
సాక్షి, హైదరాబాద్: భారత గణతంత్ర దినోత్సవానికి మరో వారమే ఉన్నా.. వేడుకల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. దీనితోపాటు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కూడా వస్తున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందో అంతా చూస్తారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆవిష్కరించారు.
తర్వాత మీడియాతో మాట్లాడారు. ఖమ్మం సభలో గవర్నర్ల వ్యవస్థపై సీఎంలు, పలు పార్టీల ముఖ్యనేతలు చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. గవర్నర్లను అవహేళన చేస్తూ సీఎంలు, ఇతర రాజకీయ నేతలు మాట్లాడటం సరికాదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధమైన గవర్నర్ పదవికి కనీస గౌరవం ఇవ్వాలని సూచించారు. గవర్నర్లు తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారని, వారిపై రాజకీయ విమర్శలు సరికాదని చెప్పారు.
ప్రోటోకాల్‌పై సీఎం జవాబు ఇవ్వాలి
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయట్లేదన్న విమర్శలను విలేకరులు ప్రస్తావించగా.. అన్ని బిల్లులను మదింపు చేసి పరిశీలించాల్సి ఉంటుందని, దీనికి అవసరమైన మేర సమయం తీసుకుంటానని తాను ఇప్పటికే చెప్పానని పేర్కొన్నారు.
తన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది నుంచి ప్రోటోకాల్ పాటించడం లేదని, కనీసం జిల్లా కలెక్టర్లు సైతం తన పర్యటనల సందర్భంగా కలవడానికి రావడం లేదని చెప్పారు. ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదన్న విషయంపై సీఎం కేసీఆర్ సమాధానమిచ్చిన తర్వాతే బిల్లులపైగానీ, ఇతర విషయాలపైగానీ తాను బదులిస్తానని చెప్పారు.
సాంప్రదాయం ప్రకారం ఏటా రాష్ట్రస్థాయిలో నిర్వహించే గణతంత్ర దిన వేడుకల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కోవిడ్ మహమ్మారిని కారణంగా చూపి వేడుకలను రాజ్‌భవన్‌కు పరిమితం చేసి సాదాసీదాగా నిర్వహించింది. దీనిపై గవర్నర్ తమిళిసై తీవ్ర విమర్శలు చేశారు. గణతంత్ర వేడుకల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తనను అవమానాలకు గురిచేసిందని ఆరోపించారు.
ఇక గత ఏడాది రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించడాన్ని కూడా తప్పుపట్టారు. ఇప్పుడు మళ్లీ గణతంత్ర దినం, బడ్జెట్ సమావేశాలు వస్తుండటంతో.. గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment