
ఓ మూషికం సరికొత్త రికార్డ్‌లను సృష్టించింది. బాంబుల నుంచి ఓ దేశాన్ని కాపాడడంలో పాత రికార్డ్‌లన్నీ తిరగ రాసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా బాంబులు గుర్తించిన ఎలుకల జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కెక్కింది.
కాంబోడియా దేశానికి చెందిన భూముల్లో ఉన్న బాంబులను గుర్తించడమే ఎలుక రోనిన్ పని. తాజాగా రోనిన్ బాంబుల వేటలో ప్రపంచంలోనే తొలిసారి వందకు పైగా ల్యాండ్‌మైన్లు, ఇతర యుద్ధ అవశేషాలను గుర్తించిన ఎలుకగా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
అఫ్రికన్ జెయింట్ పౌచ్‌డ్ రాట్ రోనిన్ 2021 నుండి ఇప్పటివరకు భూమిలో దాచిన 109 బాంబులు, 15 పేలని బాంబులను గుర్తించినట్లు జంతువులకు శిక్షణ ఇచ్చే ఏపోపో అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. తద్వారా రోనిన్ ఇప్పుడు ఎలుకలలో అత్యధిక మైన్లు గుర్తించిన రికార్డును సొంతం చేసుకుందని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా, కాంబోడియా ప్రజల ప్రాణాల్ని కాపాడడంలో రొనిన్ బాధ్యతలు అత్యద్భుతమని కొనియాడింది.
ఎలుక రోనిన్ గురించి పలు ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్ల వయస్సున్న రోనిన్ మంచి పనిమంతుడు. అందరితో స్నేహంగా ఉండటమే కాదు..శాంతంగా ఉంటాడట. రోనిన్ విజయానికి కారణం ఏకాగ్రత, ఒత్తిడిలో ఎలాంటి ఆందోళన చెందకుండా ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో సిద్ధహస్తుడు. అంతేకాదు, రోనిన్ తెలివితేటలు, సహజమైన ఆసక్తి నిత్యం చురుగ్గా ఉంచేందుకు దోహదం చేస్తున్నాయి. అందుకే కాబోలు భూమిలో బాంబులు గుర్తించడం రోనిన్‌కు ఒక ఆటలా ఉంటుంది’ అని ఏపోపో ప్రతినిధి లిల్లీ షాలోమ్ అన్నారు.
రోనిన్ సంరక్షణ చూసుకునే ఫానీ మాట్లాడుతూ.. ‘రోనిన్ విజయాలు ఎలుకల అసాధారణ సామర్థ్యానికి నిదర్శనం. రోనిన్‌ను కేవలం బాంబుల్ని నిర్విర్యం చేసే ఎలుక అని అనుకోం. మేం అతన్నిఫ్రెండ్‌గా, సహచరుడిగా భావిస్తాం’ అని అన్నారు.
ఏపోపో సంస్థ దాదాపు ముప్పై సంవత్సరాలుగా భూమిలోని బాంబులను గుర్తించేందుకు ఎలుకలకు శిక్షణ ఇస్తోంది. రోనిన్,అతని సహచరులు ప్రతి రోజూ మైన్లు ఉండే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తారు. మైన్లు ఉన్నాయన్న అనుమానం ఉన్న ప్రదేశాల్లో వాటిని విడిచిపెడతారు. ఎలుక తమ అసాధారణమైన ప్రతిభతో మైన్లు ఉన్న ప్రదేశంపై ఉన్న మట్టిని కొరుకుతాయి. అలా ఓ నిర్ధిష్ట వయస్సు వచ్చిన తర్వాత విధుల నుంచి పదవీ విరమణ చేస్తాయి.
కాంబోడియాలో ఇరవై ఏళ్లపాటు అంతర్యుద్ధాలు జరిగాయి. చివరికి యుద్ధాలు 1998లో ముగిశాయి. అయినప్పటికీ ఇంకా ప్రపంచంలో అత్యధికంగా ల్యాండ్ మైన్‌లు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా ఉంది. ఇప్పటికీ 40 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో కాంబోడియా భూముల్లో ల్యాండ్ మైన్లతో పాటు ఇంకా పేలని పేలుడు పదార్ధాలు ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అలాగే ఈ దేశంలో సగటున 40వేల మందికి పైగా ఈ ల్యాండ్ మైన్ల వల్ల కాళ్లను పోగొట్టుకున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
రోనిన్‌కు ముందు మగావా అనే ఎలుకనే అత్యధిక బాంబులు గుర్తించాడు. మగావా 2021లో పదవీ విరమణ చేసినప్పటికీ, అయిదేళ్ల కాలంలో 71 మైన్లు, 38 పేలని బాంబులను గుర్తించాడు. అతడికి సేవల గుర్తింపుగా పీడీఎస్‌ఏ అనే జంతు సంక్షేమ సంస్థ నుండి సాహస వీరుడి పతాకాన్ని అందుకున్నాడు. 2022 జనవరిలో వృద్ధాప్యంతో మగవా మరణించాడు.