్కడ గతంలో దాడులు జరిగాయి. నిందితుల ఆట కట్టించేందుకు త్వరలోనే వెహికల్‌ చెకింగ్, ప్రత్యేకంగా సిబ్బందితో గస్తీ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందించాలి. వివరాలు అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.
- నాగమల్లేశ్వరరావు, ఒన్‌టౌన్‌ సీఐ, చీరాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement