బైకును వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని బోల్తాపడటంతో ఇద్దరు మృతిచెందగా 24 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మార్కాపురం మండలం దరిమడుగు సమీపంలో మహ్మసాహెబ్ కుంట వద్ద ఆదివారం జరిగింది.
సాక్షి, మార్కాపురం రూరల్(ప్రకాశం): బైకును ఓ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టి బోల్తా పడటంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, 24 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని దరిమడుగు సమీపంలోని మహ్మసాహెబ్ కుంట వద్ద ఆదివారం జరిగింది. ప్రమాదంలో ఎస్‌కే అబ్దుల్ రహిమాన్ (30), ఎస్‌కే జిందాసాహిద్ (18)లు మృతి చెందగా అవ్వారు ఉమాదేవి, పి.పార్వతికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుంచి వైఎస్సార్ జిల్లా వెళ్తోంది. అందులో 26 మంది ప్రయాణికలు ఉన్నారు. పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ రహిమాన్ బైకుపై దోర్నాల బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి మార్కాపురం వస్తున్నాడు.
అదే బైకుపై విద్యార్థి ఎస్‌కే జిందాసాహిద్ ఉన్నాడు. దోర్నాల–ఒంగోలు జాతీయ రహదారి మహ్మసాహెబ్ కుంట వద్ద ఓవర్ టేక్ చేయబోయి బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టి బోల్తా పడింది. బైకుపై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అబ్దుల్ రహిమాన్ పట్టణంలోని పదో వార్డులో నివాసం ఉంటూ పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయనకు భార్య రుక్షాన, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విద్యార్థి దరిమడుగులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిప్లమో సెకండియర్ చదువుతున్నాడు. ఇతడిది కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలం జూటూరు గ్రామం. తండ్రి రహంతుల్లా ఎలక్ట్రికల్ షాపు నడుపుతూ కుంటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
బస్సులో ఉన్న 26 మంది ప్రయాణికుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌కు బాషాతో పాటు 24 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఉమాదేవి, పార్వతిది వైఎస్సార్ జిల్లాలోని కోణపేట మండలం అప్పన్నవల్లి. వీరు కుటుంబంతో శ్రీశైలం పుణ్యక్షేత్రం దర్శించుకుని తిరుగు ప్రయాణం చేస్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటన స్థలాన్ని సీఐ రాఘవేంద్ర, ఎస్‌ఐ గంగుల వెంకట సైదులు, పెద్దారవీడు ఎస్‌ఐ రామకృష్ణ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ రాఘవేంద్ర, ఇతర పోలీసు అధికారులు
Comments
Please login to add a commentAdd a comment