స్వాప్నికళ | Markapur crochet designer Swapnika Raagni receives Guinness certificate | Sakshi
Sakshi News home page

స్వాప్నికళ

Published Tue, Oct 22 2024 12:14 AM | Last Updated on Tue, Oct 22 2024 9:43 AM

Markapur crochet designer Swapnika Raagni receives Guinness certificate

ఆస్ట్రేలియాకు చెందిన ప్రసిద్ధ క్రోచెట్‌ ఆర్టిస్ట్‌ జెన్నీ కింగ్‌ నోటి నుంచి వినిపించే  మాట... ‘అల్లికల కళకు మాంత్రిక శక్తి  ఉంది. అది మన మనసును ఎప్పుడూ  ఆహ్లాదభరితం చేస్తుంది. మంత్రముగ్ధుల్ని  చేసే మనోహర కళ ఇది’.
మార్కాపురానికి చెందిన స్వాప్నిక రాజ్ఞీ  చిన్నప్పుడే ఆ మంత్రముగ్ధకళలలో  ఓనమాలు నేర్చుకుంది. ఆ కళ ఇచ్చిన ఉత్తేజం ఊరకేపోలేదు. అల్లికల కళలో చేయి తిరిగిన స్వాప్నిక పేరు  గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది.

ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన స్వాప్నిక అమ్మమ్మ తోటకూర క్రిస్టియనమ్మ పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ తీరిక వేళల్లో ఇంట్లో అల్లికలు (క్రోచెట్స్‌) చేసేది. అమ్మమ్మ అల్లికల పనిలో ఉన్నప్పుడు స్వాప్నిక ఆసక్తిగా గమనించేది. అలా ‘అమ్మమ్మ అల్లికల స్కూల్‌’ లో స్టూడెంట్‌గా చేరింది. గురువుగారి ప్రియ శిష్యురాలు అయింది. అల్లికలకు సంబంధించి ఎన్నో మెళకువలు అవలీలగా నేర్చుకుంది.

కొత్త అల్లికల గురించి ఆలోచించడమే కాదు, క్రోచెట్స్‌కు సంబంధించి కొత్త రికార్డ్‌ల గురించి తెలుసుకోవడం అంటే స్వాప్నికకు ఇష్టం. మదర్‌ ఇండియాస్‌ క్రోచెట్‌ క్వీన్స్‌ (ఎంఐక్యూ)లో ఆరు వేలమందికి పైగా సభ్యులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రోచెట్‌ ఆర్టిస్ట్‌లకు స్ఫూర్తినిచ్చే సంస్థ ఇది. ‘క్రోచెట్‌ క్వీన్స్‌’కు చెందిన మహిళలు అతి పెద్ద క్రోచెటెడ్‌ దుప్పటి, అతి పెద్ద క్రోచెటెడ్‌ స్కార్ఫ్, అతి పెద్ద క్రోచెటెడ్‌ క్రిస్మస్‌ డెకరేషన్‌... మొదలైన వాటితో రికార్డ్‌ సృష్టించారు.

‘ఎంఐక్యూ’లాంటి సంస్థల రికార్డుల గురించి తెలుసుకునే క్రమంలో స్వాప్నికకు రికార్డ్‌లపై ఆసక్తి మొదలైంది.

‘గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌’ అంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించే సవాలు. అలాంటి అరుదైన సవాలును స్వీకరించే అవకాశం స్వాప్నికకు విశాఖపట్టణంలో వచ్చింది.

విశాఖపట్టణానికి చెందిన ‘మహిళా మనోవికాస్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ క్రియేషన్‌’ సంస్ధ క్రోచెట్స్‌కు సంబంధించి  నిర్ణీత వ్యవధిలో అత్యధిక కళాకృతులు తయారు చేయాలని సవాలు ఇచ్చింది. ఈ సవాలుకు ‘సై’ అంటూ స్వాప్నిక బృందంలోని మహిళలు అతి తక్కువ సమయంలో 58,112 క్రోచెట్‌ స్క్వేర్‌లను తయారుచేసి ‘లార్జెస్ట్‌ డిస్‌ప్లే ఆఫ్‌ క్రోచెట్స్‌ స్వే్కర్‌’ అనే టైటìఃల్‌ సొంతం చేసుకున్నారు. గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌ నెలకొల్పారు. గిన్నిస్‌ రికార్డు కోసం 20వేల క్రోచెట్స్‌ స్క్వేర్స్‌ తయారు చేయాల్సి ఉండగా స్వాప్నిక బృందం 58,112 తయారుచేసి వరల్డ్‌ రికార్డు సాధించింది.
‘గిన్నిస్‌ రికార్డ్‌ ఇచ్చిన ఉత్సాహంతో భవిష్యత్‌లో మరిన్ని రికార్డ్‌లు నెలకొల్పుతాం’ అంటుంది ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో స్వాప్నిక రాజ్ఞీ.
 

కూచిపూడి నుంచి కరాటే వరకు
‘నేర్చుకుంటే పోయేదేమీ లేదు... వచ్చేదే తప్ప’ అన్నట్లుగా ఉంటుంది స్వాప్నిక ఉత్సాహం. అల్లికల కళలో చేయి తిరిగిన స్వాప్నిక అక్కడితో ఆగిపోలేదు. తల్లిదండ్రులు నాగెళ్ల లీనా కెఫీరాల, డాక్టర్‌ కొండేపోగు డేవిడ్‌ లివింగ్‌ స్టన్‌ ్రపోత్సాహంతో కూచిపూడి నేర్చుకుంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు గెలుచుకుంది.  కరాటేలో కూడా ప్రావీణ్యం సంపాదించింది. బిఫార్మసీ చదివే రోజుల్లో స్వాప్నిక తన చేతులపై జీపును నడిపించుకుని సాహసవంతమైన ఫీట్‌ చేసింది. వృత్తిరీత్యా ఫార్మసిస్టు అయిన స్వాప్నిక ప్రవృత్తిరీత్యా ఆర్టిస్ట్‌. ఎప్పటికప్పుడు కొత్త కళలపై ఆసక్తి చూపుతుంటుంది.

– గోపాలుని లక్ష్మీ నరసింహారావు, 
‘సాక్షి’, మార్కాపురం, ప్రకాశం జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement