‘దొనకొండ’ను రాజధాని చేయాలి | 'Should make capital donakonda | Sakshi
Sakshi News home page

‘దొనకొండ’ను రాజధాని చేయాలి

Published Fri, Aug 15 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

'Should make capital donakonda

మార్కాపురం : దొనకొండను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని మార్కాపురం, యర్రగొండపాలెం ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, విశ్రాంత హైకోర్టు జడ్జి పి.లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్జీఓ హోంలో గురువారం సాయంత్రం సీమాంధ్ర రాజధాని సాధన సమన్వయ కమిటీ సమావేశం న్యాయవాది జావీద్‌అన్వర్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏపీ రాజధానిని దొనకొండలో ఏర్పాటు చేసేలా  కృషి చేయాలన్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై మాట్లాడతామని స్పష్టం చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు మాట్లాడుతూ కేంద్రం ఏపీలోని అన్ని జిల్లాలకు వివిధ  సంస్థలు, విద్యాలయాలను ప్రకటించినప్పటికీ, ప్రకాశం జిల్లాపై వివక్ష చూపిందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని వర్గాల మెప్పు పొందేందుకు తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటిస్తూ శివరామకృష్ణన్ కమిటీని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విశ్రాంత హైకోర్టు జడ్జి లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ వాసులందరూ కర్నూలును రాజధానిగా చేయాలని కోరుతున్నారని, ప్రభుత్వం ఒకవేళ కర్నూలు వైపు మొగ్గుచూపకుంటే దొనకొండను రాజధానిగా చేయాలని కోరారు. అనంతపురం కంటే పశ్చిమ ప్రకాశం వెనుకబడి ఉన్న విషయాన్ని తాము గుర్తించామన్నారు.

ఈ ప్రాంత అభివృద్ధి, రాజధాని ఏర్పాటు విషయమై త్వరలోనే రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీకి సమాంతరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి పి.నారాయణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ పనిచేస్తోందని విమర్శించారు. సీనియర్ పాత్రికేయుడు ఓఏ మల్లిక్ మాట్లాడుతూ రాజధాని కోసం ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాది అన్వర్ మాట్లాడుతూ చంద్రబాబు శివరామకృష్ణన్ కమిటీని ప్రభావితం చేయడం తగదన్నారు.

సాధన కమిటీ కో-కన్వీనర్ గాయం నారాయణరెడ్డి మాట్లాడుతూ దొనకొండలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగించుకుని ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఝాన్సీ, ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బీవీ శ్రీనివాసశాస్త్రి, పెద్దారవీడు మండల వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గాలి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement