markapur
-
స్వాప్నికళ
ఆస్ట్రేలియాకు చెందిన ప్రసిద్ధ క్రోచెట్ ఆర్టిస్ట్ జెన్నీ కింగ్ నోటి నుంచి వినిపించే మాట... ‘అల్లికల కళకు మాంత్రిక శక్తి ఉంది. అది మన మనసును ఎప్పుడూ ఆహ్లాదభరితం చేస్తుంది. మంత్రముగ్ధుల్ని చేసే మనోహర కళ ఇది’.మార్కాపురానికి చెందిన స్వాప్నిక రాజ్ఞీ చిన్నప్పుడే ఆ మంత్రముగ్ధకళలలో ఓనమాలు నేర్చుకుంది. ఆ కళ ఇచ్చిన ఉత్తేజం ఊరకేపోలేదు. అల్లికల కళలో చేయి తిరిగిన స్వాప్నిక పేరు గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది.ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన స్వాప్నిక అమ్మమ్మ తోటకూర క్రిస్టియనమ్మ పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ తీరిక వేళల్లో ఇంట్లో అల్లికలు (క్రోచెట్స్) చేసేది. అమ్మమ్మ అల్లికల పనిలో ఉన్నప్పుడు స్వాప్నిక ఆసక్తిగా గమనించేది. అలా ‘అమ్మమ్మ అల్లికల స్కూల్’ లో స్టూడెంట్‌గా చేరింది. గురువుగారి ప్రియ శిష్యురాలు అయింది. అల్లికలకు సంబంధించి ఎన్నో మెళకువలు అవలీలగా నేర్చుకుంది.కొత్త అల్లికల గురించి ఆలోచించడమే కాదు, క్రోచెట్స్కు సంబంధించి కొత్త రికార్డ్ల గురించి తెలుసుకోవడం అంటే స్వాప్నికకు ఇష్టం. మదర్ ఇండియాస్ క్రోచెట్ క్వీన్స్ (ఎంఐక్యూ)లో ఆరు వేలమందికి పైగా సభ్యులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రోచెట్ ఆర్టిస్ట్‌లకు స్ఫూర్తినిచ్చే సంస్థ ఇది. ‘క్రోచెట్ క్వీన్స్’కు చెందిన మహిళలు అతి పెద్ద క్రోచెటెడ్ దుప్పటి, అతి పెద్ద క్రోచెటెడ్ స్కార్ఫ్, అతి పెద్ద క్రోచెటెడ్ క్రిస్మస్ డెకరేషన్... మొదలైన వాటితో రికార్డ్ సృష్టించారు.‘ఎంఐక్యూ’లాంటి సంస్థల రికార్డుల గురించి తెలుసుకునే క్రమంలో స్వాప్నికకు రికార్డ్‌లపై ఆసక్తి మొదలైంది.‘గిన్నిస్ బుక్ రికార్డ్’ అంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించే సవాలు. అలాంటి అరుదైన సవాలును స్వీకరించే అవకాశం స్వాప్నికకు విశాఖపట్టణంలో వచ్చింది.విశాఖపట్టణానికి చెందిన ‘మహిళా మనోవికాస్ క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్’ సంస్ధ క్రోచెట్స్కు సంబంధించి నిర్ణీత వ్యవధిలో అత్యధిక కళాకృతులు తయారు చేయాలని సవాలు ఇచ్చింది. ఈ సవాలుకు ‘సై’ అంటూ స్వాప్నిక బృందంలోని మహిళలు అతి తక్కువ సమయంలో 58,112 క్రోచెట్ స్క్వేర్లను తయారుచేసి ‘లార్జెస్ట్ డిస్ప్లే ఆఫ్ క్రోచెట్స్ స్వే్కర్’ అనే టైటìఃల్ సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్ రికార్డ్ నెలకొల్పారు. గిన్నిస్ రికార్డు కోసం 20వేల క్రోచెట్స్ స్క్వేర్స్ తయారు చేయాల్సి ఉండగా స్వాప్నిక బృందం 58,112 తయారుచేసి వరల్డ్ రికార్డు సాధించింది.‘గిన్నిస్ రికార్డ్ ఇచ్చిన ఉత్సాహంతో భవిష్యత్‌లో మరిన్ని రికార్డ్‌లు నెలకొల్పుతాం’ అంటుంది ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో స్వాప్నిక రాజ్ఞీ. కూచిపూడి నుంచి కరాటే వరకు‘నేర్చుకుంటే పోయేదేమీ లేదు... వచ్చేదే తప్ప’ అన్నట్లుగా ఉంటుంది స్వాప్నిక ఉత్సాహం. అల్లికల కళలో చేయి తిరిగిన స్వాప్నిక అక్కడితో ఆగిపోలేదు. తల్లిదండ్రులు నాగెళ్ల లీనా కెఫీరాల, డాక్టర్ కొండేపోగు డేవిడ్ లివింగ్ స్టన్ ్రపోత్సాహంతో కూచిపూడి నేర్చుకుంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు గెలుచుకుంది. కరాటేలో కూడా ప్రావీణ్యం సంపాదించింది. బిఫార్మసీ చదివే రోజుల్లో స్వాప్నిక తన చేతులపై జీపును నడిపించుకుని సాహసవంతమైన ఫీట్ చేసింది. వృత్తిరీత్యా ఫార్మసిస్టు అయిన స్వాప్నిక ప్రవృత్తిరీత్యా ఆర్టిస్ట్. ఎప్పటికప్పుడు కొత్త కళలపై ఆసక్తి చూపుతుంటుంది.– గోపాలుని లక్ష్మీ నరసింహారావు, ‘సాక్షి’, మార్కాపురం, ప్రకాశం జిల్లా -
జడతో కారు లాగిన చిన్నారి!
మార్కాపురం: రెండు జడలతో కారును లాగి అందర్నీ అబ్బురపరిచిందో చిన్నారి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన క్రీడా కోచ్ చిట్టిబాబు కుమార్తె టి.బిందు (సౌజన్య) స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. (చదవండి: వెంట్రుకలను ఎందుకలా కత్తిరిస్తున్నారని అడిగా..) బుధవారం పీఎస్ కాలనీలోని మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్లో సాహసం చేసి అందరితో శభాష్ అనిపించుకుంది. పట్టుమని 12 ఏళ్లు నిండని చిన్నారి.. తన జడతో మారుతీకారును 50 మీటర్లు లాగింది. ఈ సాహసాన్ని చూసిన ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి బిందును అభినందించారు. -
అరుదైన పాము పట్టివేత
మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతంలో అరుదుగా కనిపించే ఆలీవ్ కీల్ బ్లాక్ స్నేక్‌ను ఆదివారం మార్కాపురం ఫారెస్ట్ ఆఫీసులో పట్టుకున్నట్లు డీఎఫ్‌వో అప్పావ్ విఘ్నేశ్ తెలిపారు. పాముని రెస్క్యూ టీం సభ్యులు పట్టుకుని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు చెప్పారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో మాత్రమే ఉండే ఈ పాము మైదాన ప్రాంతాల్లోకి రావడం అరుదన్నారు. ఈ పాము ప్రమాదకరం కాదని చెప్పారు. చదవండి: ప్రాణాలు తీసిన ‘పార్టీ’ -
అలుపెరుగని అథ్లెటిక్.. పరుగులో రారాజు
మల్కాపురం (విశాఖ పశ్చిమ): ఆయన వయసు 67 ఏళ్లు...అయినా 20 ఏళ్ల యువకుడిలా ఫిట్‌గా ఉంటాడు. ఎవరైనా సరే నాతో పరుగెత్తగలరా అంటూ సవాల్ విసురుతాడు. కచ్చితంగా గెలిచే తీరుతాడు. 60–75 ఏళ్ల విభాగంలో పోటీలో పాల్గొంటూ పతకాలు గొల్లగొడుతున్నాడు. అతనే ఇందిరాకాలనీకి చెందిన ఆకుల కనకరాజు. ఇప్పటికీ అదే ఉత్సాహం కనకరావుకు ఇప్పడు 65 ఏళ్లు. అయినా నిత్యయువకుడిలా పరుగులో రాణిస్తున్నాడు. తెల్లవారు జామునే నిద్ర లేవడం.. రన్నింగ్‌కు వెళ్లడం నిత్య దినచర్య. ప్రస్తుతం కనకరాజు షిప్‌యార్డ్ జూనియర్ కళాశాలలో పీఈటీగా పనిచేస్తున్నాడు. రన్నింగ్‌తో పాటు బాడీబిల్డింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్ వంటి క్రీడలు కనకరాజుకు అనుభవం ఉంది. ఆ క్రీడల్లో కూడా పతకాలు సాధించాడు. 1972లో తొలిసారిగా.. 1972లో ఇండియన్ నేవి విశాఖలో ఏర్పాటు చేసిన పది కిలో మీటర్ల పరుగు పందెంలో తొలి స్థానంలో నిలిచాడు. అప్పటి నుంచి ఏటా వివిధ రాష్ట్రాలలో జరిగే పరుగు పందెంలో పాల్గొని పతకాలు సాధించాడు. 65 ఏళ్ల వయసులో కూడా (2000వ సంవత్సరం) హరియానలో జరిగిన జాతీయ స్థాయి 4 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచాడు. వంద, రెండు వందలు ,మూడు వందలు, నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో ఇప్పటి వరకు నాలుగు వందల వరకు పతకాలు సాధించాడు. ఇప్పటి వరకు సాధించిన పతకాలు 140 జీవీఎంసీ 60వ వార్డు పరిధి ఇందిరాకాలనీ– 1 ప్రాంతానికి చెందిన ఆకుల కనకరాజు అథ్లెటిక్స్ రాణిస్తు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వయసు 67 ఏళ్లయినా వెనుకడుగు వేయకుండా పరుగులో నంబర్–1 గా నిలుస్తున్నాడు. పదో తరగతి పూర్తి చేసిన కనకరాజు ఇండియన్ ఆర్మీలో చేరాడు. అక్కడ అధికారులు ఇచ్చిన పోస్టు నచ్చక ఏడాదికి తిరిగి వచ్చాశాడు. విశాఖలో హోంగార్డుగా ఐదేళ్లు పనిచేశాడు. అనంతరం సీలేరు వద్ద గల ప్రభుత్వ ఐటీఐలో మేల్ నర్స్‌గా చేరాడు. తరువాత విశాఖ సెంట్రల్ జైల్లో మేల్ నర్సింగ్ విధులు నిర్వహించి అక్కడే పదవీ విరమణ పొందాడు. కనకరాజు 13 ఏళ్ల వయసులోనే పరుగు మొదలు పెట్టాడు. షిప్‌యార్డ్, జింక్, పోర్టు గ్రౌండ్లో రన్నింగ్ ప్రాక్టిస్ చేశాడు. -
బైకును ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా
బైకును వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని బోల్తాపడటంతో ఇద్దరు మృతిచెందగా 24 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మార్కాపురం మండలం దరిమడుగు సమీపంలో మహ్మసాహెబ్ కుంట వద్ద ఆదివారం జరిగింది. సాక్షి, మార్కాపురం రూరల్(ప్రకాశం): బైకును ఓ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టి బోల్తా పడటంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, 24 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని దరిమడుగు సమీపంలోని మహ్మసాహెబ్ కుంట వద్ద ఆదివారం జరిగింది. ప్రమాదంలో ఎస్కే అబ్దుల్ రహిమాన్ (30), ఎస్కే జిందాసాహిద్ (18)లు మృతి చెందగా అవ్వారు ఉమాదేవి, పి.పార్వతికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుంచి వైఎస్సార్ జిల్లా వెళ్తోంది. అందులో 26 మంది ప్రయాణికలు ఉన్నారు. పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ రహిమాన్ బైకుపై దోర్నాల బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి మార్కాపురం వస్తున్నాడు. అదే బైకుపై విద్యార్థి ఎస్కే జిందాసాహిద్ ఉన్నాడు. దోర్నాల–ఒంగోలు జాతీయ రహదారి మహ్మసాహెబ్ కుంట వద్ద ఓవర్ టేక్ చేయబోయి బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టి బోల్తా పడింది. బైకుపై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అబ్దుల్ రహిమాన్ పట్టణంలోని పదో వార్డులో నివాసం ఉంటూ పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయనకు భార్య రుక్షాన, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విద్యార్థి దరిమడుగులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిప్లమో సెకండియర్ చదువుతున్నాడు. ఇతడిది కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలం జూటూరు గ్రామం. తండ్రి రహంతుల్లా ఎలక్ట్రికల్ షాపు నడుపుతూ కుంటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బస్సులో ఉన్న 26 మంది ప్రయాణికుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌కు బాషాతో పాటు 24 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఉమాదేవి, పార్వతిది వైఎస్సార్ జిల్లాలోని కోణపేట మండలం అప్పన్నవల్లి. వీరు కుటుంబంతో శ్రీశైలం పుణ్యక్షేత్రం దర్శించుకుని తిరుగు ప్రయాణం చేస్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటన స్థలాన్ని సీఐ రాఘవేంద్ర, ఎస్ఐ గంగుల వెంకట సైదులు, పెద్దారవీడు ఎస్ఐ రామకృష్ణ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ రాఘవేంద్ర, ఇతర పోలీసు అధికారులు -
పాపం పసివాడు..
► రైలు పట్టాల పక్కనే ఉన్న మూడేళ్ల బాలుడు ► ఇంతలో వేగంగా వెళ్లిన గూడ్స్ రైలు ► ఆ ధాటికి అదుపుతప్పి కంకర రాళ్లపై పడిన బాలుడు ► తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందిన పసి హృదయం మార్కాపురం రూరల్ : ఆ బాలుడి వయసు మూడేళ్లు. తల్లి కోసం రైలు పట్టాలు దాటి ఏడ్చుకుంటూ వచ్చాడు. ఇంతలో ఓ రైలు వచ్చింది. దాని వేగం ధాటికి బాలుడు అదుపుతప్పి పట్టాల పక్కన రాళ్లపై పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన మండలంలోని గోగులదిన్నె ఎస్సీ కాలనీ సమీపంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే మురికపూడి నాగయ్య, నాగమ్మ దంపతులకు జాయ్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. తల్లి బహిర్భూమి కోసం కాలనీకి సమీపంలోని రైలు పట్టాలు దాటుకుని అవతలి వైపునకు వెళ్లింది. కుమారుడు జాయ్ ఏడ్చుకుంటూ తల్లి కోసం రైలు పట్టాల వద్దకు వచ్చి ఆగాడు. ఇంతలో ఓ గూడ్స్ రైలు వేగంగా వెళ్లింది. ఆ గాలి ధాటికి రైలు పట్టాల పక్కన ఉన్న బాలుడు అదుపుతప్పి కిందపడ్డాడు. కింద పెద్దపెత్త కంకర రాళ్లు ఉండటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రులు పలకల పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అప్పటి వరకూ ఆడుతూ చలాకీగా నవ్వుతూ ఉన్న జాయ్ ఉన్నట్టుండి మృతి చెందాడని తెలిసి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
పరిహారమా..పరిహాసమా?
► పునరావాస కల్పనలోనిర్లక్ష్యం ► పూర్తిస్థాయిలో అందని పరిహారం ► తొమ్మిదేళ్లుగా కాలయాపన ► ప్రారంభం కాని పునరావాస పనులు ► శిథిలమైన గృహాల్లో ముంపు గ్రామాలవాసుల అవస్థలు వారి త్యాగం వెల కట్టలేనిది... తాత, ముత్తాతల నుంచి పుట్టి పెరిగిన కన్నతల్లి లాంటి ఊరును, చెరగని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ స్వగ్రామం నుంచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం మాత్రం పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కొండల మధ్య పచ్చని చెట్ల నడుమ ఉండే ఆ గ్రామస్తులు లక్షల మంది ప్రజల కోసం ఊరిని వదిలేందుకు సిద్ధమయ్యారు. బంగారం పండించే పొలాలను కూడా వదులుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం వారి పునరావాసం పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. కొత్త ఇళ్లు నిర్మించుకుందామంటే ఉపయోగం లేదు. పోనీ ఉన్న ఇంటికి మరమ్మతులు చేయించుకుందామన్నా ఎప్పుడు ఖాళీ చేయిస్తారో తెలియదు. దీంతో శిథిల గృహాల మధ్య నివసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లింపు, ఆర్ఆర్ ప్యాకేజి అమలులో ప్రభుత్వం చేస్తున్న జాప్యం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సుమారు 11 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. మార్కాపురం మండలంలో గొట్టిపడియ, అక్కచెరువు తండా, పెద్దారవీడు మండలంలో సుంకేసుల, కలనూతల, గుండంచర్ల, చింతలముడిపి, అర్ధవీడు మండలంలోని కాకర్ల, మాగుటూరు తండా, తదితర గ్రామాలు ఉన్నాయి. మొత్తం 11 గ్రామాల్లో 11,365 గృహాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 4 వేల గృహాలు శిథిలావస్థకు చేరాయి. ప్రాజెక్టు పరిధిలో ఇప్పటి వరకు ఒక్క పునరావాస కాలనీ ప్రారంభం కాలేదు. కనీసం ఒక్క గృహం కూడా శంకుస్థాపనకు నోచుకోలేదు. వర్షాకాలంలో మబ్బులు పడితే వారి గుండెల్లో భయం. డ్యామ్‌లోకి నీళ్లు వస్తే మునిగిపోతామన్న ఆందోళన. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గొట్టిపడియ డ్యామ్ ముంపు గ్రామమైన గొట్టిపడియ నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజి అమలు చేయటంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. సుమారు తొమ్మిదేళ్ల నుంచి నిర్వాసితులకు ఇళ్ల స్థలాల సేకరణ పూర్తి కాలేదు. గొట్టిపడియ పంచాయతీలో గొట్టిపడియ, అక్కచెరువు తండా ఉన్నాయి. ఈ రెండింటిలో సుమారు 950 కుటుంబాలు, 650 గృహాలు ఉన్నాయి. వీరిలో దాదాపు 60 కుటుంబాల వారికి నష్టపరిహారం అందలేదు. 20 ఎకరాలకు సంబంధించి 10 మంది రైతులకు నష్టపరిహార పంపిణీ ఇంకా జరగలేదు. పెద్దారవీడు మండలంలోని చింతలముడిపిలో 56 గృహాలు, 72 కుటుంబాలు, సుంకేసులలో 1131 గృహాలు, 1552 కుటుంబాలు, కలనూతలలో 514 గృహాలు, 625 కుటుంబాలు, గుండంచర్లలో 237 గృహాలు, 715 కుటుంబాలు ఉన్నాయి. గొట్టిపడియ డ్యామ్ పరిధిలో గొట్టిపడియ, అక్కచెరువు తండాలు, సుంకేశుల డ్యామ్ పరిధిలో చింతలముడిపి, సుంకేశుల, కలనూతల, గుండంచర్ల గ్రామాలు మునిగిపోనున్నాయి. గొట్టిపడియ, అక్కచెరువు గ్రామాల వారికి మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న అల్లూరి పోలేరమ్మ దేవాలయం వద్ద 60 ఎకరాల్లో కొంత మందికి, కోమటికుంట వద్ద 45 ఎకరాల్లో మరి కొంత మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, భూములు కోల్పోతున్న రైతులు కోర్టుకు వెళ్లటంతో తొమ్మిదేళ్ల నుంచి ఈ సమస్య పరిష్కారం కాలేదు. సుంకేసుల గ్రామస్తులకు తోకపల్లె వద్ద, కలనూతల గ్రామస్తులకు ఇడుపూరు వద్ద , గుండంచర్ల గ్రామస్తులకు దేవరాజుగట్టు వద్ద పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గొట్టిపడియ ప్రధాన కాలువ పూర్తయి ఏడేళ్లు కావస్తోంది. కొంత మందికి ఇంకా నష్టపరిహారం చెల్లించకపోవటంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు యూనిట్ 1, 2, 3 పరిధిలోకి వచ్చే గ్రామ ప్రజలకు ఆర్ఆర్ ప్యాకేజిని పూర్తి స్థాయిలో అధికారులు అమలు చేయటం లేదు. ఇదిలా ఉండగా, గొట్టిపడియ లింక్ కాలువ నిర్మాణంలో కూడా 15 ఎకరాలకు రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించకపోవటంతో అటు భూమిని కోల్పోయి, ఇటు నష్టపరిహారం రాక కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో పాటు కాలువకు ఆవల వైపున కూడా సుమారు 20 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించలేదని, 2 అవార్డులు(చెట్లకు నష్ట పరిహారం) చెల్లించలేదని బాధిత రైతులు తెలిపారు. -
బీపీఎస్‌కు స్పందన కరువు
మార్కాపురం టౌన్: జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అనుమతిలేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణ గడువు ముగిసిపోయింది. జిల్లాలో ఇంకా చాలా మంది క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు రాలేదు. జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉన్నాయి. మున్సిపాలిటీల్లో జీప్లస్ వన్ భవనాన్ని నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తారు. జీ ప్లస్ 2 భవనాన్ని నిర్మించుకోవాలంటే రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా మున్సిపాలిటీకి సదరు భవనాన్ని మార్టిగేజ్ చేయాలి. 300 స్క్వేర్ మీటర్ల నుంచి వెయ్యి స్క్వేర్ మీటర్ల వరకు నిర్మించే భవనానికి గుంటూరు రీజనల్ డెప్యూటీ డైరెక్టర్ నుంచి అనుమతి పొందాలి. వెయ్యి స్క్వేర్ మీటర్లు దాటితే (4 అంతస్తుల పైన) హైదరాబాదులోని మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి అనుమతులు పొందాలి. దినదినాభివృద్ధి చెందుతున్న మార్కాపురంతోపాటు జిల్లాలో మున్సిపాలిటీలలో కొన్నేళ్లుగా అపార్ట్మెంట్ నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో పాటు మల్టీప్లెక్స్ కాంప్లెక్స్‌లు కూడా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనధికార కట్టడాలకు మున్సిపల్ అధికారులు అపరాధ రుసుం విధిస్తున్నారు. కాగా, పురపాలక సంఘం పరిధిలో 1 జనవరి 1985 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మించుకున్న కట్టడాలను క్రమబద్ధీకరించుకోవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన సమయం ఏప్రిల్ 30తో ముగిసింది. తదుపరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పథకం ద్వారా 1985 నుంచి 2014లోపు నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించుకోవాలని నిబంధన విధించింది. దీంతో జిల్లాలోనే మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలను గుర్తించి అధికారులు సుమారు 7 వేల భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. అయితే జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో బిల్డింగ్ పీనలైరైజేషన్ పథకంలో భాగంగా 3,346 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 2,215 మంది క్రమబద్ధీకరించుకోగా, 1130 దరఖాస్తులు పరిష్కరించుకోవాల్సి ఉంది. మామూలుగా భవన నిర్మాణదారులు ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను మున్సిపల్ అధికారులు డౌన్లోడ్ చేసుకుని డాక్యుమెంట్‌ను పరిశీలించి సదరు బిల్డింగ్ వద్దకు వెళ్లాలి. అక్రమ కట్టడాలను గుర్తించి అపరాధ రుసుం విధించిన అనంతరం ఆ బిల్లును కట్టి బిల్డింగ్‌ను క్రమబద్ధీకరించుకోవాలి. కష్టపడి పదివేలు డిపాజిట్ చెల్లించి ఆన్లైన్ చేయించుకుని వచ్చిన వాటిని డౌన్లోడ్ చేసుకుని పరిశీలించడానికి అనువైన పరికరాలు మున్సిపాలిటీలో లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
మహిళా సంఘాల నిధులు స్వాహా
► రూ.6.73 లక్షలు కైంకర్యం ► పరారీలో వెలుగు సీసీ మార్కాపురం: రెండు మహిళా సంఘాల ఖాతాల్లో ఉన్న సుమారు రూ.6.73 లక్షల నిధులను వెలుగు కమ్యూనిటీ కో ఆర్డినేటర్ (సీసీ) స్వాహా చేశాడు. రాజుపాలెంలో ఆదర్శ మహిళా సంఘంలో 10 గ్రూపులు ఉన్నాయి. వాటిల్లో ఆదర్శ, ఆరాధన, భారతి, భగత్, క్రీస్తు, మేరీమాత, ప్రభు, శాంతి, విజయ గ్రూపులున్నాయి. వెలుగు సీసీగా పనిచేస్తున్న వ్యక్తి మహిళల వద్దకు వెళ్లి రుణాలు చెల్లించాలంటూ ఒక్కో గ్రూపు నుంచి రూ.12 వేలు చొప్పున డ్రా చేయించి ఆ డబ్బును తన సొంత ఖర్చులకు వాడుకున్నాడు. మళ్లీ ఆరు గ్రూపుల నుంచి రికార్డు మెయింటెనెన్స్, బ్యాంకు ఖాతాల్లో ఖర్చుల కోసం అంటూ రూ.7,200 చొప్పున వసూలు చేశాడు. ఈ విధంగా రూ.1.63 లక్షలు వసూలు చేశాడు. ఇదే సీసీ వేములకోట పంచాయతీలోని కొట్టాలపల్లెలో ఉన్న భవానీ, విజయ గ్రూపుల నుంచి రూ.5.10 లక్షలు వారి ద్వారానే బ్యాంకుల నుంచి డ్రా చేయించి స్వాహా చేశాడు. ప్రభుత్వం స్వయం సహాయక బృందాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు బ్యాంకుల్లో చేస్తున్న పొదుపు ఆధారంగా రుణాలు మంజూరు చేస్తోంది. ఈ ప్రక్రియలో వెలుగు అధికారులు కీలకపాత్ర పోషిస్తారు. వీరిచ్చే నివేదికల ప్రకారమే బ్యాంకు మేనేజర్లు పొదుపు గ్రూపులకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణాలను సక్రమంగా చెల్లిస్తే బ్యాంకర్లు రెట్టింపు రుణాలు ఇస్తారు. వీటి ద్వారా మహిళలు పాడిపరిశ్రమ, దుస్తుల వ్యాపారం నిర్వహించుకోవచ్చు. మహిళల అవసరాన్ని ఆసరా చేసుకున్న వెలుగు సీసీ నమ్మకంతో వారి ద్వారానే బ్యాంకు ఖాతాల నుంచి నగదు డ్రా చేయించుకుని స్వాహా చేశాడు. ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళలు లబోదిబోమంటూ సదరు సీసీ నిర్వాహకంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు బ్యాంకు మేనేజర్లు మాత్రం రుణాలు చెల్లించాల్సిందేనంటూ గ్రూపు లీడర్లపై ఒత్తిడి తేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: మార్కాపురం మండలం రాజుపాలెం, కొట్టాలపల్లె గ్రామాల్లో వెలుగు సీసీ డబ్బులు దుర్వినియోగం చేసినట్లు అక్కడి మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మా శాఖ ఉన్నతాధికారులు సదరు సీసీపై పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు. ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాం. ---రమేష్, ఏపీఎం, వెలుగు -
ప్రత్యేక హోదా బాధ్యత కేంద్రానిదే
– ఉద్యమాలతో హోదా రాదు సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మార్కాపురం టౌన్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఉద్యమాల ద్వారా సాధించలేమని సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా మార్కాపురం పీఆర్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరగడంతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పొందు పరచలేదని, రాజ్యసభలో వెంకయ్య నాయుడు, నాటి బీజేపీ ఎంపీలు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌కు 5 నుంచి 10 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని కోరాయని, నేడు 14వ ఆర్థిక సంఘం సాకుతో ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని చెప్పటం వారికే చెల్లుతుందన్నారు. కేంద్రంతో ఘర్షణతో కాకుండా సామరస్యంగా ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నార ని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు, వెనుకబడిన ప్రాంతాలు, రాజధాని, పోలవరం ప్రాజెక్టు, విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ తదితరాలకు కేంద్రం తగిన నిధులు సమకూరుస్తుందన్నారు. మంత్రి వెంట ఆర్డీవో చంద్రశేఖరరావు, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. -
రైలు కిందపడి తల్లి, కూతురు మృతి
ప్రకాశం జిల్లా: మార్కాపురం రైల్వేస్టేషన్లో రైలు కింద పడి తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఆత్మహత్యకు చేసుకున్న వారి వివరాలు తెలియలేదు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు రైల్వేపోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుర్తుతెలియని మహిళ మృతి
మార్కాపురం: ప్రకాశం జిల్లాలో గుండెపోటుతో గుర్తుతెలియని మహిళ బుధవారం ఉదయం మృతిచెందింది. ఈ సంఘటన మార్కాపురం బస్టాండ్‌లో చోటుచేసుకుంది. కర్నూలు బస్సు కోసం సదరు మహిళ వేచిచూస్తున్న క్రమంలో ఓ మహిళ ఒక్కసారిగా గుండెపోటుతో మృతిచెందిందని స్థానికులు తెలిపారు. దీంతో ఆమె కర్నూలు జిల్లా చెందిన మహిళగా ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సర్కారు మోసాలపై ఉద్యమం
మార్కాపురం: ఎన్నికల్లో గెలవడానికి రైతు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేసే రీతిలో వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కార్ తీరుకు నిరసనగా డిసెంబర్ 5న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు ఎవరి రుణాలు మాఫీ కాలేదన్నారు. దీంతో రైతులు, డ్వాక్రా మహిళలు ఆందోళన చెందుతున్నారని, రుణమాఫీ కోసం ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, నాయకులు, రైతులు, డ్వాక్రా మహిళలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 24, 25తేదీల్లో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒంగోలు వస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి సమస్యలపై చర్చిస్తారన్నారు. ప్రభుత్వంపై ప్రజల తరఫున పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. పశ్చిమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రాంత ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించేందుకు నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ప్రధాని పిలుపు మేరకు సన్సద్ ఆదర్శ గ్రామ యోజన కింద రాష్ట్రంలో మొట్టమొదట తానే చొరవ చూపి గిద్దలూరు నియోజకవర్గంలోని దద్దవాడ గ్రామాన్ని ప్రకటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాబోయే నాలుగున్నర ఏళ్లలో మూడు గ్రామాలను దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎంపీ ప్రకటించారు. మార్కాపురం, కంభం, గిద్దలూరు, తర్లుపాడు, దొనకొండ రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని, రైల్వే ఉన్నతాధికారులను ఇక్కడికి పిలిపించి సమీక్ష నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారనే సాధ్యమవుతుందని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. 25న మార్కాపురం నియోజకవర్గ సమీక్ష ఉంటుందని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి తెలిపారు. ఎంపీగా ఎన్నికైన తరువాత మొదటి నిధులను మార్కాపురం నియోజకవర్గానికి కేటాయించటం మరచిపోలేమన్నారు. విలేకరుల సమావేశంలో మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్తలు వెన్నా హనుమారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షులు కె.వి.రమణారెడ్డి, మార్కాపురం, పొదిలి ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
భర్త వివాహేతర సంబంధం గుట్టురట్టు
మార్కాపురం : భర్త వివాహేతర సంబంధాన్ని భార్య బట్టబయలు చేసింది. ఓ మహిళతో ఇంట్లో ఉండగా కుమారుడు, కుమార్తెలతో పాటు బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వివరాలు.. పట్టణంలోని శివాజీ నగర్ 5వ లైనులో నివాసం ఉంటున్న మేడవరపు శ్రీనివాసరావు తర్లుపాడు మండలం శీతానాగులవరం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. దర్శికి చెందిన హైమావతితో 1997 మేలో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హైమావతి స్థానిక ఏరియా వైద్యశాలలో కాంట్రాక్టు పద్ధతిన ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోంది. కొన్నేళ్లుగా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త తనతో కాపురం చేయకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉండగానే భర్త నివాసం ఉంటున్న ఇంటిపై నిఘా ఉంచింది. ఈ నేపథ్యంలో ఇంట్లో మరో మహిళ ఉన్నట్లు స్థానికుల నుంచి ఆమెకు సమాచారం అందింది. బీజేపీ మహిళా మోర్చా నాయకులు ఎం.లక్ష్మి, ఎన్.లక్ష్మి, ఆ పార్టీ నేత పయిడిమర్రి శ్రీనివాసరావు, తన ముగ్గురు పిల్లలతో కలిసి గురువారం వేకువ జామున 4 గంటల సమయంలో హైమావతి తన భర్త ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన వెంటనే విలేకరులకూ సమాచారం అందించింది. ఈమె వద్ద ఉన్న మరో తాళంతో తలుపు తీయగానే అప్పటి వరకూ భర్త శ్రీనివాసరావుతో ఉన్న మహిళ బయటకు వెళ్లింది. ఈ నేపథ్యంలో హైమావతి తరఫు బంధువులు, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ఘర్షణ జరిగింది. న్యాయం చేయాలంటూ ధర్నా తనకు న్యాయం చేయాలంటూ హైమావతి తన పిల్లలు హరికృష్ణ, ధరణి, ద్రాక్షయనిలతో కలిసి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి శ్రీనివాసరావును పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ఇరువర్గాలు ఒకరిపై మరొకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఇంట్లో ఉన్న పనిమనిషితో తనకు వివాహేతర సంబంధం అంటగట్టారని శ్రీనివాసరావు విలేకరులకు తెలిపాడు. తన భర్త అసత్యం చెబుతున్నాడని, ఆయన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా తాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని హైమావతి కూడా వివరించింది. -
ప్రొటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్‌కు ఎమ్మెల్యే జంకె లేఖ
మార్కాపురం : నియోజకవర్గంలో వివిధ శాఖల అధికారుల ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యుడిని తప్పకుండా ఆహ్వానించాలన్న నిబంధనకు అధికారులు నీళ్లొదలడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు మార్కాపురం మున్సిపల్ కమిషనర్ ప్రొటోకాల్ ఉల్లంఘించారని శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై అసెంబ్లీ కార్యదర్శి స్పందించారు. ఈ నెల 13వ తేదీలోపు విచారణ చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ విజయకుమార్‌ను ఆయన ఆదేశించారు. అక్కడ ఏం జరిగిందో విచారించి నివేదిక ఇవ్వాలని మార్కాపురం ఆర్డీఓతో కలెక్టర్ చెప్పారు. ఎం జరిగిందంటే.. మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో చైర్మన్ పక్కనే ఎమ్మెల్యేకు కుర్చీ ఏర్పాటు చేయాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2012, జూన్ 26వ తేదీన జీఓ నంబర్ 348 విడుదల చేసింది. అనివార్య కారణాలతో ఎమ్మెల్యే, ఎంపీ సమావేశానికి హాజరు కాలేకపోయినా సీట్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్‌పై ఉంది. ఇప్పటికీ మూడు మున్సిపల్ సమావేశాలు జరగ్గా ఎమ్మెల్యేకు తగిన సీటు కేటాయించకపోవటంతో జంకె వెంకటరెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. దీనితో పాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కూడా మున్సిపల్ అధికారులు ప్రొటోకాల్ పాటించటం లేదు. గత నెల 25వ తేదీని పొదిలిలో ఎన్ఆర్డీడబ్ల్యూబీ పథకం ద్వారా రూ.30 లక్షలతో ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కూడా స్థానిక ఎమ్మెల్యే జంకెకు సమాచారం ఇవ్వలేదు. దీంతో పొదిలి ఆర్డబ్ల్యూఎస్ డీఈపై స్పీకర్, ఆ విభాగం ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్న అధికారుల తీరుపై పట్టణానికి చెందిన పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రొటోకాల్ ఉల్లంఘనపై విచారణ చేయనున్నట్లు ఇన్చార్జి ఆర్డీఓ భక్తవత్సాలరెడ్డి తెలిపారు. -
‘దొనకొండ’ను రాజధాని చేయాలి
మార్కాపురం : దొనకొండను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని మార్కాపురం, యర్రగొండపాలెం ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, విశ్రాంత హైకోర్టు జడ్జి పి.లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్జీఓ హోంలో గురువారం సాయంత్రం సీమాంధ్ర రాజధాని సాధన సమన్వయ కమిటీ సమావేశం న్యాయవాది జావీద్‌అన్వర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏపీ రాజధానిని దొనకొండలో ఏర్పాటు చేసేలా కృషి చేయాలన్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై మాట్లాడతామని స్పష్టం చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు మాట్లాడుతూ కేంద్రం ఏపీలోని అన్ని జిల్లాలకు వివిధ సంస్థలు, విద్యాలయాలను ప్రకటించినప్పటికీ, ప్రకాశం జిల్లాపై వివక్ష చూపిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని వర్గాల మెప్పు పొందేందుకు తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటిస్తూ శివరామకృష్ణన్ కమిటీని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విశ్రాంత హైకోర్టు జడ్జి లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ వాసులందరూ కర్నూలును రాజధానిగా చేయాలని కోరుతున్నారని, ప్రభుత్వం ఒకవేళ కర్నూలు వైపు మొగ్గుచూపకుంటే దొనకొండను రాజధానిగా చేయాలని కోరారు. అనంతపురం కంటే పశ్చిమ ప్రకాశం వెనుకబడి ఉన్న విషయాన్ని తాము గుర్తించామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి, రాజధాని ఏర్పాటు విషయమై త్వరలోనే రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీకి సమాంతరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి పి.నారాయణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ పనిచేస్తోందని విమర్శించారు. సీనియర్ పాత్రికేయుడు ఓఏ మల్లిక్ మాట్లాడుతూ రాజధాని కోసం ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాది అన్వర్ మాట్లాడుతూ చంద్రబాబు శివరామకృష్ణన్ కమిటీని ప్రభావితం చేయడం తగదన్నారు. సాధన కమిటీ కో-కన్వీనర్ గాయం నారాయణరెడ్డి మాట్లాడుతూ దొనకొండలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగించుకుని ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఝాన్సీ, ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బీవీ శ్రీనివాసశాస్త్రి, పెద్దారవీడు మండల వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గాలి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎదురు చూపు
మార్కాపురం: ఎంసెట్ కౌన్సెలింగ్‌పై రెండు రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రతిష్టంభన విద్యార్థుల్లో గందరగోళానికి దారి తీస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, రాష్ట్ర విభజన ఏర్పడి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత రాకపోవడం, సుప్రీంకోర్టులో కౌన్సెలింగ్‌పై, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విచారణ సాగుతుండటంతో ఎప్పుడు కౌన్సెలింగ్ జరుగుతుందో, తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో పలువురు విద్యార్థులు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చదువు నిమిత్తం వెళ్తుండగా, మరి కొంత మంది ఇతర డిగ్రీలపై ఆసక్తి చూపుతున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో మన రాష్ట్రంలో కూడా కౌన్సెలింగ్ తేదీలపై స్పష్టత లేదు. పలువురు విద్యార్థులు ఎంసెట్ కౌన్సెలింగ్‌లో జరుగుతున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్‌లో ర్యాంక్‌లు వచ్చిన విద్యార్థులు ప్రతి రోజు ఉన్నత విద్యామండలి కార్యాలయానికి ఫోన్ చేస్తున్నప్పటికీ అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. ఈ ప్రాంత విద్యార్థులు కౌన్సెలింగ్‌లో తాము హైదరాబాదులోని కళాశాలలను ఆప్షన్‌గా ఎంచుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా, రాదా అన్న అనుమానం ఏర్పడింది. 1956 ప్రాతిపాదికన తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తానని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఇక్కడి విద్యార్థులను ఆందోళనకు గురిచే స్తోంది. స్థానిక డాక్టర్ శామ్యూల్ జార్జి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రీ ఇంజినీరింగ్ కోర్సులో పలువురు విద్యార్థులు చేరారు. కౌన్సెలింగ్ తేదీల కోసం ఎదురు చూస్తున్నారు. -
ప్రాణాలు పోకముందే స్పందించండి
గిద్దలూరులో టెన్షన్ 1990లో ఎన్నికల ప్రచారానికి వెళుతున్న జీపు రాచర్ల మండలంలోని రామాపురం రైల్వే గేటు వద్ద గేటు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో జీపులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆతర్వాత కొన్నాళ్లకు గేటు ఏర్పాటు చేశారు. రాచర్ల మండలంలోని గుడిమెట్ట వద్ద రైల్వే క్రాసింగ్ రోడ్డు ఉంది. కానీ ఇక్కడ గేట్ లేదు. గేట్‌మ్యాన్ కూడా లేడు. రద్దీగా ఉండే ఈ రహదారిలో నిత్యం వాహనాలతో పాటు ప్రజలు తిరుగుతుంటారు. గేటు లేని కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ►అలాగే అచ్చంపల్లె, ఒద్దులవాగుపల్లె గ్రామాల మధ్య కూడా రైల్వే క్రాసింగ్ లేన్‌కు భద్రతా చర్యలు తీసుకోలేదు. గేటు లేని కారణంగా ప్రజలు ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటారు. ఏ సమయంలో రైలు బండ్లు వస్తాయో ఎవరికీ తెలియదు. పట్టాలపై వాహనాలు ఆగిపోతే పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించక తప్పదు. ►గిద్దలూరు మండలంలోని పెద్దచెరువు గ్రామానికి వెళ్లే రోడ్డులో రైల్వే ట్రాక్‌పై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. గేటు లేకపోవడమే దీనికి కారణం. కానీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. -గిద్దలూరు దర్శి నియోజకవర్గం ఘోరం ►కురిచేడు మండలంలో సుమారు 13 కిలోమీటర్ల మేర గుంటూరు-డోన్ రైల్వే మార్గం ఉంది. అయితే మండల పరిధిలోని వెంగాయపాలెం వద్ద రైల్వే క్రాసింగ్ గేటు లేదు.. కాపలాగానూ ఎవరూ ఉండరు. గేటు దాటుకుంటూ పశువులతో పాటు వ్యవసాయ కూలీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వ్యవసాయ సీజన్లో అయితే రాత్రి వేళ కూడా గేటు క్రాస్ చేయాల్సిందే. ►మండల కేంద్రం కురిచేడు వద్ద నాగార్జున సాగర్ కాలువ కట్టపై ఓ రైల్వే బ్రిడ్జి ఉంది. ఇక్కడ కూడా గేటు లేదు. ఈ మార్గం నుంచి కాటంవారిపల్లె, పేరంబొట్లవారిపాలెం గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పొలాల ప్రాంతం కావడంతో పశువులు అరకలతో, ఎడ్లబండ్లతో పట్టాలు దాటుతుంటాయి. రైతులు, రైతు కూలీలు, సాగర్ కాలువ పరిశీలనకు వెళ్లే అధికారులు కూడా ప్రమాదభరితంగా ఆ మార్గంలో తిరుగుతుంటారు. ►కాటంవారిపల్లెకు కూతవేటు దూరంలో మరో రైల్వే క్రాసింగ్ ఉంది. దీని ద్వారా కేవలం పంటపొలాలకు వెళ్లే ట్రాక్టర్లు, పశువులు, రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే పొట్లపాడు గ్రామంలో ఉన్న రైల్వే క్రాసింగ్ నుంచి పొట్లపాడు గ్రామస్తులు, మొండెద్దుల వారిపాలెం గ్రామస్తులు కూడా వెళుతుంటారు. ►దొనకొండ మండలంలోని గుంటూరు- గుంతకల్ రైల్వే లైన్లో ఐదు రైల్వే క్రాసింగ్ గేట్లున్నాయి. రెండు చోట్లు గేట్ మ్యాన్లుండగా... రైల్వేశాఖ మరో రెండు గేట్లను మూసివేసింది. అయితే రాజమక్కపల్లి గేటు మాత్రం ప్రమాద భరితంగా ఉంది. ఇక్కడ కాపలాగా ఎవరూ లేరు. భూమనపల్లి, మంగినపూడి, మల్లమ్మ పేట, కొచ్చెర్ల కోట, ఇండ్లచెరువు, దొనకొండ, వెంకటాపురం తదితర గ్రామాల ప్రజలు నిత్యం ఈ గేటు నుంచి పనులపై వెళతారు. ►నియోజకవర్గ పరిధిలోని ఈ క్రాసింగులన్నీ రైల్వేలేన్ ఏర్పాటైనప్పటి నుంచి ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు గేటు నిర్మించలేదు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేసే సమయంలో కూడా క్రాసింగ్ గేట్ల గురించి మరచి పోయారు. ఫలితంగా ఇప్పటికే జరిగిన ఎన్నో ప్రమాదాల్లో వందలాది పశువులు చనిపోయాయి. ఎంతమంది మనుషులు ప్రాణాలు విడిచారు. కానీ రైల్వే అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం విచారకరం. - తాళ్లూరు మార్కాపురంలో మరణాలు ►మార్కాపురం- తర్లుపాడు, మార్కాపురం -గజ్జలకొండ మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్‌లతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ మార్గంలో కాపలాలేని మూడు రైల్వేగేట్లున్నాయి. మార్కాపురం మండలంలోని నాయుడుపల్లె, భూపతిపల్లె, తర్లుపాడు మండలంలోని సూరేపల్లి దగ్గర గేట్మెన్ లేరు.. గేట్లూ లేవు. నాయుడుపల్లె వద్ద ఈ ఏడాది ఏప్రిల్‌లో గూడ్స్ రైలు ఆటోను ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గత ఏడాది తర్లుపాడు మండలం సూరేపల్లి దగ్గర రైలు ఢీకొనటంతో 3 గేదెలు మృతి చెందాయి. గత ఏడాది భూపతిపల్లె రైల్వే గేటు వద్ద రైలు.. ఆటోను ఢీకొన్న సంఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. సంపాదనే ధ్యేయంగా ఉండే రైల్వే శాఖకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు-గుంతకల్ మార్గంలో ప్రస్తుతం గూడ్స్ రైళ్ల రాకపోకలు ఎక్కువయ్యాయి. వీటికి తోడు గుంటూరు-కాచిగూడ, మచిలీపట్నం, ప్రశాంతి, తెనాలి ప్యాసింజర్ రైళ్లు తిరుగుతుంటాయి. ఏ సమయంలో ఏ బండి వస్తుందో వాహనదారులకు అర్థం కావడంలేదు. - మార్కాపురం -
హంస వాహనంపై చెన్నకేశవుడు
మార్కాపురం టౌన్, న్యూస్‌లైన్: శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి హంస వాహనోత్సవం శనివారం రాత్రి వైభవంగా జరిగింది. స్వామి వారు ప్రజాపతి అలంకారంలో హంస వాహనంపై పట్టణ మాడవీధుల్లో దర్శనమిచ్చారు. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొన్నారు. వేకువజామున మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులకు తిరుమంజనం, స్వామివారి మూలవిరాట్‌ను, అమ్మవారి మూలవిరాట్‌కు అర్చనలు, నిత్యహోమాలు మంగళ హారతులను అర్చకులు శ్రీపతికేశవచార్యులు, నంద్యాల తిరుమలచార్యులు నిర్వహించారు. రాత్రి 11 గంటలకు స్వామి ఉత్సవమూర్తులను ప్రజాపతి అలంకారంలో హంస వాహనంపై అలంకరించి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉభయదాతలుగా పైడా దివాకరరావు, మార్కాపురం పట్టణ ఆర్యవైశ్య సంఘంవారు వ్యవహరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ మేనేజర్ ఏవి.నారాయణరెడ్డి, సిబ్బంది పర్యవేక్షించారు. -
సీమాంధ్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
- ఒంగోలు పార్లమెంటు వైఎస్సార్ సీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి మార్కాపురం, న్యూస్‌లైన్ : సీమాంధ్ర అభివృద్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పట్టణంలోని నాదెళ్ల కల్యాణ మండపంలో ప్రముఖ పారిశ్రామికవేత్త నాదెళ్ల సుబ్రహ్మణ్యం శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సుకు వైవీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుతో సహా పట్టణంలో తాగునీటి సమస్యను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని వైవీ హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదు : కేపీ కొండారెడ్డి తాను 25 ఏళ్లు ఎమ్మెల్యేగా, జంకె వెంకటరెడ్డి ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణంలోని ఆర్యవైశ్యులను బెదిరించటం,బ్లాక్మెయిల్ చేయటం, లెసైన్స్‌లు రద్దు చేయించటం, అధికారులతో దాడులు చేయించటం వంటి నీచ పనులు చేయలేదని మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి అన్నారు. ఆర్యవైశ్యులకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఎవరికీ భయపడకుండా నిర్భయంగా ఓటు వేసుకోవాలని సూచించారు. ఏ సమయంలో ఎలాంటి కష్టం వచ్చినా పరిష్కరించేందుకు తనతో పాటు జంకె వెంకటరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మీ వెంట ఉంటారని హామీ ఇచ్చారు. మా వద్ద ‘హిమ్’ డబ్బుల్లేవ్.. వైఎస్సార్ సీపీ నేతలెవరూ పేద ప్రజలు దాచి పెట్టుకున్న హిమ్ సంస్థలోని డబ్బును తినలేదని పరోక్షంగా టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిని ఉద్దేశించి కేపీ కొండారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఆర్యవైశ్యులంతా జంకె వెంకటరెడ్డితో పాటు వైవీ సుబ్డారెడ్డికి ఓటు వేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్ పదవిని తొలుత ఆర్యవైశ్యులకే కేటాయించామని, పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో డాక్టర్ కనకదుర్గను ఎంపిక చేశామని కొండారెడ్డి వివరణ ఇచ్చారు. అభివృద్ధి చేస్తా : జంకె తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, నీతి నిజాయితీగా పనిచేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే అభ్యర్థి జంకె వెంకటరెడ్డి అన్నారు. తనకు, వైవీకి ఓట్లు వేయాలని జంకె కోరారు. ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని దృష్టిలో ఉంచుకుని ఆర్యవైశ్యులంతా వైఎస్సార్ సీపీకి ఓటు వేయాలని మాజీ కౌన్సిలర్, ఆర్యవైశ్య సంఘ నాయకుడు చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, మేడా సుబ్బారావులు పిలుపునిచ్చారు. అనంతరం ఆర్యవైశ్య నాయకులు నాదెళ్ల సుబ్రహ్మణ్యం, నాదెళ్ల చంద్రమౌళి, హరగోపాల్, సురేష్‌లు కలిసి ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి. జంకె వెంకటరెడ్డి, కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, తాటిశెట్టి వినయ్‌కుమార్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాజా, మార్కాపురం, పొదిలి మార్కెట్ యార్డు చైర్మన్లు గుంటక సుబ్బారెడ్డి, రమణారెడ్డి, పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, ఆర్యవైశ్య సంఘ నాయకులు గార్లపాటి ఆంజనేయులు, వూటుకూరి రామకృష్ణ, పరుచూరి చంద్ర, మొగిలి సుబ్బరత్నం, నేరెళ్ల భద్రి, గుంపల్లి రత్నంశెట్టి, గ్రంధే రవి, ఇమ్మడిశెట్టి వీరారావు, చాటకొండ చంద్రశేఖర్, తాళ్లపల్లి ప్రసాద్, కాళ్ల ఆది, రమేష్ తదితరులు పాల్గొన్నారు.