Janke Venkata Reddy
-
ప్రొటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్‌కు ఎమ్మెల్యే జంకె లేఖ
మార్కాపురం : నియోజకవర్గంలో వివిధ శాఖల అధికారుల ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యుడిని తప్పకుండా ఆహ్వానించాలన్న నిబంధనకు అధికారులు నీళ్లొదలడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు మార్కాపురం మున్సిపల్ కమిషనర్ ప్రొటోకాల్ ఉల్లంఘించారని శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై అసెంబ్లీ కార్యదర్శి స్పందించారు. ఈ నెల 13వ తేదీలోపు విచారణ చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ విజయకుమార్‌ను ఆయన ఆదేశించారు. అక్కడ ఏం జరిగిందో విచారించి నివేదిక ఇవ్వాలని మార్కాపురం ఆర్డీఓతో కలెక్టర్ చెప్పారు. ఎం జరిగిందంటే.. మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో చైర్మన్ పక్కనే ఎమ్మెల్యేకు కుర్చీ ఏర్పాటు చేయాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2012, జూన్ 26వ తేదీన జీఓ నంబర్ 348 విడుదల చేసింది. అనివార్య కారణాలతో ఎమ్మెల్యే, ఎంపీ సమావేశానికి హాజరు కాలేకపోయినా సీట్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్‌పై ఉంది. ఇప్పటికీ మూడు మున్సిపల్ సమావేశాలు జరగ్గా ఎమ్మెల్యేకు తగిన సీటు కేటాయించకపోవటంతో జంకె వెంకటరెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. దీనితో పాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కూడా మున్సిపల్ అధికారులు ప్రొటోకాల్ పాటించటం లేదు. గత నెల 25వ తేదీని పొదిలిలో ఎన్ఆర్డీడబ్ల్యూబీ పథకం ద్వారా రూ.30 లక్షలతో ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కూడా స్థానిక ఎమ్మెల్యే జంకెకు సమాచారం ఇవ్వలేదు. దీంతో పొదిలి ఆర్డబ్ల్యూఎస్ డీఈపై స్పీకర్, ఆ విభాగం ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్న అధికారుల తీరుపై పట్టణానికి చెందిన పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రొటోకాల్ ఉల్లంఘనపై విచారణ చేయనున్నట్లు ఇన్చార్జి ఆర్డీఓ భక్తవత్సాలరెడ్డి తెలిపారు. -
‘దొనకొండ’ను రాజధాని చేయాలి
మార్కాపురం : దొనకొండను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని మార్కాపురం, యర్రగొండపాలెం ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, విశ్రాంత హైకోర్టు జడ్జి పి.లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్జీఓ హోంలో గురువారం సాయంత్రం సీమాంధ్ర రాజధాని సాధన సమన్వయ కమిటీ సమావేశం న్యాయవాది జావీద్‌అన్వర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏపీ రాజధానిని దొనకొండలో ఏర్పాటు చేసేలా కృషి చేయాలన్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై మాట్లాడతామని స్పష్టం చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు మాట్లాడుతూ కేంద్రం ఏపీలోని అన్ని జిల్లాలకు వివిధ సంస్థలు, విద్యాలయాలను ప్రకటించినప్పటికీ, ప్రకాశం జిల్లాపై వివక్ష చూపిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని వర్గాల మెప్పు పొందేందుకు తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటిస్తూ శివరామకృష్ణన్ కమిటీని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విశ్రాంత హైకోర్టు జడ్జి లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ వాసులందరూ కర్నూలును రాజధానిగా చేయాలని కోరుతున్నారని, ప్రభుత్వం ఒకవేళ కర్నూలు వైపు మొగ్గుచూపకుంటే దొనకొండను రాజధానిగా చేయాలని కోరారు. అనంతపురం కంటే పశ్చిమ ప్రకాశం వెనుకబడి ఉన్న విషయాన్ని తాము గుర్తించామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి, రాజధాని ఏర్పాటు విషయమై త్వరలోనే రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీకి సమాంతరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి పి.నారాయణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ పనిచేస్తోందని విమర్శించారు. సీనియర్ పాత్రికేయుడు ఓఏ మల్లిక్ మాట్లాడుతూ రాజధాని కోసం ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాది అన్వర్ మాట్లాడుతూ చంద్రబాబు శివరామకృష్ణన్ కమిటీని ప్రభావితం చేయడం తగదన్నారు. సాధన కమిటీ కో-కన్వీనర్ గాయం నారాయణరెడ్డి మాట్లాడుతూ దొనకొండలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగించుకుని ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఝాన్సీ, ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బీవీ శ్రీనివాసశాస్త్రి, పెద్దారవీడు మండల వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గాలి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానంలో ‘పొదిలి’ వాసులు ఆదర్శం
పొదిలి : రక్తదానం చేసి ఆపదలో ఉన్న ప్రాణాలు కాపాడడంలో తామే ముందుంటామని మండల వాసులు నిరూపించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ జీవీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. సుమారు 270 మంది రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు ప్రతినిధులు ఆ మేరకు సిద్ధం కాకపోవడంతో 190 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి శిబిరాన్ని సందర్శించి, రక్తదాతలకు పండ్లు పంపిణీ చేశారు. మంచి కార్యక్రమం నిర్వహించారంటూ ఎంపీడీఓని అభినందించారు. జిల్లాలో ఎప్పుడూ ఇంత స్పందన రాలేదని బ్లడ్ బ్యాంకు డాక్టర్ పి.సత్యనారాయణ చెప్పారు. స్టెప్ అధికారి శ్రీమన్నారాయణ శిబిరాన్ని పర్యవేక్షించారు. రక్తదాతలకు ఎంపీడీఓ అభినందనలు తెలిపారు. పండ్ల వ్యాపారుల సంఘ అధ్యక్షుడు షేక్ సుభాని, వైఎస్ఆర్ సీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు గునుపూడి భాస్కర్ రక్తదాతలకు పండ్లు, రొట్టెలు, జ్యూస్, బిస్కట్లు అందచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కోవెలకుంట్ల నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యుడు సాయి రాజేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్‌వలి, సీడీపీఓ రేచల్ సరళ, ఈఓఆర్డీ జి.నాగేశ్వరరావు, క్రిష్ణయ్య, వైఎస్ఆర్ టీఎఫ్ జిల్లా నాయకులు సానికొమ్ము జగన్మోహనరెడ్డి, ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు నారు శ్రీనివాసరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జి.శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, రాచమల్ల వెంకటరామిరెడ్డి, కంచర్ల శ్రీనివాసులు, పులి వెంకటేశ్వరరెడ్డి, కె.చిన్న సోమయ్య పాల్గొన్నారు. -
మార్కాపురంలో వలసల జోరు
మార్కాపురం, న్యూస్‌లైన్: పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్థానిక బ్రహ్మం గారి మఠం ప్రాంతానికి చెందిన 300 మంది తెలిపారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, పట్టణ కన్వీనర్ బట్టగిరి తిరుపతిరెడ్డి సమక్షంలో వారంతా గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. కాలనీకి చెందిన వేశపోగురాజు మాట్లాడుతూ తమ ప్రాంతం లో సీసీరోడ్లు, కాలువలు, వాటర్ లైన్స్, మరుగుదొడ్లు, శ్మశానాలు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, ఉన్నత తరగతులు ఏర్పాటు చేయాలని గతంలో వార్డుల నాయకులకు చెప్పినా పట్టించు కోలేదన్నారు. కాలనీల్లోని సమస్యలు పరిష్కరించగల సత్తా ఉన్న వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. కటికెల గురవయ్య, కొండేటి ఆవులయ్య, ఎన్.డేవిడ్, గుంటి దేవరాజు, వి.శేఖర్, బి.నారాయణ, జి.రంగయ్య, డి.పేతురు, పి.రాముడు తదితరులు పార్టీలో చేరారు. ఏకలవ్య కాలనీలో.. టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ కొమ్ము యోగమ్మ నేతృత్వంలో ఏకలవ్యకాలనీలో సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డిల నేతృత్వంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలోనే నూతన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నట్లు వారు తెలిపారు. డేవిడ్, పౌల్‌రాజు, తదితర నాయకులు పాల్గొన్నారు. 31వ వార్డులో.. స్థానిక కాలేజీ రోడ్డులోని 31వ వార్డులో సుమారు 100 మంది టీడీపీ కార్యకర్తలు వంగూరి రూతమ్మ నేతృత్వంలో గురువారం సాయంత్రం వైఎస్సార్ సీపీలో చేరారు. నందిగం డేవిడ్, ఆదిమూలపు క్రిష్టయ్య, వంగూరి జానీ, ఏసోబు, అఖిల్, ప్రశాంత్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు ఆర్.తిరునారాయణ, ఎం.మహేశ్వరరెడ్డి, పంబి వెంకటరెడ్డి, పాపిరెడ్డి సుబ్బారెడ్డి, గొలమారి శివారెడ్డి, ఇంజినీర్ వెంకటరెడ్డి, కురాటి చెన్నకేశవులు, మార్కెట్ యార్డు చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, గుంటక వెంకటరెడ్డి, కంది ప్రమీలారెడ్డి, ఆవులమంద పద్మ, ఒంటెద్దు రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 31వ అభ్యర్థి జి.రోజ్లిడియాతో కలిసి డాక్టర్ కనకదుర్గ ప్రచారం నిర్వహించగా ర్యాలీలో కేపీ, జంకె, వెన్నా హనుమారెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యాలయం ప్రారంభం 17వ బ్లాక్‌లో వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి సతీమణి కె.సుబ్బమ్మ గురువారం రాత్రి ప్రారంభించారు. అభ్యర్థి బుశ్శెట్టి నాగేశ్వరరావుతో పాటు పార్టీ నాయకులు ఎంవీ రమణ, ఇస్మాయిల్, బొందిలి కాశిరాంసింగ్, కనిగిరి వెంకటేశ్వర్లు, పెండ్యాల వెలుగొండయ్య, వెంకటేశ్వర్లు, రిటైర్డ్ తహసీల్దార్ హుస్సేన్‌పీరా, షేక్ మన్సూర్, రాధాకృష్ణ పాల్గొన్నారు.