
కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని తాను ఏనాడూ అనలేదని గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: తనపై తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న విమర్శలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి స్పందించారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని తాను ఏనాడూ అనలేదని, రాజకీయం చేస్తున్నానని అనవసరంగా తనను విమర్శిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళిసై.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా భేటీ తరుణంలో సోమవారం మరోసారి ఈ విషయమై స్పందించారు. ‘తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా నన్ను విమర్శించారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ప్రజలను కలిస్తే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏ పదవిలో ఉన్నా.. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం’ అని తమిళిసై పేర్కొన్నారు.
ఇక తెలంగాణ ప్రభుత్వంతో నడుస్తున్న ప్రోటోకాల్ వివాదంపైనా ఆమె స్పందించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు.. రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదని, అలాంటి ఆలోచన కూడా లేదని ఆమె స్పష్టం చేశారు.