CM KCR Govt Vs Governor Tamilisai Soundararajan On TSRTC Bill - Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బిల్లుపై లొల్లి!.. గవర్నర్‌ వర్సెస్‌ సర్కార్‌గా సాగుతున్న వివాదం 

Published Sun, Aug 6 2023 1:06 AM | Last Updated on Sun, Aug 6 2023 10:55 AM

CM KCR Govt VS Tamilisai Soundararajan On RTC Bill - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన ‘ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023’ అంశం మలుపుల మీద మలుపులు తీసుకుంటోంది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సాగుతున్న ఉత్తర, ప్రత్యుత్తరాలు, ప్రశ్నలు, సమాధానాలు, వివరణలు.. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.  శుక్రవారం గవర్నర్‌ తమిళిసై ఆర్టీసీ బిల్లుపై ఐదు ప్రధాన సందేహాలను లేవనెత్తుతూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు కోరారు.

ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా అంశాలపై వివరణలు ఇస్తూ గవర్నర్‌ కార్యదర్శికి శనివారం లేఖ పంపారు. కానీ ఈ వివరణలతో గవర్నర్‌ సంతృప్తి చెందకపోవడం, పలు అంశాలపై పూర్తిస్థాయి స్పష్టత కోరడం, ఇదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి.. వారి ప్రయోజనం కోసమే తాను ప్రయత్నిస్తున్నట్టు చెప్పడం వంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తే.. రెండు గంటల్లోనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి అనుమతిస్తానని గవర్నర్‌ పేర్కొన్నట్టు తెలిసింది. గవర్నర్‌ ఆదివారం ఉదయానికల్లా ఆర్టీసీ బిల్లుకు అనుమతిస్తే.. అసెంబ్లీ సమావేశాల చివరిరోజున సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునే అవకాశాలు ఉన్నాయి. 

రాజుకుంటున్న రాజకీయాలు 
రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత నెల 31న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో.. ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే ఆర్టీసీ బిల్లు ఆర్థిక సంబంధిత అంశాలతో ముడిపడి ఉండటంతో, అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ అనుమతి కోసం ఈనెల 2న రాజ్‌భవన్‌కు పంపించింది.

గవర్నర్‌ ఆ బిల్లును పరిశీలించి.. పలు సందేహాలు వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వంలో అలజడి మొదలైంది. గవర్నర్‌ కావాలనే బిల్లును ఆపారంటూ బీఆర్‌ఎస్‌ నుంచి రాజకీయ విమర్శలు వచ్చాయి. దీంతో కనీసం బిల్లును చదవనీయకుండా గవర్నర్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ బీజేపీ నేతలు ప్రతివిమర్శలకు దిగారు.

మరోవైపు బిల్లుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడించగా.. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం నుంచి వివరణలు కోరానని గవర్నర్‌ తమిళిసై ప్రకటించారు. శనివారం రాత్రి తర్వాత కూడా ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. 
 
తొలుత గవర్నర్‌ కోరిన వివరణలు, ప్రభుత్వమిచ్చిన సమాధానాలు ఇవీ.. 
 1. గవర్నర్‌: 1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాలు, ఇతర సాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు. 
 ప్రభుత్వం: సమైక్య రాష్ట్రంలో ఏపీఎస్‌ ఆర్టీసీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడి వాటాలు రూ.61.07 కోట్లు, రూ.140.20 కోట్లుగా ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకే ఈ బిల్లు పరిమితం. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఇతర అన్ని విషయాల్లో ఆర్టీసీ సంస్థ ప్రస్తుత స్వరూపం, రీతిలో యథాతథంగా పనిచేస్తుంది. వాటాలు, రుణాలు, గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయాలు, ఇతర అంశాల నిర్వహణ విషయంలో, ఆర్టీసీ చట్టం–1950 కింద అపెక్స్‌ బాడీగా ఆర్టీసీ బోర్డు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన అంశాలను బిల్లులో పొందుపర్చాల్సిన అవసరం లేదు. 
 
2: రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్‌  ఐగీ ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవు. 
ప్రభుత్వం: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినా.. సంస్థ ప్రస్తుత స్వరూపంలోనే కొనసాగుతుంది. రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారమయ్యే వరకు సంస్థ స్వరూపం మారదు. విభజన అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. పూర్తయ్యే వరకు ఇదే విధానం కొనసాగుతుంది. 
 
3: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని ప్రభుత్వం చెప్తోంది. మరి వారి సమస్యలకు పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా? వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి? 
ప్రభుత్వం: ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యాక.. వారికి పారిశ్రామిక వివాదాల చట్టం వర్తింపు అంశం అందులోని నిబంధనలకు లోబడి ఉంటుంది. ఈ విషయంలో బిల్లులో ఎలాంటి నిబంధనలు పొందుపర్చాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తేనే వారికి అత్యుత్తమ ప్రయోజనాలు లభిస్తాయి. 
 
4: ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్‌ ఇస్తారా? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వండి. 
ప్రభుత్వం: ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ నిబంధనలు, ఇతర ప్రయోజనాల నిబంధనలను ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేసే విషయంలో బిల్లులో ఎలాంటి అస్పష్టత లేదు. ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా.. అలాంటి నిబంధనలను రూపొందించి, ప్రకటించే అధికారాలను బిల్లులోని 4, 5 సెక్షన్లు రాష్ట్ర ప్రభుత్వానికి కల్పిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం అన్ని భాగస్వామ్యపక్షాలతో విస్తృత చర్చలు జరిపి ఓ అభిప్రాయానికి వస్తుంది. అప్పటిదాకా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుత ఆర్టీసీ నియమ, నిబంధనలే వర్తిస్తాయి. 
 
5: ప్రభుత్వ ఉద్యోగుల్లో కండక్టర్, కంట్రోలర్‌ వంటి పోస్టులు లేవు. మరి ప్రమోషన్లు, కేడర్‌ నార్మలైజేషన్‌ అంశాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు జరిగే న్యాయం, ఇతర ప్రయోజనాలపై స్పష్టమైన వివరాలు ఇవ్వండి. 
ప్రభుత్వం: ఇలాంటి అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన నిబంధనలు బిల్లులోని సెక్షన్‌ 4, 5లలో పొందుపరిచాం. జీతాలు, అలవెన్సుల విషయంలో ఏ ఉద్యోగినీ ఇబ్బందిపెట్టం. విలీనం తర్వాత ఆర్టీసీలోని ప్రస్తుత కేటగిరీలు, కేడర్ల కొనసాగింపునకు ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని నిషేధించే.. ‘తెలంగాణ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ఎంప్లాయీస్‌ ఆఫ్‌ స్టేట్‌ గవర్నమెంట్‌ పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్స్‌ ఇన్‌టూ పబ్లిక్‌ సర్వీస్‌ యాక్ట్‌ 1997’ నుంచి మినహాయింపు కల్పించడం కోసమే ఈ బిల్లును తెచ్చాం. 
 
మరిన్ని వివరణలు కావాలన్న గవర్నర్‌ 
గవర్నర్‌ తమిళిసై లేవనెత్తిన సందేహాలపై రాష్ట్ర ప్రభుత్వం తొలుత సమాధానం ఇచ్చినా.. ఆయా అంశాల్లో మరింత స్పష్టత, అదనపు వివరణలు కావాలని గవర్నర్‌ ప్రభుత్వాన్ని కోరారని రాజ్‌భవన్‌ ప్రకటించింది. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌కు అడ్డంకులు సృష్టించడం తమ ఉద్దేశం కాదని.. వారి సర్వహక్కులను పరిరక్షించడానికే వివరాలు కోరాల్సి వస్తోందని స్పష్టం చేసింది.

ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనల విషయంలో భవిష్యత్తులో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చిన ఇచ్చిన నేపథ్యంలో.. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపర చిక్కులు రాకుండా, ఉద్యోగుల విలీన ప్రక్రియ సజావుగా జరిగేలా గవర్నర్‌ ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి అంశాలను ప్రతిపాదిత బిల్లు పరిష్కరించగలదా? అన్న అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలో కింది వివరణలను ప్రభుత్వం నుంచి కోరినట్టు తెలిపింది. 
 
► కేంద్రం నుంచి సమ్మతి పొందారా? కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీలో 30శాతం వాటా కలిగి ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరణలో పేర్కొంది. ఈ మేరకు కేంద్రం నుంచి సమ్మతి తీసుకున్నారా? ఒకవేళ సమ్మతి పొంది ఉంటే అందుకు సంబంధించిన ప్రతిని అందజేయాలి. లేనిపక్షంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా తీసుకున్న జాగ్రత్తలను తెలపాలి. 
 
► డిపోల వారీగా అన్ని కేటగిరీల శాశ్వత ఉద్యోగుల సంఖ్య ఎంత? డిపోల వారీగా అన్ని కేటగిరీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, క్యాజువల్, ఇతర తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య ఎంత? తాత్కాలిక ఉద్యోగుల విషయంలో అవలభించనున్న విధానం ఏమిటి? 
 
► ఇకపైనా ఆర్టీసీ సంస్థ ప్రస్తుత స్వరూపంలోనే కొనసాగుతుందని ప్రభుత్వం వివరణ ఇచ్చిన నేపథ్యంలో.. సంస్థ చర, స్థిరాస్తులు సంస్థతోనే కొనసాగుతాయా? రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? ముఖ్యంగా భవనాలు, భూములు ఎవరి వద్ద ఉంటాయి? 
 
► బస్సు సర్వీసుల నిర్వహణ విషయంలో అజమాయిషీ, బాధ్యత ఎవరిది? ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అవుతున్నందున వారి విధులను నియంత్రించే బాధ్యత ఎవరిది? ఉద్యోగులు, ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో కార్పొరేషన్‌ బాధ్యత ఏమిటి? 
 
► ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆర్టీసీలో డిప్యూటేషన్‌పై కొనసాగుతారా? అలాంటి ఇతర ఏర్పాట్లు ఏమైనా చేస్తారా?   

 రెండో దఫాలో గవర్నర్‌ కోరిన వివరణలు 
► ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉంది. అలాంటప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవడంపై కేంద్రం నుంచి సమ్మతి పొందారా? 
► ఆర్టీసీ చర, స్థిర ఆస్తులను ప్రభుత్వం స్వాదీనం చేసుకుంటుందా? 
► ఆర్టీసీలో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు మొత్తం ఎంత మంది ఉన్నారు? 
► ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైతే.. వారిపై, బస్సు సర్వీసులపై అజమాయిషీ ఎవరికి ఉంటుంది? కార్పొరేషన్‌ ఏం చేస్తుంది? ఉద్యోగులను ఆర్టీసీలో డిప్యుటేషన్‌పై నియమిస్తారా? లేక ఏదైనా ఏర్పాటు చేస్తారా? 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement