ప్రొటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్‌కు ఎమ్మెల్యే జంకె లేఖ | janke venkata reddy wrote letter to speaker on protocol violations | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్‌కు ఎమ్మెల్యే జంకె లేఖ

Published Sun, Nov 9 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

janke venkata reddy wrote letter to speaker on protocol violations

 మార్కాపురం : నియోజకవర్గంలో వివిధ శాఖల అధికారుల ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యుడిని తప్పకుండా ఆహ్వానించాలన్న నిబంధనకు అధికారులు నీళ్లొదలడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు.

ఈ మేరకు మార్కాపురం మున్సిపల్ కమిషనర్ ప్రొటోకాల్ ఉల్లంఘించారని శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై అసెంబ్లీ కార్యదర్శి స్పందించారు. ఈ నెల 13వ తేదీలోపు విచారణ చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ విజయకుమార్‌ను ఆయన ఆదేశించారు. అక్కడ ఏం జరిగిందో విచారించి నివేదిక ఇవ్వాలని మార్కాపురం ఆర్డీఓతో కలెక్టర్ చెప్పారు.

 ఎం జరిగిందంటే..
 మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో చైర్మన్ పక్కనే ఎమ్మెల్యేకు కుర్చీ ఏర్పాటు చేయాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2012, జూన్ 26వ తేదీన జీఓ నంబర్ 348 విడుదల చేసింది. అనివార్య కారణాలతో ఎమ్మెల్యే, ఎంపీ సమావేశానికి హాజరు కాలేకపోయినా సీట్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్‌పై ఉంది.

ఇప్పటికీ మూడు మున్సిపల్ సమావేశాలు జరగ్గా ఎమ్మెల్యేకు తగిన సీటు కేటాయించకపోవటంతో జంకె వెంకటరెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. దీనితో పాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కూడా మున్సిపల్ అధికారులు ప్రొటోకాల్ పాటించటం లేదు. గత నెల 25వ తేదీని పొదిలిలో ఎన్‌ఆర్‌డీడబ్ల్యూబీ పథకం ద్వారా రూ.30 లక్షలతో ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కూడా స్థానిక ఎమ్మెల్యే జంకెకు సమాచారం ఇవ్వలేదు.

దీంతో పొదిలి ఆర్‌డబ్ల్యూఎస్ డీఈపై స్పీకర్, ఆ విభాగం ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్న అధికారుల తీరుపై పట్టణానికి చెందిన పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రొటోకాల్ ఉల్లంఘనపై విచారణ చేయనున్నట్లు ఇన్‌చార్జి ఆర్డీఓ భక్తవత్సాలరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement